google పిలుస్తోంది!

‘గూగుల్‌లో జాబ్‌ కొట్టాలిరా... అదే నా టార్గెట్‌!’ తరచూ క్యాంపస్‌ల్లో వినిపించే మాట ఇది. ఇప్పుడా అవకాశం మరింత చేరువైంది. 1.3 లక్షలమంది భారతీయ విద్యార్థులకు ఉపకారవేతనంతో కూడిన అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వాలని గూగుల్‌ నిర్ణయించింది. సెర్చ్‌ఇంజిన్‌ స్థాయికే పరిమితం కాకుండా ప్రజల జీవనప్రమాణాలు, నాణ్యతలను మెరుగుపరిచే సామాజిక సంస్థగా రూపొందే క్రమంలో గూగుల్‌ వేస్తున్న అడుగులు ఇవి.

అధునాతన టెక్నాలజీ అభివృద్ధి, వినియోగ రంగాల ప్రారంభ పరిశ్రమల స్థాపనలో అమెరికా తర్వాతి స్థానంలో మనదేశమే ఉంది. ఈ విషయంలో 2021 నాటికి అమెరికాని అధిగమించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. కొత్త టెక్నాలజీలను ఆదరించి, ఉపయోగించడంలో భారతీయులు ముందున్నారు. కానీ వినూత్నత్వంలో చైనా కంటే వెనుకబడి ఉన్నారు. ఈ రంగంలో కూడా భారతీయులను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్‌లో అగ్రగామి శిక్షణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని గూగుల్‌ ఇప్పటికే దాదాపు 2,60,000 మందికి అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థ ఉడాసిటీ ద్వారా మన డెవలపర్లు గూగుల్‌ సంస్థ రూపొందించిన కోర్సుల్లో శిక్షణ పొందారు.
ఈసారి ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో శిక్షణ అందించే ప్రముఖ సంస్థ ప్లూరల్‌సైట్‌ వెబ్‌సైట్‌ ద్వారా 1,00,000 మందికి, ఉడాసిటీ వేదికపై 30,000 మందికి శిక్షణ ఇప్పించాలని గూగుల్‌ నిర్ణయించింది. ఆ మేరకు ప్రకటన చేసింది. ఈ సమయంలో స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీపై ఈ శిక్షణ ఉంటుందని గూగుల్‌ ఉత్పత్తుల అభివృద్ధి, భారతీయ శిక్షణ విభాగం అధిపతి విలియమ్‌ ఫ్లోరెన్స్‌ వెల్లడించారు. ఈ అవకాశం వినియోగించుకుంటే భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ప్రపంచ స్థాయిలో నాణ్యమైన, అధునాతన మెలకువలు కలిగిన నిష్ణాతులుగా మారతారు.
ప్లూరల్‌సైట్‌ ద్వారా మొదట తమ సాంకేతిక మెలకువల స్థాయిని అభ్యర్థులు బేరీజు వేసుకోవచ్చు. తదనుగుణంగా ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, మొబైల్‌ ఇంటర్‌నెట్‌ స్కిల్స్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్చర్‌, డేటా ఇంజినీరింగ్‌ అనే నాలుగు ముఖ్యమైన రంగాల్లో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.
ఈ స్కాలర్‌షిప్‌ ఆధారిత శిక్షణ కార్యక్రమం ద్వారా గూగుల్‌, ప్లూరల్‌సైట్‌, ఉడాసిటీ సంస్థల్లోని అనుభవజ్ఞులు, నిష్ణాతులతో అభ్యర్థులకు పరిచయం పెరుగుతుంది. వారి సహాయ సహకారాలు, శిక్షణ, పర్యవేక్షణలతో మరింత సాంకేతిక నైపుణ్యాన్ని సాధించి ఉద్యోగావకాశాలను మెరుగు పరచుకోవచ్చు. అంతేకాకుండా నేటి, రేపటి సమాజ అవసరాలకు ఉపయోగపడే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా ఇంటర్‌నెట్‌ వేదికగా ఈ-కామర్స్‌ సేవల రంగంలో కూడా ఉన్నత ఉద్యోగాలతో కెరియర్‌ని ప్రారంభించవచ్చు.
ఎందుకీ స్కాలర్‌షిప్‌లు?
చైనా తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా వినియోగంలో ఉన్న భారతదేశంలో ఇంటర్‌నెట్‌ అందరికీ అందుబాటులోకి తెచ్చి తమ సేవలను విస్తరించాలని గూగుల్‌ భావిస్తోంది. ప్రపంచంలోని వివిధ ఉత్పత్తులు భారతదేశ అవసరాలకు ఉపయోగపడే విధంగా చూడటం, భిన్న అభిరుచులు, సంస్కృతుల సమాహారమైన మన దేశానికి విలువైన, ఉపయుక్తమైన కంటెంట్‌, వీడియోలను అందించాలనుకుంటోంది. వివిధ స్థానిక భాషల్లో ఈ సేవలు అందించాలని గూగుల్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిపుణుల అవసరం ఉంటుంది. అందులో భాగంగానే శిక్షణ ఇవ్వనుంది. తద్వారా ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి.
డిగ్రీలో చేరి ఉంటే చాలు!
అభ్యర్థికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌సైన్స్‌ లేదా ఇతర అనుబంధ రంగానికి సంబంధించి డిగ్రీస్థాయిలో ప్రవేశం పొంది ఉండాలి. గూగుల్‌ సంస్థ కంప్యూటర్‌సైన్స్‌ లేదా దాని అనుబంధ బ్రాంచిలో అభిరుచి ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇస్తోంది. ఈ రంగంలోని కొత్త కోర్సులను ఆన్‌లైన్‌లో నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే అభ్యర్థులు ఇప్పటికే విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది ఉండాలి.
దరఖాస్తు పద్ధతి
ఉడాసిటీ, ప్లూరల్‌సైట్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఈ కింది లింక్‌ల ద్వారా విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
https://in.udacity.com/ google-india-scholarships
https://app.pluralsight.com/id?
అంతర్జాతీయ శిక్షణ
ఆండ్రాయిడ్‌, మొబైల్‌ ఇంటర్‌నెట్‌లకు సంబంధించి వివిధ టూల్స్‌పై నాణ్యమైన అంతర్జాతీయ శిక్షణ ఉంటుంది. ఉడాసిటీలో కోర్సు రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తారు. నాలుగు కోర్సుల్లో ఏదైనా ఒకదానికి అభ్యర్థి నమోదు చేసుకోవచ్చు. ఆరునెలల శిక్షణ పూర్తయిన తర్వాత ప్రతిభను ప్రదర్శించిన 1000 మంది విద్యార్థులకు పూర్తి స్కాలర్‌షిప్‌తో రెండో దశ శిక్షణ ఉంటుంది. దీనితోపాటు విద్యార్థి నేర్చుకున్న నైపుణ్యంలో నానో డిగ్రీని ప్రదానం చేస్తారు. దీంతో పాటు ఉద్యోగం కూడా ఇంచుమించు ఖరారు అయినట్టే.
స్కాలర్‌షిప్‌ ముఖ్యమైన తేదీలు
ఉడాసిటీలో
వివరాల నమోదు చివరి తేది: జనవరి 31, 2018
సవరణలకు గడువు: ఫిబ్రవరి 1, 2018
అభ్యర్థిత్వం ఖరారు తేది: ఫిబ్రవరి 8, 2018
తరగతులు ప్రారంభం: ఫిబ్రవరి 14, 2018
ప్లూరల్‌సైట్‌లో
వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.
గడువు తేదీలు ఇంకా ప్రకటించలేదు.
ఉడాసిటీ

ప్రధానంగా ఆండ్రాయిడ్‌, డేటా సైన్స్‌, డేటా అనలిటిక్స్‌, కృత్రిమ మేధ వంటి పదహారు రంగాల్లో వివిధ సర్టిఫికెట్‌ కోర్సులను ఉడాసిటీ వెబ్‌సైట్‌ అందిస్తోంది. ఆన్‌లైన్‌ శిక్షణలను కొన్నింటిని ఉచితంగానూ, మరికొన్నింటిని నానో డిగ్రీ పేరుతో కొంత రుసుంతోనూ అందిస్తోంది. నైపుణ్యాలను పెంచుకుని, అధునాతన టెక్నాలజీల్లో కెరియర్‌ ప్రారంభించాలనుకునే వారికి ఉడాసిటీ చక్కటి వేదిక. విద్యార్థులు, డెవలపర్లకూ అవకాశాలు ఉన్నాయి. అమెరికాలోని ప్రముఖ జార్జియాటెక్‌ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసే అవకాశం కూడా ఉంది.
ప్లూరల్‌సైట్‌

సాఫ్ట్‌వేర్‌, ఐటీ రంగాలతోపాటు సృజనాత్మకతకు అవకాశం ఉన్న సివిల్‌, మెకానికల్‌, ఆర్కిటెక్చర్‌, మేనేజ్‌మెంట్‌ వంటి వృత్తి విద్యా రంగాల్లో కూడా వివిధ కోర్సులను ఆన్‌లైన్‌లో ప్లూరల్‌సైట్‌ సంస్థ అందిస్తోంది. ప్రస్తుత టెక్నాలజీల్లోనే కాకుండా సమీప భవిష్యత్తులో ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిశ్రమలకు ఉపయోగపడే టెక్నాలజీలను గుర్తించి కోర్సులు రూపొందించి ప్లూరల్‌సైట్‌ శిక్షణ ఇస్తోంది. అయితే ప్రస్తుతం గూగుల్‌ సంస్థ ద్వారా ఈ రెండు సంస్థలు కూడా ఆండ్రాయిడ్‌, జావా రంగాల్లోనే కోర్సులను స్కాలర్‌షిప్‌ల ద్వారా నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయుల్లో అందిస్తున్నారు.

- నీల‌మేఘ‌శ్యాం దేశాయి, ACE ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌
భారతీయ విద్యార్థుల సృజనాత్మకతకు ప్రోత్సాహం
భారతీయ విద్యా విధానం విద్యార్థుల్లోని సృజనాత్మకత ప్రయోగాత్మకతలను ప్రోత్సహించేదిగా ఉండాలని నా అభిప్రాయం. అందుకే రాబోయే మూడు సంవత్సరాల్లో రెండు మిలియన్ల భారతీయ విద్యార్థులకు ఎమర్జింగ్‌ టెక్నాలజీలో ఉపకార వేతనంతో కూడుకున్న ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వాలని గూగుల్‌ నిర్ణయించింది. తద్వారా వారిలో ఉద్యోగ సంసిద్ధతను పెంచాలని భావిస్తున్నాం.
- సుందర్‌ పిచాయ్‌. సీఈవో, గూగుల్‌

Posted on 29-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning