మొదటి కొలువులో మీదైన ముద్ర!

కాలేజీల్లో కొత్త కొలువుల కోలాహలం మొదలైంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎలాగైనా ఉద్యోగం కొట్టి స్నేహితులు, బంధువుల మధ్య సెలబ్రిటీ అయిపోవాలనే ఆరాటం అందరిలో ఉంటుంది. కానీ ఎంతోమందితో జరిగిన పోటీలో నిలబడినప్పటికీ కొత్త ఉద్యోగంలో పరిస్థితులను ఎదుర్కొలేక ఫ్రెషర్లు నిరాశ పడుతుంటారు. అలాంటి వాళ్లు వేగంగా అన్ని రకాల నైపుణ్యాలను ప్రదర్శించాలని కార్పొరేట్‌ కంపెనీలు కోరుకుంటాయి. వాటిని ముందుగానే తెలుసుకొని, సన్నద్ధమైతే మొదటి కొలువులో సొంత ముద్రను విజయవంతంగా వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కళాశాలల్లో ప్రాంగణ నియామకాల తరుణమిది. విద్యార్థులు ఎన్నో దశల్లో ప్రతిభ చూపి మెప్పిస్తేనే ఉద్యోగం లభిస్తుంది. కాలేజీకి బై చెప్పి, కొలువు బాట పట్టడం ఉత్తేజాన్నివ్వడంతోపాటు ఎంతోకొంత భయపెట్టడమూ సాధారణమే. జీవితకాలపు కెరియర్‌ను నిర్దేశించగల కొలువులో అనుచిత వైఖరిని అనుసరిస్తే ఎదుగుదల ఉండదు. నైపుణ్యాలు ఎప్పటికీ వెలుగులోకి రాకుండానూ పోవచ్చు. సంస్థ ఆశించిన అంచనాలను అందుకోవడానికైనా, అక్కడి వాతావరణంలో ఇమడటానికైనా కొత్త ఉద్యోగికి కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. వాటిని గ్రహించి పాటిస్తే సరిపోతుంది. అయితే... మొదటి ఉద్యోగమంటే శాశ్వత ఉద్యోగమే అవ్వాలనేం లేదు. టెక్నికల్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేశాక ఫ్యాషన్‌ రంగంపైకో, ఫొటోగ్రఫీపైకో మనసు మళ్లిందనుకోండి. ఇంటర్న్‌షిప్‌ ద్వారానో, పార్ట్‌టైం ఉద్యోగం ద్వారానో ఆ రంగం సరిపోతుందేమో ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు. సరిపోతే సరే! లేదంటే, చదివిన విభాగంలోనే ఉద్యోగం చేసుకోవచ్చు. మొదటి ఉద్యోగ సమయంలో వయసు కూడా కలిసొచ్చే అంశం కాబట్టి, ప్రయోగాలను ఆహ్వానించొచ్చు.

జంకు గొంకు లేకుండా...
ధైర్యే సాహసే: స్నేహితులతో ఏ విషయమైనా చర్చించేటపుడో, కుటుంబ సభ్యులతో మాట్లాడేపుడో ఎలాంటి జంకూ లేకుండా మాట్లాడుతుండటం సహజం. సంస్థలు కూడా ఉద్యోగులు తమ ఆలోచనలను పంచుకోవడంలో, తమ వివరణలను అందించడంలో అలాగే నిర్భయంగా ఉండాలని ఆశిస్తుంటాయి. నిజానికి ఒక అభ్యర్థిని ఎంచుకునేపుడు వారి రెజ్యూమెలో ‘ఫలానా కార్యక్రమానికి లీడ్‌ చేశాను’, ‘ఇంతమంది ప్రేక్షకుల ముందు ప్రెజెంటేషన్‌ ఇచ్చాను’ లాంటివి ఉన్నవారిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపడానికి కారణమిదే. చెప్పే ఆలోచన/ సూచన ఏదైనా నిర్భయంగా తెలియజేయడం అలవరచుకోవాలి.
ఉదాహరణకు- ఏదైనా పని/ సమస్య విషయంలో చర్చ జరిగేటపుడు మీకేదైనా ఆలోచన తడితే చెప్పడానికి మొహమాటపడకూడదు. ఒక్కోసారి చిన్న ఆలోచనే పెద్ద సమస్యల పరిష్కారానికి దారి చూపుతాయి. మీ సూచనను పై అధికారులు తీసుకున్నా, తీసుకోకపోయినా సమస్య పరిష్కారానికి మీవంతు ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వారిలో ఉంటుంది.
చొరవ, చర్చ: వ్యక్తిగత విశ్వసనీయతకు పునాది కూడా మొదటి కొలువు నుంచే పడుతుంది. ఇది సంస్థ, తోటి వ్యక్తులు సదరు వ్యక్తిపై చూపే నమ్మకం ద్వారా సాధ్యపడుతుంది. మరి దాన్ని పొందడమెలా? ఏదైనా పనిని అప్పగించినపుడు దాన్ని గడువులోగా పూర్తిచేయండి. ఇక్కడ ఏవైనా సందేహాలున్నపుడు అడగడానికి వెనకాడొద్దు. ఎవరికైనా సాయం అవసరమైనపుడు అందించడానికీ ఆలోచించొద్దు. ఏదైనా విషయంలో భిన్నాభిప్రాయాలున్నా, వారితోనే చర్చించేలా ఉండాలి. వారు లేని సమయంలోనే ఇతరులతో చర్చించకూడదు.
త్వరగా, చురుకుగా: కొత్త ఉద్యోగం అన్నపుడు పెద్ద ప్రాజెక్టులు/ బాధ్యతలను నిర్వహించడానికి అభ్యర్థికి కొంత శిక్షణ అవసరమనేది సంస్థల అభిప్రాయం. నిజానికి దాదాపుగా అన్ని సంస్థలూ ఈ ప్రక్రియను అవలంబిస్తాయి. వీటిని అభ్యర్థి త్వరగా నేర్చుకోవాలనీ, చురుకుగా ఉండాలని ఆశిస్తాయి. కాబట్టి అభ్యర్థి తాను త్వరగా నేర్చుకోగలననీ, చెప్పింది చురుగ్గా గ్రహించగలననీ అభిప్రాయాలను కలిగించగలగాలి.

జోరుగా... హుషారుగా..
* అప్పగించే ప్రతీ పనిపట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించగలగాలి. తొలి దశలో ఎంతవరకూ సానుకూలంగా, ప్రభావవంతంగా పనిచేశారన్న దానిపైనే అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. మొత్తంగా ‘నేను ఏదైనా చేయగలను’ అన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగలగాలి.
* మరీ అవసరమైతే తప్ప పనివేళలను తప్పకూడదు. వీలుంటే ఇంటి దగ్గరి నుంచే పనిచేసేలా (వర్క్‌ ఫ్రం హోం) అయినా అనుమతి తీసుకోవాలి. ఇలాంటపుడు అవసరమైతే పనివేళలు పెరిగినా వెనుకాడకూడదు. అసలు సమయపాలన అనేది క్రమశిక్షణను తెలుపుతుంది.
* ఏదైనా ప్రాజెక్టును కేటాయించినపుడు దానిలోని పురోగమనాన్ని సంబంధిత అధికారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలి. తద్వారా దానిలో మీ పాత్ర ఎంతవరకూ ఉందో తెలియజేసిన వారవుతారు. ఈ సమయంలో ఏదైనా అవసరం అయితే/ సందేహాలున్నా అడగడానికి వెనుకాడొద్దు. అయితే పూర్తిగా ఆధారపడటమూ మంచిది కాదు.
* పనివేళల్లో అదే పనిగా సెల్‌ఫోన్‌ చూడటం, సామాజిక మాధ్యమాల్లో గడపడం మంచిది కాదు. మరీ అవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. సోషల్‌ మీడియాలో మీ వ్యక్తిగత అభిప్రాయాలు సంస్థ ప్రతిష్ఠను తగ్గించే వీలు కలిగించేలా ఉన్నాయేమో చూసుకుని, వాటిని తొలగించడమే మేలు.
* తోటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాలి. మీ పని బాధ్యతలతోపాటు మీ పక్క బృందాలు/ వ్యక్తుల పని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సంస్థలో ఇతర డిపార్ట్‌మెంట్ల పనిపై అవగాహన వ్యక్తిగత అభివృద్ధికీ తోడ్పడుతుంది.
* ఉద్యోగపరంగా ఎదగడంపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. మీరు నేర్చుకోవాలనుకుంటున్న, అవసరమైన నైపుణ్యాలకు దానిలో ప్రాధాన్యముండాలి. అందుకుగానూ ఏ సర్టిఫికేషన్లు, కోర్సులు అవసరమో మేనేజర్లు, హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్లను అడిగి తెలుసుకోవచ్చు.
అంతిమంగా సంస్థకు ఒక అభిప్రాయాన్ని కలిగించగలిగేది ఉద్యోగి సాఫ్ట్‌ స్కిల్సే. అందుకే టెక్నికల్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ సమన్వయం తెలిసుండాలి. అన్నిటికీ మించి కొత్త ఉద్యోగంలో విజయవంతం కావాలంటే తన మీద తనకు నమ్మకం ఉండటం ఎంతో ముఖ్యం!

ఎలా ఉన్నా స్వీకరించాలి
ఉద్యోగంలో చేరగానే తోటివారంతా కొత్త విద్యార్థిలా మీరు నేర్చుకునేవరకూ ఓపికగా నేర్పుతారనో, ఓనమాలు దిద్దిస్తారనో ఆశించకూడదు. అలాగని ముందు నుంచే భారీగా పని ఇచ్చేసి చేయమంటారనే భయమూ వద్దు. ఒక్కో సంస్థ తీరు ఒక్కోలా ఉంటుంది. ఫలానా విధంగానే ఉంటుందనుకుని ముందుగానే ఊహించుకుంటే అలా లేకపోయేసరికి నిరుత్సాహపడాల్సి వస్తుంది. అది పని మీదా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఎలా ఉన్నా స్వీకరించేలా సిద్ధమవ్వాలి. ఈ క్రమంలో కొత్త నైపుణ్యాలు అవసరమైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విద్యార్థిగా ఉన్నపుడు ఒక తరగతికి హాజరు కాకపోవడం, అసైన్‌మెంట్‌ చేయకపోవడం లాంటి చర్యల వల్ల మీకొక్కరికే నష్టం వస్తుంది; మిగతా విద్యార్థులకు కాదు. కానీ సంస్థ విషయంలో అలా కాదు. ఒక బృందంలో పనిచేస్తున్నపుడు మీరు తీసుకునే ఒక చర్య మిగతా వారందరిపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని, నడచుకోవాలి. ప్రతీ సంస్థకూ పని విషయంలో తనదైన సంస్కృతి ఉంటుంది. మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి కొత్తగా అనిపించవచ్చు. కొంత ఓర్పు, నెమ్మదితనం అలవరచుకోవాలి. ఈ తరహా ఆలోచన.. నేర్చుకునే విధానాన్ని సులభతరం చేస్తుంది. కొత్త ఉద్యోగులకు 90 రోజుల సమీక్షను నిర్వహించటం కొన్ని సంస్థలకు పరిపాటి. ఒకవేళ అలాంటి పద్ధతి లేకపోయినా ఆ సమీక్షను నిర్వహించమని ఉద్యోగులు తన పై అధికారిని కోరవచ్చు. దీనివల్ల తమ పనితీరు ఏ దిశలో ఉన్నదీ గ్రహించవచ్చు. లోపాలను సవరించుకుని, మెరుగుపరచుకోవచ్చు.

కొత్తవి నేర్చుకోవటానికి వెనుకాడకూడదు
ఇంజినీరింగ్‌ చదువుతున్నపుడే హైదరాబాద్‌లోని ఓ స్టార్టప్‌ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌ చేశాను. ఇంటర్న్‌షిప్‌ చేసినవారికి నియామకాల్లో కొంత మొగ్గు ఉంటుంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ‘లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌’ సంస్థలో ఈ ఏడాది జనవరిలో నాకు ఉద్యోగావకాశం లభించింది. ఇంటర్‌్్నగా ఆరునెలలు చేశాక డేటా అనలిస్టుగా తీసుకున్నారు. ఆరు వారాల శిక్షణ ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన మొదట్లో కొత్తకొత్తగా ఉంటుంది. మనకేదీ తెలియదనిపిస్తుంది. కానీ ఫ్రెషర్లనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కేర్‌ తీసుకుని, సీనియర్లు సపోర్ట్‌ చేస్తుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వటంతో పాటు మూడు నెల్లకూ, ఆరు నెల్లకూ సీనియర్లూ, మేనేజర్లూ మన పనితీరును సమీక్షిస్తారు. ఇక్కడ చేరాక సంస్థ అవసరాలకు అనుగుణంగా ఆర్‌ ప్రోగ్రాం, పైతాన్‌ టెక్నాలజీలను నేర్చుకున్నాను. ఈ విషయంలో వెనుకాడకూడదు. అలాగే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలుంటే క్లయింట్‌ అవసరాలను కచ్చితంగా గ్రహించి, దానికి తగ్గట్టు మెరుగ్గా పనిచేయగలుగుతాం. కళాశాలలో నేర్చుకున్న తీరు వేరు. కార్పొరేట్‌ రంగంలో పనిచేయటం విభిన్నంగా ఉంటుంది. ఎంతోమంది అనుభవజ్ఞులతో మాట్లాడే అవకాశం వస్తుంది. అక్కడి ప్రాజెక్టులు, ఆ అనుభవం వెలకట్టలేనివి!
- భావన సతీష్‌, డేటా అనలిస్ట్‌

పరిధి పెట్టుకోకుండా పనిచేయాలి
బీటెక్‌ ముగిసేలోపే ‘కోనీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ జులై 2016లో నాకు జాబ్‌ ఆఫర్‌ ఇచ్చింది. మొబైల్‌ యాప్స్‌కు సంబంధించిన ఈ సంస్థ 18 రోజుల శిక్షణ ఇచ్చి, ఇంటర్న్‌గా తీసుకుంది. అలా 14 నెలలు పనిచేశాక సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా డిజిగ్నేషన్‌ ఇచ్చారు. కొత్తగా చేరానని ఉద్యోగ విధుల్లో ఎలాంటి వెసులుబాట్లూ ఇవ్వరు. చొరవ చూపించాల్సిందే. బేసిక్స్‌పై పట్టు ఉంటుందని భావించే విధులు అప్పగిస్తారు. దానికి సిద్ధంగా ఉండాలి. మాకు 4 వారాలకోసారి అరగంట సమావేశం ఉండేది. ఎక్కడ మెరుగుపరుచుకోవాలో ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేవారు. దాంతో నెలనెలా ఇంప్రూవ్‌మెంట్‌ వచ్చింది. నాణ్యతగా, బాధ్యతగా పనిచేయటం చాలా అవసరం. అవసరమైనపుడు పనివేళలు ఎక్కువైనా పట్టించుకోకూడదు. విధుల పరిధి దాటి అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు వస్తుంది. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ముఖ్యం. బాగా పనిచేస్తే అవార్డులు, స్వల్పకాలంలోనే పదోన్నతి సాధ్యమేనని నా అనుభవం చెప్తోంది.
- ఆదిత్య, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌

Posted on 21-08-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning