అమెరికా చదువే సులభం

* అక్కడ ప్రాక్టికల్స్‌కు పెద్దపీట
* మన రాష్ట్రంలో థియరీకే ప్రాధాన్యం
* బీటెక్‌ తరవాత ఎంబీఏలపై శ్రద్ధ పెరిగింది
* 'ఈనాడు'తో డెల్‌ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్‌ మురళీధర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ''నేను కూకట్‌పల్లి జేఎన్‌టీయూ క్యాంపస్‌లో బీటెక్‌ డిగ్రీ పాసై అమెరికా వెళ్లాక అక్కడ పీజీ చదవడం పెద్దగా కష్టమనిపించలేదు. నా దృష్టిలో మన రాష్ట్రంలో బీటెక్‌ మంచి మార్కులతో పాసవడానికి పడే కష్టంతో పోలిస్తే అమెరికాలో చదువుకు పడే శ్రమ తక్కువ. అక్కడ థియరీలో మార్కుల కోసం ఇక్కడి మాదిరిగా రాత్రింబవళ్లు కష్టపడి చదవాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రయోగాల్లో(ప్రాక్టికల్స్‌)లో ముందుండేవారికే అమెరికాలో మంచి గుర్తింపు వస్తుంది. ఇక్కడ డిగ్రీ చదివేవారికి ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం తక్కువ. అందుకే ఇక్కడ డిగ్రీ పాసైనవారంతా రాణించలేకపోతున్నారు'' అని చెప్పారు నన్నపనేని మురళీధర్‌.
అమెరికాలో టెక్సాస్‌లో డెల్‌ కంప్యూటర్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా 8 ఏళ్లుగా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్‌ వచ్చారు. డెల్‌లో చేరకముందు నోకియా కంపెనీలోనూ సుదీర్ఘకాలం పనిచేశారు. అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ చదువులను, ఉద్యోగావకాశాలను పోలుస్తూ ఆయన 'ఈనాడు'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే...''నేను 1990లో జేఎన్‌టీయూ క్యాంపస్‌లో బీటెక్‌(మెకానికల్‌) డిగ్రీ చేశాను. ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లాక చదువుతున్నప్పుడే ఉదయం 4 గంటలు...రాత్రిపూట 8 గంటలు చిన్న ఉద్యోగాలు చేస్తూ మధ్యలో రోజూ నాలుగైదు గంటలే క్లాసులకు వెళ్లి చదివేవాడిని. జేఎన్‌టీయూలో డిగ్రీ చదువుతున్నప్పుడు రోజంతా తరగతులు లేదా చదువు అన్నట్టు ఉండేది. అమెరికా వెళ్లాక ఆ వాతావరణం కనిపించలేదు. అక్కడ చదువుతో సమానంగా ఉపాధిపై దృష్టి ఉంటుంది. కాలేజీలో చేరాక అక్కడి విద్యార్థులు సొంతంగా సంపాదించుకుని చదువుకుంటూ ఉంటారు. వారు ప్రధానంగా జీవితంలో స్థిరపడటానికి ఏం చదవాలి అన్న ధోరణితో కాలేజీలో చేరతారు. వర్శిటీ కౌన్సెలర్లు సైతం వారి ఆసక్తిని తెలుసుకుని ఏ సబ్జెక్టులు చదివితే ఎలా రాణిస్తారు, జీవితంలో స్థిరపడటానికి అవి ఎలా ఉపయోగపడతాయో చెపుతారు. మన దగ్గర అలాంటి వాతావరణం లేదు. అక్కడ విద్యార్థులు కాలేజీలో చేరాక తొలుత తల్లిదండ్రులకు దూరంగా క్యాంపస్‌లో ఉండి చదువుకోవాలని అధ్యాపకులు ప్రోత్సహిస్తారు. దీనివల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, జీవితంలో స్థిరపడటానికి ధైర్యం వస్తాయి.
మన తల్లిదండ్రులు ఇక్కడ పిల్లలను వదిలి ఉండటానికి ఇష్టపడరు. దానివల్ల మన పిల్లలు డిగ్రీ పాసైనా జీవితంలో స్థిరపడటానికి చాలాకాలం పడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో లక్షల మంది బీటెక్‌ చదువుతున్నారు. కానీ ఉద్యోగాలకు అవసరమైన వృత్తి నైపుణ్యం రావడం లేదు. మళ్లీ ఉద్యోగంలో చేరాక కొన్నేళ్లు కష్టపడినవారే చివరికి రాణిస్తున్నారు. గత నాలుగేళ్లుగా నేను మరో మార్పు గమనించాను. మన రాష్ట్రం నుంచి బీటెక్‌ పాసైన వారు బిజినెస్‌ కోర్సు(ఎంబీఏ)ల్లో చేరడానికి అమెరికా వచ్చాక ఇష్టపడుతున్నారు. బీటెక్‌లో మంచి సాంకేతిక నైపుణ్యం సాధించినవారు బిజినెస్‌ కోర్సుల్లో ప్రతిభ చూపితే ఉపాధి అవకాశాలు అమెరికాలో బాగున్నాయి. అమెరికాలో చదువుకోవడానికివచ్చేవారు రోజుకు కనీసం 16 నుంచి 18 గంటలు కష్టపడగలం అనే గట్టి నమ్మకం, పట్టుదల ఉంటేనే రావాలి. లేదంటే చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ జీవితంలో స్థిరపడటానికి తిప్పలు పడాల్సి ఉంటుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning