![]() |
మేటి కొలువులకు సిద్ధమేనా?
మనదేశంలోని ప్రతిష్ఠాత్మకమైన పరీక్షల్లో ఒకటైన ‘గేట్’ తన ప్రాధాన్యాన్ని ఏడాదికేడాదీ విస్తరించుకుంటోంది. గేట్-2016 ద్వారా 30 నుంచి 35 సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.
కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఆకర్షణీయమైన వేతనాలు, సౌకర్యాలను అందిస్తున్నాయి. రూ. 7 లక్షల నుంచి 9 లక్షల వార్షిక వేతనం పొందే మేనేజ్మెంట్ ట్రెయినీ/ ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగం సంపాదించాలంటే ‘గేట్ స్కోరు’ అత్యంత కీలకం. తుది ఎంపికకు గేట్ స్కోరు 75% నుంచి 80% వెయిటేజీని పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని సంస్థల్లో గేట్ 2016 స్కోరుతోపాటు గ్రూప్ డిస్కషన్/ గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
అభ్యర్థులు తాము ఇంజినీరింగ్ చదువుకున్న కోర్ సబ్జెక్టుకు సంబంధించిన రంగంలోనే పనిచేసే అవకాశం, సంతృప్తి గేట్ స్కోరు ద్వారా ఎంపిక చేసుకున్న సంస్థ అందిస్తుంది.
బృంద చర్చ (గ్రూప్ డిస్కషన్)
అభ్యర్థి తుది ఎంపికకు పర్సనల్ ఇంటర్వ్యూతోపాటు బృందచర్చది కూడా ప్రధాన పాత్ర. బృందచర్చ పద్ధతిలో సంస్థ తమకు కావాల్సిన నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అభ్యర్థులకు ఏదైనా ఒక టాపిక్/ సన్నివేశాన్ని ఇచ్చి 10- 15 నిమిషాలు చర్చించిన తరువాత, విశ్లేషకుల ద్వారా ఒక నివేదిక తయారుచేసి ఫలితాలు వెల్లడిస్తుంది.
బృందచర్చలో పరీక్షించే నైపుణ్యాలు
* భావప్రసార నైపుణ్యాలు
* నాయకత్వ లక్షణాలు
* స్ఫూర్తిని అందించే నేర్పు
* బృంద నిర్మాణ నైపుణ్యాలు
* సృజనాత్మకత మొదలైనవి.
గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ
ఈ విభాగంలో అభ్యర్థులకు ఒక టాస్క్ ఇచ్చి దానికి సమాధానాలు కూడా ఇస్తారు. అభ్యర్థులు ఇచ్చిన సమాధానాల నుంచి సరైనదానిని గుర్తించి, ఆ సమాధానాన్ని సమర్థించడానికి అవసరమైన కారణాలను వివరించాల్సి ఉంటుంది.
బృందచర్చ తరువాత తుది ఎంపికకు వ్యక్తిగత మౌఖికపరీక్షలో మంచి మార్కులు సంపాదించడం తప్పనిసరి. దీనిలో అడిగే ప్రధానాంశాలు:
* అభ్యర్థి స్వీయ పరిచయం
* బీఈ/ బీటెక్ చివరి సంవత్సరపు ప్రాజెక్టు
* తమకు పట్టున్న సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు
* జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్
సంబంధిత సంస్థకు అభ్యర్థి తన ఇంజినీరింగ్ ప్రాజెక్టు ప్రాక్టికల్‌గా ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రశ్నలకు నిజాయతీగా జవాబులు చెప్పాలి. ఇది అభ్యర్థి శ్రద్ధ, స్వచ్ఛత, పరిపక్వతలను తెలియజేస్తుంది. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా విని సంక్షిప్తంగా జవాబును చెప్పాలి.
దీనిలో మంచి మార్కులు సంపాదించడానికి ఒకటి, రెండు మాదిరి ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. గతంలో ఆయా సంస్థల్లో ఎంపికైన అభ్యర్థుల నుంచి సలహాలు, సూచనలు రాబట్టవచ్చు. సంస్థ వెబ్‌సైట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే విలువైన సమాచారం పొందవచ్చు.
ముఖ్య సూచనలు
* మొదటగా గేట్ ర్యాంకు జనరల్ కేటగిరీలో 500- 1000లోపు వస్తే ఏదో ఒక సంస్థలో ఇంటర్వ్యూకు పిలుపు వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ ఆరువారాలు తగిన కృషి చేసి గేట్లో మంచి ర్యాంకు/ స్కోరు సాధించాలి.
* గేట్ పరీక్ష ముగిసిన తరువాత నిర్లక్ష్యం వహించకూడదు. గ్రూప్ డిస్కషన్/ గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూల మీద అధ్యయనం, అభ్యాసం చేయాలి.
కొన్ని నియామక సంస్థల ప్రకటనల ముఖ్య సమాచారం
మహారత్న సంస్థలు
1. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్x
ఉద్యోగం: ఇంజినీర్ ట్రెయినీ
విభాగాలు/ ఖాళీలు:
మెకానికల్- 115 ఎలక్ట్రికల్- 60
ఎలక్ట్రానిక్స్- 15 మెటలర్జీ- 10
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు ఆధారంగా 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
గేట్ స్కోరు వెయిటేజీ- 75% ఇంటర్వ్యూ వెయిటేజీ- 25%
దరఖాస్తు: ఆన్లైన్లో జనవరి 4, 2016 నుంచి ఫిబ్రవరి 1, 2016
వెబ్సైట్: www.careers.bhel.in
2. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
విభాగాలు/ ఖాళీలు:
మెకానికల్- 13 ఎలక్ట్రికల్- 13
ఇన్స్ట్రుమెంటేషన్- 6 కెమికల్ - 14
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు, బృందచర్చ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో డిసెంబర్ 22, 2015 నుంచి జనవరి 29, 2016 వరకు
వెబ్సైట్: www.gailonline.com
3. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు ఆధారంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో జనవరి 5, 2016 నుంచి జనవరి 29, 2016 వెబ్సైట్: www.ntpccareers.net
నవరత్న సంస్థలు
1. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్
అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 65% మార్కులతో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
గేట్- 2016 మార్కులు 100కి- 85%
గ్రూప్ డిస్కషన్- 3%
పర్సనల్ ఇంటర్వ్యూ- 12%
దరఖాస్తు: ఆన్లైన్లో జనవరి 15, 2016 నుంచి ఫిబ్రవరి 29, 2016 వరకు
వెబ్సైట్: www.powergridindia. com
2. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
ఉద్యోగం: మేనేజ్మెంట్ ట్రెయినీలు
విభాగాలు: మెకానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ బీఈ/ బీఎస్సీ (ఇంజినీరింగ్)
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష
దరఖాస్తు: ఆన్లైన్లో డిసెంబర్ 17, 2015 నుంచి జనవరి 30, 2016 వరకు
వెబ్సైట్: www.bpclcareers.com
3. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్
ఉద్యోగం: గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
విభాగాలు/ ఖాళీలు:
మెకానికల్- 50 ఎలక్ట్రికల్ - 15
ఎలక్ట్రానిక్స్ - 5 సివిల్- 10
కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్- 5
మైనింగ్- 10 కంప్యూటర్స్- 5
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు ఆధారంగా తరువాతి దశలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో డిసెంబర్ 23, 2015 నుంచి జనవరి 22, 2016 వరకు
వెబ్సైట్: www.nlcindia.com
4. నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్
ఉద్యోగం: మేనేజ్మెంట్ ట్రెయినీ
విభాగాలు: సివిల్
అర్హత: కనీసం 60% మార్కులతో ఫుల్‌టైం సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో డిసెంబర్ నెలాఖరు నుంచి ప్రారంభం
వెబ్సైట్: www.nbccindia.com
ఇతర సంస్థలు
1. మజ్గావ్డాక్షిప్ బిల్డర్స్ లిమిటెడ్
ఉద్యోగం: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
విభాగాలు/ ఖాళీలు:
మెకానికల్- 16, ఎలక్ట్రికల్- 19
అర్హత: సంబంధిత విభాగంలో 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో డిసెంబర్ 18 నుంచి ఫిబ్రవరి 1, 2016 వరకు
వెబ్సైట్: www.mazagondock.gov.in
2. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్
ఉద్యోగం: ట్రెయినీ ఇంజినీర్/ ట్రెయినీ ఆఫీసర్
విభాగాలు/ ఖాళీలు:
ఎలక్ట్రికల్- 50 సివిల్- 20
మెకానికల్- 20
అర్హత: కనీసం 60% మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్)/ ఏఎంఐఈ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: గేట్- 2016 స్కోరు ఆధారంగా తరువాతి దశలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో జనవరి 1, 2016 నుంచి ప్రారంభం
వెబ్సైట్: www.nhpcindia.com
గేట్ 2016 ద్వారా నియామకాలు చేపట్టే మరికొన్ని సంస్థలు:
ఏఏఐ, బార్క్, బీబీఎన్ఎల్, బెల్ ఇండియా, సీఈఎల్, కోల్ ఇండియా లిమిటెడ్, కాన్కర్, డీడీఏ, డీవీసీ, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎంఈసీఎల్, ఎంఈసీఓఎన్, నాల్కో, ఆయిల్ ఇండియా, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, రైట్స్, టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్, డబ్ల్యూబీఎస్ఈడీసీఎల్.
Posted on 14- 12 - 2015