విద్యార్థుల అభిప్రాయాలు
కష్టపడే తత్వం.. ఏకాగ్రత.. స్థిరత్వం అవసరం!

ఎంసెట్‌లో నాకు వచ్చిన ర్యాంకుకు డెంటల్, అగ్రికల్చర్, హార్టీకల్చర్ లాంటి కోర్సుల్లో సీటు వచ్చేది. ఎలాగైనా ఎంబీబీఎస్ చేయాలనేది నా కోరిక. ఓ పత్రికా ప్రకటన చూసి రష్యాలో వైద్య విద్య గురించి తెలుసుకున్నాను. 2004 నవంబరులో రష్యాలోని స్టావ్రోపోల్ స్టేట్ మెడికల్ అకాడమీలో ఎండీ ఫిజీషియన్ కోర్సులో చేరాను. ఇది మన దేశంలోని ఎంబీబీఎస్‌తో సమానం. కోర్సు వ్యవధి ఆరున్నరేళ్లు. ఏటా లక్షా ఎనభైవేల రూపాయలు ఖర్చయ్యాయి. స్టావ్రోపోల్‌తోపాటు మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, రుస్తోవ్, సరతోవ్, వోల్గాగ్రేడ్ లాంటి రష్యాలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా మన దగ్గరి నుంచి విద్యార్థులు వైద్య విద్య కోసం వెళుతుంటారు. బ్రిటన్‌కు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోని యూనివర్సిటీలకు ఆ దేశం నుంచి కొంత మంది విజిటింగ్ ప్రొఫెసర్లు వస్తుంటారు.

విదేశీ విద్యార్థులకు ప్రత్యేకమైన ఫ్యాకల్టీ ఉంటుంది. భారతీయులతోపాటు సూడాన్, సౌదీ అరేబియా, గ్రీక్, పాకిస్థాన్, శ్రీలంక దేశస్థులు ఎక్కువగా ఉంటారు. క్లాసుకి 8 నుంచి 12 మంది విద్యార్థులనే తీసుకోవడం రష్యా విద్యా విధానం ప్రత్యేకత. అందువల్ల ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. 100 శాతం హాజరు ఉండాలి. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల తరగతికి హాజరుకాకపోతే మరుసటి రోజు ఆ పాఠ్యభాగానికి సంబంధించి వైవా ఉంటుంది. దీంట్లో భాగంగా వివిధ ప్రశ్నలు అడిగి, సందేహాలను నివృత్తి చేస్తారు. యూనివర్సిటీల్లో అధునాతన సాంకేతికత, పరికరాలు అందుబాటులో ఉంటాయి. క్లినికల్ ప్రాక్టికల్స్ సమయంలోనూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాగా సహకరిస్తారు. రష్యన్ భాషలో కొంతమేరకైనా పరిజ్ఞానాన్ని సంపాదిస్తే రోగులతో మాట్లాడగలుగుతాం. ఉత్తీర్ణతను గ్రేడుల్లో నిర్ణయిస్తారు. 4 నుంచి 5 వరకు గ్రేడింగ్ వస్తేనే మంచి ఉత్తీర్ణత సాధించినట్లు. అన్ని సెమిస్టర్లలోనూ ఇంచుమించు 5కు సమానంగా గ్రేడులు సంపాదించడం వల్ల స్టావ్రోపోల్ స్టేట్ మెడికల్ అకాడెమీ నాకు 'రెడ్ డిగ్రీ'ని ప్రదానం చేసింది. ఇది మన విశ్వవిద్యాలయాల్లోని గోల్డ్ మెడల్‌తో సమానం. రష్యాలోని ప్రముఖ విద్యా విషయక మ్యాగజైన్‌లో ఫొటోవేసి కథనాన్ని ప్రచురించే అరుదైన గౌరవాన్ని కూడా పొందాను. నాతోపాటు మరో నలుగురు భారతీయులకు రెడ్ డిగ్రీ వచ్చింది. చదువుతోపాటు క్రీడలు, ఉత్సవాలు, పర్యటక ప్రదేశాల సందర్శన లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విదేశాల్లో ఉంటున్నామన్న దిగులు ఉండదు. మన స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతోపాటు రష్యా విక్టరీ డే ఉత్సవాల్లోనూ ఉత్సాహంగా పాల్గొనేవాళ్లం. మెడికల్ విద్య అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. తొందరగా స్థిరపడాలని కోరుకునేవారు, సుదీర్ఘకాలం చదివే ఓపిక లేనివారు మెడికల్ రంగం వైపు రాకపోవడమే ఉత్తమం. ఈ రంగంలోకి అడుగేయడానికి కష్టపడే గుణం, ఏకాగ్రత, స్థిరత్వం ఉండాలి. అందులోనూ మంచి నడత, దృఢచిత్తం, పరిస్థితులకు అనుగుణంగా మసలుకోవడం, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కోవడం లాంటి లక్షణాలున్నవాళ్లే విదేశాల్లో వైద్యవిద్యనభ్యసించే సాహసం చేయాలి.
- డాక్టర్ సిద్దార్థా రెడ్డి,
హౌజ్ సర్జన్,
గాంధీ ఆసుపత్రి,
హైదరాబాద్.
ఇ-మెయిల్: drsiddureddy@gmail.com

అన్ని జాగ్రత్తలనూ తీసుకోవడం అవసరమే కదా!
అమ్మానాన్న నన్ను డాక్టరు చేయాలని మెడికల్ విద్యవైపు ప్రోత్సహించారు. నాకు ఇక్కడి కాలేజీల్లో సీటు రాలేదు. అందువల్ల చెన్నైలోని ఒక పేరుపొందిన కన్సల్టెన్సీ ద్వారా రష్యాలోని రుస్తోవ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాను. అక్కడ భారతీయ విద్యార్థులు చాలా తక్కువ. ఆ ప్రాంతంలో ఇతర దేశస్థులపై దాడి చేసే స్కిన్డ్ హెడ్స్ కూడా ఎక్కువే. యూనివర్సిటీవారు కచ్చితంగా రష్యన్ మీడియంలోనే చదవాలనే నిబంధన పెట్టడంతో వేరే దారి లేక మధ్యలో స్టావ్రోపోల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి మారాను. ఇక్కడ ఇంగ్లిష్ మీడియం తీసుకున్నాను. అంతే కాకుండా స్టావ్రోపోల్‌లో భారతీయులూ ఎక్కువే. మనకు సరైన అవగాహన లేకపోతే ఏజెంట్లు సీట్లు ఉన్న ఏదో ఒక విద్యా సంస్థకు పంపిస్తారు. మన దేశంలోని పుణ్య క్షేత్రాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికే అనేక విధాలుగా ఆలోచిస్తాం. అలాంటిది సుదీర్ఘకాలంపాటు మాతృభూమికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తలనూ తీసుకోవడం అవసరమే కదా! ఇందుకోసం తప్పనిసరిగా ముందస్తు కసరత్తు చేయాలి. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్ధపడినవారే విదేశాలకు వెళ్లే ఆలోచన చేయాలి. రష్యాలో చలి ఎక్కువ. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రష్యా ఉత్తర ప్రాంతాల్లో -50 0C , దక్షిణ ప్రాంతాల్లో -30 0C వరకు ఉంటాయి.
విదేశాల్లోని మెడికల్ గ్రాడ్యుయేషన్‌కు మన దేశంలో అంతగా గుర్తింపు ఉండదు అనే వదంతుల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఈవిధంగా వైద్య విద్యనభ్యసించిన అనేక మంది పేరుపొందిన ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తుండటమే దీనికి నిదర్శనం. మన దగ్గరితో పోలిస్తే, విదేశీ చదువుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. క్లినికల్ ప్రాక్టికల్స్ విషయంలో రోగులతో ఇంటరాక్ట్ అవడానికి స్థానిక భాషలో పరిజ్ఞానం ఉండాలి. అందువల్ల చదివేది ఇంగ్లిష్ మీడియమే అయినా, కోర్సులో భాగంగా స్థానిక భాషకు సంబంధించిన సబ్జెక్టులు కూడా ఉంటాయి. మొదట నుంచి ప్రత్యేక శ్రద్ధతో ప్రిపేరయితే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధించడం తేలికే.
