పాస్‌పోర్టు, వీసా పొందడం ఎలా?
జనన ధ్రువీకరణ పత్రం (గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలు ఇస్తాయి), ఓటరు గుర్తింపు కార్డు, అభ్యర్థి చిరునామాకు సంబంధించిన పత్రాలతో సరైన వివరాలను సమర్పించి పాసుపోర్టును తేలిగ్గానే పొందవచ్చు. విద్యార్థి ఎంచుకున్న కన్సల్టెన్సీలు కూడా పాసుపోర్టు, వీసా పొందడానికి అవసరమైన తోడ్పాటును అందిస్తాయి. మన రాష్ట్రంలో సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయానికి అనుబంధంగా మరిన్ని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటిలో విశాఖపట్నం, విజయవాడ, నిజామాబాద్, తిరుపతి లాంటి నగరాలున్నాయి. హైదరాబాద్‌లోనూ అమీర్‌పేట, బేగంపేట, టోలీచౌకీలో పాసుపోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలను పాస్‌పోర్టు కార్యాలయం వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.ap.nic.in/passport/
విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందడానికి అనుసరించే ప్రక్రియలో వీసా సాధించడం ఓ కీలక ప్రక్రియ. వీసా గురించి కూడా అభ్యర్థులు అనవసరంగా ఆందోళన చెందుతారు.
వేరే దేశంలో తాత్కాలికంగా నివాసం ఉండి, చదువుకోవడానికి చట్టబద్ధత కల్పించేదే వీసా. దీని కోసం సంబంధిత పత్రాలను సక్రమంగా, నిజాయితీగా పూర్తిచేసి, పంపించాలి. యూఎస్, యూకే లాంటి కొన్ని దేశాలు వీసా కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. కానీ, చాలా దేశాలు ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు ఇస్తున్నాయి. గతంలో ఢిల్లీ కేంద్రంగా ఈ ప్రక్రియ కొనసాగేది. చెన్నై, హైదరాబాద్, బెంగళూర్ లాంటి నగరాల్లోనూ ఆయా దేశాల ఎంబసీలను ఏర్పాటు చేయడంతో ఇటీవల ఈ ప్రక్రియ మరింత సులభతరమైంది.

వీసా ప్రక్రియకు సంబంధించిన ముఖ్యాంశాలు
* అభ్యర్థులు విద్యార్హతలు, నివాస, ఆస్తి వివరాలు, విదేశీ విద్యాసంస్థలో ప్రవేశానికి సంబంధించిన అనుమతిపత్రం లాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
* నిర్దిష్టంగా ఏయే పత్రాలు అడిగారో వాటినే అందజేయాలి. లెక్కలేనన్ని పత్రాలను జోడించి చిక్కుల్లో పడవద్దు. ఉదాహరణకు కొన్ని దేశాలు (యూకే, యూఎస్, ఆస్ట్రేలియా) ఆస్తి డాక్యుమెంట్లు, ఆదాయానికి సంబంధించిన రిటర్నుల గురించి అడగటం లేదు.
* అభ్యర్థి ఏ ఆటంకం లేకుండా కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన ఆదాయం (బ్యాంక్‌లోన్/ ఫిక్స్‌డ్ డిపాజిట్లు/ బ్యాంకు నిల్వ) సరిపోను ఉందా? లేదా అనేది పరిశీలిస్తారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలి.
* కోర్సు ఫీజు, జీవన వ్యయం లాంటివాటికి సరిపోయేలా బ్యాంకు ఖాతాలో ఎంతకాలంపాటు, ఎంత మొత్తం నిధుల నిల్వను చూపించాలో కచ్చితంగా తెలుసుకోవాలి. అవసరానికి సరిపోను డబ్బు నిల్వలను చూపించకపోతే ఇబ్బందులు తప్పవు.

* విద్యార్థి, అతడి తల్లిదండ్రుల బ్యాంకుఖాతాలతోపాటు నాయనమ్మ, అమ్మమ్మ, సంరక్షకుల పేర్లపై కూడా బ్యాంకుఖాతాలకు అనుమతినిస్తున్నారు.
* వీసా నిబంధనలు తరచూ మారుతూ ఉంటాయి. అందువల్ల వెబ్‌సైట్ల నుంచి తాజా పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, సక్రమంగా పూర్తి చేసి పంపించాలి. పాత దరఖాస్తులను నింపి, పంపిస్తే అనుమతి లభించదు.
* కొన్ని దేశాలకు వెబ్‌సైట్ ద్వారా ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకొని, నిర్దిష్ట తేదిన దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
* వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా జతచేయాలి. అందువల్ల వీటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కొన్ని దేశాలకు సంబంధించి వాటి హైకమిషన్లు అడిగినప్పుడు ఈ వివరాలను అందజేయాల్సి ఉంటుంది.
* అడిగిన వివరాలన్నింటితో దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత వాటిని సంబంధిత వీఎఫ్ఎస్ (వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్) కేంద్రాల్లో సమర్పించాలి. ఎంబసీవారు ఈ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.
* వీసా ప్రక్రియలో భాగంగా టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి. డాక్యుమెంట్లలో సమర్పించిన వివరాలతో తేడా రాకుండా సమాధానాలు ఇవ్వడంలో జాగ్రత్త వహించాలి. సాధారణంగా సెప్టెంబరు ప్రవేశాల కోసం జులై, ఆగస్టులో; జనవరి ప్రవేశాల కోసం నవంబరు, డిసెంబరులో వీసా ప్రయత్నాలు ముమ్మరంగా ఉంటాయి. విదేశీ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తే 4 నుంచి 6 వారాల్లో వీసా పొందవచ్చు. దరఖాస్తుల తాకిడి ఎక్కువగా లేకపోతే వారంలోనే వస్తుంది. దరఖాస్తుల సంఖ్య పెరిగేకొద్దీ వీసా మంజూరీకి వ్యవధి కూడా పెరుగుతుంది. అందువల్ల వీలైనంత ముందుగానే దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం.

<--back