ప్రధాన కోర్సులు - ఫీజుల వివరాలు
మెడికల్ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా ప్రధానంగా జనరల్ మెడిసిన్ (ఫిజీషియన్) కోసం విదేశాలకు ఎక్కువగా వెళుతున్నారు. అన్ని దేశాల్లోనూ ఈ కోర్సు వ్యవధి సుమారు ఆరేళ్లుగా ఉంది. ఇది మన దేశంలోని ఎంబీబీఎస్‌తో సమానం. పీడియాట్రిక్స్ (ఫిజీషియన్), డెంటల్ (స్టమటోలజీ) కోర్సుల్లో చేరుతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వీటితోపాటు నర్సింగ్, ఫార్మసీ, ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్స్ లాంటి నాలుగేళ్ల కోర్సులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా వివిధ దేశాల్లో సుమారు 32 విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే పీజీ మెడికల్ కోర్సుల కోసం వెళుతున్నవారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది.

ఫీజుల వివరాలు
అన్ని దేశాల్లోనూ కోర్సు సెమిస్టర్లవారీగా ఉంటుంది. విద్యా సంవత్సరం సెప్టెంబరులో ప్రారంభమవుతుంది. మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు నవంబరు వరకూ అవకాశముంటుంది. సాధారణంగా సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో మొదటి సెమిస్టర్, ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య కాలంలో రెండో సెమిస్టర్ ఉంటాయి.

కోర్సు ఫీజు సెమిస్టర్లవారీగా చెల్లించవచ్చు. ఆయా దేశాలను బట్టి సెమిస్టరుకు రూ.80 వేల నుంచి రూ.2.25 లక్షల వరకు ఫీజు ఉంది. అదనంగా నెలకు రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకూ హాస్టల్, భోజన ఖర్చులు ఉంటాయి. మొత్తంగా కోర్సు పూర్తి చేయడానికి రూ.14 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఖర్చవుతాయి. మన ఫీజులతో పోలిస్తే (ఎంసెట్ ద్వారా సీటు రానివారికి) ఇది చాలా తక్కువ.

ఎందుకూ... ఇంత వ్యత్యాసం?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 250 అంతకంటే తక్కువ మంది పౌరులకు ఒక డాక్టరు ఉండాలి. మన దేశంలో వైద్యులు, ప్రజల నిష్పత్తి 1 : 1700గా ఉంది. ఉక్రెయిన్, రష్యా లాంటి దేశాల్లో ఈ నిష్పత్తి ఇంచుమించుగా 1 : 250 గా ఉంది. ఈ దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడమే దీనికి కారణం. అక్కడి ఆసుపత్రులను ప్రభుత్వాలే నిర్వహిస్తాయి. అందువల్ల ఆయా దేశాల్లో విద్యా సంస్థలు అందులోనూ వైద్య విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మన రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లలా అక్కడి మెడికల్ కాలేజీల్లో ఏటా అనేక సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ సీట్లను విదేశీ విద్యార్థులకు తక్కువ ఫీజులకే కేటాయిస్తున్నారు.

<--back