![]() |
కొలువుల దారిలో కొత్త వారధి
* దేశవ్యాప్తంగా ఏకకాలంలో నాక్టెక్
* ఆగస్టు నెలాఖరులో ఏడో సెమిస్టర్
* ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్ష
* ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగావకాశాలకు కొదవలేదు
* 'ఈనాడు'తో నాస్కామ్ ఉపాధ్యక్షురాలు సంధ్య చింతల
ఈనాడు - హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే కోరిక ఉన్నా కొద్దిమంది మాత్రమే అవకాశాలు పొందగలుగుతున్నారు. కళాశాలల్లో ప్రాంగణ నియామకాల ద్వారా కొందరికే అవకాశాలు తలుపు తడుతుండగా మిగతావారు నిరాశకు గురవుతున్నారు. ఇలాంటివారికి దారి చూపేందుకు 'నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్'(నాస్కామ్) సిద్ధమవుతోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు, కొలువులిచ్చే సంస్థలకు వారధిగా నిలిచేలా దేశవ్యాప్తంగా 'నాస్కామ్ అసెస్మెంట్ ఆఫ్ కాంపిటెన్సీ-టెక్నాలజీ'(నాక్టెక్) పరీక్షను ఆగస్టు నెలాఖరులో నిర్వహించబోతుంది. ఇప్పటివరకు పలు రాష్ట్రాల్లో ఈ పరీక్షను నిర్వహించిన నాస్కామ్ ఈసారి ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించేందుకు వీలుగా ఆగస్టు 10 నాటికి ప్రకటన ఇవ్వనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపనున్నట్లు నాస్కామ్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ సంధ్య చింతల వెల్లడించారు. ఇంజినీరింగ్ విద్య-ఉద్యోగావకాశాల కల్పనపై నాస్కామ్ చేపడుతున్న చర్యలపై ఆమె 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..
ఆంధ్రప్రదేశ్లో 700కి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో కాలేజీల్లో మాత్రమే ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. మిగతాచోట్ల ప్రతిభావంతులున్నా వారికి అవకాశాలు దక్కడం లేదు. ఐటీ సంస్థలకు తగిన సమయం లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల వారిని చేరుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నాస్కామ్.. ఐటీ, సాప్ట్వేర్ పరిశ్రమల వారితో చర్చించి గత ఏడాది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నాక్టెక్ నిర్వహించగా మంచి స్పందన కనిపించింది.
సామర్థ్యాలకు పరీక్ష..
నాక్టెక్ పరీక్ష ద్వారా విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యం, భావప్రకటన నైపుణ్యాలు తదితర అంశాలను పరిశీలిస్తాం. ఈ ఆన్లైన్ పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభాపాటవాల వివరాలను జాబితాల రూపంలో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ వంటి ప్రముఖ సంస్థలకు అందిస్తాం. ఆ డాటాబేస్ ఆధారంగా ఆయా సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా కొందరిని ఎంపిక చేసుకుని వారికి ఇతర పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంజినీరింగ్ ఏడో సెమిస్టరులో ఉన్న విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్ష వివరాలను ఆగస్టు నెలాఖరులో ప్రకటించి దేశవ్యాప్తంగా ఏకకాలంలో జరపాలని భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే పరీక్ష నిర్వహణ సులభమవుతుంది కాబట్టి రెండు ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నాం.
అవకాశాలు పెరుగుతాయి..
2020 నాటికి దేశంలో ఏటా 4 లక్షల మందికి ఐటీ, బీపీఎం రంగాల్లో మంచి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ పరిశ్రమ పలుమార్లు సవాళ్లు ఎదుర్కొన్నా కోలుకుంటూ వస్తున్న నేపథ్యంలో 2020 నాటికి ఈ రంగంలో ఉద్యోగావకాశాల వృద్ధి ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఉపాధి అవకాశాల్లో చైనా, ఫిలిప్పీన్స్, బ్రెజిల్ వంటి దేశాలతో పోలిస్తే భారత్ ముందుంది. ప్రతిభావంతులను అందించడంలో మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ ఆ జోరు కొనసాగితేనే అంతర్జాతీయ ఐటీ-బీపీఎం పరిశ్రమలో మన ఆధిపత్యం నిలుస్తుంది. ఈ రంగంలో కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 86% ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ కేంద్రంగా ఉన్నందున ఉద్యోగావకాశాల కల్పనలో మొదటిస్థానంలో.. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ముంబయి, పుణె, చెన్నై, కోయంబత్తూరుల్లోనూ ఐటీ పరిశ్రమలు ఉన్నందున అక్కడా డిమాండ్ ఉంది.
ఆదరణ ఉన్నా..
ఇంజినీరింగ్ విద్యకు ఆంధ్రప్రదేశ్లో మంచి ఆదరణ ఉంది. రాష్ట్రంలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న వారిలో ఇంజినీరింగ్ చదువుతున్నవారు 28.9 శాతం మంది ఉన్నట్లు 2013లో నాస్కామ్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే, ఏపీలో ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశించే వారిలో కొందరికి తగిన ఆసక్తి ఉండడంలేదు. అత్తెసరు మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేయడం వల్ల ఫలితముండదు. అంతేకాదు.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ విద్యావిధానం లేదు. ప్రశ్నపత్రాల రూపకల్పన మూసపద్ధతిలో సాగుతోంది. ఇంజినీరింగ్ విద్యలో నిత్యనూతనంగా, సృజనాత్మకంగా ఆలోచించాలి. చాలా కళాశాలల్లో అధ్యాపకులకు తగిన బోధన నైపుణ్యాలు ఉండడం లేదు. ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. అధ్యాపకుల కొరత ఉంటే వీడియో పాఠాలు వంటి మార్గాలు అనుసరించి సమస్యను అధిగమించొచ్చు. చదువంటే ఇంజినీరింగ్ ఒక్కటే అనే భావన పోవాలి. అందుబాటులో ఉన్న అనేక కోర్సులను ఆసక్తి మేరకు ఎంచుకుని సాగాలి. పదో తరగతి, ఇంటర్ పాసైన.. తప్పిన విద్యార్థుల ఉపయోగపడేలా కూడా నాస్కామ్ కృషిచేస్తోంది. ఐఐటీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వివిధ కోర్సులు నిర్వహించి ధ్రువపత్రాలు అందిస్తున్నాం.