![]() |
సాఫ్ట్‌గా నేర్పుతున్నారు
* అదనపు నైపుణ్యాల బాటలో ఇంజినీరింగ్ కళాశాలలు
* బ్రాంచేదైనా శిక్షణ తప్పనిసరి
* నిపుణులతో ప్రత్యేక బోధన ఏర్పాట్లు
* కళాశాల దశలోనే విద్యార్థులకు లబ్ధి
సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలన్నది సగటు ఇంజినీరింగ్ విద్యార్థి కల. ఆ కలను సాకారం చేసుకోవాలంటే కేవలం ఇంజినీరింగ్ పాఠ్యాంశాల్లో ప్రతిభ కనబరిస్తే సరిపోదు. సాఫ్ట్వేర్ సంస్థల అవసరాలకు తగ్గట్లుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఆ నైపుణ్యాలు సాధించేందుకు ఇప్పటి వరకూ విద్యార్థులు బయటి సంస్థలపై ఆధారపడేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి మారింది. ప్రస్తుతం ఆ బాధ్యతలను కళాశాలలే తీసుకుంటున్నాయి. అన్ని బ్రాంచిల విద్యార్థులకూ కార్పొరేట్ నిపుణులతో సాఫ్ట్, టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తున్నాయి. కార్పొరేట్ అవసరాలకు తగ్గట్లుగా మొదటి సంవత్సరం నుంచే అదనపు నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాయి.
మార్పు అనివార్యం
విద్యార్థులు, సంస్థల డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పుడు కళాశాలలు సాఫ్ట్వేర్ నైపుణ్యాలను అందించేందుకు సిద్ధపడుతున్నాయి. ''విద్యార్థులను ఆకర్షించేందుకు వారికి అదనంగా ఏదైనా ఇవ్వాల్సిన అవసరం కళాశాలలకు ఏర్పడింది. బహుళ జాతి సంస్థలూ అదే కోరుకుంటున్నాయి. సంస్థలు ఇలా నాణ్యత ప్రమాణాల విషయంలో చొరవ చూపడమన్నది విద్యార్థులకు మంచిదే. లేదంటే కళాశాలలు కేవలం డిగ్రీలిచ్చి పంపించే వ్యవస్థల్లా మారుతున్నాయి. కంప్యూటర్ సైన్సు(సీఎస్సీ) విద్యార్థులతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్(ఈఈ), సివిల్స్.. ఇలా అన్ని బ్రాంచిల విద్యార్థులకూ అదనపు నైపుణ్యాలు నేర్పిస్తున్నాం. ఎందుకంటే సీఎస్సీ మినహా మిగిలిన బ్రాంచిల విద్యార్థులకు వారి రంగాల్లో ఉద్యోగావకాశాలు తక్కువ. అందరి చూపూ సాఫ్ట్వేర్ వైపే. అందుకే ఈ అదనపు శిక్షణ'' అని వివరించారు కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(కేఎంఐటీ) డైరెక్టర్ నీల్ గొగటే.
కార్పొరేట్ ఒత్తిడి
కేవలం మూల పాఠ్యాంశాల బోధనొక్కటే కాదు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే శిక్షణ ఇప్పించాల్సిందిగా కార్పొరేట్ సంస్థలు కోరుతున్నాయి. దీంతో కళాశాలలు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ''విద్యార్థులకు 80-90 శాతం మార్కులొస్తున్నాయి. కానీ, చిన్న ప్రోగ్రాం రాయమంటే రాయలేకపోతున్నారు. కళాశాలల్లో ఇప్పటి వరకూ ఈ అదనపు నైపుణ్యాలపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. కళాశాలలోనే విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాలపై శిక్షణ లభిస్తే బయటికెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. నియామక ప్రక్రియను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు'' అని చెబుతున్నారు మహేంద్ర సత్యం మానవ వనరుల విభాగం ప్రతినిధి సత్య.
నిపుణులతో శిక్షణ
సంస్థలు కోరినా, పోటీ కోసం కళాశాలలు సిద్ధపడినా, అంతిమంగా లబ్ధి పొందేది మాత్రం విద్యార్థులే. నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యాభ్యాస కాలంలోనే అన్నీ నేర్చుకునే అవకాశం లభిస్తోంది. అదనపు నైపుణ్యాలను అందించడానికి ప్రస్తుతం కళాశాలలు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాయి. ల్యాబ్‌లు, ఇతర సాంకేతిక సౌకర్యాలూ కల్పిస్తున్నాయి. ''నాలుగేళ్లు మేం ఎక్కువ సమయం గడిపేది కళాశాలలోనే. ఇక్కడే మేం సాఫ్ట్, టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉండడంతో సమయం చాలా కలిసొస్తుంది. ఈ శిక్షణ కోసం ప్రత్యేకంగా అధ్యాపకులను నియమించారు. ల్యాబ్‌ల్లో మా ఇష్టమొచ్చినంత సమయం గడపొచ్చు. అదే బయట సంస్థల్లో నేర్చుకోవాల్సి వస్తే ఈ ప్రయోజనాలేవీ ఉండవు. ముఖ్యంగా భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొందించుకోవడానికి అవకాశాలెక్కువ. నా బ్రాంచి ఐటీ అయినా.. నాకు పాఠ్యాంశాల్లో లేని అనేక నైపుణ్యాలు ముందుగానే నేర్చుకునే అవకాశం దక్కింది. మాకిది మంచి పరిణామమే'' అని చెబుతున్నారు కేఎంఐటీ నాలుగో సంవత్సరం ఐటీ విద్యార్థిని శ్రుతి.
దశల వారీగా..
ప్రధానంగా విద్యార్థికి అవసరమైనవి రెండు నైపుణ్యాలు. ఒకటి సాఫ్ట్‌స్కిల్స్, రెండోది టెక్నికల్ స్కిల్స్. ఎక్కువమంది మొదటి నైపుణ్యాల దగ్గరే బోల్తా పడుతుంటారు. ''సాఫ్ట్‌స్కిల్స్ పరీక్షలో ప్రధానంగా ఆంగ్లంలో మాట్లాడడం, భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెంపొందించుకోవడం, ఆప్టిట్యూడ్ పరీక్షకు సిద్ధం కావడం, సమస్యను తర్కంతో విశ్లేషించడం, సమస్యను పరిష్కరించడం.. ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ దశ దాటితే సంస్థలో ఏ ఉద్యోగానికి అర్హులవుతారో.. దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుంది. ఉదాహరణకు సీ లాంగ్వేజ్, జావా, డాట్ నెట్.. ఇలాంటివి. ఈ రెండు రకాల నైపుణ్యాలూ విద్యార్థికి అవసరమైనవే. వాటిని దశల వారీగా ఏడాదికి కొన్ని చొప్పున నేర్పిస్తున్నాం'' అని విశాఖపట్నంలోని అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్(ఏఎన్ఐటీఎస్) కళాశాల ప్రాంగణ నియామకాధికారి మూర్తి చెప్పారు.