ఎంసీఐ - స్క్రీనింగ్ టెస్ట్
భారత వైద్య మండలి (ఎం.సి.ఐ.) విదేశాల్లో వైద్య విద్యనభ్యసించే వారికి సంబంధించి 2002 మార్చిలో 'ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్‌ను ప్రవేశ పెట్టింది. 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్' (ఎన్‌బీఈ) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. దీంట్లో అర్హత సాధిస్తేనే, ఎంసీఐ సంబంధిత డిగ్రీని గుర్తించి, అభ్యర్థికి రిజిస్ట్రేషన్ నెంబరు ఇస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబరుతో మన దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో లేదా సొంత క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు అందించవచ్చు. అయితే ఈ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ (హౌజ్ సర్జన్) చేయాలి. విదేశీ వైద్య విద్య అనగానే చాలా మంది ఈ పరీక్ష గురించే భయపడతారు. దీన్ని ప్రవేశ పెట్టిన తొలి దశలో వివిధ దేశాల్లోని స్థానిక భాషల్లో వైద్య విద్యనభ్యసించినవారు ఎక్కువగా ఉత్తీర్ణత సాధించలేకపోవడమే దీనికి కారణం.

కొంత మంది మన సిలబస్‌తో పోలిస్తే, వేరుగా ఉండటమేనని అపోహ పడతారు. ఇంటర్ తర్వాత ఎంసెట్, ఏఐఈఈఈ లాంటి పరీక్షల్లానే... చదివింది వైద్య విద్యే అయినా, దీనికి సంబంధించి ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో శిక్షణా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు శిక్షణా నిమిత్తం రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజు తీసుకుంటున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించి కొన్ని కన్సల్టెన్సీలు ఆయా దేశాల్లోని విద్యా సంస్థల్లోనూ శిక్షణనిచ్చే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ పరీక్ష సంవత్సరంలో రెండు సార్లు నిర్వహిస్తారు. సాధారణంగా ఇది మార్చి, సెప్టెంబరు చివరి ఆదివారం ఉంటుంది. దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి. ఉదయం నాన్ క్లినికల్ విభాగంలో, మధ్యాహ్నం క్లినికల్ విభాగంలో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ఎన్‌బీఈ నిర్వహించే పీజీ మెడికల్ టెస్టు తరహా సిలబస్ ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉండవు. రెండింటిలో కలిపి 50 శాతం (150) మార్కులు తెచ్చుకుంటే అర్హత సాధించినట్లు. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువయ్యే కొద్దీ దీని క్లిష్టత పెంచుతున్నారు. అందువల్ల ఉత్తీర్ణతా శాతం 10 నుంచి 40 మధ్య ఉంటోంది. భారతీయ వైద్య ప్రమాణాలను అందుకోవడానికి ఆ మాత్రం క్లిష్టత అవసరమేనని, ఈ పరీక్ష నిర్వహించడం విద్యార్థులకే మేలు చేస్తుందని అనేక మంది చెబుతున్నారు. విద్యార్థి చదివిన సంస్థలో ఇంగ్లిష్ విద్యా బోధన సరిగా ఉండి, కోర్సు చేస్తూనే దీనికి ప్రత్యేకంగా సన్నద్ధమైతే శిక్షణా సంస్థల అవసరం కూడా ఉండదని మొదటిసారే ఉత్తీర్ణులైన చాలామంది విద్యార్థుల అభిప్రాయం.

<--back