మీ కొలువుల ప్రాజెక్ట్‌ మీరే కట్టుకోండి!

ఇంజినీరింగ్‌ ట్రెండ్‌ మారుతోంది. పట్టా పొందితే చాలనుకునే రోజులకు కాలం చెల్లుతోంది. పరిశ్రమల అవసరాలకు తగినంత పరిజ్ఞానం అభ్యర్థుల్లో ఉందో లేదో పరీక్షించే విధానం వచ్చేస్తోంది. అందుకే ప్రాజెక్ట్‌ వర్క్‌ను అత్యంత శ్రద్ధతో పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అదే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందంటున్నారు. నేర్చుకున్న అంశాలను సమాజ ప్రయోజనాలకు వినియోగించగల శక్తిసామర్థ్యాలను విద్యార్థులకు అందించడమే ప్రాజెక్టుల పరమోద్దేశం. వీటిని సమర్థంగా పూర్తి చేయడం అంటే మీ ఉద్యోగ లక్ష్యం చేరుకోడానికి మీరే ప్రాజెక్ట్‌ కట్టుకోవడం అన్నమాటే!
కిరణ్‌ అంతగా పేరు లేని ఒక ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చేస్తున్నాడు. నాలుగో సంవత్సరంలో ప్రాజెక్టు ముగించాడు. ప్రాంగణ నియామకాల కోసం ఆ కాలేజీకి పెద్దగా సంస్థలు రావు. ఒక ప్రముఖ కంపెనీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జాతీయస్థాయిలో నిర్వహించిన హ్యాకథాన్‌ లాంటి పోటీ పరీక్షలో పాల్గొన్నాడు. అందులో నెగ్గి ఇంటర్వ్యూకి వెళ్లాడు. కొన్ని మామూలు ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల్లో ఒకరు కిరణ్‌ చేసిన ప్రాజెక్టుపై ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ‘ప్రాజెక్టు ఎలా ఎంచుకున్నావు, ఆలోచన ఎలా తట్టింది, ఎంతమంది సభ్యులు, ప్రాజెక్టు చేసిన సంస్థ పేరు- వివరాలు, బృంద సభ్యుల సంఖ్య, ప్రాజెక్టులో నీ బాధ్యతలు ఏమిటి’ లాంటి కీలక ప్రశ్నలు అడిగారు. మూడో సంవత్సరం అయిన వెంటనే ప్రాజెక్టు గురించి వివరాలు సేకరిస్తూ, చక్కటి దారి వేసుకున్న కిరణ్‌కు ఆ ప్రశ్నలు పెద్దగా కష్టమనిపించలేదు. సాంకేతికంగానూ స్పష్టమైన సమాధానాలు చెప్పాడు. పెద్ద జీతంతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతడితో కలిసి ప్రాజెక్టు చేసిన మిగిలిన ఇద్దరికీ ఆ సంస్థలోనే ఉద్యోగం వచ్చింది. ప్రాజెక్టుని సీరియస్‌గా తీసుకుని శ్రద్ధగా చేయడంతో కిరణ్‌ బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు పడింది.
ప్రాజెక్టు ఎందుకు చేయాలి?
నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌ ప్రయాణంలో సబ్జెక్టులు చదవడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఒక కోణమైతే.. ప్రాజెక్టు చేయడం మరో ముఖ్యమైన కోణం. బీటెక్‌ మూడో సంవత్సరంలో ఉన్న విద్యార్థులు మినీ ప్రాజెక్టు, నాలుగో సంవత్సరంలో ఉన్నవారు మెయిన్‌ ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. బీటెక్‌ ముగించడంలోని ఆఖరిమెట్టు ప్రాజెక్టు. ఉద్యోగ సాధనకూ, కెరియర్‌ను సక్రమ మార్గానికి మలచుకోవడానికీ దీన్ని తొలి అడుగుగా చెప్పవచ్చు.
ప్రాజెక్టు అనేది విద్యాపరంగానే కాకుండా ఇతర ప్రయోజనాల కోసమూ ప్రాధాన్యం సంతరించుకుంది.
* ప్రాజెక్టు ఇంజినీరింగ్‌లో అంతర్భాగం. ఇది చేయకపోతే బీటెక్‌ పూర్తి కాదు.
* విద్యార్థిగా చదివే పాఠ్యాంశాల సామాజిక అవసరం పట్ల సమగ్ర అవగాహన ఉండాలి. ఈ దిశలో సమాజ అవసరాలను తెలుకోడానికి ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.
* మనుషుల దైనందిన పనులను సులభతరంగా, సమర్థంగా చేయడానికి నేర్చుకున్న విషయ జ్ఞానం ఎలా ఉపయోగించాలో ప్రాజెక్టు వల్ల తెలుస్తుంది.
* పుస్తకాల్లోని అంశాలకూ, ప్రపంచంలో వాటి వినియోగానికీ మధ్య తేడా గ్రహించి తగిన మార్పులు చేర్పులు ఎలా చేయాలో గ్రహించడం ప్రాజెక్టు వల్ల సాధ్యమవుతుంది.
* విద్యార్థిలో ఆచరణశీలత, ప్రయోగాత్మకత, నిశిత దృష్టి, లోతైన విషయ పరిజ్ఞానం, ప్రశ్నించే తత్వంతో కూడిన విశ్లేషణాత్మక లక్షణాలను పెంపొందిస్తుంది.
* బృందంలో ఎలా మెలగాలి, సమష్టిగా ఉండి అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితాలను ఎలా సాధించాలో తెలుసుకోవడానికి ప్రాజెక్టు అనుభవం అవసరం.
ఒక్కో దశలో ఒక్కో ముగింపు
ప్రాజెక్టు మొదలుపెట్టి ముగించేవరకు కొన్ని దశలుంటాయి. ఒక్కో దశలో ఒక్కొక్క పని ముగించాలి. కింది దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయవచ్చు.
* మొదటగా ప్రాజెక్టు ఏ అంశంపై చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. అనుకూలమైన ఏదో ఒక పద్ధతిలో దాన్ని ఎంచుకోవాలి.
* ప్రాజెక్టు ముగించడానికి ఎంత సమయం అవసరమవుతుందో అంచనా వేయాలి. సాధారణంగా బీటెక్‌ స్థాయిలో ప్రాజెక్టు చేయడానికి రెండు నుంచి మూడు నెలల కాల వ్యవధి కావాలి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకునే ప్రాజెక్టు ఎంచుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకున్నా బీటెక్‌ పరంగా ఎంతమేరకు పూర్తి చేస్తే సరిపోతుందనే విషయం పట్ల స్పష్టత ఉండాలి.
* దీని తర్వాత ప్రాజెక్టు చేయడానికి ఎంతమంది సభ్యులు ఉండాలో నిర్ణయించాలి. దీని కోసం ప్రాజెక్టుకి సంబంధించిన పనిని చిన్నచిన్న స్వతంత్ర భాగాలుగా విభజించి (ఈ కసరత్తును డి-కంపోజిషన్‌ అంటారు) ఏ సభ్యుడు ఏ భాగానికి బాధ్యత వహించాలో డిసైడ్‌ చేయాలి. ఒక్కరే చేసిన ప్రాజెక్టుల కంటే బృందంగా చేసిన ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ బృందంలోని సభ్యులందరికీ ప్రాజెక్టు పట్ల సమగ్ర అవగాహన ఉండాలి.
* ఆ తర్వాత ప్రాజెక్టు చేయడానికి సాంకేతికపరమైన మెలకువలు, నైపుణ్యాలు, అవసరమైన ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలు, కావాల్సిన హార్డ్‌వేర్‌, ఇతర ఉపకరణాలను గుర్తించాలి. ఖర్చు, సమయం అంచనా వేసుకోవాలి. పటిష్టమైన ప్రణాళికతో ఏ సమయానికి ఎంతమేరకు ప్రాజెక్టు పని పూర్తి కావాలి, ఎవరి బాధ్యత ఎంత అనేవి నిర్ణయించుకోవాలి. ఏవైనా కొత్త నైపుణ్యాలు అవసరమవుతాయని గుర్తిస్తే వాటికి కావాల్సిన సమయాన్ని కేటాయించాలి. దాన్నీ ప్రాజెక్టులో అంతర్భాగంగానే పరిగణించాలి.
* ఇక అసలు పని మొదలుపెట్టి వేసుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తిచేయాలి.
