![]() |
మన స్వభావాన్ని పట్టిస్తుంది... మౌఖికం !
ఉద్యోగాన్వేషణలో జరిగే ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో రాతపరీక్షలో విజయం సాధించిన తరువాత మౌఖికపరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. చాలా మంది విద్యార్థులు రాత పరీక్షలో మంచి ప్రతిభ ప్రదర్శించినప్పటికీ మౌఖికపరీక్షలో విఫలమవుతుంటారు. అసలు మౌఖిక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మౌఖిక పరీక్ష సమయంలో రిక్రూటర్లు ఏం గమనిస్తారు ఏయే అంశాలు పరిశీలిస్తారనే వాటిపైనా అవగాహన అవసరమని నిపుణులు చెబుతున్నారు. చాలామంది అభ్యర్థులు పలుసార్లు మౌఖికపరీక్షకు వెళ్లినప్పటికీ వృత్తి జీవితంలో అడుగుపెట్టలేరు. సంస్థకు అవసరమైన, ఉపయోగకరమైన అభ్యర్థులపైనే రిక్రూటర్లు దృష్టి సారిస్తారు. ఆ దిశగానే వారు ప్రశ్నలు సంధిస్తారు. అభ్యర్థులు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని తామెలా సంస్థకు అమూల్యమవుతామో తమ సమాధానాల ద్వారా రిక్రూటర్లుకు వివరించగలిగితే వృత్తి జీవితంలోకి సులభంగా అడుగుపెడతారు.
నైపుణ్యం నిజమేనా:
మౌఖికపరీక్షకు పిలుపు వచ్చిందంటే సదరు ఉద్యోగానికి మీరు అర్హులని సంస్థ గుర్తించినట్లే. రెజ్యూమెలో గతానుభవం, విద్యా విషయాలు, నైపుణ్యం తదితర విషయాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా మీరెలా వ్యవహరిస్తారు.. రెజ్యూమెలో ఉన్నట్లుగానే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించగలరా? రెజ్యూమెలో ఉన్న అర్హతలకు తగ్గట్టుగా మీరున్నారా అనేది రిక్రూటర్లు పరిశీలిస్తారు. రెజ్యూమె పరిశీలన తర్వాత ఏర్పడిన రిక్రూటర్లకు ఏర్పడిన అభిప్రాయం... ముఖాముఖిలో మీ భావవ్యక్తీకరణ, హావభావాల తర్వాత కూడా మారకపోతే ఉద్యోగం ఖాయమైనట్లే.
అంతర్గత భావాలు:
డిగ్రీలు, రాత పరీక్షల్లో మార్కులు వచ్చినంత మాత్రాన మౌఖికపరీక్షలో విజయం సాధించడం సులభమని భావించకండి. నలుగురిలోనూ ఇమడగలరా? అహంకారం ఉందా? ఆలోచన విధానం ఎలా ఉంటుంది... చెప్పినపని చేయడమేనా.. సమయస్ఫూర్తి ప్రదర్శిస్తారా అనే అంశాలు తెలుసుకోవడానికీ రిక్రూటర్లు ముఖాముఖిని ఉపయోగించుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల వివరాలు... వారి పట్ల మీ వైఖరి గురించి అడుగుతారు. ఎందుకంటే... బృందసభ్యుల్లో ఒకరిగా ఇమడగలరా... నాయకుడు చెప్పిన అంశాన్ని అనుసరించగలరా... నైపుణ్యం ఉంది కదా అనే అహంభావం ఎక్కడైనా ప్రదర్శిస్తారా అనే కోణంలో ఈ ప్రశ్నలు సాగుతాయి.
అర్హతలు ఎక్కువైతే:
ఒక్కోసారి ఉద్యోగానికి అవసరమైన వాటి కన్నా ఎక్కువ అర్హతలు ఉన్న వారు వస్తే.. వారినీ రిక్రూటర్లు సునిశితంగా గమనిస్తారు. కొద్దికాలం పనిచేసి వెళ్లిపోతారా... ఎక్కడా ఉద్యోగం దొరక్క చివరగా దీనికి దరఖాస్తు చేశారా అనే కోణంలో రిక్రూటర్ల ఆలోచనలు సాగుతాయి. అందుకే సంస్థలో ఉద్యోగం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, అంకితభావంతో పనిచేస్తారన్న విషయం రిక్రూటర్లకు తెలియజేయాలి. వృత్తి పట్ల మీకున్న ఆసక్తి వివరించగలగాలి. అర్హతలు ఎక్కువ ఉన్నప్పటికిs ప్రవర్తన లోపముంటే అవకాశం చేజారినట్లే.
రెజ్యూమెలో పొందుపరిచిన అర్హతలు మీకున్నాయో... లేవోనన్న అంశాన్ని పరిశీలించడంతో పాటు మీ ధ్రువపత్రాలు సరైనవో కాదో కూడా చూస్తారు. వేతనం గురించి అడిగినప్పుడు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. అర్హతలు, నైపుణ్యాలు ఉండి తక్కువ వేతనం అడిగితే రిక్రూటర్లకు మీపై ఆసక్తి తగ్గే అవకాశాలూ ఉన్నాయి. అందుకే ముందుగానే సంస్థ, ఇతర సంస్థలో సదరు ఉద్యోగానికిచ్చే వేతనంపై ఆరా తీయండి. మీ నైపుణ్యానికి తగ్గట్లుగా వేతనాన్ని కోరండి. వీటితోపాటు, సంస్థలో చేపట్టాల్సిన బాధ్యతలు, శిక్షణ, పని సంస్కృతి ఎలా ఉంటుంది? తదితర ప్రశ్నలు అభ్యర్థుల నుంచి రిక్రూటర్లు ఆశించే అవకాశమూ ఉంది.