![]() |
ఇంజినీరింగ్ సర్వీసెస్ లో 475 పోస్టులు
ప్రకటన విడుదలచేసిన యూపీఎస్సీ
దరఖాస్తుకు గడువు ఏప్రిల్ 10
జూన్ 12 నుంచి పరీక్షలు
పోస్టుల సంఖ్య: 475
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి-కమ్యూనికేషన్ ఇంజినీరింగ్.
అర్హతలు: సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి-కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజి.)/ ఏఎంఐఈ ఉండాలి.
వయసు: జనవరి 1, 2015 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (జనవరి 2, 1985 కంటే ముందు; జవనరి 1, 1994 తర్వాత జన్మించినవారు అనర్హులు)
పరీక్ష ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు)
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 14
చివరి తేది: ఏప్రిల్ 10
రాత పరీక్ష తేది: జూన్ 12
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.
పరీక్ష విధానం: ఇందులో రెండు సెక్షన్లలో మొత్తం 5 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు. రాత పరీక్షకు మొత్తం 1000 మార్కులు కేటాయించారు. సెక్షన్ 1లో 3 ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు వ్యవధి 2 గంటలు. ఇందులో జనరల్ ఎబిలిటీ టెస్ట్ (పార్ట్ ఎ జనరల్ ఇంగ్లిష్, పార్ట్ బి జనరల్ స్టడీస్) అన్ని బ్రాంచీలవారికీ ఉమ్మడిగా ఉంటుంది. ఈ సెక్షన్లో మిగిలిన రెండు పేపర్లు సంబంధిత బ్రాంచ్ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్) నుంచి ఉంటాయి. సెక్షన్ 2లో సంబంధిత బ్రాంచీల నుంచి 2 కన్వెన్షనల్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 3 గంటల వ్యవధి కేటాయించారు. ఈ రెండు పేపర్లకూ ఇంగ్లిష్‌లోనే సమాధానాలు రాయాలి. కన్వెన్షనల్ ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటాయి.. ఇంజినీరింగ్ బ్రాంచీకి సంబంధించే 800 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు.
గమనిక:
సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాల్లో యూపీఎస్సీ నిర్ణయించే కనీస అర్హత మార్కులు సాధిస్తేనే సెక్షన్ 2 కన్వెన్షనల్ ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేస్తారు.
కన్వెన్షనల్ పేపర్లలో చేతిరాత అర్థమయ్యేలా లేకపోతే 5 శాతం వరకు మార్కులు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి అర్థమయ్యేలా, చక్కగా రాయడాన్ని సాధన చేయాలి.
క్రమ పద్ధతిలో, ప్రభావవంతంగా, స్సష్టమైన వివరణ, తక్కువ పదాలతో రాసిన జవాబులకు ప్రాధాన్యం ఉంటుంది.
ఐఈఎస్‌లో మెరవాలంటే...?
ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించే పోటీ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రధానమైనది. వీటిలో తొలి ప్రయత్నం (21- 22 ఏళ్ళ వయసులో)లోనే విజయం సాధిస్తే మంచి ఉద్యోగంతోపాటు భవిష్యత్తులో అత్యున్నత హోదాకు చేరుకోవచ్చు. సరైన ప్రణాళిక, కార్యాచరణలకు సానుకూల దృక్పథం తోడైతే ఇదంతా సాధ్యమే!
ఒక అభ్యర్థి నాలుగైదు ప్రయత్నాల్లో సాధించినపుడు తాను విఫలమైన ప్రతి ప్రయత్నం నుంచీ గుణపాఠం నేర్చుకుంటాడు. సబ్జెక్టుపై కొంత నూతన పునాది వేసుకుంటాడు. తొలి ప్రయత్నాల్లో నేర్చుకున్న సారాంశం, మలి ప్రయత్న విజయానికి దోహదపడుతుంది. మరి మొదటి ప్రయత్నంతో సాధించాలంటే? ఈ పూర్తి అనుభవ పాఠాలను ముందుగా అర్థం చేసుకోవాలి. ఆచరించాలి.
డిగ్రీ పొందడం ఎంతో తేలిక. కారణం- విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణులు చేయడానికి ప్రయత్నిస్తాయి. తక్కువ సంఖ్యలో ఉండే ఉద్యోగ ఖాళీలకు ఎక్కువమంది అభ్యర్థులు పోటీ పడతారు. కాబట్టి పోటీ పరీక్షలు నిర్వహించే సంస్థలు అభ్యర్థులను అనర్హులను చేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి విశ్వవిద్యాలయ పరీక్షలకూ పోటీ పరీక్షలకూ సిలబస్‌లో తేడా, పరీక్ష విధానంలో తేడా ముందు అర్థం చేసుకోవాలి. పోటీ పరీక్షల్లోని ప్రశ్నల సరళి విభిన్నం. ఇంజినీరింగ్ చదివే మూడో సంవత్సరం నుంచే ఈ ప్రధాన మార్పులపై దృష్టిపెట్టి చదవాలి.
ఏదైనా ఒకటి/ అన్ని ప్రశ్నపత్రాల్లో కనీస నిర్ణయాత్మక మార్కులు నిర్దేశించే విచక్షణాధికారం సర్వీస్ కమిషన్‌కు ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అన్ని పేపర్లకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువమంది అభ్యర్థులు జనరల్ ఎబిలిటీ పేపర్‌పై శ్రద్ధ పెట్టరు. ఇది సరి కాదు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తెలుగు మీడియం అభ్యర్థులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాల్లో అర్హతా మార్కులు వస్తేనే కన్వెన్షనల్ జవాబు పత్రాలు దిద్దుతారు.
2013లో జనరల్ కేటగిరిలో ఇంజినీరింగ్ విభాగం మౌఖిక పరీక్షకు అర్హత పొందిన ఆఖరి అభ్యర్థి మార్కులు (1000 మార్కులకుగాను)
సివిల్: 352, మెకానికల్: 418 ఎలక్ట్రికల్: 367
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్: 482
తుది ఎంపికకు నిర్ణయించిన కనీస మార్కులు
జనరల్ కేటగిరిలో ఇంజినీరింగ్ విభాగం తుది ఎంపికకు ఆఖరి అభ్యర్థి మార్కులు (1200 మార్కులకు గాను)
సివిల్: 511, మెకానికల్: 584 ఎలక్ట్రికల్: 531
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్: 636
తుది ఎంపికకూ, మౌఖిక పరీక్ష అర్హతకూ సుమారుగా 150 మార్కుల తేడా ఉంటోంది. మౌఖిక పరీక్షలో మార్కులు కనిష్ఠ స్థాయిలో 40 నుంచి 50 వరకూ, గరిష్ఠ స్థాయిలో 150 నుంచి 160 వరకూ వస్తుంటాయి. అంటే అభ్యర్థి ఇంటర్వ్యూలో కనిష్ఠ స్థాయి మార్కులు దృష్టిలో పెట్టుకుని రాత పరీక్షపై శ్రద్ధ పెట్టాలి. మౌఖికపరీక్షలో 150 మార్కులు వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి రాతపరీక్షలోని కనీస మార్కుకి 100 మార్కులు తమ కేటగిరీలో కలుపుకుని ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడే కచ్చితంగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
ఆబ్జెక్టివ్ టెక్నికల్ పేపర్లలో ప్రశ్నల తీరు
* ఈ విభాగానికి కాలిక్యులేటర్లను అనుమతించరు.
* ఫార్ములాలు, వాస్తవ విషయాలకు సంబంధించినవి 15%
* అసర్షన్, రీజనింగ్ 8 - 10%
* జతపరిచే ప్రశ్నలు 10%
* ప్రాథమిక, మౌలిక అంశాలకు సంబంధించినవి 40%
* అప్లికేషన్స్‌కు సంబంధించినవి 25%
* ఇటువంటి ప్రశ్నల ద్వారా సబ్జెక్టుపై పట్టునూ, విశ్లేషణ సామర్థ్యాన్నీ పరీక్షిస్తారు.
ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాల్లో 120 ప్రశ్నలకు సమయం 120 నిమిషాలు. ఓఎంఆర్ షీటులో 120 సమాధానాలు బ్లాక్ పెన్నుతో గుర్తించాలంటే కనీసం 12 నిమిషాలు పడుతుంది. మిగిలినవి 108 నిమిషాలు అంటే ఒక ప్రశ్నకు కేవలం 54 సెకన్లు. కాబట్టి 120 ప్రశ్నలు ఎవరూ చేయలేరు. 90 ప్రశ్నల వరకూ లక్ష్యంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రాలకు సంబంధించి తయారీ విస్తృతంగా ఉండాలి. కన్వెన్షనల్కి సంబంధించి ఎంపిక చేసుకున్న అంశాలను కేంద్రీకృతంగా చదవాలి.
యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల పేపర్లను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్, గేట్ పాత పేపర్లు, ఇతర ప్రభుత్వ రంగ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
రుణాత్మక మార్కులున్నాయ్
ప్రతి తప్పు సమాధానానికీ కేటాయించిన మార్కుల్లో 1/3 వంతు తగ్గిస్తారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలకు 200 మార్కులు. అంటే ప్రతి ప్రశ్నకూ 5/3 మార్కులు. తప్పు సమాధానానికి 5/9 రుణాత్మక మార్కులు. కొన్ని ప్రశ్నలకు ఎలిమినేషన్ విధానంలో జవాబులు రాబట్టవచ్చు. అయితే ఎలాంటి క్లూ దొరకని ప్రశ్నలను వదిలేయడమే మంచిది.
కన్వెన్షనల్ ప్రశ్నల తీరు
* ముఖ్యమైన డెరివేషన్స్
* విశ్లేషణాత్మక థియరీ ప్రశ్నలు
* న్యూమరికల్ ప్రశ్నలు
జనరల్ ఇంగ్లిష్: తెలుగు మీడియం విద్యార్థులు తగిన జాగ్రత్తలు వహించాలి. వ్యాకరణం, అర్థాలు, వ్యతిరేక అర్థాలు, వాక్యపూరణం, కాంప్రహెన్సివ్ ప్యాసెజెస్ మీద సాధన చేయాలి. English by Wren & Martin చాలా ఉపయోగపడుతుంది.
పోటీ స్థాయి ఎలా?
2013లో 702 ఉద్యోగాలు ఇచ్చారు. 2,11,184 మంది దరఖాస్తు చేశారు. కానీ 78,794 మంది మాత్రమే పరీక్ష రాశారు. అంటే సుమారుగా మూడోవంతు పోటీ పడ్డారు. పోటీస్థాయి 1:112. వీరిలో కూడా సీరియస్ పోటీదారులు 1:20
గ్రాడ్యుయేట్లు సాధించగలరా?
2013లో ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులు సుమారుగా 630 అంటే 90% మంది గ్రాడ్యుయేట్లు.
ద్వితీయ శ్రేణి విద్యార్థులు సాధించగలరా?
2013లో 3.5% మంది ద్వితీయ శ్రేణి విద్యార్థులే. అంటే ఎటువంటి వ్యతిరేక ఆలోచన లేకుండా పోటీ పడవచ్చు.
అదనపు సూచనలు
* ఏదైనా ఒక గత ప్రశ్నపత్రం తీసుకుని సమయానుగుణంగా పరీక్ష రాస్తే తన ప్రస్తుత స్థాయి తెలుస్తుంది. దాన్ని బట్టి ఎంతవరకు సన్నద్ధమవాలో అంచనాకు రావచ్చు.
* ఆఖరి అభ్యర్థుల మార్కుల శాతం చూస్తే (సివిల్ 42.6%, మెకానికల్ 48.7%, ఎలక్ట్రికల్ 44.3%, ఎలక్ట్రానిక్స్ 53%) జనరల్ కేటగిరీలోనే ఎంత సులభమో అర్థమవుతుంది. మొదటి ర్యాంకర్ మార్కుల శాతం చూస్తే మరింత ధైర్యం వస్తుంది.
* 100% సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. 80% చక్కగా అర్థం చేసుకుని దానిలో 60% మార్కులు సాధిస్తే టాప్ ర్యాంకర్ కావచ్చు.
* ఏమి చదవాలో, ఏం చదవకూడదో సరిగా నిర్ణయించుకున్నవారే విజేతలు!
* దొరికిందల్లా చదవకూడదు. ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చదవాలి.
* గత ప్రశ్నలననుసరించి సబ్జెక్టులు, అంశాలకు సన్నద్ధతలో ప్రాముఖ్యమివ్వాలి.
* ప్రతి సబ్జెక్టుకీ సంక్షిప్తంగా, సూక్ష్మంగా నోట్సు పది పేజీలలోపు తయారు చేసుకోవాలి. దీనివల్ల పునశ్చరణ (రివిజన్) సులభమవుతుంది.
* ముగ్గురు/ నలుగురు బృందంగా చదివితే తేలిక.
* సీనియర్ల, అనుభవజ్ఞులైన అధ్యాపకుల సలహాలు తీసుకోవాలి.
నమూనా ప్రశ్నపత్రాలు
ఆబ్జెక్టివ్, సబ్జెక్టు ప్రశ్నపత్రాలు సమయానుసారంగా సాధన చేస్తే పరీక్ష హాలులో ఒత్తిడి లేకుండా సమాధానాలు రాయవచ్చు.
మౌఖిక పరీక్ష: రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2.5 నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖికపరీక్షకు సాధారణంగా పిలుస్తారు. దీనిలో అభ్యర్థి ఆలోచన విధానాన్నీ, శక్తి సామర్థ్యాలు, నీతి నిజాయతీలను అంచనా వేస్తారు. ప్రస్తుతం 2 సంవత్సరాల నుంచి ఐఈఎస్ మౌఖిక పరీక్షలో వ్యక్తిగత విషయాలకూ, హాబీలకూ కొంత ప్రాముఖ్యమిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. వీరు ఉద్యోగం చేస్తున్నా/ ఎంటెక్ చేస్తున్నా సంబంధిత విషయాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశముంది. సామాజిక, వర్తమాన అంశాల గురించి కూడా అడగవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండి ప్రణాళిక ప్రకారం వెళ్తే అధిక మార్కులు సాధించవచ్చు.
మానసిక సంతులత: సన్నద్ధత సమయంలో కొంతమంది అధైర్యపరచవచ్చు. కొన్ని సంఘటనలు నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకోవడానికి దృఢ చిత్తంతో కష్టపడాలి. గత విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
Posted on 13 - 03 - 2015