తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సమాజ నిర్మాణంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి సాధించడానికి మనిషికి ముందుగా కావాల్సింది సంపూర్ణ ఆరోగ్యం. అందుకు తోడ్పడేదే వైద్యరంగం. మెడిసిన్ వృత్తి మహోన్నత సేవాభావంతో కూడుకుంది. ఈ రంగంలోకి రావడానికి ఆసక్తితోపాటు అంకితభావం కూడా ఉండాలి. వైద్యవిద్యకు మనదేశంలో పరిమిత అవకాశాలుండటం వల్ల దీని కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటివాళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం..
* విదేశాల్లో వైద్యవిద్య చడవడానికి వెళుతున్న విద్యార్థులు ఆ దేశ పరిస్థితులు, బోధన, సామాజికాంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కన్సల్టెన్సీలు చెప్పిన వివరాలతోపాటు పూర్వ విద్యార్థులను నేరుగా సంప్రదించడం ఉత్తమం.
* ఫీజు, ఇతర అవసరాలకు సంబంధించి ఏడాదికి ఎంత ఖర్చవుతుందనేది తల్లిదండ్రుల బడ్జెట్ పరిధి ప్రకారం బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. విద్యారుణం ఆధారంగా చదవాలనుకునే విద్యార్థి తల్లిదండ్రులు ముందుగానే బ్యాంకును సంప్రదించి అతడు విదేశాలకు వెళ్లే సమయానికి డబ్బు అందేవిధంగా హామీ తీసుకోవాలి.
* తెలుగు మీడియం విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న విద్యాసంస్థలో ఆంగ్ల విద్యా బోధన అర్థమయ్యే రీతిలో ఉంటుందో, లేదో పూర్వ విద్యార్థుల ద్వారా తెలుసుకోవాలి.
* విదేశాలకు వెళ్లే ముందు ప్రయాణ, జీవిత బీమా తీసుకోవాలి. అనారోగ్యానికి గురైనా, ప్రయాణాల్లో లగేజీ పోయినా బీమా ఉపయోగపడుతుంది.
* శీతల దేశాల్లో ధరించాల్సిన ప్రత్యేక దుస్తుల గురించి తెలుసుకొని వాటిని ముందుగానే సమకూర్చుకోవాలి.
* సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలైన జలుబు, తలనొప్పి, జ్వరం లాంటి వాటికి డాక్టరును సంప్రదించి తగిన మందులు తీసుకోవాలి. ఎంపిక చేసుకున్న ప్రాంత వాతావరణ పరిస్థితులను తెలుసుకొని, వైద్యుడి సలహాల ప్రకారం అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఆహారం విషయంలోనూ రాజీ పడేందుకు మానసికంగా సంసిద్ధమవాలి.
* విద్యార్థులు తాము విదేశంలో ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయా దేశాల చట్టాలు, కాలేజీల నిబంధనలను తప్పకుండా పాటించాలి. పరిమితులకు లోబడి ఉన్నంతవరకూ ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు.
* పాశ్చాత్య జీవనశైలికి అలవాటుపడిపోయి చదువును నిర్లక్ష్యం చేస్తే, డబ్బుతోపాటు విలువైన సమయం కూడా వృథా అవుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

<--back