![]() |
ఐటీ ఉత్పత్తుల సంస్థలదే జోరు
* నాస్కామ్ 10,000 స్టార్టప్ కార్యక్రమం * ఇప్పటికే 115 సంస్థలకు ఆర్థిక సాయం ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి, అద్భుతాలు సృష్టించాలని ఆశిస్తున్న యువతరానికి నాస్కామ్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థల ప్రోత్సాహం లభిస్తోంది. ఐటీ సేవల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించినట్లే, ఐటీ ఉత్పత్తుల్లోనూ భారత్‌లో తమదైన ముద్ర వేసేందుకు ఆయా సంస్థలు స్టార్టప్ 10,000 కార్యక్రమంతో యువతను ప్రోత్సహిస్తున్నాయి. |
ఇదే క్రమంలో డిసెంబరు 18న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న టై సదస్సు కూడా ఔత్సాహికులకు అవగాహన పెంచనుంది.
ఐటీ రంగంలో కొత్త సంస్థల ఏర్పాటుతో పాటు, ప్రారంభించి కొంతకాలమై, తమ ఆలోచనలకు ఒకరూపం ఇస్తున్న ఐటీ కంపెనీలను ప్రోత్సహించేందుకు నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) 10,000 స్టార్టప్ కార్యక్రమం ప్రారంభించింది. ఇందుకోసం కొన్ని ఇంక్యుబేషన్ కేంద్రాలతో పాటు సంస్థల వృద్ధికి తోడ్పడే సంస్థల (యాక్సెలరేటర్స్)తోనూ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఆలోచనను ఉత్పత్తిగా మార్చేందుకు సహకరించడం, ఆర్థిక సహకారం, విపణిలో అవకాశాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం, మార్కెటింగ్‌కు సహకరించడం వంటివి వీరు చేస్తారు. ఇందుకు మైక్రోసాఫ్ట్, ఐయాక్సెలరేటర్, టై (ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్) వంటి సంస్థలు ముందుకు వస్తున్నాయి.
ఆలోచనకు ప్రోటోటైప్ కూడా ఏర్పడి ఖాతాదారులు సిద్ధంగా ఉంటే, ఏంజెల్ ఫండింగ్ కింద రూ.25 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు అందించేందుకు హైదరబాద్ ఏంజెల్స్, చెన్నై ఏంజెల్స్, హెచ్‌బీఎస్ ఏంజెల్స్, ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ వంటి సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ పథకం తొలిదశ కింద 4,000 దరఖాస్తులు రాగా, 332 సంస్థలను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిల్లో 29 సంస్థలకు నాస్కామ్, మరికొన్ని సంస్థలకు ఇతర సంస్థలు ఆర్థిక సాయం అందించాయి. రెండోదశ దరఖాస్తుల స్వీకరణ ఈనెల 15 వరకు కొనసాగింది. 1,000 కి పైగా సంస్థలు దరఖాస్తులు పంపాయి. వీటిల్లోంచి 10 ఉత్తమ ఆలోచనలను ఎంపిక చేసి, 2014 జనవరిలో ముంబయిలో జరిగే కార్యక్రమంలో నాస్కామ్ ఆర్థిక సాయం అందించనుంది.
మొదటి దశలో 29 సంస్థలకు నాస్కామ్ ఆర్థిక సాయం అందించిందని, రెండో విడత దరఖాస్తులు స్వీకరించామని నాస్కామ్ సీనియర్ ఉపాధ్యక్షురాలు సంగీతా గుప్తా 'ఈనాడు'తో చెప్పారు. కంపెనీ ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులు వారి ఆలోచనకు ప్రోటోటైప్ కూడా జత చేసి, ఆర్థిక సహాయం కోసం పంపుతున్నారని వివరించారు. నాస్కామ్ స్టార్టప్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచీ ఐటీ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయని నాస్కామ్ ప్రాంతీయ డైరెక్టర్ బిధాన్ కంకటే చెప్పారు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఐఎస్బీలో, ట్రిపుల్ ఐటీలో కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వాటిల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 110-115 సంస్థలకు ఆర్థిక సాయం అందిందన్నారు.
ప్రారంభ కంపెనీల్లో అత్యధికం ఐటీ ఉత్పత్తి కంపెనీలే కావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఐటీ ఉత్పత్తి అనేది పెద్ద వ్యవహారమని, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో అధిక సహకారం అవసరన్నారు. ప్రస్తుతం 110 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6,71,000 కోట్లు) మేర ఉన్న దేశీయ ఐటీ పరిశ్రమ 2020 నాటికి 225 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13.72 లక్షల కోట్లు) పరిశ్రమగా ఎదుగుతుందనేది మెకిన్సే, నాస్కామ్ ల అంచనా. ఇదే సమయంలో ఐటీ ఉత్పత్తులకు 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.61,000 కోట్లు) స్థాయికి చేరుతుందనే అంచనా. 2015-2020 మధ్య దేశంలో విధుల్లో చేరే యువత 4 కోట్ల మంది అందుబాటులోకి వస్తారని అంచనా. అదే సమయంలో చైనాలో అవసరం కన్నా 9 శాతం తక్కువ ఉంటారని భావిస్తున్నారు. ఇందుకోసమే నైపుణ్యానికి మెరుగులు దిద్దే కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.