మొదటి అడుగు...
నిపుణుల అభిప్రాయం ప్రకారం విదేశాల్లో మెడికల్ విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నవారు ముందుగా సీనియర్ విద్యార్థుల సలహాలు తీసుకోవాలి. విదేశీ విద్య పేరుతో ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని, మోసాలకు పాల్పడేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కన్సల్టెన్సీలను సంప్రదించినప్పుడు కూడా విధిగా ఆ సంస్థ నుంచి విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసినవారి వివరాలు తీసుకొని, వారి ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
* ఎంపిక చేసుకున్న విద్యాసంస్థకు సంబంధిత దేశ ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.

* సంబంధిత విద్యా సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.)లో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
* ఆ విద్యా సంస్థ అందించే వైద్య డిగ్రీని ఐ.ఎం.సి. చట్టం-1956 ప్రకారం భారత వైద్య మండలి గుర్తిస్తుందా? లేదా? తెలుసుకోవాలి. (డబ్ల్యూహెచ్ఓలో పేరు నమోదుచేసుకున్న కొన్ని విద్యా సంస్థలు అందించే డిగ్రీలను కూడా ఎంసీఐ గుర్తించడం లేదు). ఎంసీఐ, సంబంధిత విద్యా సంస్థ వెబ్‌సైట్లను పరిశీలించడం ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు.
భారత వైద్య మండలి వెబ్‌సైట్: www.mciindia.org

* ఇంగ్లిష్ మీడియంలో ఎన్నేళ్ల నుంచి కోర్సులు అందిస్తున్నారు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారా? లేదా? తెలుసుకోవాలి. సీనియర్లను సంప్రదించడం, ఆయా విద్యాసంస్థల వెబ్‌సైట్లను పరిశీలించడం ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
* భారత్‌తో ఆ దేశానికి ఉన్న సంబంధాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
* సంబంధిత విద్యా సంస్థలో భారత్ నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో తెలుసుకోవాలి.
* అక్కడి వాతావరణ పరిస్థితులు, భద్రతా స్థితిగతులు తదితర అంశాల గురించి తెలుసుకోవాలి.
* విద్య, ఆరోగ్యం, శాస్త్ర-సాంకేతిక రంగాలకు సంబంధించి ఆ దేశ ప్రగతిని తెలుసుకోవడం ద్వారా అక్కడ విద్యనభ్యసించడంపై ఒక అవగాహనకు రావచ్చు. మంచి కన్సల్టెన్సీని ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమే. ఎందుకంటే విదేశీ విద్య పేరుతో కొన్ని ఏజెన్సీలు, కొంత మంది సీనియర్ విద్యార్థులు మోసాలకు పాల్పడుతున్నారు. చాలా విదేశీ విద్యా సంస్థలకు సంబంధించి మన రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. సాధారణంగా మాతృభూమికి దూరంగా ఉన్నప్పుడు ఈ సంస్థలు పోషించే పాత్ర కీలకమైంది. తల్లిదండ్రులకు, విద్యార్థులకు సంధానకర్తలుగా ఇవే పని చేస్తాయి.

ఒక దేశంలోని యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించడం, పాస్‌పోర్టు, వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించడం, విద్యార్థి సంబంధిత ప్రాంతంలోని యూనివర్సిటీకి చేరడంలో తోడ్పడటం, కోర్సు పూర్తయ్యేంత వరకు వివిధ సమస్యలకు పరిష్కారాలను సూచించడం, విద్యార్థి క్షేమ సమాచారాన్ని, చదువుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడూ అతడి తల్లిదండ్రులకు అందించడం లాంటివి ఈ కన్సల్టెన్సీల విధులు. సంపాదనకు ప్రాధాన్యమిచ్చే సంస్థలు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోవు. సీనియర్ విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వాహకులకు ఉండే సంబంధాలను పరిశీలించి, కన్సల్టెన్సీల మంచీచెడులను అంచనా వేసుకోవచ్చు.

<--back