నేను ఇంజినీరింగ్‌ 2012లో పూర్తిచేశాను. ఇంటర్వ్యూ సరిగా ఎదుర్కోలేకపోతున్నాను. మొదట్లో అడిగే 'మీ గురించి చెప్పండి (Tell us about yourself/ brief us about yourself) అనే ప్రశ్నకు ఎలా సమాధానం ఇవ్వాలో వివరించండి?.

సాధారణంగా చాలామంది ఇంటర్వ్యూలో ఇటువంటి ప్రశ్నకు జవాబు ఇవ్వడంలో సతమతమవుతుంటారు. ఇక మీ జవాబును మీ పేరు, చదువు, మీకున్న నైపుణ్యాలతో మొదలుపెట్టి ఆ ఉద్యోగానికి మీరు ఎలా సరైన/ తగినవారో వివరించండి. అంతేకానీ అవసరం లేని మీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి ఈ సదవకాశాన్ని వృథా చేసుకోకండి. ఇలాంటివాటికి మీరు ముందుగా ఆ ఉద్యోగానికి కావాల్సిన చదువు, నైపుణ్యాలు, ఇతర వివరాలను ఉద్యోగ ప్రకటన/ వెబ్‌సైటు, కంపెనీలో పనిచేసే ఉద్యోగి/ హెచ్‌ఆర్‌/ టెక్నికల్‌ మేనేజర్‌ల నుంచి తెలుసుకోండి. దీనికి ఇంటర్వ్యూ సమయం కంటే ముందు వెళ్లి వివరాలు సేకరించడం ఎంతో మంచిది. ఎలాంటి కంపెనీవారయినా ముఖ్యంగా మీరు ఆ ఉద్యోగాన్ని సరిగా నిర్వహిస్తారో లేదో అనే విషయాన్ని పరిశీలిస్తారని గ్రహించండి. మీరు facebook.com/passion4careerని లైక్‌ చేసి, అనుసరిస్తూ మరిన్ని కెరియర్‌కు సంబంధించిన చిట్కాలను పొందండి.

2010లో బీటెక్‌ పూర్తిచేశాను. ఇప్పటివరకు మూడు కంపెనీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాను. దూరవిద్యలో ఎంబీఏ (ఫైనాన్సు) కూడా చదువుతున్నాను. బ్యాంకు ఉద్యోగం సాధించాలనుంది. కానీ పనివేళల రీత్యా కోచింగ్‌ తీసుకోవడం కుదరదు. ఉద్యోగం మానేయలేను. సలహా ఇవ్వండి.

ఇప్పుడు మీరు ఉద్యోగం ఒక కంపెనీలో చేస్తున్నారా లేక మూడు కంపెనీల్లోనూ చేస్తున్నారా? కంపెనీ నుంచి ఇంటికి రావడానికి ఎంతసేపు పడుతుంది? కోచింగ్‌ తీసుకోవడం వీలుకాకపోతే ఇంటి దగ్గరే అభ్యాసం చేయవచ్చు. చేయాల్సిందల్లా ఉన్న సమయాన్ని వృథా చేయకుండా చూసుకోవడమే. రోజుకు కనీసం రెండు గంటలు కేటాయించగలిగితే ఎటువంటి పరీక్షనైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.
* ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ పుస్తకాలను సంపాదించుకోండి.
* ఆన్‌లైన్‌లో దొరికే మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయవచ్చు.

బీటెక్‌ 2012లో పూర్తి చేశాను. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నచ్చిన వ్యాపారం చేయాలని ఉంది. దీనికి సంబంధించిన సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తారని తెలిసింది. వివరాలు తెలుపగలరు.

ఈ మధ్యకాలంలో వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు meetup.com లాంటి సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా హైదరాబాద్‌లో వివిధ రకాల సమావేశాల నుంచి ఎంతో లాభపడుతున్నారు. ఉదాహరణకు ఈ కింది గ్రూపులు చూసి ఉచితంగా జాయిన్‌ అవొచ్చు. http://hyderabad.startupweekend.org/, www.meetup.com/passion-and-life-PAL, www.meetup.com/urclubhyd/, www.meetup.com/Hyderabad-Entrepreneurs-Society/ వీటిలో కొన్ని ఉచితంగా, మిగతావి కొద్దిపాటి ఖర్చుతో కూడుకున్నవి. ఇటువంటి సమావేశాల ద్వారా మీరు రకరకాల వ్యాపార అనుభవజ్ఞులను కలిసి వారి అభిప్రాయాలను సేకరించడం, మీకు పెట్టుబడిలో సహకరించేవారి గురించి తెలుసుకోవడం/ ఇతరత్రా విషయాల్లో సహకరించేవారిని కలిసే సదవకాశం ఉంటుంది.

బీటెక్‌ (2013) చేసి, 3 నెలలు ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ ట్రైనింగు కోర్సు పూర్తిచేశాను. ఈ రంగంలో విభాగాలు, ఉద్యోగావకాశాలను తెలియజేయగలరు.

ముందుగా ఆటోమేషన్‌ రంగంలో అసెంబ్లీ- హాండ్లింగ్‌ సిస్టమ్స్‌, లీనియర్‌ పొజిషనింగ్‌ సిస్టమ్స్‌, రోబోటిక్స్‌, ఇండస్ట్రియల్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, పీఎల్‌సీ, ఎస్‌సీఏడీఏ, సెన్సార్స్‌ అండ్‌ ఆక్చువేటర్స్‌, ఇండస్ట్రియల్‌ పీసీస్‌, కమ్యూనికేషన్‌, నెట్‌వర్క్స్‌-ఫీల్డ్‌ బస్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, మెజరింగ్‌ అండ్‌ టెస్ట్‌ సిస్టమ్స్‌, ఇండస్ట్రియల్‌ ఆటోమేటిక్‌ డేటా కాప్చరింగ్‌ అండ్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్స్‌, ఆటోమేషన్‌ సర్వీసెస్‌, సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ సిస్టమ్స్‌లలో మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకోండి.
ఆటోమోటివ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మాన్యుఫాక్చరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ పాకేజింగ్‌, కాపిటల్‌ గూడ్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌, మైనింగ్‌, స్టీల్‌ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయి. వీటికి సంబంధించిన సంస్థల వివరాలకు www.linkedin.com/directory/companies-industrial-automation వెబ్‌సైట్లను చూడండి.

ఎంఎంఈ బ్రాంచి వాళ్లు ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ రాయడానికి వీలుందా? ఒకవేళ ఉంటే ఎలా అవుతుందో తెలియజేయండి.

యూపీఎస్‌సీ ఏటా నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఏ ఇంజినీరింగ్‌ చదివినవారైనా అర్హులే. కాబట్టి మీరు అర్హులు. కాకపోతే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలు సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానికల్‌ ఇంకా ఎలక్ట్రానిక్స్‌ బ్రాంచిలలో మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి మీరు వీటిలో ఏదేని ఒక బ్రాంచితో ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ రాసుకోవచ్చు. మీకు మెకానికల్‌ ఐతే కొంత సులభంగా ఉండవచ్చు.

బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న సగటు విద్యార్థిని. ప్రభుత్వ ఉద్యోగంలోనే స్థిరపడాలనుంది. కష్టపడితే ఏదైనా వస్తుందనే నమ్మకం ఉంది. బీటెక్‌ అయిపోయేలోపు ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాను. ఏ రంగమైనా సరే. దయచేసి నాకు గల అవకాశాలను తెలుపగలరు.

ఎవరైనా చదువు పూర్తికాగానే ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు మనం కావాలనుకున్నపుడు దొరకవు. ఏ ఉద్యోగాలూ మన అధీనంలో ఉండవు. ఖాళీలను బట్టి ఉద్యోగ ప్రకటనలు వెలువడుతుంటాయి. దాదాపు 25 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగానికి గేట్‌లో పాస్‌ అవడం తప్పనిసరి. మీకు ఇస్రో, డీఆర్‌డీవో, బ్యాంక్‌ ప్రొబేషనరీ ఆఫీసర్ల ఉద్యోగాలకు అర్హత ఉంది. కానీ బీటెక్‌లో 60% పైగా వచ్చుండాలి. ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారకుండా జాగ్రత్తపడాలి. లక్ష్యాన్ని సాధించాలంటే నిర్దిష్టమైన ప్రణాళిక, దాని నిరంతర అమలూ ముఖ్యం.

నేను శస్త్ర విశ్వవిద్యాలయం, తంజావూరు నుంచి 2011లో బీటెక్‌ చేశాను. కుటుంబ కారణాల వల్ల ఏడాదిన్నరపాటు ఇంటివద్దనే ఉన్నాను. గత నవంబర్‌ నెలలో ఎన్‌ఐఐటీ జావా టెక్నాలజీలో కోర్సు పూర్తిచేశాను. ఇప్పుడు ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళదామనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా?

మీ నిర్ణయం సరైనదే. మీరు అమెరికా వెళ్లవచ్చు. జావా టెక్నాలజీలో కోర్సు పూర్తి చేశానన్నారు. సన్‌ మైక్రో సిస్టమ్స్‌ నుంచి సర్టిఫికేషన్‌ చేస్తే మీకు ఆర్థిక సహాయం ఎక్కువగా లభించే అవకాశముంటుంది.

బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలి?

ముందుగా మీకున్న నైపుణ్యం బట్టి ఇష్టమైన ఏదో ఒక రంగాన్ని ఎంచుకోండి. చివరి సంవత్సరంలో కాకుండా దానిపై ఇప్పటినుంచే దృష్టి పెడుతూ మీ పరిజ్ఞానం మెరుగుపరుచుకోండి. ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టు వర్కులు సరైన గైడ్‌ ద్వారా స్వయంగా చేయండి. బ్యాక్‌లాగ్స్‌ లేకుండా అన్ని సబ్జెక్టులూ పూర్తిచేసుకుంటూ మార్కుల శాతం పెంచుకోండి.
బహుళజాతి సంస్థల రాతపరీక్ష, ఆప్టిట్యూడ్‌ పరీక్ష, బృందచర్చ, టెక్నికల్‌, హెచ్‌.ఆర్‌ లాంటి రౌండ్సులో పాస్‌ కావాల్సి ఉంది. లింకెడిన్‌ లాంటి సోషల్‌ మీడియా ద్వారా ఇంజినీరింగ్‌ అయిన వెంటనే బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేసేవాళ్ల నుంచి కూడా అనుభవాలను తెలుసుకోవచ్చు. హెచ్‌.ఆర్‌. అని మాత్రమే కాకుండా ఎవరు Hiring Manager అన్నది సోషల్‌మీడియా సైట్స్‌ ద్వారా తెలుసుకుని వారినే సంప్రదించడం మంచిది. ఏదేమైనా ముందుగా రెండు మూడేళ్లు చిన్న కంపెనీలో చేసి పెద్దవాటిలో చేసినట్లయితే నైపుణ్యం మెరుగుపరుచుకుని కెరియర్‌ ఎదుగుదలకు ఉపయోగపడేలా మలుచుకోవచ్చు.

బి.టెక్‌ పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగంకోసం వెదుకుతున్నాను. ఇంకా నాకు దీనిలో సందేహంగానే ఉంది. మీ సలహా ఇవ్వండి.

మీకు నచ్చిన సబ్జెక్టు ఏదో ఒకటి ఎంచుకుని ముందుకు సాగండి. http://goo.gl/DowoH(హిందీ), http://goo.gl/yda5B (ఇంగ్లిష్‌) వీడియో చూస్తే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేలా తోడ్పడుతుంది. I have a Dream by Rashmi Bansal పుస్తకం చదవండి. దీనిలో ఎంతోమంది తమ నైపుణ్యం, అభీష్టాలకు తగ్గట్టుగా కెరియర్‌ను ఎలా మొదలుపెట్టారో తెలుస్తుంది. ప్రతివ్యక్తిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించి దాంట్లోనే కెరియర్‌ను మొదలుపెట్టాలి. మీకు సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఇష్టం ఉంటే C, C++, C# లో పరిజ్ఞానం పెంపొందించుకోండి. బ్లాగు ద్వారా నైపుణ్యాలు వ్యక్తపరుస్తూ రిక్రూటర్లను ఆకర్షించవచ్చు.

నేను బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థిని. మా సీనియర్లు, ఎందరో విద్యార్థులు పలు రకాల సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకుంటున్నారు. కానీ నేను అలా కాకుండా కోర్‌ ఇంజినీరింగ్‌ పైనే దృష్టి పెట్టాలని ఉంది. కోర్‌లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుపండి.

మీరు అనుకుంటున్నదే చేయండి. ఎవరో ఏదో కోర్సుకు వెళ్లారని కాకుండా మీకు నచ్చిన రంగంవైపు దృష్టి పెట్టండి. ముందుగా ఏదో ఒకదానిలో పరిపూర్ణత సాధించడం ముఖ్యం. మీరు ఇంటర్న్‌షిప్‌ లేదా ప్రాజెక్టులు BHEL, Power Grid, NTPC లేదా SAIL లాంటివాటిలో చేయండి. ప్రాజెక్టు మేనేజర్‌లతో కలిసి మీకున్న సందేహాలను తీర్చుకుంటూ ఎప్పటికప్పుడు తాజా విశేషాలు (అప్డేట్‌) గ్రహించవచ్చు. పవర్‌- సోలార్‌ ఎనర్జీ, కంప్యూటర్స్‌, ఏరోస్పేస్‌, ఆప్టికల్‌ ఇంజినీరింగ్‌, Manufacturing , టెలికమ్యూనికేషన్స్‌ రంగంలో భవిష్యత్తు ఉండనే ఉంది.

మా అబ్బాయి ఇంజినీరింగ్‌ ఈఈఈ మూడో సంవత్సరంలో ఉన్నాడు. వాళ్ళ కాలేజీవాళ్ళు 40 రోజులు ఇంటర్న్‌షిప్‌ కని విదేశాలకు వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు. యు.ఎస్‌.లో దగ్గరి బంధువులున్నారు. పంపించడం మంచిదా కాదా సూచించండి?

ఒకే ప్రదేశంలో ఉండటం కంటే వివిధ ప్రదేశాలు తిరగటం వల్ల చాలా పరిజ్ఞానం పెరుగుతుంది. ఇలా ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టుల గురించి విదేశాలకు వెళ్ళటం మంచిదే. కానీ పంపించేముందు ఏ కంపెనీలో ఎలాంటి ఇంటర్న్‌షిప్‌కి అవకాశముందో పూర్తి వివరాలు తెలుసుకుని పంపండి.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ 2008లో పూర్తిచేసిన తర్వాత నాకు పెళ్ళి అయింది. ఇక ఇపుడు కెరియర్‌పై దృష్టి పెట్టదలిచాను. ఎంటెక్‌ లేదా ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. కమ్యూనికేషన్‌ ఇంకా మెరుగుపరుచుకోవాల్సివుంది. నా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఎదగడానికి సలహా ఇవ్వగలరు

కేవలం ఎంటెక్‌ లేదా ఎంబీఏ లాంటివి కాకుండా పరిశోధన (రిసర్చ్‌) కి సంబంధించిన పీహెచ్‌డీతో పైచదువుల కోసం ప్రయత్నించండి. ఇంట్లో ఉంటూ ఇంటర్న్‌షిప్‌ చేసుకోవటానికి Internshalaలాంటివాళ్ళు అవకాశం కల్పిస్తారు. http://goo.gl/uftMHలింకు చూసి మీకు నచ్చిన ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం చేస్తూ నైపుణ్యాలు మెరుగుపర్చుకోండి. ఆ లోటును అధిగమించిన తర్వాత ఫుల్‌టైం జాబ్‌ ఎక్కడ, ఎలాంటివి ఉన్నాయో తెలుసుకుని చేరవచ్చు. మొదట మీకు ఏ రంగం ఇష్టమో గ్రహించి దానిపై దృష్టి పెట్టండి. రోజూ బిజినెస్‌ మ్యాగజీన్స్‌ను చదువుతూ, తెలుగు టీవీ ఛానల్సు మాత్రమే కాకుండా ఇంగ్లిష్‌, ఇతర చానళ్ళు కూడా చూసి, ఆ భాషలు మాట్లాడే తీరును గమనిస్తుండండి. స్వయంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. సాధన చేయకుండా ఏ స్పోకెన్‌ ఇంగ్లిష్‌ ఇన్‌స్టిట్యూట్‌లోనో జాయినంతమాత్రానే కమ్యూనికేషన్‌ బాగుపడదని గుర్తించండి.

2008లో ఇంజినీరింగ్‌ (ఈఈఈ) చేసి ఇపుడు ప్రభుత్వరంగ బ్యాంకులో మూడు సంవత్సరాలనుంచి పనిచేస్తున్నాను. ఇది మానేసి నా కెరియర్‌లో ఎదుగుదలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఎంబీఏ ప్రోగ్రాం చేసి, గ్లోబల్‌ కెరియర్‌ అవకాశాలను పొందగలనా?

మీకు నచ్చనిది చేయకుండా కెరియర్లో ఎదుగుదలకు మీరు నిశ్చయించుకోవడం అభినందనీయం. ఎందరో ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇవన్నీ గుర్తించలేక బ్యాంకు ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. కేవలం డిగ్రీ సర్టిఫికేట్'ను నమ్ముకోవద్దు. మీకు ఇష్టమైన రంగంపై దృష్టి పెట్టండి. 'మీకు ఏది ఉత్తమం' అనేది నిర్దిష్టంగా చెప్పాలంటే మీ పూర్తి వివరాలు తెలిస్తే గానీ సూచించలేము.