ఇంజినీర్లకు లైసెన్సు తప్పనిసరి!

* ఇ.సి.ఐ.లో నమోదు చేసుకోవాల్సిందే
* ముసాయిదా రూపొందించిన హెచ్‌.ఆర్‌.డి. శాఖ

ఈనాడు, దిల్లీ: వైద్యులకు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్లకు ఉన్న మాదిరిగానే ఇంజినీర్లకూ త్వరలో లైసెన్సుల విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారత ఇంజినీర్ల మండలి (ఇ.సి.ఐ.)లో వీరంతా తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకుని, విశిష్ఠ సంఖ్యను పొందాల్సి ఉంటుంది. దీని విధివిధానాలతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌.ఆర్‌.డి.) మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను రూపొందించింది. దీని ప్రకారం నిర్ణీత కాలవ్యవధుల్లో ఇంజినీర్లు తమ లైసెన్సులను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అనుమతి పొందకుండా దేశంలో ఎక్కడా ఇంజినీర్లు పనిచేసే అవకాశం ఉండదని హెచ్‌.ఆర్‌.డి. మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నమోదైన ఇంజినీర్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే మధ్యలోనూ లైసెన్సును రద్దు చేసే అధికారం ఇ.సి.ఐ.కి ఉంటుంది. ఇంజనీర్లు చేసిన ఏమైనా పనులు లోపభూయిష్టంగా ఉన్నట్లయితే వాటిపై ఇ.సి.ఐ.కి ఫిర్యాదులు చేయవచ్చు. వాటిని పరిశీలించిన తర్వాత ఆ సంస్థ చర్య తీసుకుంటుంది. 'దేశంలో ఏటా 12 నుంచి 15 లక్షల మంది ఇంజినీర్లు తయారవుతున్నారు. వారిని నియంత్రించే చట్టబద్ధమైన సంస్థ ఇంతవరకు లేదు. విదేశాల్లో ఉద్యోగాలకు ప్రయత్నించేవారికి దీనివల్ల ఇబ్బంది ఎదురవుతోంది. దీనిని తొలగించడంతో పాటు పనుల్లో ఇంజినీర్లకు జవాబుదారీతనాన్ని నిర్ణయించడానికి కొత్త నిర్ణయం ఉపయోగపడుతుంద'ని ఇ.సి.ఐ. అధ్యక్షుడు ఉద్ధేశ్‌ కోహ్లి 'ఈనాడు'కు చెప్పారు. హెచ్‌.ఆర్‌.డి. రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రిమండలికి పంపిస్తారు. అక్కడ ఆమోదం లభించాక ఇది తగిన మార్పులు చేర్పుల నిమిత్తం పార్లమెంటుకు వెళ్తుంది.

Posted on 16 - 02 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning