Scientists

VCs/Professor

Chairman/CEO

Others

కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

 • విలువల పునాదులపైనే సంస్థలు నిలుస్తాయి

  ఎర్రబస్సు ఇమేజ్‌ను పూర్తిగా మార్చేశాం

  లాభాపేక్షతో విజయాలను సాధించలేం

  సమస్యలను చాకచక్యంగా ఎదుర్కోవాలి

  - రెడ్‌బస్ సీఈవో సామా ఫణీంద్ర
  రాష్ట్రంలో 'ఎర్రబస్సు అంటే అస్థవ్యస్థం నిర్వహణకు, అసంతృప్త, అధ్వాన్న ప్రయాణానికి నిర్వచనంగా ఉండేదని, ఆ పేరుకున్న ఇమేజ్‌ను రెడ్‌బస్.

  ఇన్ మార్చేసిందని ఆ సంస్థ సీఈవో సామా ఫణీంద్ర పేర్కొన్నారు. విశాఖ విచ్చేసిన ఫణీంద్ర 'ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు...

  వ్యవస్థాపకుడి(ఎంటర్‌ప్రెన్యూర్)గా ఎదగాలనే ఆలోచన ఎలా వచ్చింది?
  బిట్స్ పిలానిలో ఇంజినీరింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీజీ చేసిన నాకు లక్ష రూపాయల వేతనంతో కూడిన ఉద్యోగం లభించింది. ఉద్యోగంలో చేరినా మనసులో ఏదో వెలితిగా ఉండేది. నేనే సొంతంగా ఒక సంస్థను ఎందుకు ఏర్పాటుచేయకూడదన్న ఆలోచన ఎప్పుడూ వెంటాడేది. ఎలాంటి సంస్థ ఏర్పాటు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరికి ఇద్దరు మిత్రులతో కలిసి రెడ్‌బస్.ఇన్ సంస్థను ప్రారంభించాను.
  ఎర్రబస్సు అనే పేరుకు ప్రజల్లో అంత ఇమేజ్ లేదు? ఆ పేరును ఎలా ఎంచుకున్నారు?
  దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లడానికి అవసరమైన టిక్కెట్లను ఆన్‌లైన్లోనే బుక్ చేసుకునే సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో సంస్థను ఏర్పాటు చేశాం. ఆ పేరును ఉచ్చరించడానికి వీలుగా, తక్కువ పదాల్లో ఉండేవిధంగా, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా, అక్షర దోషాలు లేకుండా రాయగలిగే పదం కోసం ఆలోచించడం మొదలుపెట్టాం. రెడ్‌బస్ అనే పేరు బాగుందని ఖారారు చేశాం. అయితే ఆ పేరుకు మార్కెట్లో అంత ఇమేజ్ లేకపోవడంతో మా సంస్థపై ప్రభావం పడుతుందేమోనని ఒకింత భయపడ్డాం. వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందిస్తూ రెడ్‌బస్ పేరుకు కొత్త ఇమేజ్ తీసుకురాగలిగాం.
  రెడ్‌బస్ భారత్‌లో అతిపెద్ద ఆన్‌లైన్ బస్ టికెటింగ్ సంస్థగా అభివృద్ధి చెందిన క్రమాన్ని వివరించండి?
  బిట్స్ పిలానీలో నేను చదువుకునే రోజుల్లో మిత్రులైన సుధాకర్, చరణ్‌లతో కలిసి 2005లో రెడ్‌బస్ సంస్థను స్థాపించాను. ఆన్‌లైన్లో బస్ టిక్కెట్లను బుక్ చేసే సంస్థ ఒక్కటి కూడా భారతదేశంలో లేకపోవడంతో మంచి మార్కెట్ చేజిక్కించుకోవచ్చని అంచనావేశాం. మొదట ఆదరణ లభించకపోయినా క్రమంగా రెడ్‌బస్.ఇన్ ద్వారా టికెట్లు బుక్‌చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆరేళ్ల వ్యవధిలో 1200 మంది ఆపరేటర్లకు మా సేవలు అందించేస్థాయికి చేరుకున్నాం. దేశవ్యాప్తంగా 5000లకు పైగా రూట్లలో ప్రయాణానికి నిత్యం వేలాది మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. రెడ్‌బస్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో విపరీతమైన ఆదరణ దక్కింది. దీంతో మా సంస్థ దేశంలోనే అతిపెద్ద టికెట్ బుకింగ్ సంస్థగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది.
