గేట్‌.. తుది మెరుగులు

ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష గేట్‌. వివిధ విభాగాల్లో వరుసగా ఈ పరీక్ష త్వరలో జరగబోతోంది. ఇప్పటి వరకూ కొనసాగించిన సన్నద్ధత ఫలించేలా అన్ని విధాలా తుది మెరుగులు దిద్దుకోవాల్సిన తరుణమిది!
గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) స్కోరును బట్టే వివిధ ఐఐటీలూ, ఐఐఎస్‌సీ- బెంగళూరు, ఎన్‌ఐటీలూ, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్‌/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. నెలవారీ 12,400 రూపాయిల ఉపకారవేతనం ఓ ఆకర్షణ. ఇంకా వివిధ మహారత్న, మినీ రత్న ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలకు కూడా గేట్‌ స్కోరు ఆధారం.
గేట్‌ను ఆన్‌లైన్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపొందిస్తున్నారు. అందుకని అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యం లభిస్తోంది. అభ్యర్థులు ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్నిటిలో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి.
కొన్ని అధ్యాయాలు కఠినంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో ప్రశ్నలు కూడా నాలుగైదు సంవత్సరాలకొకసారి వస్తాయి. సబ్జెక్టు మీద పూర్తిగా పట్టు లేనివారు వీటికోసం ఎక్కువ సమయం కేటాయించడం ఆచరణీయం కాదు. గత ప్రశ్నపత్రాలను బట్టి దాదాపు 25 శాతం ప్రశ్నలు పునరావృతమవుతుంటాయి. వీటికోసం సుమారు 20 సంవత్సరాల ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది.
సృజనాత్మకంగా, పరిశోధనాత్మకంగా ఉన్న ప్రశ్నల కోసం మౌలికాంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సివిల్‌ సర్వీసెస్‌ ప్రశ్నలు చాలావరకూ గేట్‌లో అడుగుతుంటారు. కాబట్టి వీటిని గేట్‌ సిలబస్‌కు అనుగుణంగా సాధన చేయాలి.
కొన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వరు. తార్కికంగా ఆలోచించి వాటికి సమాధానం రాబట్టాల్సివుంటుంది. ఇలాంటి ప్రశ్నలు ప్రామాణిక గ్రంథాల్లోని అభ్యాస ప్రశ్నల్లో ఉంటాయి. న్యూమరికల్‌ ప్రశ్నల సమాధానాలు సమయపాలనను దృష్టిలో పెట్టుకుని సాధన చేయాలి.
వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌తో...
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష అయిన ప్రస్తుత గేట్‌లో సాంప్రదాయిక కాల్‌క్యులేటర్‌లను అనుమతించరు. వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌తోనే సంఖ్యా సంబంధిత ప్రశ్నలను పరిష్కరించాలి. ఈ కాల్‌క్యులేటర్‌తో కొన్ని హయ్యర్‌ ఆర్డర్‌ ఈక్వేషన్లను చేయలేము.
అలాంటి ప్రశ్నలను మెథడ్‌ ఆఫ్‌ సబ్‌స్టిట్యూట్‌ లేదా ఎలిమినేషన్‌ పద్ధతిలో చేసుకోవాలి. దీనికితోడు సాంప్రదాయిక కీ బోర్డు బదులు వర్చువల్‌ కీపాడ్‌ ఉపయోగించాలి. అందుకని ఈ విషయంలో తగిన జాగ్రత్తలూ, సరిపడ సాధనా చేయాలి. లేనట్లయితే సబ్జెక్టులో నిష్ణాతులు కూడా ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. దీనికోసం ఆన్‌లైన్‌లో నిర్వహించే నాలుగు/ ఐదు పూర్తి నమూనా ప్రశ్నపత్రాలు తప్పనిసరిగా రాయాలి.
నేటి నుంచి ఎలా?
గేట్‌ కోసం రోజుకు కనీసం 8-10 గంటల తయారీ అవసరం. ఇప్పటివరకూ ఎన్నడూ చదవని కొత్త విషయాలను వదిలివేయడం మంచిది. ఇప్పటివరకూ సాధన చేసిన విషయాలనే పునశ్చరణ చేయాలి.
ఇప్పటికే ప్రతి సబ్జెక్టుకూ సంబంధించి అభ్యర్థులు షార్ట్‌ నోట్సు తయారుచేసుకునివుంటారు. వాటితో పాటు ముఖ్యమైన ఫార్ములాలూ వాటికి సంబంధించిన కొన్ని మాదిరి ప్రశ్నలూ సాధన చేయాలి. కఠినమైన అంశాలను రెండు మూడు సార్లు మననం చేసుకోవాలి.
పునశ్చరణతో పాటు ఆన్‌లైన్లో నిర్వహించే మాదిరి ప్రశ్నపత్రాలకు జవాబులు రాయడం వల్ల సమగ్ర అవగాహన లేని కొన్ని అంశాలను కొంతవరకూ మెరుగుపరుచుకునే వీలుంది.
ప్రతిరోజూ రెండు సబ్జెక్టులు తీసుకోవాలి. నిత్యం మ్యాథ్స్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ సబ్జెక్టుల కోసం కొంత సమయం కేటాయించడం వల్ల మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది.
పరీక్ష కేంద్రంలో...
గత ఏడాది న్యూమరికల్‌ ప్రశ్నలు (ఖాళీలను సరైన అంకెతో పూరించడం) వచ్చాయి. అందుకే వీటిపై తగిన శ్రద్ధ అవసరం. సమాధానం పక్కన యూనిట్లు జాగ్రత్తగా గమనించాలి.
సంఖ్యాపరమైన ప్రశ్నలకు చిత్తు కాగితంపై తగిన రీతిలో స్టెప్పులు రాసుకోవడం ఎంతైనా మంచిది. ఒకవేళ సమాధానం రానిపక్షంలో సమీక్షించుకునే అవకాశం ఉంటుంది.
బహుళైచ్ఛిక ప్రశ్నల విషయంలో ఒక మౌలికాంశాన్నీ, ఒక ఫార్ములానీ విద్యార్థి ఎన్ని విధాల తప్పు చేయవచ్చో, ఎన్ని రకాల సమాధానాలు వస్తాయో వూహించి ప్రశ్నపత్ర రూపకర్తలు ఆప్షన్లు ఇస్తారు. వచ్చిన సమాధానం కనపడగానే వెంటనే గుర్తించవద్దు. ఒక్క క్షణం మిగతా ఆప్షన్లు కూడా పరిశీలించి చూడాలి.
ఎన్ని ప్రశ్నలకు ప్రయత్నించామనేదానికంటే ఎన్నిటికి సరైన సమాధానాలు రాశామనేదే ముఖ్యం. సమయపాలన చాలా ముఖ్యం. ఏదో ఒక ప్రశ్న సమాధానానికే ఎక్కువ సమయం కేటాయించవద్దు. జవాబు రాయాల్సినవి ఇంక ఎన్నో ఉన్నావని మరవకూడదు.
సాధారణ జాగ్రత్తలు
* ఈ కీలక సమయంలో సమయం వృథాను నిరోధించాలి. టీవీ, సినిమా, యూట్యూబ్‌ చూడటం, ఫేస్‌బుక్‌ వాడటం, వాట్సాప్‌ల్లో చాటింగులూ మానివేయడం ఎంతైనా మంచిది. వీలైతే సెల్‌ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేయటం మేలు.
* రోజూ క్రమం తప్పకుండా కనీసం అరగంట యోగా/ధ్యానం/చిన్నపాటి వ్యాయామం చేస్తే ఒత్తిడి నుంచి దూరం కావొచ్చు.
* ఈ రెండు వారాలూ ఎవరితోటీ వాగ్వాదాలు చేయ కూడదు.
* పరీక్ష రాయటానికి ముందు ప్రశాంతత ముఖ్యం. సరిగా సిద్ధం కాలేదనో, మరో కారణం వల్లనో ఆందోళన చెందవద్దు.
* పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ముందు ఏమీ చదవకపోవడం మంచిది.
కఠినమని కంగారొద్దు
నమూనా పరీక్షలు రాస్తున్నపుడే తగిన మెలకువలు పాటించాలి. పరీక్షలో సాధారణంగా మొదటి ప్రశ్నలు కొంత కఠినంగా ఉంటాయి. ఆందోళన పడకూడదు. మొత్తం పేపర్‌ కఠినంగా అనిపించినప్పటికీ కంగారు అనవసరం. గేట్‌ స్కోరు కేవలం సహ అభ్యర్థుల సాపేక్ష ప్రతిభపై ఆధారపడివుంటుందని మర్చిపోకూడదు.
గేట్‌ 2015లో మొత్తం వంద మార్కులకు 60-70 మార్కులు సాధించినవారు కూడా ఉత్తమ ర్యాంకులను తెచ్చుకున్నారు. మంచి సంస్థల్లో ప్రవేశం పొందారు.
గ్రూప్‌-1లోని ఒక మార్కు ప్రశ్నలను త్వరగా చేయాలి. చాలావరకూ ఈ విభాగంలో థియరీకి సంబంధించిన మౌలికాంశాలపై ప్రశ్నలు వస్తాయి. రుణాత్మక మార్కులతో జాగ్రత్త. జవాబు తెలియకున్నా అంచనా వేసి గుర్తించడం వల్ల ఒక్కోసారి నష్టం జరుగుతుంది.
న్యూమరికల్‌ ప్రశ్నల సంగతికొస్తే వీటికి ఆప్షన్లుండవు. సరైన సమాధానాన్ని మౌస్‌, వర్చ్యువల్‌ కీప్యాడ్‌ ఉపయోగించి సమాధానం గుర్తించాలి. వీటికి రుణాత్మక మార్కులుండవు. క్లిష్టమైన కీలకాంశాలను మరోసారి మననం చేసుకోవాలి.
Posted on 18- 1 - 2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning