బీటెక్, ఆపై ఎంబీఏ చేశాను. ప్రస్తుతం ఐటీ విభాగంలో పనిచేస్తున్నాను. కెరియర్‌ మార్చుకోవాలనుంది. బీఈడీ చేయడానికి నేను అర్హుడినేనా? - ఎన్‌. సాయి

ఏదైనా డిగ్రీలో 50 శాతం, ఇంజినీరింగ్‌ డిగ్రీలో 55 శాతంతో పట్టభద్రులయిన వారందరూ (ఎంబీబీఎస్, బీఎస్‌సీ అగ్రికల్చర్, బీవీఎస్‌సీ, బీఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు మినహాయించి) బీఈడీ కోర్సు చదవడానికి అర్హులవుతారు. మీరు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఎం.బి.ఎ. పూర్తి చేశారన్నారు కాబట్టి, ప్రాచుర్యంలో ఉన్న ఎడ్యుకేషన్‌ టెక్నాలజీని బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో స్పెషలైజేషన్‌గా ఎంచుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకున్న బీటెక్, ఎంబీఏ విద్యార్హతలతో ఈమధ్య కాలంలో డిమాండ్‌ ఉన్న డాటా అనలిటిక్స్, డాటా మైనింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌కు సంబంధించిన కోర్సులు చేసి కూడా మీ కెరియర్‌ని వేరే దిశగా మార్చుకోవచ్చు. - ప్రొ. బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

బీటెక్‌ (జెనెటిక్‌ ఇంజినీరింగ్‌) 2018లో పూర్తిచేశాను. పీజీ చేయాలనుకుంటున్నాను. ఎంటెక్‌ చేయాలా? ఎంఎస్సీలాంటి అవకాశాలేమైనా ఉన్నాయా? - నిఖిత

ఈ మధ్యకాలంలో జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుపై చాలామందికి ఆసక్తి పెరుగుతోంది. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ సిద్ధాంతాలను వ్యవసాయం, వైరాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, వైద్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పరిశోధనా రంగాల్లో శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా బీఎస్సీ చదివిన తర్వాత ఎమ్మెస్సీ; బీటెక్‌ చదివాక ఎంటెక్‌ లేదా ఎంఎస్సీ చదివే అవకాశం ఉంటుంది. కొంతమంది ఎమ్మెస్సీ అనంతరం ఎంటెక్‌ చదువుతారు. ఎంటెక్‌ (జెనెటిక్‌ ఇంజినీరింగ్‌), ఎంఎస్సీ (జెనెటిక్‌ ఇంజినీరింగ్‌) కోర్సుల్లో 70 నుంచి 80 శాతం సిలబస్‌ ఒకటే. ఉద్యోగావకాశాలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఏ కోర్సునైనా ఎంచుకొనే ముందే భవిష్యత్తులో ఏ రంగంలో, ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారు అనేదానిపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఇంజినీరింగ్‌ రంగంలో స్థిరపడటానికి ఎంటెక్‌ కోర్సు ఉపయోగకరం. బోధన, పరిశోధనా రంగంలో ప్రవేశించడానికి ఎంఎస్సీ కోర్సుని ఎంచుకోవచ్చు.

బీటెక్‌ (సీఎస్‌ఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇంటీరియర్‌ డిజైన్‌పై ఆసక్తి ఉంది. ఇది డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉందా? దూరవిద్య ద్వారా చేయొచ్చా? - సీహెచ్‌ భువనేశ్వరి

ఉన్నత విద్యలో ఆరంభదశలోనే మీ అభిరుచులను తెలుసుకొని వాటికి తగిన కోర్సులను ఎంచుకోవడం కెరియర్‌కు చాలా ఉపయోగకరం అవుతుంది. మన దేశంలో ఇప్పుడు ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. ఎన్నో ప్రైవేట్‌ కాలేజీలు ఒక సంవత్సరం పరిమితి గల డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ ప్రధానంగా నైపుణ్య ఆధారితం.. ఇది ప్రాక్టికల్‌ ఆధారమైనది కావడం వల్ల ప్రధాన విద్యాసంస్థలేవీ దీన్ని దూరవిద్యలో అందించడం లేదు. అరకొరగా కొన్ని ప్రైవేట్‌ ఇన్స్టిట్యూట్‌ లు దూరవిద్యలో అందించినప్పటికీ అవి ప్రామాణికం కావు. అందువల్ల ఇంటీరియర్‌ డిజైనింగ్‌ను దూరవిద్యలో అభ్యసించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. - ప్రొ. బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

బీటెక్‌ పూర్తిచేశాను. ఉన్నతవిద్య చదవాలనుంది. ఎంటెక్‌, ఎంబీఏ లపై ఆసక్తి లేదు. నాకున్న వేరే అవకాశాలేంటి? చరిత్ర, రూరల్‌ డెవలప్‌మెంట్‌లపై చేయాలని ఉంది. వీటిల్లో చేయగలిగిన కోర్సులేమైనా ఉన్నాయా? - వెంకటేష్‌, పాల్వంచ

చాలా అవకాశాలు ఉన్నాయి. సాధారణ డిగ్రీతో చేయదగిన కోర్సులన్నీ మీరు చేయవచ్చు. బీటెక్‌ తరువాత ఎంబీఏ, ఎంటెక్‌ ఆసక్తి లేకపోతే ఎంఎస్సీని ఎంచుకోవచ్చు. చరిత్ర మీద ఆసక్తి ఉందంటున్నారు కాబట్టి, ఎంఏ హిస్టరీని తీసుకోండి. ఏ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినా ఈ కోర్సును చేయడానికి అర్హులే. ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుకూ మీరు అర్హులే. ఈ రెండింటిలో మీకు దేనిపై ఎక్కువ అభిరుచి ఉంటే దాన్ని ఎంచుకోండి.

బీటెక్‌ (సీఎస్‌ఈ) చివరి సంవత్సరం పూర్తిచేశాను. ఇస్రోలో (రిసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌) పనిచేయాలనుంది. నాకున్న అవకాశాలేమిటి? - కొప్పెర వినీత

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చి ఆర్గనైజేషన్‌ (ఇస్రో) అంతరిక్ష పరిశోధనల్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతోంది. ప్రతి సంవత్సరం యువ ఇంజినీర్లను నియమించుకోవడం ఈ విజయాలకు కారణమని సీనియర్‌ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇస్రో ప్రతి సంవత్సరం ఏప్రిల్లో సైంటిస్ట్‌/ఇంజినీర్‌ ‘ఎస్‌సి’ పరీక్ష నిర్వహిస్తూ ఎందరో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ గ్రూపుల్లో స్పెషలైజేషన్‌ చేసినవారు ఈ పరీక్ష రాయటానికి అర్హులు. పరీక్షలో అడిగే ప్రశ్నలు గేట్‌ సిలబస్‌కు దగ్గరగా ఉంటాయి. మీరు ఇప్పటినుంచే గేట్‌ సిలబస్‌ను రిఫర్‌ చేసుకుంటూ సిద్ధమైతే ఇస్రోలో కొలువు సాధించే అవకాశం పెరుగుతుంది.

మా అమ్మాయి బీటెక్‌ (బయోటెక్నాలజీ) రెండో సంవత్సరం చదువుతోంది. చదువు పూర్తయ్యాక తనకు ఉన్న ఉద్యోగావకాశాలను తెలపండి. - సురేష్‌ మహేంద్రకర్‌

జీవకణాలకు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని బయోటెక్నాలజీగా పిలుస్తారు. సూక్ష్మజీవుల పాత్ర మానవాళి జీవితంలో కీలకపాత్ర పోషిస్తుంది. జీవ మనుగడకూ దోహదం చేస్తుంది. నాలుగేళ్ల బయోటెక్నాలజీ కోర్సు ఇంటర్‌ డిసిప్లినరీ కావడం వల్ల వివిధ శాఖల్లో మంచి ఉద్యోగాలున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ, ఔషధ, పర్యావరణ రంగాల్లో నిపుణులను తయారు చేయడం ఈ కోర్సుల ముఖ్యొద్దేశం. కాబట్టి, ఈ రంగంలో నిపుణులకు మెడికల్‌ ల్యాబ్స్‌, రిసెర్చ్‌ ల్యాబ్‌ల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఉన్నత చదువులు చదవాలనుకునేవారు ఎంటెక్‌, ఎంఎస్‌సీలను ఎంచుకోవచ్చు.

బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? - శ్రీవశిష్ట

ఇంజినీరింగ్‌ సిద్ధాంతాలు, సమస్యా పరిష్కార టెక్నిక్‌లను బయాలజీ లేదా మెడికల్‌ రంగాలకు అన్వయించి సత్ఫలితాలను సాధించే ఇంటర్‌ డిసిప్లినరీ శాస్త్రమే బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌. ఈ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్టార్టప్‌ సంస్థల స్థాపనలో ఈ రంగంవారు ముందున్నారు. మెడికల్‌ డివైజెస్‌ తయారీ, కృత్రిమ అవయవాల రూపకల్పన, సర్జికల్‌ రోబోట్స్‌ తయారీ, నియంత్రణ, కంప్యూటేషన్‌ బయాలజీ, మెడికల్‌ ఇమేజింగ్‌, బయో నానో టెక్నాలజిస్ట్‌, క్లినికల్‌ ఇంజినీర్స్‌ వంటి అవకాశాలుంటాయి.
వైద్యవృత్తి, పరిశ్రమలో వస్తున్న మార్పుల్లో వీరి పాత్ర ఎక్కువ. దేశవిదేశాల్లో వీరికి మంచి భవిష్యత్తు, ఉద్యోగ, వ్యాపార అవకాశాలూ ఉన్నాయి. అయితే చదువుతోపాటుగా ప్రాక్టికల్‌ ఆవిష్కరణ, పరిశోధనపైనా దృష్టిపెట్టాల్సి ఉంటుంది.

పెట్రోలియం ఇంజినీరింగ్‌ చేయాలనుంది. మనదేశంలో దీనికున్న అవకాశాలేంటి? - సుమంత్‌ నాయుడు

పెట్రోలియం ఇంజినీరింగ్‌ చేయాలనుకునేవారు 10+2లో మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ చదివుండాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ద్వారా ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ- విశాఖపట్నం, రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ-అమేధి, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, ఐఐటీ- బాంబే, ఐఐటీ- ధన్‌బాద్‌ వంటి ప్రముఖ విద్యాలయాల్లో బీటెక్‌ (పెట్రోలియం ఇంజినీరింగ్‌) కోర్సులో ప్రవేశాన్ని పొందవచ్చు. వీరికి డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, రిజర్వాయర్‌ ఇంజినీర్‌, ఆఫ్‌ షోర్‌ డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌ వంటి ఉద్యోగావకాశాలుంటాయి. ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు ఆయిల్‌ సంస్థలైన ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌ పెట్రోలియం ఎస్సార్‌ ఆయిల్‌ వంటి ప్రముఖ ఆయిల్‌ సంస్థలు మంచి వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.

ఎంసెట్‌గానీ, జేఈఈగానీ రాయకుండా బీటెక్‌ చదవడం సాధ్యమేనా? - శిరీష, తిమ్మసముద్రం

ఎంసెట్‌ కానీ, జేఈఈకానీ రాయకుండా బీటెక్‌లో ప్రవేశం పొందడం సాధ్యమే. సదరు విశ్వవిద్యాలయంవారు నిర్వహించే వారి సొంత ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం పొందవచ్చు. ఉదాహరణకు- వీఐటీ విశ్వవిద్యాలయం వీఐటీఈఈఈ (వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) ద్వారా, గీతం విశ్వవిద్యాలయం జీఏటీ (గీతం అడ్మిషన్‌ టెస్ట్‌), ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఎస్‌ఆర్‌ఎం జేఈఈ ద్వారా బీటెక్‌ కోర్సుల్లోకి ప్రవేశాలను కల్పిస్తున్నాయి. ఇవేకాకుండా కళాశాలలకు కేటాయించిన మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల ద్వారా కూడా బీటెక్‌లోకి ప్రవేశాన్ని పొంది, తమ విద్యను కొనసాగించవచ్చు.

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదవాలంటే.. ఏ అర్హతలుండాలి? ఏ ప్రవేశపరీక్ష రాయాలి? - కిరణ్‌, తిరుపతి

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశాన్ని పొందాలనుకునేవారు 10+2 మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లతో పూర్తిచేసినవారై ఉండాలి. మన రాష్ట్రంలో ఎంసెట్‌ ద్వారా స్టేట్‌ యూనివర్సిటీలు, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ అందిస్తున్న అనుబంధ కళాశాలల్లో తమ ర్యాంకు ఆధారంగా సీటు పొందవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం; జేఎన్‌టీయూ- కాకినాడ; లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌- మైలవరం, విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌- హైదరాబాద్‌; విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌- నల్గొండ ముఖ్యమైనవి.
ఐఐటీవారు నిర్వహించే జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) ద్వారా ఐఐటీ- ఖరగ్‌పూర్‌, ఐఐటీ-మద్రాసు, ఐఐటీ-బాంబే వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాన్ని పొందవచ్చు. రానున్న కాలంలో ఏవియేషన్‌ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనడంలో, మంచి ఉపాధి కలిపిస్తుంది అనడంలో సందేహం లేదు.

అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుంది? దానిలో ప్రవేశం పొందడం ఎలా? - కీర్తి, నర్సీపట్నం

మనది వ్యవసాయాధారిత దేశం. కాబట్టి ఈ రంగంలో అపార విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయానికి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి ఆహారోత్పత్తిలో, ప్రాసెసింగ్‌లో అభివృద్ధిని సాధించడమే అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ ఉద్దేశం. ఇంటర్‌లో మ్యాథ్స్‌, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చదివినవారు ఈ కోర్సును చదవడానికి అర్హులు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం, డా. వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, గుంటూరు; విజ్ఞాన్‌ యూనివర్సిటీ, ఇతర అనుమతి పొందిన అనుబంధ కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌) కోర్సు కాలవ్యవధి 4 సంవత్సరాలు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌వారు ఆల్‌ ఇండియా ఎంట్రెన్స్‌ పరీక్ష ద్వారా జాతీయ స్థాయిలో ప్రవేశాన్ని కల్పిస్తున్నారు.
ఈ కోర్సు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఫుడ్‌ సూపర్‌వైజర్‌, ఆగ్రో ఎకనమిస్ట్‌, సాయిల్‌ సైంటిస్ట్‌, ఫార్మ్‌ షాప్‌ మేనేజర్‌, రిసెర్చర్‌, ప్లాంట్‌ ఫిజియాలజిస్ట్‌, సర్వే ఇంజినీర్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ వంటి ఉద్యోగాలు పొందుతారు. జేఈఈ ద్వారా కూడా కొన్ని విద్యాసంస్థలు అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

బీఏ చదివాను ఫైర్‌ అండ్‌ సేఫ్టీ కోర్సును దూరవిద్య ద్వారా చదవాలనుకుంటున్నాను. కుదురుతుందా? అందించే సంస్థలేవి? - కె. నాగరాజు

ఫైర్‌ ఫైటింగ్‌, విపత్తును ఎదుర్కోవడం, ఆస్తి, ప్రాణనష్టాన్ని తగ్గించడం వంటి వివిధ కార్యకలాపాలను చూసుకోవడమే ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ముఖ్య ఉద్దేశం. దూరవిద్య ద్వారా ఈ కోర్సును (డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ) ఇగ్నో, దిల్లీ వారు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌, నాగ్‌పూర్‌వారు అందిస్తున్నారు. పదో తరగతి, ఆపై అర్హత ఉన్నవారు ఈ కోర్సును చేయడానికి అర్హులు.

బీటెక్‌ (మైనింగ్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. నాకున్న ఉద్యోగావకాశాలను వివరించండి. అది పూర్తయ్యాక ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది? - కాసుల హిమవంశీ

మైనింగ్‌ ఇంజినీరింగ్‌ దేశవిదేశాల్లో మంచి ఉద్యోగ, విద్యావకాశాలను కల్పిస్తోంది. మైనింగ్‌ ఇంజినీర్‌గా ప్రొడక్షన్‌ టార్గెట్‌ను సాధించడానికి మిషనరీ, మాన్‌ పవర్‌పై మీకు ఆధిపత్యం ఉంటుంది. ఎక్స్‌ప్లోజివ్స్‌ సెక్టార్‌లో సేల్స్‌ ఇంజినీర్‌ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ఆయిల్‌ ఇండియా, ఆయిల్‌ రిగ్స్‌, గెయిల్‌ వంటి పీఎస్‌యూ సంస్థల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉన్నతవిద్య పరంగా.. జీఆర్‌ఈ స్కోరు ఆధారంగా విదేశాల్లో ఎంఎస్‌ చేయవచ్చు. మీ కోర్సు పరంగా ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. మీరు వీటిల్లో చదివుండకపోయుంటే ఉన్నతవిద్యను ఎంచుకోవడం మేలు. ఉద్యోగపరంగా అయితే మనదేశంలోనూ, గల్ఫ్‌ దేశాల్లోనూ ఈ కోర్సు చదివినవారికి గిరాకీ ఎక్కువ.

బీటెక్‌ (సీఎస్‌ఈ) తుది సంవత్సరం చదువుతున్నాను. ఎథికల్‌ హ్యాకింగ్‌ చదవాలనుంది. తెలుగు రాష్ట్రాల్లో అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వివరాలను తెలియజేయండి.

హానికర హ్యాకర్లు చేయాలనుకునే దుశ్చర్యలను ముందుగానే పసిగట్టి దాన్ని సమర్థంగా తిప్పికొట్టడమే ఎథికల్‌ హ్యాకర్స్‌ చేసే పని. ఒకరకంగా కంప్యూటర్‌, సహకార వ్యవస్థల బలహీనతలు, దుర్బలాలను గుర్తించే చర్యలను న్యాయపరంగా సాగించడమే వీరి ధ్యేయం. మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ కంప్యూటర్‌ కోచింగ్‌ సంస్థలు ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణను అందిస్తున్నాయి. ఈసీ కౌన్సిల్‌వారు సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ (సీఈహెచ్‌) సర్టిఫికేషన్‌ కోర్సును అందిస్తున్నారు. ఇది ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సుల్లోనే ప్రముఖమైంది. ఈ పరీక్షలో 125 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి- నాలుగు గంటలు. మరిన్ని వివరాలకు www.eccouncil.org ను సందర్శించవచ్చు.

బీటెక్‌ చదువుతున్నాను. ఇంజినీరింగ్‌పై ఆసక్తి లేదు. ఎకనామిక్స్‌, సివిల్స్‌ సర్వీసుల్లో ఆసక్తి. నాకు ఎంఏ (ఎకనామిక్స్‌) చదివే అవకాశం ఉందా? నేరుగా సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధమవడం మేలా? పీజీ కానీ, ఉద్యోగంకానీచేసి ఆపై సన్నద్ధమవడం మంచిదా?

మంచి విశ్వవిద్యాలయాల్లో ఎంఏ (ఎకనామిక్స్‌) చేయాలనుకునేవారు డిగ్రీ స్థాయిలో ఎకనామిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విశ్వవిద్యాలయ ఎంట్రన్స్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు-
క్రయిస్ట్‌ యూనివర్సిటీ- బెంగళూరు, గీతం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లు ఏదైనా డిగ్రీ చేసినవారికీ ఎంఏ (ఎకనామిక్స్‌) చదవడానికి అర్హత కల్పిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల ప్రవేశ వివరాలను తెలుసుకుని, మీకు అనుకూలంగా ఉన్నవాటికి దరఖాస్తు చేసుకోండి.
ఇక సివిల్స్‌ సన్నద్ధత విషయానికి వస్తే.. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు సివిల్స్‌ పరీక్ష రాయడానికి అర్హులు. పీజీ చదువుతూ, ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కు ఎంపికైనవారు చాలామందే ఉన్నారు. సాధారణంగా సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారికి విషయాన్ని లోతుగా విశ్లేషించడం, వివిధ కోణాల్లో సమస్యను పరిష్కరించగల నేర్పు, ప్రజాసంక్షేమం పట్ల ఆసక్తి ఉండాలి.
కాబట్టి అందుకు తగిన లక్షణాలు మీలో ఉంటే.. సమయం, ఆర్థిక స్థితులను దృష్టిలో ఉంచుకుని మీ సన్నద్ధతను ఎప్పుడు ప్రారంభించుకోవాలో నిర్ణయించుకోండి.

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. పీజీ చేయాలనుంది. పొలిటికల్‌ సైన్స్‌, ఆర్కియాలజీల్లో ఆసక్తి ఉంది. చదివే అవకాశముందా? లేదంటే మ్యాథ్స్‌ తప్పనిసరి కాని ఏవైనా పీజీ కోర్సులను తెలియజేయగలరు.

పొలిటికల్‌ సైన్స్‌ లేదా ఆర్కియాలజీలో పీజీ చేయదలచుకున్నవారు ఏదేని డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది. మీరు ఇంజినీరింగ్‌ బ్యాచిలర్స్‌ పూర్తిచేశారు కాబట్టి, మీకు అర్హత ఉంది. జేఎన్‌యూ దిల్లీ, దిల్లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పీజీ అభ్యసించడం శ్రేయస్కరం. మీకు ఆసక్తి ఉన్న పై రెండు కోర్సుల్లోనూ మీరు కోరుకున్నట్టుగానే మేథ్స్‌ సబ్జెక్టు ఉండదు.

బీటెక్‌ (సివిల్‌) పూర్తిచేసి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాను. నాకు దూరవిద్య ద్వారా పై చదువులను కొనసాగించాలని ఉంది. పీజీసెట్‌ ద్వారా దూరవిద్యలో ఎంటెక్‌ను అందించే కళాశాలల వివరాలను తెలపండి.

ఉద్యోగం చేస్తూ ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే మీ ఆసక్తికి అభినందనలు. ఐఐకేఎం కర్ణాటక వారు ఎంటెక్‌ కోర్సును సివిల్‌ ఐచ్ఛికంలో అందిస్తున్నారు. ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఐఈ), ఇండియా వారు పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ సివిల్‌ అందిస్తున్నారు. బీఈ లేదా బీటెక్‌ను 60% మార్కులతో పూర్తిచేసి కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అర్హులు. వీటికి సంవత్సరం పొడవునా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంది. మేలో పరీక్షలు జరుగుతాయి. ఎంటెక్‌ దూరవిద్యలో అభ్యసించేముందు ప్రోగ్రామ్‌ గుర్తింపు, ఈక్వివలెన్స్‌ గురించి తెలుసుకుని, ప్రభుత్వ గుర్తింపు ఉన్నవాటినే ఎంచుకోవాలి.

బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాను. నాకు ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌పై ఆసక్తి ఉంది. ఈ కోర్సులను అందించే ప్రభుత్వ సంస్థల వివరాలను తెలపండి. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

మనిషి సాయం లేకుండా కంప్యూటర్లు, రోబోలు, కంట్రోల్‌ సిస్టమ్స్‌ ద్వారా ఇండిస్ట్రియల్‌ ప్రాసెస్‌ జరపడానికి ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ వీలు కల్పిస్తుంది. ఎన్‌పీటీఈఎల్‌, ఐఐటీ ఖరగ్‌పుర్‌ ఈ కోర్సును అందిస్తున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ)- కాలికట్‌ వారు నాలుగు నెలల వ్యవధి ఉన్న అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా- పీఎల్‌సీ/ స్కాడా/ డీసీఎస్‌ కోర్సులు, పీజీ డిప్లొమా ఇన్‌ ఇండిస్ట్రియల్‌ ఆటోమేషన్‌ సిస్టమ్స్‌ డిజైన్‌లను అందిస్తున్నారు.
ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ప్రభుత్వ, బహుళజాతి పారిశ్రామిక యూనిట్లలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానీ, ఈ కోర్సులతోపాటు వివిధ సాఫ్ట్‌వేర్ల వాడకంపైనా పట్టు పెంచుకున్నవారికే మెరుగైన అవకా.

బీటెక్‌ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ) 80%తో పూర్తిచేశాను. ఈ రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలను తెలియజేయండి. ఒకవేళ నేను ఎంటెక్‌ చేయాలనుకుంటే వేటిని ఎంచుకోవచ్చు? తెలియజేయండి.

బీటెక్‌- ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు చాలానే ఉంటాయి. ఈ కోర్సు చదివినవారికి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ), నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌, సెంట్రల్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది.
మినిస్ట్రీ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వారు ఈమధ్యే 500 ఫుడ్‌ పార్కులను నెలకొల్పడానికి ప్రణాళిక ప్రకటనను విడుదల చేశారు. కాబట్టి మీకు ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ చదివినవారు క్వాలిటీ అస్యూరెన్స్‌ మేనేజర్‌, ఫుడ్‌ ప్యాకింగ్‌ మేనేజర్‌, బ్యాక్టీరియాలజిస్ట్‌, లేబొరేటరీ సూపర్‌వైజర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌, ఫుడ్‌ టెక్నాలజీ లాంటి ఉద్యోగాలను పొందవచ్చు.
ఎంటెక్‌ చేయాలనుకుంటే.. ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, ఫుడ్‌ బయోటెక్నాలజీ, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌, ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌ లాంటి స్పెషలైజెషన్లలో ఆసక్తి మేరకు ఎంచుకోవచ్చు.
ఎంటెక్‌ చదవడానికి కొన్ని విశ్వవిద్యాలయాలు గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ను, మరికొన్ని వాటి ప్రత్యేక పరీక్షల ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్నాయి.

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో పాలిటెక్నిక్‌ ద్వారా డిప్లొమా పూర్తిచేశాను. ఉద్యోగం చేస్తూ బీటెక్‌/ ఏఎంఐఈ చేయడానికి అవకాశం ఉందా? ఉంటే, ఆ కోర్సులను అందిస్తున్న విశ్వవిద్యాలయాలు ఏవి? ఏఎంఐఈకి, రెగ్యులర్‌ బీటెక్‌తో సమాన గుర్తింపు ఉంటుందా?

పాలిటెక్నిక్‌ చదివినవారికి కూడా ఏఎంఐఈ, రెగ్యులర్‌ బీటెక్‌ చేసినవారితో సమానంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఏఎంఐఈ కోర్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందింది. కాబట్టి బీఈ/ బీటెక్‌ చదివిన వారితో సమానంగా వీరు కూడా యూపీఎస్‌సీ, గేట్‌ లాంటి పరీక్షలు రాయడానికి అర్హులే. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సుకి సంబంధించిన స్టడీ సెంటర్లు జేఎన్‌టీయూ-కాకినాడ, జేఎన్‌టీయూ-అనంతపురం, ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌)లోని విశ్వేశ్వరయ్య భవన్‌, తెలంగాణ స్టేట్‌ సెంటర్‌, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఎన్‌ఐటీ-వరంగల్‌ మొదలైన విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి.

అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పై చదువులు చదవాలనుంది. వేటిని ఎంచుకోవాలి? ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నాకున్న ఉద్యోగావకాశాలేంటి?

పై చదువులకు ఇప్పటినుంచే ప్రణాళిక వేసుకోవడం మంచి విషయమే. ఇంకా మీరు మొదటి సంవత్సరంలోనే ఉన్నారు కాబట్టి, మంచి మార్కులతో ముందు ఇంజినీరింగ్‌ డిగ్రీని పూర్తిచేయండి. తరువాత ఉన్నత చదువులకు గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) పరీక్షను రాయాల్సి ఉంటుంది. గేట్‌లో మంచి స్కోరు సాధిస్తే, విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లో ఎంటెక్‌ లేదా ఎంఎస్‌ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఎంటెక్‌లో అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌, ఆక్వాకల్చర్‌ ఇంజినీరింగ్‌, ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ ఇంజినీరింగ్‌ మొదలైన స్పెషలైజేషన్లు ఉంటాయి. ఆసక్తి మేరకు కోర్సును ఎంచుకోవచ్చు.
అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో చాలా ఉద్యోగావకాశాలుంటాయి. ఉదాహరణకు- నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్స్‌, ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసర్చ్‌ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
అగ్రో బయోటెక్‌, ఇండో- అమెరికన్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌ ప్రై. లిమిటెడ్‌, ప్రో ఆగ్రో సీడ్‌ కంపెనీ లిమిటెడ్‌, సెంచురీ సీడ్స్‌ ప్రై. లిమిటెడ్‌ మొదలైన ప్రైవేటురంగ సంస్థల్లో కూడా ఉపాధికి వీలుంటుంది. దేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది కాబట్టి, అగ్రికల్చర్‌ కోర్సు చదివినవారికి ఉద్యోగాలకు కొరత ఉండదు.

ఈఈఈ బ్రాంచితో డిప్లొమా ఫైనలియర్‌ చదువుతున్నాను. అందరిలాగా డిప్లొమా తర్వాత బీటెక్‌ చేయాలనుకోవటం లేదు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు మీద ఆసక్తి ఉంది. డిప్లొమా తర్వాత ఈ కోర్సు చేయవచ్చా? చేస్తే ఎలాంటి అవకాశాలుంటాయి? ఆపైన ఎంబీఏ చదవటానికి వీలుంటుందా?

మీకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుపై ఆసక్తి ఉంది కాబట్టి డిప్లొమా పూర్తయ్యాక దానిలో చేరవచ్చు. ఈ కోర్సు చదివినవారికి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలుంటాయి. అయితే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేరడానికి ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన కోర్సులో ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా చదివివుండాలి. వయసు 22 సంవత్సరాలు మించరాదు. కొన్ని వర్గాలవారికి వయః పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగాల విషయానికొస్తే.. హోటళ్ళు, రెస్టారెంట్లలో, పర్యాటక రంగంలో, కేటరింగ్‌ సర్వీసులు, ఫుడ్‌క్రాఫ్ట్‌ సంస్థల్లో, విమానయాన రంగంలో, బహుళజాతి సంస్థల్లో, విద్యాసంస్థల్లో అవకాశాలుంటాయి. సొంతంగా వ్యాపారం చేయడానికి కూడా వీలు ఉంటుంది. ఈ కోర్సు పూర్తయినతర్వాత ఉన్నతవిద్యను అభ్యసించాలంటే మీరు ఎంబీఏ (హోటల్‌ మేనేజ్‌మెంట్‌) చదవటానికి కూడా అవకాశాలుంటాయి.

నేను బీఈ చదివాను. ఎంఏ హిస్టరీ చదవడానికి వీలుందా? ఓపెన్‌ యూనివర్సిటీల్లో ఈ కోర్సు చేయడానికి అవకాశం ఉందా?

బీఈ బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో ఎంఏ హిస్టరీ చదవడానికి వీలుంది. ఇందుకు విద్యాసంస్థలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (న్యూదిల్లీ) మొదలైన విశ్వవిద్యాలయాలు ఏ బ్యాచిలర్‌ డిగ్రీతోనైనా ఎంఏ హిస్టరీ చదవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.మీరు దూరవిద్య ద్వారా ఎంఏ హిస్టరీ చదవడానికి కూడా అవకాశం ఉంది. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ) వంటివి దూరవిద్య ద్వారా ఎంఏ హిస్టరీ కోర్సును అందిస్తున్నాయి. కానీ మీరు ఎంచుకున్నది మీరు చదివిన బ్యాచిలర్‌ డిగ్రీకి భిన్నమైన కోర్సు. కాబట్టి ఈ కోర్సును దూరవిద్య ద్వారా కంటే రెగ్యులర్‌గా చదవడం మేలు. ఎందుకంటే మీరు నేరుగా చదవడం వల్ల సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఏదైనా అర్థం కాని అంశాలను అధ్యాపకులతో చర్చించే అవకాశం ఉంటుంది.

బీటెక్‌ (ఈసీఈ) పూర్తి చేశాను. బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) చేయాలనుకుంటున్నాను. దీనికి అర్హుడినేనా? ఈ కోర్సును రెగ్యులర్‌గా, దూరవిద్యలో అందించే విద్యాసంస్థలు ఎక్కడున్నాయో తెలుపగలరు?

* ఎన్‌సీటీఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌) నూతనంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బీటెక్‌ చదివిన విద్యార్థులు కూడా బీఈడీ చదవడానికి అర్హులే. కానీ బీటెక్‌ విద్యార్థులు 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెంటల్లీ హాండిక్యాప్‌డ్‌ (హైదరాబాద్‌), బి.ఎస్‌.ఆర్‌. కాలేజ్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ మెంటల్లీ రిటార్డెడ్‌ (అనంతపురం), కాలేజ్‌ ఆఫ్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (ఆంధ్ర మహిళాసభ, హైదరాబాద్‌), డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం), హెలెన్‌కెల్లర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిసర్చ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ ఫర్‌ ద డిజేబుల్డ్‌ చిల్డ్రన్‌ (హైదరాబాద్‌), హెలెన్‌ కెల్లర్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (వైఎస్‌ఆర్‌ డిస్ట్రిక్ట్‌), శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి), ఆర్‌ఏఎస్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (చిత్తూరు) మొదలైన విద్యాసంస్థలు బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)ను అందిస్తున్నాయి. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ)లో బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌)ను దూరవిద్య ద్వారా అందిస్తోంది. రెగ్యులర్‌గా చేయలేని క్లిష్ట పరిస్థితులున్నపుడు మాత్రమే దూరవిద్యకు ప్రాముఖ్యత ఇవ్వండి.

డిప్లొమా(ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతున్నాను. డిప్లొమా తర్వాత ఇంజినీరింగ్‌ కాకుండా ఏయే కోర్సులు ఎక్కడ చేయవచ్చు?

* డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) వారికి ఉండే అవకాశాలుంటాయి. డిప్లొమా చదివనవారికి ఎంపీసీ వారు చేసే దాదాపు అన్ని కోర్సులూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థికి చాలా ముఖ్యమైన దశ. మీ ఆసక్తి, సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోండి. డిప్లొమా (ఈసీఈ) చదివనవారు ఇంజనీరింగ్‌ కాకుండా బీఎస్సీ ( బయాలజీకి సంబంధించిన కోర్సులు తప్ప), బీఏ, ఎల్‌ఎల్‌బీ, చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రెటరీ మొదలైనవి చేయవచ్చు. అంతేకాకుండా మాస్‌ కమ్యూనికేషన్స్‌, జర్నలిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, లెదర్‌ టెక్నాలజీ, ప్లాస్టిక్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ మొదలైనవి చదవవచ్చు. ఈ కోర్సులు ఎక్కడైనా ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేయడం మేలు. ప్రతి కోర్సు కూడా ప్రత్యేకత ఉండి, దానికి సంబంధించిన ఉద్యోగావకాశాలను కలిగి ఉంటుంది. మీ ఆసక్తిని బట్టి నిర్ణయాన్ని తీసుకోండి.

నేను డిప్లొమా (ఈఈఈ) పూర్తిచేశాను. ఈ మధ్య ఏఎంఐఈ గురించి విన్నాను. డిప్లొమా తర్వాత బీటెక్‌ కూడా ఉంది. ఏఎంఐఈ , బీటెక్‌...ఈ రెండింటిలో దేనికి కెరియర్‌ అవకాశాలున్నాయి?

* ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌) అనేది దూరవిద్య ద్వారా ఇంజనీరింగ్‌ విద్యను అందిస్తుంది. ఏఎంఐఈ అనేది బీటెక్‌ డిగ్రీకి సమానం. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారికి బీటెక్‌ డిగ్రీతో సమానంగా అన్ని అవకాశాలు ఉంటాయి. ఉన్నతవిద్యను అభ్యసించాలన్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకైనా ఏఎంఐఈ, బీటెక్‌ వారికి సమాన అవకాశాలుంటాయి.
ఏఎంఐఈ కోర్సు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారు చదవడానికి అనుకూలం. పని అనుభవం ఉన్నవారు ఈ కోర్సు చదవడంవల్ల వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. డిప్లొమా (పాలిటెక్నిక్‌), ఇంటర్మీడియెట్‌ తర్వాత కూడా చదవడానికి అవకాశం ఉంటుంది.
ఎలాంటి టెక్నికల్‌ కోర్సు అయినా రెగ్యులర్‌గా చేయడమే మేలు. దూరవిద్య ద్వారా చేసిన కోర్సులు రెగ్యులర్‌ కోర్సులకు సమానమైనప్పటికీ, రెగ్యులర్‌ ద్వారా కోర్సు చేసినవారికి సబ్జెక్టు పరిజ్ఞానం, నైపుణ్యాలూ ఎక్కువగా లభించే అవకాశాలు ఉంటాయి.

నాకు బీటెక్‌లో ఒక సబ్జెక్టు బ్యాక్‌లాగ్‌ ఉంది. దాన్ని పూర్తి చేసి బీటెక్‌ డిగ్రీ అర్హతతో ఎంబీఏ చేస్తున్నాను. అమెరికాలో ఉద్యోగం చేయాలనేది నా కల. నాకు మార్గం తెలపండి.

* సాధారణంగా మన ఇండియన్‌ డిగ్రీలతో అమెరికాలో నేరుగా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఏవైనా కంప్యూటర్‌ (సాఫ్ట్‌వేర్‌) కోర్సులు నేర్చుకుని అమెరికాలో ఉద్యోగానికి వెళ్లవచ్చు. లేదంటే మొదట భారత్‌లో ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరి, ఆ కంపెనీ ద్వారా అమెరికాకు వెళ్లవచ్చు. భారత్‌లో ఉన్న అమెరికన్‌ కంపెనీలో పనిచేసి దాని ద్వారా వెళ్లడం మరో విధానం. అమెరికాలో ఎమ్మెస్‌ (మాస్టర్‌ డిగ్రీ) చేసి అక్కడే ఉద్యోగానికి ప్రయత్నించేవారూ ఉన్నారు. ఒకవేళ కంపెనీ తరపున వెళ్లి అక్కడ అమెరికాలో ఉద్యోగం సంపాదించినప్పటికి తిరిగి మీరు పూర్వం పనిచేసిన కంపెనీకి వచ్చి ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతే మీరు అక్కడ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది.

జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ తీసుకుంటే భవిష్యత్‌ అవకాశాలు ఏముంటాయి? అండర్‌గ్రాడ్యుయేట్‌, పీజీల్లో ఈ కోర్సు ఏ కళాశాలల్లో లభ్యమవుతుంది? ప్రవేశపరీక్ష వివరాలు కూడా తెలుపగలరు.

* సాధారణంగా చాలా విశ్వవిద్యాలయాల్లో జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అనేది అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీల్లో బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి కోర్సుల్లో భాగంగా బోధిస్తారు. అంతేకానీ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీల్లో జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ను చాలా విశ్వవిద్యాలయాలు ప్రత్యేకంగా అందించడం లేదు.
కానీ తెలుగు రాష్ట్రాల్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో బీఎస్సీ (జెనెటిక్స్‌) అందుబాటులో ఉంది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, విశ్వభారతి యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ మొదలైనవి (ఎమ్మెస్సీ) పీజీలో జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ను అందిస్తున్నాయి. వీటితోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ కలికట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, సర్దార్‌ పటేల్‌ యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీ మొదలైనవి బీఎస్సీ, ఎమ్మెస్సీలో జెనెటిక్స్‌ను అందిస్తున్నాయి. కొన్ని ఐఐటీల్లో కూడా జెనెటిక్స్‌ అందుబాటులో ఉంది. ఎస్‌ఆర్‌ఎమ్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ (జెనెటిక్‌ ఇంజనీరింగ్‌), ఎంటెక్‌ (జెనెటిక్‌ ఇంజనీరింగ్‌) కోర్సులున్నాయి.
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు (బీఈ/ బీటెక్‌) ఐఐటీల్లో చదవాలంటే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర విద్యాసంస్థలు తమ రాష్ట్రస్థాయి ప్రత్యేక ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, దిల్లీ వారు నిర్వహించే ఆల్‌ ఇండియా కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా వివిధ యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐటీల్లో గేట్‌ పరీక్ష ద్వారా ఎంటెక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రస్తుతం జెనెటిక్‌ ఇంజనీరింగ్‌కి మనదేశంలో, విదేశాల్లో చాలా గిరాకీ ఉంది. వివిధ రంగాల్లో జెనెటిక్‌ ఇంజనీర్ల అవసరం కూడా పెరుగుతూ ఉంది. వీరు ముఖ్యంగా ఫార్మా, వ్యవసాయ రంగం, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని రీసెర్చీ అండ్‌ డెవెలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లలో, బయోటెక్‌ లేబొరేటరీలలో, ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంబంధిత రంగాలలో మొదలైనవాటిలో ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజి (న్యూదిల్లీ), సెంటర్‌ ఫర్‌ డిఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ (హైదరాబాద్‌), బయోకెమికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ అండ్‌ ప్రాసెస్‌ డెవెలప్‌మెంట్‌ సెంటర్‌( చండీగర్‌), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజి(దిల్లీ), ఇతర సంస్థలతో జెనెటిక్‌ ఇంజనీర్స్‌, బయోటెక్‌ శాస్త్రవేత్తల అవసరం ఎంతైనా ఉంటుంది.

నాకు బీటెక్‌లో ఒక సబ్జెక్టు బ్యాక్‌లాగ్‌ ఉంది. దాన్ని పూర్తి చేసి బీటెక్‌ డిగ్రీ అర్హతతో ఎంబీఏ చేస్తున్నాను. అమెరికాలో ఉద్యోగం చేయాలనేది నా కల. నాకు మార్గం తెలపండి.

* సాధారణంగా మన ఇండియన్‌ డిగ్రీలతో అమెరికాలో నేరుగా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఏవైనా కంప్యూటర్‌ (సాఫ్ట్‌వేర్‌) కోర్సులు నేర్చుకుని అమెరికాలో ఉద్యోగానికి వెళ్లవచ్చు. లేదంటే మొదట భారత్‌లో ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరి, ఆ కంపెనీ ద్వారా అమెరికాకు వెళ్లవచ్చు. భారత్‌లో ఉన్న అమెరికన్‌ కంపెనీలో పనిచేసి దాని ద్వారా వెళ్లడం మరో విధానం. అమెరికాలో ఎమ్మెస్‌ (మాస్టర్‌ డిగ్రీ) చేసి అక్కడే ఉద్యోగానికి ప్రయత్నించేవారూ ఉన్నారు. ఒకవేళ కంపెనీ తరపున వెళ్లి అక్కడ అమెరికాలో ఉద్యోగం సంపాదించినప్పటికి తిరిగి మీరు పూర్వం పనిచేసిన కంపెనీకి వచ్చి ఇక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాతే మీరు అక్కడ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది.

బీటెక్‌ 2010లో పూర్తిచేశాను. కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనుంది. ఏం చేయాలి?

* ఇంకా ఉద్యోగం రాలేదని నిరాశ చెందవలసిన అవసరం లేదు. పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది. బీటెక్‌ పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విరివిగా ఉద్యోగావకాశాలుంటాయి. మీరు కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలని ఉందన్నారు. కానీ బీటెక్‌లో ఏ బ్రాంచి చదివారో చెప్పలేదు. ఈ రోజుల్లో ఏ సంస్థ అయినా సరైన నైపుణ్యాలు, సామర్థ్యాలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. మీరు ఏ విభాగంలో, ఏ రంగంలో పని చేయాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు, పరిజ్ఞానం మొదలైనవి ఆ ఉద్యోగం చేయడానికి అవసరమవుతాయి. వాటిని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి.
ఏ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో ఆ రంగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. భావవ్యక్తీకరణ, బృందంతో కలిసి పనిచేయగలగడం, పట్టుదల, విశ్వాసం, నాయకత్వ లక్షణాలు, స్వీయ ప్రేరణ, చొరవ తీసుకోవడం, సమస్యను సమర్థంగా పరిష్కరించగలగడం, చదివిన సబ్జెక్టుకు సంబంధించి పరిజ్ఞానం మొదలైనవి అవసరం.

యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా, యానిమేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో బీఈ/ బీటెక్‌ను అందించే విశ్వవిద్యాలయాల వివరాలను తెలపండి.

* ప్రత్యేకంగా బీటెక్‌/ బీఈలో యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా, యానిమేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ను అందించే విశ్వవిద్యాలయాలు భారతదేశంలో తక్కువగా ఉన్నాయి. చాలా సంస్థలు ఎక్కువగా యానిమేషన్‌, మల్టీమీడియా, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కోర్సులను డిప్లొమా లేదా పీజీ డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ కోర్సులుగా అందిస్తున్నాయి.
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ బీటెక్‌ (డిజిటల్‌ టెక్నిక్స్‌ ఫర్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్‌), పంజాబ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ అనుబంధ కళాశాల అయిన గురుకూర్‌ విద్యాపీఠ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ బీటెక్‌ (3డీ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్‌), ఉత్తరాఖండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఎస్‌సీ)లో బీటెక్‌ (గ్రాఫిక్స్‌ అండ్‌ గేమింగ్‌) కోర్సు, అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నాలుగు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ ఇన్‌ (యానిమేషన్‌ డిజైన్‌)లను అందిస్తున్నాయి.
2015 నుంచి ఐఐటీ- బాంబే కూడా 4 సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (యానిమేషన్‌ డిజైన్‌)ను అందిస్తోంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌ అండ్‌ యానిమేషన్‌- ఐఐడీఏఏ- కోల్‌కతా బీఎస్‌సీ (యానిమేషన్‌)నూ, తమిళనాడులోని హిందుస్థాన్‌ యూనివర్సిటీ బీఎస్‌సీ (మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌) కోర్సులనూ అందిస్తున్నాయి.
యానిమేషన్‌, మల్టీమీడియా, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కోర్సులు ఎక్కువగా ఒకేషనల్‌ కోర్సుల్లాగానే అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రైవేటు సంస్థలు వీటిని పార్ట్‌టైం/ సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులుగా అందిస్తున్నాయి.

డిప్లొమా (ఈసీఈ) 2007లో పూర్తిచేసి, బీటెక్‌లో చేరాను. కానీ, కొన్ని కారణాలరీత్యా మధ్యలోనే ఆపేశాను. ప్రస్తుతం బీఎస్‌సీ మొదటి సంవత్సరం దూరవిద్య ద్వారాచేద్దామనుకుంటున్నాను. జియాలజీ, మైనరాలజీ, పాలెంటాలజీల గురించిన వివరాలను అందించండి. ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

* జియాలజీ, మైనరాలజీ, పాలెంటాలజీ లాంటి కోర్సులను దూరవిద్య ద్వారా చేయడం వీలవదు. ఈ కోర్సులను ఏ విశ్వవిద్యాలయాలు కూడా దూరవిద్య ద్వారా అందించడం లేదు. ఈ కోర్సులను చేయాలనుకుంటే రెగ్యులర్‌గానే చేయాల్సివుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కాకతీయ, ఉస్మానియా వంటి విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలైన బనారస్‌ హిందూ, యూనివర్సిటీ ఆఫ్‌ కాలికట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ, యూనివర్సిటీ ఆఫ్‌ అలహాబాద్‌ వంటి విశ్వవిద్యాలయాలు జియాలజీ డిగ్రీని అందిస్తున్నాయి.
మైనరాలజీ, పాలెంటాలజీలు బయాలజీ డిగ్రీలో సబ్జెక్టులుగా ఉంటాయి. తరువాత ఎంఎస్‌సీలో వేర్వేరుగా చదవవచ్చు. కొన్ని విద్యాసంస్థలు బీటెక్‌లో జియోసైన్స్‌ ఇంజినీరింగ్‌ను కూడా అందిస్తున్నాయి. జియాలజీ, మైనరాలజీ, పాలెంటాలజీ చదివినవారికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్ష ద్వారా ఉద్యోగావకాశాలుంటాయి. సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, కోల్‌ ఇండియా, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అథారిటీ, హిందుస్థాన్‌ జింక్‌, ఇతర సంస్థల్లోనూ ఉపాధి లభిస్తుంది. ఆర్మీ, పారా మిలిటరీ దళాలు కూడా జియాలజిస్టుల సేవలను ఉపయోగించుకుంటున్నాయి.

మా అమ్మాయి బీటెక్‌ (ప్లానింగ్‌) మూడో సంవత్సరం చదువుతోంది. తరువాత ఏయే పోటీ పరీక్షలను రాయవచ్చు? మాస్టర్స్‌ ఏ బ్రాంచిలో చేస్తే ఉపయోగకరం? ప్రభుత్వ ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

* బీటెక్‌ తరువాత ఉద్యోగం చేయాలనుకుంటే యూపీఎస్‌సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) వారు నిర్వహించే ఐఈఎస్‌ (ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌), సివిల్‌ సర్వీసెస్‌ లాంటి పోటీపరీక్షలు రాయడానికి అవకాశముంటుంది. బ్యాంకింగ్‌ రంగంలో పనిచేయాలనుకుంటే ఐబీపీఎస్‌, ఎస్‌బీఐలాంటి పరీక్షలను రాయాల్సిఉంటుంది. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, బీఈఎల్‌, హెచ్‌ఏఎల్‌, ఏఏఐ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ మొదలైన సంస్థలు పీఎస్‌యూ (పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌) పోటీపరీక్ష ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. పరిశోధన రంగంలోకి అడుగుపెట్టాలనుకుంటే ఇస్రో, బార్క్‌, డీఆర్‌డీఓలాంటి పరీక్షల ద్వారా అవకాశముంటుంది.
భారత్‌లో రక్షణ రంగంలో పనిచేయడానికి సీడీఎస్‌ (కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌) పరీక్ష ద్వారా ఇండియన్‌ ఏర్‌ఫోర్స్‌, ఆర్మీ, నేవీ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఉన్నత చదువులు చదవాలనుకుంటే గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌) ద్వారా ఎంటెక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నత చదువుల కోసం జీఆర్‌ఈ, టోఫెల్‌, జీమ్యాట్‌ లాంటి పోటీపరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా బీటెక్‌ తరువాత ఎంబీఏ చేయాలనుకుంటే క్యాట్‌, మ్యాట్‌, గ్జాట్‌ మొదలైన పరీక్షల ద్వారా ప్రవేశం పొందవచ్చు.
మాస్టర్స్‌ డిగ్రీలో ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌, హౌసింగ్‌, అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లానింగ్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, రూరల్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన కోర్సులుంటాయి. మీ అభిరుచినీ, ఆసక్తినీ బట్టి మీకు నచ్చిన బ్రాంచిని ఎన్నుకుని చదవడం మేలు. ఏ బ్రాంచి అయినా తనదైన ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. బీటెక్‌ (ప్లానింగ్‌) చదివిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీస్‌ హెచ్‌యూడీఏ, వీయూడీఏ మొదలైనవి. మున్సిపల్‌ కార్పొరేషన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, మల్టీనేషనల్‌ కంపెనీలు (అర్బన్‌ ప్లానింగ్‌కు చెందినవి), సాఫ్ట్‌వేర్‌ రంగం, ప్రొఫెషనల్‌ ఇండస్ట్రీ, ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్‌ (అర్బన్‌ ప్లానర్‌), డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ జాగ్రఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

ఆటోమేషన్‌- రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా బెంగళూరులో చేస్తున్నాను. తరువాత ఇదే బ్రాంచిలో బీటెక్‌ చేయాలనుకుంటున్నాను. అందించే కళాశాలల వివరాలు తెలియజేయండి.

* ఆటోమేషన్‌- రోబోటిక్స్‌ అనేది ఇంజినీరింగ్‌లో ఒక ప్రత్యేక విభాగం. రోబోలు, ఆటోమేటిక్‌ మెషీన్‌ల ఉపయోగం పెరుగుతున్న ఈ తరుణంలో ఈ బ్రాంచిని ఎంచుకోవడం అభినందనీయం. ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని భారతదేశంలో దలాల్‌ గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (న్యూదిల్లీ), గుల్జార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (లూథియానా), పీఎస్‌జీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కోయంబత్తూరు), చండీగఢ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (పంజాబ్‌), డీఏవీ యూనివర్సిటీ (పంజాబ్‌) లాంటి విద్యాసంస్థలు అందిస్తున్నాయి. కొన్ని ఐఐటీల్లో నేరుగా కాకుండా ఈ ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ను ఎలక్టివ్స్‌గా అందిస్తున్నారు. ఉదాహరణకు ఐఐటీ దిల్లీలో పరవ్‌ అండ్‌ రోబోటిక్స్‌ అనే బ్రాంచి అందుబాటులో ఉంది.

మా అమ్మాయి అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదువుతోంది. తరువాత తనకున్న కెరియర్‌, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు తెలియజేయండి.

* అతి ముఖ్యమైన వ్యవసాయ రంగంలో కెరియర్‌పరంగా, ఉద్యోగపరంగా అవకాశాలు అధికం. మీ అమ్మాయి అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదువుతోంది కాబట్టి, ఇందులో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకుంటే అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, ఫార్మ్‌ మెషినరీ అండ్‌ పవర్‌ ఇంజినీరింగ్‌, క్రాప్‌ ప్రొడక్షన్‌, రూరల్‌ టెక్నాలజీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ, అగ్రికల్చరల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, సాయిల్‌ వాటర్‌ కన్సర్వేషన్‌ ఇంజినీరింగ్‌, పోస్ట్‌ హార్వెస్ట్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ ఇంజినీరింగ్‌ల్లో ఎంటెక్‌ కోర్సులు చేయడానికి అవకాశముంటుంది. ఎంఎస్‌సీ ఇన్‌ రూరల్‌ టెక్నాలజీ, అగ్రిఇన్ఫర్మేటిక్స్‌, రూరల్‌ టెక్నాలజీల్లో పీహెచ్‌డీ కూడా చేయవచ్చు. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలం. వీరికి ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ (ఏఆర్‌ఎస్‌), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌), ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి సంస్థలు, బ్యాంకుల్లో, వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు రంగంలో వీరికి వ్యవసాయ పరికరాల తయారీ రంగంలో, కన్సల్టెన్సీ సర్వీసెస్‌, అగ్రిబిజినెస్‌ సంస్థలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ రిటైలింగ్‌ రంగంలో, పరిశోధన సంస్థలు, లేబొరేటరీల్లో ఉపాధి లభిస్తుంది.

* ఇంజినీరింగ్‌ (ఈసీఈ)ను 58% మార్కులతో పూర్తిచేశాను. ప్రస్తుతం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తున్నాను. ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో అసోసియేట్‌ కూడా పూర్తిచేశాను. నా అర్హత, ఉద్యోగానుభవానికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందే అవకాశముందా?

ఈసీఈ చేసి ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో పనిచేస్తున్న మీరు సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం పొందాలంటే మళ్లీ కొన్ని సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేయాల్సిన అవసరముంది. లేదంటే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ను ప్రాసెస్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో మీకున్న ఇన్సూరెన్స్‌ అనుభవంతో ఇన్సూరెన్స్‌ స్పెషలిస్ట్‌గా చేరవచ్చు. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమే చేయాలనుకుంటే డేటా అనలిటిక్స్‌, బిగ్‌ డేటా అనాలసిస్‌ లాంటి రంగాల్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నట్లయితే ఇన్సూరెన్స్‌కు సంబంధించిన డేటా అనలిటిక్స్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

* పాలిటెక్నిక్‌ చేసి, 2013లో బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాను. నా చదువుకు ఏ కోర్సులు చేస్తే మంచిది? వాటికి ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేసిన మీరు గేట్‌ (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)ను రాసి, అందులో ఉత్తీర్ణత పొందితే ఎంటెక్‌ చేయడానికి అవకాశముంటుంది. మీకు ఎంటెక్‌- ఆటోమోటివ్‌ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, నానోటెక్నాలజీ, సెన్సార్‌ సిస్టమ్‌ టెక్నాలజీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ మొదలైన కోర్సులు చేయడానికి అవకాశముంటుంది. ఆసక్తి ఉన్న కోర్సును ఎంచుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.
ప్రభుత్వరంగ సంస్థలైన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లి., మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లి., ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మొదలైన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. వీటితోపాటు ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌), డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌), బార్క్‌ (బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌) మొదలైన పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. అంతేకాకుండా రక్షణ రంగం, రైల్వే, ఆల్‌ ఇండియా రేడియో, ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లాంటి కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంటుంది.

* ముంబై యూనివర్సిటీ నుంచి ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. నేను ఐఈఎస్‌కు అర్హుడినేనా?

ఐఈఎస్‌ (ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌) పరీక్షను యూపీఎస్‌సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష రాయడానికి కనీస అర్హతగా బీటెక్‌/ బీఈ ఇన్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీని ఉండాలి. మీరు ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ చదివారు కాబట్టి, ఐఈఎస్‌ పరీక్ష రాయడానికి అర్హులు. కానీ ఐఈఎస్‌ పరీక్ష సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మాత్రమే నిర్వహిస్తారు. మీకు ఐఈఎస్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రాయడానికి అర్హత ఉంది.
జనరల్‌ కేటగిరీ వారికి 21- 30 సంవత్సరాలు, ఓబీసీ అయితే 21- 33 సంవత్సరాలు, ఎస్‌సీ/ ఎస్‌టీకి 21- 35 సంవత్సరాల వయః పరిమితి ఉంటుంది.

* బీటెక్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ సంస్థలో నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. ఎంటెక్‌/ ఎంఎస్‌ చేయకుండా వీలవుతుందా?

సాధారణంగా పీహెచ్‌డీ చేయాలంటే సంబంధి సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. ఉదాహరణకు- 3 సంవత్సరాల బీఎస్‌సీ చేస్తే, 2 సంవత్సరాలు ఎంఎస్‌సీ; బీఏ తర్వాత రెండేళ్ళ ఎంఏ; బీకాం తర్వాత రెండేళ్ళ ఎంకాం పూర్తిచేస్తే కానీ పీహెచ్‌డీకి అవకాశం లేదు. కానీ 4 సంవత్సరాల బీఎస్‌సీ (ఆనర్స్‌), బీకాం (ఆనర్స్‌), బీఏ (ఆనర్స్‌), బీఈ/ బీటెక్‌తో నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశముంది. దీన్ని 10+2+4 సిస్టమ్‌ అంటారు. ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేయడం కోసం భారత్‌లోని వివిధ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు ఎంటెక్‌ను కనీస అర్హతగా నిర్ణయించాయి. ఇందుకు భిన్నంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌సీ, ఐఐఎస్‌ఈఆర్‌, ప్రసిద్ధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు (యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, బనారస్‌ హిందు విశ్వవిద్యాలయం)లలో బీటెక్‌తోనే నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందడానికి అవకాశం కల్పిస్తున్నాయి. బీటెక్‌లోఅత్యుత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ పోటీపరీక్షలైన యూజీసీ- జేఆర్‌ఎఫ్‌/ నెట్‌, సీఎస్‌ఐఆర్‌- జేఆర్‌ఎఫ్‌/ నెట్‌, గేట్‌ మొదలైన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటం, సృజనాత్మకతతో ఆలోచించగలిగి పరిశోధనపట్ల ఆసక్తి ఉండటం, ఎంచుకున్న ఇంజినీరింగ్‌ రంగంలో ఉపయోగకరమైన పరిశోధన అంశాన్ని ఎంచుకుని ఇంటర్వ్యూలో రాణించగలగడం... ఇవి ఉంటే నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశముంటుంది. చాలా విద్యాసంస్థలు ఇంజినీరింగ్‌లో ప్రథమశ్రేణి అని పేర్కొన్నప్పటికీ 70- 80% మార్కులు పొందినవారికి సీటు లభించే అవకాశాలు ఎక్కువ. మరికొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటుగా ఉద్యోగానుభవం/ బోధనానుభవం/ కనీసం రెండు పరిశోధన పత్రాల ప్రచురణ ఉన్నట్లయితే నేరుగా పీహెచ్‌డీకి అవకాశమిస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ గమనిస్తే అత్యంత ప్రతిభ, పరిశోధన పట్ల విపరీతమైన ఆసక్తి కనబరిచే అతి కొద్దిమంది బీటెక్‌ విద్యార్థులకు మాత్రమే పీహెచ్‌డీలో నేరుగా ప్రవేశం లభిస్తుందని గ్రహించవచ్చు.

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ 2013లో పూర్తిచేశాను. ఏరో విభాగంలో పై చదువులు చదివి డీఆర్‌డీవో, ఇస్రోల్లో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను. నేను అర్హుడినేనా? ఉద్యోగసాధనకు ఇంకా సంపాదించుకోవాల్సిన అర్హతలేమిటి?

సైంటిస్ట్‌ ఎంట్రీ టెస్ట్‌ (సెట్‌) ద్వారా నేరుగా, ఐఐటీలు, ఐఐఎస్‌సీ, ఎన్‌ఐటీ లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాంగణ నియామకాలు, లేటరల్‌ ఎంట్రీ స్కీం, రిక్రూట్‌మెంట్‌ & అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) ద్వారా ఏరోనాటికల్‌ రీసెర్చ్‌ & డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఏఆర్‌డీబీ) ఫెలోషిప్‌ అవకాశాలు పొందవచ్చు. డీఆర్‌డీవోలో రిక్రూట్‌మెంట్‌, షెడ్యూల్‌ వివరాలకు www.rac.gov.inని చూడండి.
ఇంజినీరింగ్‌ అర్హతతో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ/ తగిన ఉద్యోగాల భర్తీకి వారి నోటిఫికేషన్‌ కోసం ఇస్రో (లిక్విడ్‌ ప్రపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ & ఎన్‌ఆర్‌ఎస్‌ఏ)- www.lpsc.gov.in/, www.nrsc.gov.in/Work_With_Us_careers.html వెబ్‌సైట్లను చూడండి.
యూజీసీ (నెట్‌) ప్రకటన ప్రకారం టెస్టులో అర్హత ప్రభుత్వ అధీన సంస్థల్లో ఉద్యోగాలకు అర్హతగా ఉపయోగపడుతుంది. దాదాపు ప్రతి పీఎస్‌యూల్లో గేట్‌లో ఉత్తీర్ణత సాధించినవాళ్లను తీసుకుంటారు. బీటెక్‌లో 65% మార్కులతోపాటు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుని దరఖాస్తు చేసుకున్న తరువాత వారు నిర్వహించే రాతపరీక్ష, మౌఖికపరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

సింగరేణి కాలరీస్‌లో ఇంజినీర్‌గా చేస్తున్నాను. మైనింగ్‌ విభాగంలో దూరవిద్య ద్వారా ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. అందించే సంస్థల వివరాలు తెలపండి?

దూరవిద్య ద్వారా ఎంటెక్‌- మైనింగ్‌లో చేయడం సాధ్యం కాదు. రెగ్యులర్‌ విధానం కోసం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ యూనివర్సిటీ; ఐఐఐటీ; ఎన్‌ఐటీ; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌ & టెక్నాలజీ, షిబ్‌పూర్‌; జై నరైన్‌ వ్యాస్‌ యూనివర్సిటీ, జోధ్‌పూర్‌లను సంప్రదించండి.

మెటలర్జీ & ఇంజినీరింగ్‌ 2014లో పూర్తిచేశాను. బీహెచ్‌పీవీ (విశాఖపట్నం)లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేశాను. సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుంటున్నాను. నా బ్రాంచీ ఆధారంగా ట్రైనింగ్‌- సర్టిఫికేషన్‌ కోర్సులను అందించే సంస్థలేవి?

నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) వారు ఐఐటీలు, ఐఐఎస్‌సీ వారితో కలిసి ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు, నామమాత్రపు ఫీజులతో సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ మెటలర్జికల్‌ థర్మోడైనమిక్స్‌ సర్టిఫికేషన్‌/ ఎగ్జామినేషన్‌ కోర్సు ఈ లింక్‌ http://onlinecourses.nptel.ac.in/noc15_mm01/preview ద్వారా దరఖాస్తు చేసుకోండి. వీటికి సంబంధించిన పరీక్ష మే 2015లో జరుగుతుంది. ట్రినిటీ ఎన్‌డీటీ వారి సర్టిఫికేషన్‌ కోర్సులకు http://www.trinityndt.com/training_ndt.php; ముంబై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటలర్జీ క్వాలిటీ & మేనేజ్‌మెంట్‌ వారి కోర్సులకు http://www.mimetallurgy.com/industrial-training.htm ను చూడండి. ఇవే కాకుండా వీడియోలను http://nptel.ac.in/courses/113105024/; http://freevideolectures.com/Subject/Metallurgy-and-Material-Science ద్వారా చూసి మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి.

గేట్‌ స్కోరు ఆధారంగా నియామకాలు చేపట్టే ప్రభుత్వ రంగ సంస్థల వివరాలేమిటి?

దాదాపు అన్ని ప్రభుత్వ రంగాల్లో గేట్‌ స్కోరు ఆధారంగా ఉద్యోగ నియామకాలుంటాయి. ఉదా: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లి., హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లి., ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లి., పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లి., మాజగాన్‌ డాక్‌ లి., ఆయిల్‌ & నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌, కోల్‌ ఇండియా లి., నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లి., ఇకాన్‌ ఇంటర్నేషనల్‌ లి., నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మొ.వి. మరిన్ని వివరాలకు http://bit.ly/18PabAi ని చూడండి.

మెటల్‌ & మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నాను. మంచి ఉద్యోగం సాధించడానికి ఏయే అంశాల్లో నైపుణ్యాన్ని సాధించాలి? ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న ఉద్యోగావకాశాలేమిటి?

మీకు ముఖ్యంగా మెటల్‌, మెటాలిక్‌ ప్రాడక్ట్స్‌ తయారుచేసే పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఇదే కాకుండా ఆర్‌&డీ/ ల్యాబ్‌ సెంటర్లు, దేశవిదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పనిచేయవచ్చు. లార్సన్‌ గ్రూప్‌, న్యూ భారత్‌ రిఫ్రాక్టరీస్‌ లి., ద మెటల్‌ పౌడర్‌ కంపెనీ లి., హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లి., నాల్కో, ఉత్కల్‌ మినరల్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌, జిందాల్‌ స్టీల్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), హిందాల్కో ఇండస్ట్రీస్‌ లి. లాంటి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో సైంటిస్ట్‌, ప్రొఫెసర్‌, రీసెర్చర్‌, మెటలర్జిస్ట్‌, వెల్డింగ్‌ ఇంజినీర్‌, ప్లాంట్‌ ఎక్విప్‌మెంట్‌ ఇంజినీర్‌, బాలిస్టిక్స్‌ ఇంజినీర్‌, క్వాలిటీ ప్లానింగ్‌ ఇంజినీర్‌, ప్రాసెస్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ప్రాసెస్‌ ఇంజినీర్‌, సప్లయిర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌ లాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీరు ఎంచుకున్న అంశాన్ని బట్టి మెటలర్జికల్‌ థర్మోడైనమిక్స్‌ & కైనటిక్స్‌, డీఫార్మేషన్‌ బిహేవియర్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ ఎక్స్‌ట్రాక్టివ్‌ మెటలర్జీ, ఫేజ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ & హీట్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, మెటీరియల్స్‌ కారెక్టరైజేషన్‌, ఐరన్‌ మేకింగ్‌ & స్టీల్‌ మేకింగ్‌లలో మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. ఉచిత వీడియో లెక్చర్‌లకు http://bit.ly/1BC8Qafను వీక్షించండి.

ఇంజినీరింగ్‌లో ఈసీఈతోపాటు దూరవిద్య ద్వారా బీఎస్‌సీ (ఎంఈసీ) చేద్దామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా?

పరిజ్ఞానాన్ని పెంపొందిం చాలనుకోవడం సరైనదే. కానీ యూజీసీ వారి ప్రకారం రెగ్యులర్‌ విధానంలో ఇది వీలు కాదు. దూరవిద్య కంటే MOOC, UDEMY/ COURSERA ద్వారా మీ జ్ఞానాన్ని మెరుగుపరచుకోవటం ఉత్తమం.

ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. చదువు కొనసాగించాలనుకుంటున్నాను. ఎంటెక్‌, ఎంబీఏలలో దేన్ని ఎంచుకుంటే మేలు? ఉద్యోగావకాశాలను తెలియజేగలరు.

మీ నైపుణ్యాలు, లక్ష్యాన్ని బట్టి ఎంటెక్‌, ఎంబీఏలలో సరైనది ఎంచుకోవాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్‌/ వ్యాపారం వైపు వెళ్లాలనుకుంటే దానికిముందు వ్యాపార లావాదేవీలపై స్పష్టమైన అవగాహన ఉండాల్సిందే. దీనికి ఎంబీఏ చేసి సరిపడే ఇంటర్న్‌షిప్‌లు చేయడంవల్ల తగిన నైపుణ్యాలు సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఇంజినీరింగ్‌లోని కోర్‌ సబ్జెక్టులోనే కెరియర్‌ ఆరంభించాలనుకుంటే నచ్చిన సబ్జెక్టుకు తగ్గ ఎంటెక్‌ కోర్సునే చేయండి. ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగంలో చేరాక కొద్దిపాటి అనుభవం వచ్చాక పై చదువులకు వెళ్లడం ఉత్తమమే.

ప్రభుత్వరంగ సంస్థలో రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాను. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. సంస్థల వివరాలు తెలుపగలరు. బీటెక్‌ తరువాత గేట్‌ రాయడానికి అర్హురాలినేనా?

దూరవిద్య ద్వారా బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ చేయడానికి ఒకప్పటిలా ఇపుడు వీలు కాదు. యూజీసీ/ ఏఐసీటీఈ/ డీఈసీ వారు వీటికి అనుమతి ఇవ్వడం లేదు. కాబట్టి దూరవిద్య ద్వారా అనుమతి లేని ఇంజినీరింగ్‌ కోర్సులో చేరకండి. మీరు 10+2 (ఎంపీసీ), డిప్లొమా/ ఇతర పై చదువులు ఉన్నవారు రెగ్యులర్‌ విధానంలో బీటెక్‌ చేయలేనపుడు ఏఎంఐఈ ద్వారా ఇంజినీరింగ్‌ పూర్తిచేయవచ్చు. ఇది పూర్తిచేశాక గేట్‌ రాయడానికి కూడా అర్హులే. ఏఎంఐఈ వివరాలకు http://bit.ly/1yAAXXq ని చూడండి.

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. వీలవుతుందా? కంప్యూటర్‌ సైన్స్‌ ఏరోస్పేస్‌ ఉద్యోగాల్లో ఎలా ఉపయోగపడుతుందో కూడా వివరించండి.

మీరు ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చేయవచ్చు. ఏరోస్పేస్‌ ఇంజినీర్లు ముఖ్యంగా మ్యాన్డ్‌/ అన్‌ మ్యాన్డ్‌ ఏర్‌క్రాఫ్ట్‌, స్పేస్‌ క్రాఫ్ట్‌లను డిజైన్‌ చేస్తారు. వీరు ఉన్న మెషీన్‌లనూ, కొత్తగా రూపొందించిన డిజైన్లనూ పరీక్షిస్తారు. ఏరోస్పేస్‌ ఇంజినీర్లే కాకుండా కంప్యూటర్‌ ఇంజినీర్లు కూడా ఏరోస్పేస్‌ పరిశ్రమలో వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు. ఫిజికల్‌ డిజైన్‌ కాకుండా కంప్యూటర్‌ సైన్స్‌ నైపుణ్యాలతో సాఫ్ట్‌వేర్‌ తయారుచేసి, వాటిని ఉపయోగించి ఏవియానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ బాక్సులు ఏరోప్లేన్‌ని పనిచేసేలా చేస్తారు.
ఇంటిగ్రేటెడ్‌ సిస్టం, వివిధ టెక్నాలజీలను ఉపయోగించి క్లిష్టమైన సాఫ్ట్‌వేర్‌ని, సవాలు విసిరే ప్రాజెక్టులను తయారుచేసేవారయితే ఈ రంగం ఒక చక్కని అవకాశం. కంప్యూటర్‌ సిస్టమ్‌ అనలిస్ట్స్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్స్‌, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్స్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్స్‌, కంప్యూటర్‌ సపోర్ట్‌ స్పెషలిస్ట్స్‌లతోపాటు నెట్వర్క్‌ & కంప్యూటర్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ లాంటి ఉద్యోగావకాశాలుంటాయి.

బీటెక్‌ (సీఎస్‌) పూర్తిచేశాను. ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై ఆసక్తి ఉంది. భారత్‌, ఇతర దేశాల్లో ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసే వీలుందా? కళాశాలల వివరాలు తెలుపగలరు.

కింద తెలిపిన కళాశాలల్లో ఇంటీరియర్‌ డిజైన్‌ కోర్సుల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయవచ్చు.
అమిటీ విశ్వవిద్యాలయం, నోయిడాలో బీఎస్‌సీ, ఎంఎస్‌సీ; బ్రెయిన్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ స్టడీస్‌, అహ్మదాబాద్‌లో డిప్లొమా, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ; కాడెన్స్‌ అకాడమీ ఆఫ్‌ డిజైన్‌, నాగపూర్‌లో డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, B.Des, ఎంఎస్‌సీ; సిండ్రెబే స్కూల్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, కాలికట్‌లో డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, బీఎస్‌సీ &ఎంబీఏ, ఎంఎస్‌సీ పీజీ డిప్లొమా; ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో ఎంఎస్‌సీ; క్యూబాటిక్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, కాలికట్‌లో డిప్లొమా, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ; డీ సమర్‌ అకాడమీ, లూథియానాలో డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ; ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & పారామెడికల్‌ సైన్సెస్‌లో డిప్లొమా, బీఎస్‌సీ, ఎంఎస్‌సీ; డీజైన్‌ ఈకొలె కాలేజీ, అజ్మీర్‌లో బీఎస్‌సీ, ఎంఎస్‌సీ.

మా అబ్బాయి మెటలర్జీ & మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కోర్‌ విభాగంలో తగిన ఉద్యోగం దొరకదని భావిస్తున్నాడు. కోర్‌, నాన్‌కోర్‌ విభాగాల్లోని ఉద్యోగావకాశాలు, నాన్‌ కోర్‌ విభాగంలో ఉద్యోగం సంపాదించుకోవడానికి చేయాల్సిన కోర్సుల వివరాలు తెలియజేయగలరు.

ప్రతిభ, సరైన నైపుణ్యాలున్న మెటలర్జీ &మెటీరియల్స్‌ ఇంజినీర్లను లార్సన్స్‌ గ్రూపు, న్యూ భారత్‌ రీఫ్రాక్టరీస్‌ లి., ద మెటల్‌ పౌడర్‌ కంపెనీ లి., హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లి., నాల్కో, ఉత్కల్‌ మినరల్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌, జిందాల్‌ స్టీల్‌, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) లాంటి సంస్థలు కచ్చితంగా తీసుకుంటాయి. నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) వారు http://nptel.ac.in/courses.phpలో పొందుపరచిన వీడియోల ద్వారా మెటలర్జీ & మెటీరియల్‌ సైన్స్‌ల్లో నైపుణ్యాలను మెరుగుపరచుకోమని చెప్పండి.
కోర్‌లో నైపుణ్యాలు లేకపోయినా, తనకు ఈ రంగంలో ఇష్టం లేకపోయినా మిగతా నాన్‌కోర్‌లో తనకు ఇష్టమైన విభాగంలో చేయవచ్చు. గ్రాఫిక్స్‌/ మల్టీమీడియా, ఫొటోగ్రఫీ, ఫైన్‌ ఆర్ట్స్‌, కన్సల్టింగ్‌, ఈ-కామర్స్‌, ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌, సోలార్‌ మాత్రమే కాకుండా ప్రస్తుతం కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలికాం రంగాల్లో మంచి భవిష్యత్తు ఉంది. బ్యాంకింగ్‌/ పబ్లిక్‌ సర్వీసెస్‌ వంటి ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రయత్నించవచ్చు. వీటిల్లో ఏది ఇష్టమో తెలుసుకుని దానిపై దృష్టి పెట్టమనండి.

ఈసీఈ చివరి సంవత్సరం చదువుతున్నాను. సాంకేతిక రంగంలో ఆసక్తి ఉంది. దీనిలో కొత్తగా అభివృద్ధి చెందుతున్న విభాగాల గురించి తెలపండి.

మారుతున్న కాలానికీ, ప్రపంచ అవసరాలకూ దీటుగా సాంకేతిక రంగంలో రోజురోజుకూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రతిదీ ఆటోమేషన్‌ వైపుగా మార్చడానికీ, ఉత్తమ ఫలితాలతోపాటు వనరుల ఖర్చు, సమయాన్ని ఆదా చేయడానికి కృషి జరుగుతోంది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ముఖ్యంగా ఈ కింది వాటిని చెప్పవచ్చు. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌/ వీఎల్‌ఎస్‌ఐ, ఎనలాగ్‌ డిజైన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, పీఎల్‌సీ/ స్కాడా/ డీసీఎస్‌ లాంటి కంట్రోల్‌ &ఆటోమేషన్‌ టెక్నాలజీలు; ఆప్టో ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, సోలార్‌ పవర్‌, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, మొబైల్‌/ టెలీకమ్యూనికేషన్స్‌ (ఐపీ మల్టీమీడియా సబ్‌సిస్టమ్‌, హై స్పీడ్‌ డౌన్‌- లింక్‌ ప్యాకెట్‌ యాక్సెస్‌, మొబైల్‌ వర్చ్యువల్‌ నెట్వర్క్‌ ఆపరేటర్‌), రోబోటిక్‌ ఇంజినీరింగ్‌. వీటిపై మాన్యుఫాక్చరింగ్‌, విద్యుదుత్పత్తి- పంపిణీ, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏవియేషన్‌- ఎవియానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, రేడియో- టెలివిజన్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, టాన్స్‌పోర్టేషన్‌, టెలీ కమ్యూనికేషన్స్‌, హాస్పిటల్‌ డయాగ్నోస్టిక్‌ ఎక్విప్‌మెంట్‌ & ఆఫ్‌షోర్‌ పరిశ్రమల్లో ఆర్‌&డి రోజూ జరుగుతూనే ఉంటుంది. మీరు గూగుల్‌ అలర్ట్స్‌ ఉపయోగించి ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ టెక్నాలజీలో మార్పులను గమనించండి. మరిన్ని వివరాలకు http://bit.ly/1uETefs, www.ieee.org/index.html, www.electronicsforu.comలను చూడండి.

ఇంజినీరింగ్‌ చదువుతుండగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరి ఆర్నెల్లు అవుతోంది. ఈ సంస్థలో నాకు ఏ ఇబ్బందీ లేదు. మంచి జీతం. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. అయితే 'మా సంస్థలోకి వస్తే మంచి జీతం ఇస్తాం' అంటూ ఇతర సంస్థల నుంచి నాకు ఆఫర్లు వస్తున్నాయి. వాటిని చూస్తుంటే ఆ సంస్థల్లో చేరాలనిపిస్తోంది. కానీ ఇప్పుడు పని చేస్తున్న సంస్థకి రెండేళ్ల పాటు ఇందులోనే పనిచేస్తానని బాండ్‌ రాసిచ్చాను. అటువైపు ఎక్కువ జీతం వదులుకోలేను. ఇటువైపు బాండ్‌ని అతిక్రమిస్తే న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న భయం. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం చేయమంటారు?

బాండ్‌ని అతిక్రమిస్తే ఏమవుతుంది... ఎటువంటి న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది కాసేపు పక్కన పెడదాం. అసలు బాండ్‌ని సంస్థలు ఎందుకు రాయించుకుంటాయో చెబుతాను. ప్రముఖ సంస్థలు కాలేజీ క్యాంపస్‌లకు వచ్చి విద్యార్థులను రిక్రూట్‌ చేసుకొన్న తర్వాత బాండ్‌ రాయించుకొంటాయి. దీని ఉద్దేశం, అప్పటికి వాళ్లకేదో పని వచ్చని కాదు. నిపుణులైన ఉద్యోగులు అనుకునీ నియమించుకోవడం లేదు. పనిని నేర్చుకోగల సమర్థులన్న భావనతో ఎంపిక చేసుకుంటున్నాయి. అంటే వాళ్లకు పని నేర్పించి, భవిష్యత్తులో వారి నుంచి తగిన ఉత్పాదకతను పొందాలనుకుంటాయి. అందుకోసం బ్యాంకులూ, ఐటీ సంస్థలూ ఈ మాదిరిగానే తమ సమయాన్నీ, డబ్బునీ, వనరులనీ ఐదారు నెలల పాటు వెచ్చిస్తాయి. తర్ఫీదు పొందిన వారు... శిక్షణతో కలుపుకొని కనీసం రెండేళ్లు పని చేస్తే సంస్థ పెట్టిన పెట్టుబడీ, వాళ్లు ఆశించిన పనీ లభిస్తుంది. దీనినే 'రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌' అంటారు. కానీ సంస్థలు ఇంతా చేసిన తర్వాత ఇలా శిక్షణ పొందిన వాళ్లు మార్కెట్‌లో హాట్‌కేకుల్లా తయారవుతారు. పోటీ సంస్థలు ఇటువంటి వారిని గద్దల్లా తన్నుకుపోవాలని చూస్తాయి. వాళ్లు దీనికోసం పెద్దగా శ్రమ పడిందేమీ ఉండదు. కానీ మీకొచ్చే జీతానికి పైన నాలుగు వేలో, ఐదు వేలో ఎక్కువ ఇస్తామని వూరిస్తాయి. ఇక్కడే మీలాంటి వాళ్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది.
జాబ్‌కీ, కెరీర్‌కీ తేడా ఉంది. ఇప్పటి తరం వాళ్లు గబగబా కెరీర్‌లో ఎదగాలని చూస్తున్నారు. అందుకే మరో చోట కాస్తంత ఎక్కువ జీతం వస్తుంది అనుకోగానే అక్కడికి వెళ్లిపోవాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ నైతిక విలువల కోణం కూడా ఆలోచించాలి. సర్వీస్‌ని బ్రేక్‌ చేసి వెళ్లడం నైతికత కాదనేది ఓ కోణమైతే... మీ కెరీర్‌లో ఇది మైనస్‌ పాయింట్‌ అవుతుంది. 'నేను ఒక సంస్థలో బాండ్‌ని అతిక్రమించాను' అని మీరు చెబితే ఏ హెచ్‌ఆర్‌ సంస్థకీ అంత గౌరవం ఉండదు. ఒక సంస్థలో బాండ్‌ బ్రేక్‌ చేసిన వాళ్లు మన సంస్థలో మాత్రం చేయరా అని మీకు కొత్తగా ఉద్యోగం ఇచ్చే వాళ్లు ఆలోచిస్తారు కదా! మీ మీద నమ్మకం ఉంచి, ఎంచుకున్న సంస్థలో కనీసం ఆర్నెల్లు కూడా పని చేయకుండా మానేయడానికి పెద్ద కారణం ఉంటే బాగుంటుంది! లేదంటే, మిమ్మల్ని స్థిరత్వం లేని మనిషిగా అంచనా వేసే అవకాశం ఉంది. సరైన జీతం ఇవ్వకపోవడం, సౌకర్యాలు కల్పించకుండా పని చేయమనడం, ఆరోగ్యం సహకరించపోవడం వంటి అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగం మానేయాల్సి రావడం వేరు. నాలుగైదు వేల జీతం ఎక్కువ వస్తుందని 'మార్పు' కోరుకోవడం వేరు. అన్ని అంశాలనూ జాగ్రత్తగా ఆలోచించుకోండి. న్యాయపరమైన చిక్కులూ, చికాకులూ ఎలానూ ఉంటాయని మరిచిపోవద్దు!!.

మా అమ్మాయి బీటెక్‌- బయోటెక్నాలజీ చదువుతోంది. భవిష్యత్తులో బయోటెక్నాలజీ రంగంలో ఉండే ఉద్యోగావకాశాలను తెలుపగలరు.

మెడికల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఆనిమల్‌ హజ్బెండరీ, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, బయో ప్రాసెసింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, డ్రగ్‌ డిజైనింగ్‌ అండ్‌ మాన్యుఫాక్చర్‌, ఎన్విరాన్‌మెంట్‌ కన్వర్జేషన్‌ లాంటి రంగాల్లో వీరికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఫార్మాస్యూటికల్‌, కెమికల్‌, బయోప్రాసెసింగ్‌, అగ్రికల్చరల్‌ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో రీసెర్చ్‌ సైంటిస్ట్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌, మార్కెటింగ్‌ పర్సనల్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్‌, బయోటెక్‌ ఇంజినీర్‌/ లాబ్‌ టెక్నీషియన్లుగా అవకాశాలుంటాయి.
బయోటెక్నాలజిస్టులను తీసుకునేవాళ్లలో హిందుస్థాన్‌ లీవర్‌, థాపర్‌ గ్రూప్‌, ఇండో అమెరికన్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌, బిన్‌కాన్‌ ఇండియా లిమిటెడ్‌, బివ్‌కాల్‌, ఇండియన్‌ వాక్సిన్స్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ ఆంటీబయాటిక్స్‌, సన్‌ ఫార్మా, కాడిలా లాంటి కొన్ని సంస్థలను చెప్పుకోవచ్చు. పై చదువులకు ఎంటెక్‌ (బయోటెక్నాలజీ), ఎంటెక్‌ (బయో ఇన్ఫర్మాటిక్స్‌)/ ఎంబీఏ (బయోటెక్నాలజీ) లలో నచ్చిన కోర్సును కూడా ఎంచుకోవచ్చు.

నేను ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. కానీ నేను చదువుకున్న ఆ ఇనిస్టిట్యూట్‌ పెద్దగా పేరున్నదేం కాదు. ఉద్యోగం కోసం రెండేళ్లుగా ఇప్పటికే వందల రెజ్యుమేలను పంపాను. ఫలితం లేదు. మొదట్లో అవకాశాలు రాలేదు. ఇప్పుడు అనుభవం లేదు అంటున్నారు. దరఖాస్తు చేయాలంటేనే భయం వేస్తోంది. సరైన నెట్‌వర్క్‌ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమేమో అనిపిస్తోంది. ఏం చేయమంటారు?

నెట్‌వర్క్‌ అనేది మీరన్నట్టుగా చాలా కీలకమైన విషయం. ఓ పట్టాన కొరుకుడు పడని అంశం కూడా. కానీ మీరు కొన్ని సలహాలు పాటించారంటే అది మీకు చాలా తేలిక అవుతుంది. మీరు సొంతంగా ఎన్ని దరఖాస్తులు పంపినా ఫలితం ఉండటం లేదు కాబట్టి ఇదే రంగంలో ఎవరు పని చేస్తున్నారో తెలుసుకుని వారితో కలిసి పనిచేసే ప్రయత్నం చేయండి. ఉదాహరణకి మీరు సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ అసోసియేషన్లూ, ఆర్గనైజేషన్లలో సభ్యత్వం తీసుకోండి. వాళ్ల కార్యక్రమాల్లో మీరు చురుగ్గా ఉంటూ చొరవ తీసుకొంటే, మీ విద్యార్హతలని బట్టి వాళ్లే మీకు ఉద్యోగాన్నివ్వడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి అసోసియేషన్లలో 'మెంబర్‌షిప్‌ అవుట్‌రీచ్‌ కోఆర్డినేటర్‌' అవసరం ఎక్కువగా ఉంటుంది. అంటే సంస్థ తరపున పనిచేస్తూ ఎక్కువమంది సభ్యులు అందులో చేరేట్టు చేయాలి. దాంతోపాటూ వాళ్ల కార్యక్రమాలని నిర్వహించాలి. ఈ పనిని బిజీగా ఉండేవాళ్లూ, ఇప్పటికే ఉద్యోగం ఉన్నవాళ్లూ చేయలేరు. మీకు సమయం ఉంది కాబట్టి ఇటువంటి పనులు ఎంచుకోవచ్చు. మీరు ఆ అసోసియేషన్‌ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి వివిధ సంస్థలతో మీదైన హోదాతో పరిచయాలు పెంచుకోవచ్చు. అలా మీ నెట్‌వర్క్‌ పెరుగుతుంది. మీ దరఖాస్తులో అనుభవం తోడవుతుంది. చదువు తర్వాత ఎక్కువ విరామం తీసుకొన్నారనే ప్రతికూల ముద్ర పడకుండా ఉంటుంది.
ఇప్పుడు పరిచయమైన వాళ్లలో సీనియర్లని గుర్తించి ఒక ఫ్రెండ్లీ మెసేజి పెట్టొచ్చు. అదెలా అంటే, నేను ఫలానా సంస్థకి మెంబర్‌షిప్‌ అవుట్‌ రీచ్‌ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాను. నా వృత్తిలో ప్రతిభ చూపడానికి ఉపయోగపడే సూచనలు పొందేందుకు మిమ్మల్ని సరైన వ్యక్తిగా భావించాను... అని వారితో స్నేహాన్ని పెంచుకోవచ్చు. అవతలి వ్యక్తి నుంచి సరైన స్పందన వస్తే వారి సంస్థలో కానీ వారికి బాగా పరిచయమున్న కంపెనీల్లో కానీ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నించొచ్చు. అవి ఫలించే అవకాశాలూ ఉన్నాయి. అలాగే వాళ్లు స్ఫూర్తిమంతమైన కార్యక్రమాలు చేసినప్పుడు మీరు అభినందించాలి. దీనివల్ల మీ ఆలోచనలు వాళ్లకు చేరువగా ఉండటాన్ని వాళ్లు గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో వారు నిర్వహించే ఈవెంట్ల బాధ్యతను మీకు అప్పగిస్తారు. అలాంటప్పుడు అతిథులతో సత్సంబంధాలు కలిగి ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా నెట్‌వర్క్‌ పెంచుకోవాలి. అయితే ఇదంతా జరగడానికి చాలా ఓపిక కావాలని తెలుసుకోండి. ఇది కేవలం ఇంజినీర్లకు సంబంధించిందే అనుకోవద్దు. వైద్యులూ, ఐటీ ఉద్యోగులూ, లాయర్లూ... ఎవరికయినా వర్తిస్తుంది.

ఇంజినీరింగ్‌ పూర్తయిన వెంటనే మంచి అవకాశం రావడంతో ఉద్యోగంలో చేరిపోయాను. ఆరేళ్లుగా అదే సంస్థలో పనిచేస్తున్నా. ఈ మధ్య నాతో కలిసి చదువుకున్న కొందరు స్నేహితురాళ్లను కలిశా. అందరూ ఉద్యోగస్తులే. మాటల మధ్యలో పనిఒత్తిడికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు నా స్నేహితురాళ్లు రిస్క్‌ ఉన్న ఉద్యోగాల్లో పనిచేస్తున్నా తమ విధుల్ని ఎంతో ఆనందిస్తున్నట్లు చెప్పారు. నా ఉద్యోగంలో అటువంటి అనుభూతేం లేదు. ఆ క్షణంలో నా ఉద్యోగం పట్ల అసంతృప్తి కలిగింది. ఇదే విషయాన్ని సీనియర్‌తో చెబితే పనిచేసే చోట ఆనందం వెతుక్కోవడం అసాధ్యం అనీ, కేవలం సంపాదన మాత్రమే చూసుకోవాలని చెప్పింది. ఓ రకంగా ఇది నాలో సంఘర్షణగా మారింది. ఆదాయం మాత్రమే చూసుకొని, సంతృప్తినివ్వని ఉద్యోగం చేయడం సబబేనా?

నీ ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ దశను ఎదుర్కొంటారు.. మీలాంటి ఆలోచనలు చేస్తారు. అయితే ఒక్క మాట.. జీవితం మన చేతుల్లోకి వచ్చిన తర్వాత అంటే.. మనం జీవితాన్ని మనం జీవించడం మొదలుపెట్టిన తర్వాత సగం సమయం ఆఫీసులో గడిచిపోతుంది. అటువంటి సమయంలో సంతృప్తి అనేదే లేకపోతే ఆ ప్రభావం మీరు చేసే ప్రతీ పనిమీదా కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో సంతోషం అనేది తప్పనిసరి. అప్పుడే పనినీ ఆనందిస్తారు. మీరొక్కరని కాదు.. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగుల పరిస్థితి ఇదే. అందరిలో పెరుగుతున్న పని ఒత్తడిని గుర్తించే దాన్ని అధిగమించేలా చేసేందుకు ఐరాస రెండేళ్ల క్రితం మార్చి 20వ తేదీని ప్రపంచ సంతోష దినోత్సవంగా ప్రకటించింది. ఆహారం, నిద్ర మనిషికి ఎలా అవసరమో సంతోషంగా ఉండటం అనేది మన అందరి హక్కు.. దీన్ని కార్పొరేట్‌ సంస్థలూ గుర్తించాయి. అందుకే వాళ్ల అజెండాలో ఉద్యోగుల సంతోషానికి చోటు కల్పించేలా మార్పులు చేస్తున్నాయి. అలాని సంతోషం ఒకరు ఇచ్చేది కాదు. స్ఫూర్తిని, ప్రేరణను అందిపుచ్చుకొంటూ మీరే ఆ సంతోషాలను విధుల్లోకి ఆహ్వానించాలి. పనిని యాంత్రికంగా కాకుండా అదెంత విలువైనదో గుర్తించి చేస్తే సంతోషం, సంతృప్తి వాటంతటే అవే వస్తాయి. ఓ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందిస్తున్నాం.. అనే ఆలోచనతో విధులు నిర్వర్తించాలని.. అప్పుడే సంతృప్తి ఉంటుందని చెబుతారు మానసిక నిపుణులు. నిత్యం ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటూ, చేస్తున్న పనిలో ఆనందాన్ని వెతుక్కునేవారు తక్కినవారితో పోలిస్తే 40 శాతం అధికంగా తమ సామర్థ్యాన్ని ప్రదర్శించగలుగుతారట. కాబట్టి.. మీరూ మీలోని అసంతృప్తిని వదిలేయండి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేస్తున్నాను. ఈ రంగం నుంచి బయటకు వచ్చి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాను. ఏది ఎంచుకుంటే మేలు?

చాలామందికి రోజూ మాదిరి 9 am- 5 pm ఉద్యోగం చేయడం ఇష్టం లేక సొంతంగా కంపెనీ పెట్టి వ్యాపారిగా మారాలని ఉంటుంది. వారు చేసే ఉద్యోగంలో సరైన ఎదుగుదలకు అవకాశాలు లేకపోవడం, తన నైపుణ్యాలను సదరు మేనేజర్‌ గుర్తించకపోవడం, వేతనం సరిపోకపోవడం ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు.
వ్యాపారంలోకి అడుగుపెట్టడం మంచి నిర్ణయమే కానీ దానికి ముందు మీరు వ్యాపార పథకం (బిజినెస్‌ ప్లాన్‌) తయారు చేసుకోవాలి. అంటే వ్యాపారం ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎంత పెట్టుబడి, ఎక్కడ, ఎవరితో మొదలు పెట్టడం, మీ వ్యాపారం వల్ల ఎలాంటి కస్టమర్లు లాభపడతారో అనేది తెలుసుకోవడం.
ఈ-కామర్స్‌, అప్లికేషన్‌ డిజైన్‌ & డెవలప్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, క్యూఏ/ టెస్టింగ్‌, ఎస్‌ఈవో/ సీఎమ్‌ఎస్‌, ఈఆర్‌పీ/ ఆటోమేషన్‌ ప్రాడక్ట్స్‌ లాంటి మరెన్నో వాటిలో మీ వ్యాపారం మొదలు పెట్టొచ్చు. వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి అవగాహన రావడానికి www.nenonline.tv/courses వీడియోలను వీక్షించండి. స్టార్ట్‌అప్‌ కంపెనీ యజమానులు www.meetup.com/passionandlife, www.meetup.com/Hyderabad-Entrepreneurs-Society లాంటి సోషల్‌ గ్రూపుల ద్వారా పరిచయం చేసుకోవాలి. వారి నుంచి వ్యాపారానికి ఉపయోగపడే ఎన్నో సలహాలను, అభిప్రాయాలను తెలుసుకోవచ్చు.

2006లో మెటలర్జీ డిప్లొమా చేశాను. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. దూరవిద్య ద్వారా మెటలర్జీలో ఇంజినీరింగ్‌ చేద్దామనుకుంటున్నాను. హైదరాబాద్‌ పరిధిలో దీన్ని అందించే విశ్వవిద్యాలయాల వివరాలు తెలుపగలరు.

ఎలాంటి సాంకేతిక కోర్సునూ దూరవిద్యలో నిర్వహించే అనుమతి లేదు. ఇంజినీరింగ్‌ కోర్సులను రెగ్యులర్‌ మోడ్‌లోనే చేయడం ఉత్తమం. ఐఐటీ, ఎన్‌ఐటీలతోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, జేఎన్‌టీయూ, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి వారు నాలుగు సంవత్సరాల వ్యవధి కల మెటలర్జీ ఇంజినీరింగ్‌ కోర్సుని నిర్వహిస్తున్నారు. దీనికి మీరు జేఈఈ/ ఎంసెట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు. ఏఐసీటీఈ ద్వారా అనుమతి పొందిన కళాశాలల వివరాలకు http://bit.ly/1dUhJke, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ) వారి అనుమతి పొందిన కళశాలల వివరాలకు http://bit.ly/1i7VVmb వెబ్‌సైట్లను చూస్తూ ఉండండి.

బీటెక్‌ చేసి బ్యాంకింగ్‌ రంగంలో క్లరికల్‌ క్యాడర్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఉద్యోగం చేస్తూ ఎంబీఏ చేయడానికి వీలున్న విశ్వవిద్యాలయాలు, పూర్తిచేయడానికి పట్టే వ్యవధి, వాటి నోటిఫికేషన్‌ వివరాలు తెలుపగలరు.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ), హైదరాబాద్‌ వారు పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌- బ్యాంకింగ్‌, ఇన్స్యూరెన్స్‌& ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వివరాల గురించి http://bit.ly/NuJ3Mm, IGNOU - మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బ్యాంకింగ్‌& ఫైనాన్స్‌) వివరాల గురించి http://bit.ly/NTcVSd, NIIT & ICICIల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, వారి పీజీ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ & ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోర్సులున్నాయి. వీటి నోటిఫికేషన్‌, కోర్సులు, వ్యవధి వివరాలను http://www.ifbi.com/pgdbo.aspx వెబ్‌సైట్ల ద్వారా పొందండి.

బీటెక్‌ తరువాత ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో పీజీ డిప్లొమా చేశాను. నాకు సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌పై ఆసక్తి ఉంది. ఉద్యోగావకాశాల వివరాలు తెలుపగలరు.

సైబర్‌ క్రైం, డేటా తెఫ్ట్‌, డేటా లాస్‌, వైరస్‌ ఇతరత్రా సమస్యలు పెరుగుతుండడం వల్ల వీటిని అరికట్టడానికి ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సిస్టం, నెట్వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌ మేనేజ్‌మెంట్‌ చాలా అవసరం. చిన్న సంస్థలో అయినా సరే జూనియర్‌/ట్రెయినీ- సెక్యూరిటీ/ సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా కెరియర్‌ను మొదలుపెట్టవచ్చు. నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ తర్వాత పలురకాల ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు నెట్వర్క్‌ సెక్యూరిటీ, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌/ మేనేజర్‌, నెట్వర్క్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌, సిస్టమ్స్‌/ అప్లికేషన్స్‌ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్‌, వెబ్‌ సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేటర్‌/ మేనేజర్‌, సెక్యూరిటీ ఆడిటర్‌, డేటా సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌ ఇన్వెస్టిగేటర్‌, ఐటీ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌/ కన్సల్టెంట్‌/ మేనేజర్‌, సెక్యూరిటీ సర్టిఫైడ్‌ ప్రోగ్రామర్‌, ఫోరెన్సిక్స్‌ ఇన్వెస్టిగేటర్‌. http://bit.ly/1fGjSMO చూసి ఏ ఉద్యోగానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమో తెలుసుకోండి.

ఐటీ రంగం నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. సాఫ్ట్‌వేర్‌ వారికి ఉన్న వ్యాపారావకాశాలను తెలుపగలరు.

చాలామందికి 9 AM - 5 PM ఉద్యోగం చేయడం ఇష్టంలేక సొంతంగా సంస్థ పెట్టి ఎదగాలని ఉంటుంది. వ్యాపారంలోకి అడుగుపెట్టడం మంచి నిర్ణయమే కానీ దానికిముందు వ్యాపార పథకం (బిజినెస్‌ ప్లాన్‌) తయారు చేసుకోవాలి. అంటే చేయదగ్గ వ్యాపారం ఏమిటి, ఎంత పెట్టుబడి, ఎక్కడ, ఎవరితో మొదలు పెట్టాలి, వినియోగదారులు ఏ తరహా అనేవి తెలుసుకోవడం. ఈ-కామర్స్‌, అప్లికేషన్‌ డిజైన్‌- డెవలప్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌, క్యూఏ/టెస్టింగ్‌, ఎస్‌ఈవో/సీఎంఎస్‌, ఈఆర్‌పి/ ఆటోమేషన్‌ ప్రాడక్ట్స్‌ వంటివాటిలో వ్యాపారం మొదలు పెట్టవచ్చు. దీనిపై మంచి అవగాహన రావడానికి www.nenonline.tv/courses వీడియోలను వీక్షించండి. స్టార్టప్‌ కంపెనీ యజమానులను www.meetup.com/passionandlife, www.meetup.com/Hyderabad-Entrepreneurs-Society లాంటి సోషల్‌ గ్రూపుల ద్వారా కలుస్తూ, పరిచయం చేసుకుని వారి నుంచి వ్యాపారానికి ఉపయోగపడే సలహాలూ, అభిప్రాయాలను తెలుసుకోవచ్చు.

బీఈ (ఇన్‌స్ట్రుమెంటల్‌ టెక్నాలజీ) చేశాను. హార్డ్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఏ కోర్సులు చేస్తే ఉపయోగకరం?

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌- ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఐటీ) వారు ఏఐసీటీఈ ఆమోదంతో డిప్లొమా, బీటెక్‌, ఎంటెక్‌ వంటి కోర్సులతోపాటు స్వల్పకాలిక కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. డిప్లొమా/ అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ మెయింటెనెన్స్‌- నెట్‌వర్కింగ్‌ వంటి కోర్సులో చేరి సాంకేతిక నైపుణ్యాలు మెరుగుపరచుకోండి. co-ordinatorstc@doeaccchennai.edu.in కి మెయిల్‌ చేసి, లేదా http://bit.ly/18RvpfHని చూసి మరిన్ని వివరాలు పొందవచ్చు. వీరికి సాఫ్ట్‌వేర్‌/ హార్డ్‌వేర్‌ రంగంలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌, హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌, సెక్యూరిటీ ఇంజినీర్‌, లాబ్‌ డెమన్‌స్ట్రేటర్‌, టెక్నీషియన్‌/ ట్రబుల్‌ షూటర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి.

సిరామిక్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. ప్రభుత్వ రంగంలో నాకు ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయో తెలియజేయగలరు.

సిరామిక్‌ టెక్నాలజీకి మంచి గిరాకీ ఉంది. గృహోపకరణాలు, నిర్మాణ రంగం, ఆటోమొబైల్‌, ఏరోస్పేస్‌, ఉత్పత్తి రంగాల్లో సిరామిక్స్‌కు ఆదరణ లభిస్తోంది. కాబట్టి అనేక సంస్థలు తమ పరిశోధనలకు అవసరమైన సిరామిక్‌ టెక్నాలజిస్టులను ఎంచుకుంటున్నాయి. సిరామిక్‌ ఇంజినీర్లు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి పొందే అవకాశముంది. సిరామిక్‌ టెక్నాలజిస్ట్‌/ సిరామిక్‌ డిజైనర్‌గా మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీల్లో, ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సంస్థలు, డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ, బాబా ఆటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రీసెర్చ్‌ వంటి పరిశోధన సంస్థల్లో/ ప్రభుత్వ లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించవచ్చు.ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ అంశాలకు సంబంధించి తలెత్తే సందేహాలను వివరంగా రాసి పంపండి.

బెంగుళూరులో డిజైనర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం హెల్త్‌కేర్‌ విభాగంలో C, C++ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తున్నాను. సర్టిఫికేషన్‌ కోర్సులు చేద్దామనుకుంటున్నాను. వివరాలు తెలుపగలరు.

మీరు సిస్టం డొమైన్‌ వంటి (www.systemdomain.net/c-c), Ascent సాఫ్ట్‌వేర్‌ (http://asti.co.in) సంస్థల్లో చేరవచ్చు. ఇలా కాకుండా MIT courseware, Khan academy, coursera, udemy, edX వంటి వెబ్‌సైట్ల ద్వారా మీ C, C++ నైపుణ్యాలను అవలీలగా మెరుగుపరచుకోండి. ఇంకెన్నో ఉచిత కోర్సులను అందించే వెబ్‌సైట్ల కోసం www.facebook.com/ passion4career పేజీలో పొందుపరచిన వాటిని అనుసరించండి.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమాలో చివరి సంవత్సరం చదువుతున్నాను. ఏఎంఐఈ చదువుతూ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. సంస్థలు, ఫీజు, సిలబస్‌, రిజిస్ట్రేషన్‌ వివరాలు తెలియజేయగలరు.

10+2/ డిప్లొమా చేసి ఉద్యోగం చేస్తూనే పై చదువులకు వెళ్లాలనుకునేవారికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) అందించే ఏఎమ్‌ఐఈ ఒక చక్కని కోర్సు. వీటి పరీక్ష రాయాలన్నా, ఇతర సర్వీసుల్ని వినియోగించుకోవడానికి ముందుగా ఇందులో సభ్యత్వం తీసుకోవాలి. దీనినే టెక్నీషియన్‌ (10+2 వారికి)/ సీనియర్‌ టెక్నీషియన్‌ (డిప్లొమా చేసినవారికి) మెంబర్‌షిప్‌ అని కూడా అంటారు. దీనికి ప్రభుత్వ గుర్తింపు ఉంది కాబట్టి ఏఎమ్‌ఐఈ చేసినవారు బీఈ/ బీటెక్‌ వారి లాగానే పోటీ పరీక్షలకు అర్హులు. ఏఎంఐఈ తర్వాత ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా గేట్‌ రాసి పై చదువులకు కూడా వెళ్లొచ్చు. ఈ http://ieindia.org/PDF_IMAGES/ACADEMIC/examform.pdf దరఖాస్తు పత్రాన్ని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, విశ్వేశ్వరయ్య భవన్‌, ఖైరతాబాద్‌లో సమర్పించండి. మీకు సభ్యత్వం లభించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తారు. కోర్సు, అర్హత, సిలబస్‌, ఫీజు, పరీక్ష వివరాలకు ఈ http://ieindia.org/examannounce.aspx?accod=acaని చదవండి.

బీటెక్‌ (ఈఈఈ) చేసి, పీఈడీ (పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డ్రైవ్స్‌) లో మాస్టర్‌ డిగ్రీ పూర్తిచేశాను. ఐఈఎస్‌ చేయాలనుంది. దాని అర్హత, పరీక్ష విధానం వివరాలతోపాటు ఎంఈ (పీఈడీ)కి ఉన్న అవకాశాలనూ తెలుప గలరు.

ప్రతి సంవత్సరం ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (ఐఈఎస్‌)ని యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసినవారు (వయసు 21- 30 సంవత్సరాల లోపు) రాతపరీక్ష, ఇంటర్వ్యూలో అర్హత సాధించి సర్వీసు సంపాదించుకోవచ్చు. మరిన్ని వివరాలకు http://upsc.gov.in/general/engg.htm చూడండి.
ఐఈఎస్‌- ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, దీపక్‌గుప్త; జనరల్‌ ఎబిలిటీ, జీకేపీ వంటి పుస్తకాలు చదవండి.
పీఈడీకి ఉన్న అవకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పవర్‌సెక్టార్‌, ఎలక్ట్రిక్‌- హైబ్రిడ్‌ వెహికల్స్‌, డిఫెన్స్‌, హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌, రైల్వేస్‌, ఏవియేషన్‌, వీఎల్‌ఎస్‌ఐ, టెలికమ్యూనికేషన్‌, సివిల్‌ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి.

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ తరువాత మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాను. దీని ద్వారా ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఏ నైపుణ్యాలుంటే ఉద్యోగంలో త్వరగా స్థిరపడవచ్చు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ అనేది నెట్‌వర్క్‌ డెలివరీ సెంటర్‌ని భద్రంగా కాపాడుకోవడం. నెట్‌వర్క్‌ సెక్యూరిటీని అర్థం చేసుకుని డేటా బ్యాక్‌అప్‌లో నైపుణ్యమున్న వెరిటాస్‌ వంటి వాటితో పనిచేయడం. డేటా సెంటర్స్‌ సెక్యూరిటీ గురించి www.cisco.com/web/learning/certifications/index.html#~spec వెబ్‌సైట్‌ని చూడండి. నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ వంటి పుస్తకాలూ కొని సొంతంగా నేర్చుకోండి. Akamai (or) CtrlS వంటి సంస్థల్లో మొదట కెరియర్‌ను ఆరంభించండి. 2- 3 సంవత్సరాల అనుభవం వచ్చాక కెరియర్‌లో ఎదుగుదలకు సిస్కో స్పెషలిస్ట్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు చేయండి.

ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. నానో టెక్నాలజీపై ఆసక్తి ఉంది. ఈ కోర్సును అందించే సంస్థలను తెలుపగలరు.

నానో టెక్నాలజీ అనేది ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా అన్ని ఇంజినీరింగ్‌, టెక్నాలజీ సబ్జెక్టుల సమాహారం. ఈ పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సుకు బీటెక్‌ పూర్తిచేసినవారు అర్హులు.
ఈ కింద తెలిపిన కళాశాలల్లో నానో టెక్నాలజీ కోర్సుల్లో చేరొచ్చు. ఐఐటీ- ముంబై, కాన్పూర్‌, మద్రాస్‌, గౌహతి, ఢిల్లీ; అమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నానో టెక్నాలజీ (ఏఐఎన్‌టీ), నోయిడా; బయోసిస్‌ బయోటెక్‌ లాబ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, చెన్నై; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగుళూరు; నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), రూర్కెలా; ఎన్‌ఐటీ- కురుక్షేత్ర (హర్యానా); మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎమ్‌ఏఎన్‌ఐటీ), భోపాల్‌; అమృత సెంటర్‌ ఫర్‌ నానోసైన్సెస్‌ (ఏసీఎన్‌ఎస్‌), కొచ్చి; జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌, బెంగుళూరు; సెంటర్‌ ఫర్‌ నానో టెక్నాలజీ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ బయోమెటీరియల్స్‌ (సీఈఎన్‌టీఏబీ), శాస్త్రా యూనివర్సిటీ, తమిళనాడు.
ఈ కోర్సు పూర్తిచేసిన తరువాత స్పేస్‌ రీసెర్చ్‌, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్‌, జెనెటిక్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, పర్యావరణం, మెడిసిన్‌ మొదలైనవాటిలో ఉద్యోగావకాశాలుంటాయి. నానో టెక్నాలజీపై మరింత సమాచారం కోసం http://bit.ly/1btRSjXని చూడండి.

బీటెక్‌ (ఈసీఈ) 2012లో పూర్తిచేశాను. విదేశాల్లో ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, టెలికాం రంగాల్లో ఇంజినీరింగ్‌ విద్య ఆధారంగా కోర్సులందించే సంస్థల వివరాలు తెలుపగలరు.

విదేశాల్లో ఎమ్‌ఎస్‌ని మీరు ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌తోపాటు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ని, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ కూడా చేయొచ్చు. విదేశాల్లో ఎక్కువగానే ఎలక్ట్రానిక్‌ కంపెనీలున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాలు, కోర్సుల గురించి http://bit.ly/16mZsstని చూడండి. దేశవిదేశాల్లో వివిధ ఎలక్ట్రానిక్‌ కంపెనీల జాబితా కోసం http://bit.ly/18AWjosని చూడండి.

బీఈ (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌) 2010లో పూర్తిచేసి, ఒక ఎమ్‌ఎన్‌సీలో పనిచేస్తున్నాను. దూరవిద్య ద్వారా ఎంటెక్‌/ ఎంఈ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సులను అందించే ఏఐసీటీఈ/ యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన సంస్థల వివరాలు తెలుపగలరు.

దూరవిద్య ద్వారా ఎంటెక్‌/ ఎంఈ కోర్సులను చేయటానికి వీలులేదు. యూజీసీ/ ఏఐసీటీఈ నుంచి వీటికి ఎలాంటి అనుమతీ లేదు. 3 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో ఒక ఏరియాను ఎంచుకుని ఫుల్‌టైం ఎంటెక్‌/ ఎంఈ కోర్సులను ఐఐటీ/ ఎన్‌ఐటీ వంటి సంస్థల్లో చేయండి.

ఈసీఈ పూర్తిచేసి మొబైల్‌/ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ రంగంలో పనిచేస్తున్నాను. ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ చేయాలని ఆసక్తి ఉంది. వీటిని అందించే స్వదేశీ, విదేశీ విశ్వవిద్యాలయాలేమిటి?

భారత్‌లో అయితే GATE అర్హత సాధించి వర్థమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (http://vardhaman.org/),సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (http://cvr.ac.in/home/), IITs,పాండిచ్చెరి ఇంజినీరింగ్‌ కాలేజ్‌ (http://www.pec.edu/index.html) కళాశాలల్లో ఎంటెక్‌ కోర్సుని చేయవచ్చు. GRE స్కోరు ద్వారా యూఎస్‌ఏలోని కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, షికాగో, ఐఎల్‌; ద జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ, బల్తిమోర్‌, ఎండీ; యూనివర్శిటీ ఆఫ్‌ పటిస్‌బర్గ్‌, పిట్స్‌బర్గ్‌, పీఏ; బోస్టన్‌ యూనివర్శిటీ, బోస్టన్‌, ఎంఏ.

బీటెక్‌ (ఈసీఈ) 2011లో పూర్తి చేశాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఆసక్తి ఉంది. దీనికి సంబంధించిన కోర్సుల వివరాలు తెలుపగలరు.

ఆతిథ్య (హోటల్‌ మేనేజ్‌మెంట్‌) రంగంలో ఆపరేషన్స్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌, హౌజ్‌ కీపింగ్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌, అకౌంటింగ్‌, ఇంజినీరింగ్‌/ మెయింటెనెన్స్‌, సేల్స్‌ అండ్‌ సెక్యూరిటీ లాంటివి ముఖ్యమైన విభాగాలు. మీకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కేటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ న్యూట్రిషన్‌ మేనేజ్‌మెంట్‌ (http://www.ihmhyd.org/),హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, చెన్నై, గాంధీనగర్‌, గౌహతి, త్రివేండ్రం, ఇతర ప్రదేశాల్లో వీరి సంస్థలున్నాయి. వీటిల్లో మీకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అకామడేషన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి 1.5 సంవత్సర కాల వ్యవధితో ఉండే కోర్సులు చేయవచ్చు. లేదా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ http://www.nithm.ac.in/), హైదరాబాద్‌లో అయితే 2 సంవత్సరాల మాస్టర్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ) కోర్సు ఉంటుంది. ఇవి కాకుండా ఇతర ప్రదేశాల్లో అయితే డాక్టర్‌ అంబేద్కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కేటరింగ్‌ అండ్‌ న్యూట్రిషన్‌, చండీఘర్‌ (http://www.ihmchandigarh.org/), బనార్సిదాస్‌ చండీవాలా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ, న్యూఢిల్లీ (http://bcihmct.ac.in/) లో మీకు తగిన కోర్సులు లభ్యమవుతాయి.

ప్ర: బీటెక్‌లో మెటీరియల్‌ సైన్స్‌, వాటి ఉపయోగాలను, ఉద్యోగావకాశాలను తెలపండి.

మెటీరియల్‌ ఇంజినీర్లు పరిశ్రమలో ఉపయోగించే మెటీరియల్‌ని మొదటిదశ అంటే రా మెటీరియల్‌ మొదలుకుని ప్రొడక్షన్‌, కాంపోనెంట్‌ డిజైన్‌, మాన్యుఫాక్చరింగ్‌, రీసైక్లింగ్‌ వరకు ప్రతి దశలో వాటిని అధ్యయనం చేస్తూ సరైన పద్ధతిలో వినియోగించుకోవడంలో కీలకపాత్ర పోషిస్తారు.
మెటీరియల్‌సైన్స్‌ ఇంజినీర్లకు ప్రభుత్వరంగంలో ఉదాహరణకి UCIL, HAL, NTPC, RITES లాంటి కంపెనీల్లో అవకాశాలు ఎక్కువ. ఐఐటీ (రూర్కీ), ఎన్‌ఐటీ (కర్ణాటక) వంటి వాళ్లు ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంటారు. జనరల్‌ ఎలక్ట్రిక్‌, ఫైజర్‌ అండ్‌ ఎనర్జీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌, నాప్రో లైఫ్‌ సైన్సెస్‌ ప్రై. లిమిటెడ్‌. ఎంటెక్స్‌ మెషినరీ, టెస్కో పీఎల్‌సీ వంటి ప్రైవేటు సంస్థల్లో మెటీరియల్‌ ఇంజినీర్లకు అవకాశాలుంటాయి.

ఏరోస్పేస్‌ ఇంజినీరింగులో మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలనుకుంటున్నాను. ఇది సాధ్యమేనా? ఏరోస్పేస్‌ రంగంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఎంతవరకూ ఉపయోగకరమో తెలుపగలరు.

ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ సవాలుతో కూడుకున్న రంగం. ఎందుకంటే ఇది ఏవియేషన్‌, స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌, డిఫెన్సు రంగాల్లో టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ దానిని డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌, టెస్టింగ్‌, ఆపరేషన్‌, నిర్వహణ చేస్తూ ఉండడం ఒక సవాలే. మీరు మొదట ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి ఎటువంటి ఉద్యోగావకాశాలుంటాయో తెలుసుకోండి. స్పేస్‌క్రాఫ్ట్స్‌కి పైలట్‌ లేదా క్రూ మెంబర్లు, ఫిజికల్‌ సైటింస్టులు, లైఫ్‌ సైంటిస్టులు, సోషల్‌ సైంటిస్టులు, మాథమెటీషియన్‌లు, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఇంజినీర్స్‌ డిజైనర్లు, టెక్నికల్‌ కమ్యూనికేటర్స్‌ వంటి వాటిలో మీకు ఇష్టం ఉన్న రంగాన్ని ఎంచుకోండి. వివరాలకు http://www. nasa.gov/centers/ langley/news/factsheets/ FS-2001-09-68-LaRC.html వెబ్‌సైట్‌ను చూడండి.
ఈ రంగంలో ముఖ్యంగా ఎనలిటికల్‌, మాథమెటిక్స్‌, సృజనాత్మకత, దృఢంగా ఉండడం చాలా అవసరం. అంతేకానీ ఎంటెక్‌ కంప్యూటర్‌ చేయడం తప్పనిసరి కాదు. ఎయిర్‌ క్రాఫ్ట్స్‌లో ఉండే ఇన్‌స్ట్రుమెంట్‌ పానెల్స్‌ను ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ద్వారా నియంత్రిస్తారు కనుక ఎంబెడెడ్‌లో ప్రావీణ్యం అవసరం. ఇలా మీరు ఎంచుకున్న దానికి తగిన కోర్సు చేస్తే సరిపోతుంది.

2006లో బీటెక్‌ పూర్తిచేశాను. బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలికాం టెక్నికల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ దూరవిద్య ద్వారా సిస్టమ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంటెక్‌ చేస్తున్నాను. నెట్‌ వర్కింగ్‌లో ఆసక్తి ఉంది. ఇది నాకు ఉపయోగకరమేనా?

టెలి కమ్యూనికేషన్‌ రంగంలో చేస్తూ సిస్టం, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంటెక్‌ చేయడం లాభదాయకమే. సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, నెట్‌వర్కింగ్‌ టెలి కమ్యూనికేషన్‌ రంగం వారికి నెట్‌వర్కింగ్‌ గురించి అవగాహన ఉండడం ఎంతో మేలు. ఎందుకంటే వీటికి మరొకదానితో అనుసంధానం ఉంది. కానీ మీరు ముందుగా ఒకదానిపై స్పెషలైజేషన్‌ కోసం దృష్టి పెట్టండి. http://www.spin.rice.edu/publications.html చూడండి.

మా అమ్మాయి బీటెక్‌ బయోటెక్నాలజీ చేస్తోంది. భవిష్యత్తులో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుపగలరు.

బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందనుంది. ఇతర దేశాల నుంచి ఎన్నో సంస్థలు తమ ఆర్‌ అండ్‌ డీ (రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) కేంద్రాలను భారత్‌లో పెట్టడానికి సుముఖంగా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం వనరుల లభ్యతలో సౌలభ్యమే. డ్రగ్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ రిసర్చ్‌, పబ్లిక్‌ ఫండెడ్‌ లేబొరేటరీస్‌, కెమికల్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ కంట్రోల్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఎనర్జీ, ఫూడ్‌ ప్రాసెసింగ్‌, బయోప్రాసెసింగ్‌ పరిశ్రమల్లో అవకాశాలుంటాయి.
డాబర్‌, రాన్‌బాక్సీ, హిందుస్థాన్‌ లివర్‌, డా.రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, థాపర్‌ గ్రూప్‌, బయోకాన్‌ ఇండియా లి. వంటి పలు సంస్థల గురించి బిజినెస్‌ వార్తలు చదువుతూ ఏ కంపెనీ ఎలా తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయో ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉండండి.

మా అబ్బాయికి ఏరోస్పేస్‌ ఇంజినీరింగు చదవాలని కోరిక. ఏరోస్పేస్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగుల మధ్య వ్యత్యాసం ఏమిటో చెప్పండి? ఈ కోర్సులో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?

ఏరోస్పేస్‌ ఇంజినీరింగుని రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఏరోనాటికల్‌ ఇంజినీరింగు, ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగు. ఏరోనాటికల్‌ ఇంజినీరింగు అనేది భూవాతావరణంలో తిరిగే వాహనాల గురించి చెప్పే శాస్త్రం. హెలికాప్టర్లు, విమానాలు, జెట్‌ వంటివి. రెండోది అంతరిక్షంలో తిరిగే వాహనాల గురించి చెప్పేది. ఏరోనాటికల్‌ అనేది ఏరోస్పేస్‌ ఇంజినీరింగులో ఒక భాగం. అంతరిక్షంలోకి పంపే ఫ్త్లెట్‌ టెక్నాలజీలో వస్తున్న మార్పులని బట్టి ఏరోస్పేస్‌ ఇంజినీరింగు వాడుకలోకి వచ్చింది. ఏరోనాటికల్‌ కంటే ఏరోస్పేస్‌లో ఉద్యోగ అవకాశాలు మెరుగనే అభిప్రాయం ఉంది. మీరు లూనార్‌ రాకెట్స్‌, స్పేస్‌ షటిల్‌, మిస్సైల్‌, శాటిలైట్‌ డిజైనర్‌గా చేరాలనుకుంటే ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చేయడం మేలు. వివరాలకుwww.aero.iisc.ernet.in/ వెబ్‌సైట్‌ని చూడండి.

మా అమ్మాయి బీటెక్‌ మూడో సంవత్సరం పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఏడాది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు తక్కువగా ఉన్నాయి కదా? ముందుజాగ్రత్తగా బయట ఏ కోర్సులపై శిక్షణ తీసుకుంటే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు/ ఆఫ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగ సాధనకు అవకాశం ఉంది? హైదరాబాద్‌లోని శిక్షణసంస్థలను సూచించగలరు.

ఇలా ఇంజినీరింగు పూర్తి కాకముందే జాగ్రత్త తీసుకోవడం ఎంతో మంచిది. చాలామంది ఇంజినీరింగు పూర్తయిన తర్వాతే కెరియర్‌ గురించి ఆలోచించి తర్వాత ఉద్యోగం కోసం సతమతమవుతుంటారు. నిజమే, ఈమధ్య చాలా సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల వైపు మొగ్గు చూపించడం లేదు. ఇంజినీరింగు పూర్తయినవాళ్లకి, చివరి సంవత్సరం చదువుతున్నవాళ్లకి టాలెంట్‌ స్ప్రింట్‌(www.talentsprint.com) వాళ్లు ప్రతి శనివారం గచ్చిబౌలి, అమీర్‌పేటల్లో ఉచితంగా వర్క్‌షాప్‌ నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమం నుంచి తనకి ఎలాంటి కెరియర్‌ అవకాశాలు ఉన్నాయో, ఉద్యోగం సంపాదించడానికి ఎలా కంపెనీలను సంప్రదించాలో అనుభవజ్ఞుల ద్వారా తెలుస్తుంది. దీనికి మీ అమ్మాయిని mentor@talentsprint.com)కి cvని పంపమని చెప్పండి. తద్వారా వాళ్లు మీ అమ్మాయికి ప్రోగ్రాంకి సంబంధించిన ఆహ్వానం పంపిస్తారు.

మా అబ్బాయికి ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో చేరాలని కోరిక. దీనిలో అవకాశాలెలా ఉన్నాయి? దానికి సంబంధించిన సంస్థలు ఎక్కడెక్కడున్నాయో తెలపండి.

ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ చేసినవాళ్లకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే స్వదేశంతోపాటు ఇతర దేశాల ఆటోమొబైల్‌ కంపెనీలు వాళ్ల మాన్యుఫాక్చరింగ్‌, ఆర్‌ అండ్‌ డీ హబ్‌లని ఇండియాలో స్థాపిస్తున్నారు. ఉదాహరణకు అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌, హీరో గ్రూప్‌, యమహా మోటార్స్‌, టొయోట, బజాజ్‌, మారుతి సుజుకి, టీవీఎస్‌, ఫోర్డ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ మోటార్స్‌ ఇలాంటివి ఎన్నో ఉండనే ఉన్నాయి. ఐఐటీ- హైదరాబాద్‌/ ఢిల్లీ/రూర్కీ లేదా ఎస్‌ఆర్‌ఎమ్‌, సత్యభామ, హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ లాంటి వాటిలో ఇంజినీరింగ్‌ చేయడం మంచిదే.

ఇంజినీరింగ్‌ 4వ సంవత్సరం చదువుతున్నాను. వీఎల్‌ఎస్‌ఐ నేర్చుకుందామనివుంది. ఎం.టెక్‌లో కూడా అదే చేస్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ మా స్నేహితులు ఎంబెడెడ్‌ చేయమని చెబుతున్నారు. వీఎల్‌ఎస్‌ఐ కోర్సుల, సంస్థల వివరాలు తెలపండి.

ఈ శీర్షికలో దీనిపై గతంలో వివరాలు ఇచ్చాం. స్నేహితులు ఏదో చెప్పారని కాకుండా మీకేది ఇష్టమో దానిపైనే దృష్టి పెట్టండి. సీడ్యాక్‌, హైదరాబాద్‌ ప్రభుత్వసంస్థ (www.cdac.in 040-23737124) వారు ముఖ్యంగా డిప్లొమా ఇన్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డిజైన్‌ (DESD),డిప్లొమా ఇన్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ (DSSD),డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (DAC)లాంటి ఆర్నెల్ల వ్యవధి కోర్సులను నిర్వహిస్తున్నారు. వీఎల్‌ఎస్‌ఐ సాంకేతిక శిక్షణతో బాటు ప్రాజెక్టులు, సెమినార్‌, భావ వ్యక్తీకరణ మెరుగుపరిచే కార్యక్రమాలతో బాటు ఉద్యోగసాధన గురించీ వివరిస్తుంటారు. ఇలాంటి సంస్థల్లో చేరటం మంచిది.

ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. తర్వాత వీఎల్‌ఎస్‌ఐ నేర్చుకుందామనుకుంటున్నాను. కానీ అది ఎంబెడెడ్‌తో పోలిస్తే కష్టతరమని మా స్నేహితులు అంటున్నారు. ఏం చేయాలో చెప్పండి.

మీ స్నేహితులు ఏదో చెప్పారని కాకుండా మీకు ఏది ఇష్టమో దానిపైనే దృష్టిపెట్టండి. C-DAC (www.cdac.in) వారు ముఖ్యంగా డిప్లొమా ఇన్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డిజైన్‌, డిప్లొమా ఇన్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌లాంటి ఆర్నెల్ల కోర్సులను నిర్వహిస్తున్నారు. సాంకేతిక శిక్షణతో పాటు ప్రాజెక్టులూ, సెమినార్లూ, భావ వ్యక్తీకరణ నైపుణ్యం మెరుగుపరుచుకునే కార్యక్రమాలతో పాటు ఉద్యోగాలు ఎలా సంపాదించాలో కూడా వివరిస్తుంటారు. కాబట్టి మీరు దీనిలో చేరవచ్చు.

బీటెక్‌ (బయోటెక్నాలజీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. ఇప్పటికి 74 శాతం మార్కులు వచ్చాయి. ఈ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలపండి.

బీటెక్‌ (బయో టెక్నాలజీ) పూర్తయిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కెరియర్‌ మొదలుపెట్టవచ్చు. లేదా మీ ఇష్టానుసారం ఇంకా పైచదువులకు వెళ్లవచ్చు. లివింగ్‌ ఆర్గానిజమ్స్‌, బయో ప్రాసెసెస్‌కి సంబంధించి ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, మెడిసిన్‌ రంగంలో మొదలుపెట్టవచ్చు. ఎక్కువగా ఫార్మా రంగంలో అవకాశాలు ఉంటాయి.
డ్రగ్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ రిసర్చ్‌, ప్రభుత్వ నిధులతో నడిచే ప్రయోగశాలలు, కెమికల్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ కంట్రోల్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఎనర్జీ, ఫూడ్‌ ప్రాసెసింగ్‌ లేదా బయో ప్రాసెసింగ్‌ రంగాలకు సంబంధించి కొన్ని సంస్థల్లో ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. Dabur, Ranbaxy, Hindustan Lever, Dr.Reddy's Lab, Wockhardt Ltd., GlaxoSmithKline, Indian Immunologicals, Thaper Group, Indo-American Hybrid Seeds, Biocon India Ltd., IDPL, Hindustan Antibiotics లాంటివి. ప్రభుత్వ రంగ/సంస్థల్లో సీసీఎంబీ, నేషనల్‌ బ్రెయిన్‌ రిసర్చ్‌ సెంటర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలలో ఉద్యోగావకాశాలుంటాయి.

నేను ఇంజినీరింగ్‌ 2012లో పూర్తి చేశాక డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు చేశాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఇది చూసి మా స్నేహితులు అందులో ఎలాంటి భవిష్యత్తూ లేనప్పుడు ఈ కోర్సు ఎందుకు చేశావని అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి.

మీరు కోర్సు పూర్తి చేయడం అన్నది కాకుండా, దీని ద్వారా మీరు ఎంత నేర్చుకున్నారో తెలుసుకోండి. కేవలం సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగం సంపాదించడం వీలు కాదు. ఎవరో ఏదో అన్నారని కాకుండా SQL లేదా ఒరాకిల్‌లో ఏది ఇష్టమో తెలుసుకొని మీ కెరీర్‌పై దృష్టి పెట్టండి. http://www.w3schools.com/ లాంటి వెబ్‌సైట్ల ద్వారా ఉచితంగా మీ స్కిల్‌ను మెరుగు పరుచుకోవచ్చు. బ్లాగ్‌ రాయడం అలవాటు చేసుకోండి. మీకు తెలిసిన విషయాలపై సమస్య, దానికి మీ తెలివిని ఉపయోగించి పరిష్కారం రాస్తూ ఉండండి. మీరు ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు మీ నైపుణ్యాలను ప్రదర్శించటానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చదివితే మీకే తెలుస్తుంది. http://www.bestremotedba.com

నేను బయోఇన్ఫర్మాటిక్స్‌లో ఎంటెక్‌ చేశాను. రెండున్నర సంవత్సరాల పరిశోధనానుభవం ఉంది. యూజీసీ నెట్‌ పూర్తిచేయలేదు. పీహెచ్‌డీ ఎలా పూర్తిచేసి నా కెరియర్‌ను మొదలుపెట్టాలి?

మనదేశంలో పీహెచ్‌డీకి నెట్‌ పాసవాల్సిందే. ఇలా కాకుండా ప్రైవేటు విశ్వవిద్యాలయాలవారు మీకు అవకాశమిస్తారేమో. కానీ దాన్ని ఇప్పుడే సూచించను. మొదటగా పీహెచ్‌డీ ఎందుకు చేయాలనేది తెలుసుకోండి. కేవలం డిగ్రీ కోసమే అయితే పీహెచ్‌డీకి వెచ్చించే సమయం వృథా. సంతోషం పొందలేని అధ్యాపకుడిగానే ఉండిపోవాల్సివస్తుంది. బయోఇన్ఫర్మాటిక్స్‌పై దృష్టిపెట్టి దానిలో- ఉదాహరణకు డ్రగ్‌ డిజైనింగ్‌కి సంబంధించిన ఫార్మా లేదా లైఫ్‌సైన్స్‌ పరిశ్రమలో ఉద్యోగం చేయండి. తర్వాత- ఎంచుకున్న సబ్జెక్టులో ప్రైవేటు విశ్వవిద్యాలయంలోనైనా పీహెచ్‌డీ చేయొచ్చు.