* బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాను. నాకున్న ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఏమిటి? - శ్రీలత

కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేసినవారు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగానికి సంబంధించిన ప్రైవేటు సంస్థల వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఆకర్షణీయమైన వేతనం లేదా ఇతర ఉద్యోగపరమైన ప్రోత్సాహకాలు, కెరియర్‌లో త్వరగా ముందుకువెళ్లే అవకాశాల్లాంటివి దీనికి కారణం అయివుండొచ్చు. అయితే బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారికి ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలున్నాయి. బ్యాంకింగ్‌ రంగం, భారతీయ రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్, ఇస్రో, డీఆర్‌డీవో, ఈసీఐఎల్, ఏర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, సెయిల్‌ లాంటి చాలా ప్రభుత్వరంగ సంస్థల్లో టెక్నికల్‌ విభాగంలో మంచి ఉద్యోగావకాశాలుంటాయి.

* సీఎస్‌ఈ మూడో సంవత్సరం చదువుతున్నాను. కోడింగ్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నా. ఎథికల్‌ హ్యాకింగ్‌ నేర్చుకుంటే భవిష్యత్తు ఏవిధంగా ఉంటుంది? - సాయిప్రియ

ఇంజినీరింగ్‌ దశలోనే కోడింగ్‌పై దృష్టిపెట్టడం మంచి నిర్ణయం. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత కూడా కోడింగ్‌లో సరైన నైపుణ్యం లేని గ్రాడ్యుయేట్లు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల కోడర్‌ల కొరత ఇప్పుడు మార్కెట్లో ఉంది. మెరుగైన నైపుణ్యం కోసం జావా, రూబీ, పైథాన్‌లతో మొదలుపెట్టడం మంచిది. ఇక ఎథికల్‌ హ్యాకింగ్‌కు ఇప్పుడు గిరాకీ చాలా పెరిగింది. అంతర్జాల భద్రత, నెట్‌వర్కింగ్‌ రంగాల్లో ఎథికల్‌ హ్యాకర్లకు మంచి ఉద్యోగావకాశాలున్నాయి. ఈసీ-కౌన్సిల్‌ లాంటి వెబ్‌సైట్లు ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణ ఇస్తున్నాయి.

* బీటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తి చేశాను. అదనంగా కోర్సులు చేయాలనుకుంటున్నాను. ఉద్యోగావకాశాలను అందించే కొత్త కోర్సుల వివరాలను తెలపండి - లలిత

ముందుగా మీరు ఏ రంగంలో అడుగెడదామనుకుంటున్నారో నిర్ణయించుకోండి. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనే వివిధ అవకాశాలు డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌, ఆటోమేషన్‌ విభాగాల్లో ఉన్నాయి. మీరు ఎంచుకున్న విభాగాన్ని బట్టి షార్ట్‌ టర్మ్‌ కోర్సులను ఎంచుకోవాలి. ఉదాహరణకు టెస్టింగ్‌లో సెలీనియం, ఆటోమేషన్‌కు దీనిజువీశిళీ కోర్సులను ఎంచుకోవచ్చు.
డేటా అనలటిక్స్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే DEVOPS ప్రోగ్రామింగ్‌, PYTHON, SAS తో పాటుగా స్టాటిస్టిక్స్‌పై పట్టు సాధించాలి. ఈ విధంగా మీరు నచ్చిన కోర్సును ఎంచుకుని ఉద్యోగాన్ని సాధించవచ్చు.

* మా అబ్బాయి బీటెక్‌ (సీఎస్‌ఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. తనకు ఎథికల్‌ హ్యాకింగ్‌పై ఆసక్తి. అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వివరాలను అందించండి. - రవిప్రసాద్‌ ఆత్కూరి

హానికర హ్యాకర్లు చేయదలచుకునే దుశ్చర్యలను ముందుగా పసిగట్టి, కంప్యూటర్‌ సమాచార వ్యవస్థల బలహీనతలను, దుర్బలాలను గుర్తించే చర్యను చట్టపరంగా సాగించడమే ఎథికల్‌ హ్యాకింగ్‌ ఉద్దేశం. కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన/ చేస్తున్నవారికి ఈ కోర్సు ఎంతగానో దోహదపడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రైవేటు సంస్థలు ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈసీ కౌన్సిల్‌వారు అందిస్తున్న సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సు ప్రముఖమైంది. 125 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల పరీక్షను నాలుగు గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ‌www.eccouncil.org ను సందర్శించవచ్చు. ఇంకా బీటెక్‌ రెండో సంవత్సరమే కాబట్టి, చదువు పూర్తయ్యేలోపు ఈ కోర్సును చేసి, ఏదైనా సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేస్తే మంచిది. ప్రస్తుతానికి ఈ కోర్సు ప్రభుత్వ సంస్థల్లో అందుబాటులో లేదు.

నా తమ్ముడు బీటెక్‌ (సీఎస్‌ఈ) 2015లో పూర్తిచేశాడు. తరువాత ఐబీఎంలో ఏడాదిపాటు మాన్యువల్‌ టెస్టర్‌గా పనిచేసి, మానేశాడు. ప్రస్తుతం సెలెనియం కోర్సును నేర్చుకుంటున్నాడు. దీంతోపాటు ఏం నేర్చుకుంటే అతని భవిష్యత్తు బాగుంటుంది? - కె. కులదీప్‌

ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ టూల్స్‌ రాకతో మాన్యువల్‌ టెస్టింగ్‌ నిపుణులకు అవకాశాలు తగ్గాయి. దీంతో మాన్యువల్‌ టెస్టర్స్‌ ప్రసిద్ధ ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ టూల్‌ అయిన సెలెనియాన్ని నేర్చుకుంటున్నారు. వెబ్‌ బేస్‌డ్‌ అప్లికేషన్‌ టెస్టింగ్‌కు సెలెనియం ఉపయోగకరం. టెస్టింగ్‌ రంగంలో విజయం సాధించాలనుకునేవారు సెలెనియం టూల్‌తోపాటు జావా బేసిక్స్‌పై పట్టు సాధించాలి. క్వాలిటీ అస్యూరెన్స్‌ (క్యూఏ)పై మంచి అవగాహన ఉండాలి. ఐఓఎస్‌/ ఆండ్రాయిడ్‌ అప్లికేషన్స్‌ టెస్టింగ్‌ కోసం ఉపయోగపడే ఏపీపీఐయూఎం టూల్‌ను నేర్చుకుంటే తమ ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

బీటెక్‌ (కంప్యూటర్‌సైన్స్‌) చేశాను. ఎంటెక్‌లో కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ స్పెషలైజేషన్‌ చేయాలనుంది. దూరవిద్య ద్వారా చేసే అవకాశం ఉందా?

బీటెక్‌, ఎంటెక్‌ లాంటి వృత్తివిద్యాకోర్సులను రెగ్యులర్‌ విద్య ద్వారా అభ్యసించడం శ్రేయస్కరం. మన దేశంలో దూరవిద్య ద్వారా ఎంటెక్‌ (కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌)ను యూజీసీ లేదా ఏఐసీటీఈ ఆమోదంతో ఏ విశ్వవిద్యాలయమూ అందించడం లేదు. దేశంలో అమిటీ విశ్వవిద్యాలయం ఎంఎస్‌సీ- కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ కోర్సును దూరవిద్య ద్వారా అందిస్తోంది. ఏదేని డిగ్రీ చేసినవారు ఈ కోర్సును అభ్యసించడానికి అర్హులు.

బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) 2011లో పూర్తిచేశాను. డాట్‌నెట్‌ కూడా నేర్చుకున్నాను. కానీ ఇంకా ఉద్యోగం రాలేదు. ఇంకా ఏమైనా కోర్సులు నేర్చుకుంటే మేలా? ఉద్యోగసాధనకు ఏం చేయాలో తెలపండి.

మీరు డాట్‌నెట్‌తోపాటు ఎస్‌ఏపీ, ఒరాకిల్‌ లాంటి కోర్సులు నేర్చుకోవచ్చు. స్ట్రక్చర్‌ క్వెరీ లాంగ్వేజ్‌ (ఎస్‌క్యూఎల్‌), టెస్టింగ్‌ టూల్స్‌ (మాన్యువల్‌ అండ్‌ ఆటోమేషన్‌), నెట్‌వర్కింగ్‌ లాంటి కోర్సులు నేర్చుకుంటే కెరియర్‌ అభివృద్ధికి దోహదపడతాయి. ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల మాత్రమే ఉద్యోగం సాధించలేరు. వీటితోపాటు మంచి భావప్రకటన సామర్థ్యం, ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరించగలిగే సామర్థ్యం, బృందంతో కలిసి పనిచేయగల సామర్థ్యం మొదలైనవి చాలా అవసరం. సబ్జెక్టు పరిజ్ఞానం, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, ఇంటర్వ్యూని ఎదుర్కొనే సామర్థ్యం మొదలైనవి ఉద్యోగసాధనకు ఉపయోగపడతాయి. .