* అంచెలంచెలుగా పని పూర్తిచేస్తున్నప్పుడే ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకోవాలి. నివేదిక తయారీ శ్రమతో, ఎక్కువ సమయంతో కూడుకున్న పని. చివర్లో చేస్తే అయిపోతుందిలే అనుకోవడం పొరపాటు. దీనివల్ల కొంత సమాచారాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు డైరీ రాసుకోవడం ఒక మంచి అలవాటు. నీ ప్రాజెక్టుకి సంబంధించిన ముఖ్య అంశాలు, ఫలితాలు, ప్రణాళికల పవర్‌పాయింట్‌ తయారుచేసుకుని సిద్ధంగా ఉండాలి.
* బృందంలో సభ్యులు అందరూ ప్రజెంటేషన్‌కి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ఒకటికి రెండుసార్లు రిహార్సల్‌ చేసుకోవడం మంచిది.
ఎలా ఎంచుకోవాలి?
తగిన ప్రాజెక్టును ఎలా గుర్తించాలి, ఎంచుకోవాలి అనేది మొట్టమొదటి సమస్య. ఏ ప్రాజెక్టు చేస్తే ఉద్యోగం త్వరగా వస్తుంది? పూర్తి చేయడానికి ఎంత సమయం కావాలి? నిర్ణీత సమయంలో పూర్తి చేయడం ఎలా? ఒకవేళ పూర్తి కాకపోతే పర్యవసానం ఏమిటి? అనే ప్రశ్నలు వస్తాయి.
ప్రాజెక్టును ఎంచుకోవడంలో కింది మార్గాల్లో ఏదైనా ఒక దాన్ని అనుసరించవచ్చు.
ఇష్టమైన పాఠ్యాంశం: చదివినవాటిలో బాగా ఉత్సాహం కలిగించిన పాఠ్యాంశాలను గుర్తించాలి. వీటిలో అన్నిటికన్నా బాగా నచ్చిన వాటిలో వస్తున్న కొత్త అభివృద్ధిని గుర్తించి సంబంధిత ప్రాజెక్టును ఎంచుకోవచ్చు.
పరిశ్రమల్లో ప్రాజెక్టు: పరిశ్రమలకు వెళ్లి అక్కడున్న సమస్యలను కనుక్కొని వాటిని ప్రాజెక్టుగా చేయవచ్చు. ఈ పద్ధతి మంచిది, అభిలషణీయం.
ఇంటర్న్‌షిప్‌: ఇంటర్న్‌శాల అనే సంస్థ ఏఐసీటీఈతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా విద్యార్థులందరికీ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తోంది. విద్యార్థులు ఈ సంస్థ వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలి. దీంతోపాటు వివిధ కంపెనీల్లో ఉన్న ఇంటర్న్‌షిప్‌ అవకాశాల జాబితాను విద్యార్థులతో ఈ సంస్థ పంచుకుంటుంది. లేదా తన సైట్లో ప్రచురిస్తుంది. ఈ పద్ధతిలో సంస్థలు/ పరిశ్రమలు తమ వద్దఉన్న అవకాశాల వివరాలను ఇంటర్న్‌శాలకు తెలియజేస్తాయి. కాలేజీలో ప్రాంగణ/ ప్రాంగణేతర నియామకాలు జరిగి అందులో ఉద్యోగం తెచ్చుకుంటే, ఆ సంస్థల్లోనూ ఇంటర్న్‌షిప్‌ అవకాశం ఉంటుంది.
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు: సుప్రసిద్ధ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎంలలో, ఇంకా టాటా ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌, ఐఐసీటీ, సీసీఎంబీ, భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ లాంటి పరిశోధన సంస్థల్లో ప్రాజెక్టు చేసుకునే అవకాశం ఉంటుంది. వీటికి ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రొఫెసర్ల మార్గదర్శనం: కాలేజీలో పరిశోధన వైపు మొగ్గు ఉన్న ఆచార్యులు తమ పరిశోధనా రంగంలో కొన్ని నిర్దిష్టమైన ప్రాజెక్టులు చేయిస్తారు. ఇది వారికీ, విద్యార్థికీ ఉపయోగమైన మార్గం. ప్రొఫెసర్ల రంగంలో విద్యార్థికీ అభిరుచి ఉంటే ఈ పద్ధతి సులువవుతుంది.
ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లలో వెతకడం: మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, గూగుల్‌, అడోబ్‌ వంటి ప్రముఖ సంస్థలు తమ వెబ్‌సైట్ల ద్వారా కొన్ని సమస్యలను సవాళ్లుగా అందరికీ అందుబాటులో పెడతాయి. ఈ సమస్యలు నిజ జీవితానికి సంబంధించిన సమస్యలకు దగ్గరగా ఉంటాయి. వీటిని ప్రాజెక్టుగా తీసుకోవచ్చు. ఒకవేళ నాణ్యమైన పరిష్కారాన్ని ప్రదర్శిస్తే ఈ సంస్థల్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది.
హ్యాకథాన్లు: వివిధ సంస్థలు వివిధ స్థాయుల్లో హ్యాకథాన్ల పేరిట ప్రతిభా పోటీలు నిర్వహిస్తుంటాయి. పర్యావరణం, వ్యవసాయం ఇంకా ఎన్నో రంగాల సమస్యలను పోటీల్లో ప్రకటిస్తాయి. వాటిలో ఒక అంశంపై ప్రాజెక్టు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
అంతర్జాలంలో అన్వేషణ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈఈఈ), స్ప్రింగర్‌, ఎల్సెవియర్‌ లాంటి అంతర్జాతీయ సేవాసంస్థలు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ), కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా లాంటి జాతీయ సేవాసంస్థలు ఇంజినీరింగ్‌, టెక్నాలజీ రంగంలో జరుగుతున్న అభివృద్ధి, పరిశోధనలపై వ్యాసాలు, ప్రచురణలు నిర్వహిస్తాయి. నూతన టెక్నాలజీల మెలకువలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఇంకా విద్యార్థి స్థాయిలో చేయగలిగిన ప్రాజెక్టుల జాబితాను అందరికీ అందుబాటులో ఉంచుతాయి. ఈ ప్రాజెక్టులు సాధారణంగా కొంత పై స్థాయిలోనూ, ప్రామాణికంగానూ ఉంటాయి.
ప్రభుత్వ సంస్థలు: డిఫెన్స్‌ సంస్థలు, సీపీఆర్‌ఐ, సీఎంటీఈఎస్‌, ఎన్‌ఎస్‌ఐసీ, సీఎంసీ, ఈసీఐఎల,్ బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌ఐసీ వంటి రక్షణ, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ప్రాజెక్టు చేసే అవకాశం ఉంది. చాలావరకు ఇవి రుసుంతో కూడుకొని ఉంటాయి.
ఇవే కాకుండా కొన్ని ప్రైవేటు సంస్థలు శిక్షణతో కూడిన ప్రాజెక్టులకు అవకాశం ఇస్తాయి. వీటిని ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ప్రాజెక్టు చేసినా, విద్యార్థి తానుగా చేస్తేనే సార్థకత ఉంటుంది.
చేస్తే.. అర్థమైనట్లే!

విన్నది మర్చిపోతాం. నేర్చుకున్నది గుర్తుపెట్టుకుంటాం. చేసింది అర్థం చేసుకుంటాం.
- ప్రఖ్యాత ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌
ఈ మాటలు ఇంజినీరింగ్‌ విద్యకు చక్కగా సరిపోతాయి. అర్థం చేసుకున్న విషయాలను అనువర్తించి సమాజ సేవకు ఉపయోగించడలోనే ఈ డిగ్రీకి సార్థకత లభిస్తుంది. అది ప్రాజెక్ట్‌ వర్క్‌ వల్ల సాధ్యమవుతుంది.
ప్రాజెక్టు అంటే..?

బీటెక్‌లో చదివిన అనేక సబ్జెక్టుల్లో ఒక అంశాన్ని ఎంచుకుని అందులోని మౌలిక సూత్రాలతో సమాజానికి పనికొచ్చే నమూనా రూపొందించే ప్రయత్నం చేయడమే ప్రాజెక్టు. నైపుణ్యాలకు పదును పెట్టుకుని విద్యార్థి తన భవితకు పునాది వేసుకునే సాధనం.
నాణ్య‌మైన ప్రాజెక్టుల‌కు కొన్ని వెబ్‌సైట్‌లు
www.ieee.org
https://getengineerhelp.wordpress.com/projects-help/
https://www.facebook.com/thehelpingengineer/
https://www.linkedin.com/ company/the-helping-engineer/
https://studentstrapz.blogspot.com/2018/08/face-detection-project-source-code-final-year-project-download-link.html
https:// codezips.com
https://icpc.baylor.edu
https://summerofcode.withgoogle.com
http://microsofthackers.github.io/ challenge/
https://www.ibm.com/in-en/university/academia-programs/events/ibm-hack-challenge/?parent=events


Posted on 04-02-2020

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning