![]() |
కళాశాలల నుంచే అంకురం
* స్టార్టప్ విలేజ్‌తో టీహబ్ ఒప్పందం
* తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రయోజనం
ఈనాడు, హైదరాబాద్: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) తొలిసారిగా ఏర్పాటైన స్టార్టప్విలేజ్ (ఎస్వీ.కో)తో హైదరాబాద్‌లోని టీహబ్ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రతిభావంతులైన ఔత్సాహికులను, వారిలోని అంకుర ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఎస్వీ.కో దేశవ్యాప్తంగా 3500 ఇంజినీరింగ్ కాలేజీల్లో 50లక్షల మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ‘స్టార్ట్ ఇన్ కాలేజీ’ (కళాశాల నుంచే అంకురం) అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 50మందికి పైగా అత్యుత్తమ విద్యార్థులను ఎంపిక చేసి ఆర్నెల్లలో వారి ఆలోచనలు ఆచరణరూపం దాల్చేందుకు సాయమందిస్తుంది. ఈ ఆర్నెల్లలో చివరి వారం వారిని అమెరికాలోని సిలికాన్‌వ్యాలీకి తీసుకెళతారు. ప్రతి రాష్ట్రంలో 15 ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. తెలంగాణ నుంచి అధికారిక భాగస్వామిగా టీహబ్ ఉంటుంది. ఈ మేరకు స్టార్టప్విలేజ్ ఛైర్మన్ సంజయ్ విజయకుమార్, టీహబ్ సీఈవో జయ్కృష్ణన్లు ఎంఓయూపై ఆగస్టు 13న సంతకాలు చేశారు. కార్యక్రమం తొలిదశలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను భాగస్వాములను చేస్తున్నారు. తెలంగాణలోని ప్రతిభావంతులైన విద్యార్థులు తమ అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసి సిలికాన్ వ్యాలీలో ఆవిష్కరించడానికి ఈ ఒప్పందం ద్వారా వీలుకలుగుతుందని స్టార్టప్ విలేజ్ ఛైర్మన్ సంజయ్ ఆశాభావం వ్యక్తంచేశారు. సిలికాన్‌వ్యాలీ కార్యక్రమం ఎంపికలో పాల్గొనాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులు www.sv.co ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
టీహబ్-2కు కేంద్రసాయానికి సిఫార్సు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న టీహబ్ రెండో దశకు కేంద్ర సాయం అందేలా సిఫార్సు చేస్తామని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ వెల్లడించారు. తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ప్రణాళికసంఘం ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్యలతో కలిసి అమితాబ్‌కాంత్ టి-హబ్‌ను సందర్శించారు. అక్కడి ఔత్సాహికులతో ముచ్చటించారు. అంకుర కేంద్రాల కోసం ఇలాంటి ప్రయోగశాలను ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ ఆలోచనను మెచ్చుకున్నారు. ‘‘టీహబ్ రెండో దశకు కేంద్రం ఆర్థికసాయం అందించేలా సిఫార్సు చేస్తాం. అంతేగాకుండా పలు అంకుర కార్యక్రమాలను టీహబ్‌లో నిర్వహించేలా కేంద్రానికి సూచిస్తాం’’ అని అమితాబ్‌కాంత్ హామీ ఇచ్చారు.
Posted on 14-08-2016