  రెడ్‌బస్ రూపకల్పనలో ఎదురైన సవాళ్లు, అధిగమించిన సమస్యలు ఏమిటి?
  ప్రారంభంలో రెండు మూడు నెలలు పెద్దగా ఆదరణ దక్కలేదు. ఒకొక్కరం లక్ష రూపాయలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాల్ని వదులుకుని వచ్చి తప్పుచేశామేమోనని మిత్రులు అభిప్రాయపడ్డారు. రోజూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ఆన్‌లైన్లో టికెట్లు బుక్‌చేసుకునే సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారు అత్యంత విశ్వసనీయమైన ఆన్‌లైన్ బుకింగ్ సంస్థ ఉండాలని కోరుకుంటున్నారన్న మా అంచనా తప్పుకాదని నిరూపించాలన్న పట్టుదల బాగా పెరిగింది. ఎంత నష్టం వచ్చినా ఏడాదిపాటు ఎలాగైనా రెడ్‌బస్.ఇన్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. బస్ ఆపరేటర్ల సంఖ్యను, రూట్ల సంఖ్యను గణనీయంగా పెంచాం. దీంతో క్రమంగా ఆశించిన ఫలితాలు రావడం మొదలయ్యాయి. ఆపరేటర్ల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాన్ని నిరంతరాయంగా కొనసాగించాం. దీంతోపాటు టికెట్‌బుకింగ్‌కు ఉపయోగించే వెబ్‌సైట్ కూడా ప్రతి ఒక్కరూ సునాయాసంగా వినియోగించుకునేలా, అత్యంత వేగంగా, అతితక్కువ సమయంలోనే బుక్ చేసుకునేవిధంగా ఎప్పటికప్పుడు దాని సామర్థ్యాన్ని పెంచాం. ఆయా చర్యలన్నీ ఫలించి లక్షలాది మంది మా వినియోగదారులుగా మారారు.
  మీరు అందజేస్తున్న సేవలతో సంతృప్తి చెందారా? సౌకర్యాల మెరుగుదల, ఆధునికీకరణకు సంబంధించిన వ్యూహాలేమిటి? పొరుగుదేశాలకు కూడా మీ సేవలను విస్తరించే అవకాశం ఉందా?
  ఆన్‌లైన్ వ్యాపారాల అభివృద్ధి అంతా వాటి విశ్వసనీయత పైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి వినియోగదారుడు అసంతృప్తి చెంది ఇతర సంస్థలకు వెళ్లాడంటే అతన్ని మళ్లీ మన వినియోగదారుడిగా మార్చుకోవడమనేది కష్టంతో కూడుకున్న పని. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఒక్క ప్రయాణికుడు అసంతృప్తి చెందకుండా మా సేవలు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. వెబ్‌సైట్ సేవలను ఉపయోగించుకునే వారి సంఖ్యకు అనుగుణంగా సర్వర్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాల్సి ఉంది. దీంతోపాటు మరింత సౌకర్యవంతంగా బుకింగ్ పూర్తయ్యేలా చూడాలి. ఆ చర్యలన్నింటినీ ఎప్పటికప్పడు తీసుకుంటుండటంతో ఏటా మా సేవల్ని వినియోగించుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మా సంస్థకు భారతదేశంలో ఉన్న విస్తారమైన నెట్‌వర్క్‌ను చూసి ఐబిబో అనే అంతర్జాతీయ సంస్థ కొనుగోలు చేసింది. యాజమాన్యం మారినా నిర్వహణ, బ్రాండ్‌నేమ్ మాత్రం మారలేదు. ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా గుర్తింపుపొందిన ఐబిబో సంస్థ రెడ్‌బస్‌ను కొనుగోలు చేసిన నేపథ్యంలో దీనికి కూడా అంతర్జాతీయస్థాయిలో కీర్తిప్రతిష్ఠలు లభిస్తున్నాయి.
  వ్యవస్థాపకుడిగా ఎదగాలనుకునే వారికి మీరిచ్చే సూచనలేమిటి?
  విద్యార్థులు ఉద్యోగాల కోసం ఆరాటపడటంలో తప్పులేదు. అదే సమయంలో ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? వాటిని ఏవిధంగా అందిపుచ్చుకోవచ్చు? అందుకు సమకూర్చుకోవాల్సిన వనరులేంటి? పెంచుకోవాల్సిన నైపుణ్యాలేమిటి? ఎలాంటి ఒడుదొడుకులనైనా తట్టుకునే శక్తి సామర్థ్యాలున్నాయా? తదితర అంశాలన్నింటినీ సమగ్రంగా విశ్లేషించుకోవాలి. మంచి వ్యాపార ప్రణాళికను రూపొందించుకుని, దాని సాధ్యాసాధ్యాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత వ్యాపార సంస్థలు ప్రారంభించాలి.
  వ్యవస్థాపకులుగా అందరూ రాణించకపోవడానికి కారణాలేమిటి?
  ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సొంత సంస్థలు స్థాపించినప్పటికీ ఊహించనివిధంగా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ చాకచక్యంగా ఎదుర్కోవాలి. కొన్నింటికి పరిష్కారాలు యాజమాన్యాల చేతుల్లో ఉండవు. అలాంటి పరిస్థితుల్నీ తట్టుకోగలగాలి.ఒక్కోసారి వ్యయ అంచనాలు గణనీయంగా పెరిగిపోతాయి. ఆయా సమస్యల్ని ఎదుర్కోలేకపోతే పతనం అనివార్యమవుతుంది. సంస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ, వినియోగదారుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుకుంటూ బ్రాండ్‌కు మంచి కీర్తిప్రతిష్ఠల్ని తీసుకువచ్చి వాటిని నిలబెట్టుకోవడానికి నిరంతర కృషిచేయాలి. సంస్థలోని మానవవనరుల నైపుణ్యాలను కాలానుగుణంగా పెంపొందించుకోవాలి.
  నాయకత్వానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?
  నాయకుడనే వ్యక్తి మిగిలిన వారికి ఆదర్శప్రాయుడిగా, మార్గదర్శకుడిగా ఉండాలి. అత్యున్నత విలువలతో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. నమ్మకాన్ని, విశ్వసనీయతను పెంచుకోవాలి. ఆయా లక్షణాలు లేకుండా కేవలం లాభాపేక్షతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా విజయం సాధించలేరన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.
  మీ విజయానికి కారణాలు ఏవని భావిస్తారు? ఒక సంస్థను సమర్థంగా నిర్వహించడానికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలేమిటి?
  రెడ్‌బస్ సంస్థను కేవలం విలువల పునాదిపైనే నిర్మించాను. ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే లక్షలాది మంది రెడ్‌బస్ సేవలను వినియోగిస్తున్నారంటే.. ఉత్తమ సేవల్ని అందించడం వల్లే అది సాధ్యమవుతోంది. సంస్థల ఏర్పాటు ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరుతోందా? అందిస్తున్న సేవల పట్ల వినియోగదారులు సంతృప్తికరంగా ఉన్నారా? అనే విషయాలను ఎప్పటికప్పుడూ ఆత్మపరిశీలన చేసుకుని లోపాల్ని సవరించుకుంటే విజయాలు సునాయాసంగా సాధించవచ్చు.
  విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
  లక్ష్యాల్ని సాధించాలంటే ప్రణాళికాబద్ధమైన కృషి చేయడం అత్యంత కీలకం. ఎలాంటి లక్ష్యాల్ని ఏర్పాటుచేసుకున్నాం? అందుకు ఏ స్థాయిలో కృషిచేయాలి? ఆమేరకు కృషిచేస్తున్నామా? లేదా? లక్ష్యసాధనకు అవసరమైన నైపుణ్యాల్ని పెంపొందించుకుంటున్నామా? తదితర విషయాల్ని ఎప్పుటికప్పుడు సమీక్ష చేసుకుని ప్రగతిపథంలో దూసుకుపోవాలి.

  - బి. రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning