ఇంజినీరింగ్‌ (ఈఈఈ)ను 2012లో చదివాను. ప్రస్తుతం ఆర్‌బీఐలో పనిచేస్తున్నాను. నాకు లెక్కలంటే ఆసక్తి. గణితశాస్త్రంలో ఉన్నతవిద్య చదవాలనుంది. దూరవిద్య ద్వారా అందుబాటులో ఉన్న కోర్సులేంటి? - పవన్‌ కుమార్‌

సాధారణంగా గణితశాస్త్రంలో ఉన్నతవిద్య అభ్యసించాలంటే డిగ్రీ స్థాయిలో గణితం ఒక సబ్జెక్టుగా మూడు సంవత్సరాల పాటు చదివి ఉండాలి. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు మరి కొన్ని విశ్వవిద్యాలయాలు పీజీ డిప్లొమా ఇన్‌ మాథమాటిక్స్‌ కోర్సును ఏ డిగ్రీ చదివిన వారికైనా అందిస్తున్నాయి. మీకు కంప్యూటింగ్‌ రంగంలో ఆసక్తి ఉంటే కంప్యూటరు కోర్సులు గానీ, స్టాటిస్టిక్స్‌లో కొంత ప్రవేశం ఉంటే డాటా సైన్స్‌ లాంటి కోర్సులు గానీ చదువుకొనే అవకాశం ఉంది.

డిప్లొమా, బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలేంటి? ఇంకా ఏవైనా అదనపు కోర్సులు చేస్తే మేలా? - పార్థసారథి

డిప్లొమా చేసి ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. డిప్లొమా అర్హతతో మీరు రైల్వే శాఖలో టెక్నికల్‌ అసిస్టెంట్‌, లోకో పైలెట్‌ లాంటి ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన భారీ పరిశ్రమల్లో కూడా టెక్నీషియన్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ అర్హతతో గేట్‌ స్కోరు ద్వారా ప్రభుత్వరంగ సంస్థల్లో టెక్నికల్‌ ట్రైనీ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకొని, ఆఫీసర్‌ క్యాడర్‌ ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.
ఒకవేళ మీకు టెక్నికల్‌ వైపు వెళ్లాలని లేకపోతే, ఇంజినీరింగ్‌ అర్హతతో బ్యాంకు పోస్టులకూ, ఇతర ప్రభుత్వశాఖల పోస్టులకూ ప్రకటనలు పడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ప్రైవేటు రంగ ఉద్యోగాల విషయానికి వస్తే- మెలకువలు, సృజనాత్మకత ఉన్న ఇంజినీర్లు ఎప్పుడూ డిమాండ్‌లోనే ఉంటారు. ఇప్పుడు మనదేశంలో పెద్ద ప్రైవేటు కంపెనీలతో పాటు ఎన్నో స్టార్ట్‌ అప్‌లు ప్రారంభమయ్యాయి. అందుకని ప్రైవేటు రంగంలో ఇంజినీర్‌లకు ఎప్పుడూ గిరాకీనే. ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ కోర్సులను నేర్చుకొని సాఫ్టువేర్‌ రంగంలోకి కూడా వెళ్లొచ్చు. డేటా అనలిటిక్స్‌ లాంటి కోర్సులను కూడా చదివి ఆ రంగంలో కూడా ప్రయత్నించవచ్చు. ఇంకా చదువులను కొనసాగించాలని ఉంటే, టెక్నికల్‌ రంగంలో అయితే ఎం.టెక్‌ లేదా ఎంసీఏ ఎంచుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించిన విషయాలపై అవగాహన తెచ్చుకొని మేనేజ్మెంట్‌ నైపుణ్యాలూ పెంపొందించుకోవాలని అనుకునేవారు ఎంబీఏను ఎంచుకోవచ్చు. - ప్రొ. బి.రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

* బీటెక్‌ (ఈఈఈ) చివరి సంవత్సరం చదువుతున్నా. ఎంటెక్‌లో ఏది ఎంచుకుంటే మేలు? పీజీ చేయడానికి గేట్‌ కాకుండా ఉన్న మార్గాలేమిటి? - వి.వై. స్వామి

ఎంటెక్‌ (ఈఈఈ) కోర్సుకు సంబంధించినంత వరకూ విద్యార్థులకు మనదేశంలో తక్కువ ఆప్షన్లు ఉన్నాయి. పవర్‌ సిస్టమ్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డ్రైవ్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, వీఎల్‌ఎస్‌ఎల్‌ అందుబాటులో ఉన్నాయి. మీ అభిరుచిని బట్టి గ్రూపును ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఎంటెక్‌ అనేది రిసెర్చ్‌ ఓరియెంటెడ్‌ కోర్సు. అందువల్ల ఆ కోర్సు మొత్తం మీరు పొందే పురోగతిపై ఆధారపడివుంటుంది. ఉద్యోగానికి కూడా మీరు చేసే ఎంటెక్‌ ప్రాజెక్టును ప్రాతిపదికగా తీసుకుంటారు. గేట్‌ ద్వారా కాకుండా రాష్ట్ర పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో పీజీఈసెట్‌ ర్యాంకు ద్వారా పీజీలో చేరవచ్చు.

* బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉంది. కోర్సును అందించే ప్రభుత్వ సంస్థల వివరాలను తెలియజేయండి. - రాములు గంగాల

వెయ్యి పదాల కంటే ఒక చిత్రం ఎక్కువ విషయాన్ని చేరవేస్తుంది. ఫొటోగ్రఫీ చేయాలనుకునేవారికి వైవిధ్యంగా చిత్రాన్ని చూడగలిగే నేర్పు, సృజనాత్మకత, వృత్తిపట్ల అంకిత భావం, దీక్ష వంటి లక్షణాలను అవసరం. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా- పుణె, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌- కోల్‌కతా, కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌- దిల్లీ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ- హైదరాబాద్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌- అహ్మదాబాద్‌ వారు ఫొటోగ్రఫీలో బ్యాచిలర్స్‌ ఇన్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (ఫొటోగ్రఫీ)ను అందిస్తున్నారు. సొంత ప్రవేశపరీక్షల ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తారు. ముందుగా ఫొటోగ్రఫీ మీ కెరియరా, ఆసక్తా, హాబీనా అనేది నిర్ణయించుకుని ముందుకు అడుగు వేయండి. ఈ రంగంలో శిక్షణ పొందితే ఫిల్మ్‌, మీడియా, మోడలింగ్‌ ఫొటోగ్రఫీ, టీవీ, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా మంచి అవకాశాలు లభిస్తాయి.

* ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాను. కోర్సు పూర్తి చేసుకున్నాక నాకున్న ఉద్యోగావకాశాలేవి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? - కార్తీక్‌ కర్రే

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా చదివినవారికి ప్రైవేటు, ప్రభుత్వ రంగాలతోపాటు కంప్యూటర్‌ రంగంలోనూ విస్తృత అవకాశాలున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ తయారీ, సరఫరా సంస్థల్లో వివిధ ఉద్యోగాలు, ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌టీపీసీ, సింగరేణి కాలరీస్‌, అణు, ఇంధన శాఖల్లోనూ ఉద్యోగావకాశాలున్నాయి. ప్రైవేటు ఎలక్ట్రికల్‌ సంస్థలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు తయారు చేసే సంస్థల్లోనూ, అపార్ట్‌మెంట్‌లను నిర్మించే పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలు, మునిసిపాలిటీలు, సిమెంట్‌, అల్యూమినియం కర్మాగారాలు, ప్రైవేటు విద్యుత్‌ ఉత్పాదక సంస్థల్లోనూ ఉపాధి అవకాశాలుంటాయి. విద్యుత్‌ రంగ పరికరాల తయారీ సంస్థల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఉద్యోగ ప్రకటనలను గమనిస్తూ దరఖాస్తు విధానం, ఎంపిక, పరీక్ష, ఇంటర్వ్యూ విధివిధానాలను తెలుసుకుని, అవగాహన ఏర్పరచుకుంటే మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందవచ్చు.

బీటెక్‌ (ఈఈఈ) 2015లో పూర్తిచేశాను. గత రెండు సంవత్సరాలుగా పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఎంఏ ఇంగ్లిష్‌ దూరవిద్య ద్వారా చేయాలనుంది. నాకు అర్హత ఉందా? అందించే కళాశాలల వివరాలను తెలపండి.

దూరవిద్యలో ఎంఏ (ఇంగ్లిష్‌) చేయాలనుకునేవారు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ (3 లేదా 4 సంవత్సరాలు) పూర్తిచేసి ఉండాలి. మీది బీటెక్‌ పూర్తైంది కాబట్టి, మీకు అర్హత ఉన్నట్టే. మన తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, ఇఫ్లూ, గీతం విశ్వవిద్యాలయం వారు తమ అనుబంధ స్టడీసెంటర్ల ద్వారా ఎంఏ (ఇంగ్లిష్‌)ను దూరవిద్యలో అందిస్తున్నారు. మీ వీలును బట్టి మీకు సరైనదాన్ని ఎంచుకోండి. అలాగే సమయపాలన, ఆత్మవిశ్వాసం, సరైన సన్నద్ధతతో పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించండి.

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. కోర్‌ విభాగంలోని షార్ట్‌టైం కోర్సుల వివరాలు తెలపండి. ఉద్యోగాధారిత కోర్సులు, శిక్షణ సంస్థల వివరాలనూ తెలపండి.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌తో ఉద్యోగం సంపాదించడం అంత కష్టమేమీ కాదు. మొదట మీరు ఏ రంగంలోకి వెళ్లదలచుకున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ రెండు రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు చేయడానికి మీరు అర్హులు. కాబట్టి మీకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
* కోర్‌ విభాగంలో ఆసక్తి ఉంటే పవర్‌ సిస్టమ్స్‌, సోలార్‌ పానెల్స్‌ల తాజా అనువర్తనాలు వంటి వాటికి సంబంధించిన కోర్సులు చేయవచ్చు.
* ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో అయితే ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వెరిలార్జ్‌ స్కేల్‌ ఇంటిగ్రేషన్‌ (వీఎల్‌ఎస్‌ఐ) లాంటి కోర్సులు చదవడానికి కూడా అవకాశముంది. వీటితోపాటు ఉద్యోగాధారిత స్వల్పకాలిక కోర్సులు- రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌, నానో టెక్నాలజీ వర్క్‌షాప్‌, పవర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్‌, లీనియర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్‌, అడ్వాన్స్‌డ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ సర్క్యూట్‌ అనాలిసిస్‌, స్విచ్‌గేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ మొదలైన కోర్సులు చదవవచ్చు.
ఇతర డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ కోర్సులను ఎక్కువగా ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. అతి తక్కువ ప్రభుత్వ విద్యాసంస్థలు స్వల్పకాలిక ఉద్యోగాధారిత కోర్సులను అందిస్తున్నాయి.

మా బాబు బీటెక్‌ (ఈఈఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో సంవత్సరంలో క్యాడ్‌ శిక్షణ నిమిత్తం బెంగళూరు/ హైదరాబాద్‌ పంపుతామన్నారు. క్యాడ్‌ అంటే ఏమిటి? అది ఎక్కడ చేస్తే మంచిది? ఇవి కాకుండా ఇంకా ఏమైనా శిక్షణలుంటాయా?

క్యాడ్‌ అంటే కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌. డిజైన్‌లను తయారు చేయడంలో, మార్చడంలో, విశ్లేషించడంలో కంప్యూటర్‌ సిస్టమ్స్‌ను ఉపయోగించడాన్ని కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌ అంటారు. దీనివల్ల డిజైనర్ల ఉత్పాదకత పెరిగి డిజైన్‌లో నాణ్యత కూడా పెరుగుతుంది. ప్రస్తుతమున్న తయారీ రంగంలో క్యాడ్‌కు చాలా ప్రాముఖ్యముంది. వీటిని చాలా ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. ఏ సంస్థలో చేసినప్పటికీ మెలకువలు నేర్చుకోవడం ముఖ్యం.
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ), హైదరాబాద్‌, విజయవాడల్లో క్యాడ్‌లో సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా మ్యాట్‌ లాబ్‌, జెనెసిస్‌, మైక్రోక్యాప్‌, ఎల్‌టీ స్పైస్‌ లాంటి స్పైస్‌ సిమ్యులేషన్‌ టూల్స్‌, పీసీఏడీ, ఆల్టియమ్‌ లాంటి టూల్స్‌, ఆల్టిరాస్‌ క్వార్టస్‌, క్జిలింక్స్‌ ఐఎస్‌ఈ డిజైన్‌ సూట్‌ మొదలైన టెక్నికల్‌ కోర్సులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది.

2014లో బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. ఐటీ రంగంలో ఆసక్తి ఉంది. ఏ కోర్సులు చదివితే మేలు?.

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేసిన మీరు ఐటీ రంగంలోకి వెళ్లాలంటే ఎంటెక్‌ కంప్యూటర్‌సైన్స్‌/ ఎంటెక్‌- ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎంఎస్‌సీ లాంటి రెగ్యులర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు చేయవచ్చు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు/ సంస్థలు, డీమ్డ్‌/ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కళాశాలల్లో మీరు ఈ కోర్సును చదవవచ్చు.
పీజీ కాకుండా కంప్యూటర్‌కు సంబంధించిన కోర్సులు చేయాలంటే వెబ్‌ డిజైనింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌, హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ కోర్సులు, సాఫ్ట్‌వేర్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ కోర్సులు, సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన కోర్సులు, జావా, డాట్‌ నెట్‌, టెస్టింగ్‌ టూల్స్‌, ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్సింగ్‌ ప్లానింగ్‌)కి సంబంధించిన కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఐటీలో కూడా మీకు ఆసక్తి ఉన్న విభాగంలో, ప్రస్తుతం ఉన్న ఉద్యోగావకాశాలను బట్టి తగిన కోర్సును ఎంచుకుంటే మంచిది.

బీటెక్‌ (ఈఈఈ) 2012లో పూర్తిచేశాను. ఎంబీఏ/ ఎంటెక్‌ దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. ఏది మేలు? విశ్వవిద్యాలయాల వివరాలూ తెలపండి.

మేనేజ్‌మెంట్‌/ వ్యాపారం వైపు వెళ్లాలనుకుంటే దానికి ముందు వ్యాపార లావాదేవీలపై స్పష్టమైన అవగాహన ఉండాల్సిందే. ఎంబీఏ చేసి ఇంటర్న్‌షిప్‌లు చేయడం వల్ల తగిన నైపుణ్యాలు సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఇంజినీరింగ్‌లోని కోర్‌ సబ్జెక్టులోనే కెరియర్‌ ఆరంభించాలనుకుంటే నచ్చిన సబ్జెక్టుకు తగ్గ ఎంటెక్‌ కోర్సునే చేయండి. ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగంలో చేరాక కొద్దిపాటి అనుభవం వచ్చాక పై చదువులకు వెళ్లడం ఉత్తమం. అమిటీ విశ్వవిద్యాలయం (http://bit.ly/1nMpCgw), సిక్కిం మణిపాల్‌ విశ్వవిద్యాలయం (http://bit.ly/UbHUf9), గీతం విశ్వవిద్యాలయం (www.gitam.edu/CDL/images/mba_general.pdf), సింబయాసిస్‌ సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌- పీజీడీబీఎం (http://bit.ly/1mjwpJG), ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (http://bit.ly/1jAv2eJ), ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ (www.icfaiuniversity.i/dlp.htmnl), భారతి విద్యాపీఠ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ (http://bit.ly/UbKOki) వారు ఎంబీఏ దూరవిద్య కోర్సులను అందిస్తున్నారు. ఆయా వెబ్‌సైట్లలో పొందుపరచిన వివరాలను బట్టి నచ్చిన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోండి.
ఎంటెక్‌ కోసం ఏఐసీటీఈ/ యూజీసీ వారి గుర్తింపు లేదు కాబట్టి దూరవిద్యకు దూరంగా ఉండండి. రెగ్యులర్‌ విధానంలో ఎంటెక్‌ చేయాలనుకుంటే గేట్‌ (http://gate.iitk.ac.in/GATE2015/)/ పీజీఈసీఈటీ (www.appgecet.org/) ద్వారా ఉత్తీర్ణత సాధించండి.

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. మనస్తత్వశాస్త్రం (సైకాలజీ) చదవాలనుంది. అందించే సంస్థలు, అర్హత వివరాలు తెలుపగలరు.

మీరు డిగ్రీ/ అండర్‌ గ్రాడ్యుయేట్‌లో మనస్తత్వశాస్త్రానికి సంబంధించిన సబ్జెక్టు చదవలేదు కాబట్టి మాస్టర్స్‌ ఇన్‌ సైకాలజీకి అర్హులు కారు. కాకపోతే మీరు 10+2 అర్హతతో డిగ్రీ కోర్సు/ సైకాలజీ / కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఇతర షార్ట్‌ టర్మ్‌/ డిప్లొమా కోర్సులు చేయవచ్చు. మరిన్ని వివరాలకు http://bit.ly/1sFKT09, http://bit.ly/1C6Z2W8, http://bit.ly/1yqGTzYను చూడండి. ఆన్‌లైన్‌ కోర్సులకు ఈ వెబ్‌సైట్‌ http://bit.ly/1IGKNcw, http://bit.ly/1ubNTN5ని చూడండి. ముందుగా ఈ కింద తెలిపినవాటిలో మీకు నచ్చిన అంశం ఏంటో తెలుసుకోండి. అప్త్లెడ్‌ సైకాలజీ, క్లినికల్‌, కాగ్నిటివ్‌, కౌన్సెలింగ్‌, క్రిమినల్‌/ లీగల్‌, డెవలప్‌మెంటల్‌, ఎడ్యుకేషనల్‌, ఎక్స్‌పరిమెంటల్‌, ఇండస్ట్రియల్‌/ ఆర్గనైజేషనల్‌, న్యూరో, రీసెర్చ్‌, సోషల్‌ సైకాలజీలు.

2010లో బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేసి, ఉద్యోగం చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేయాలనుంది. ఏ కోర్సులు చేస్తే ఉపయోగకరం?

బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, రిటైల్‌, మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలు, రక్షణ, ఏరోనాటిక్స్‌, రైల్వే, ఈ-కామర్స్‌/ ఆన్‌లైన్‌ షాపింగ్‌- ఇలా పలు రకాల ప్రాడక్ట్‌, సర్వీసు సంస్థల్లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో రకరకాల ఉద్యోగ (అప్లికేషన్‌ డెవలపర్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, సాఫ్ట్‌వేర్‌/ బిజినెస్‌ అనలిస్ట్‌, ఎస్‌ఈఓ స్పెషలిస్ట్‌) అవకాశాలుంటాయి. ముందుగా మీరు ఎలాంటి పరిశ్రమ, ఏ సాఫ్ట్‌వేర్‌ను దేని గురించి ఉపయోగిస్తారనేది తెలుసుకోండి.
వెబ్‌ డిజైనింగ్‌/ డెవలప్‌మెంట్‌ కోసం HTML5, PHP, Javascript, J2EE, ASP.Net; అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీ, సీ++, కోర్‌ జావా, నెట్‌, పైథాన్‌, పీహెచ్‌పీ, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోసం ఒరాకిల్‌, పీఎల్‌, ఎస్‌క్యూఎల్‌, మైఎస్‌క్యూఎల్‌, ఆపరేటింగ్‌ సిస్టం- యూనిక్స్‌/ లైనక్స్‌/ విండోస్‌/ మాక్‌; నెట్వర్కింగ్‌ గురించి సీసీఎన్‌ఏ, సీసీఎన్‌పీ; ఎంబెడెడ్‌/ వీఎల్‌ఎస్‌ఐ; ఎంటర్‌ప్రైజ్‌ అప్లికేషన్స్‌- ఎస్‌ఏపీ/ ఒరాకిల్‌ అప్లికేషన్స్‌; బిగ్‌ డేటా అనలిటిక్స్‌- హడూప్‌; డేటా మైనింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌; అప్లికేషన్‌- మాన్యువల్‌/ ఆటోమేషన్‌.. గురించి ఆన్‌లైన్‌ మెటీరియల్‌, బుక్‌, ఫోరమ్స్‌, ఇవెంట్స్‌, ఇంటర్న్‌షిప్‌, టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ల ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మీ అభీష్టాలు, సామర్థ్యానికి తగిన కోర్సు ఎంచుకోండి.

బీఈ (ఈఈఈ) చేసి, పవర్‌ ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌లో ఎంటెక్‌ చేస్తున్నాను. ఏపీ, తెలంగాణల్లో దీనిపై ఇంటర్న్‌షిప్‌ అందించే సంస్థల వివరాలు తెలుపగలరు?

ఈ కింది వాటిలో మీకు నచ్చిన సంస్థలను ఎంచుకుని ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోండి. ALSTOM, NTPC, NHPC, PGCL, SUZLON,టాటా పవర్‌, రిలయన్స్‌ పవర్‌, లాంకో వారు ఇంటర్న్‌షిప్‌ సదుపాయం కల్పిస్తున్నామని వారి వెబ్‌సైట్లలో తెలియపరచకపోయినా వారిని నేరుగా/ సరైన రిఫరెన్సులు ఉపయోగించి సంప్రదించండి. మీరు ఇంటర్న్‌షిప్‌ వారి కంపెనీల్లో చేయడం వల్ల వారి ప్రస్తుత, భవిష్యత్తులో వచ్చే సమస్యలపై అధ్యయనం చేసి తగిన పరిష్కారం సూచించగలరని వివరించండి. దీనికంటే ముందుగా మీరు ఆయా సంస్థల గురించి తెలుసుకోవాలి. గూగుల్‌ అలర్ట్స్‌తోపాటు వివిధ వ్యాపార పత్రికలను చదువుతూ ఏయే సంస్థలు ఎక్కడెక్కడ వారి వ్యాపారాలను విస్తరిస్తున్నాయో తెలుసుకుని సంప్రదించండి.

బీటెక్‌ (ఈఈఈ) 2010లో పూర్తిచేశాను. ఇప్పుడు ఎంబీఏ ద్వారా చేయాలనుకుంటున్నాను. మీ సూచన...?

చదువుతోపాటు నేర్చుకోవడానికి చోటు లేనపుడు ఎలాంటి డిగ్రీ/ పీజీలు చేసినా వృథానే. చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌/ ఇతర డిగ్రీలు చేసినవెంటనే ఎలాంటి ఆలోచన/ స్పష్టత లేకుండానే ఎంబీఏ చేయాలనుకుంటారు. ఎంబీఏ రెగ్యులర్‌ చేసినవాళ్లే ఇంటర్న్‌షిప్‌/ ప్రాజెక్టులకు ఎలాంటి కంపెనీలకు వెళ్లకుండా ఏదో రికార్డు సమర్పిస్తూ ప్రయోగాత్మక పరిజ్ఞానం పొందే సదవకాశాల్ని కోల్పోతున్నారు. ఒక్కోసారి క్వాలిఫికేషన్‌ పెరిగే కొద్దీ ఉద్యోగం సంపాదించడం కష్టతరమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే మీరు పై చదువులకు వెళ్తూ మీ నైపుణ్యాలు పెంచుకోకుండా కేవలం సర్టిఫికెట్లు సంపాదించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పై చదువులకు వెళ్లడం కన్నా నేర్చుకోవడంపైనే దృష్టిపెట్టండి. కొంత అనుభవం వచ్చాక ఎంబీఏ చేెరడం ఉత్తమం.

బీటెక్‌ (ఈఈఈ) చేసి, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌లో శిక్షణ తీసుకున్నాను. ఈ రంగంలో పీఎల్‌సీ ప్రోగ్రామర్‌కు ఉన్న ఉద్యోగావకాశాలేమిటి?

ఈ రోజుల్లో చాలా పరిశ్రమలు వారి యూనిట్లను అవలీలగా నడపడానికి ఆటోమేషన్‌ వైపు సుముఖత చూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోలర్‌ (పీఎల్‌సీ)ని ఫ్యాక్టరీలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, ఆసుపత్రులు, హోటళ్ళు, మిలిటరీ, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, నిర్మాణ రంగాల్లో మెషినరీ కంట్రోల్‌ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆటోమేషన్‌ రంగంలోకి సంబంధించిన సంస్థ వివరాలకు http://linkd.in/1vs1lh8 ను చూడండి. పీఎల్‌సీ ప్రోగ్రామర్‌కు దేశ విదేశాల్లో వివిధ ఉద్యోగావకాశాల గురించి http://linkd.in/1yy1pS6 లింకును చూడండి. పీఎల్‌సీ శిక్షణ వీడియోల కోసం http://bit.ly/1qRUgBZ, http://bit.ly/1wUHRCX ద్వారా ఉచితంగా పొందండి

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. ఎలక్ట్రికల్‌ విభాగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం సంపాదించడానికి చేయాల్సిన కోర్సుల వివరాలు తెలపగలరు.

ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే ముఖ్యంగా ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో యూపీఎస్‌సీ వారు నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ సిలబస్‌ గురించి ఈ వెబ్‌ లింక్‌ http://upsc.gov.in/general/engg.htmను చూడండి. వీటిలో మీకు జనరల్‌ ఎబిలిటీ, జనరల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌తోపాటు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల నుంచి రాతపరీక్షతోపాటు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇతర పీఎస్‌యూల పోస్టులు (ఉదాహరణకు ఎన్‌టీపీసీ: www.ntpccareers.net/et_files/et14_advt.pdf)చూస్తే వారు గేట్‌ పరీక్షలో కనీస అర్హత సాధించినవారిలో ఎంచుకుని బృందచర్చ, మౌఖిక పరీక్షలకు పిలుస్తారు.
సాధారణంగా ప్రతి ఉద్యోగానికి రాత పరీక్ష ఉంటుంది. కాబట్టి మీరు ఎలక్ట్రికల్‌ (కోర్‌) విభాగంతోపాటు జనరల్‌ ఎబిలిటీ, జనరల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ లాంటి విభాగాలకు సంబంధించిన కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎలక్ట్రికల్‌ డిజైన్‌, పీఎల్‌సీ, ఎస్‌సీఏడీఏ, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్‌ లాంటి వాటిలో మీకు నచ్చింది ఎంచుకుని ప్రాలిఫిక్‌ సిస్టమ్స్‌ &టెక్నాలజీస్‌, అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సాందీపనీ స్కూల్‌ ఆఫ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, సీడీఏసీ వంటి సంస్థలు నిర్వహించే కోర్సులు చేయవచ్చు.

ఈఈఈ 2010లో పూర్తిచేశాను. ట్రాన్స్‌ఫార్మర్‌ మాన్యుఫాక్చరింగ్‌లో ఆసక్తి ఉంది. యూఎస్‌లో దీనిపై ఎంఎస్‌ చేసే అవకాశముందా? ఐఈఎల్‌టీఎస్‌లో చేరాను. ఇంకా ఏయే కోర్సులు చదవాల్సి ఉంటుందో తెలపండి.

యూఎస్‌ఏ విశ్వవిద్యాలయాలు ఎంఎస్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ మాన్యుఫాక్చరింగ్‌ అందించడం లేదు. కాబట్టి కింది వాటిలో మీకు నచ్చిన విభాగాన్ని ఎంచుకోవచ్చు. ఇండస్ట్రియల్‌ & కమర్షియల్‌ పవర్‌ సిస్టమ్స్‌, మోటార్‌ డ్రైవ్స్‌ & కంట్రోల్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ క్వాలిటీ, పవర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్‌, పవర్‌ సిస్టమ్‌ ఎకనామిక్స్‌, మార్కెట్స్‌ & రెగ్యులేషన్‌, పవర్‌ సిస్టమ్స్‌ కమ్యూనికేషన్స్‌, పవర్‌ సిస్టమ్‌ రిలేయింగ్‌ & ప్రొటెక్షన్‌, పవర్‌ సిస్టమ్‌ స్టెబిలిటీ & కంట్రోల్‌, పవర్‌ సిస్టమ్‌ ట్రాన్సియెంట్స్‌, పవర్‌ సిస్టమ్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & మెజర్‌మెంట్‌, పవర్‌ సిస్టమ్స్‌ ఆపరేషన్స్‌, ప్లానింగ్‌- రిలయబిలిటీ, ఫొటోవొల్టాయిక్స్‌, విండ్‌, రెనెవబుల్స్‌, స్మార్ట్‌ గ్రిడ్స్‌, సబ్‌స్టేషన్‌ డిజైన్‌, ట్రాన్స్‌మిషన్‌ & డిస్ట్రిబ్యూషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రిక్‌ మెషినరీ, ఎనర్జీ కన్వర్షన్‌, ఎనర్జీ డెవలప్‌మెంట్‌ & పవర్‌ జనరేషన్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఎనర్జీ సిస్టం డిజైన్‌, హై వోల్టేజ్‌ ఏసీ/డీసీ, ఫాక్ట్స్‌.
కోర్సుల విషయానికి వస్తే.. జీఆర్‌ఈలో 340కు 305- 314; టోఫెల్‌లో 120కు 90/ ఐఈఎల్‌టీఎస్‌లో 9కు 6- 7 స్కోరు సాధించాల్సి ఉంటుంది.

బీటెక్‌ (ఈఈఈ) 2013లో పూర్తిచేశాను. ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌లో 3 నెలల శిక్షణ కూడా తీసుకున్నాను. ఆటోమేషన్‌ రంగంలో ఉన్న ఉద్యోగావకాశాల వివరాలు తెలుపగలరు.

ఆటోమొబైల్స్‌, ఫుడ్‌& బేవరేజెస్‌, పల్ప్‌ &పేపర్‌, సిమెంట్‌, మైనింగ్‌, కెమికల్‌, ఫార్మా, కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, పవర్‌ జనరేషన్‌& ట్రాన్స్‌మిషన్‌ వంటి రంగాల్లో ఎన్నో సంస్థలు ఆటోమేషన్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. తద్వారా వారి ప్రాడక్ట్‌- సర్వీసుల నాణ్యతను మెరుగు పరచుకోవాలనుకుంటున్నాయి. కాబట్టి మీకు చాలా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ గురించి గూగుల్‌ అలర్ట్స్‌ను వాడి మీ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి. ముఖ్యంగా మూడు రకాల కంపెనీలను చూడవచ్చు. మొదటగా ఆటోమేషన్‌- కంట్రోల్‌ సిస్టంను వాలిడేట్‌తో మొదలుపెట్టి తరువాత సిస్టం డిజైన్‌, మోడలింగ్‌లోకి అడుగు పెట్టొచ్చు. మీరు కంట్రోల్‌ థియరీ లాంటి ప్రాథమికాంశాలతోపాటు డిస్ట్రిబ్యూటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ (డీసీఎస్‌), ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోల్స్‌ (పీఎల్‌సీ), న్యూమాటిక్‌, హైడ్రాలిక్స్‌, ఎలక్ట్రో మాగ్నటిక్స్‌ లాంటి కాన్సెప్టులు, సీ, వీబీ, ఫోర్టాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, ఇంకా MATLAB, Lab Viewపై అవగాహన ఎంతో ముఖ్యం. 2 లేదా అంతకంటే తక్కువ అనుభవం ఉన్నవారిని తీసుకునే కంపెనీలు రెండు రకాలుంటాయి. మొదటివారు సిమెన్స్‌ లాంటి హార్డ్‌కోర్‌ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ వారు ప్రాజెక్ట్స్‌, డిజైన్‌, ఇంజినీరింగ్‌, కమిషనింగ్‌, సేల్స్‌& సర్వీస్‌ కోసం మీలాంటి వారిని తీసుకుంటారు.
రెండో రకం కాడ్బరీస్‌, ఫోర్డ్‌, టాటా ఐరన్‌& స్టీల్‌, రాన్‌బాక్సీ, సీఈటీ టైర్స్‌ లాంటి మాన్యుఫాక్చరింగ్‌/ కన్స్యూమర్‌ పరిశ్రమల్లో ప్లాంట్‌ &ప్రాజెక్ట్స్‌, ప్లాంట్‌ మెయింటనెన్స్‌, ప్లాంట్‌ పర్చేజ్‌, ప్లాంట్‌ ఇంజినీరింగ్‌/ కమిషనింగ్‌, ప్లాంట్‌ ప్రొడక్షన్‌ వంటి వాటిలో మిమ్మల్ని తీసుకుంటారు.

బీటెక్‌ (ఈఈఈ) 2014లో పూర్తిచేశాను. ఉద్యోగం చేసే విభాగంలో ఎంఎస్‌ చేయాలన్న కోరికా ఉంది. ఇతర దేశాల్లో ఎంఎస్‌ చేయడానికి యూనివర్సిటీ, వీసా వివరాలు తెలిపే సంస్థల వివరాలు తెలుపగలరు.

పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ మెషీన్‌ & డివైస్‌, పవర్‌ సిస్టం, కంట్రోల్‌& ఆటోమేషన్‌ వంటి వాటిలో మీకు నచ్చినవాటిని ఎంఎస్‌ కోసం ఎంచుకోవచ్చు. తద్వారా పీహెచ్‌డీ చేయడం ఎంతో మేలు. పీహెచ్‌డీ, విదేశాల్లో పై చదువుల గురించి తెలుసుకోవడానికి ఉచిత కౌన్సెలింగ్‌ ద్వారా మీకు సరితూగే దేశం, యూనివర్సిటీల వివరాలను వివిధ సంస్థల వారు వివరిస్తుంటారు. ఇంటర్నెట్‌ ద్వారా ఈ వివరాలు అన్వేషించవచ్చు.

బీటెక్‌ (ఈఈఈ) 2013లో పూర్తిచేశాను. తరువాత PLC, SCADA మూడు నెలల శిక్షణ కోర్సు చేశాను. పీఎల్సీ ప్రోగ్రామర్‌గా ఉన్న ఉద్యోగావకాశాలను తెలుపగలరు.

ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో మానవ వనరులను తగ్గించి ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోలర్‌ (PLC),సూపర్‌వైజరీ కంట్రోల్‌ &డేటా అక్విజిషన్‌ (SCADA) లాంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ప్లాంట్‌, మిషనరీలను నియంత్రణకు, ఉత్పాదకత పెంచడానికీ వాడతారు. ఉదాహరణకు ఆటోమొబైల్‌, బెవరేజ్‌, ఫుడ్‌, మెరైన్‌, మెటల్స్‌, పవర్‌, పల్ప్‌& పేపర్‌, టైర్‌& రబ్బర్‌, కెమికల్‌, షుగర్‌ పరిశ్రమల్లో ఇటువంటి సాంకేతికతను ఉపయోగిస్తారు.
ఏబీబీ లిమిటెడ్‌, అడెప్ట్‌ టెక్నాలజీ Inc, Bosch, బ్రూక్‌ సొల్యూషన్స్‌, Citect,ఐడీఈసీ కార్పొరేషన్‌, ఇన్వెన్సిస్‌, ఇన్‌టెరాల్‌ వరల్డ్‌వైడ్‌ గ్రూప్‌, Moog Inc., గ్లోబల్‌ సైబర్‌సాఫ్ట్‌ లాంటి ఫ్యాక్టరీ ఆటోమేషన్‌ కంపెనీల్లో మీకు సరిపడే ఉద్యోగావకాశాలుంటాయి. ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌, అప్లికేషన్‌ ఇంజినీరింగ్‌, ప్రాడక్ట్‌ ఇంజినీరింగ్‌, కాన్సెప్ట్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో మరిన్ని అవకాశాలు ఉండబోతున్నాయి.

బీటెక్‌ (ఈఈఈ) 2013లో పూర్తిచేశాను. సౌర ఇంధనంపై ఆసక్తి ఉంది. ఫ్రెషర్లకు ఈ రంగంలో ఉన్న అవకాశాలేమిటి? ప్రవేశించాలంటే అనుభవం తప్పనిసరా?

సోలార్‌ రంగానికి పెరుగుతున్న ఆదరణ, అవకాశాలు, అనుభవం కోసం మీరు http://bit.ly/1fu2EIU, http://bit.ly/1fA54Eo వెబ్‌సైట్‌లలో పొందుపరచిన కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నించండి. తద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మాన్యుఫాక్చరింగ్‌, సిస్టం & ప్రాజెక్ట్‌ డిజైన్‌, ఇన్‌స్టలేషన్‌, ఆపరేషన్‌ & మెయింటనెన్స్‌, ప్రొక్యూర్మెంట్‌లలో ట్రైనీ ఇంజినీర్‌గా ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.

బీటెక్‌ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్నాను. నా కెరియర్‌ను ఎలా ప్లాన్‌ చేసుకోవాలి? పీజీ చేస్తే ఏ కోర్సు ఎంచుకుంటే మేలు?

ప్రాడక్ట్‌ డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌, సర్వీస్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మెయిన్‌టనెన్స్‌కు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రో మాగ్నటిజం లాంటివి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగానికి చాలా అవసరం. ఆరకంగా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌కు ప్రాముఖ్యం ఉంది. మీరు ఇంజినీరింగ్‌ చేశాక ఉద్యోగం చేయడం, పై చదువులకు వెళ్లడం/ సొంత వ్యాపారం మొదలుపెట్టడం లాంటివి చేయవచ్చు.
వ్యాపారం చేయడానికి ముందు వ్యాపార లావాదేవీలపై అవగాహన ఉండాల్సిందే. ఇక పైచదువులకు బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ & మేనేజ్‌మెంట్‌ కోసం ఎంబీఏ/ బీటెక్‌లో నచ్చిన అంశాన్ని ఎంచుకుని స్పెషలైజేషన్‌ కోసం ఎంటెక్‌ చేయవచ్చు. పైచదువులకు వెళ్లేముందు ఆ కళాశాల లెక్చరర్లు, మౌలిక వసతులు, క్యాంపస్‌ నియామకాల గురించి తెలుసుకుని చేరండి.
ఇంజినీరింగ్‌లో ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ/ ఐటీ, ఎంసీఏ చేసినవారు mentor@rrembedlabs.comకి CVని పంపి వారు వారాంతంలో నిర్వహించే కెరియర్‌ కౌన్సిలింగ్‌ వర్క్‌షాపు (వారి నుంచి ఈ-మెయిల్‌ పొందాక)కి హాజరవ్వవచ్చు. కెరియర్‌ ప్లానింగ్‌, ఉద్యోగావకాశాలను నిపుణుల నుంచి నేరుగా తెలుసుకోవచ్చు

బీటెక్‌ (ఈఈఈ) చేశాను. కోర్‌ సెక్టార్‌లో ముఖ్యంగా పవర్‌ప్లాంట్‌ విభాగంపై ఆసక్తి ఉంది. ఉద్యోగావకాశాలను తెలియజేయగలరు.

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) అంచనా ప్రకారం భారత్‌లో 2012-13 కంటే (4%) 2013-14లో (5.7%) విద్యుదుత్పత్తి పెరగబోతోంది. థర్మల్‌, న్యూక్లియర్‌, హైడ్రోలతోపాటు సోలార్‌, గ్యాస్‌, సెవేజ్‌/ వేస్టేజ్‌ లాంటి ఆధారాల నుంచి విద్యుదుత్పత్తికి ఎన్నో ప్రాజెక్టులు కార్యరూపం దాల్చుకుంటున్నాయి.
దీనికి తోడుగా Steag ఎనర్జీ సర్వీసెస్‌, తోషిబా జేఎస్‌డబ్ల్యూ టర్బైన్‌ & జెనరేటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లాంటి విదేశీ కంపెనీలు కూడా భారత్‌లోని సంస్థలతో జట్టు కట్టి విద్యుదుత్పత్తికి సుముఖత చూపిస్తున్నాయి. కాబట్టి ఎన్‌టీపీసీ, దామోదర్‌ వేలీ కార్పొరేషన్‌ (డీవీసీ), నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ), న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), ఇతర రాష్ట్రాల ప్రభుత్వ ఎలక్ట్రిసిటీ రంగాలే కాకుండా టాటా పవర్‌, రిలయన్స్‌ ఎనర్జీ లిమిటెడ్‌, సీఈఎస్‌సీ లిమిటెడ్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, సుజ్లాన్‌ ఎనర్జీల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి.
సౌర ఇంధనంపై ఆసక్తి ఉంటే http:// electronicsmaker.com/solar-demand-in-2014 వెబ్‌లింకులో ఈ రంగానికి పెరుగుతున్న ఆదరణను చూడండి .

బీటెక్‌ (ఈఈఈ) నాలుగో సంవత్సరం చదువుతున్నాను. మా బ్రాంచికి సంబంధించిన కొన్ని వినూత్న ప్రాజెక్టులను చెప్పండి.

వినూత్నమనేది ఒక పట్టికలా దొరకదు. మన ఆలోచనా విధానమే వినూత్నతను సృష్టిస్తుంది. ఈ కింది అంశాల్లో ప్రాజెక్టుల కోసం ప్రయత్నించండి.
* ఎనర్జీ కంట్రోల్‌ సిస్టమ్స్‌ అండ్‌ ఎర్లీ వార్నింగ్‌ మెకానిజమ్స్‌
* ఇంటలిజంట్‌ రోడ్‌ లైటింగ్‌ డిజైన్‌ సిస్టమ్స్‌
* సెన్సర్‌ బేస్‌డ్‌ లైటింగ్‌ డివైజెస్‌ విత్‌ లో పవర్‌ కన్సమ్‌ప్షన్‌
* మెషిన్‌ ఫాల్ట్‌ డయాగ్నొసిస్‌ యూజింగ్‌ మైక్రో కంట్రోలర్స్‌
* ఇంటలిజెంట్‌ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌ యూజింగ్‌ ఫొటో వోల్టాఇక్‌ సిస్టమ్స్‌
* రెన్యూవబుల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ .

నేను బీటెక్‌ (ఈఈఈ) 2007లో పూర్తిచేశాను. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించాను. కానీ కొన్ని ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించినా ఇంటర్వ్యూలకు పిలుపు రాలేదు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం సాధించడానికి ఏ కోర్సులు చేయాలి? ఒరాకిల్‌, సీ నేర్చుకున్నాను. గేట్‌కి కూడా సిద్ధమవుతున్నాను. సలహా ఇవ్వగలరు.

మీరు నిర్దిష్ట ప్రణాళిక వేసుకోవాలి. ఏ రంగం వైపు వెళ్లాలనుకుంటున్నారో కచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఏవేవో కోర్సులు చేయడం సరికాదు. ప్రస్తుతం గేట్‌కు సిద్ధమవుతున్నారు కాబట్టి దానిపై దృష్టి పెట్టండి. దానితోపాటు..
* ప్రతిరోజూ నిర్ణీత సమయం ప్రకారం ప్రతి సబ్జెక్టూ చదవాలి.
* వారంలో ప్రతి సబ్జెక్టూ కనీసం రెండుసార్లు చదవాలి. కొంత సమయం పునశ్చరణకూ కేటాయించాలి.
* సబ్జెక్టులో ఉన్న అనుమానాలను నిపుణుల సాయంతో తీర్చుకోవాలి.
* గత సంవత్సరపు ప్రశ్నపత్రాలను సేకరించి వాటిని అభ్యాసం చేయాలి.
* ఆన్‌లైన్‌లో మాదిరి ప్రశ్నపత్రాలను అభ్యాసం చేయండి.
* కొన్ని ఆప్టిట్యూడ్‌ పరీక్షలనూ సాధన చేయండి.
ప్రస్తుతం మీరున్న పరిస్థితిలో ఎంటెక్‌ చెయ్యడం చాలా అవసరం. కెరియర్‌లో అభివృద్ధికి ఈఈఈ వారు చేయాల్సిన కోర్సుల వివరాలకు www.eenadupratibha.net చూడండి.

బీటెక్‌ (ఎలక్ట్రికల్‌) 2012లో పూర్తిచేశాను. ELE - CADల్లో ఉద్యోగ అవకాశాలను తెలపండి.

నూతన, వినూత్న ఎలక్ట్రికల్‌ ప్రాడక్ట్స్‌/ సిస్టమ్స్‌ని తయారుచేయడంలో నిపుణులైన ఎలక్ట్రికల్‌ డిజైనర్లకు లోపలి, బయటి కాంపోనెంట్లు ఎల్లపుడూ సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోవడం ముఖ్య విధి.
వీరు ముఖ్యంగా రీసెర్చ్‌, ప్రిలిమినరీ డిజైన్‌లకు, ప్రోటోటైప్‌ డిజైన్లకు, టెస్టింగ్‌/ రీటెస్టింగ్‌, డిజైన్‌లో ఉండే లోపాలను సరిదిద్దడంలోనే ఎక్కువ సమయం కేటాయిస్తారు. డ్రాయింగ్‌ కోసం వీళ్లు కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ (CAD) వంటి మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్‌ CAD డిజైన్‌ అనేది కంప్యూటర్‌ డిజైన్‌ అయినప్పటికీ అవసరాన్ని బట్టి వీళ్లు కన్‌స్ట్రక్షన్‌ సైట్‌కి వెళ్లి చూడాల్సి ఉంటుంది.
ఇక ఉద్యోగ విషయానికి వస్తే BHEL, ఇండియన్‌ రైల్వేస్‌ వంటి గవర్నమెంట్‌ (PSU), ABB, Alstom, Wipro, Bajaj international pvt ltd, Crompton Greaves, Siemens ltd, Schneider కంపెనీల్లో వీరికి అవకాశాలుంటాయి.

ఈసీఈ మూడో సంవత్సరం చదువుతున్నాను. అప్రెంటిస్‌ను అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల గురించి తెలపండి. వాటికి దరఖాస్తు ప్రక్రియ, విధానాలనూ వివరించండి.

బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌ ట్రైనింగ్‌, సదరన్‌ రీజియన్‌ వారు http://www.boat-srp.com/boat/ అనే వెబ్‌ పోర్టల్‌ ద్వారా విద్యార్థులకు అప్రెంటిస్‌ కల్పించేవిధంగా ప్రవేశపెట్టారు. దీనిలో దరఖాస్తు చేసుకుంటే ఏయే కంపెనీలు అప్రెంటిస్‌లకు అవకాశమిస్తున్నారో తెలుస్తుంది. ISRO, DRDO, BHEL, BEL, NTPC, BSNL ప్రభుత్వ భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, యూనినార్‌ ఇంకా ఎన్నో ఇతర ప్రైవేటు సంస్థలు ఇంటర్న్‌షిప్‌ వంటి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైట్‌లను గమనిస్తూ ఇంటర్న్‌షిప్‌ కల్పించే కంపెనీలను తెలుసుకుంటుండండి. www.twenty19.com, www.letsintern.com, www.internmatch.com, https://www.facebook.com/eduinfoupdates/posts/542737229081420 లో కూడా ఇంటర్న్‌షిప్‌ వివరాలు లభ్యమవుతాయి. ఇతర దేశాల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం http://www.eduinfo.asia/ని అనుసరించండి.


ఈఈఈతో ఇంజినీరింగ్‌(2011) పూర్తి చేశాను. సౌర ఇంధనం (సోలార్‌)పై ఆసక్తి ఉంది. ఈ రంగంపై ఏవైనా కోర్సులున్నాయా? మనరాష్ట్రంలో ఎంటెక్‌లో సోలార్‌ స్పెషలైజేషన్‌ అందించే సంస్థల వివరాలు తెలుపగలరు.

జేఎన్‌టీయూ- అనంతపురం, జేఎన్‌టీయూ- హైదరాబాద్‌ రెండు సంవత్సరాల ఎంటెక్‌ (ఐఎంపీ)- రెన్యూవబుల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ కోర్సులు నిర్వహిస్తాయి. దీనికి గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఇది కాకుండా కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నొవేటివ్‌ రీసెర్చ్‌ (ఏసీఎస్‌ఐఆర్‌) సంయుక్తంగా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌- పీహెచ్‌డీ ఇన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ కోర్సును నిర్వహిస్తున్నారు. దీని వ్యవధి ఎంటెక్‌ (రెండేళ్ళు) + పీహెచ్‌డీ (మూడేళ్ళు). వివరాలకు- http://acsir-imp.csio.res.in/ వెబ్‌సైట్‌ను చూడండి. దీనికి గేట్‌ కనీస అర్హత, వయసు 28 సంవత్సరాలలోపు ఉండి ఇంజినీరింగ్‌లో మార్కులు కనీసం 70 శాతం ఉండాలి. సౌర ఇంధనం గురించి http://www.solarenergy.in/ ద్వారా తెలుసుకుంటుండండి.

బీటెక్‌ (ఈసీఈ) పూర్తి చేశాను. ఐసెట్‌లో 2000 కంటే తక్కువ ర్యాంక్‌ వచ్చింది. ప్రాంగణ నియామకాలు అందిస్తున్న ఏదైనా కళాశాలలో చేరనా? నా చదువుకు సంబంధించి ఏదైనా కోర్సు చేయనా?

మీరు ఎంబీఏ చేయాలనుకుంటే ఆయా కళాశాలల పూర్వవిద్యార్థులను సంప్రదించి ప్రాంగణ నియామకాల గురించి తెలుసుకుని చేరండి. ఇదివరకంటే ఇప్పుడు ప్రాంగణ నియామకాలు చాలా తగ్గిపోయాయి. ఇలా కాకుండా ఈసీఈ వాళ్లకు సంబంధించిన కోర్సులు లేదా ఫైబరు ఆప్టిక్‌ టెక్నాలజీ కోర్సులు చేసి 2-3 సంవత్సరాల కనీస అనుభవం వచ్చాక అపుడు పై చదువులకు వెళ్లడం మేలు. ఫైబరు ఆప్టిక్‌పై అవగాహనకు ఈ http://computer.howstuffworks.com/fiber-optic.htmలింకును చూడండి.

నేను ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో బీఈ పూర్తిచేసి, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో ఎంఈ చేస్తున్నాను. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో ఉద్యోగావకాశాల గురించి తెలపండి?

ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ చేసినవాళ్లు సమర్థమైన పద్ధతిలో మెషిన్‌, ఉద్యోగులు, శక్తి(ఎనర్జీ)ని ఉపయోగించి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. మీకు భారీ ఉత్పత్తి పరిశ్రమల్లో చాలా అవకాశాలుంటాయి. ఐటీ, హాస్పిటల్స్‌, బీపీఓ, గార్మెంట్‌/ అపారెల్‌, ఇతర నాన్‌ఐటీ, కన్సెల్టింగ్‌ కంపెనీల్లో మీ అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే ముందు మిమ్మల్ని వారు తప్పక సంప్రదిస్తారు. ఎందుకంటే ఇండస్ట్రియల్‌ ఇంజినీర్లకు లాజిస్టిక్స్‌ని ఎలా ఉపయోగించాలో తెలుస్తుంది. ఇంటర్న్‌షిప్‌/ ప్రాజెక్టుల ద్వారా నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. ఇంజినీరింగ్‌ కంపెనీల వివరాల కోసం
http://www.inc.com/inc5000/list/2012/industry/engineeringలేదా http://economictimes.indiatimes.com/et500list.cms వెబ్‌సైట్లను చూడండి.

బీటెక్‌ ఈఈఈ (2013) పూర్తిచేశాను. సౌర ఇంధనానికి సంబంధించిన శిక్షణ కోర్సులను ఏ సంస్థలు అందిస్తున్నాయో తెలుపగలరు.

అంతర్జాలంలో ఉచితంగా లభించే మెటీరియల్‌ని చదివి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. NCPRE (www.ncpre.iitb.ac.in/events.php) వాళ్లు నిర్వహించే కోర్సులు ఎన్నో ఉన్నాయి. అనవసరంగా ఎక్కువ సమయం, డబ్బు వృథా చేయకుండా www.solarenergy.gen.in/, http:://shaikmohasin.wordpress.com/, లేదా http://diy-energy.org/ebooks/SolarEnergy.pdfలాంటి వెబ్‌సైట్‌ల ద్వారా సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండవచ్చు. ఇంకా ట్రైనింగ్‌ వర్క్‌షాపులు, ట్రేడ్‌ ఫేర్‌లకు హాజరవుతూ వివిధ అనుభవజ్ఞుల నుంచి సౌరశక్తిపై సందేహాలు తీర్చుకోవడమే కాకుండా అవకాశాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చు.

నేను బీటెక్‌ 2012లో పూర్తి చేశాను. నాకు కోర్‌ సెక్టార్‌ ఈఈఈ అంటే ఇష్టం. నేను ఎంటెక్‌ చేయాలా? ఉద్యోగం చేయాలా?

సాధారణంగా బీటెక్‌ చేసిన తర్వాత ప్రతి విద్యార్థీ పై చదువులకు వెళ్లడమో; కోర్‌, ఐటీ, బీపీఓ/ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించటమో చేస్తుంటారు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే పై చదువులకు వెళ్లి మీరు ఎంచుకున్న ఈఈఈపై పట్టు సాధించొచ్చు. ఇంకా మీరు ఐఐఎస్సీ, ఐఐటీఎస్‌, టీఐఎఫ్‌ఆర్‌, సీఎమ్‌ఐ, ఐఎస్‌ఐ, హెచ్‌సీయూ లాంటి వాటిలో పీహెచ్‌డీ కూడా చేయొచ్చు. ఏదేమైనా మీరు కోర్‌ ఏరియాలో కొంత అనుభవం తెచ్చుకున్నాకే పై చదువులకు వెళ్లడం ఎంతో మేలు. కోర్‌ ఇంజినీరింగ్‌లో సౌర ఇంధనం (సోలార్‌ ఎనర్జీ)లో భవిష్యత్తు ఉన్న రంగం. మీరు http://bit.ly/Zgljz8గ్రూపులో చేరి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి.

నేను ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక గత మూడు సంవత్సరాలుగా పవర్‌ ప్లాంటులో పనిచేశాను. అందులో ఎక్కువ ఎదుగుదల అనిపించడం లేదు. జార్ఖండ్‌లో ఉద్యోగం చేస్తున్నాను. అక్కణ్ణుంచి హైదరాబాద్‌కు రావాలని ఉంది కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉందేమో అనిపిస్తోంది. అందుకే ఉద్యోగం బదులు వ్యాపారం చేయదలిచాను. మీ సలహా ఇవ్వండి.

మీరు enterprenuer కావాలనుకోవడం మంచిదే. ఆమధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారు 3500 సీసీ టీవీ కెమెరాల కోసం దాదాపు 450 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. ప్రతి రిటైల్‌ షాపు, భవనం, కర్మాగారం, పాఠశాల, కళాశాల, ఆస్పత్రులు, హోటళ్ళలో సీసీ టీవీ కెమెరాల అవసరం ఎంతో ఉంది.
మీకు దీనిపై ఆసక్తి ఉంటే Surveillance సాంకేతిక నిపుణుడుగా అవొచ్చు. http://finance.groups.yahoo.com/group/passion-n-career/గ్రూపులో జాయినైన తర్వాత Recruitment of Engineering Fresher' అనే పోస్టింగు చదవండి. సీసీటీవీ కంపెనీ వారు పదిమందిని ఎంపిక చేసుకుని ఆర్నెల్లపాటు అవస్థాపన (ఇన్‌స్టలేషన్‌), నిర్వహణ, మార్కెటింగులపై బెంగళూర్లో ఉచిత శిక్షణ ఇస్తారు. భోజన- వసతి సదుపాయాలతో పాటు చక్కని compensation ఇస్తారు. మీరు వ్యాపారవేత్తగా ఎదగాలనే ధ్యేయం ఉంటే ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాపారాన్ని కొనసాగించొచ్చు.

కోర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పనిచేస్తున్నాను. ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, ఇతర ఎలక్ట్రీషియన్‌ సంబంధిత వెబ్‌సైట్స్‌/ ఫోరమ్స్‌ తెలియజేయండి.

మీరు http://goo.gl/tXsgJ లేదా http://goo.gl/qLAO7 వెబ్‌సైట్ల ద్వారా ఎలక్ట్రికల్‌ రంగంలో మీకు తెలియనివి ఎన్నో తెలుసుకోవచ్చు. ఇంకా మీరు గూగుల్‌ ద్వారా ఉచితంగా లభించే అలర్ట్స్‌ను వినియోగించుకోండి. ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ లేదా మీకు కావలసిన పదాలను కీవర్డ్స్‌గా పెట్టి ఎప్పటికప్పుడు దానిపై తాజా విషయాలు గ్రహిస్తూ (అప్‌డేట్‌) ఉండండి.

ఇంజినీరింగ్‌ (ఈసీఈ) చివరి సంవత్సరం చదువుతున్నాను. నాకు ఎంబీఏ-ఐటీ చేయాలని ఉంది. మీ సలహా ఇవ్వండి.

ఎంబీఏ లేదా ఎంఎస్‌ ఏది చేయాలో తెలియక చాలామంది విద్యార్థులు పొరబడుతూ ఉంటారు. మీరు ఎంబీఏ ఐటీతో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇలా చేయడం మంచిదే. కొత్తగా ఉద్భవిస్తున్న ఐటీ ధోరణుల గురించి తెలుసుకుంటూ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో గ్రహించవచ్చు. ఐఐఎం అలహాబాద్‌, ఐఐఎం కలకత్తా లాంటి బిజినెస్‌ స్కూల్స్‌లో చూసినట్టయితే చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదివి వచ్చినవారే ఎక్కువ. కేవలం డిగ్రీ లేదా సర్టిఫికెట్ల గురించి కాకుండా ఇలాంటి చదువులు కెరియర్‌ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయో చూసుకోవాలి. ఇదే శీర్షికలో చెప్పినట్టు ఎంబీఏ చేసే ముందు 2 లేదా 3 సంవత్సరాలు మీకిష్టమైన రంగంలో అనుభవం తెచ్చుకుంటే ఇంకా మంచిది.

బీటెక్‌ (ఈసీఈ) 2011లో చేశాను. 58శాతం ఉత్తీర్ణత ఉంది. ఎలక్ట్రికల్‌ డిజైన్‌ కోర్సు చేశాను. ఎలక్ట్రికల్‌ డిజైన్‌ ఉద్యోగానికి ఈఈఈ వాళ్లనే తీసుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి?

మొదటగా మీకున్న పరిజ్ఞానంతో మీ బ్లాగ్‌, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌లలో ఎలక్ట్రికల్‌ డిజైన్‌ మీద పోస్టు చేయడం మొదలుపెట్టండి. సీవీ మాత్రమే కాకుండా ఇలాంటి బ్లాగ్‌ లింక్స్‌ కూడా టెక్నికల్‌/ హెచ్‌ఆర్‌ మేనేజర్‌లకు పంపండి. గూగూల్‌ అలర్ట్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు తాజా అంశాలు గ్రహిస్తూవుండండి. ఇంకా http://engineering.electrical-equipment.org/లాంటి టెక్నికల్‌ ఫోరమ్స్‌లో చాలా విషయాలు పోస్ట్‌ చేసి అడిగి తెలుసుకోవచ్చు. తద్వారా మీకు ఎలాంటి కంపెనీలు మిమ్మల్ని తీసుకోవడానికి సుముఖత చూపిస్తున్నాయో తెలుస్తుంది. ఇంటర్వ్యూలో కూడా మీరు స్పష్టంగా ఆ కంపెనీలకు ఏం చేయగలరు అనేది తెలిపితే మిమ్మల్ని ఎంపిక చేసుకోవడానికి ముందుకొస్తారు.

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ 73 శాతం మార్కులతో పూర్తిచేశాను. టాయ్‌ మాన్యుఫాక్చరింగ్‌ సంస్థల్లో చేయాలన్నది నా ఆశయం. తరచూ నా సి.వి.ని పంపిస్తున్నాను. కానీ వాళ్ళనుంచి ఎలాంటి జవాబూ లేదు. మీ సలహా?

మీరు చదివింది ఏదైనా, చేయదల్చుకున్నది స్పష్టంగా మీకు తెలుసు కాబట్టి ఆ కంపెనీలకు సి.వి. పంపేముందు ఆ కంపెనీలు ఎలాంటి ఆటబొమ్మలు ఉత్పత్తి చేస్తున్నాయో తెలుసుకోండి. వాటి బ్రోషర్లు/ మాన్యువల్స్‌ చదివి ఉత్పత్తుల గురించి మరిన్ని విషయాలు గ్రహించండి. వారి పోటీదారుల గురించి తెలుసుకోవటం ఇంకా మంచిది. తర్వాత Mattel, Fisher-priceలాంటి సంస్థల్లో ప్రాజెక్టు మేనేజర్లతో సోషల్‌ మీడియా ద్వారా అనుసంధానమవ్వండి. మీ ఆసక్తినీ, ఉన్న నైపుణ్యాలనూ మీ బ్లాగు ద్వారా వ్యక్తపరుస్తూ వారికి మెయిల్స్‌ పంపండి.

నేను ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ 2012లో పూర్తి చేశాను. ఇంతవరకూ ఉద్యోగం సంపాదించలేదు. కోర్‌ వైపు ప్రయత్నించాలో, సాఫ్ట్‌వేర్‌లో ప్రయత్నించాలో చెప్పండి. ఏం చేయాలో సలహా ఇవ్వండి.

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో భవిష్యత్తు పుష్కలంగా ఉంది. ఉదాహరణకు సౌర ఇంధన సాంకేతికత (సోలార్‌ ఎనర్జీ టెక్నాలజీ). దీనిలో సోలార్‌ వాటర్‌ హీటింగ్‌, సోలార్‌ వీధిదీపాలు, రిమోట్‌ పంప్‌ స్టార్టర్‌ వంటివీ, వాటిని వినియోగించే విధానం తెలుసుకోండి. http://goo.gl/gid8Qలోకి వెళితే మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. దేశవిదేశాల్లో సోలార్‌ టెక్నాలజీ ఉపయోగాలపై ఎలాంటి పరిశోధన జరుగుతోందో తెలుసుకుని, మీకు ఇష్టమైన రంగంలోనే పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఇలా మీకు ఉచితంగా దొరికే సోషల్‌ మీడియా టూల్స్‌ ద్వారా ఇంటర్నెట్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని పరిశ్రమ నిపుణుల నుంచి స్వయంగా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకానీ, ఎవరో చెప్పారని ఇష్టం లేని సాఫ్ట్‌వేర్‌కు వెళ్లకండి.

నేను 2011లో ఇంజినీరింగ్‌ (ఈఈఈ)ని 60 శాతం ఉత్తీర్ణతతో పూర్తిచేశాను. నాకు ట్రాన్స్‌ఫార్మర్‌ తయారుచేసే రంగం అంటే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా అనుభవం ఉన్నవాళ్ళనే తీసుకుంటున్నారు. మీ సలహా?

మీకు ట్రాన్స్‌ఫార్మర్‌ మాన్యుఫాక్చరింగ్‌పై ఇష్టం ఉంది కాబట్టి ఈ రంగంలో ఎలాంటి కంపెనీలున్నాయో పరిశోధించండి. అనుభవం లేకపోయినా ఇంటర్న్‌షిప్‌/ప్రాజెక్టుల ద్వారా మీరు ఉద్యోగం తెచ్చుకోవడం సులువవుతుంది. ఏడో తరగతి వరకే చదివి, ట్రాన్స్‌ఫార్మర్‌ తయారుచేసే కంపెనీ మొదలుపెట్టిన ఒక సాధారణ స్త్రీ గురించి మీరు వినే ఉంటారు. ఇలాంటివి చదివితే ప్రేరణ కలుగుతుంది. ఎలక్ట్రికల్‌ ట్రాన్స్‌ఫార్మర్ల గురించి తెలుసుకుని మీ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి www.powertransformersblog.comవెబ్‌సైట్‌ చూడండి

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. తర్వాత పవర్‌ ఇంజినీరింగ్‌కి సంబంధించిన కంపెనీలో జాయినయ్యాను. అక్కడి పని పరిస్థితులు నచ్చక ఆ ఉద్యోగం మానేశాను. ఇప్పుడు నేనెలాంటి కొలువులో, ఎలాంటి సంస్థలో చేరాలో సలహా ఇవ్వండి.

ఎప్పుడూ ఉద్యోగం వెంటపడకుండా, కంపెనీ, ప్రాజెక్టు, టెక్నికల్‌/ప్రాజెక్టు మేనేజర్‌ గురించి తెలుసుకుని వాళ్ళను ప్రత్యక్షంగా సంప్రదించండి. సౌరశక్తి (సోలార్‌ ఎనర్జీ) రంగంలో ఎంతో భవిష్యత్తు ఉంది. ఉదాహరణకు- అలాన్‌ రోస్లింగ్‌ స్థాపించిన కిరణ్‌ ఎనర్జీ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రాతో కలిసి ఈ సౌరశక్తి రంగంలో పెట్టుబడులు పెడుతూ మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లాంటి ప్రదేశాలకు విస్తరిస్తోంది. ఇలా మీకు నచ్చిన రంగంలో ఏ సంస్థలున్నాయో, అక్కడి ప్రాజెక్టు మేనేజర్‌లు ఎవరో సమాచారం సేకరించుకోవాలి. నచ్చిన సంస్థల్లో ఉద్యోగం కోసం సంప్రదించండి.

నేను ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. కానీ నాకు ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే ప్రోగ్రామింగ్‌ చేయడం నాకు అసలు రాదు. నాకు కోర్‌ ఇంజినీరింగ్‌లోనే ఇష్టం ఉంది. మీరు ఎలాంటి సలహా ఇస్తారు?

ఫైబర్‌ ఆప్టిక్స్‌ టెక్నాలజీ మంచి భవిష్యత్తు ఉన్న రంగం. బీఎస్‌ఎన్‌ఎల్‌ వారు దీనిపై శిక్షణ కూడా ఇస్తున్నారు. FTTPలో పరిపూర్ణత సాధిస్తే అలాంటి అభ్యర్థులను తీసుకోవడానికి చాలా సంస్థలు ముందుకొస్తాయి. నిర్మాణ సంస్థలు కూడా శ్రద్ధ చూపుతాయి. వేరేవారిని అనుసరించి ఇష్టం లేని ఐటీ రంగంలో చేరకుండా, మీకు నచ్చిన కోర్‌ ఇంజినీరింగ్‌లోనే ప్రవేశించడం మంచిది.

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. నా దృష్టి అంతా కోర్‌ ఇంజినీరింగ్‌పైనే. కానీ ఈ మధ్య నా స్నేహితులు ఐటీ రంగంలో సులువుగా ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలో ఉన్న శిక్షణసంస్థల్లో చేరారు. నేను కూడా వాళ్ళతోపాటు కోర్సులో చేరటం మంచిదేనా?

కళాశాలలో నాలుగేళ్ళుగా చదవలేనివి ఇలాంటి చిన్నచిన్న శిక్షణసంస్థల్లో 3 వారాల్లో/ 3 నెలల్లో నేర్చుకోలేరు. మీకు తగిన సోలార్‌ ఎనర్జీ కంపెనీలను వెతికి, ఎలా వినియోగిస్తారో ఈ వెబ్‌లింక్‌ http://www.gizmag.com/eliodomestico/24058/ద్వారా తెలుసుకోవచ్చు. వాటిని సంప్రదించి మీకు నచ్చిన రంగంలో కెరియర్‌ను ఆరంభించవచ్చు. ఎప్పుడైనా మొదటి ఉద్యోగం కొద్దిగా కష్టమైనదే. తర్వాత మీరు ఐబీఎం స్మార్ట్‌ ఎనర్జీపై దృష్టి పెట్టవచ్చు. అది కూడా సొంతంగా గూగుల్‌ అలర్ట్స్‌ ద్వారా నేర్చుకోవటానికి ప్రయత్నించవచ్చు.