'గేట్‌'తో ఉజ్వల భవిత

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ పీజీ, నేరుగా పీహెచ్‌డీ చేయాలంటే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) తప్పనిసరి. ఐఐటీల్లో బీటెక్‌ చేయాలనే కలలు విఫలమైనవారు మరో రూపంలో వాటిని నెరవేర్చుకునేందుకు ఇదో చక్కని మార్గం. ఉన్నత విద్యకే కాకుండా వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో మంచి జీతభత్యాలలో ఉద్యోగాలకు కూడా ఈ స్కోరు తొలిమెట్టు. గేట్‌-2015 ప్రకటన వెలువడిన సందర్భంగా ఈ పరీక్షకు అవసరమైన వ్యూహం ఎలా ఉండాలో చూద్దాం!
ఐఐటీలతోపాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌- బెంగుళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ఫార్మసీ విభాగాల్లో చేరడానికి గేట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష స్కోరును మలేసియా, సింగపూర్‌ తదితర దేశాల్లో కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు. బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వంటి పరిశోధనా సంస్థలు కూడా ఈ స్కోరును గుర్తిస్తున్నాయి. గేట్‌తో మనదేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సులో ప్రవేశంతోపాటు 8 వేల రూపాయల ఉపకార వేతనం కూడా లభిస్తుంది.
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఉన్నత విద్యాశాఖల తరఫున ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సు- బెంగుళూరు, 7 ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం స్థాయి కూడా ఆ సంస్థలకున్న పేరుప్రతిష్ఠలకు అనుగుణంగానే ఉంటుంది. అందువల్ల ఈ పరీక్ష రాయదలచుకున్న ప్రతి ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యార్థీ ప్రణాళికబద్ధంగా శ్రమించాల్సిందే. ఈసారి గేట్‌ను ఐఐటి-కాన్పూర్‌ నిర్వహిస్తోంది.
దరఖాస్తు ప్రక్రియ
* ఐఐఎస్‌సీ, ఏడు ఐఐటిలలోని ఏదో ఒక గేట్‌ జోనల్‌ వెబ్‌సైట్‌ని ఉపయోగించి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నింపి రిజిష్టర్‌ చేసుకోవాలి.
* అభ్యర్థులు తమ ఫొటోగ్రాఫ్‌, సంతకం, సంబంధిత సర్టిఫికెట్లను దరఖాస్తుతోపాటు తప్పకుండా పంపించాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుఫారం , సర్టిఫికెట్లను ఐఐటి/ఐఐఎస్‌సీ జోనల్‌ గేట్‌ ఆఫీస్‌లకు పంపవలసిన అవసరం లేదు.
* గేట్‌-2015 దరఖాస్తుఫారాలు ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌లో మాత్రమే లభిస్తాయి. బయట ఎక్కడా అమ్మరు.
* అభ్యర్థులు తమ అడ్మిట్‌కార్డును జోనల్‌ గేట్‌ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌కార్డుతోపాటు వ్యక్తిగత గుర్తింపు కార్డుని తప్పనిసరిగా తీసుకెళ్ళాలి.
* గేట్‌-2015 అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు గేట్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (GOAPS) లో మాత్రమే లభిస్తాయి.
* పరీక్ష రుసుము: పురుషులకు (General, OBC) Rs. 1500. స్త్రీలు/SC/ST/PWD లకు Rs. 750. ఈ రుసుమును నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌కార్డు/ క్రెడిట్‌ కార్డు (అన్ని బ్యాంకులు), ఈ-చలాన్‌ ద్వారా చెల్లించవచ్చు.
విద్యార్హతలు
గత ఏడాది మాదిరిగానే ఈసారి నిర్వహించబోయే గేట్‌కు కూడా ఆఖరి సంవత్సరం ఇంజినీరింగ్‌ చదివే, ఇంజినీరింగ్‌ పూర్తయిన విద్యార్థులు అర్హులు. ఇంజినీరింగ్‌లో మూడో ఏడాది విద్యార్థులు అనర్హులు.
* B.E/B.Tech/B.Arch./B.Pharm: చివరి సంవత్సరం చదివే విద్యార్థులు, ఇంజినీరింగ్‌ పూర్తయిన విద్యార్థులు అర్హులు.
* B.S.: చివరి సంవత్సరం, కోర్సు పూర్తయిన విద్యార్థులు అర్హులు.
* M.Sc/MCA/M.A or Equivalent: చివరి సంవత్సరం, కోర్సు పూర్తయినవారు అర్హులు.
* Int. M.E/M.Tech (Post-B.Sc) : 2వ, 3వ, 4వ సంవత్సరం, కోర్సు పూర్తయిన విద్యార్థులు అర్హులు
* Int. M.E/M.Tech (or) Dual Degree (After Diploma (or) 10+2): 4వ, 5వ సంవత్సరం, కోర్సు పూర్తయిన విద్యార్థులు అర్హులు.
ఇంజినీరింగ్‌ పూర్తయినవారు డిగ్రీ సర్టిఫికెట్‌/ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేయాలి. కోర్సు చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్‌ నుంచి పొందిన అనుమతి పత్రం సరిపోతుంది.
పరీక్షా విధానం
22 బ్రాంచీల అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తారు.
* గేట్‌-2015 పరీక్ష ఉదయం, మధ్యాహ్నం ప్రత్యామ్నాయ వారాంతాల్లో (శనివారం, ఆదివారం) 31 జనవరి -2015; 14 ఫిబ్రవరి-2015 మధ్య కాలంలో జరుగుతుంది.
* ఆన్‌లైన్‌ పరీక్ష విధానంలో కంప్యూటర్‌ మౌస్‌ను ఉపయోగించి సరైన ఆప్షన్‌ గుర్తించాలి.
* న్యూమరికల్‌ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్‌ కీబోర్డును ఉపయోగించి రాయాలి.
ముఖ్య గమనిక: న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు దగ్గరలోని స్థాయిలో ఇవ్వవచ్చు. ఉదాహరణకు- సరైన సమాధానం 10.33 అనుకుందాం. 10.32 నుంచి 10.34 మధ్యలో సమాధానం రాసినా స్వీకరించి మార్కులు ఇస్తారు.
న్యూమరికల్‌ ప్రశ్నల ప్రాధాన్యం
గేట్‌-2014 ప్రశ్నపత్రాల ప్రకారం వివిధ బ్రాంచిల్లో న్యూమరికల్‌ సమాధాన ప్రశ్నలకు వెయిటేజి-
* ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: 46/100
* కంప్యూటర్‌ సైన్స్‌: 43/100
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 45/100
* ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: 37/100
* సివిల్‌ ఇంజినీరింగ్‌: 37/100
* ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌: 49/100
* ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌: 40/100
ప్రధాన మార్పులు
1. గేట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి అధ్యాయాలతో సహా అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. అభ్యర్థులు ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్ని సబ్జెక్టుల్లో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.
2. పరీక్ష కేంద్రంలోకి సైంటిఫిక్‌ కాలిక్యులేటరు, మొబైల్స్‌లను అనుమతించరు. అభ్యర్థులు కాల్‌క్యులేషన్స్‌ చేసుకోవటానికి ఆన్‌లైన్‌ సైంటిఫిక్‌ కాలిక్యులేటర్‌ని అందుబాటులో ఉంచనున్నారు. కంప్యూటర్‌ మౌస్‌ని ఉపయోగించి ఈ కాలిక్యులేటర్‌ని వాడుకోవచ్చు.
3. గేట్‌ స్కోరు 3 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుంది.
రెండు విభాగాలు
గేట్‌ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1: జనరల్‌ ఆప్టిట్యూడ్‌
ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఒకటి నుంచి ఐదు ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 6 నుంచి 10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి.
ఈ విభాగంలో నాలుగు నుంచి ఐదు మార్కులకు గాను ఇంగ్లిష్‌ సంబంధిత ప్రశ్నలు ఇవ్వొచ్చు.
విభాగం-2 (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు)
ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి.
(i) 1-25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
(ii) 26-55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి.
గత సంవత్సరపు ప్రశ్నపత్రంలో కామన్‌ డేటాబేస్డ్‌ ప్రశ్నలు, లింక్డ్‌ ఆన్సర్‌ ప్రశ్నలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఈ విధమైన ప్రశ్నలు ఇవ్వకపోవచ్చు.
ప్రశ్నల సరళి?
పరీక్షపత్రంలో ప్రశ్నలు ఎలా ఉండాలో, ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యం ఉండాలో ఐఐటీల కోర్‌ కమిటీ నిర్ణయిస్తుంది. గత పరీక్షపత్రాల సరళి ప్రకారం-
* ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచిల్లో-
1) 35 శాతం ప్రశ్నలు: కామన్‌ సబ్జెక్టుల్లో ఉంటాయి. ఉదా: డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, అనలాగ్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రోప్రాసెసర్స్‌, నెట్‌వర్క్‌ థియరీ, కంట్రోల్‌ సిస్టమ్స్‌, సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌, ట్రాన్స్‌ఫారమ్‌ థియరీ.
2) 35 శాతం ప్రశ్నలు: సంబంధిత కోర్‌ సబ్జెక్టుల్లో...
(ఎ) ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌: పవర్‌ సిస్టమ్స్‌, మెషీన్స్‌, మెజర్‌మెంట్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌.
(బి) ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌: ఎలక్ట్రో మాగ్నిటిక్‌ థియరీ, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్‌ డివైసెస్‌.
(సి) ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌: ప్రాసెస్‌ కంట్రోల్‌, ట్రాన్స్‌డ్యూసర్స్‌, ఎలక్ట్రానిక్‌ మెజర్‌మెంట్స్‌, ఎనలిటికల్‌, బయోమెడికల్‌, ఆప్టికల్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
3) గణితం: 10 నుంచి 15 శాతం ప్రశ్నలు. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి.
4) జనరల్‌ ఎబిలిటీ: 15 శాతం ప్రశ్నలు. ఇందులో వెర్బల్‌ ఎబిలిటీ దాదాపు 5 శాతం, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 10 శాతం.
ముఖ్యమైన సూచనేంటంటే... ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకొని ఉంటాయి.
* ఎలక్ట్రికల్‌ పేపర్‌లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పేపర్‌లో డిజిటల్‌ కమ్యూనికేషన్‌; వీఎల్‌ఎస్‌ఐ విభాగాల్లో నిత్యం మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సబ్జెక్టుల్లో లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
ప్రతి పేపర్‌లో పదికి మించిన సబ్జెక్టులు. కానీ మొత్తం ప్రశ్నలు 65. ఏ సబ్జెక్టుకు ఎన్ని ప్రశ్నలు అనేది ఐఐటీలకు ఒక సవాలుగా మారింది. కాబట్టి ఐఐటీ ప్రొఫెసర్లు రెండు, మూడు సబ్జెక్టుల విషయాలను కలిపి ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి పేపర్‌లో వివిధ సబ్జెక్టులను మిళితం చేస్తూ ప్రశ్నలు ఇస్తున్నారు.
నెగెటివ్‌ మార్కులతో జాగ్రత్త
గేట్‌లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మైనస్‌ మార్కులుంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు.
ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ ప్రారంభం: 1 సెప్టెంబరు 2014
* ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ గడువు: 14 అక్టోబరు 2014 (23:59 Hrs.)
* పరీక్షా కేంద్రం మార్చుకోవటానికి గడువు: 21 నవంబర్‌ 2014(4) ఆన్‌లైన్‌ నుంచి అడ్మిట్‌ కార్డ్‌ ప్రింటు తీసుకోవటానికి: 17 డిసెంబర్‌ 2014
* గేట్‌-2015 పరీక్ష తేదీలు ఉదయం 9.00- 12.00 గంటలు; మధ్యాహ్నం 2:00- 5:00 గంటలు 31 జనవరి, 1, 7, 8, 14 ఫిబ్రవరి 2015
* పరీక్షా ఫలితాల వెల్లడి: 12 మార్చి 2015
విజయం సాధించాలంటే...
ఇప్పటినుంచే రోజూ కనీసం 6 నుంచి 8 గంటలు సాధనకు కేటాయించాలి. ప్రతి వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి. సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం.
* పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి.
* సన్నద్ధమయ్యే సమయంలో కూడా ఇదే సూత్రాలు పాటించాలి. అందుబాటులో ఉన్న ఆరునెలల సమయంలో ఏ అంశాలను చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో నిర్ణయించుకోవాలి.
* ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్లను తప్పనిసరిగా సాధన చేయాలి.
* తొలిసారి సిద్ధమయేటప్పుడు ప్రతి చాప్టర్‌కూ సంబంధించి ముఖ్య విషయాలను చిన్న, చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి. పరీక్షకు ముందు రోజుల్లో పునశ్చరణకు ఇది చాలా ఉపయోగం.
* మంచి ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంచుకోవడం ప్రధానం.
* ఇంజినీరింగ్‌, సివిల్‌ సర్వీసెస్‌ గత ప్రశ్నపత్రాల అధ్యయనం చాలా ప్రయోజనం. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉంటుందో తెలుస్తుంది!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning