డిప్లొమా (మెకానికల్‌ ఇంజినీరింగ్‌) పూర్తిచేశాను. నానోటెక్నాలజీతో బీటెక్‌ చేయాలనుంది. నేను అర్హుడినేనా? - ఐ. లిఖిత్‌

మీకు అర్హత ఉంది. కానీ డిగ్రీ స్థాయిలో ఈ కోర్సును అతి తక్కువ సంస్థలు అందిస్తున్నాయి. అణు పరిమాణంలో పదార్థాల ద్రవ, ఘన, ఇతర లక్షణాలను నానో టెక్నాలజీలో అధ్యయనం చేస్తారు. ఈ టెక్నాలజీ చదివినవారికి ఏరోస్పేస్, ఫుడ్‌ అండ్‌ ఫుడ్‌ ప్యాకింగ్‌ కాస్మెటిక్స్, పర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్స్, టెక్స్‌ టైల్స్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్స్‌ లాంటి రంగాల్లో అవకాశాలుంటాయి. వైజ్ఞానికపరమైన ఆసక్తితో పాటు పరిశోధన రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇది మంచి ఎంపిక. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా మూడు సంవత్సరాల పాలిటెక్నిక్‌ కోర్సు ఉత్తీర్ణులు ఈ కోర్సు చేయడానికి అర్హులు. నానో టెక్నాలజీని డిగ్రీ స్థాయిలో చదవడం కంటే పీజీలో ఎంచుకోవడం మంచిది. ఈ సబ్జెక్టు సూపర్‌ స్పెషాలిటీ లాంటిది. పీజీ లేదా పీహెచ్‌డీ… స్థాయిలో చదవాలి. ఎవరైనా భవిష్యత్తులో నానో టెక్నాలజీ రంగంలో స్థిరపడాలనుకుంటే బీటెక్‌లో మెకానికల్‌ లేదా మెటలర్జీ ఇంజినీరింగ్‌లో చేరడం మంచిది.

డిప్లొమా (మెకానికల్‌) పూర్తిచేశాను. ఇప్పుడు బీకాం చదువుతున్నాను. డిప్లొమా తర్వాత ఎంచుకున్న డిగ్రీకి విలువ ఉంటుందా? - హేమంత్‌ కుమార్‌

మీరు ‘డిప్ల్లొమా మెకానికల్‌ చేసిన తర్వాత బీకాం చదివాను’ అని చెప్పారు. చదివిన డిప్లొమా, ఇప్పుడు చేస్తున్న డిగ్రీ వేర్వేరు రంగాల్లోనివి. ఈ రెండిటికీ ప్రత్యక్ష సంబంధం లేదు. డిప్లొమా, ఇంజినీరింగ్‌, మాథ్స్‌, ఫిజిక్స్‌ లాంటి కోర్సులు లాజికల్‌ రీజనింగ్‌, డేటా విశ్లేషణ లాంటి విషయాల్లో మెలకువలు పెంపొందడానికి దోహదపడటం వల్ల పోటీ పరీక్షల్లో సాటి పోటీదారులకంటే మీరు కొంత మెరుగైన స్థితిలో ఉంటారు. కొన్ని ఉద్యోగాలకు అకౌంట్స్‌తో పాటు, టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరమైనప్పుడు మీ డిప్లొమా, డిగ్రీ రెండూ ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాల కోర్సులు చదవడం అనేది అదనపు అర్హత కూడా. మీ డిగ్రీల విలువ మీకు సబ్జెక్టుపై ఉన్న అవగాహన, అనుభవం, భావప్రకటనా సామర్థ్యం లాంటి వాటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిశ్చింతగా బీకాం పూర్తిచేసుకుని ఎంకామ్‌ లేదా ఎంబీఏ లాంటివి ఎంచుకొని మంచి భవిష్యత్తుకు దారులు వేసుకోండి.

బీటెక్‌ (మెకానికల్‌) ఇటీవలే పూర్తయింది. గేట్‌కు సిద్ధమవుతున్నాను. ఎంటెక్‌లో ఏ బ్రాంచి ఎంచుకుంటే మేలు? - నాగసురేష్‌

చదవాల్సిన రంగం లేదా తీసుకోవాల్సిన బ్రాంచిపై నిర్ణయం అనేది మన ఆసక్తిని బట్టి ఉంటుంది. ప్రస్తుతం బీటెక్‌ మెకానికల్‌ చేసిన విద్యార్థులకు ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌ ఇంజినీరింగ్‌, థర్మల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌, మెటీరియల్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, నానోటెక్నాలజీ, ఆటో మొబైల్‌ ఇంజినీరింగ్‌, క్యాడ్‌- క్యామ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌, ఎనర్జీ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌ లాంటి బ్రాంచీల్లో అవకాశాలున్నాయి. ఒకవేళ భారీ పరిశ్రమల్లో పనిచేయాలనే ఆసక్తి ఉంటే ప్రొడక్షన్‌, మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లను తీసుకోవడం మంచిది. డిజైన్‌ పరమైన అంశాలపై అభిరుచి లేదా నైపుణ్యం ఉందని భావిస్తే డిజైనింగ్‌ తీసుకోవడం ఎంతో ఉత్తమం. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగంలో డిజైన్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి డిమాండ్‌ ఉంది. రోబోటిక్స్‌ లాంటి బ్రాంచిలోనూ విద్యార్థులకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు జియో థర్మల్‌ ఇంజినీరింగ్‌, పేపర్‌ టెక్నాలజీ, రైల్వే ఇంజినీరింగ్‌, న్యూక్లియర్‌ ఇంజినీరింగ్‌ లాంటి మల్టీ డిసిప్లినరీ రంగాల్లోనూ ఎంటెక్‌ని అందిస్తున్నాయి. - ప్రొఫెసర్‌ బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతున్నాను. ఇస్రోలో ప్రొపల్షన్‌ ఇంజినీర్‌/ శాటిలైట్‌ డిజైనర్‌గా చేరాలనుంది. ఏం చేస్తే నా కల నెరవేరుతుంది? బీటెక్‌ తర్వాత ఇంకేమైనా అదనంగా చదవాలా? - సాయి

మనదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రోలో కొలువు సాధించాలంటే సంబంధిత రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించే పరీక్షకు హాజరుకావాలి. ఇందుకోసం బీఈ/ బీటెక్‌లో 65 శాతం మార్కులతో లేదా 6.84 సీజీపీఏతో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైవుండాలి. ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లోని కాన్సెప్టులన్నింటినీ ప్రాక్టికల్‌ పద్ధతిలో అర్ధం చేసుకోగలిగితే ఇస్రో పరీక్షలో మెరిట్‌ సాధించవచ్చు. ప్రొపల్షన్‌/ శాటిలైట్‌ డిజైన్‌ రంగంలో ఆసక్తి ఉందన్నారు కాబట్టి వీటి గురించి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించుకోవాలి. అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ కోర్సులు చేయడం మంచిది. - ప్రొఫెసర్‌ బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

ఇంజినీరింగ్‌ పూర్తిచేశాను. ఇప్పుడు తెలుగులోఎంఏ చదవాలనుంది. వీలవుతుందా? - బి. రామ్మోహన్‌

ఇంజినీరింగ్‌తో ఎంఏ తెలుగు చేయడం సాధ్యం కాదు. తెలుగులో పీజీ చేయాలంటే డిగ్రీలో తెలుగు ఒక ఐచ్ఛికంగా లేదా సబ్జెక్టుగా ఉండాలి. బీఓఎల్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ లాంగ్వేజ్‌) పూర్తయినా తెలుగుతో పీజీ చేసే వీలుంటుంది.

బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన ఫ్రెషర్‌... అత్యధిక పే ప్యాకేజీతో కూడిన ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి? - వంశీ సీహెచ్‌

ఇంజినీరింగ్‌ చేసిన తర్వాత మంచి ప్యాకేజీతో తొలి కొలువు దక్కించుకోవాలంటే మొదటి సంవత్సరం నుంచి తగిన కృషి చేయాలి. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులు కోర్‌ జాబ్స్‌ చేయాలనుకుంటే మౌలిక అంశాలపై పట్టు సాధించాలి. ఇంజినీరింగ్‌ కాన్సెప్టులను ఆచరణాత్మంగా ఎలా అమలు చేయాలో కూడా నేర్చుకోవాలి. కంప్యుటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ సాఫ్ట్‌వేర్‌పై అవగాహన ఉన్న మెకానికల్‌ ఇంజినీర్లకు ప్రస్తుతం చాలా డిమాండ్‌ ఉంది. కానీ ఆ నైపుణ్యాలతో ఉన్నవారు కొద్దిమందే మార్కెట్లో దొరుకుతున్నారు.
కళాశాలలో ఈవెంట్‌ కన్వీనర్‌గా టెక్నికల్‌ ఈవెంట్స్‌ను నిర్వహించి, విద్యార్థుల బృందానికి నేతృత్వం వహించటం వల్ల నిర్వహణ నైపుణ్యాలు పెరుగుతాయి. వేసవి సెలవుల్లో మినీ ప్రాజెక్టులు చేస్తూ పరిశ్రమలోని కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలి. జర్నల్స్‌లో, కాన్ఫరెన్సుల్లో టెక్నికల్‌ పేపర్లను సమర్పిస్తుండాలి. SAE India, ASHRAE లాంటి ప్రొఫెషనల్‌ సొసైటీల్లో సభ్యత్వం తీసుకుని, జాతీయస్థాయి కార్యక్రమాల్లో పాల్గొనాలి. దీనివల్ల లైవ్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులతో పరిచయం ఏర్పడుతుంది.
ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కోర్‌ పరిజ్ఞానంతో పాటు సీ++, జావా మొదలైన ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలపై పరిజ్ఞానం అవసరం. దీంతోపాటు ఈ నాలుగేళ్ల వ్యవధిలో విద్యార్థులు సమాజానికి మేలు చేసే సేవాసంస్థల కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.
మొత్తం మీద టెక్నికల్‌, సాఫ్ట్‌స్కిల్స్‌తో పాటు కో-కరిక్యులర్‌, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉంటే రెజ్యూమెకు విలువ పెరిగి, హై ప్రొఫైల్‌ మెకానికల్‌ కోర్‌ ఉద్యోగం పొందేందుకు వీలుంటుంది. గేట్‌ ద్వారా మంచి స్కోరు తెచ్చుకుంటే ఓఎన్‌జీసీ, ఐఓసీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌ లాంటి ప్రభుత్వరంగ సంస్థల్లో కొలువు చేజిక్కించుకోవచ్చు. వీటిలో ప్రారంభ వార్షిక వేతనమే సుమారు రూ.12 లక్షలుంటుంది.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా (2010) పూర్తిచేశాను. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు ఇంజినీరింగ్‌ చేయాలనుంది. నాకు అర్హత ఉందా? ఎలా చేయొచ్చో తెలియజేయగలరు. - శ్రీనివాస్‌ దినేష్‌

మీ ఉద్యోగరీత్యా బీటెక్‌ రెగ్యులర్‌ విధానంలో పూర్తి చేయడం వీలు కాదు. కాబట్టి, ప్రత్యామ్నాయమైన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారు అందించే ఏఎంఐఈ కోర్సును లేదా ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఐఈటీఈ) వారు అందించే ఏఎంఐఈటీఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఆవిధంగా బీటెక్‌ చదవాలనే మీ కోరికను సఫలం చేసుకోవచ్చు.
వీటిని చేయడానికి 10+2 (ఎంపీసీ) లేదా 10+3 (డిప్లొమా) పూర్తి చేసినవారు అర్హులు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఐఈ) వారు ఏఎంఐఈ కోర్సును సివిల్‌, ఈఈఈ, సీఎస్‌ఈ, మెకానికల్‌ వంటి పదకొండు ఐచ్ఛికాలతో అందిస్తున్నారు. రెండు సెక్షన్ల (ఎ, బి) కింద ఈ కోర్సును రూపొందించారు. డిప్లొమా పూర్తి చేసినవారు పదమూడు సబ్జెక్టులు, ల్యాబ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే అసోసియేట్‌ మెంబర్‌ ఇన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ)గా నమోదు అవుతారు. ఆరేళ్ల వ్యవధిలో కోర్సును పూర్తిచేయాలి. ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో పరీక్షలు జరుగుతాయి. ఏడాది పొడవునా అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐటీఈ వారు అందించే కోర్సు (ఏఎంఐఈటీఈ) మరిన్ని వివరాలకు ‌్ర్ర్ర.ఖినిగిని.్న౯్ణ ను సందర్శించవచ్చు. పై రెండు కోర్సులనూ రెగ్యులర్‌ విధానంలోని బీటెక్‌ కోర్సుకు సమాన అర్హతగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నత చదువులు అభ్యసించడానికి తోడ్పడుతాయి.

* నాకు కిందటి సంవత్సరం బీటెక్‌ (మెకానికల్‌) పూర్తయింది. కానీ కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్‌ ఉండిపోయాయి. ఏర్‌క్రాఫ్ట్‌ రంగంలో స్థిరపడాలనుకున్నాను. కానీ బ్యాక్‌లాగ్స్‌ పాసవడానికి ఏడాది పడుతుంది. డిగ్రీ లేదా ఉద్యోగానికి అర్హత లేకపోతోంది. ఏం చేయాలో తోచడం లేదు. నాకు ఆసక్తి ఉన్న ట్రావెల్‌ అండ్‌ టూరిజం దూరవిద్యలో చేయవచ్చా?

మీకు కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి. కాబట్టి మొదట వాటిపై శ్రద్ధ వహించండి. మీరు అన్ని సబ్జెక్టులూ పాసైతే ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. చాలామంది విద్యార్థులు తాము ఏదైనా కోర్సు చదువుతున్నపుడు కాలాన్ని వృథా చేయడం వల్ల లేదా సరిగా వినియోగించుకోకపోవడం వల్ల తక్కువ మార్కులు పొందడం గానీ, సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అవడం గానీ జరుగుతోంది.
మీ లక్ష్యం ఏర్‌క్రాఫ్ట్‌ రంగంలో స్థిరపడటం. మీరు మీ లక్ష్యంవైపే అడుగులు వేయండి. కొన్నిసార్లు ఏవో పరిస్థితుల ప్రభావం వల్లనో, కారణాంతరాల వల్లనో ఆటంకాలు ఏర్పడవచ్చు. అంతమాత్రాన లక్ష్యాన్ని వదిలిపెట్టి ఇతర అంశాలపై దృష్టిపెట్టనక్కర్లేదు. బాగా చదివి, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందడానికి ప్రయత్నించండి. తప్పకుండా అనుకున్న రంగంలో స్థిరపడతారు.

* బీటెక్‌ (మెకానికల్‌) 2012లో పూర్తిచేశాను. దూరవిద్య ద్వారా ఎంటెక్‌ చేయాలనుకుంటున్నాను. కుదురుతుందా? కళాశాలల వివరాలు తెలియజేయండి.

బీటెక్‌ (మెకానికల్‌) పూర్తిచేసిన మీరు దూరవిద్య ద్వారా ఎంటెక్‌ చేసే అవకాశం లేదు. ఎంటెక్‌ను దూరవిద్య ద్వారా చేయడానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) లాంటి కోర్సులకు మాత్రమే అతి తక్కువ అవకాశాలున్నాయి. గతంలో చెప్పినట్లుగా ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రత్యక్ష విద్య ద్వారా కళాశాలలో చదివితేనే విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉండి మెరుగైన ఉద్యోగావకాశాలుంటాయి.

* మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఇండియన్‌ నేవీలో ఉద్యోగం వచ్చింది. నేనెలా చదువు పూర్తిచేయగలనో వివరించండి. దూరవిద్య ద్వారా చేసే అవకాశముంటే కళాశాలల వివరాలు తెలియజేయండి.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న మీకు ఇండియన్‌ నేవీలో ఉద్యోగం వచ్చినందుకు అభినందనలు. అవకాశముంటే ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరువాత ఉదోగంలో చేరే ప్రయత్నం చేయండి. లేని పక్షంలో చదువుతున్న కళాశాల ఆఫీసులో ఎన్ని సంవత్సరాల్లోపు ఇంజినీరింగ్‌ డిగ్రీని పూర్తిచేసే అవకాశం ఉంటుందో కనుక్కోండి. దాన్ని బట్టి ఉద్యోగంలో చేరి స్టడీలీవ్‌లో అర్హత లభించాక మళ్లీ వెనక్కి వచ్చి ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని వెళ్లండి.
ఇంజినీరింగ్‌ను దూరవిద్య ద్వారా అందించే కళాశాలలు లేవు. ఇంజినీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను కళాశాలల్లో చదవడమే మేలు. తప్పనిసరిగా మీరు దూరవిద్య ద్వారానే చేయాలి అనుకుంటే ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇంజినీర్స్‌)ను చేయవచ్చు.

* బీటెక్‌ (మెకానికల్‌) మూడో సంవత్సరం చదువుతున్నాను. ఏర్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ చేయాలనుంది. వివరాలు తెలియజేయగలరు?

ప్రస్తుతం విమానయాన పరిశ్రమలన్నింటిలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజినీరింగ్‌లో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏర్‌బేస్‌, బోయింగ్‌, నాసా లాంటి సంస్థల్లో ఇంజినీర్ల అవసరం ఎక్కువ. ఇస్రో, డిఫెన్స్‌, పౌరవిమాన సంస్థ, ఎన్‌ఏఎల్‌, డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్‌, ప్రైవేటు ఏర్‌లైన్స్‌ సంస్థల్లో అవకాశాలుంటాయి. కొన్ని ఐఐటీలు, ఐఐఎస్‌సీ బెంగళూరు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, మరికొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఎంటెక్‌, ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ని అందిస్తున్నాయి.

నా భర్త మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 2004లో పూర్తిచేశారు. ప్రస్తుతం గల్ఫ్‌లో చేస్తున్నారు. హెచ్‌వీసీఏ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. దూరవిద్య ద్వారా సేఫ్టీలో పీజీ డిప్లొమా కూడా చేశారు. భారత్‌కు రావాలనుకుంటున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆయనకున్న ఉద్యోగావకాశాలు, దరఖాస్తు విధానాలను తెలపండి.

వీరికి ఆటోమొబైల్‌ (టాటా, జనరల్‌ మోటార్స్‌, మారుతి, నిస్సాన్‌), హెవీ మెషినరీ/ మానుఫాక్చరింగ్‌ (సిమెన్స్‌, సుజ్లోన్‌, బోస్చ్‌, కిర్లోస్కర్‌, ఎల్‌ &టీ), కెమికల్‌/ ఫార్మా (డా.రెడ్డీస్‌, ఆల్‌కెమిస్ట్‌, అరబిందో, సిప్లా), పవర్‌/ ఎనర్జీ (అదాని, కుమిన్స్‌, ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌, ఎస్సార్‌, కేఎస్‌కే), కన్‌స్ట్రక్షన్‌ (ఎల్‌ &టీ, ఐవీఆర్‌సీఎల్‌, ఎన్‌సీసీ, రాంకీ)లలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు http://bit.ly/1F3Vkzf లింకును చూసి ఆయా సంస్థల ఉద్యోగ అవసరాలకు తగ్గట్టుగా ప్రొఫైల్‌ను తయారు చేసుకోవాలి.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆయా సంస్థల విధానాల్ని అనుసరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు జాబు పోర్టల్‌, ఈమెయిల్‌, సంస్థ వెబ్‌సైట్‌లో పొందుపరచిన దరఖాస్తును పూరించడం, పోస్టు ద్వారా/ రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెన్సీల ద్వారా పంపడం ఉంటుంది. ఆయా సంస్థల్లో పనిచేసే టెక్నికల్‌ మేనేజర్‌లతో లింక్‌డిన్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెట్‌వర్క్‌ పెంచుకోమని చెప్పండి. తద్వారా వారి అనుభవం, నైపుణ్యాలను వివరించి జాబు సెర్చ్‌ సులభతరం చేసుకోవచ్చు.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్న్‌షిప్‌ చేయాలనుకుంటున్నాను. నాకున్న అవకాశాలను తెలియజేయ గలరు.

ఆటోమోటివ్‌, ఏరోస్పేస్‌, కెమికల్‌, కంప్యూటర్‌, కమ్యూనికేషన్‌, పేపర్‌, పవర్‌ జనరేషన్‌ లాంటి అన్ని మాన్యుఫాక్చరింగ్‌ సంస్థల్లో డిజైన్‌, మాన్యుఫాక్చర్‌, ఇన్‌స్టలేషన్‌, ఇంజిన్‌ ఆపరేషన్‌, మెషిన్స్‌, రోబోటిక్స్‌, హీటింగ్‌ & కూలింగ్‌ సిస్టమ్స్‌, మాన్యుఫాక్చరింగ్‌ ప్రాసెసెస్‌ విభాగాల్లో అవకాశాలుంటాయి.
ఇంటర్న్‌షిప్‌ కోసం ఈ వెబ్‌సైట్లను చూడండి: www.letsintern.com, www.twenty19.com, www.internmatch.com, www.internshala.com. లేకపోతే నచ్చిన కంపెనీలను ఎంచుకుని రిఫరెన్సుల ద్వారా/ వాటి వెబ్‌సైటుల్లో పొందుపరిచిన కాంటాక్ట్‌ వివరాలను బట్టి నేరుగా సంప్రదించండి.

బీఈ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌) పూర్తిచేశాను. ఎంటెక్‌లో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ను ఎంచుకోవచ్చా? ఒకవేళ వీలుంటే ఈ కోర్సును అందించే కళాశాలల వివరాలు తెలపండి. అలాగే బీఈ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తర్వాత ఎంటెక్‌లో న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ను అందించే సంస్థల వివరాలు తెలియజేయండి.

మీరు ఎంటెక్‌లో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ చేయడానికి అర్హులే. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఖరగ్‌పూర్‌ (www.iitkgp.ac.in/); ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌ యూనివర్సిటీ, ధన్‌బాద్‌ (www.ismdhanbad.ac.in/); ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బెంగళూరు (www.iiitb.ac.in); జై నారాయణ్‌ వ్యాస్‌ యూనివర్సిటీ (www.jnvu.edu.in/); నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- ఎన్‌ఐటీ రూర్కేలా (www.nitrkl.ac.in); సింఘానియా యూనివర్సిటీ (www.singhaniauniversity.co.in) వంటి విశ్వవిద్యాలయాలు మెరైన్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తున్నాయి. మరిన్ని కళాశాలల వివరాలకు ఈ http://bit.ly/1szntn6 వెబ్‌సైట్‌ను చూడండి. ఇక న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ అందించే సంస్థల వివరాలను http://bit.ly/RHLRY0 వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాను. డిజైన్‌ ఇంజినీర్‌ కావాలనుకుంటున్నాను. ఎంటెక్‌లో మెషీన్‌ డిజైన్‌ కోర్సు చేయాలనుంది. అయితే ఎంటెక్‌ చేయడానికి ఐఐటీ, ఎన్‌ఐటీలే సరైనవని విన్నాను. అది నిజమేనా? ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఎంటెక్‌ చేసినవారికి ఉండే అవకాశాలేమిటి?

కళాశాల ప్రమాణాలు, ప్రయోగశాలలు/ మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, ఉద్యోగావకాశాలు, ఇతర సదుపాయాలు ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి ప్రముఖ సంస్థల్లో బాగుండడం వల్ల వాటికి ప్రాముఖ్యం వచ్చింది. మీరు ఏ కళాశాలలో చేరాలనుకున్నా వీటిని గమనించండి. దీనికి తోడుగా వాటిని మీ కెరియర్‌కి ఎలా సద్వినియోగపరచుకుంటారనేది చాలా ముఖ్యం.
ఎంటెక్‌- మెషీన్‌ డిజైన్‌ కళాశాలల వివరాలకు http://bit.ly/1f3EDGI వెబ్‌సైట్‌ చూడండి. మెషీన్‌ డిజైన్‌ చేసినవారికి మెకానికల్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్‌, కెమికల్‌, పవర్‌ ప్లాంట్స్‌, స్టీల్‌ ప్లాంట్స్‌, అగ్రికల్చరల్‌, స్పేస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, రైల్వేస్‌, సీపీడబ్ల్యూడీ, డిఫెన్స్‌, పీడబ్ల్యూడీ, పోస్ట్స్‌ &టెలిగ్రాఫ్స్‌ వంటి ప్రభుత్వ రంగాల్లో కూడా అవకాశాలుంటాయి.

మూడో సంవత్సరం మెకానికల్‌ బ్రాంచిలో చదువుతున్నాను. ఇస్రోలో కానీ, డీఆర్‌డీవోలో కానీ ఇంటర్న్‌షిప్‌ చేయాలనుంది. దరఖాస్తు వివరాలు తెలపండి.

ఇస్రోలో ఇంటర్న్‌షిప్‌ ఆ సంస్థ నిర్వహిస్తున్న కోర్సు చదివేవారికి మాత్రమే ఇస్తుంది. బయటివారికి అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. డీఆర్‌డీవోలో ప్రాజెక్టు చేయడానికి మీరు ఈ కింది పద్ధతి అనుసరించాలి. డీఆర్‌డీఓకు అనుబంధంగా కొన్ని లేబొరేటరీలు (రక్షణ విభాగానికి సంబంధించిన పరిశోధన సంస్థలు) స్వయంప్రతిపత్తితో పనిచేస్తాయి. ఇవి టెక్నాలజీలోని వివిధ రంగాల్లో ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ప్రాజెక్టు చెయ్యాలనుకునే అభ్యర్థులు తమ రంగానికి సంబంధించిన సంస్థ డైరెక్టరును నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది. మీ కాలేజి ప్రిన్సిపల్‌ ద్వారా సంస్థ డైరెక్టరును సంప్రదించండి. డీఎంఆర్‌ఎల్‌, డీఆర్‌డీఎల్‌, ఆర్‌సీఐ/ ఆర్క్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ సంస్థల్లో ప్రయత్నించండి.

మెకానికల్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాను. డిజైనింగ్‌కు సంబంధించిన ఉద్యోగాల వివరాలు తెలుపగలరు. బీహెచ్‌ఈఎల్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించాలంటే గేట్‌ తప్పనిసరా?

మీరు ముందుగా CATIA, 2D/3D CAD, Ansys, proE, Solidworks లాంటి వాటిలో నైపుణ్యం మెరుగుపరచుకోవాలి. దీనికి తోడుగా స్టాటిక్స్‌, డైనమిక్స్‌, మెకానిక్స్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, స్ట్రెస్‌ ఎనాలసిస్‌, మెటీరియల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డ్రాయింగ్‌ తెలిసివుండాలి. మీకు ప్రాడక్ట్‌/ మెషిన్‌ డిజైన్‌, ఇంజినీరింగ్‌ డిజైన్‌, డ్రాఫ్టింగ్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ రంగంలో ఎన్నో ఆటోమొబైల్‌ పరిశ్రమల్లో (మెర్సిడెస్‌ బెంజ్‌, టాటా మోటార్స్‌, వోక్స్‌వేగన్‌, ఆడి, స్కోడా, బీఎండబ్ల్యు, మారుతీ సుజుకీ, మహీంద్ర అండ్‌ మహీంద్ర, హ్యుందాయ్‌, అశోక్‌ లేలాండ్‌, ఫోర్డ్‌, హోండా, టయోటా, నిస్సాన్‌, మిత్సుబిషి) ఉద్యోగావకాశాలున్నాయి. ఇవే కాకుండా ఏరోస్పేస్‌, ఏవియేషన్‌, స్టీల్‌ప్లాంట్స్‌, కెమికల్‌, థర్మల్‌ ప్లాంట్స్‌, ఏసీ, రిఫ్రిజిరేటర్‌, షిప్పింగ్‌ లాంటి రంగాల్లో కూడా డిజైన్‌ ఇంజినీర్లకు ప్రాముఖ్యం ఎంతో ఉంది.
బీహెచ్‌ఈఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీస్‌ (ETs) ఉద్యోగం కోసం మీ గేట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. వారు నిర్వహించే రిక్రూట్‌మెంట్‌ వివరాల గురించి ఈ వెబ్‌లింక్‌ http://bit.ly/1huRaWDని చూడండి.

మా అబ్బాయి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. అతను హీట్‌ ట్రాన్స్‌ఫర్‌పై ప్రాజెక్టు వర్క్‌ చేశాడు. ఈ అంశంపై కోర్సులు అందిస్తున్న పీజీ కళాశాలల వివరాలు తెలుపగలరు.

హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ పీజీ కోర్సులు నిర్వహించే కళాశాలలు చాలా అరుదు. బీటెక్‌ అయిన తర్వాత GATEలో అర్హత సాధించి ఐఐటీలో హీట్‌ ట్రాన్స్‌ఫర్‌ పీజీ కోర్సును చేయవచ్చు. గేట్‌ గురించి మరిన్ని వివరాల కోసం http://gate.iitk.ac.in/ వెబ్‌సైట్‌ను చూడండి.
ఈ అంశం గురించి సులభంగా తెలుసుకోవడానికి ఐఐటీ ప్రొఫెసర్ల వర్క్‌షాప్‌ వీడియోలను http://bit.ly/19smLkS (or) http://bit.ly/16vbm58 లో ఉచితంగా చూడవచ్చు.

నేను మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 2006లో పూర్తిచేశాను. ఇపుడు ఆటోక్యాడ్‌ పైన ఉద్యోగం చేస్తున్నాను. ఇక డిజైన్‌ ఫీల్డ్‌ అంటే CATIA, ANALYSIS లేదా UNIGRAPHICS లాంటి వాటిలోకి మారాలనుంది. ఏం చేయాలో వివరించండి?

UGS NX అనేది CAD/CAM/CAE PLM సాఫ్ట్‌వేర్‌ సూట్‌ Seimens PLM వారి కమర్షియల్‌ ప్రోడక్ట్‌.CATIA, Unigraphics, ProE, Solidworks ఎక్కువగా ఆటోమోటివ్‌ (General Motars, Nissan Motors) , ఏరోస్పేస్‌ పరిశ్రమ (Boeing, Rolls-Royce and Pratt & Whitney)లో ఉపయోగిస్తారు. కొద్దిగా కన్స్యూమర్‌ గూడ్స్‌ డిజైన్‌ సెక్టార్‌ (BSH, Dyson and Apple)లో కూడా వాడతారు. CATIA వేరే అప్లికేషన్స్‌ (Enovia, Smarteam, CAE Analysis)తో ఇంటరాక్ట్‌ అవలీలగా అవుతూ tandem తో పనిచేస్తుంది.
కనుక దీన్ని ఎక్కువగా వాడతారు. మీకు నచ్చిన పరిశ్రమను ఎంచుకుని దానికి తగ్గట్టుగా NX తోపాటు CATIA కూడా నేర్చుకుంటే ఎంతో మేలు.

నేను బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 3వ సంవత్సరం చదువుతున్నాను. డిజైనింగ్‌ అంటే ఇష్టం. వేసవి సెలవుల్లో తినేర్చుకుందాం అనుకున్నాను. ఇది ఉపయోగమేనా?

CATIAఅనేది 3డి ప్రాజెక్టులో పలు రకాల దశలను సపోర్టు చేస్తుంది. దీనికి సంబంధించిన ట్యుటోరియల్స్‌, ఆర్టికల్స్‌, ఇతర వీడియోలకు ఈ వెబ్‌సైట్‌లో http:catia.cad2design.com/చూడండి. దీనిని ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఆటోమోటివ్‌, ఇండస్ట్రియల్‌ ఎక్విప్‌మెంట్‌, షిప్పింగ్‌, కన్స్యూమర్‌ గూడ్స్‌, ప్లాంట్‌ డిజైన్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఆర్కిటెక్చర్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌, పవర్‌, పెట్రోలియం లాంటి వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు. కాబట్టి మీకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది.

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 2011లో పూర్తిచేశాను. తర్వాత చాలా కంపెనీలకు సి.వి. పంపాను. కానీ ఇంతవరకూ ఉద్యోగం సంపాదించలేకపోయాను. ఎలా ముందడుగు వేయాలి?

జాబ్‌పోర్టల్స్‌లో ఉన్న ప్రకటనలకు సి.వి.లు పంపుతూ సమయం వృథా చేసేకంటే అంతకంటే మెరుగైన విధానం అనుసరించాలి. చిన్న మాన్యుఫాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలు- Creamline Dairy, Nekkanti Sea Foods Limited, Nakoda Chemicals Ltd. మొదలైనవి ఉన్నాయి. ఆ సంస్థలు ఏమి చేస్తున్నాయి, వాటికి మీ వల్ల ఎలా లాభదాయకం అవుతుందో తెలుసుకోండి. మొదటి రెండు సంవత్సరాలూ మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. అప్పుడు పెద్ద ఇంజినీరింగ్‌ కంపెనీల్లో కొలువు సంపాదించటం సులభమవుతుంది.