Wed 24th December, 2014

|
|
|
|
 
మంచి ర్యాంకుకు ఆన్‌లైన్‌ సాధన!

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ జేఈఈ- మెయిన్‌ పూర్తయింది. ఎంసెట్‌ను మినహాయిస్తే ఇక మిగిలినవి ఎక్కువశాతం ఆన్‌లైన్‌ పరీక్షలే. కానీ ఈ పరీక్షలపై విద్యార్థులకు అభ్యాసం తక్కువగా ఉంటోంది. సరైన అవగాహనతో ప్రణాళిక వేసుకుని సాధన చేస్తే మంచి ర్యాంకు అవకాశాలు మెరుగుపడతాయి!
ఎంపీసీ విద్యార్థులు రాసే మహీ, గీతం, విట్‌, ఎస్‌ఆర్‌ఎం, కేఎల్‌ఈ, విజ్ఞాన్‌- ఇవన్నీ ఆన్‌లైన్‌ పరీక్షలు. వీటికితోడు ప్రతిష్ఠాత్మక బిట్‌శాట్‌ పూర్తిగా ఆన్‌లైన్‌ పరీక్షే. ఈ సారూప్యం వల్ల ఒక పరీక్షకు సరిగా తయారుకాగలిగితే మిగిలిన అన్ని పరీక్షలకూ ఆ తయారీ ఉపయోగపడుతుంది.
ఐఐటీ, ఎన్‌ఐటీ సంస్థలతో సమాన స్థాయి కలిగినదీ, కొన్ని అంశాల్లో మెరుగైనదీ అయిన సంస్థగా బిట్స్‌కు ప్రసిద్ధి. ఎన్‌ఐటీల్లో స్వరాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు ఇతర రిజర్వేషన్‌ విధానాలున్నాయి. కాబట్టి ఒకే తరగతిలో 1000లోపు ర్యాంకు సాధించిన విద్యార్థి, 50,000లోపు ర్యాంకు సాధించిన విద్యార్థి కూడా ఉంటున్నారు. ఈ అసమానత వల్ల బోధన విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. బిట్స్‌లో ప్రవేశ విధానం అఖిలభారత స్థాయిలో ఓపెన్‌ మెరిట్‌ విధానంలోనే ఉంటుంది. తరగతిలోని అందరు విద్యార్థులూ 300 మార్కులపైన సాధించినవారే అవుతున్నారు. వారి పురోగతి కూడా వూహించిన దానికంటే ఎక్కువగానే ఉంటోంది.
పరిశ్రమలోని మార్పులతో అనుసంధానమయ్యే సిలబస్‌ బిట్స్‌ ప్రత్యేకత. బిట్స్‌ పిలానీలో 15 విద్యా విభాగాలున్నాయి. ఇవన్నీ ప్రాక్టీస్‌ స్కూళ్లను కలిగి ఉండి దేశంలోని వివిధ పరిశ్రమ సంస్థలతో అనుసంధానమై ఉన్నాయి. దీనివల్ల నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకునేలోపే సిద్ధాంతపరంగా చదివినదానికీ, ప్రయోగాత్మకంగా పరిశ్రమల్లోని విధానానికీ తేడా గ్రహించి రాణించే అవకాశాలుంటున్నాయి.