ఉద్యోగం చేస్తున్నాను. న్యాయవిద్యా కోర్సు చేయాలనుకుంటున్నాను. ఉద్యోగం చేస్తూనే లా చదివే అవకాశముందా? ప్రవేశమార్గాలేంటి? - బి. రమేష్‌

లా కోర్సును దూర విద్య ద్వారా చదవడానికి ఇప్పుడు అవకాశం లేదు. మీకు న్యాయవిద్యపై ఆసక్తి ఉంటే దూరవిద్య ద్వారా డిప్లొమా కోర్స్‌ కానీ, పీజీ డిప్లొమా కోర్సు కానీ, సర్టిఫికెట్‌ కోర్సులు కానీ, అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేట్‌ కోర్సులు కానీ చేయవచ్ఛు వీటిని ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, న్యాయ విశ్వవిద్యాలయాలతో పాటు ఇతర రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని దూరవిద్యా కేంద్రాల ద్వారా చేయవచ్ఛు.

యానిమేషన్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలేంటి? - శ్యామ్‌ అమృతపూడి

సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారికి యానిమేషన్‌ చక్కని కెరియర్‌ ఆప్షన్‌. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ఫ్రేమ్‌ యానిమేటర్‌, ఇమేజ్‌ ఎడిటర్‌, మోడెల్లర్‌, లేఔట్‌ ఆర్టిస్ట్‌, డిజిటల్‌ అండ్‌ ఇంక్‌ ఆర్టిస్ట్‌ లాంటి ఉద్యోగావకాశాలుంటాయి. జూనియర్‌ యానిమేటర్స్‌కు 8 వేల నుంచి 15 వేల రూపాయల వరకు జీతం ఉంటుంది. 3- 5 సంవత్సరాల అనుభవం తరువాత 25 వేల నుంచి 40 వేల రూపాయల వరకు సంపాదించగలరు. - ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

ఎల్‌.ఎల్‌.బి. చివరి సంవత్సరం చదువుతున్నాను. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇకపై చదువు కొనసాగించకూడదంటున్నారు. నిజమేనా? - సుహాస్‌

ఉద్యోగంలో చేరే తేదీకి ముందే రెగ్యులర్‌ కోర్సు చదువును ఆపెయ్యాల్సి ఉంటుంది. అయితే దూరవిద్యలో కోర్సులు చేయవచ్చు. అనుమతి తీసుకుని ఈవినింగ్‌ కోర్సులో చేరవచ్చు. మీ విషయానికొస్తే... ఉద్యోగం వచ్చాక కూడా మీ చదువుని కొనసాగించాలని ఉంటే, కొంతకాలం పాటు ఉద్యోగం చేసి, ఉద్యోగానికి సెలవు పెట్టి చదువుని పూర్తి చేయండి. మీరు ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరంలో ఉన్నానన్నారు కాబట్టి, మీకు ఉద్యోగాన్ని ఇచ్చిన సంస్థని సంప్రదించి మీ చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరే వెసులుబాటు ఉందేమో కనుక్కోండి.

ఏఐ సంబంధిత కోర్సులను చదవాలనుంది. వేటిని నేర్చుకుంటే మేలు? - రాహుల్‌

రానున్న కాలాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) శాసిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన కోడింగ్‌పై అవగాహన, గణితంపై గట్టి పట్టు ఉన్నవారు ఎవరైనా ఏఐలో రాణించవచ్చు. ఐఐటీ బొంబాయి, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ లాంటి విద్యాసంస్థలు ఏఐ కు సంబంధించిన మాస్టర్స్‌ కోర్సులను అందిస్తున్నాయి. బీటెక్‌ లేదా బీఎస్సీ లాంటి కోర్సులు ఈ మాస్టర్స్‌ కోర్సులను అభ్యసించడానికి కావలసిన కనీస అర్హత. ఇవి కాకుండా కోర్సెరా, యుడెమీ, ఎడెక్స్‌ లాంటి ఆన్లైన్‌ లర్నింగ్‌ ప్లాట్‌ఫారాల్లో ఏఐ కు సంబంధించిన డిప్లొమా, సర్టిఫైడ్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులు బోలెడు ఉన్నాయి. వీటితో పాటు చాలా ప్రైవేట్‌ సంస్థలు మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, పైథాన్‌, హాడూప్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, ఐఓటీ లాంటి కోర్స్‌ లు అందిస్తున్నాయి. మీరు మీ విద్యార్హతనూ అవసరాన్నీ బట్టి వీటిని ఎంచుకోవాలి.

ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేశాను. వీఎఫ్‌ఎక్స్‌, యానిమేషన్‌, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్స్‌, మీడియా లాంటి అంశాలపై ఆసక్తి ఉంది. వాటికి సంబంధించిన కోర్సులు, అందిస్తున్న సంస్థలూ, వాటి ప్రవేశాలు, ఫీజు వివరాలను తెలపండి. - ఎం. శ్రావణి

ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ రెండూ మంచి డిమాండ్‌ ఉన్న రంగాలు. సృజనాత్మకతకు నైపుణ్యం తోడై ఆసక్తి, కొత్త తరహా ఆలోచనలు ఉన్నవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. డిగ్రీ చేస్తూనే దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా ఫొటోగ్రఫీ నేర్చుకోవచ్ఛు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ లాంటి ఎన్నో సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో డిప్లొమా ఇన్‌ ఫొటోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి. రెగ్యులర్‌ విధానంలో ఉస్మానియా యూనివర్సిటీ మూడేళ్ల బ్యాచిలర్‌ కోర్సును నిర్వహిస్తోంది. దీనికి ప్రవేశ పరీక్ష ప్రతి సంవత్సరం జూన్‌ మొదటి వారంలో జరుగుతుంది. మాస్‌ కమ్యూనికేషన్‌ రిసెర్చ్‌ సెంటర్‌- జామియామిలియా ఇస్లామియా, దిల్లీ - స్టిల్‌ ఫొటోగ్రఫీలో సర్టిఫికెట్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది. వ్యవధి ఒక్క సంవత్సరం. ఏటా ఫిబ్రవరిలో అడ్మిషన్లు మొదలవుతాయి.
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో మూడు సంవత్సరాల బ్యాచిలర్‌ కోర్సు ఉంది. ఇది ఏటా ఆగస్టులో మొదలవుతుంది. యానిమేషన్‌ విషయానికి వస్తే, మనదేశంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిలిం అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ - కోల్‌కతా, సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీ- కోల్‌కతా, ఎరీనా యానిమేషన్‌ లాంటి ఇన్‌స్టిట్యూట్‌లు డిగ్రీ, డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

ఇంటర్మీడియట్‌ చదువుతున్నాను. లా, జర్నలిజం.. రెండింటిపై నాకు ఆసక్తి ఉంది. ఒకేసారి రెండింటినీ చదివే వీలుందా? - జీవీ సృజన్‌

న్యాయవిద్య (లా), జర్నలిజం- రెండూ భిన్నమైన కోర్సులు. ఈ రెండింటినీ కలిపి అందించే కోర్సులయితే ప్రస్తుతం లేవు. న్యాయవిద్యను అభ్యసించిన జర్నలిస్టులకు మీడియా రంగంలో మంచి అవకాశాలుంటాయి. లా పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి లీగల్‌ రిపోర్టర్లుగా, లీగల్‌ కరస్పాండెంట్లుగా సంబంధిత వార్తలూ, కథనాలను రాసే వీలుంటుంది. మీరు ముందుగా జర్నలిజంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేసి తరువాత ఎల్‌.ఎల్‌.బి. చెయ్యవచ్చు.

ఇంటర్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. వైరాలజీ గురించి తెలపండి. డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్న కోర్సులు, అందించే కాలేజీలు, ప్రవేశ విధానాలను తెలపండి. - కె. దీప్తి

వివిధ రకాల వైరస్‌లూ, అవి వ్యాపించే విధానం, ఆ వైరస్‌లు వృద్ధి చెందే ప్రక్రియను అర్ధం చేసుకోవడం మానవ మనుగడకు ఎంతో ముఖ్యం. మనుషులకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు ఈ వైరస్‌లే కారణం. వీటిని కనుక్కోవడం, మనకు వచ్చిన ఆరోగ్య సమస్యలకు యాంటీ-వైరస్‌లను కనుక్కోవడంలో వైరాలజిస్టులు ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ రంగంలో ఉన్న కోర్సులు చదివి పరిశోధనలు చేయాలనుకునేవారికి వైరాలజీ మంచి భవిష్యత్తునే అందిస్తుంది. డిగ్రీ స్థాయిలో వైరాలజీ కోర్సులు లేవు. ఎందుకంటే దీన్ని చదవడానికి బయాలజీ, కెమిస్ట్రీలపై గట్టి పట్టు అవసరం. అందువల్ల బయాలజీ, లైఫ్‌సైన్స్‌, కెమిస్ట్రీలకు సంబంధించి గ్రాడ్యుయేషన్‌ చేసినవారికి మాస్టర్స్‌ స్థాయిలో వైరాలజీ చదివే అవకాశం ఉంటుంది.

ఇంటర్‌ తర్వాత బీఎస్సీ (బయలాజికల్‌ ఓషనోగ్రఫీ) చదవాలంటే ఏం చేయాలి? దానికి భవిష్యత్తు ఎలా ఉంటుంది? - అరవింద్‌

ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివినవారు బీఎస్సీ ఓషనోగ్రఫీ చేయవచ్చు. బయలాజికల్‌ ఓషనోగ్రఫీ అనేది ఓషనోగ్రఫీƈ కోర్సుకు సంబంధించిన ఒక బ్రాంచి. సముద్ర గర్భంలో ఉండే జీవరాశుల జనన ప్రక్రియ, వాటి సంతతికి సంబంధించిన అంశాలపై ఈ కోర్సులో అవగాహన కల్పిస్తారు. మనదేశంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ, గోవా; అన్నా యూనివర్సిటీ, మంగళూరు యూనివర్సిటీ, బ్రహ్మపుర యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఎంట్రన్స్‌ల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తాయి. కోర్సు పూర్తి చేస్తే మెరైన్‌ పాలసీ నిపుణులుగా, మెరైన్‌ ఆర్కియాలాజిస్టులుగా, మెరైన్‌ బయాలజిస్టులుగా, ఫిజికల్‌ ఓషనోగ్రాఫర్లుగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు.

బీఎస్సీ (బీజెడ్‌సీ) వాళ్లకి సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు ఉంటాయా? ఉంటే వాటిని అందుకోడానికి ఏ కోర్సులు చేయాలి? - సాయి చరణ్‌

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ చేసిన విద్యార్థులనే కాకుండా సాధారణ డిగ్రీ విద్యార్థులనూ సంస్థలు ఎంచుకుంటున్నాయి. చాలా కంపెనీలు అభ్యర్థుల అర్హతలతో సంబంధం లేకుండా ఆసక్తి, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఆధారంగా నియామకాలు జరుపుతున్నాయి. ఎనలిటికల్‌ స్కిల్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ఎబిలిటీ, కోడింగ్‌పై పట్టు సాధిస్తే సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొలువు సొంతమవుతుంది. ముందుగా సీ లాంగ్వేజీ, జావా లాంటి వాటిపై నైపుణ్యాలు పెంచుకోవాలి. పైథాన్‌ నేర్చుకోవచ్చు.

బీఎస్సీ (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, సీఎస్‌) చదువుతున్నాను. డిగ్రీ తరువాత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసే అవకాశముందా? - వి. మానస

సృజనాత్మకత, వైవిధ్యమైన ఆలోచనా ధోరణితో పాటు టెక్స్‌టైల్‌, జ్యూలరీ రంగాలపై ఆసక్తి ఉన్నవారికి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సరైన ఎంపిక. డిగ్రీ ఏ సబ్జెక్టులో చేసినప్పటికీ ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో మాస్టర్స్‌ చేసే వెసులుబాటు ఉంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో మాస్టర్స్‌ చేద్దాం అనుకునే విద్యార్థులకు మూడు బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి .అవి మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మానేజ్‌మెంట్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ మన దేశంలో అత్యుత్తమ ప్రభుత్వ సంస్థ.

మెరైన్‌ జియోఫిజిక్స్‌ చేయాలనుకుంటున్నాను. భవిష్యత్తు ఎలా ఉంటుంది? - మనోజ్‌ నాగిరెడ్డి

ఫిజిక్స్‌ విభాగానికి సంబంధించి మాస్టర్స్‌ కోర్సు మెరైన్‌ జియోఫిజిక్స్‌. భౌతికశాస్త్రంపై పట్టు ఉండి పరిశోధన రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఈ కోర్సు ఉత్తమ ఎంపిక. దీన్ని చదివిన విద్యార్థులు సముద్రగర్భంలో జరిగే భౌతిక ప్రక్రియలను అర్థం చేసుకొని మెరైన్‌ సర్వ్‌లు చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు. మెరైన్‌ జియో ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ కోర్సు చేయాలంటే బాచిలర్స్‌లో మాథ్స్‌ లేదా ఫిజిక్స్‌ స్పెషలైజేషన్‌తో ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఈ కోర్సును అందిస్తోంది. ఇది చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో మెరైన్‌ ఫ్యూయల్‌ టెక్నీషియన్‌, మెరైన్‌ జియో ఫిజిక్స్‌ ట్రెయినీ, మేనేజర్‌ (మెరైన్‌) వంటి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాను. వైద్యవృత్తిపై ఆసక్తి. డిగ్రీ పూర్తయ్యాక ఎంబీబీఎస్‌ చేయడం వీలవుతుందా? - ప్రియాంక

సాధారణంగా ఇంటర్మీడియట్‌ (బై.పి.సి.) పూర్తి అయినవెంటనే నీట్‌ ప్రవేశపరీక్ష రాసి అందులో వచ్చిన ర్యాంకు ద్వారా ఎం.బి.బి.ఎస్‌.లో జాయిన్‌ అవుతారు. మీరు ఇప్పుడు డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నారు, కొంచెం ఆలస్యం అయింది. వయసు 25 సంవత్సరాలు దాటకుండా ఉండి ఉన్నట్టయితే డిగ్రీ పూర్తి అయినవెంటనే ఇంటర్మీడియట్‌ అర్హతతో నీట్‌ రాయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు మరో 5 సంవత్సరాల వెసులుబాటు ఉంటుంది. నీట్‌ ర్యాంకు ఆధారంగా వైద్యవిద్యలో ప్రవేశించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో మ్యూజిక్ డిగ్రీని అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలేవి? - వికాస్ బాబు

సంగీత కళను గ్రాడ్యుయేట్; మాస్టర్స్ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో బి.ఎ. మ్యూజిక్ను అందిస్తున్నారు.ప్రవేశపరీక్ష లేదు. ఇంటర్ పాసైవుండాలి. ఆంధ్ర, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు ప్రవేశపరీక్ష లేకుండా గ్రాడ్యుయేషన్ ఆధారంగా ఎం.ఎ. మ్యూజిక్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. తెలంగాణలో కాకతీయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు ఎం.ఎ. మ్యూజిక్ను అందిస్తున్నాయి. దీనికోసం బి.ఎ. మ్యూజిక్ లో 50 శాతంతో ఉతీర్ణత సాధించి ఉండాలి. ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఆంధ్రమహిళాసభ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్ టెన్త్ అర్హతతో డిప్లొమా ఇన్ మ్యూజిక్, ఇంటర్ అర్హతతో బి.ఎ. మ్యూజిక్, బి.ఎ. మ్యూజిక్ అర్హతతో ఎం.ఎ. మ్యూజిక్ అందిస్త్తోంది. ప్రైవేటు వర్సిటీల్లో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ అఫ్ హయ్యర్ లర్నింగ్లో బ్యాచిలర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్సును అందిస్తున్నారు. దీనికి ప్రవేశ పరీక్ష ఉంది. ఇగ్నో దూరవిద్య విధానంతో బి.ఎ. మ్యూజిక్ను అందిస్తోంది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు సంగీత విభాగం ప్రారంభించారు. వచ్చే విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2020 మార్చి/ ఏప్రిల్ నెలలో వచ్చే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రవేశ ప్రకటనను గమనిస్తుండండి.
- ప్రొ. బి.రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

ఉద్యోగసాధనకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కావాలని చెపుతుంటారు కదా? అంటే ఇంగ్లిష్‌ బాగా నేర్చుకుంటే సరిపోతుందా? - కిరణ్మయి, పెడన

భావ వ్యక్తీకరణ (కమ్యూనికేషన్‌) అనేది ఇంగ్లిష్‌కో, మరో భాషకో మాత్రమే సంబంధించిన విషయం కాదు. మనం చెప్పాలనుకున్న భావం స్పష్టంగా, తికమక లేకుండా, ఎదుటివారికి సరిగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామా లేదా అనేది భావ వ్యక్తీకరణ. ముఖ్యంగా అపార్థాలకు ఏమాత్రం తావివ్వకుండా మన ఉద్దేశం అవతలివారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి.
భాషానైపుణ్యాలతో పాటు ఇతర నైపుణ్యాలూ భావ వ్యక్తీకరణలో భాగంగా ఉంటాయి. వీటిని మెరుగుపరచుకోవటానికి ఎన్నో అవకాశాలున్నాయి. పబ్లిక్‌ స్పీకింగ్‌, నెట్‌వర్కింగ్‌ కార్యక్రమాలు, నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచుకునే సదస్సులు ఎక్కడ జరిగినా హాజరవుతుండాలి. హైదరాబాద్‌ టోస్ట్‌మాస్టర్‌ (www.hyderabadtoastmasters.in) లాంటి సోషల్‌ గ్రూపుల్లో చేరి క్రియాత్మకంగా పాల్గొంటే భావ వ్యక్తీకరణ మెరుగుపడుతుంది.

మెకానికల్‌ విద్యార్థిని. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ప్రిపేర్‌ అవుతున్నాను. సిలబస్‌లో ఆర్‌సీసీ అండ్‌ సర్వేయింగ్‌ అని ఉంది. ఇది పూర్తిగా సివిల్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టు. ఇవన్నీ చదవాలా? సిలబస్‌లో ఇచ్చినంత వరకు చదివితే సరిపోతుందా? బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ లాంటి అదనపు సమాచారాన్ని కూడా చదవాలా? - మౌనిక

సిలబస్‌లో ఇచ్చినంత వరకు చదివితే సరిపోతుంది. బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ సిలబస్‌లో లేదు. అలాంటి వాటిని అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచికి చెందిన వారైనా సిలబస్‌లో ఇచ్చిన విభాగాలన్నింటికీ ప్రిపేర్‌ కావాల్సిందే. ప్రశ్నలు ఈసెట్‌ స్థాయిలో ఉంటాయి.

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పరీక్షకు హాజరవుతున్నాను. ఇందులో జనరల్‌ స్టడీస్‌కు 50 మార్కులు. టెక్నికల్‌ సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించారు. ఉన్న కాస్త సమయంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? టైమ్‌ను ఎలా విభజించుకొని ప్రిపేర్‌ కావాలి? - రవీంద్రకుమార్‌ అన్నపరెడ్డి

మీ పరిజ్ఞానాన్ని అనుసరించి ప్రిపరేషన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. మీరు జీఎస్‌ ఇంతకు ముందే చదివి ఉంటే కొంత తక్కువ సమయం సరిపోతుంది. టెక్నికల్‌ సబ్జెక్టుపై పట్టు ఉంటే జీఎస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా రోజుకి జీఎస్‌కి రెండు గంటలు, టెక్నికల్‌ సబ్జెక్టుకి 5 నుంచి 6 గంటలు కేటాయించడం మంచిది. ఎప్పటికప్పుడు రివిజన్‌ చేసుకోవాలి. చివర్లో మళ్లీ రివిజన్‌ చేయాలి. బిట్లను ప్రాక్టీస్‌ చేయాలి. పరీక్ష రాసేటప్పుడు ముందు జీఎస్‌ బిట్లను పూర్తి చేసి, టెక్నికల్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.

ఎడ్యుకేషన్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ జాబ్‌ కోసం ఎడ్యుకేషన్‌ సైకాలజీ చదవాలా? జనరల్‌ సైకాలజీ సరిపోతుందా? సిలబస్‌లో కమ్యూనికేషన్‌ అని ఒక పదం మాత్రమే ఉంది. ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌ గురించి ప్రిపేర్‌ కావాలా? సాధారణ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ గురించి తెలుసుకుంటే చాలా? తెలియజేయగలరు. - దివాకర్‌ రెడ్డి

ఎడ్యుకేషన్‌ సైకాలజీ చదవాలి. విద్యా మనోవిజ్ఞానశాస్త్రం, విద్యాదృక్పథాలు అధ్యయనం చేయాలి. ఈ ఉద్యోగానికి కనీస విద్యార్హత కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ కాబట్టి కమ్యూనికేషన్‌ అంటే ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ సిస్టం గురించి స్థూలమైన అవగాహన కలిగి ఉండాలి.

టీఎస్‌ పీజీఈసెట్‌లో మెకానికల్‌లో 46వ ర్యాంకు, నానో టెక్నాలజీలో 3వ ర్యాంకు సాధించాను. ఈ రెండింటిల్లో దేన్ని ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది? నానోటెక్నాలజీకి జేఎన్‌టీయూ- కరీంనగర్‌ను ఎంచుకోవచ్చా? మరో సందేహం- ఆర్‌ఎఫ్‌సీఎల్‌ లాంటి పరీక్ష ఫలితాల్లో అవకతవకలకు ఆస్కారముందా? - నాగరాజు తూటి

ఓయు పరిధిలో పీజీఈసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ ముగిసింది. భవిష్యత్తు అవకాశాల దృష్ట్యా నానో టెక్నాలజీ కోర్సు ఉత్తమ ఎంపిక. మనదేశంలో మాత్రం ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సమీప భవిష్యత్తులో సర్వీస్‌, మెటీరియల్స్‌ విభాగాల్లో నానోటెక్నాలజీ 5 లక్షల ఉద్యోగాలను అందించనుందని అంచనా! ఐఐటీలు, ఐఐఎస్‌సీలు, కొన్ని సంస్థలు నానోటెక్నాలజీలో పరిశోధనకు ప్రాముఖ్యమిస్తున్నాయి. మీకు కూడా పరిశోధనపై ఆసక్తి ఉంటే దీన్ని ఎంచుకోవచ్చు. రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేదనుకుంటే మెకానికల్‌ను ఎంచుకోండి. ముందు ఎంటెక్‌ ఎందుకు చేయాలనుకుంటున్నారో స్పష్టం చేసుకోండి. కేవలం ఎంటెక్‌ అర్హత ఉన్న ఉద్యోగాలకు ప్రయత్నించాలనుకుంటున్నారా? లేదా రిసెర్చ్‌ కూడా చేయాలనుకుంటే ఏ కోర్సు అయినా ఫర్వాలేదు. నానోకు సంబంధించి కొత్త విభాగం కాబట్టి, పీహెచ్‌డీ త్వరగా పూర్తి చేసుకునే అవకాశమూ ఎక్కువే. అలాకాకుండా ఎంటెక్‌ను ఉద్యోగం వచ్చేంతవరకూ బిజీగా ఉంచే సాధనంగా భావిస్తే ఏ కోర్సూ ఉపయోగకరం కాదు. జేఎన్‌టీయూ- కరీంనగర్‌కి మంచి పేరుంది. అయితే ఇక్కడ ఫాకల్టీ పరంగా కొంత కొరత ఉంది. దీన్నే ఎంచుకోవాలనుకుంటే మెకానికల్‌ కోసం ప్రయత్నించవచ్చు.
ఇక పోటీపరీక్ష గురించి. పరీక్షలు పారదర్శకంగానే జరుగుతాయి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల విషయంలో మార్పులు చేయడం కష్టం. అయినా ఎంపిక విషయంలో పాటించే పద్ధతులు సంస్థను బట్టి ఉంటాయి. అయితే ముందుగానే ఈ విషయాన్ని చెప్పారా లేదా అన్నది ముఖ్యం. జాబ్‌ మార్కెట్‌ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం అంటేనే పోటీతో కూడుకున్నది. పరిజ్ఞానమున్న వారి మధ్య జరిగే పోటీ. సబ్జెక్టుకు సంబంధించి పూర్తిగా సిద్ధమై ఉండాలి. ఉద్యోగాన్ని ఒడిసి పట్టుకోవాలంటే పోటీతత్వం, కచ్చితత్వం, వేగం తప్పనిసరి. కాబట్టి, మిగతా ఆలోచనలను మనసులోంచి తుడిచిపెట్టి, మీవంతు ప్రయత్నం చేయండి.

అబ్బాయి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అగ్రికల్చర్‌పై ఆసక్తి. పీజీలో అయినా చదవాలనుకుంటున్నాడు. వీలవుతుందా?- పి. ప్రసాదరావు

సాధారణంగా డిగ్రీలో బి.ఎస్‌.సి. అగ్రికల్చర్‌ చెయ్యకపోతే ఎం.ఎస్‌.సి. అగ్రికల్చర్‌ చేసే అవకాశం లేదు. ఏ యూనివర్సిటీ అయినా నాన్‌ అగ్రికల్చరల్‌ విద్యార్థులకు కూడా అగ్రికల్చరల్‌ పీజీ చేసేందుకు వీలు కల్పిస్తే ఆ కోర్సుకు ICAR గుర్తింపు ఉందో లేదో తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఏ అగ్రికల్చర్‌ కోర్సుకు అయినా ICAR అనుమతి తప్పనిసరి.

బీకాం చదువుతున్నాను. సైకాలజీపై ఆసక్తి. బీకాం వారికి సైకాలజీలో ఎంఏ/ ఎమ్మెస్సీ చేసే వీలుంటుందా? - తేజ, అనంతపురం

చాలా విశ్వవిద్యాలయాల్లో సైకాలజీలో పీజీ చేయాలంటే డిగ్రీలో సైకాలజీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. అయితే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయం, తమిళనాడులోని కొన్ని యూనివర్సిటీల్లో ఏ డిగ్రీతోనైనా దూర విద్యావిధానంలో సైకాలజీ పీజీ చేయవచ్చు. మీ అర్హతలూ, అవకాశాలనూ బట్టి నిర్ణయం తీసుకోండి.

బీఎస్‌సీ (కంప్యూటర్స్‌)కి ఉన్న ఉద్యోగావకాశాలు ఏమిటి? డిగ్రీ తర్వాత ఉన్నత చదువులకు ఏవి ఎంచుకోవటం మంచిది? - హైమప్రియ

ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చేసినవారికి దీటుగా ఇప్పుడు బీఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌ చేసిన విద్యార్థులు ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.. బీటెక్‌తో పోలిస్తే తక్కువ వ్యవధిలో కోర్సు పూర్తవటం, తక్కువ ఖర్చు, బోలెడన్ని ప్రారంభ దశ అవకాశాలు... ఇవన్నీ బీఎస్‌సీ కంప్యూటర్స్‌ను ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తున్నాయి.
బీఎస్‌సీ కంప్యూటర్స్‌ చేసిన విద్యార్థులు కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌, హార్డ్‌ వేర్‌, నెట్‌వర్క్‌, వెబ్‌ డిజైనింగ్‌ అండ్‌ డెవలపింగ్‌ రంగాల్లో స్థిరపడవచ్చు. బీఎస్‌సీ తర్వాత ఎంబీఏ (ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌), ఎంసీఏ కోర్సుల్లో చేరవచ్చు. లేకపోతే ఎస్‌ఏపీ, సిస్టం ఇంజినీర్‌ లాంటి సర్టిఫైడ్‌ కోర్సులు చేసి ఉన్నత ఉద్యోగావకాశాలను పొందవచ్చు.

డిగ్రీ (బీఎస్‌సీ) పూర్తిచేశాను. బోటనీలో పీజీ చేద్దామనుకుంటున్నా. భవిష్యత్తు ఎలా ఉంటుంది? - బి.రామకృష్ణ

వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చే మనదేశంలాంటి చోట్ల బొటానిస్టుల అవసరం ఎప్పుడూ ఉంటుంది. వీరు వివిధ రకాల మొక్కల జీవనవిధానం, వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన విషయాల్లో నిష్ణాతులుగా ఉంటారు.. కృత్రిమ పరిసరాల్లో మొక్కలను పెంచి వాటిపై ప్రయోగాలు చేస్తారు. ఎంఎస్‌సీ బోటనీ కోర్సులో వివిధ రకాల గ్రూపులున్నాయి. జెనెటిక్స్‌ లైకెనాలాజీ, ఎకనామిక్‌ బోటనీ, సైటాలజీ, పాలినాలజీ మొదలైనవి. బోటనీలో పీజీ చేసినవారికి వైవిధ్యమైన ఉద్యోగావకాశాలున్నాయి. పీజీ పూర్తయ్యాక మీ అభిరుచికి తగ్గట్టు ప్లాంట్‌ ఎక్స్‌ప్లోరర్‌, కన్జర్వేషనలిస్ట్‌, ఎకాలజిస్ట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్‌, హార్టికల్చరిస్ట్‌ మొదలైన ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.

బీఎస్‌సీ చదువుతున్నాను. ఎస్‌ఐ కావాలనుంది. ఏం చేయాలి? - వి. శ్రీహరి

ఎస్‌ఐ ఉద్యోగానికి మీరు అర్హులే. ఏ డిగ్రీ చేసిన వారైనా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేదా కంటి సమస్యలు ఉండకూడదు. శారీరకంగా, మానసికంగా దృఢమైన వ్యక్తి అయి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పుడు దరఖాస్తు చేసుకుని, వారు నిర్వహించే రాత, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులై మెరిట్‌ పొందితే ఎస్‌ఐ పోస్టును పొందవచ్చు. మంచి జీవితంతోపాటు సామాజిక హోదాను ఈ ఉద్యోగం అందిస్తుంది.

డిప్లొమా (మెకానికల్‌) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఏమిటి? - తేజ శ్రీకాంత్‌

ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునేవారికి డిప్లొమా కోర్సులు మంచి మార్గం. మెకానికల్‌ డిప్లొమా వారికి ప్రభుత్వరంగంలో అవకాశాలున్నాయి. కానీ ఇప్పుడున్న పోటీలో ఉద్యోగం సంపాదించడానికి మీ సాంకేతిక నైపుణ్యాలతో పాటు అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌కు సంబంధించిన అన్ని అంశాల్లో అవగాహన పెంచుకోవాలి. రైల్వే, గెయిల్‌, ఓఎన్‌జీసీ, డీఆర్‌డీఓ, బీహెచ్‌ఈఎల్‌, ఎన్‌టీపీసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ లాంటి ఎన్నో ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా నోటిఫికేషన్లు వస్తుంటాయి. సంబంధిత పోటీ పరీక్షలో రాణిస్తే ఉద్యోగం సాధించినట్టే. మీకు ఆసక్తి ఉంటే డిప్లొమా తర్వాత పరీక్షల్లో నెగ్గి ఇండియన్‌ ఆర్మీలో కూడా చేరవచ్చు.

పదో తరగతి పూర్తిచేశాను. బైపీసీ తీసుకుందామనుకుంటున్నా. బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుంది. బైపీసీతో చేయొచ్చా? - ఎస్‌. రామ్‌చంద్ర

బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ 4 సంవత్సరాల గ్రాడ్యుయేట్‌ కోర్సు. ఆరోగ్యం, బయోలాజికల్‌ అంశాలకు సంబంధించి సమస్యలను ఇంజినీరింగ్‌ నైపుణ్యం ద్వారా పరిష్కరించడానికి ఈ కోర్సును రూపొందించారు. ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌కు సంబంధించిన సబ్జెక్టులు కోర్సులో భాగంగా ఉంటాయి. దీనిలో చేరాలంటే ఇంటర్‌లో కచ్చితంగా మేథమేటిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులకు మెడికల్‌, మెడికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లకు సంబంధించిన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి.

డిగ్రీ చదువుతున్నాను. రాజకీయాల గురించి తెలుసుకోవాలనుంది. దానికి సంబంధించిన కోర్సులేమైనా ఉన్నాయా? - దిషిత

రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి, సంబంధిత శాస్త్రాన్ని అభ్యసించాలనుకునేవారు బీఏ పొలిటికల్‌ సైన్స్‌ లేదా ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. మీరు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు కాబట్టి, డిగ్రీ పూర్తయ్యాక ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎంఏ రెగ్యులేటరీ గవర్నెన్స్‌, ఎంఏ అర్బన్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌, ఎంఏ పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ స్టడీస్‌ లాంటి పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.

ఇంటర్‌లో ఐఎస్‌సీ (హోమ్‌సైన్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, బయాలజీ, ఇంగ్లిష్‌) కరిక్యులమ్‌ చదువుతున్నాను. డిగ్రీ స్థాయిలో ఉన్న అవకాశాలను తెలియజేయండి. - లింగుట్ల కావ్య

ఇంటర్‌లో ఐఎస్‌సీ (హోమ్‌సైన్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, బయాలజీ, ఇంగ్లిష్‌) కరిక్యులమ్‌ చదివిన వాళ్లకు హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌, ఎకనామిక్స్‌, లా, సైకాలజీ వైపు ఉన్నతవిద్య చదవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బయాలజీ రంగంలో అయితే కొన్ని కోర్సులకు అర్హత ఉంటుంది. హ్యూమానిటీస్‌ వైపు ఆసక్తి ఉంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ను ఎంచుకోవచ్చు. ఇంకా సైకాలజీ, మాస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ జర్నలిజం, లా విభాగాల్లో డిగ్రీ చేయవచ్చు. వ్యాపార రంగంపై అభిరుచి ఉంటే బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సుల్లో చేరవచ్చు.

బీఏ పూర్తిచేశాను. వయసు 31 ఏళ్లు. పురాతత్వ శాఖ వైపు వెళ్లాలని ఉంది. నాకున్న అవకాశాలేంటి? - సతీష్‌

పురాతత్వ శాఖపై ఆసక్తి ఉన్నవారికి ఆర్కియాలజీ కోర్సు ఒక చక్కని మార్గం. చరిత్ర మీద ఆసక్తితోపాటు నాగరికత గురించి తెలుసుకోవాలనే కోరికా ఉంటే ఈ రంగానికి మీరు సరైనవారు కాగలరు. ఆర్కియాలజీ చదవాలనుకునే వారికి డిగ్రీలో చరిత్ర ఒక సబ్జెక్టుగా ఉండాలి. మీకు ఉంది కాబట్టి, మీరు అర్హులే.
ముంబయి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ అలహాబాద్‌ వంటి విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును జాతీయ స్థాయిలో అందిస్తున్నాయి. ఆర్కియాలజీ చదివినవారు ఆర్కియాలజిస్టులు, రిసెర్చ్‌ అసిస్టెంట్లు, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు నియమితమయ్యే అవకాశం ఉంది.

