![]() |
క్లిష్టత స్థాయి తగ్గింది!
ప్రసిద్ధ ఐఐఎంలూ, ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నవంబర్ 16, 22 తేదీల్లో 'క్యాట్' నిర్వహించారు. ఈ పరీక్ష క్లిష్టత ఏ తీరులో ఉంది? ఒక్కో విభాగం నుంచి ఏ రీతిలో ప్రశ్నలు వచ్చాయి?
రోజూ రెండు చొప్పున, మొత్తంగా నాలుగు స్లాట్లలో క్యాట్ పరీక్షలు జరిగాయి. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగానే 1. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ 2. వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నపత్రం క్లిష్టతా స్థాయి గతంతో పోలిస్తే, తేలిగ్గానే ఉందని చెప్పొచ్చు. అయితే మొదటి, చివరి స్లాట్లలో డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇతర స్లాట్లలో వచ్చిన దానికంటే కష్టంగా ఉందని విద్యార్థులు ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. మొత్తం నాలుగు స్లాట్లలో మూడోది (22వ తేదీ ఉదయం నిర్వహించారు) అన్నింటిలోకెల్లా తేలికగా ఉందన్నది చాలామంది అంటున్నారు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్ ప్రిటేషన్
గణితంలో ప్రాథమిక అంశాలపై నుంచే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు. 8, 9, 10 తరగతుల్లోని పాఠ్యాంశాల్లో పట్టు ఉన్నవారైనా సరే, ఒకింత తార్కిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే సమాధానం వచ్చేలా ప్రశ్నలున్నాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు మాత్రం క్లిష్టతరంగా ఉన్నాయి. సూక్ష్మీకరణాలకు ఎక్కువ సమయం తీసుకున్నాయి. ఎక్కువశాతం ప్రశ్నలు ఆల్జీబ్రా, అరిథ్‌మెటిక్, నంబర్స్, జామెట్రీ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో బార్, టేబుల్, స్కేటర్ డయాగ్రమ్‌ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. సూక్ష్మీకరణాలను వేగంగా చేయగలిగే వాళ్లకు ఈ దఫా కలిసొచ్చిందని చెప్పవచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సాధారణంగానే ఉంది. 34 ప్రశ్నలు క్వాంటిటేటివ్ విభాగం నుంచి రాగా 16 ప్రశ్నలు డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి వచ్చాయి. నంబర్ సిస్టం, పర్ముటేషన్ & కాంబినేషన్, అరిథ్‌మెటిక్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఈ విభాగంలో వచ్చాయి.
* నంబర్ సిస్టం: ట్రేయిలింగ్ జీరోస్, రిమెయిండర్స్ తదితర ప్రాథమిక అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయి.
* అరిథ్‌మెటిక్: టైం, స్పీడ్, డిస్టెన్స్, మిక్చర్స్, యావరేజెస్, టైం- వర్క్, ప్రాఫిట్- లాస్, డిస్కౌంట్ తదితర అంశాల నుంచి సాధారణ ప్రశ్నలు వచ్చాయి. మొత్తంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలు తేలికగా చేయగలిగేవే.
* ఆల్జీబ్రా: చాలా ఎక్కువ సంఖ్యలో ఈ అంశం నుంచి ప్రశ్నలు వచ్చాయి. వర్గమూలాలను కనుగొనడం, వర్గాల లబ్దాలు, ఫంక్షన్స్, అంక, గుణ శ్రేణులు, ఇన్‌ఈక్వాలిటీస్ నుంచి ప్రశ్నలు వచ్చాయి. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు కూడా వచ్చాయి. ఆప్షన్లను బట్టి సమాధానం కనుగొనేలా చాలా ప్రశ్నలు ఉన్నాయి.
* జామెట్రీ: పైథాగరస్, వృత్తాలు, చతురస్రాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. సూత్రాల ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం ఇచ్చారు. క్లిష్టంగా ఉండే 3 డి జామెట్రీ ప్రశ్నలను ఎక్కువగా అడగలేదు.
* మోడర్న్ మాథ్స్: కొన్ని లాగ్ ప్రశ్నలు ఉన్నాయి. క్యాలెండర్లో ప్రాథమిక పరిజ్ఞాన ఆధారిత ప్రశ్నలు కూడా వచ్చాయి. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి నేరుగా సమాచారం ఉన్న ప్రశ్నలు కనిపించాయి. 80% కచ్చితత్వంతో 30కిపైగా ప్రశ్నలు చేసిన విద్యార్థులు ఈ విభాగంలో మంచి పర్సంటైల్ ఆశించవచ్చు.
వెర్బల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్
ఈసారి వెర్బల్ ఎబిలిటీలో రెండు ఆశ్చర్యకరమైన అంశాలను అభ్యర్థులు గమనించారు. ఒకాబులరీ/ ఇంగ్లిష్ భాషలో వివిధ పదాలు ఉపయోగించే తీరుపై ప్రశ్నలు రాకపోవడం ఒకటయితే, క్రిటికల్ రీజనింగ్ నుంచి కొన్ని ప్రశ్నలే వచ్చాయి. గతంలోనూ క్రిటికల్ రీజనింగ్ నుంచి తక్కువ వచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఒకాబులరీ నుంచి ఒక్క ప్రశ్న కూడా లేకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. పారా జంబుల్స్, ఆడ్‌మన్ ఔట్లు, ప్రశ్నలు చాలా సులభంగానే ఉన్నాయి. అన్ని స్లాట్లలోనూ ఇదే ధోరణి ఉన్నట్లు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు.
* రీడింగ్ కాంప్రహెన్షన్: నాలుగు రీడింగ్ కాంప్రహెన్షన్లు వచ్చాయి. అన్ని స్లాట్లలో ఇదే తీరు. ఒక్కో దానిలో నాలుగు ప్రశ్నలున్నాయి. జియో- పాలిటిక్స్, టెక్నాలజీ, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా తదితర అంశాల ఆధారితంగా కాంప్రహెన్షన్లు ఉన్నాయి. ఇన్ఫరెన్స్ కేంద్రంగా ప్రశ్నలు అడిగారు. ఆప్షన్ల నుంచి తేలికగా ఎంపిక చేసుకునేలా ఉన్నాయి. ఎలిమినేషన్ విధానం విస్తృతంగా ఉపయోగించి ఉంటే ప్రయోజనం.
* లాజికల్ రీజనింగ్ కూడా తేలికగానే ఉంది. సాధన బాగా చేసిన వారికి కలిసొచ్చింది. ఈ విభాగంలో 75 శాతం కచ్చితత్వంతో 30కిపైగా ప్రశ్నలు చేసినవారు మంచి పర్సంటైల్ ఆశించొచ్చు.
Posted on 01-12-2014