![]() |
చదువుతూ పాస్‌పోర్టు
మెదక్ జిల్లా (పటాన్చెరు) : మారుతున్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు విద్యార్థులు మానసికంగా సిద్ధం అవుతున్నారు. భవిష్యత్తులో జరగనున్న మార్పులను ముందుగా వూహించుకొని దానికి తగ్గట్టుగా వ్యూహాత్మక రచన చేసుకుంటున్నారు. విదేశాల బాటపడుతున్నారు. ఉన్నత చదువులకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు కావాల్సిన పాస్‌పోర్టు పొందడానికి ఉత్సాహం చూపుతున్నారు. కళాశాలల్లో యాజమాన్యాలు కూడా ప్రవేశాల సమయాల్లోనే నిబంధన పెడుతున్నాయి. ఇది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటోంది.
జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థులు 20 శాతం మంది విదేశాల్లో చదవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మూడో సంవత్సరం నుంచే విదేశీ చదువులపై అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి కోర్సులు, విశ్వవిద్యాలయం ఎంపిక చేసుకోవాలో చూసుకుంటున్నారు. విదేశాల్లో ఏదైనా విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసిన తరువాత స్థానికంగా విభాగం ఇన్‌ఛార్జి ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అత్యధికంగా ఇంజినీరింగ్ మూడో ఏట నుంచి పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
* ఏఏ దేశాలకు
ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత సహజంగానే విదేశాల్లో చదువు పూర్తి చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మధ్య, ఉన్నత వర్గాల వారు విదేశాల్లో చదవడం పెరుగుతుంది. మధ్యతరగతి కుటుంబీకులు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా తమ పిల్లలను విదేశాలకు పంపడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఎంఎస్ చేయడానికి వెళుతున్నారు. సింగపూర్, మలేషియా, జపాన్, ఇండోనేషియా వంటి దేశాల్లో తక్కువ ఖర్చులో ఉన్నత చదువులు పూర్తి చేస్తున్నారు.
* 35శాతం మందికి పాస్‌పోర్టులు
విదేశాల్లో చదువుకునే వాళ్లు మాత్రమే పాస్‌పోర్టు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న కళాశాలల్లో చదువుకుంటున్నవారిలో 35శాతం మందికి పాస్‌పోర్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్ మూడవ సంవత్సరంకు వచ్చారంటే పాస్‌పోర్టు అనేది అర్హతగా చేశారు. గీతంలో ఐదు వేల మంది చదువుతుండగా ఇందులో 4,500 మందికి పాస్‌పోర్టులు ఉన్నాయి. ఎల్లంకి కళాశాలలో రెండు వేలపై చిలుకు విద్యార్థులుండగా 12 వందల మంది పొందారు. టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 70 శాతం మంది విదేశాల్లో ఉన్నత చదువులకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్ఆర్ఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు, నాలుగు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు దాదాపు ఆరు వందల మంది పాస్‌పోర్టులు పొందారు. నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలో 15 వందల మంది విదేశాలకు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారు. మొదటి ఏడాది విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
* ధ్రువీకరణ పత్రాలు కళాశాల నుంచే..
విద్యార్థులు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసే సందర్భంలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు చదువుతున్న కళాశాల ఇస్తుంది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసేటప్పుడు 10వ తరగతి ధ్రువీకరణ పత్రం నకళ్లు జతపరుస్తారు. ఆ తరువాత పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లిననప్పుడు ఒరిజినల్ అడిగితే చూపించాల్సి ఉంటుంది. అలానే విద్యార్హతకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ కళాశాల ప్రిన్సిపల్ బోనఫైడ్ జారీ చేస్తారు.
* ప్రవేశాల సమయంలో..: సంజయ్, గీతం డైరెక్టర్
ఇంజినీరింగ్ ప్రవేశాల సమయంలోనే పాస్‌పోర్టు ఉందా అని అడుగుతున్నాం. వారికి విదేశీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నైపుణ్యతను బట్టి ఉన్నత చదువులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే తాము ముందస్తుగా పాస్‌పోర్టు తీసుకోమని కోరుతున్నాం.
* ఏడో తరగతిలోనే: రిత్విక్‌రెడ్డి
తండ్రితో అమెరికా వెళ్లాలనుకునే సమయంలోనే పాస్‌పోర్టు తీసుకున్నా. అప్పుడు తాను ఏడో తరగతి చదువుతున్నా.ఇప్పుడు ఎలాగూ ఉన్నత చదువులకు వెళ్లాల్సిఉంది.
* కెనడా వెళ్లానుకుంటున్నా: అరవింద్
ఏడాది కిందట పాస్‌పోర్టు తీసుకున్నా. అమెరికా, కెనడా ఏదో ఒక దేశంలో ఉన్నత చదువులకు వెళ్దామనుకుంటున్నాను. కెనడాలో నాకు నచ్చిన విధంగా ఉన్నత చదువులకు అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
* బ్రిటన్‌లో ఎంఎస్..: సంజనా
బ్రిటన్‌లో ఎంఎస్ చేయాలనుకుంటున్నాను. ఇంజినీరింగ్‌లో చేరిన కొత్తలోనే ప్రణాళిక వేసుకున్నా. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే పాస్‌పోర్టు తీసుకున్నా.
* భారత పౌరుడిగా గుర్తింపు: కిరణ్, ఈఈఈ
పాస్‌పోర్టు అనేది కేవలం విదేశాలకు వెళ్లడానికి మాత్రమే అనుకుంటున్నారు. ఒక భారత పౌరుడిగా విదేశాల్లో గుర్తింపు పొందడానికి ఉపయోపడుతోంది. అలానే అన్ని రకాలుగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పాస్‌పోర్టుకు ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తున్నారు.
* విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశం: హరిసూర్య
ఈఈఈ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ పరిశ్రమలో ఉద్యోగం వచ్చింది. విదేశాల్లో కూడా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు ఉందా అంటూ అడిగారు. దీంతో అప్పటికప్పుడు దరఖాస్తు చేసా.