బీటెక్‌ (ఈసీఈ) చదువుతున్నాను. త్వరలో మాకు ప్రాంగణ నియామకాలు ఉన్నాయి. మా స్నేహితులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించడం సులువు అంటున్నారు. నాకేమో కోర్‌ విభాగంలో ఆసక్తి ఉంది. నా బ్రాంచి ఆధారంగా నాకున్న ఉద్యోగావకాశాలేంటో తెలపండి. - రమ్య శ్రీనివాసరావు

ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు ఏ బ్రాంచి వారైనప్పటికీ ప్రాంగణ నియామకాల్లో ఐటీ రంగం లేదా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సాధించుకునే వీలుంది. కానీ కోర్సు పూర్తయిన తర్వాత ఆ రంగంలోనే ఏదైనా ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులు కోర్‌కు సంబంధించిన ఉద్యోగాన్ని ఎంచుకోవడం, దాని కోసం ప్రయత్నించడం మంచిది. ఏ బ్రాంచి అయినప్పటికీ ఏ రంగం అయినప్పటికీ మనకు ఆ రంగంలో మంచి పట్టు, నైపుణ్యం ఉన్నట్లయితే ఉద్యోగం సంపాదించటం పెద్ద కష్టం కాదు. ఇక మీ కోర్‌ బ్రాంచి విషయానికొస్తే ఈసీఈలో ఇంజినీరింగ్‌ చేసిన విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీర్‌, ఎలక్ట్రానిక్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ ఇంజినీర్‌, సపోర్ట్‌ ఇంజినీర్‌, సిస్టమ్స్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌ లాంటి ఉద్యోగావకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు మిగతా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల మీరు కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీ బ్రాంచికి ప్రైవేటు రంగాల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు ఎక్కువే. చాలా ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అందుకని గేట్‌ రాసి ప్రభుత్వ ఉద్యోగాల కోసమూ ప్రయత్నించవచ్చు. - ప్రొఫెసర్‌ బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాను. గేట్‌ రాశాను. కానీ కేవలం క్వాలిఫై అయ్యాను. దీనిద్వారా చేయగలిగిన కోర్సులు, ఉద్యోగాలేమైనా ఉన్నాయా? ఇంకా ఏదైనా డిప్లొమా చేస్తే మేలా? తెలియజేయగలరు. - ప్రత్యూష, శ్రీకాకుళం

చాలామంది విద్యార్థులు గేట్‌ను ఐఐటీలో ఎంటెక్‌కు ప్రవేశపరీక్షగా, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఒక అర్హతగా మాత్రమే చూస్తున్నారు. గేట్‌లో క్వాలిఫై అయినవారికి కూడా ఎన్నో అవకాశాలున్నాయి. సింగపూర్‌ లాంటి దేశాల్లో ఎన్నో కళాశాలలకు గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. చాలా ప్రైవేటు సంస్థల్లో ఇప్పుడు గేట్‌ స్కోరును పరిగణనలోకి తీసుకుని మంచి ఉద్యోగాలను అందిస్తున్నాయి. మీకు డిప్లొమా చేయడానికి ఆసక్తి ఉంటే ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, డిజిటల్‌ అండ్‌ అనలాగ్‌ డిజైన్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ సిస్టమ్‌ సెక్యూరిటీ లాంటి విభాగాల్లో డిప్లొమా చేస్తే మంచిది.

బీటెక్‌ (ఈసీఈ) రెండో సంవత్సరం చదువుతున్నాను. మిలటరీ విభాగంలో పనిచేయాలన్నది నా కోరిక. అమ్మాయిలకు మిలటరీలో ఉన్న అవకాశాలేంటి? - దీపిక

ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తున్న వారిలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేయాలనే ఆసక్తి ప్రదర్శిస్తున్న ఈరోజుల్లో మిలటరీ గురించి ఆలోచిస్తున్న తీరు అభినందనీయం. మిలటరీలో ఇంజినీరింగ్‌ ద్వారా పొందగలిగే ఉద్యోగాలకు స్త్రీ, పురుషులకు పెద్దగా తేడా లేదు. అతి తక్కువ ఉద్యోగాలకు మాత్రమే వివాహితులైన మహిళలు అర్హులు కారు. కాబట్టి నిరభ్యంతరంగా మీరు మీ కలలను సాకారం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు.
కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా, ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ద్వారా కూడా మిలటరీలో ప్రవేశించవచ్చు. రక్షణ రంగ సంస్థలైన డీఆర్‌డీఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ లాంటి వాటిల్లోనూ ప్రయత్నించవచ్చు. ఇంజినీరింగ్‌ తరువాత ఎంటెక్‌లో చేసే స్పెషలైజేషన్‌ ద్వారా కూడా అవకాశముంటుంది. సిగ్నల్‌ ఇంజినీరింగ్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ పొందినా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఎక్కువే!

ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాను. భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలను పొందడానికి అనుబంధంగా ఏయే కోర్సులను నేర్చుకుంటే మేలు?

ఏ ఉద్యోగం చేయడానికైనా ప్రాథమికాంశాలపై పట్టు, సూత్రాలు, భావనలపట్ల సూక్ష్మజ్ఞానం అవసరం. మీరింకా ప్రథమ సంవత్సరంలోనే ఉన్నారు కాబట్టి, సబ్జెక్టు పట్ల అవగాహన ఏర్పరచుకోండి. లోతుగా సబ్జెక్టులను నేర్చుకోవడానికి ఎన్‌.పి.టెల్‌, edx, course era వెబ్‌సైట్లను సందర్శించడి. తరగతి గది బోధన, చర్చలను శ్రద్ధగా అనుసరించండి. స్కాడా, మ్యాట్‌ లాబ్‌, ఎంబెడెడ్‌-సి, పీసీబీ డిజైనింగ్‌ వంటి అదనపు కోర్సులను మీ అభిరుచికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. సాధారణంగా మూడో/ నాలుగో సంవత్సరంలో అనుబంధ కోర్సుల్లో శిక్షణ వల్ల ప్రాజెక్ట్‌ వర్క్‌, కోర్‌ కంపెనీల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు. ప్రస్తుతం మీ సెమిస్టర్‌ కోర్సులపై దృష్టిసారించడం మేలు.

మా అబ్బాయి ఇంజినీరింగ్‌ (ఈసీఈ) తుది సంవత్సరం చదువుతున్నాడు. తను ఎంబీఏ/ ఎంటెక్‌లలో ఏది చేస్తే ఉత్తమం? ఏది చదివితే ఉద్యోగాలు వస్తాయి?

ఎంబీఏ, ఎంటెక్‌ల్లో ఏ కోర్సు ఉత్తమం అనేది చెప్పలేం. ఎందుకంటే ఏ కోర్సుకు అయినా తనదైన ప్రత్యేకతతోనే ఉంటుంది. ఇంజినీరింగ్‌ తర్వాత ఎంబీఏ లేదా ఎంటెక్‌ల్లో ఏ కోర్సు చదివినా ఉద్యోగావకాశాలు ఉంటాయి. కానీ కోర్సు ఎంపిక చదివేవారి ఆసక్తిపై ఆధారపడితే మంచిది. మీ అబ్బాయికి ఇంజినీర్‌ అవ్వాలనుకుంటే ఎంటెక్‌ లేదా వ్యాపారం పట్ల ఆసక్తి ఉంటే ఎంబీఏ కోర్సును ఎంచుకోమనండి. అవకాశాలు రెండింటికీ పుష్కలంగానే ఉంటాయి. ఆసక్తి ఉంటేనే కదా ఎవరైనా దేనిలోనైనా రాణించేది! అందుకే ఎవరో చెప్పారని ఆసక్తిలేనిదాన్ని ఎంచుకోమనకండి.

మా అమ్మాయికి 2017 మే నెలలో బీటెక్‌ (ఈసీఈ) ఫైనలియర్‌ పూర్తవుతుంది. ఎంబీఏ ఫైనాన్స్‌ చేయాలనివుంది. ఈ కోర్సు చదువుతూనే బ్యాంకు పరీక్షలకు సిద్ధం కావాలని తన ఆలోచన. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఎంబీఏ అందించే మంచి కళాశాల ఎక్కడుంది? బ్యాంకులో ఉద్యోగం కూడా ప్రాక్టికల్‌ అనుభవం కోసమే. ఆ తర్వాత సొంతంగా బిజినెస్‌ ప్రారంభించాలనేది తన లక్ష్యం. వివరాలు తెలుపగలరు.

సొంతంగా బిజినెస్‌ చేయాలనే అభిలాష అభినందనీయం. ఎంబీఏ చదవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా, జేఎన్‌టీయూ, ఆంధ్ర, గీతం, ఆచార్య నాగార్జున, కాకతీయ మొదలైన విశ్వవిద్యాలయాలు ఎంబీఏను అందిస్తున్నాయి. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం వారు క్యాట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన వర్సిటీలు ఐసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి.
అంతేకాకుండా బిజినెస్‌ స్కూళ్ళు కూడా మన రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. బీ స్కూళ్ళలో ఎంబీఏ చదవాలంటే ఎక్కువ ఫీజు చెల్లించాల్సివుంటుంది. కాబట్టి ఏ విశ్వవిద్యాలయంలోనైనా చదవొచ్చు. సొంతంగా బిజినెస్‌ చేయాలనే అభిలాష ఉంది కాబట్టి బిజినెస్‌ పరిజ్ఞానం ఎక్కువగా పెంచుకోవాలి. బ్యాంకు పరీక్షలక్కూడా సరైన సమయాన్ని కేటాయించాలి. ఏకాగ్రత, అంకితభావాలతో చదివితే అనుకున్నది తప్పకుండా సాధిస్తారు.

* ఈసీఈ 2014లో పూర్తిచేసి ప్రస్తుతం ఓ ఎంఎన్‌సీలో ఉద్యోగం చేస్తున్నాను. విదేశాల్లో న్యూక్లియర్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేయాలనుంది. ఏ దేశంలో చేస్తే మంచిది? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఉద్యోగం చేస్తూ కూడా ఉన్నత విద్య కొనసాగించాలనే మీ అభిలాష అభినందనీయం. న్యూక్లియర్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేయడం వల్ల మెరుగైన అవకాశాలుంటాయి. అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్‌లాంటి దేశాల్లో పీజీ చేయవచ్చు. న్యూక్లియర్‌ టెక్నాలజీలో ఉన్నత విద్య తరువాత ప్రయోగశాలల్లో, న్యూక్లియర్‌ ప్లాంట్స్‌, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కొద్దిమంది మాత్రమే చదవాలని కోరుకునే ఈ కోర్సు పూర్తిచేస్తే ఉద్యోగావకాశాలు బాగా ఉంటాయి. మాస్టర్స్‌ తర్వాత పీహెచ్‌డీ కూడా చేయగలిగితే మరిన్ని అవకాశాలను పొందగలుగుతారు.

* బీటెక్‌ (ఈసీఈ) 2014లో పూర్తిచేశాను. కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనుంది. గేట్‌ ద్వారా నియామకాలు జరిపే సంస్థల వివరాలు తెలియజేయండి?

ఎలక్ట్రానిక్స్‌ కోర్‌ విభాగంలో గేట్‌ ద్వారా ఉద్యోగాలను అందించే ప్రధాన ప్రభుత్వ సంస్థలు- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హెచ్‌పీసీఎల్‌ (హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌), ఎన్‌టీపీసీ (నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌), ఎన్‌ఎల్‌సీ (నైవెలా లిగ్నైట్‌ కార్పొరేషన్‌), సీఈఎల్‌ (సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌), పీజీసీఐఎల్‌ (పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా), పీఎస్‌పీసీఎల్‌ (పంజాబ్‌ స్టీల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌), బీబీఎన్‌ఎల్‌ (భారత్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌), ఏఏఐ (ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఇండియా లిమిటెడ్‌), బీఏఆర్‌సీ (బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌), ఎన్‌బీసీసీ (నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌), ఐఆర్‌సీఓఎన్‌ (ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌), నాల్కో (నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌).

బీటెక్‌ (ఈసీఈ) 2013లో పూర్తిచేశాను. గేట్‌ 12,000 ర్యాంకు సాధించాను. ఎటువంటి ఉద్యోగానుభవమూ లేదు. కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనుంది. అందించే సంస్థల వివరాలు తెలపండి?

మీకు కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏవియేషన్‌ & ఏవియానిక్స్‌, ఎలక్ట్రిసిటీ జెనరేషన్‌ & డిస్ట్రిబ్యూషన్‌, మాన్యుఫాక్చరింగ్‌, కమ్యూనికేషన్స్‌, రేడియో & టెలివిజన్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, టెలి కమ్యూనికేషన్స్‌, హాస్పిటల్‌ డయాగ్నోస్టిక్‌ ఎక్విప్‌మెంట్‌ & ఆఫ్‌షోర్‌ ఇండస్ట్రీస్‌ల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఉదాహరణకు టాటా, శాస్కెన్‌, హెచ్‌సీఎల్‌, సింఫనీ, కేపీఐటీ క్యుమిన్స్‌, సిగ్నస్‌, క్వాల్కమ్‌, సిస్కో, బ్రాడ్‌కామ్‌, ఇంటెల్‌, శామ్‌సంగ్‌ ఇతర సంస్థల వివరాలకు http://bit.ly/1EVqXw9; http://bit.ly/1KzD5Bl లని చూడండి.

బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాను. బ్యాక్‌లాగ్‌ల కారణంగా ఒక సంవత్సరం ఆలస్యమైంది. ప్రస్తుతం నాకు బీటెక్‌లో 68 శాతం మార్కులున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హుడినేనా?

మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. అయితే గేట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ప్రభుత్వరంగ సంస్థలు తీసుకుంటాయి. కాబట్టి మీరు గేట్‌లో మంచి మార్కులు సంపాదించండి. దీని తర్వాత బృంద చర్చ, వ్యక్తిగత మౌఖికపరీక్ష ద్వారా నియామకాలు జరుగుతాయి. ఉదాహరణకు ఎన్‌టీపీసీ వారి ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ నియామకాల నోటిఫికేషన్‌ (http://ntpccareers/net/et15/my_files/advt_et15.pdf) చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

బీఈ (సీఎస్‌ఈ) నాలుగో సంవత్సరం చదువుతున్నాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటర్‌ తరువాత రెండు సంవత్సరాలు, బీఈ మూడో సంవత్సరం తరువాత ఒక సంవత్సరం చదువు ఆపేశాను. ఇది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపై ప్రభావం చూపుతుందా?

ఇలాంటివాటిని మీరు ఇంటర్వ్యూలో ఎలా సమర్థించుకుంటారో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇక ఎంఎన్‌సీ/ త్వరితంగా ఎదుగుతున్న ఇతర సంస్థల వారు ముఖ్యంగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కి వచ్చేపుడు ఎలాంటి విరామం, బ్యాక్‌లాగ్‌ లేకుండా ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు ఉన్నవారినే తీసుకోవడానికి సుముఖత చూపుతారు. ఇక స్టార్ట్‌అప్‌ సంస్థ విషయానికి వస్తే వారు కేవలం మార్కులు/ అకడమిక్‌ రికార్డుని ఉద్దేశించి కాకుండా వారికి మీ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడుతాయనేది చూస్తారు. కాబట్టి మీరు స్టార్ట్‌అప్‌ సంస్థలను సంప్రదించండి. మీ కెరియర్‌ను సీఎస్‌ఈలో నచ్చిన అంశం (ఉదా: మొబైల్‌ అప్లికేషన్‌, వెబ్‌సైట్‌ అప్లికేషన్‌/ బ్యాంకింగ్‌/ ఇతర డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌)లపై ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా మొదలుపెట్టండి. ఈ అనుభవంతో చిన్న సంస్థల్లో 2- 3 సంవత్సరాల అనుభవం వచ్చాక ఇక మీ మార్కులూ, విరామం మీ ఎదుగుదలకు అడ్డుకావు.

బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాను. బీఈఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ లాంటి ఎలక్ట్రానిక్స్‌ సంస్థల్లో ఉద్యోగానికి తోడ్పడే షార్ట్‌ టర్మ్‌ కోర్సులను తెలియజేయండి?

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) అనేది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలో ప్రవేశం కోసమే కాకుండా బీఈఎల్‌, బీహెచ్‌ఎల్‌ లాంటి ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలకు కనీస అర్హత అన్నది తెలిసిందే. కాబట్టి ఇంజినీరింగ్‌లో మీకున్న సబ్జెక్టులన్నీ పూర్తిగా మళ్లీ అధ్యయనం చేయండి. ఇక మీ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ కెరియర్‌లో ఎదుగుదలకు ఈ కింది వాటిలోంచి మీకు ఇష్టమైన అంశాన్ని ఎంచుకోండి. ఫొటోఒల్టాయిక్‌ సిస్టమ్స్‌; ఇన్‌స్ట్రుమెంటేషన్‌ & పీఎల్‌సీ సిస్టం; పవర్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టం (ఇన్వర్టర్స్‌, యూపీఎస్‌, డ్రైవర్స్‌, రెక్టిఫయర్స్‌); సర్క్యూట్‌ డిజైనింగ్‌; డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌; ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌; పీసీబీ డిజైనింగ్‌; స్కాడా కమ్యూనికేషన్‌; వీఎల్‌ఎస్‌ఐ టెస్టింగ్‌. బీఈఎల్‌ వారి నియామక ప్రకటనల కోసం ఈ http://bit.ly/14Hd5Eq లింక్‌ను చూసి మరిన్ని అర్హత వివరాలు తెలుసుకోండి. ఎలాంటి ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లకుండా ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఉదా: http://bit.ly/1wfL8dA, http://bit.ly/1CeKz8j, http://bit.ly/1yqKkXv.

బీటెక్‌ (ఈసీఈ) 2011లో పూర్తిచేశాను. ఎంటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. పీహెచ్‌డీ జర్మనీ/ జపాన్‌లో చేయాలనుంది. మార్గాలేంటి? నేనేం చేయాలి?

తక్కువ ఖర్చుతో, నాణ్యతతో కూడిన పీహెచ్‌డీలకు జర్మనీ ఒక మంచి ప్రదేశం అని చెప్పవచ్చు. మీరు జర్మనీలో ట్రెడిషనల్‌/ ఇండివిడ్యుయల్‌ (సూపర్‌వైజర్‌/ గైడ్‌ను ఎంచుకుని)/ స్ట్రక్చర్డ్‌ డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్‌ (యూనివర్సిటీ) ద్వారా పీహెచ్‌డీ చేయవచ్చు. వివిధ విశ్వవిద్యాలయాలు, అవి అందించే కోర్సుల వివరాలకు http://bit.ly/1x8JETK ని చూడండి. జర్మన్‌ అకడమిక్స్‌ ఎక్ఛేంజ్‌ సర్వీస్‌ (డీఏఏడీ) ఉపకార వేతనాల వివరాల కోసం ఈ http://bit.ly/1xvtRxj లింక్‌ను చూడండి. అర్హత, ఇతర వివరాలకు ఈ http://bit.ly/1ubBqsR ని చూడండి. ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగావకాశాల వివరాలకు www.academics.com/ ని చూడండి. జపాన్‌ ప్రభుత్వ వివిధ విశ్వవిద్యాలయాలు/ కోర్సుల కోసం http://bit.ly/1Cut9VQ, ఉపకార వేతనాల వివరాలకు http://bit.ly/BAao6r ని చూడండి. అర్హత, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌, ఇతర వివరాలకు ఈ వెబ్‌సైట్‌ http://bit.ly/1xvyLdG ని చూడండి. వీటిని బాగా అధ్యయనం చేసి సరైన కోర్సు, ప్రదేశాన్ని ఎంచుకోండి.

బీటెక్‌ (ఈసీఈ) 2013లో పూర్తిచేశాను. కోర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఉద్యోగావకాశాలున్నాయా? అందుకు బీటెక్‌ సరిపోతుందా? ఎంటెక్‌ వంటి పై చదువులు చదవాలా?

మీరు ఎలాంటి పై చదువులూ లేకుండానే బీటెక్‌ (ఈసీఈ)తో ఉద్యోగం సంపాదించవచ్చు. కాకపోతే మీకు నచ్చిన అంశం గురించి మీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ ఉండండి. ఉదాహరణకు ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్‌ & మెషీన్స్‌, సిగ్నల్స్‌ & సిస్టమ్స్‌, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, మైక్రోప్రాసెసర్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, ఆప్టికల్‌ సిస్టమ్స్‌, వీఎల్‌ఎస్‌ఐ లాంటి వాటిలో ఒకదానిపై దృష్టిపెట్టండి. ఇక ఈ అంశానికి సంబంధించిన సంస్థలను వివిధ రంగాల (కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏవియేషన్‌ & ఏవియానిక్స్‌, మాన్యుఫాక్చరింగ్‌, ఎలక్ట్రిసిటీ జనరేషన్‌ & డిస్ట్రిబ్యూషన్‌, కమ్యూనికేషన్స్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, టెలీకమ్యూనికేషన్స్‌, రేడియో & టెలివిజన్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, హాస్పిటల్‌ డయాగ్నోస్టిక్‌ ఎక్విప్‌మెంట్‌ & ఆఫ్‌షోర్‌ ఇండస్ట్రీస్‌) నుంచి వెతికి ఎంచుకుని ఉద్యోగానికి ప్రయత్నించండి. కనీసం 2-3 సంవత్సరాల అనుభవం వచ్చాక ఎంటెక్‌ చేసి పదోన్నతులకు మార్గం సులభం చేసుకోవచ్చు. లేదా పరిశోధన రంగంవైపు వెళ్లడానికి ఎంటెక్‌ తర్వాత పీహెచ్‌డీ చేయడం మంచిది.

గేట్‌ 2013లో పాస్‌ అయ్యాను. ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. ఏ కోర్సు ఎంచుకోవాలి? ఎంటెక్‌ తరువాత ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

బీటెక్‌ చేశాక ఎంటెక్‌లో చేరి విద్యార్హత విలువను పెంచుకోవడం మంచిదే. ఇది మీ భవిష్యత్తులో పదోన్నతులకు ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఇక గేట్‌లో ఉత్తీర్ణత ద్వారా ప్రసిద్ధ కళాశాలల్లో ఎంటెక్‌లో చేరడమే కాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడానికి కూడా వీలవుతుంది. బీటెక్‌లో చేసిన/ ఇష్టమైన బ్రాంచిని ఎంటెక్‌లో ఎంచుకోండి. కోర్‌ ఇంజినీరింగ్‌లో కార్పొరేట్‌ సంస్థల్లో ప్రొఫెషనల్‌ ఇంజినీర్‌గా కాకుండా మేనేజర్‌ స్థానానికి ఎదగడానికి ఎంటెక్‌ ఉపయోగపడుతుంది. ఇంకా పీహెచ్‌డీ చేసి టెక్నికల్‌ లిటరేచర్‌, ఐడియా ప్రోటోటైప్‌, పేపర్‌, విద్యార్థులకు గైడ్‌ చేయడంతోపాటు ప్రొఫెసర్‌ రీసెర్చ్‌లో సహకరిస్తూ రీసెర్చ్‌ అకడమిక్‌ అనుభవాన్ని పెంచుకోవచ్చు. ఎంచుకున్న సబ్జెక్టులో ఎంటెక్‌ ద్వారా ఇంకా లోతుగా వెళ్లి దానిలోనే కెరియర్‌ను ఆరంభించండి.

బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాను. ఐటీ రంగంలో స్థిరపడాలనుకుంటున్నాను. PHP, MySQL నేర్చుకున్నాను. వీటిలో ఉద్యోగాలు, భవిష్యత్తు వివరాలు తెలపండి. అదనంగా ఏం నేర్చుకోవాలి?

క్రియాశీల వెబ్‌సైట్లను తయారుచేయడానికి వాడే LAMP టెక్నాలజీలో సర్వర్‌కు సంబంధించిన స్క్రిప్టింగ్‌ లాంగ్వేజ్‌ పీహెచ్‌పీ (హైపర్‌టెక్ట్స్‌ ప్రీ ప్రాసెసర్‌). ఫేస్‌బుక్‌ లాంటి ప్రముఖ సంస్థలు వారి వెబ్‌సైట్‌ను పీహెచ్‌పీతో తయారు చేశారన్నది తెలిసిన విషయమే. వాళ్లు 2004 నుంచి దీనిని వాడుతూనే ఉన్నారు. అనుభవం లేకపోయినా పీహెచ్‌పీలో నైపుణ్యాలు కలిగి ఉన్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌, ఇన్‌స్టిట్యూషన్‌, బ్యాంకులు, స్కూలు ఇలా పలు సంస్థల్లో వారి వెబ్‌సైట్‌/ పోర్టళ్ళకు సంబంధించి ప్రాజెక్టుల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కొన్ని ఉద్యోగావకాశాలకు ఈ వెబ్‌సైట్‌లను చూడండి: http://bit.ly
http://bit.ly/1CpsVxj, http://bit.ly/1ockBk4. మీరు LAMP అంటే Linux, Apache, MySQL, PHPలతోపాటు HACK, CMS టూల్స్‌ అంటే జూమ్లా, ద్రుపాల్‌, పైథాన్‌ వంటివి నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్‌ అవుతూ ఉండండి. ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. http://hacklang.org/tutorial, http://bit.ly/Zw5PbZ.

బీటెక్‌ (ఈసీఈ) చేశాను. ఎంటెక్‌లో నానో టెక్నాలజీ కోర్సు ఎంచుకోవచ్చా? ప్రాంగణ నియామకాలను అందించే సంస్థలేవి? పీహెచ్‌డీ చేసే వీలుంటుందా?

అవును. మీరు ఎంటెక్‌లో నానో టెక్నాలజీ కోర్సు ఎంచుకోవచ్చు. పీహెచ్‌డీ లేకుండా నానోటెక్నాలజీలో ఎదుగుదలకు అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు. నానో- బయోటెక్నాలజీ, సిరామిక్‌ ఇంజినీరింగ్‌, గ్రీన్‌ నానో టెక్నాలజీ, మెటీరియల్స్‌ సైన్స్‌, నానో ఆర్కిటెక్టానిక్స్‌, నానో ఇంజినీరింగ్‌, నానో మెకానిక్స్‌, వెట్‌ నానో టెక్నాలజీ, నానో-మెడిసిన్‌ లాంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మెడికల్‌, హెల్త్‌కేర్‌ రీసెర్చ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇండస్ట్రీస్‌, ఫార్మాస్యూటికల్‌, అగ్రికల్చర్‌, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌, ఆర్‌అండ్‌డీ ఉన్న కంపెనీలు వీరిని నియమించుకుంటాయి.
జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌, బెంగళూరు అందించే కోర్సుల వివరాలకు http://www.jncasr.ac.in/admit/ ను చూడండి. ఇంకా ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌, అమృత, అమిటీ, శాస్త్ర సంస్థల్లో పై చదువులకు వెళ్లవచ్చు. నానో టెక్నాలజీ భవిష్యత్తుపై http://bit.ly/1vj8ti6 నివేదిక చదివి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

బీటెక్‌ (ఈసీఈ) చివరి సంవత్సరం చదువుతున్నాను. సాంకేతిక విభాగంలో కెరియర్‌ను మలచుకోవాలనుకుంటున్నాను. ఏ విభాగాలు ఎంచుకోవచ్చు?

ఈసీఈ సబ్జెక్టుల్లో మీకు నచ్చిన అంశం వివరిస్తే బాగుండేది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి ఈ కింది రంగాల్లో మీ కెరియర్‌ను ఆరంభించవచ్చు.
* కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌లో ప్రాడక్ట్‌ డిజైన్‌, హార్డ్‌వేర్‌/ పీసీబీ డిజైన్‌, ప్రాడక్ట్‌ టెస్టింగ్‌ లాంటి ఉద్యోగావకాశాలు శాంసంగ్‌, ఆపిల్‌, సోనీ లాంటి కంపెనీల్లో ఉంటాయి.
* ఆటోమొబైల్‌ రాబర్ట్‌బోస్చ్‌, డెల్ఫి లాంటి కంపెనీల్లో వెహికల్‌ తయారీకి ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌, దానికి సంబంధించిన ఇతర కంపోనెంట్‌ డెవలప్‌ చేయడానికి ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్ల అవసరం ఉంటుంది.
* ఎంబెడెడ్‌/ వీఎల్‌ఎస్‌ఐ: సాస్కెన్‌, టాటా, టెక్సాస్‌ లాంటి ప్రాడక్ట్‌/ సర్వీస్‌ కంపెనీల్లో ఎంబెడెడ్‌ సిస్టం హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, చిప్‌ లెవెల్‌ డిజైన్‌ (వీఎల్‌ఎస్‌ఐ) ఇంజినీర్లకు అవకాశాలుంటాయి.
* సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఇతర సీఎస్‌ఈ/ ఐటీ బ్రాంచి వారితోపాటు సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లు, వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌ అప్లికేషన్స్‌... ఇలాంటి వాటిలో అవకాశాలుంటాయి.
* ఇవే కాకుండా ఇస్రో, డీఆర్‌డీవో, బీఏఆర్‌సీ లాంటి ప్రభుత్వ రంగాల్లో/ పైన తెలిపినవాటిలో మీరు సొంత వ్యాపారం మొదలు పెట్టవచ్చు.

బీటెక్‌ (ఈసీఈ) 2013లో పూర్తిచేశాను. నాకు opto ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌లో ఎంటెక్‌ చేయాలని ఉంది. ప్రస్తుతం వీటికి మనదేశంలో ఎటువంటి ఆదరణ ఉంది? వీటిని అందించే విశ్వవిద్యాలయాల వివరాలు తెలుపగలరు.

Opto ఎలక్ట్రానిక్స్‌లో ఇప్పుడు అవకాశాలు తక్కువగానే ఉంది. కానీ కమ్యూనికేషన్‌, హెల్త్‌కేర్‌, డిఫెన్స్‌ రంగాల్లో సరికొత్త సెన్సార్‌ డివైస్‌, మెటీరియళ్ల అవసరం డిఫెన్స్‌లో పెరుగుతున్నందువల్ల opto ఎలక్ట్రానిక్స్‌కి ఆదరణ పెరుగుతుందనే చెప్పాలి. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ డక్టింగ్‌, ఫైబర్‌బ్లోయింగ్‌, స్త్ల్పెసింగ్‌లతోపాటు ఆప్టికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ సర్వేయింగ్‌, డిజైనింగ్‌లలో అవకాశాలు పెరుగుతున్నాయి.
ఓఎస్‌ఐ ఆప్టో ఎలక్ట్రానిక్స్‌, హైదరాబాద్‌; ఆప్టో ఎలక్ట్రానిక్స్‌ ఫాక్టరీ, డెహ్రాడూన్‌; ఆప్టో ఎలక్ట్రానిక్స్‌ ప్రై.లి., బెంగళూరు; ఎస్‌ఎఫ్‌ఓ టెక్నాలజీస్‌, కొచ్చిన్‌; శాటిలైట్‌ ఆప్టికల్‌ టెక్నాలజీస్‌ లి., పూణే; తేజాస్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా లి., బెంగళూరు; ఆప్టో సర్క్యూట్స్‌ (ఇండియా) లి., బెంగళూరు; క్వాలిటీ ఫొటోనిక్స్‌ ప్రై. లి., హైదరాబాద్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఇక ఎంటెక్‌ చేయడానికి ఐఐటీ మద్రాస్‌, ఢిల్లీ, ఖరగ్‌పూర్‌ వారితోపాటు కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌& టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ కలకత్తా లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలున్నాయి.

ఈసీఈ బ్రాంచి వారికి ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ వివరాలు తెలపండి.

ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్షలు దాదాపు అన్ని కేంద్రప్రభుత్వ సంస్థల్లో ఏ, బీ గ్రేడ్‌ ఉద్యోగాల కోసం. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. ఇది మూడు రోజులు జరిగే పరీక్షాక్రమం. మొదటి రోజు జరిగే పరీక్షలో అర్హులైతేనే (జనరల్‌ ఎబిలిటి, జనరల్‌ ఇంగ్లిష్‌లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు) రెండో రోజు జరిగే సబ్జెక్టుకు సంబంధించి ఆబ్జెక్టివ్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. అలాగే రెండో రోజు పరీక్షలో అర్హులైతేనే మూడోరోజు సబ్జెక్టుకు సంబంధించిన వివరణాత్మక పరీక్ష మూల్యాంకనం ఉంటుంది. ఇవన్నీ కలిపి మొత్తం 1000 మార్కులుంటాయి. తరువాత ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది. సాధారణంగా రాత పరీక్షలు ఆగస్టు నెలలో, ఇంటర్య్వూలు జనవరి నెలలోనూ ఉంటాయి. వివరాలకు www.eenadu.net చూడండి. ఈసీఈ అభ్యర్థుల ఉద్యోగావకాశాలు ఈ వెబ్‌సైట్లో ఉన్నాయి.

బీటెక్‌ (ఈసీఈ) చదివాను. టెలికాం రంగంలో ఉద్యోగం సంపాదించడానికి కోర్సులు, ఉపాధి వివరాలు తెలుపగలరు. ఏది ఎంచుకుంటే నా కెరియర్‌కు మేలు?

ఐఐటీలు, ఐఐఎం వాళ్లు ఐటీ, టెలికమ్యూనికేషన్‌ రంగంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌, జెడ్‌టీఈ, హువాయి వాళ్లతో కలిసి సర్టిఫైడ్‌ ఐసీటీ ప్రొఫెషనల్‌ అనే ప్రోగ్రామును మొదలుపెట్టారు. దీని కాలవ్యవధి 12 నెలలు. ఇందులో మొదటి 6 నెలలు శిక్షణ ఇచ్చి మిగతా 6 నెలలు ఇంటర్న్‌షిప్‌- తర్వాత ప్లేస్‌మెంట్‌ జరుగుతాయి.
ఇందులో వైర్‌లెస్‌ టెక్నాలజీ, ఆర్‌ఎఫ్‌ ఇంజినీరింగ్‌, రేడియో ఆక్సెస్‌, ట్రాన్స్‌మిషన్‌, కోర్‌ నెట్‌వర్క్స్‌, ఐపీ- డేటాకామ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి వాటిపై శిక్షణనిస్తారు. దీనిలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌- హైదరాబాద్‌, హువాయి- గుర్గాన్‌, జెడ్‌టీఈ- బెంగుళూరుకు తీసుకెళ్లి ప్రాయోగిక శిక్షణ (ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) ఇస్తారు. తద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌, హువాయి, టాటా టెలీసర్వీసెస్‌, జెడ్‌టీఈ, రిలయన్స్‌, క్వాల్‌కామ్‌, ఆస్టర్‌, ఏటీ&టీ, బీమ్‌ వంటి సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసి ఉద్యోగం సంపాదించవచ్చు. శిక్షణ ప్రోగ్రాం కోసం http://bit.ly/12pSKMq లింకును చూడండి.

2012లో ఈసీఈ బ్రాంచితో బీటెక్‌ ముగించాను. ఎంఎస్‌సీ (స్టాటిస్టిక్స్‌) చేయాలనుంది. నేను చెయ్యవచ్చా?

ఏదేని ఒక కోర్సులో పీజీ చెయ్యాలంటే దానికి సంబంధించిన సబ్జెక్టు డిగ్రీలో కనీసం రెండేళ్లపాటు చదివి ఉండాలి. మీకు బీటెక్‌ (ఈసీఈ)లో ఒకే ఒక సెమిస్టరులో ప్రాబబిలిటీ అండ్‌ రాండమ్‌ వేరియబుల్స్‌ అనే సబ్జెక్టు మాత్రం చదువుకుంటారు. కాబట్టి మీరు ఎంఎస్‌సీ (స్టాటిస్టిక్స్‌) చెయ్యడానికి వీలు పడదు.

బీటెక్‌ (ఈసీఈ) 2013లో పూర్తిచేశాను. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీ కండక్టర్స్‌పై ఆసక్తి ఉంది. ఈ కోర్సులను అందించే సంస్థల వివరాలు, ఉద్యోగావకాశాలను తెలుపగలరు.

ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ లాంటి కోర్సుల గురించి సీడీఏసీ, యూటీఎల్‌ టెక్నాలజీస్‌, వేదా ఐఐటీ, సాందీపనీ, సిగ్మా సొల్యూషన్స్‌ అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌, సీఐటీడీ, సెంటర్‌ ఫర్‌ డీఎస్‌పీ ట్రైనింగ్‌ సంస్థల్లో సంప్రదించండి. మెంటార్‌ గ్రాఫిక్స్‌, సినాప్సిస్‌, గ్జిలింక్స్‌, కోనెగ్జాంట్‌, ఏఎమ్‌డీ, మాషిప్‌, సస్కెన్‌, ఎనలాగ్‌ డివైజెస్‌, ఫస్ట్‌పాస్‌, స్మార్ట్‌ప్లే, రుద్రాక్ష టెక్నాలజీస్‌ వంటి ఎన్నో సంస్థల్లో ఎనలాగ్‌ డిజైన్‌, ఆర్‌ఎఫ్‌ డిజైన్‌, డిజిటల్‌ డిజైన్‌, ఏఎస్‌ఐసీ, ఫుల్‌ కస్టమ్‌ చిప్‌, ఎఫ్‌పీజీఏ, సీపీఎల్‌డీ, పీఎల్‌డీస్‌, memory- RAM, ROM, ఫ్లాష్‌, ఫాబ్రికేషన్‌ వంటి ఎన్నో సెమీ కండక్టర్‌కి సంబంధించిన ఏరియాల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

బీటెక్‌ (ఈసీఈ) రెండో సంవత్సరం చదువుతున్నాను. మా బ్రాంచి వారికి బీఎస్‌ఎన్‌ఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ మొదలైన సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయని విన్నాను. వాటిలో ఉద్యోగ సాధనకు రాయాల్సిన పరీక్షల గురించి తెలపండి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలో జూనియర్‌ టెలికాం ఆఫీసర్‌ (జేటీఓ) అనే పోస్టులకు ఈసీఈ పూర్తిచేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి వయసు 21- 35 మధ్యలో ఉండి, ఇంజినీరింగ్‌లో కనీసం 50 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు జరుగుతాయి. రాతపరీక్ష సిలబస్‌ కోసం www.engineersinstitute.com/pdf/jto_syllabus.pdf వెబ్‌సైట్‌ని చూడండి. మీరు జేటీఓ నోటిఫికేషన్‌ కోసం మాత్రం http://bsnl.co.in/ వెబ్‌సైట్‌ని అనుసరిస్తూ ఉండండి. బీహెచ్‌ఈఎల్‌లో అయితే ఇంజినీర్‌ ట్రైనీలు అనే పోస్టుకి గేట్‌లో అర్హతని బట్టి ఈసీఈ వాళ్లని తీసుకుంటారు. 2013లో జరిగే నియామకాల గురించి http://careers.bhel.in/et_gate2013/static/etgate2013.pdf ని చూడండి. బీహెచ్‌ఈఎల్‌ వారి http://careers.bhel.in అనుసరిస్తూ ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుంటూ ఉండండి.

బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. ఎంబెడెడ్‌ గురించిన పూర్తి వివరాలు తెలపండి.

ఎలక్ట్రానిక్స్‌ ఫర్‌ యూ(http://electronicsforu.com) వంటి మేగజీన్లను చదువుతుండండి. ఎంబెడెడ్‌ కోర్సులు చేసినవారికి కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌, టెలికమ్యూనికేషన్స్‌, ప్రాడక్ట్‌ మాన్యుఫాక్చరర్స్‌ (మెడికల్‌, డిఫెన్స్‌ వగైరా) వంటి ఎన్నో రంగాల్లో హార్డ్‌వేర్‌ డిజైనర్‌, ASIC డిజైనర్‌, బోర్డ్‌ సపోర్ట్‌ పాకేజీ డెవలపర్‌, ప్రోటోకాల్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డెవలపర్‌/ డిజైనర్‌/ ఇంజినీర్‌, ప్రాడక్ట్‌ డిజైనర్‌/ ఇంజినీర్‌/ ఆర్కిటెక్ట్‌లుగా కెరియర్‌ మలచుకోవచ్చు. C-DAC (http://cdachyd.in/) వంటి సంస్థల్లో ఎంబెడెడ్‌పై శిక్షణ కోర్సుల్లో చేరొచ్చు. టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, ఇంటెల్‌, సిప్రెస్‌, సైమన్స్‌, జీఈ, మైక్రోచిప్‌, ఆంటెల్‌ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలూ ఉంటాయి. ఎంబెడెడ్‌పై నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి పాఠాలను ఉచితంగా ఈ వీడియో లింక్‌ http://bit.ly/1asRZs0, http://bit.ly/17RIZfx, http://bit.ly/1b8q9UA చూడండి.

ఈసీఈ చివరి సంవత్సరం చదువుతున్నాను. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఆసక్తి ఉంది. ఇందుకు వేటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది?

ఈసీఈ చేసినంతమాత్రాన కోర్‌లోనే ఉద్యోగం చేయాలనేమీ లేదు. మీకు నచ్చిన సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే మీ కెరియర్‌ను మలుచుకోవచ్చు. మొదటగా మీరు ఈ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి. ఆ రంగంలో ఉన్న అనుభవజ్ఞుల ద్వారా గానీ, ఇంటర్నెట్‌ ఉపయోగించి అయినా సరే- సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌, టెస్ట్/QA ఇంజినీర్‌, నెట్‌వర్క్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజినీర్లలో మీకు నచ్చిన రంగం- బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్స్యూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), హెల్త్‌కేర్‌, టెలికాం, రిటైల్‌, ఈ-కామర్స్‌ ఎంచుకోండి. ఎంచుకున్నదానికి తగిన ప్రాజెక్టులు చేస్తూ మీ పరిజ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ప్రాజెక్ట్‌/ ఇంటర్న్‌షిప్‌ల కోసం తెలిసినవాళ్ల నుంచి లేదా ఇంటర్నెట్‌ (ఉదా: letsintern.com)ద్వారా తెలుసుకోండి. ఇలా చేస్తూ మీరు ఉద్యోగానికి చిన్న/మధ్య/ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్న కంపెనీల్లో మొదలుపెట్టటం కెరియర్‌ ఎదుగుదలకు ఎంతో సహకరిస్తుంది.

ఇంజినీరింగ్‌ (ఈసీఈ) పూర్తి చేశాను. ఆగస్టులో సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్తున్నాను. రెండు దేశాల్లో ఈ రంగం భవిష్యత్తును తెలపండి.

సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ వాడకం అన్ని దేశాల్లో పెరుగుతున్నందున ఈ రంగంలో అవకాశాలు ఎక్కువే. ఎనలాగ్‌ సిగ్నల్‌, డిజిటల్‌ సిగ్నల్‌, స్టాటిస్టికల్‌ సిగ్నల్‌, ఆడియో సిగ్నల్‌, స్పీచ్‌ సిగ్నల్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, వీడియో సిగ్నల్‌, అర్రే సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లుగా విభజిస్తారు. సిగ్నల్‌ ప్రాసెసింగ్‌లో మంచి అవకాశాల కోసం అసెంబ్లీ లాంగ్వేజ్‌, c, c++లో మంచి అవగాహన, రియల్‌ టైం ప్రోగ్రామింగ్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఆల్‌గారిథమ్స్‌, టైం కన్‌స్త్ట్రెంట్స్‌లో నైపుణ్యం ఉండాలి. ముఖ్యంగా డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌కు ఆదరణ ఎక్కువ. NASSCOM వాళ్లు డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ ఉద్యోగావకాశాలకు, ఎదుగుదలకు మంచిదని తెలిపారు.
డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌కి నంబర్‌, గణితంలో ప్రావీణ్యం అవసరం. పరిశ్రమ, స్పీచ్‌ గుర్తింపు, కమ్యూనికేషన్‌, కన్వర్జెన్స్‌ వాటిలో ముందుకు వెళ్తుంది. మీకు టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, మోటరోలా, లూసెంట్‌, ఎనలాగ్‌ డివైసెస్‌, ఇన్‌టెల్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీల్లో అవకాశాలు ఇపుడు, రాబోయే రోజుల్లో పుష్కలంగా ఉంటాయి.

ఈసీఈ చివరి సంవత్సరం చదువుతున్నాను. కోర్‌ హార్డ్‌వేర్‌ విభాగంలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంది. హార్డ్‌వేర్‌ శిక్షణ సంస్థల వివరాలు తెలుపగలరు.

ఈసీఈ పూర్తి చేసిన విద్యార్థులకు కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్‌, రియల్‌టైమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, డిజైన్‌ పాటరన్స్‌/ సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌, ఆల్గారిథమ్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లలో అవగాహన ఉంటే ఎంతో మేలు. పలు వ్యాపార సంస్థలు, వాటి కార్యకలాపాలను పలు దేశాల్లో విస్తరిస్తున్న ఈరోజుల్లో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌ ఆవశ్యకత ఎంతో ఉంది. కోర్‌ హార్డ్‌వేర్‌ విభాగంలో ప్రధానంగా నెట్‌వర్కింగ్‌, ఎంబెడెడ్‌ లేదా వీఎల్‌ఎస్‌ఐ వంటి కోర్సులు మీ ఉద్యోగవేటకు ఎంతగానో ఉపయోగపడతాయి.
సిస్కో సర్టిఫికేషన్‌ కోర్సుల కోసం http://ipsol.in/; ఎంబెడెడ్‌ లేదా వీఎల్‌ఎస్‌ఐ వంటి కోర్సుల వివరాలకు http://www.cdachyd.in/ వెబ్‌సైట్‌లను చూడండి. మీరు coursera.org, udacity.comలో ఈ హార్డ్‌వేర్‌కి సంబంధించిన శిక్షణ వీడియోలు ఉచితంగా పొందవచ్చు.

ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పూర్తి చేశాను. పీఎల్సీ, డీసీఎస్‌, స్కాడాల్లో పూణేలో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాను. శిక్షణ సంస్థల వివరాలు తెలుపగలరు.

పుణేలో ప్రొలిఫిక్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి. http://www.prolifictraining.com/instrumentation-engineering-corporate.html); PLC Automation Training (http://www.plctrg.com/plc-courses.html); PLC SCADA Automation Training (http:// www. plcscada.net/ plc_scada_pdf.pdf) లాంటి ఇన్‌స్టిట్యూట్‌ల్లో ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోలర్‌ (PLC)/ డిస్ట్రిబ్యూటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ (DCS), సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌ (SCADA)ెపౖ శిక్షణ కోర్సులు నిర్వహిస్తారు.
వీటిలో చేరేముందు అందులో శిక్షణ తీసుకున్న కొందరు విద్యార్థులను సంప్రదించి ట్రైనింగ్‌ ప్రోగ్రామింగ్‌ గురించి మరిన్ని వివరాలు సేకరించండి. ఇలా మీకు బాగా ఉపయోగపడే శిక్షణ సంస్థ ఏదో తెలుసుకోండి. ఇంకా మీరు పలు టెక్నికల్‌ ఫోరాల్లో చేరడం లేదా ఉచితంగా లభించే http://www.electricityguide.info/, http://www.slideshare.net/orlandomoreno/scada-1964031వంటి వెబ్‌సైట్‌ల ద్వారా మీ అవగాహన పెంచుకుంటూ ఉండండి.

ఈసీఈ (2013) పూర్తి చేశాను. కమ్యూనికేషన్‌ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. టెలికాంలో ఉద్యోగం సంపాదించే సమాచారం తెలియజేయగలరు.

ఐఐటీ, ఐఐఎం వారు ఐటీ, టెలికమ్యూనికేషన్‌ రంగంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌, జెడ్‌టీఈ, హవాయ్‌ వారితో కలిసి 'సర్టిఫైడ్‌ ఐసీటీ ప్రొఫెషనల్‌' అనే ప్రోగ్రాంను మొదలుపెట్టారు. దీని కాలవ్యవధి 12 నెలలు. ఇందులో మొదటి 6 నెలలు శిక్షణ ఇచ్చి మిగతా 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ తర్వాత ప్లేస్‌మెంట్లు జరుపుతారు. ఇందులో వైర్‌లెస్‌ టెక్నాలజీ, ఆర్‌ఎఫ్‌ ఇంజినీరింగ్‌, రేడియో ఆక్సెస్‌, ట్రాన్స్‌మిషన్‌, కోర్‌ నెట్‌వర్క్స్‌, ఐపీ-డేటాకామ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. దీనిలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌-హైదరాబాద్‌, హవాయ్‌ -గుర్గావ్‌, జెడ్‌టీఈ- బెంగుళూరుకు తీసుకెళ్లి ప్రాయోగిక శిక్షణ ఇస్తారు. తద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌, హవాయ్‌, టాటా టెలీసర్వీస్‌స్‌, జెడ్‌టీఈ, రిలయన్స్‌, క్వాల్‌కామ్‌, ఆస్టర్‌, ఏటీఅండ్‌టీ, బీఈఏఎం ఇలాంటి పలు సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేసి ఉద్యోగం సంపాదించవచ్చు. శిక్షణ కోసం ఈ http://bit.ly/12pSKMq లింక్‌ను చూడండి.

బీటెక్‌ (ఈసీఈ) 2012లో పూర్తి చేశాను. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. నాకు వీఎల్‌ఎస్‌ఐపై ఆసక్తి ఉంది. వాటిల్లో ఉద్యోగ అవకాశాలను గురించి తెలపండి?

very large scale integration (VLSI)అనేది ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ డిజైన్‌. దీన్ని చిప్‌ డిజైన్‌ అని కూడా అంటారు. మీరు ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ చేశారు కాబట్టి వీఎల్‌ఎస్‌ఐ మీకు తగినదే. వీఎల్‌ఎస్‌ఐ ఇంజినీర్లు verilog, VHDL వంటి హార్డ్‌వేర్‌ డిస్క్రిప్షన్‌ లాంగ్వేజెస్‌ (HDS) వాడినా కూడా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ మీలోని ఐక్యూ, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను చూస్తాయి. మీరు నిజంగా ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ ఇష్టపడితే సెమీకండక్టర్‌ పరిశ్రమలో చాలా అవకాశాలున్నాయి. దీనిలో మీరు ఫ్రంట్‌ ఎండ్‌ డిజైనర్‌- ఏఎస్‌ఐసీ/ఎఫ్‌పీజీఏ, బాక్‌ఎండ్‌ డిజైనర్‌, ఏఎమ్‌ఎస్‌ డిజైనర్‌, డీఎఫ్‌టీ ఇంజినీర్‌, పీసీబీ డిజైనర్‌ (బోర్డ్‌ డిజైన్‌), లైబ్రరీ డెవలపర్‌, ఫ్రంట్‌-ఎండ్‌ వెరిఫికేషన్‌ ఇంజినీర్స్‌, వేలిడేషన్‌ ఇంజినీర్స్‌, మోడలింగ్‌ ఇంజినీర్స్‌, వెరిఫికేషన్‌ కన్‌సల్టెంట్స్‌, సీఏడీ ఇంజినీర్‌, ఫీల్డ్‌ అప్లికేషన్‌ ఇంజినీర్‌ (ప్రీ-సేల్స్‌), కార్పొరేట్‌ అప్లికేషన్‌ ఇంజినీర్‌ (పోస్ట్‌-సేల్స్‌), అప్లికేషన్‌ కన్సల్టెంట్స్‌ వంటి అవకాశాలుంటాయి.
http://vlsi-india.org/వెబ్‌సైట్‌ను అనుసరిస్తూ కొత్త విషయాలు, ఇతర వర్క్‌షాపుల గురించి తెలుసుకుంటూ ఉండండి. http:/bit.ly/124UiMgవెబ్‌సైట్‌ ద్వారా వివిధ కంపెనీల్లో వీఎల్‌ఎస్‌ఐకి సరిపడే అవకాశాలు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకోండి.

నేను ఈసీఈ ఇంజినీరింగ్‌ 2011లో పూర్తిచేశాను. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ నేర్చుకున్నాను. ఇంకా c, c++ లలో ప్రావీణ్యం ఉంది. కానీ ఉద్యోగం ఎలా సంపాదించాలో తెలియడం లేదు.

కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏరోస్పేస్‌, టెలీకమ్యూనికేషన్స్‌ లేదా ప్రోడక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ లాంటి రంగాల్లో మీకు అవకాశాలు ఉంటాయి. ఈ http://bit.ly/15nsvM8 జాబితాలో మీకు తగిన ప్రారంభ కంపెనీలను ఎంచుకొని వారిని ఉద్యోగం కోసం సంప్రదించండి. ఇక మీరు హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌, ఏఎస్‌ఐసీ ఇంజినీర్‌, బోర్డు సపోర్ట్‌ ప్యాకేజ్‌ డెవలపర్‌, ప్రోటోకాల్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌, ఆటోమేషన్‌ సొల్యూషన్‌ డెవలపర్‌, డివైస్‌ డ్రైవర్‌ డెవలపర్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌/ ఆర్కిటెక్ట్‌ ఇంజినీర్‌ లేదా ఎంబెడెడ్‌ సిస్టం డెవలపర్‌/ డిజైన్‌ ఇంజినీర్‌ ... ఇలా ఎన్నోవిధాలుగా కెరియర్‌ని మలచుకోవచ్చు. ఈ http://linkd.in/11KZ7LU వెబ్‌సైట్‌ ద్వారా ఎంబెడెడ్‌లో అనుభవజ్ఞులను సంప్రదించవచ్చు. ఎంబెడెడ్‌కి సంబంధించిన గ్రూప్‌లో చేరితే ఎన్నో విషయాలు తెలుసుకోవడానికీ, ఉద్యోగం సంపాదించడానికీ సహాయం పొందవచ్చు.

ఇంజినీరింగ్‌ (ఈసీఈ) చేశాక వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ కోర్సులు పూర్తిచేశాను. నా రంగానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటం ఎలా?

గూగుల్‌ అలర్ట్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌కి సంబంధించిన కంపెనీలు, అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో టెలికమ్యూనికేషన్స్‌, డిఫెన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, రైల్‌రోడ్‌ నెట్‌వర్క్స్‌, కంజ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ పేమెంట్స్‌, స్మార్ట్‌ కార్డ్‌ పరిశ్రమలో అవకాశాలున్నాయి. వీఎల్‌ఎస్‌ఐలో అయితే డిజైన్‌ అండ్‌ పార్టిషనింగ్‌, హైపెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, న్యూట్రల్‌ నెట్‌వర్క్స్‌, మల్టీమాడ్యూల్‌ సిస్టమ్స్‌, మైక్రో ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌, రిసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. మీకు తగిన కొన్ని కంపెనీల వివరాలకు- http://bit.ly/124xHSq సైట్‌ చూడండి.

బీటెక్‌ (ఈఈఈ) పూర్తిచేశాను. సోలార్‌ ఎనర్జీపై నాకు ఆసక్తి ఉంది. దీనిగురించి మరిన్ని వివరాలు ఎలా తెలుసుకోవాలో తెలుపగలరు.

ఇష్టమున్న సోలార్‌ ఎనర్జీనే మీరు ఎంచుకోవటం మంచిది. దీనికి ఎంతో భవిష్యత్తు ఉంది. మనదేశంలో గుజరాత్‌తో మొదలై రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో దీని ప్రాముఖ్యం పెరుగుతూ వస్తోంది. మరిన్ని వివరాలకు http://shaikmohasin.wordpress.com/లాంటి బ్లాగులను అనుసరించండి. Headwaysolar లాంటివాళ్ళకు మీలాంటి ఇంజినీర్ల అవసరం ఎంతో ఉంది. careers@headwaysolar.com కి దరఖాస్తు పంపండి.

బీటెక్‌ (ఈసీఈ) పూర్తిచేశాను. కానీ, ఇంకా ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఎంబెడెడ్‌పై నైపుణ్యం వృద్ధిచేసుకోవటానికి మంచి సంస్థను సూచించండి.

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC)హైదరాబాద్‌ వారు ముఖ్యంగా డిప్లొమా ఇన్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్‌ డిజైన్‌, (DESD),డిప్లొమా ఇన్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ (DSSD),డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (DAC) లాంటి ఆరు నెలల కోర్సులను నిర్వహిస్తున్నారు. సీ-డాక్‌ హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, నోయిడా, ముంబై, పూణే, మొహలి, తిరువనంతపురంలో కూడా స్థాపించారు. ఇక్కడ ఎంబెడెడ్‌పై శిక్షణతోపాటు ప్రాజెక్టులు, సెమినార్‌, భావ వ్యక్తీకరణ నైపుణ్యం మెరుగుపరిచే కార్యక్రమాలతోపాటు కొలువులు ఎలా సంపాదించాలో కూడా వివరిస్తుంటారు. కాబట్టి, మీరు దీనిలో చేరవచ్చు.

2012 లో ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. ఇప్పుడు ఎన్‌ఐఐటీలో సీసీఎన్‌ఏ కోర్సు చేస్తున్నాను. దీనిలో నేను లైనక్స్‌ లేదా విండోస్‌ ఏ ఫ్లాట్‌ఫామ్‌ తీసుకోవాలో సలహా ఇవ్వండి.

సిస్కో సర్టిఫైడ్‌ నెట్‌వర్క్‌ అసోసియేట్‌ సెర్టిఫికేషన్‌ (సీసీఎన్‌ఏ): చాలా కంపెనీలు లైనక్స్‌ వాళ్లని తీసుకోవడానికి సుముఖత చూపిస్తాయి. అలాగే మీరు విండోస్‌లో అవగాహన సంపాదించుకుంటే ఇంకా మంచిది. మీరు మీ స్కిల్‌ను ఈ లింక్‌లో ఉండే ప్రశ్నల ద్వారా పరిక్షీంచుకోండి. http://goo.gl/ktXw8. కేవలం సర్టిఫికెట్‌లకే పరిమితం కాకుండా మీరు మీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ (అప్‌డేట్‌) ఉండండి. సీసీఎన్‌తో వెళితే మీకు నెట్‌వర్క్‌ ఇంజినీర్‌, సిస్టమ్స్‌ ఇంజినీర్‌, ఐటీ ఇంజినీర్‌, సిస్టమ్స్‌/ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్లు లాంటి అవకాశాలుంటాయి.

నేను బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. తర్వాత ఇండియాలో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. దీనికి మీరు సలహా ఇవ్వండి

గత శీర్షికలో చెప్పినవిధంగా మీరు ఎంబీఏ చేసేముందు 2- 3 సంవత్సరాలు మీకు ఇష్టమయిన రంగంలో అనుభవం తెచ్చుకోండి. ఐఎస్‌బీ, ఐఐఎం, గ్రేట్‌ లేక్స్‌, ఎస్పీ జైన్‌, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ లాంటి విద్యాసంస్థల్లో ఎక్సిక్యూటివ్‌ ఎంబీఏ చేయవచ్చు. ఉద్యోగం చేస్తున్న వాళ్లకి అయితే ఒక సంవత్సర కాలం ఉండే ప్రోగ్రాం చేయడం సరిపోతుంది. ఎంబీఏ చేసిన తర్వాత దానిని ఎలా ఉపయోగించుకున్నారో వివిధ వ్యక్తుల అనుభవాల్ని ఈ లింక్‌ ద్వారా చదివి తెలుసుకోండి.http://goo.gl/cly2n

ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. నాకు ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌పై ఇష్టం ఉంది. నాకు మైక్రో కంట్రోలర్స్‌, మైక్రో ప్రాసెసర్‌పై స్పష్టత ఇవ్వండి.

http://goo.gl/BOjHq, http://gl/zF DGLలు చూస్తే మీకు మైక్రో కంట్రోలర్స్‌, మైక్రో ప్రాసెసర్‌లపై పూర్తి అవగాహన వస్తుంది. Silicon India లాంటి వాళ్లు Virtual Classesనిర్వహిస్తుంటారు. ఈ ప్రోగ్రాంలో ఉద్యోగాల్లో ఉన్నవాళ్ల నుంచి గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ వరకూ ఎవరయినా చేయొచ్చు. ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్టుల వల్ల ఎంతో నైపుణ్యం సాధించి తద్వారా ఉద్యోగం సంపాదించడం కూడా సులభం అవుతుంది. ఎందుకంటే ఇలాంటివాటిలో ఎందరో పరిశ్రమ అనుభవజ్ఞులతో కలిసి మీ నైపుణ్యాలను తెలియపరిచి కెరియర్‌ అవకాశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా ఈ ప్రోగ్రామ్స్‌ని ఎక్కడి నుంచి అయినా అటెండ్‌ అవ్వొచ్చు. ఇంకా మీరు ఉచితంగా లభించే ఫోరమ్స్‌ లేదా బ్లాగ్స్‌ ద్వారా (http://www.embedded.com/,http://free-electrons.com/ ) ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

2012లో ఇంజినీరింగ్‌- ఈసీఈ పూర్తిచేశాను. హైదరాబాద్‌లో ఎంబెడెడ్‌ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలుంటే తెలపండి.

http://goo.gl/BpNx9 లో ఎంబెడెడ్‌ ఇంజినీరింగ్‌పై ఎప్పటికప్పుడు వఛ్చే అప్'డేట్స్ ఛూస్తూ ఉండండి. సిస్కో, మెకాఫీ, జిలింక్స్‌ వంటి సంస్థలు ఎంబెడెడ్‌ ఇంజినీర్లను తీసుకుంటున్నాయి. జిలింక్స్‌ వాళ్లు ఇంటర్న్‌షిప్‌కి కూడా అవకాశం కల్పిస్తున్నారు.

మా సోదరుడుECE 2012లో చేశాడు. MNC కంపెనీల్లో పూర్వ ఉద్యోగానుభవం ఉండాలి అంటున్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చెప్పండి.

MNCలో కంటే స్టార్టప్‌, మీడియం సైజ్డ్‌ కంపెనీలో చేస్తే అనుభవం వస్తుంది. ఎలక్ట్రానిక్స్‌లో Fibre optics Technology, Embedded systems లాంటి ఎన్నో రంగాల్లో అతడికి ఇష్టం ఉన్నది ఎంచుకోమనండి. BSNL వాళ్లు కూడా Fibre Optics Technologyలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నేను 2011లో ECE ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. జావా కి సంబంధించిన కోర్సులు చేశాను. చాలా కంపెనీల వాళ్లు ఉత్తీర్ణత 70 శాతం పైన కావాలి అంటున్నారు. అందుకే సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. కానీ నాకు ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించినవి నేర్చుకోవాలని ఉంది.

మీకు కోర్‌ ఇంజినీరింగ్‌పై ఇష్టం ఉన్నపుడు సాఫ్ట్‌వేర్‌ వైపు దృష్టి సారించకండి. మంచి చిన్నచిన్న కంపెనీల్లో సంప్రదిస్తే వాళ్లు పేపర్‌ డిగ్రీ, మార్కుల కంటే మీ నైపుణ్యాలూ, వాటిని ఉపయోగించి వాళ్లకి ఎలా లాభిస్తారు అన్నదే చూస్తారు. కనుక అలాంటి కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నించండి. ముందుగా ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ రంగంలో మీకు దేనిపై ఇష్టం ఉందో తెలుసుకోండి. ఉదాహరణకు ఇప్పుడు 4జి టెక్నాలజీలపై Tikonaలాంటి కంపెనీలు ముందుకొస్తున్నాయి. మరిన్ని వివరాలకు ఈ కథనం చదవండి. http://goo.gl/jequ5, http://www.embedded.com/, http://free-electrons.com/ వెబ్‌సైట్‌లలో embedded systems లాంటి వాటికి పలు రకాల శిక్షణ మెటీరియల్‌ ఉచితంగా లభ్యమవుతుంది.

ఈసీఈలో బీటెక్‌ 2011 లో పూర్తిచేశాను. SAPబిజినెస్‌ ఆబ్జెక్ట్‌ కోర్సు కూడా చేశాను. కానీ ఇంతవరకూ ఎలాంటి ఉద్యోగం రాలేదు. నేనింకా ఎలాంటి కోర్సు చేయాలో చెప్పండి. నాకు ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అంటే ఇష్టం. ఇంటర్న్‌షిప్స్‌ లేదా ఉద్యోగాలు హైదరాబాదులో ఎలాంటి కంపెనీల్లో ఉంటాయి?

ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీకు నచ్చినది చేయండి. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ఇష్టం ఉన్నపుడు ఇక వేరే ఏవేవో కోర్సులు చేయడం వల్ల సమయం, డబ్బూ వృథాయే కదా? ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ గురించిన పరిజ్ఞానాన్ని ఉచితంగా లభించే టెక్నికల్‌ ఫోరమ్స్‌ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. http://goo.gl/uftMHలింకులో ఇంటర్న్‌షిప్‌ గురించి వెతకండి. Mind Speed Technologies లాంటి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌/ ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఇతర కోర్సులు చేస్తూ సమయం నష్టపోకుండా కొత్త సంవత్సరంలో ఇష్టమున్న ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌పై మీ శక్తియుక్తులు కేంద్రీకరించండి.

నేను B.Tech. ECE 2011 లో 74.19 శాతం ఉత్తీర్ణతలో పాస్‌య్యాను . నాకు కోర్‌ వైపు వెళ్లడమే ఇష్టం. సాఫ్ట్‌వేర్‌ ఇష్టం లేదు. నేనెలాంటి కోర్స్‌ చేస్తే సెటిల్‌ అవుతాను?

మీకు కోర్‌ ఇంజినీరింగ్‌ వైపు ఇష్టం ఉన్నప్పుడు ఫైబర్‌ ఆప్టిక్స్‌ టెక్నాలజీ ద్వారా నిర్మాణ రంగంలో ఎలా ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ అవసరం ఉంటుందో తెలుసుకోండి. ముందు మీకు కంట్రోల్‌ సిస్టమ్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, మల్టీమీడియా అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌- వీటిలో ఏది ఇష్టమో తెలుసుకోండి. ఎన్నో టెక్నికల్‌ ఫోరమ్స్‌ మీకు ఇష్టమైనదాని గురించి తెలుసుకోవడానికి ఉచితంగా లభ్యమవుతాయి. ఉదా: http://goo.gl/plYlxచూస్తే మీకే తెలుస్తుంది. ఇలా మీరు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ఉంటే ఎక్కడ ఎలాంటి అవకాశాలున్నాయో తెలుస్తుంది.

నేను ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ 2012లో చేశాను. మా కాలేజీలో ఎలాంటి క్యాంపస్‌ రిక్రూట్‌మెంటూ జరగలేదు. ఎన్నో కంపెనీలకు నా CV ని పంపాను. కానీ ఎవరూ స్పందించలేదు. మొబైల్‌ టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం.

రాష్ట్రంలో ప్రాంగణ నియామకాలు (క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు) చాలా కళాశాలల్లో జరగటం లేదు. CV ని పంపించినంతమాత్రానే ఫలితం ఉంటుందని చెప్పలేం. మీలో ఉన్న నైపుణ్యాలకు తగిన కొన్ని కంపెనీలను గుర్తించండి. కెరియర్‌ మొదలుపెట్టడానికి CueBlocks, Endeavour లాంటి స్టార్టప్‌ సంస్థల్లో చేరండి. వీటిని సంప్రదించేముందు ఆ సంస్థల గురించి గూగుల్‌ అలర్ట్స్‌ ద్వారా తెలుసుకోండి. ఒక బ్లాగును తయారుచేసి, దానిలో మొబైల్‌ అప్లికేషన్లపై మీరు పరిశోధించి, సంబంధిత ఆర్టికల్స్‌ను దానిలో పెట్టండి. అప్పుడు ఆ సంస్థ రిక్రూటర్‌ మీ సి.వి., మార్కుల జాబితా కంటే మీ బ్లాగులో కంటెంట్‌ గురించి అడుగుతారు. ఇలా CV తో సంబంధం లేకుండానే ఉద్యోగం సంపాదించగలరు.

ఈసీఈలో బీటెక్‌ 2011 లో పూర్తిచేశాను. SAPబిజినెస్‌ ఆబ్జెక్ట్‌ కోర్సు కూడా చేశాను. కానీ ఇంతవరకూ ఎలాంటి ఉద్యోగం రాలేదు. నేనింకా ఎలాంటి కోర్సు చేయాలో చెప్పండి. నాకు ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ అంటే ఇష్టం. ఇంటర్న్‌షిప్స్‌ లేదా ఉద్యోగాలు హైదరాబాదులో ఎలాంటి కంపెనీల్లో ఉంటాయి?

ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీకు నచ్చినది చేయండి. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ ఇష్టం ఉన్నపుడు ఇక వేరే ఏవేవో కోర్సులు చేయడం వల్ల సమయం, డబ్బూ వృథాయే కదా? ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ గురించిన పరిజ్ఞానాన్ని ఉచితంగా లభించే టెక్నికల్‌ ఫోరమ్స్‌ ద్వారా తెలుసుకుంటూ ఉండండి. http://goo.gl/uftMHలింకులో ఇంటర్న్‌షిప్‌ గురించి వెతకండి. Mind Speed Technologies లాంటి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌/ ఉద్యోగం కోసం ప్రయత్నించండి. ఇతర కోర్సులు చేస్తూ సమయం వృధా చేయకుండా. కొత్త ఇష్టమున్న ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌పై మీ శక్తియుక్తులు కేంద్రీకరించండి.