- డాక్టర్ దివ్య,
చెన్నై (ఇ-మెయిల్ ద్వారా)
ఇ-మెయిల్: shiningstar.drdivya@gmail.com.
మరో ఏడాది వృథా చేయలేకే....
నాకు చిన్ననాటి నుంచే డాక్టరు కావాలని ఆశ. ఇంటర్‌తోపాటు ఎంసెట్‌కు సన్నద్ధమవుతున్నప్పుడే మన రాష్ట్రంలో మెడికల్ సీటు సంపాదించడం కష్టతరమైన విషయమని గ్రహించాను. దీంతో ఎంసెట్ కోసం మరో ఏడాది వృథా చేయడం ఇష్టం లేక విదేశాల్లో వైద్య విద్య గురించి ఆరా తీశాను. ఇండియాలో పేమెంట్ సీటుకు చెల్లించే ఫీజు కంటే తక్కువ మొత్తంతోనే చైనాలో వైద్య విద్య పూర్తి చేయవచ్చని తెలుసుకున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటర్ పూర్తికాగానే హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెన్సీ సాయంతో చైనాలోని సదరన్ మెడికల్ యూనివర్సిటీలో (ఎస్ఎంయూ) చేరాను. 2011 లో మెడికల్ విద్యను పూర్తి చేశాను. భారత్‌లో మాదిరిగానే చైనాలో అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మెడిసిన్ కోర్సును ఎంబీబీఎస్ అంటారు. దీని వ్యవధి నాలుగున్నరేళ్లు. మరో ఏడాది ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేయడం ఆప్షనల్. అంటే చైనాలోనైనా చేయవచ్చు, లేదా కోర్సు పూర్తి చేసుకుని మన దగ్గరైనా చేయవచ్చు. నా అభిప్రాయం ప్రకారం భారత్‌లో చేయడమే ఉత్తమం.
ఎంసీఐ ఈ వెసులుబాటును చైనా వైద్య విద్యకు మాత్రమే కల్పించింది. యూనివర్సిటీలను బట్టి కోర్సు వ్యవధిలో ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ మెడికల్ విద్య కాలపరిమితి ఆరేళ్లుగా ఉంది. చైనాలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మన దగ్గరితో పోలిస్తే, వేసవిలో ఉక్కపోత కాస్త ఎక్కువే. చైనా ప్రజలు ఏ దేశస్థులకైనా మంచి సహకారాన్ని అందిస్తారు. రక్షణ కూడా బాగుంటుంది. సదరన్ యూనివర్సిటీయే కాకుండా బీజింగ్, నాన్‌జింగ్, సూజౌ, జిలిన్ ప్రాంతాల్లోనూ మంచి యూనివర్సిటీలున్నాయి. ఇక్కడ మెడికల్ యూనివర్సిటీలు ఎక్కువగానే ఉన్నా, సుమారు 30 యూనివర్సిటీల వైద్య విద్యనే ఎంసీఐ గుర్తిస్తోంది. అందువల్ల చైనాకు వెళ్లదలిచినవారు ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్లలో ఈ విషయాలను పరిశీలించాలి. ఎంసీఐ స్క్రీనింగ్ టెస్టులో చైనాలో వైద్య విద్యనభ్యసించినవారి ఉత్తీర్ణతా శాతం తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం ఫీజులు కూడా భారీగా పెంచడంతో ఈ దేశానికి వెళ్లడం చాలా తగ్గింది.
- వంశీకృష్ణ, హౌజ్ సర్జన్, గాంధీ హాస్పిటల్.

<--back