* బీఈ (ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) చేస్తున్నాను. ఈ కోర్సుకు ఉన్న ఉన్నతవిద్య ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

బీఈ (ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) చదివినవారు ఉన్నతవిద్యను అభ్యసించాలనుకుంటే మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ నెట్‌వర్క్‌ ఇంజినీరింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ అనాలిసిస్‌ ఇంజినీరింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అప్లికేషన్‌, మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ మొదలైన కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆవశ్యకత వివిధ రకాల బిజినెస్‌ల్లో, సర్వీసుల్లో చాలా ఉంటుంది. కంప్యూటర్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, టెలి కమ్యూనికేషన్‌, బయోటెక్నాలజీ, ఈ-కామర్స్‌ సర్వీసెస్‌, డయాగ్నోస్టిక్స్‌ మొదలైన రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలుంటాయి. ఈ కోర్సు చదివినవారికి ప్రోగ్రామర్స్‌, క్వాలిటీ అనలిస్ట్‌, టెక్నాలజీ ఇంజినీర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్స్‌, టెక్నికల్‌ కన్సల్టెంట్స్‌ మొదలైన ఉద్యోగావకాశాలుంటాయి. ఆఫీస్‌ ఆటోమేషన్‌, ఎక్స్‌పర్ట్‌ సిస్టమ్స్‌, డెసిషన్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌, ఆన్‌లైన్‌ పరీక్షలు- ఫలితాలు మొదలైన వాటిలో ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ ఆవశ్యకత అధికం.

* మా అమ్మాయి సీఎస్‌ఎస్‌ఈ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టమ్‌ ఇంజినీరింగ్‌) రెండో సంవత్సరం చదువుతోంది. ఈ బ్రాంచి చదివిన వారికి ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? ఎంటెక్‌ చేయాలనుకుంటే ఏ స్పెషలైజేషన్‌ ఎంచుకోవాలి?

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టం ఇంజినీరింగ్‌ అనేది రెండు బ్రాంచిల కలయిక. ఈ బ్రాంచి చదవడం వల్ల కంప్యూటర్‌ సైన్స్‌, సిస్టమ్‌ ఇంజినీరింగ్‌లకు సంబంధించిన స్పెషలైజేషన్స్‌లోని ఉద్యోగాలకు అర్హులవుతారు. ఎంటెక్‌ చేయాలనుకుంటే ఈ రెండు రంగాలకు సంబంధించిన స్పెషలైజేషన్లలో చేసే అవకాశం ఉంటుంది. ఈ బ్రాంచి చదివినవారికి వెబ్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, వీడియో గేమ్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ కంప్యూటింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌, మొబైల్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ విజన్‌, సైంటిఫిక్‌ మోడలింగ్‌, కంప్యూటర్‌ సెక్యూరిటీ, డేటాబేస్‌ సిస్టమ్స్‌, యానిమేషన్‌, వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కంప్యూటర్‌ మానుఫాక్చరింగ్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, కంప్యూటేషనల్‌ బయాలజీ, సూపర్‌ కంప్యూటింగ్‌ మొదలైనరంగాల్లో అవకాశాలుంటాయి. ఈ బ్రాంచి చదివినవారు కంప్యూటర్‌ సిస్టమ్స్‌ ఇంజినీర్లుగా, కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అనలిస్ట్‌గా, కంప్యూటర్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ బ్రాంచివారు ఎంటెక్‌ చేయాలని అనుకుంటే ఎంటెక్‌- కంప్యూటర్‌సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ స్క్రుటినీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ కంప్యూటింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, కంప్యూటర్‌ సిస్టమ్స్‌ అండ్‌ హార్డ్‌వేర్‌, డేటాబేస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ మొదలైన స్పెషలైజేషన్స్‌లో మీ ఆసక్తిని బట్టి ఏదైనా స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది.

బీటెక్‌ (సీఎస్‌ఈ) 2012లో పూర్తిచేశాను. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుంది. ప్రభుత్వ రంగంలో నా బ్రాంచికి సంబంధించిన ఉద్యోగ వివరాలు తెలుపగలరు?

ప్రభుత్వ సంస్థల్లో మీరు గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ, ఇంజినీర్‌- ట్రైనీగా మొదలుపెట్టి జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, సిస్టం ఇంజినీర్స్‌, టీం లీడ్స్‌/ ఆర్కిటెక్ట్‌, టెక్నాలజీ అనలిస్ట్‌, డొమైన్‌ కన్సల్టెంట్స్‌, ఇండస్ట్రీస్‌ ఆఫీసర్‌ (టెక్నికల్‌), ఐటీ మేనేజర్‌, ఈఆర్‌పీ కన్సల్టెంట్‌ లాంటి వివిధ హోదాలను పొందవచ్చు. దీనికి మీరు యూపీఎస్‌సీ, పీఎస్‌సీ/ వారి (ఉదా: ఎస్‌ఎస్‌సీ, డిఫెన్స్‌ రంగాలు, రైల్వే విభాగాలు, ప్రభుత్వరంగ బ్యాంకులు) ప్రత్యేక రాతపరీక్షతో పాటు వ్యక్తిగత ముఖాముఖిల్లో అర్హత సాధించి ఉద్యోగం సంపాదించవచ్చు. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్స్‌, ఇండియన్‌ రైల్వేస్‌, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, డిఫెన్స్‌ ఆర్‌&డి ఆర్గనైజేషన్‌, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ కంప్యూటింగ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లాంటి ఎన్నో సంస్థలు మిమ్మల్ని తీసుకుంటాయి. ఉదాహరణకు ఇస్రో వారి సైంటిస్ట్‌/ ఇంజినీరు ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్‌ చదవండి. www.isac.gov.in/CentralBE-2014/advt.jsp

బీటెక్‌ (సీఎస్సీ) 2011లో పూర్తిచేశాను. ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌పై ఆసక్తి ఉంది. దాని వివరాలు, ప్రాముఖ్యం, నేర్చుకోవాల్సిన కోర్సుల వివరాలు తెలియజేయండి?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల్లో 1 బిలియన్‌ మొబైళ్ళలో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. ఇది ఉచిత మార్కెట్‌ కావడం వల్ల ప్రతి నెలా ఆండ్రాయిడ్‌ వినియోగదారుల గేమ్స్‌, ఇతర అప్లికేషన్స్‌ కలిపి దాదాపుగా 1.5 బిలియన్‌ దాకా డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. మీరు ఎలాంటి ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ను అయినా అభివృద్ధి చేసి ఉచితంగా/ తగిన ధరను నిర్ణయించి ఈ ఓపెన్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేయవచ్చు.
ముందుగా ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ అంటే C++, జావా నేర్చుకోవాల్సి ఉంటుంది. చేయడం ద్వారా నేర్చుకోవడం మంచి పద్ధతి. సొంతంగా నేర్చుకునే అవకాశాలు/ టూల్స్‌/ వెబ్‌సైట్ల ద్వారా సొంతంగా మీకు మీరుగా చిన్న చిన్న అప్లికేషన్లను తయారుచేసి నేర్చుకుంటూ ఉండండి. డెవలపర్‌ తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి గూగుల్‌ వారి http://developer.android.com/training/index.htmlతోపాటు www.udacity.com/course/ud853, www.coursera.org/course/androidapps101 వంటి సైట్లలో ఆండ్రాయిడ్‌ కోర్సులు పొందవచ్చు.

బీటెక్‌ (ఐటీ) పూర్తిచేశాను. ఈ రంగంలో ఉండే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలేమిటి? సీబీఐ, ఆదాయపు పన్ను విభాగాల్లో ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలేమిటి?

మీకు సివిల్‌ సర్వీసెస్‌ కాకుండా గేట్‌ ద్వారా ప్రభుత్వరంగ అండర్‌ టేకింగ్‌ సంస్థల్లో, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ, ఎంబెడెడ్‌ సిస్టం, టెలీ కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌- సాఫ్ట్‌వేర్‌ ఇంప్లిమెంటేషన్‌ & మెయింటెనెన్స్‌, మల్టీమీడియా, వెబ్‌డిజైన్‌, గేమింగ్‌ వంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ రాత పరీక్ష (టైర్‌ 1, 2) రాసి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌లలో అర్హత పొంది సీబీఐ, ఆదాయపుపన్ను శాఖ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. డిగ్రీ చదివి 18- 27 సంవత్సరాల లోపు (పోస్టును బట్టి) ఉన్నవారు ఈ రాతపరీక్షకు అర్హులు.
రిజర్వేషన్‌ ఉన్నవారికి వయసు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు http://bit.ly/1yv0pOw లో ఉన్న నోటిఫికేషన్‌ చూడండి.

కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా చేసినవారు ఎటువంటి ఉద్యోగాలకు అర్హులు?

కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లొమా చేసినవారు టెక్నికల్‌ అసిస్టెంట్‌గా డీఆర్‌డీవో, ఇస్రో, భారతీయ అంతరిక్ష శాఖ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందవచ్చు. రక్షణ శాఖలో కూడా మంచి అవకాశాలున్నాయి. ప్రైవేటు రంగంలో చేయాలనుకుంటే మీ అభిరుచిని బట్టి జావా, ఒరాకిల్‌, ఎంసీఎస్‌ఈ/ సీసీఎన్‌ఏ, ఆటోకాడ్‌ వంటి కోర్సులు చేస్తే మంచిది. మీకు స్తోమత ఉంటే బీటెక్‌ చేయొచ్చు. ఈసెట్‌ ద్వారా అర్హత సాధించి నేరుగా రెండో సంవత్సరంలో చేరొచ్చు. లేదా దూరవిద్య ద్వారా బీటెక్‌ చేయొచ్చు.

నాది కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ 2013లో పూర్తి అయింది. నాకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ గురించి వివరాలు తెలుపగలరు.

అంతర్జాలం (ఇంటర్నెట్‌) ఉపయోగించి కంప్యూటర్‌, ఇతర సంబంధిత పరికరాలను ఒకేసారి వివిధ వ్యక్తులు వాడుకోవడాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌గా చెపుతారు. కంపెనీల్లో దీన్ని వాడడం వల్ల వనరులు, సమయం, డబ్బు ఆదా అవుతాయి. దీన్ని మూడు కేటగిరీలుగా చెప్పుకోవచ్చు.
1. Infrastructure as a Service (IaaS)
2. Platform as a Service (PaaS)
3. Software as a Service (SaaS)
మీకు ఐటీ ఆర్కిటెక్ట్‌, ఐటీ అడ్మినిస్ట్రేటర్‌/ ఐటీ కన్సల్టెంట్‌ వంటి ఉపాధి అవకాశాలుంటాయి. వీటికి సంబంధించి సిస్కో, ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, ఈఎంసీ, గూగుల్‌, వీఎం వారి సర్టిఫికేషన్‌ కోర్సులుంటాయి. భారత్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీల కోసం http://bit.ly/1buiUXA, దీనికి సంబంధించిన కోర్సుల గురించి http://bit.ly/18MVvOX ని చూడండి.

మా అమ్మాయి బీటెక్‌ (సీఎస్‌ఈ) చేసి గత ఆరు సంవత్సరాలుగా ఒక పేరొందిన సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా చేస్తోంది. ఇప్పుడు తాను ఐటీ రంగం వదిలి ఇంకేదైనా ఎక్కువ సంపాదనావకాశాలున్న రంగంలో చెయ్యాలనుకుంటోంది. దయచేసి సలహానివ్వగలరు.

మీ అమ్మాయి తన ప్రస్తుత స్థితి గురించి ఏమనుకుంటున్నదనేది చాలా ముఖ్యం. సాధారణంగా చేసే పనిలో నవ్యత లోపించినా, ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నా అంచనాలకు తగినట్టు అభివృద్ధి లేకపోయినా ప్రస్తుతం ఉన్న ఉద్యోగం బాగా లేదనిపిస్తుంటుంది. అటువంటి సమయాల్లో ఉన్నతవిద్య కెరియర్లో అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. మీ అమ్మాయి ఎంటెక్‌ కానీ ఎంబీఏ కానీ చేస్తే మంచి అవకాశాలకు ఆస్కారం ఉంటుంది. ఏ నిర్ణయమైనా గత అనుభవం ఉపయోగపడేలా అడుగు వెయ్యడం మంచిది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేస్తున్నాను. విదేశాల్లో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. స్కాలర్‌షిప్‌ను అందించే మంచి విశ్వవిద్యాలయాలను తెలపండి.

మొదటగా పీహెచ్‌డీ గురించి పూర్తి వివరాలకు http://bit.ly/15s0bIT డాక్యుమెంటును చదవండి. కార్డిఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మాటిక్స్‌, యూకే (www.cs.cf.ac.uk); యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ కాజిల్‌, ఆస్ట్రేలియా (www.newcastle.edu.au); కార్నిగె మెలన్‌ యూనివర్సిటీ, పిట్స్‌బర్గ్‌ (www.csd.cs.cmu.edu)తో పాటు మరిన్ని విశ్వవిద్యాలయాల వివరాలకు http://bit.ly/16UIsfn వెబ్‌సైట్‌ చూడండి.

బీటెక్‌ (సీఎస్‌ఈ) రెండో సంవత్సరం చదువుతున్నాను. టెక్నాలజీకి సంబంధించి కొత్త ప్రాజెక్టుల తయారీపై నాకు కొన్ని ఆలోచనలున్నాయి. శాంసంగ్‌ లాంటి కంపెనీలతో నా ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను. వాళ్లను ఎలా సంప్రదించాలో, ఇటువంటి కంపెనీల్లో పరిశోధనకు సంబంధించిన ఉద్యోగం సంపాదించగల అవకాశాలను తెలపండి.

ఇటువంటి ఆలోచన ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలోనే రావడం అభినందించాల్సిన విషయం. శాంసంగ్‌ ఇండియా వారి ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు నోయిడా, బెంగళూరులో స్థాపించారు. ముందుగా మీరు వారి ప్రస్తుత, భవిష్యత్తు ప్రోడక్ట్‌, వ్యాపార ప్రణాళికను అర్థం చేసుకోవడానికి ఈ www.samsungnoidalab.com/main/about.htm వెబ్‌సైట్‌లో అన్ని పేజీలూ చదవండి. తర్వాత మీరు ఈ వెబ్‌సైట్‌ www.samsungnoidalab.com/main/register.htm ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఇంకా http://linkd.in/19S2XrC వెబ్‌ లింక్‌ ద్వారా శాంసంగ్‌ నోయిడా ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో పనిచేసే టెక్నికల్‌, హైరింగ్‌ మేనేజర్‌ని సంప్రదించి మీ దరఖాస్తు నేరుగా పంపుకోవచ్చు. ఉద్యోగం కోసం www.samsungindiasoft.com/career_opportunities.html, www.samsung.com/in/aboutsamsung/careers/SubmitYourResume.html లింకులను అనుసరిస్తూ దరఖాస్తు చేసుకోండి.

బీటెక్‌ (సీఎస్‌ఈ) పూర్తిచేశాను. యూఎస్‌ఏలో మాస్టర్స్‌ చేద్దామనుకుంటున్నాను. నా బ్రాంచితో సంబంధమున్న బ్రాంచీలను సూచించగలరు.

ఎంఎస్‌ కోర్సుల్లో రోబోటిక్స్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, కంపైలర్స్‌, బిగ్‌ డేటా టెక్నాలజీస్‌, వెబ్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, నెట్‌వర్కింగ్‌ అండ్‌ ఐఓ, గేమ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌/ డేటా మైనింగ్‌, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌, ఎనలిటిక్స్‌ వంటివి మీకు సంబంధించిన బ్రాంచీలు. ఇక మసాచుసెట్‌ ఇన్‌స్టిట్యూట్‌, స్టాన్‌ఫర్డ్‌, కార్నెల్‌, ప్రిన్స్‌టన్‌- ఇలా ఎన్నో విశ్వవిద్యాలయాలు మాస్టర్‌ కోర్సులను నిర్వహిస్తున్నాయి. దీని తర్వాత వెబ్‌/ మొబైల్‌ టెక్నాలజీస్‌, లార్జ్‌ స్కేల్‌ డేటా ప్రాసెసింగ్‌/ డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్‌, ఆల్‌గారిధమ్‌/ మెషీన్‌ లెర్నింగ్‌, కంపైలర్‌/ స్టోరేజ్‌/ వర్చులైజేషన్‌, ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌, బిజినెస్‌ ఎనలిస్ట్‌/ టెక్నాలజీ కన్సల్టెంట్‌ వంటి రంగాల్లో అవకాశాలుంటాయి.

బీటెక్‌ రెండో సంవత్సరం (ఐటీ) చదువుతున్నాను. నాకు జర్నలిజంలో ఆసక్తి ఉంది. దూరవిద్య ద్వారా మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేయాలనుకుంటున్నాను. సంబంధిత కోర్సుల వివరాలు తెలుపగలరు.

మాస్‌ కమ్యూనికేషన్‌లో ముఖ్యంగా అడ్వర్త్టెజింగ్‌, జర్నలిజం, పౌర సంబంధాలు ఉంటాయి. ఈ రంగంలో జర్నలిస్టు నుంచి ఎడిటర్‌, ఫొటోగ్రాఫర్‌, కరస్పాండెంట్‌, రిపోర్టర్‌, కాలమిస్ట్‌, న్యూస్‌రీడర్‌, రైటర్‌, యాంకర్‌, పౌర సంబంధ విభాగఅధికారి వంటి ఎన్నో అవకాశాలు ఉంటాయి. 10+2/ ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవాళ్లు మాస్‌ కమ్యూనికేషన్స్‌లో పై చదువులకు అర్హులు. ఇందులో బ్యాచిలర్‌, మాస్టర్‌ కోర్సులుంటాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌- న్యూఢిల్లీ, ఏషియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం- చెన్నై, మఖన్‌లాల్‌ చతుర్వేది నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ జర్నలిజం అండ్‌ కమ్యూనికేషన్‌- భోపాల్‌, సింబయోసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌-పుణె మొదలైనవి ప్రముఖమైనవి.

నేను పీహెచ్‌డీ (ఐటీ) దూరవిద్యలోనే చేయాలనుకుంటున్నాను. మహాత్మాగాంధీ యూనివర్సిటీ, మేఘాలయ లాంటి యూనివర్సిటీల్లో చేయవచ్చా?

పీహెచ్‌డీ అనేది కేవలం పేపర్‌ డిగ్రీ కోసం కాకుండా ఇష్టమైన అంశం ఎంచుకుని, శ్రద్ధతో పరిశోధించి కొత్త విషయాలు కనిపెట్టడం. ఇది మంచి క్యాంపస్‌లో చేయడానికి నెట్‌ పాసై ఉండాలి. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నెట్‌ అర్హత లేకున్నా పీహెచ్‌డీకి అవకాశం కల్పిస్తున్నాయి గానీ వాటిలో చేరకపోవడమే మంచిది. అసలు పీహెచ్‌డీ అంటే ఏంటి, ఎందుకు చేయాలో తెలుసుకోవాలంటే http:// bit.ly/15s0biT వెబ్‌సైట్‌ని చూడండి.

2011లో బీటెక్‌(సీఎస్‌ఈ) పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, ఒరాకిల్‌ కోర్సులు చేశాను. ఇంకా ఉద్యోగం రాలేదు. నౌక్రీ, మాన్‌స్టర్‌ పోర్టల్స్‌లో నా రెజ్యూమేని అప్‌లోడ్‌ చేశాను. నాకు కంపెనీలను ఎలా సంప్రదించాలో తెలియడం లేదు.

మీకు బాగా ఇష్టమున్న సబ్జెక్టును ఎంచుకుని, ముందుకు సాగాలి. మొదట C, C++, C# లో పరిజ్ఞానం పెంపొందించుకోండి. జాబ్‌పోర్టళ్ళ వల్ల అంత ఫలితం ఉండకపోవచ్చు. దరఖాస్తును హెచ్‌ఆర్‌కి పంపటంతో పాటు హైరింగ్‌ మేనేజర్‌ని (సోషల్‌మీడియా సైట్స్‌ ద్వారా తెలుసుకుని) సంప్రదించటం మంచిది. బ్లాగులో రాస్తూ ఆ వెబ్‌లింకును రెక్రూటర్‌కి పంపాలి. గూగుల్‌ అలర్ట్స్‌ ద్వారా స్టార్టప్‌ కంపెనీల గురించి తెలుసుకుంటూవుండాలి.

బీటెక్‌ (ఐటీ) నాలుగో సంవత్సరం చదువుతున్నాను. 3వ సంవత్సరం దాకా 65 శాతం మార్కులే వచ్చాయి. నా భవిష్యత్తుపై ఆందోళనగా ఉంది.

మార్కుల శాతం గురించి దిగులుపడకండి. ఎందుకంటే కేవలం మార్కులని చూసి ఉద్యోగాలకు సరిపోతారో లేదో అనేది కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేరు. మీకు నచ్చిన ఏరియాని నిర్ణయించుకుని దానిపై నైపుణ్యం మెరుగుపర్చుకోండి.
ఉదాహరణకు ఐటీపై ఇష్టం ఉంది కాబట్టి http://bit.ly/Yk14iWలాంటి ఫోరం నుంచి మీరు Algorithmic Trading Forumలో జాయినై ఎన్నో విషయాలు నిపుణుల నుంచి తెలుసుకోవచ్చు. ప్రాజెక్టును చిన్న చిన్న కంపెనీల్లో చేయండి. డమ్మీగా కాకుండా మనస్ఫూర్తిగా ఇష్టపడి ఎంచుకున్న ఏరియా గురించి తెలుసుకోవాలని ప్రయత్నించండి. తద్వారా అదే కంపెనీలో లేదా inoxAppsలాంటి స్టార్టప్‌ కంపెనీలు మార్కులని బట్టి కాకుండా మీరు ఆ కంపెనీలకు ఏమి చేయగలరో అనే దాన్నిబట్టి మీకు ఉద్యోగావకాశం కల్పించవచ్చు.

నేను ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాను. తర్వాత ఎలాంటి కోర్సులు చేయాలో తెలపండి.

ఏదో ఒక ఐటీ శిక్షణ సంస్థలో చేరటం కన్నా సెల్ఫ్‌ లెర్నింగ్‌ మోడ్‌లో ఎంతో నేర్చుకోవచ్చు. https://www.udacity.com/coursesలాంటి వెబ్‌సైట్‌ చూసినట్టయితే స్వయంగా గేమ్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు.
ఇంకా తక్కువ ఖర్చుతో iOS Apps వంటివి iphone, iPads డెవలప్‌ చేయడానికి నేర్చుకోవాలంటే http://bit/ly./Zp8miYలో వివరాలు లభ్యమవుతాయి.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. బిట్స్‌లో ఎంటెక్‌ చేయాలని అనుకుంటున్నాను. వివరాలు తెలపండి.

మీకు బీటెక్‌లో 60శాతం మార్కులు ఉంటే బిట్స్‌లో ఎంఈ- సాఫ్ట్‌వేర్‌ సిస్టం లేదా ఎంటెక్‌- ఇన్ఫర్మేషన్‌ సిస్టం చేయవచ్చు. దీనికి బిట్స్‌ నిర్వహించే ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత పొందాక పర్సనల్‌ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ రెండింటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రవేశం దొరుకుతుంది. నోటిఫికేషన్‌, మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ గమనిస్తూ ఉండండి. http://www.bitsadmission.com/.

ఇంజినీరింగ్‌ 2012లో పూర్తి చేశాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా బెంగళూరులో సెటిల్‌ అవాలని ఉంది.MNC కంపెనీలోwalk-inఇంటర్వ్యూలు ఎక్కడ అవుతున్నాయో చెప్పండి.

మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే MNCకంపెనీలో కంటే మంచి స్టార్ట్‌ అప్‌ కంపెనీలో ప్రయత్నించండి. ఎందుకంటే మొదటి ఉద్యోగంMNCలో అయితే మీరు నేర్చుకోవడానికి ఎంతో స్కోప్‌ ఉండదు. 2-3 ఏళ్ల అనుభవం వచ్చాక అపుడు మీరు అందులో ప్రయత్నించడం మంచిది. Walk-in ఇంటర్వ్యూలు కాకుండా కంపెనీల గురించి తెలుసుకుని, అందులోని ప్రాజెక్ట్‌ లేదా టెక్నికల్‌ మేనేజర్‌ని Linkedin లాంటి సోషల్‌ మీడియా ద్వారా కలుసుకుని మీ నైపుణ్యాలు ప్రదర్శించి ఉద్యోగం సాధించొచ్చు.

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ 2013లో పూర్తవుతుంది. కానీ మా సీనియర్లను చూశాక నాకు కెరియర్‌పై చాలా భయంగా ఉంది. నేను ఇప్పుడు ఏమి చేయాలి?

సీనియర్లు పడే కష్టాలను గమనించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనుకోవడం చాలా మంచిది. ఫైనాన్షియల్‌ ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌ రంగంలో ప్రోగ్రామింగ్‌ కొడ్ రాసే వాళ్లకు కు చాలా భవిష్యత్తు ఉంది. ఎప్పుడూ ఇంజినీరింగ్‌ చివరిదశలో కాకుండా ఇంటర్న్‌షిప్‌ నుంచే కెరియర్‌ గురించి ఆలోచించాలి. మీరు బ్లాగును మొదలుపెట్టి దానిలో మంచి ప్రోగ్రామింగ్‌ స్క్రిప్ట్స్‌ రాస్తే సి.వి. సంగతిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆసక్తి ఉంటే ఫైనాన్షియల్‌ ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌ రంగంపై దృష్టి సారించండి.

ప్రోగ్రామింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటే భయం. ఎందుకంటే నేను ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడలేను. నా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ 2013లో పూర్తవుతుంది.

ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడలేకపోతున్నందుకు బాధపడనవసరం లేదు. కోడింగ్‌పై ఉన్న నైపుణ్యాలను చూపిస్తే అప్పుడు మీకు ఆంగ్లం అడ్డు రాదు. కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ ఒకటి కాదు. 'నేను ఇంగ్లిష్‌ అర్థం చేసుకుంటాను. ధారాళంగా మాట్లాడటం నేర్చుకుంటాను' అని చెప్పొచ్చు.క్రమంగా మెరుగుపరుచుకోవచ్చు. ఎంతోమంది తమ సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించి కెరియర్‌లో వృద్ధి చెందారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ ఇన్‌స్టిట్యూట్లలో చేరినంతమాత్రానే ఇంగ్లిష్‌ రాదు. రోజూ ఇంగ్లిష్‌లో సంభాషించటం అలవాటు చేసుకోవటం ముఖ్యం.