![]() |
ఇంజినీరింగ్ బోధన ప్రణాళికలో మార్పు
* ఐటీ సంస్థల భేటీలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగానికి(ఐటీ) ఉపయోగపడేలా ఇంజినీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోధన ప్రణాళికను మార్పు చేయనున్నట్లు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. విద్యార్థులకు చక్కటి ఉపాధి అవకాశాలు పెంపొందించేలా, పరిశ్రమల అవసరాలకు తగినట్లు ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు, బోధన ఉంటుందన్నారు. నవంబరు 19న మంత్రి కేటీఆర్‌తోపాటు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఐటీ, విద్యాశాఖ కార్యదర్శులు హర్‌ప్రీత్‌సింగ్,వికాస్‌రాజ్‌లు ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య అనుసంధానం, ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఆప్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. రాష్ట్రంలో సుమారు 300 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా ఏటా 70 వేలమంది ఇంజినీర్లు బయటకు వస్తున్నారని వీరిలో 20 వేల మంది మాత్రం ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు.
Posted on 20-11-2014