ఉచితంగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ కోర్సులు

* అందుకోండి ఐఐటీ ఉచిత సాయం!

సాంకేతిక రంగంలో ప్రతిభ చూపాలంటే పైథాన్‌ నుంచి బిగ్‌డేటా వరకూ ప్రాథమికాంశాలైనా నేర్చుకోవాల్సిందే. ఈ విధంగా కంప్యూటర్‌ సైన్స్‌లో నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలని చాలామంది ఆశిస్తుంటారు. వీరికి ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ బాంబే ఈ క్రమంలో కొత్తగా ఏడు కోర్సులనూ, దిల్లీకి చెందిన ఎకోవేషన్‌ మూడు కోర్సులనూ ప్రవేశšపెట్టాయి. ఆసక్తి ఉన్నవారు వీటిని ఉచితంగానే అభ్యసించవచ్చు!

కం ప్యూటర్‌ సైన్స్‌ రంగంలోని ప్రాథమిక అంశాలు నేర్చుకోవటం ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. వాటిని ప్రామాణికంగా నేర్చుకుంటే అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో చేరి ఇట్టే అల్లుకుపోవచ్చు. ప్రాథమిక అంశాలను సశాస్త్రీయంగా బోధించే కోర్సులు మొదలుకొని ఆధునిక టెక్నాలజీల వరకు కోర్సులను రూపొందించారు. వీటిని ఆన్‌లైన్‌లో అనుకూలమైన వేళల్లో నేర్చుకోవచ్చు. ఫీజు చెల్లింపులతో నేర్చుకునే కోర్సులున్నప్పటికీ, కొన్ని ప్రయోజనకరమైన కోర్సులను మాత్రం ఉచితంగానే అందిస్తున్నాయి.

ఐఐటీ బాంబేఎక్స్‌లో...
దేశంలోని పురాతన సంస్థల్లో ఐఐటీ బాంబే ఒకటి. పరిశోధన ప్రోగ్రామ్‌లు, నాణ్యమైన విద్య పరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా పొందింది. దేశంలోకెల్లా ఈ సంస్థలో ప్రవేశాన్ని పొందడం కష్టంగా భావిస్తుంటారు. జేఈఈలో ఎంతో మంచి ర్యాంకు సాధించినవారికే ఇక్కడ సీటు సాధ్యమవుతుంది. ఇక్కడ బోధన రెండు విధాలుగా- ఆన్‌లైన్‌, తరగతి బోధనల్లో ఉంటుంది. తమను తాము సాంకేతికంగా తీర్చిదిద్దుకోవాలనుకునేవారికి ‘ఐఐటీ బాంబేఎక్స్‌’ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిలో పలు రకాల కోర్సులను అందుబాటులో ఉంచింది.
ఐఐటీ బాంబేఎక్స్‌ ఉచిత ఆన్‌లైన్‌ వేదిక. విద్యార్థులకూ, ప్రొఫెషనల్స్‌కూ వారి కెరియర్‌లోని వివిధ దశల్లో తోడ్పడేలా ఈ వేదిక ఎడ్యూ మూక్స్‌ను అందిస్తోంది. దీంతో ప్రధానమైన 7 ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ కోర్సులను ఎంపికచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది.
1. ఇంట్రడక్షన్‌ టూ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌: అల్గారిథమ్‌ రీతిలో కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లోని ప్రాథమిక భావనలను నేర్చుకుంటారు. ఇది విద్యార్థులను ప్రోగ్రామ్‌లను రాయడంలో, ప్రయోగాత్మక గణన సమస్యలను పరిష్కరించడంలో ప్రోత్సహిస్తుంది. ఇది 6 వారాల కోర్సు. నేర్చుకోవాలనుకునేవారు వారానికి 4 గంటలను కేటాయించాలి.
2. ప్రోగ్రామింగ్‌ బేసిక్స్‌: దీనికీ ఇంట్రడక్షన్‌ టూ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌కూ దగ్గరి సంబంధం ఉంటుంది. విద్యార్థులు అల్గారిథమ్స్‌, బేసిక్‌ డేటా టైప్స్‌తోపాటు సీ, సీ++ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌కు సంబంధించి చాలా అంశాలను నేర్చుకుంటారు. ఇది 9 వారాల కోర్సు. నేర్చుకోదల్చినవారు వారానికి 6-8 గంటలు కేటాయించాల్సి ఉంటుంది.
3. ఫౌండేషన్‌ ఆఫ్‌ డేటా స్ట్రక్చర్స్‌: ప్రభావవంతమైన అల్గారిథమ్స్‌ను రూపొందించడానికీ, నిర్వహణయోగ్యమైన సాఫ్ట్‌వేర్లను నేర్చుకోవడానికీ డేటా స్ట్రక్చర్స్‌ తప్పనిసరి. కోర్సులో భాగంగా నంబర్స్‌ వంటి ప్రాథమిక డేటా టైప్స్‌ను కూడా నేర్చుకుంటారు. ఆపై సమర్థమైన స్ట్రక్చర్లను రూపొందించడానికీ, నిర్వహించడానికీ అవసరమైన కాన్సెప్చువల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పరచుకుంటారు. ఇది ఆరు వారాల కోర్సు. నేర్చుకోవాలనుకునేవారు వారానికి 6 నుంచి 8 గంటల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
4. అల్గారిథమ్స్‌: భవిష్యత్తంతా దీనిదే. దీనిలో భాగంగా న్యూమరికల్‌, స్ట్రింగ్‌, జామెట్రిక్‌, గ్రాఫ్‌ అల్గారిథమ్స్‌, ఇతర వాటిని నేర్చుకుంటారు. విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి సరైన డేటా స్ట్రక్చర్లను ఉపయోగించి అల్గారిథమ్స్‌ను ఎలా ఉపయోగించొచ్చో నేర్చుకుంటారు. ఇది ఆరు వారాల కోర్సు. నేర్చుకోవాలనుకునేవారు వారానికి కనీసం 6 నుంచి 8 వారాల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
5. టెక్నికల్‌ స్కిల్స్‌: సాంకేతిక పరిశ్రమలో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. పైథాన్‌ నుంచి బిగ్‌డేటా వరకు అన్నింటికి సంబంధించిన బేసిక్స్‌ను నేర్చుకుంటారు. ‘హౌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ వర్క్స్‌?’ అనే ఒక కేస్‌స్టడీపైనా పనిచేస్తారు. ఇది నాలుగు వారాల కోర్సు.
6. ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌: ఈ కోర్సు బేసిక్స్‌కే పరిమితం కాకుండా ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ మెథడాలజీపై కొంత లోతైన అవగాహనను కలిగిస్తుంది. ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ పరిచయం, క్లాసెస్‌ అండ్‌ మెథడ్స్‌, పాలీమార్ఫిజం, ఇన్‌హెరిటెన్స్‌, ఇతర అంశాలు దీనిలో భాగంగా ఉంటాయి. ఈ కోర్సు ద్వారా ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ పద్ధతిలో సమస్యను గుర్తించడాన్ని నేర్చుకుంటారు. ఇది నాలుగు వారాల కోర్సు. వారానికి ఆరు నుంచి ఎనిమిది గంటలు కేటాయించాల్సి ఉంటుంది.
7. ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ డేటాస్ట్రక్చర్స్‌: సీ++కు ప్రతిరూపం లాంటి ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ను ఉపయోగించి అన్ని మేజర్‌ డేటా స్ట్రక్చర్లను ఎలా అమలు చేయొచ్చో నేర్చుకుంటారు. ‘ఫౌండేషన్స్‌ ఆఫ్‌ డేటాస్ట్రక్చర్స్‌’ కోర్సుతో దీనికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఇది 6 వారాల కోర్సు. వారానికి 6 నుంచి 8. గంటలు కేటాయించాల్సి ఉంటుంది.
ఈ కోర్సుల సర్టిఫికెట్లు కోరుకుంటే నమోదు చేసుకున్నవారు సుమారు రూ.3561 చెల్లించాల్సి ఉంటుంది.
వీటిని ఒక సమయంలో ఒక్కదాన్నే చేయాలనే నిబంధనేమీ లేదు. విద్యార్థి తన అనుకూలతను బట్టి, ఒకే సమయంలోని ఎన్ని కోర్సులను చేయాలనేది ఎంచుకోవచ్చు. లెక్చర్లు, అసైన్‌మెంట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. అంటే విద్యార్థికి తనకు సమయం అందుబాటులో ఉన్నపుడు వీడియోలు చూడటం, చదవడం, ఇచ్చిన ఎసైన్‌మెంట్‌ పూర్తిచేయడం వంటివి చేసుకోవచ్చు. కోర్సులు లేదా ఏదైనా విషయానికి సంబంధించి సందేహాలు ఎదురైనపుడు వెబ్‌సైట్‌లోని ‘డిస్కషన్‌ ఫోరం’లో అడగొచ్చు. ఈ కోర్సులకు ‘రీ టేక్‌’ అవకాశం కూడా ఉంటుంది. తీసుకున్న ప్రతిసారీ సర్టిఫికేషన్‌ లభిస్తుంది. కోర్సు పూర్తయ్యాక కూడా మెటీరియల్‌ అందుబాటులో ఉంటుంది. విద్యార్థి డాష్‌బోర్డులో ఆర్కైవ్స్‌లో దీన్ని తిరిగి పొందొచ్చు.
సంస్థ వెబ్‌సైట్‌: www.iitbombayx.in/\

ఎకోవేషన్‌లో...
ఐఐటీ దిల్లీ పూర్వవిద్యార్థులు రితేష్‌ సింగ్‌, అక్షత్‌ గోయల్‌ దీనిని 2015లో స్థాపించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా విద్యార్థులూ, ఉపాధ్యాయులూ, ఉద్యోగులూ, సంస్థలను ఒక తాటిపైకి తెస్తోంది. వీరందరికీ ఈ కోర్సుల్లోకి ప్రవేశించే వీలు ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్కెట్‌ పరిశోధన చేసి, అందుకు తగ్గట్టుగా కోర్సులను రూపొందిస్తున్నారు. దీంతో విద్యార్థులు కొత్త ట్రెండ్‌లూ, సంస్థల అవసరాలూ తెలుసుకుని తగిన నైపుణ్యాలను అందుకోగలుగుతారు.
కోర్సులు చేసేవారు వెబ్‌, ఆప్‌.. రెండు పద్ధతులనూ ఉపయోగించుకోవచ్చు. ఉచిత ఆప్‌ను ఆప్‌స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తీర్చిదిద్దారు. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లకే పరిమితం కాకుండా క్యాట్‌, ఎస్‌ఎస్‌సీ, ఐఐటీ జేఈఈ, యూపీఎస్‌సీ, బ్యాంకు పీవో మొదలైన వాటికి ఉచిత లర్నింగ్‌ గ్రూపులనూ అందిస్తున్నారు. మూడు విధానాల్లో.. ఫ్రొఫెషనల్‌ కోర్సులు, టెస్ట్‌ ప్రిపరేషన్‌, కరిక్యులమ్‌ లర్నింగ్‌లుగా అందిస్తున్నారు.
ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్స్‌డ్‌ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెషనల్‌ కోర్సులను నేర్చుకోవడానికి ప్యాకేజీలను నిర్ణయించారు. మధ్యతరగతి విద్యార్థుల కోసం 3 ప్రొఫెషనల్‌ కోర్సులను ఉచితంగా అందిస్తున్నారు.
* ఇంట్రడక్షన్‌ టూ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ: కోర్సు కాలవ్యవధి- ఒకరోజు. కోర్సులో భాగంగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ పరిచయం, ఉపయోగాలు, దానిలోని పొటెన్షియల్‌ అప్లికేషన్స్‌, క్రిప్టోకరెన్సీ గురించిన ప్రాథమిక సమాచారం గురించి తెలుసుకుంటారు.
* ఇంట్రడక్షన్‌ టూ మెషిన్‌ లర్నింగ్‌: కోర్సు కాలవ్యవధి- 7 రోజులు. కోర్సులో భాగంగా మెషిన్‌ లర్నింగ్‌ పరిచయం, లీనియర్‌ రిగ్రెషన్‌, పాలిమర్‌ రిగ్రెషన్‌, లాజిస్టిక్‌ రిగ్రెషన్‌, న్యూరల్‌ నెట్‌వర్క్‌, డీప్‌ లర్నింగ్‌ అంశాలను నేర్చుకుంటారు.
* సైబర్‌ అవేర్‌నెస్‌ ఫౌండేషన్‌ కోర్స్‌: కోర్సు కాలవ్యవధి-7 రోజులు. ఫైనాన్షియల్‌ లాసెస్‌ అవేర్‌నెస్‌, థ్రెట్స్‌, ట్రామా అవేర్‌నెస్‌ మొదలైనవి నేర్చుకుంటారు.
వెబ్‌సైట్‌:www.eckovation.com

Posted on 12-11-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning