బీటెక్‌ (సివిల్‌) 2015లో పూర్తిచేసి, కొన్ని నెలలపాటు సైట్‌ ఇంజినీర్‌గా చేశాను. కొన్ని అనారోగ్య కారణాలవల్ల ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను. సివిల్‌ ఇంజినీర్‌గా ఆఫీసు పని మాత్రమే ఉండే ఉద్యోగాలేమైనా ఉన్నాయా? భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఇంకేమైనా షార్ట్‌టర్మ్‌ కోర్సులు చేయాలా? - సాయి ప్రశాంత్‌

సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి ఆఫీసులో పనిచేసే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. కానీ, ప్రాథమికాంశాలపై పట్టు మాత్రం సైట్‌లో అనుభవమున్న వారికి మాత్రమే ఎక్కువ. ఆన్‌సైట్‌లో పనిచేస్తున్నా లేకపోయినా సివిల్‌ ఇంజినీర్‌ ముఖ్యంగా సైట్‌కు సంబంధించిన పనికి తోడ్పడే పనులు చేయాలి. కాబట్టి సైట్‌ దగ్గర అనుభవం తప్పనిసరి.
సర్వేయర్‌, ఎస్టిమేటర్‌, కాస్ట్‌ ట్రాకర్‌/ ఆడిటర్‌, ఆర్కిటెక్చర్‌ డిజైనింగ్‌, క్యాడ్‌, క్యామ్‌ డిజైనర్‌, మేనేజ్‌మెంట్‌, బిల్లింగ్‌ విభాగాల్లో ఆఫీసులో పనిచేసే ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఈ ఉద్యోగాలు సైట్‌లో మూడు నుంచి అయిదేళ్ల పని అనుభవం ఉన్నవారికి అందుబాటులో ఉంటాయి.
కోర్సుల విషయానికొస్తే- సాఫ్ట్‌వేర్‌ కోర్సులైన ఎంఎస్‌- ప్రాజెక్ట్‌, ప్రైమావెరా, జియో స్టూడియో, 3డి, 4డి డిజైనింగ్‌, మిడాస్‌, ఆటోక్యాడ్‌, స్టాడ్‌, ప్రొ వంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను నేర్చుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు.

సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాను. సర్వేయర్‌గా కెరియర్‌ మొదలుపెడదామని కోరిక. ఆంధ్ర, తెలంగాణల్లో శిక్షణ సంస్థలు ఎక్కడున్నాయి? ల్యాండ్‌ సర్వే ఇండియా సంస్థలో అవకాశాలు దొరుకుతాయా?

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సర్వేయింగ్‌ కోర్సులో శిక్షణను అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్వేయింగ్‌ అండ్‌ మ్యాపింగ్‌ (హైదరాబాద్‌), సర్వేయర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ (హైదరాబాద్‌), సర్వే అకాడమీ (నూజివీడు) మొదలైన సంస్థలు సర్వేయింగ్‌లో శిక్షణ ఇస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ వారు నాలుగు నెలల కోర్సు అయిన సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ల్యాండ్‌ సర్వేయింగ్‌ కోర్సును పాలిటెక్నిక్‌ సంస్థల్లో అందిస్తున్నారు. అయితే ఈ కోర్సు చదవటానికి పదిమంది కన్నా ఎక్కువమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నపుడు మాత్రమే ఈ కోర్సును అందిస్తారు. వివిధ రకాల ప్రైవేటు సంస్థలు కూడా శిక్షణను ఇస్తున్నాయి. ల్యాండ్‌ సర్వే ఇండియా సంస్థలో అవకాశాలను ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా కల్పిస్తారు.

సివిల్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. నా చదువుకు సంబంధించి సర్టిఫికేషన్‌ కోర్సులు చేయాలనుకుంటున్నాను. అందించే సంస్థలు, వివరాలు తెలియజేయండి.

సివిల్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న మీరు సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా చేయాలనుకోవడం అభినందనీయం. మీరు ఈ కింది వాటిలో సర్టిఫికేషన్‌ కోర్సులు చేసే అవకాశముంటుంది.
* ఆటో క్యాడ్‌ * స్టాడ్‌ ప్రో * ఇంటీరియర్‌ డిజైనింగ్‌ * ఈ-ట్యాబ్‌ * ప్రైమావీరా * ఎంఎస్‌- ప్రాజెక్ట్‌ మొదలైనవి. ఈ కోర్సులను ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు ఎక్కువగా అందిస్తున్నాయి.
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐసీఎంఏఆర్‌) వారు దూరవిద్య ద్వారా వారాంతపు పీజీ డిప్లొమా కోర్సులు క్వాంటిటీ సర్వేయింగ్‌, కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌లను వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కోసం అందిస్తున్నారు. బీటెక్‌ చదువుతున్న మీకు కూడా ఈ కోర్సుల్లో స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సులకు అవకాశం ఉంటుందేమో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌, హైదరాబాద్‌ క్యాంపస్‌లో ప్రయత్నించండి.

మా అబ్బాయి బీటెక్‌ (సివిల్‌) చివరి సంవత్సరం చదువుతున్నాడు. తరువాత ఎంటెక్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలనుకుంటున్నాడు. ఈ కోర్సుకు భవిష్యత్తు అవకాశాలు ఎలా ఉంటాయి? ఇతర వివరాలు తెలియజేయండి.

