![]() |
ఉద్యోగ సాధనకు..నాక్-టెక్ మార్గం
ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో ఉద్యోగ సంసిద్ధత ప్రధానమైన లోపమనీ, వీరిని ఉద్యోగ సంసిద్ధులను చేయాలనీ వివిధ కమిటీలు, సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. ఈ దిశగా జాతీయ సాఫ్ట్వేర్, సేవాసంస్థల సంఘం (నాస్కామ్) పర్యవేక్షణలో జాతీయస్థాయిలో ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నారు.
జాతీయస్థాయిలో ఉద్యోగ సంసిద్ధత- అర్హత పరీక్షలో అడగాల్సిన ప్రశ్నల ప్రామాణికతను నిర్ణయించడానికి నాస్కాం మూడంచెల విధానాన్ని నిర్ణయించుకుంది. ఈ పరీక్షల ప్రశ్నావళి, వాటి ప్రమాణాలూ, ఇంకా పరీక్షలను నిర్వహించడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ విషయంలో కాగ్నిజెంట్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ సంస్థలు తమ సేవలను అందించాయి.
ఐటీ, ఇతర ఇంజినీరింగ్ పరిశ్రమలకు శిక్షణార్హులైన అభ్యర్థులను ఉద్యోగ సంసిద్ధులుగా మార్చేలా, ప్రామాణిక ఉద్యోగ అర్హతను ధ్రువీకరించే పరీక్షగా నాక్-టెక్ (నాస్కామ్ అసెస్మెంట్ ఆఫ్ కాంపిటెన్స్-టెక్నాలజీ) అవతరించింది. ఇంజినీరింగ్ మూడో, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుని ఐటీ, ఇతర ఇంజినీరింగ్ రంగాల్లోని పరిశ్రమల అవసరాలకు అర్హతను నిర్ణయించేలా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్ష లక్ష్యాలు:
1) దేశంలోని ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభాపాటవాల అంచనా
2) రెండో, మూడో శ్రేణి పట్టణాల్లోని ఇంజినీరింగ్ విద్యార్థుల నిజ ప్రతిభ, వారిలో అభివృద్ధికి అవకాశాలున్న అంశాలపై ఆయా విద్యాసంస్థలకు సమాచారమివ్వటం; సరైన శిక్షణావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకునేలా వీలు కల్పించడం.
3) తద్వారా వారి ఉద్యోగావకాశాలను మెరుగుపరచడం ఈ పరీక్ష మరో ముఖ్యోద్దేశం.
పరీక్ష విధానం
నాక్టెక్ పరీక్ష రెండు భాగాలు. పార్ట్-ఎ, పార్ట్- బి. పార్ట్-ఎకు 60 నిమిషాలు. ఇందులో ఆంగ్లభాషా ప్రయోగ, ఉపయోగాలను పరీక్షిస్తారు. పార్ట్-బికి 30 నిమిషాలు. ఈ ప్రశ్నపత్రంలో కంప్యూటర్ రంగ సంబంధిత ప్రశ్నలుంటాయి. అభ్యర్థి మొదటి విభాగానికిగానీ/ రెండు విభాగాలకు గానీ విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పద్ధతిలో జరిగే ఈ పరీక్షలో సమాధానాలు కంప్యూటర్‌పైనే ఇవ్వవలసి ఉంటుంది.
నాక్-టెక్ అర్హులకు...
ఈ పరీక్ష రాసినవారి మార్కులు నాక్-టెక్ పోర్టల్ ద్వారా నాస్కాం సభ్యులందరికీ అందుబాటులో ఉంటాయి. అభిరుచి కలిగిన సంస్థలు ఈ పోర్టల్ నుంచి అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు ఇవ్వవచ్చు. ఇప్పటి వరకూ దాదాపు 2 లక్షలకుపైగా మంది ఈ పరీక్ష రాశారు.
* ఐటీ, ఇంజినీరింగ్ పరిశ్రమల్లో జరిగే నియామకాలకు సంబంధించి పారదర్శకమైన, ఉమ్మడి పరీక్ష విధాన ప్రక్రియ.
* పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థి తన బలాలను, బలహీనతలను నిర్దిష్టంగా బేరీజు వేసుకోగలగడం.
* వచ్చిన మార్కుల ద్వారా వివిధ అంశాల్లో తన పరిజ్ఞానం, నైపుణ్యాలపై సమగ్ర సమాచారం లభ్యమవడం వల్ల సవ్యంగా స్వీయ అంచనా వేసుకుని, కెరియర్ను ఆత్మవిశ్వాసంతో ఎంచుకునే అవకాశం.
* నాక్-టెక్ పరీక్షలోని మార్కుల ఆధారంగా మెరుగయ్యే ఉద్యోగావకాశాలు
ఎవరు నిర్వహిస్తారు?
సాధారణంగా ఈ పరీక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల చివరి వారాల్లో నాస్కాం అధీకృత సంస్థలైన ఆప్టెక్ అసెస్మెంట్ అండ్ టెస్టింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెరిట్ ట్రాక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, టీసీఎస్ అయాన్ అనే మూడు సంస్థలు జనవరి 2015 నుంచి నిర్వహిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ కింది తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరిలో పరీక్షలు ముగిసిపోయాయి.
ఫిబ్రవరి 27- 28, 2015, మార్చి 29- 30, 2015
విద్యార్థులు పార్ట్-ఎ కానీ, రెండు పార్ట్‌లకు గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు వివరాలు:
* న్యాక్-టెక్ పార్ట్-ఎ: రూ. 250
* నాక్-టెక్ పార్ట్-ఎ+ బి: రూ. 310
వివరాలను nactech@nasscom.in కి ఈ-మెయిల్ పంపి తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష మాదిరి ప్రశ్నపత్రం నాక్-టెక్ పోర్టల్ www.nactech.nasscom.in లో లభిస్తుంది.
Posted on 23 - 02 - 2015