కన్‌స్ట్రక్షన్‌ సంస్థ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డిజైన్‌ & డెవలప్‌మెంట్‌ సంస్థ, కన్సల్టింగ్‌, రోడ్‌ & రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేసేవరకు ఈ నిపుణుల అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ప్లానింగ్‌, డైరెక్టింగ్‌, కో ఆర్డినేషన్‌, బడ్జెటింగ్‌ విభాగాల్లో అవకాశాలుంటాయి. ఈ కోర్సుకు గేట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఎంటెక్‌లో కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ను కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, పుణె, జేపీ యూనివర్సిటీ కాలేజీల్లో చదవొచ్చు. లేదా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ & రీసెర్చ్‌ (ఎన్‌ఐసీఎంఏఆర్‌)లో రెండు సంవత్సరాల పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, దరఖాస్తు వివరాలకు http://bit.ly/1BKNA2Yని చూడండి.

సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. నాకు డిజైనింగ్‌, ఎనాలిసిస్‌ విభాగాల్లో ఆసక్తి ఉంది. ఈ వేసవిలో ఇంటర్న్‌షిప్‌, మినీ ప్రాజెక్టు లైవ్‌గా చేయాలనుకుంటున్నాను. వీటికి కావాల్సిన అర్హతలేమిటి? వీటిని అందించే సంస్థల వివరాలు తెలుపగలరు.

ముందుగా www.google.com/alerts ఉపయోగించి డిజైనింగ్‌, అనాలిసిస్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఇంటర్న్‌షిప్‌ లాంటి కీలక పదాలను ఉపయోగించి గూగుల్‌ అలర్ట్‌లను క్రియేట్‌ చేయండి. తద్వారా మీకు వాటిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఈ-మెయిల్‌ రూపంలో వస్తుంటాయి.
ఇంటర్న్‌షిప్‌ పొందడానికి ప్రత్యేక అర్హత అంటూ ఏమీ లేదు. కానీ మీ సీవీతోపాటు ఒక దరఖాస్తును తయారు చేసకోవాలి. ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించే సంస్థకు తగ్గట్టుగా వారికి మీ అర్హత, అభిరుచులు, ఇంటర్న్‌షిప్‌ ద్వారా మీకు, సంస్థకు ఏవిధంగా లాభదాయకమో వివరిస్తే చాలా ఉత్తమం. internshala.com, letsintern.com, twenty19.comలలో వివిధ సంస్థల ఇంటర్న్‌షిప్‌ అవకాశాల్ని చూసి దరఖాస్తు చేసుకోండి.

సివిల్‌ ఇంజినీరింగ్‌ 2012లో పూర్తి చేశాక ఒక నిర్మాణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. రెగ్యులర్‌ లేదా దూరవిద్య ద్వారా ఎంటెక్‌ చేయాలని ఉంది. మీ సలహా ఇవ్వండి.

కేవలం డిగ్రీల కోసం కాకుండా మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి పైచదువులు చదివితే మంచిది. సివిల్‌ ఇంజినీరింగ్‌లో కెరియర్‌ మొదలుపెట్టి ముందుగా 2-3 సంవత్సరాల అనుభవం తెచ్చుకోండి. నగరంలో పలు నిర్మాణ సంస్థలు సివిల్‌ ఇంజినీర్లను నియమించుకుంటున్నారు. మీకు అనుభవం వచ్చాక దానికి తగిన విధంగా ఉన్నత విద్యకు వెళ్లండి.
ఎంటెక్‌లో కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ని కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, పుణే, జేపీ యూనివర్శిటీ కాలేజీలలో రెగ్యులర్‌ లేదా దూరవిద్యలో చేయవచ్చు.

నేను సివిల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నాను. నాకు సరిపడే మంచి కంపెనీలు ఏవో తెలియజేయండి.

స్త్రీలు కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌లో కెరియర్‌ను మొదలుపెట్టి విజయవంతం అవుతున్నారు. మీరు గ్రీన్‌ కన్‌స్ట్రక్షన్‌, తక్కువ ఖర్చుతో కూడుకున్న హౌసింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. మహీంద్రా లాంటి వాళ్లు హైదరాబాద్‌లో ఇలాంటి ప్రాజెక్టులు మొదలుపెట్టారు. జెర్రీరావు, ఐటీ అనుభవజ్ఞులు ఇలాంటి ప్రాజెక్టులపై http://www.vbhc.com/ దృష్టి పెట్టారు. మీరు డమ్మీవి కాకుండా స్వయంగా నిజమైన ప్రాజెక్టులు చేయండి. http://www.nac.edu.in/ . తద్వారా ఉద్యోగం సంపాదించడం సులభతరం అవుతుంది.

సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. కోర్సు పూర్తయ్యాక ఇదే రంగంలో స్థిరపడాలనుకుంటున్నాను. నాకు బోధన రంగం అంటే ఇష్టం లేదు. కాబట్టి స్ట్రక్టరల్‌ రంగంలో భవిష్యత్‌ కెరియర్‌ అవకాశాలు ఎలాంటివి ఉంటాయో చెప్పండి. ఏవైనా కోర్సులు చేయాలా?

మీలాగా ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తవకముందే కెరియర్‌ గురించి ఆలోచించేవాళ్ళు తక్కువమందే. ఇందుకు మీకు అభినందనలు. మీరు AutoCAD, 2D, 3D, STADDలో నైపుణ్యాలు వృద్ధి చేసుకోండి. స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ గురించి http://www.sefindia.orgలో వివరాలు పొందవచ్చు. గూగుల్‌ అలర్ట్స్‌, ఇలాంటి ఫోరాల నుంచి కూడా ఎప్పటికప్పుడు మీ పరిజ్ఞానాన్ని అప్‌డేట్‌ చేసుకుంటూవుండండి. సోషల్‌ మీడియా ద్వారా మీ తెలివితేటలను పంచుతూ, అనుభవజ్ఞులను అడిగి తెలుసుకుంటూ ఉండండి. దీనివల్ల ఇంజినీరింగ్‌ పూర్తిచేయకముందే ఎక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో మీకే తెలుస్తుంది.