దూరవిద్య ద్వారా డిగ్రీ (ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌) పూర్తిచేశాను. ఆర్కియాలజీ లేదా మెటియోరాలజీ చదవాలనుంది. వీలవుతుందా? అందించే సంస్థలేవి? కోర్సు పూర్తయ్యాక నాకున్న ఉద్యోగావకాశాలేంటి? - కె. ఆర్‌. ఆశ్రిత్‌ కృష్ణ, అనంతపురం

వాతావరణం, పర్యావరణం పట్ల ఆసక్తి ఉండి, వాటిని ప్రత్యేకంగా పరిశీలించి అధ్యయనం చేయాలనుకునేవారికి మెటియోరాలజీ కోర్సు చక్కగా సరిపోతుంది. ఈ కోర్సు చేయడానికి మాత్రం మేథ్స్‌, ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసుండాలి. మీరు మీ డిగ్రీని హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌లో చేశారు కాబట్టి, ఈ కోర్సును చేయడానికి వీలు పడదు.
ఇక ఆర్కియాలజీ కోర్సు విషయానికొస్తే.. దీనిలో రాణించడానికి ముఖ్యంగా చరిత్ర మీద ఆసక్తితోపాటు నాగరికతల గురించి చదవాలనే కోరిక ఉండాలి. ఇవి ఉన్నవారు ఆర్కియాలజీ రంగానికి సరైనవారు కాగలరు. ఆర్కియాలజీ చదవాలనుకునేవారికి డిగ్రీలో తప్పనిసరిగా హిస్టరీ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. మీకు ఉంది కాబట్టి మీరు దీన్ని చదవడానికి అర్హులే.
ముంబయి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ అలహాబాద్‌ వంటి సంస్థలు ఈ కోర్సును జాతీయ స్థాయిలో అందిస్తున్నాయి. ఆర్కియాలజీ పూర్తిచేసినవారు ఆరియాలజిస్ట్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్లు, ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు నియమితమయ్యే అవకాశం ఉంది.

చాలాకాలం నుంచి నాకో సందేహం. ఆనర్స్‌ డిగ్రీ అంటుంటారు కదా? అదేమిటి? దీనిలో ఏడాది ఎక్కువ చదవాలా? - ప్రవీణ్‌, కొత్తగూడెం

ఆనర్స్‌ డిగ్రీల్లో చేరినవారు అదనంగా మరో ఏడాది చదవాల్సిన అవసరమేమీ ఉండదు. బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బ్యాచిలర్‌ డిగ్రీ ఆనర్స్‌.. రెండింటి కాలవ్యవధీ మూడేళ్లే. సాధారణంగా డిగ్రీస్థాయిలో ఉన్న అవకాశాలు- బీఎస్‌సీ, బీఏ, బీకాం. వీటిల్లో విద్యార్థి తనకు నచ్చిన/ అవకాశమున్న కాంబినేషన్లతో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసుకుంటాడు. దీనిలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని పొందుతాడు. ఆనర్స్‌ విషయానికొస్తే ఒకే సబ్జెక్టును ప్రధానంగా చదువుతాడు. విశ్లేషణకూ, సొంత ఆలోచనలను రూపొందించుకునే అవకాశం ఇస్తుంది ఆనర్స్‌. మూడు సబ్జెక్టులనూ చదివినా, ఒక దానిలో ప్రత్యేకంగా ప్రావీణ్యం లభించేలా చేస్తుంది ఇది. కాబట్టి, విద్యార్థి తనకు బాగా ఆసక్తి ఉన్న అంశంలో నైపుణ్యం సాధించాలనుకుంటే ఆనర్స్‌ డిగ్రీని ఎంచుకోవచ్చు.
ఉదాహరణకు - బీఏ సైకాలజీ (ఆనర్స్‌) ఎంచుకున్నారనుకుంటే.. సైకాలజీతోపాటు సోషియాలజీ, ఇంగ్లిష్‌ కూడా చదవాల్సి ఉంటుంది. అయితే ప్రధాన దృష్టి మాత్రం సైకాలజీపై ఉంటుంది. ఆనర్స్‌ ఉద్దేశం విద్యార్థిలో పరిజ్ఞానాన్ని పెంపొందించడంతోపాటు సంబంధిత సబ్జెక్టులో పరిశోధనకు అవసరమైన నైపుణ్యాలను పెంచడం. జనరల్‌ డిగ్రీ విషయంలో నిర్ణీత సబ్జెక్టులన్నింటి పరిచయం ఏర్పడుతుంది. ఆనర్స్‌ డిగ్రీతో పోలిస్తే జనరల్‌ డిగ్రీని సులువని చెబుతారు. ఉద్యోగ విషయంలోనూ జనరల్‌ డిగ్రీ వారితో పోలిస్తే.. ఆనర్స్‌ డిగ్రీ వారికి ప్రాధాన్యం కాస్త ఎక్కువ ఉంటుంది.
ఆనర్స్‌ డిగ్రీలు సాధారణ డిగ్రీలోనే కాదు; బి.ఇ.లో, ఎంఎస్సీలో కూడా ఉన్నాయి. సుప్రసిద్ధ విద్యాసంస్థ బిట్స్‌ పిలానీ కెమికల్‌,. సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌,. ఈఈఈ, ఈఐఈ, మెకానికల్‌, మాన్యుఫాక్చరింగ్‌ విభాగాల్లో బి.ఇ. ఆనర్స్‌ కోర్సులను అందిస్తోంది. ఇక్కడే ఎంఎస్సీ ఆనర్స్‌ కోర్సులు బయాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.

బీఎస్‌సీ బయోటెక్నాలజీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎంఎస్‌సీ చేయాలనుంది. అందించే ప్రముఖ కళాశాలలు, ఉద్యోగావకాశాల వివరాలను తెలపండి. - ఎస్‌. భరత్‌

బయాలజీకి సంబంధించిన కోర్సుల్లో బయోటెక్నాలజీది ఎప్పుడూ ప్రముఖ స్థానమే. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. బయోటెక్నాలజీ కోర్సు ఇంజినీరింగ్‌, జెనెటిక్స్‌, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లాంటి సబ్జెక్టులతో ముడిపడి ఉంటుంది. మీరు బీఎస్‌సీ బయోటెక్నాలజీ తరువాత దీనిలో ఎంఎస్‌సీ చేయాలనుకోవడం మంచి నిర్ణయం. ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ పూర్తిచేసినవారికి సీనియర్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌ బయోకెమిస్ట్‌, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ రీజనల్‌ మేనేజర్‌ వంటి ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి.ఈ కోర్సును దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, వెల్లోర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలు దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో అందిస్తున్నాయి.

బీఎస్‌సీ (బీజెడ్‌సీ) పూర్తయింది. ఎం.ఎ. (హిస్టరీ) చేయాలనుంది. నాకు అర్హత ఉంటుందా? అంటే కోర్సు పూర్తయ్యాక జేఎల్‌, డీఎల్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నేను అర్హుడినవుతానా? - వి.హరీష్‌, హైదరాబాద్‌

చరిత్ర, సంస్కృతి, నాగరికతలపై ఆసక్తి, సూక్ష్మాంశాలపై సైతం పరిశీలనాశక్తి ఉన్నవారికి ఎం.ఎ. హిస్టరీ చక్కని కోర్సు. ఈ పీజీ పూర్తిచేస్తే పరిశోధన రంగంలో రిసర్చ్‌ అసిస్టెంటుగా, పురాతన వస్తువులు సేకరించే ఆర్కివిస్టుగా ఉద్యోగావకాశాలుంటాయి. అలాగే ప్రభుత్వ మ్యూజియాల్లో, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన శాఖల్లో చేరవచ్చు. డిగ్రీలో 50 శాతం మార్కులతో ఏ బ్రాంచి పూర్తిచేసినవారికైనా ఎం.ఎ.హిస్టరీ చదివే అర్హత ఉన్నట్టే. కానీ సాధారణంగా బీఏ హిస్టరీ చదివినవారికి ప్రవేశాల్లో ప్రాముఖ్యం ఇస్తారు.
మాస్టర్స్‌ పూర్తయిన తర్వాత మీరు జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం జరిగే పరీక్షను రాయడానికి అర్హులవుతారు. డిగ్రీ లెక్చరర్‌ పోస్టుకు మాత్రం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వారు నిర్వహించే నెట్‌ లేదా రాష్ట్రస్థాయి సెట్‌లో అర్హత పొందాల్సివుంటుంది. ఇక ఇతర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల విషయానికొస్తే గ్రాడ్యుయేషన్‌ ఏదైనప్పటికీ 60 శాతం మార్కులతో పాసైనవారందరూ అర్హులే.

బీకాం (ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌) పూర్తిచేశాను. ఎంకామ్‌.కు నాకు అర్హత ఉంటుందా? నాకున్న ఇతర పీజీ అవకాశాలు, ఉద్యోగావకాశాలను తెలపండి. - పి. శ్రీనివాసులు

బీకామ్‌ ఏ స్పెషలైజేషన్‌తో చేసినా మీకు ఎంకామ్‌ చేసే అవకాశం ఉంటుంది. బీకామ్‌ పూర్తయిన తర్వాత ఎంకామ్‌ మాత్రమే కాకుండా ఎంబీఏ ఎంచుకుని మేనేజర్‌గా స్థిరపడవచ్చు. సి.ఎ. లేదా సి.ఎస్‌. ఎంచుకుని ఆడిటర్‌గా లేదా కంపెనీ సెక్రటరీగా పనిచేయవచ్చు. లేదనుకుంటే బీకామ్‌ తర్వాత ఎంసీఏ గానీ ఎంహెచ్‌ఆర్‌ఎం పూర్తిచేసి గానీ ఐటీ రంగంలో స్థిరపడే అవకాశం కూడా లేకపోలేదు.

ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. బ్యాచిలర్‌ ఆఫ్‌ లా చదవాలనుంది. దానికి సంబంధించిన ప్రవేశపరీక్షలు, అందించే కళాశాలల వివరాలను తెలపండి. - రమ్య మంజీర

పెరుగుతున్న చట్టనిబంధనలు, వ్యాపార లావాదేవీలను గమనిస్తే లా కోర్సుకు పూర్వ వైభవం వచ్చిందని చెప్పొచ్చు. ఆర్బిట్రేషన్‌ అండ్‌ కన్సిలిటేషన్‌ నిబంధనలు బాగా పటిష్టం కావడంతో లా ప్రాక్టీషనర్లకు చాలా డిమాండు ఏర్పడింది. చాలా కళాశాలలు ఇప్పుడు లా కోర్సులను అందిస్తున్నాయి. కేంద్ర/ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదవడం కుదరకపోతే మంచి గుర్తింపు ఉన్న కళాశాలలో చేయడం ఉత్తమం. లాకు దేశవ్యాప్తంగా అడ్మిషన్లకోసం జాతీయ స్థాయిలో క్లాట్‌ (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌)ను ఏటా మేలో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ లాసెట్‌ను మేలో నిర్వహిస్తారు.
జాతీయస్థాయిలో..
* నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు
* నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌
* నేషనల్‌ లా యూనివర్సిటీ, జోధ్‌పూర్‌
* గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, గాంధీనగర్‌
* నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ, భోపాల్‌
* రాజీవ్‌గాంధీ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, పటియాలా లాంటివి అత్యున్నత లా కోర్సులను అందించే కళాశాలలు.

మా చెల్లెలు ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేసింది. ఒక ఏడాది లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ కూడా తీసుకుంది. కొన్ని కారణాల రీత్యా ఒక ఏడాది ఖాళీగా ఉంది. ఇప్పుడు తన చదువు కొనసాగించాలనుకుంటోంది. తను ఏది చేస్తే మేలు? వేటిలో మంచి అవకాశాలుంటాయి? - వి. నరేష్‌

బైపీసీ నేపథ్యం నుంచి వచ్చినవారికి ఈ కాలంలో చాలా అవకాశాలున్నాయి. వీటన్నింటిపై అవగాహన లేక చాలామంది ఎంబీబీఎస్‌నే ప్రాధాన్యంగా పెట్టుకుంటారు. ఈ కాలంలో మెడిసిన్‌తోపాటు హోమియోపతి, ఆయుర్వేద వైద్యం మీద ప్రజలకు చాలా అవగాహన పెరిగింది. దీనివల్ల బీహెచ్‌ఎంఎస్‌ (బ్యాచిలర్స్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ), బీఏఎంఎస్‌ (బ్యాచిరల్స్‌ ఆఫ్‌ ఆయుర్వేద మెడిసిన్‌ అండ్‌ సర్జరీ) లాంటి కోర్సులకు ఇప్పుడు మంచి అవకాశాలు పెరిగాయి. మీ చెల్లెలికి వైద్యవిద్యలో ఆసక్తి లేకపోతే ఫోరెన్సిక్‌ సైన్స్‌, జెనెటిక్స్‌, బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్‌, ఫుడ్‌ టెక్నాలజీ, న్యూట్రిషన్‌, అగ్రికల్చర్‌, ఫారెస్ట్రీ, నర్సింగ్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. వీటికి ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సులకు ఏటా ఒకసారి అడ్మిషన్లు జరుగుతాయి. కొన్ని కోర్సులకు చాలా ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశపరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు దొరుకుతాయి. బైపీసీ చదివినవారికి సైన్స్‌ రంగాల్లో ఉన్నతవిద్య అవకాశాలున్నాయి. వీటితోపాటు బీఏ టూరిజం, బీబీఏ ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సులు వంటివీ అందుబాటులో ఉన్నాయి. కోర్సు ఎంపిక నిర్ణయం మాత్రం తన ఆసక్తిని దృష్టిలో పెట్టుకోండి.

బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాను. కానీ నాకు దీనిపై ఆసక్తి లేదు. బీఏ (సైకాలజీ) చదవాలనుంది. ఇప్పుడు నేను మళ్లీ దీనిలో చేరొచ్చా? ఆ అవకాశం ఉంటుందా? నాకు నిజాం కళాశాలలో చదవాలనుంది. ప్రవేశం ఎలా పొందాలి? - ఎండీ అలీ, కరీంనగర్‌

సైకాలజీ కోర్సుకు ఇప్పుడు చాలా అవకాశాలు పెరిగాయి. ప్రతి సంస్థలో ఒక సైకాలజిస్టు ఉండాలన్న ప్రతిపాదన కూడా అమలు కానుంది. ముందుగా మీ పెద్దవాళ్లతో సంప్రదించి, కళాశాల యాజమాన్యం నుంచి టీసీ తీసుకోండి. ఆపై బీఏ సైకాలజీలో చేరొచ్చు. నిజాం కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అంతర్భాగం. సైకాలజీ బోధిస్తున్న అతి పురాతన కళాశాలల్లో (1963 నుంచి) ఇదీ ఒకటి. మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రవేశం కల్పిస్తారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌, మే నెలల్లో అడ్మిషన్లు మొదలవుతాయి.

విజువల్‌ కమ్యూనికేషన్‌ గురించిన సమాచారాన్ని తెలియజేయగలరు. - శేష శ్రీనివాస్‌

కళ, సాంకేతికతల కలయిక... విజువల్‌ కమ్యూనికేషన్‌. సమాచారాన్ని చేరవేయటానికి ఉపయోగించే సృజనాత్మకతతో కూడిన ప్రక్రియ. ప్రేక్షకులకు ఒక సందేశాన్ని తెలియజేయడానికి ఒక దృశ్య రూపకర్త కమ్యూనికేషన్‌ మాధ్యమాలు, సాధనాల శ్రేణితో పనిచేస్తారు. ఏఏటీ కాలేజ్‌- కొచ్చి, అమిటీ యూనివర్సిటీ- నోయిడా, అమిర స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైనెసస్‌-కొచ్చి, నానా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ కోర్సులను అందిస్తున్నాయి.

డిప్లొమా (మెకానికల్‌) చేశాను. బీటెక్‌ కాకుండా డిప్లొమా వాళ్లకు ఉన్న ఇతర కోర్సులేవి? - వినయ్‌ కుమార్‌

మీరు డిప్లొమా రెండు సంవత్సరాలు క్లియర్‌ చేసుంటే అప్పుడు మంచి మార్కులతో కోర్సు పూర్తిచేయగలరేమో నిర్ధారించుకోండి. తరువాత బీఎస్‌సీ/ బీఏ/ బీకాం కోసం వెళ్లండి. కోర్సు మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. మీరు గ్రాడ్యుకేషన్‌ కోసం అడిగిన స్థాయిలో ఏ ప్రొఫెషనల్‌ కోర్సుల వివరాలూ లేవు. విషయాలు స్పష్టంగా లేనపుడు సంప్రదాయ కోర్సులను ఎంచుకోవడమే మంచిది. ప్రత్యేక కోర్సులు కాదు.

ఇంటర్మీడియట్‌ (ఎంబైపీసీ) రెండో సంవత్సరం దూరవిద్య ద్వారా చదువుతున్నాను. ఇంజినీరింగ్‌ చదవడానికి నేను అర్హుడినేనా? భవిష్యత్తులో పోటీపరీక్షలు రాయడానికి దూరవిద్య సర్టిఫికెట్‌ వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందా? - ఎస్‌. భార్గవ్‌

ఎంబైపీసీ చేసినవారు ఇంజినీరింగ్‌, వైద్య రంగాలు రెండింటిలోనూ రాణించే అవకాశం ఉంటుంది. మీరు దూరవిద్యలో చదివినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అన్ని పోటీపరీక్షలకు మీరూ అర్హులే. నీట్‌, జేఈఈ, ఎంసెట్‌ లాంటి అన్ని వైద్య విద్య, ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలకు మీకు అర్హత ఉంటుంది. దూరవిద్య సర్టిఫికెట్‌ వల్ల మీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. పోటీపరీక్షల్లో రాణించడానికి మాత్రం కోచింగ్‌ తీసుకుంటే మంచిది.

మా బాబు 9 వరకు ఏపీలో చదివాడు. డిప్లొమా తెలంగాణలో నాన్‌లోకల్‌ కేటగిరీలో వచ్చింది. ఇప్పుడు తుది సంవత్సరం చదువుతున్నాడు. మేం ఇప్పుడు గుంటూరులో స్థిరపడ్డాం. బాబును కూడా ఇక్కడే చదివించాలనుకుంటున్నాం. బీటెక్‌ (లేటరల్‌ ఎంట్రీ) ఏపీలో చేరిస్తే లోకల్‌ అవుతాడా? ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వస్తుందా? - పి. చంద్రిక శేఖర్‌, గుంటూరు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యార్థి అయినా ఒక ప్రాంతంలో 7 సంవత్సరాల్లోపు చదివితే అతడిని లోకల్‌ అభ్యర్థిగానే పరిగణిస్తారు. మీ అబ్బాయి 9వ తరగతి వరకూ ఏపీలోనే చదివినందువల్ల తనని లోకల్‌ అభ్యర్థిగానే పరిగణిస్తారు. ఒకవేళ మీరు దిగువ ఆదాయ వర్గానికి చెందినవారైతే అడ్మిషన్‌ సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే మీకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వస్తుంది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కి తండ్రి ఆదాయమే కొలమానం.

ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. డిజైనర్‌ ఇంజినీర్‌ కావాలనుంది. చేరే విధానం, అందించే కళాశాలల వివరాలను అందించండి. - నీరజ్‌ రాజ్‌

ఆర్కిటెక్ట్‌/ డిజైన్‌ ఇంజినీర్‌ కావాలనుకునేవారు 10+2 (ఎంపీసీ) అభ్యసించి ఉండాలి. నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఫర్‌ ఆర్కిటెక్చర్‌ (ఎన్‌ఏటీఏ) వారు నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా బి.ఆర్క్‌లో ప్రవేశాన్ని పొందొచ్చు. ఇది అయిదేళ్ల వ్యవధి గల కోర్సు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, ఐఐటీ-రూర్కీ, ఎన్‌ఐటీ- తిరుచ్చి వంటి ప్రసిద్ధ విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి.

ఫార్మా-డి పూర్తిచేశాను. అదనంగా ఏమేం కోర్సులు చేస్తే మేలు? - గుగులోతు రవీంద్ర నాయక్‌

నూతన, సమకాలీన కోర్సు కావడంతో ఫార్మా-డి పూర్తిచేసినవారికి మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఔషధ, బయోటెక్నాలజీ సంస్థల్లో మెడికో మార్కెటింగ్‌, ఔషధ నియంత్రణ పట్టాల డాక్యుమెంటేషన్‌, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌, డ్రగ్‌ ఎక్స్‌పర్ట్‌, కమ్యూనిటీ ప్రాక్టిషనర్‌ వంటి వివిధ ఉద్యోగావకాశాలను పొందొచ్చు. మేనేజ్‌మెంట్‌ రంగంలో అడుగుపెట్టాలనుకుంటే నైపర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వారు అందించే ఎంబీఏ (హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌)లో చేరొచ్చు.
హెల్త్‌ అనలిటిక్స్‌ రంగంలో మంచి అవకాశాలున్నాయి. ఎక్కువ వేతనంతో ఉద్యోగాలను పొందే వీలుంటుంది. ఇవేకాకుండా ఏఏపీసీ వారు అందించే సీఆర్‌సీ, సీపీసీ (సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ కోడర్‌), సీఐసీ, మెడికల్‌ డాక్యుమెంటేషన్‌, ఫార్మకో విజిలెన్స్‌, ఎస్‌ఓపీ ప్రిపరేషన్‌, పేషెంట్‌ సేఫ్టీ వంటి తక్కువ వ్యవధి గల కోర్సులను చేసినా మంచి ఉద్యోగాలను పొందొచ్చు.

ఫారెస్ట్రీలో ఉండే కోర్సులు, వాటిని అందించే సంస్థల వివరాలను తెలపండి. - కొమరపు జయరాం

ఫారెస్ట్రీలో కోర్సు చేయాలనుకునేవారు 10+2లో బైపీసీని పూర్తిచేసి ఉండాలి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌) వారు నిర్వహించే పరీక్ష ద్వారా కొన్ని అగ్రికల్చర్‌ యూనివర్సిటీలు అందించే ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాన్ని పొందొచ్చు. పోస్టుగ్రాడ్యుయేట్‌ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లు ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫారెస్ట్‌ ఎకనామిక్స్‌, కమర్షియల్‌ ఫారెస్ట్రీ, వుడ్‌ సైన్స్‌, అగ్రోఫారెస్ట్రీ, వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేషన్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌- డెహ్రాడూన్‌ మనదేశంలో ఫారెస్ట్రీ విద్యకు ప్రతిష్ఠాత్మక సంస్థ. ఇంటిగ్రల్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ- మహారాష్ట్ర గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను అందిస్తోంది.

బీఎస్‌సీ (ఎంపీసీఎస్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. తరువాత ఎంఎస్‌సీ (మేథ్స్‌/ ఫిజిక్స్‌), ఎంబీఏల్లో ఏది చేస్తే మేలు? వేటిలో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉన్నాయి? - భవాని

పీజీ విద్యను ఎంచుకునే ముందు మీ అభిరుచి, ఏ ఉద్యోగావకాశాలను పొందాలనుకుంటున్నారో బేరీజు వేసుకోండి. కోర్‌ ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటే గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక ఎంఎస్‌సీ (మేథ్స్‌/ ఫిజిక్స్‌/ స్టాటిస్టిక్స్‌)ను ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా ఎంఎస్‌సీ- ఎకనామెట్రిక్స్‌ అండ్‌ మేథమేటిక్స్‌ను కూడా పరిశీలించొచ్చు. వీటిలోనూ మంచి ఉద్యోగావకాశాలున్నాయి. నలుగురూ చేరే కోర్సులు కాకుండా స్పెషలైజ్‌డ్‌ ఏరియాల్లో పీజీ చేస్తే మంచి కెరియర్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఇక ఎంబీఏ విషయానికొస్తే.. వ్యూహరచన, వ్యాపారం పట్ల ఆసక్తి, చురుకుదనం, కమ్యూనికేషన్‌, నెట్‌వర్కింగ్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలు ఉంటే ఎంచుకోవచ్చు. కానీ ఈ కోర్సును క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించి, ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో అభ్యసిస్తే మంచిది. ఇది మీ కెరియర్‌కు బాసటగా నిలుస్తుంది. కాబట్టి, ఎంబీఏ/ ఎంఎస్‌సీ రెండింటికీ మంచి ఉపాధి అవకాశాలున్నాయి. రెండింటిలో ఒకటి తక్కువ, ఎక్కువ అనే భేదం లేదు. ఆసక్తి, అభిరుచిని బట్టి ఎంచుకోవాలి.

మా అమ్మాయిని దిల్లీలో బీఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో చేర్చాం. కానీ అది అమ్మాయిలకు అంత మంచి రంగం కాదని అంటున్నారు. నిజమేనా? కాదంటే.. కోర్సు చదివిన తరువాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తనకుండే ఉద్యోగావకాశాలేంటి? ఉన్నతవిద్య ఏం చదివితే తనకు మంచి అవకాశాలుంటాయి? - సుధాకర్‌

నేటితరం అమ్మాయిలు ప్రతి రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ రంగంలో అమ్మాయిలు విజయం సాధించలేరు అని ఏ ఒక్కదాన్నీ చెప్పలేం. మీరు అధైర్య పడకుండా మీ అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి. నేర పరిశోధనలో విజ్ఞాన సూత్రాలను వర్తింపజేసి, సాధారణ దృష్టిని తప్పించుకునే ఆధారాలను కనుగొనే శాస్త్రమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. ప్రభుత్వ రంగంలో పోలీసు శాఖ, ఎన్‌ఐఏ, సీఐడీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ల్లో ఉద్యోగావకాశాలున్నాయి. ప్రైవేటు రంగంలో డిటెక్టివ్‌ సంస్థల్లో, నేర పరిశోధన, రిసెర్చ్‌ సంస్థల్లో ఉద్యోగాలున్నాయి. పై చదువులకు విదేశాల్లో ఎంఎస్‌ (ఫోరెన్సిక్‌ సైన్స్‌) చదివి, పీహెచ్‌డీ చేస్తే పరిశోధనలో, బోధనావకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి, ఇతరుల మాటల గురించి దిగులు పడకుండా మీ అమ్మాయిని భవిష్యత్తు దిశగా ప్రోత్సహించండి.

ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) మొదటి సంవత్సరం తెలుగు మీడియంలో చదువుతున్నాను. ఐఐటీ జేఈఈ రాయాలంటే ఇంగ్లిష్‌ మీడియంలో చదివుండటం తప్పనిసరా? ఒకవేళ అయితే రెండో ఏడాది ఇంగ్లిష్‌ మీడియంలో చేస్తే నాకు అవకాశం ఉంటుందా? - ఎం. రోహిత్‌ పట్నాయక్‌

మీరు ఊహిస్తున్నట్లుగా ఏం లేదు. నేను తెలుగు మీడియం, ఇంగ్లిష్‌ మీడియంలో చదవలేదు కాబట్టి జేఈఈ రాయలేనేమో అన్న భయాన్ని వీడండి. ఎందరో విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు మాధ్యమంలో +2 చదివి, ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు సాధించారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ, పరీక్ష ఉద్దేశం విద్యార్థికి సబ్జెక్టుపై ఎంత పట్టు ఉందో పరీక్షించడమే! అయితే పరీక్షకు సన్నద్ధమయ్యేటపుడు మాత్రం ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా తెలుగు, ఇంగ్లిష్‌ రెండు భాషల పుస్తకాలనూ పక్కన పెట్టుకోండి. దీనికన్నా రెండో ఏడాది ఆంగ్ల మాధ్యమంలో చదవడం మేలని మీరు భావించినా ఆ వీలు లేదు. సబ్జెక్టుపై పట్టు సాధిస్తేనే ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానంతో విజయాన్ని సాధించవచ్చు. కాబట్టి, ఆ దిశగా దృష్టిసారించండి.

బీఎస్‌సీ (కంప్యూటర్స్‌) చదువుతున్నాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి ఉంది. అది చదవడానికి నేను అర్హురాలినేనా? ఒకవేళ అయితే కోర్సు వివరాలు, అందించే సంస్థల గురించి తెలపండి. - దివ్య

ఏదేని డిగ్రీ పూర్తి చేసినవారు పీజీ స్థాయిలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును ఎంచుకోవచ్చు. టూరిజం, సేవా పరిశ్రమలకు ఆదరణ పెరగడంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులకు అవకాశాలు పెరిగాయి. మీరు ఎంబీఏ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌, ఎంఎస్‌సీ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ వంటి పీజీ స్థాయి కోర్సులను ఎంచుకోవచ్చు.
లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ; క్రైస్ట్‌ యూనివర్సిటీ, బెంగళూరు; మణిపాల్‌ యూనివర్సిటీ; వివిధ రాష్ట్రాల్లోగల స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల ద్వారా డిప్లొమా, బ్యాచిలర్స్‌, పీజీ స్థాయుల్లో కోర్సులను ఎంచుకోవచ్చు. చిన్న సంస్థలు/ కాలేజీలను అడ్వర్టయిజ్‌మెంట్ల కారణంగానో, దగ్గరగా ఉందనో ఎంచుకోవద్దు. పేరులేని, ఫ్యాకల్టీ సరిగాలేని వాటిల్లో చేరితే భవిష్యత్తు ఉండదు. కాబట్టి సంస్థ ప్రతిష్ఠ, ప్లేస్‌మెంట్‌, ఫ్యాకల్టీ పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోండి.

పదో తరగతి చదువుతున్నాను. ఆస్ట్రో ఫిజిక్స్‌ చదవాలనుంది. ఇంటర్మీడియట్‌ నుంచి నేను కెరియర్‌ను ఎలా మలచుకోవాలి? అవకాశాలెలా ఉంటాయి? - కౌషిక్‌

ఆస్ట్రానమీ/ ఆస్ట్రో ఫిజిక్స్‌ చేయాలనుకునేవారు ఇంటర్‌ స్థాయిలో ఎంపీసీ కోర్సును, డిగ్రీలో ఫిజిక్స్‌ లేదా ఆస్ట్రోఫిజిక్స్‌ కోర్సును చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎంఎస్‌సీ ఫిజిక్స్‌, ఆస్ట్రానమీ చేసి గేట్‌/ నెట్‌/ జెస్ట్‌ పరీక్షల ద్వారా పీహెచ్‌డీలో ప్రవేశాన్ని పొందొచ్చు. ఆస్ట్రానమీ చదవడం ద్వారా ఆస్ట్రానమర్‌, స్పేస్‌ ఫిజిసిస్ట్‌ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి, ముందుగా మీరు ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌పై మక్కువ పెంచుకోవాలి.
ఎంటెక్‌- ఆస్ట్రో ఫిజిక్స్‌ కోర్సును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌, బెంగళూరు; టీఐఎఫ్‌ఆర్‌, పుణె; జేఎన్‌టీయూ, హైదరాబాద్‌; ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ వారు బీఎస్‌సీ లేదా బీటెక్‌ కోర్సులను అందిస్తున్నారు. ఈ సంస్థలు తమ సొంత ప్రవేశపరీక్షలు/ ఎంసెట్‌/ జేఈఈ మార్కుల ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

డ్రాయింగ్‌, పెయింటింగ్‌ మొదలైనవాటిని దూరవిద్య ద్వారా పూర్తిచేసే అవకాశముందా? అందించే సంస్థలేవి?- పూర్ణ చందు

డ్రాయింగ్‌, పెయింటింగ్‌లపై ఆసక్తి ఉన్నవారు రెగ్యులర్‌ విధానంలో బీఎఫ్‌ఏ (బ్యాచిలర్స్‌ ఇన్‌ ఫైన్‌ఆర్ట్స్‌) కోర్సును ఎంచుకోవచ్చు. ఈ రంగంలో రాణించాలంటే ఆసక్తి, పట్టుదల, సృజనాత్మకత వంటి నైపుణ్యాలు అవసరం. పార్ట్‌టైం హాబీలా కూడా వీటిని మలచుకోవచ్చు. అందుకు వివిధ సంస్థలు నిర్వహించే వర్క్‌షాప్‌లకు హాజరవడం ద్వారా మీ అభిరుచిని పెంచుకోవచ్చు.
వివిధ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, కోర్సుల ద్వారా కూడా సర్టిఫికేషన్‌ సాధించవచ్చు. ఉదాహరణకు- క్రాఫ్ట్‌ప్లేస్‌, యుడెమి, ఇంటర్నేషనల్‌ ఫైన్‌ఆర్ట్స్‌ అకాడమీ (ఐఎఫ్‌ఏఏ) వారు అందిస్తున్న వివిధ కోర్సులను ఎంచుకోవచ్చు. పూర్తిగా దూరవిద్య ద్వారా డిగ్రీ అందించే కోర్సులు మాత్రం అందుబాటులో లేవు. కాబట్టి, మీ అభిరుచిని బట్టి కోర్సును ఎంచుకోండి.

దూరవిద్యలో డిగ్రీ (బీఏ) పూర్తిచేశాను. అడిషనల్‌ మెథడాలజీ ఇన్‌ బీఎడ్‌ను దూరవిద్య ద్వారా చేయాలనుకుంటున్నాను. కోర్సు వివరాలు, ఉద్యోగావకాశాలను తెలపండి.- వి. ప్రసన్న

అడిషనల్‌ మెథడాలజీలో బీఎడ్‌ చదవాలనుకునేవారు సాధారణ బీఎడ్‌ పూర్తిచేసి, రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ముందుగా మీరు బీఎడ్‌ (బ్యాచిలర్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌) చేసి, ఆపై పని అనుభవాన్ని గడించండి. ఆ తరువాత దూరవిద్య ద్వారా బీఎడ్‌- అడిషనల్‌ మెథడాలజీని చేయండి. కాకతీయ విశ్వవిద్యాలయం, ఎస్‌వీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇగ్నో దీనిని అందిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

అగ్రికల్చర్‌ డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నాను. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మీద ఆసక్తి ఉంది. నాకు అర్హత ఉందా? కోర్సులు, అందించే కళాశాలల వివరాలను అందించండి. - శ్రీనివాస్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ) మానవుడి జీవనశైలిని సరళతరం చేయడంలో పెనుమార్పులను సృష్టిస్తున్నాయి. గతంలో కృత్రిమ మేధ కంప్యూటర్లకు మాత్రమే పరిమితమైతే ప్రస్తుతం మన రోజువారీ జీవనంలో వివిధ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ డివైజెస్‌ రూపంలో భాగమైపోయింది. ఉదా: అమేజాన్‌ ఎకో, స్మార్ట్‌ కిచెన్‌, హోమ్‌, చోదక రహిత వాహనాలు, రోబోటిక్స్‌. ఈ కోర్సు ఇతర కోర్సులైన కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌, రోబోటిక్స్‌, మేనేజ్‌మెంట్‌ వంటి వాటితో అనుసంధానమై ఉంటుంది. వివిధ ట్రిపుల్‌ ఐటీలు, గ్రేట్‌లేక్స్‌, అప్‌గ్రేడ్‌, ఉడ్‌మీ, కోర్స్‌ ఎరా సంస్థలు సర్టిఫికెట్‌, పీజీ డిప్లొమాలు అందిస్తున్నాయి. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌పై అభిరుచి, అనలిటికల్‌ థింకింగ్‌ ఉన్న ఎవరైనా ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. వివిధ ఐటీ, అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలు భారీ వేతనాలతో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ గురించిన సమాచారాన్ని ఇవ్వండి. కోర్సులు, అందించే సంస్థల వివరాలను తెలపండి. - జావాది వెంకటేష్‌

పరిశ్రమల్లో వివిధ పరికరాల ద్వారా వివిధ పరిమాణాలను కొలవడం, పరికరాల నియంత్రణ, వాటి నిర్వహణ పరిపాటి. ఈ పరికరాల డిజైనింగ్‌, తయారీ, వాడకానికి సంబంధించిన శాస్త్రమే ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌. 10+2 మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లతో పూర్తిచేస్తే బీటెక్‌లో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ను ఎంచుకోవచ్చు. లేదా పదోతరగతి అర్హతతో డిప్లొమా ఇన్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను కూడా అభ్యసించవచ్చు. ఎంసెట్‌ ఆధారంగా బీటెక్‌లో ప్రవేశాన్ని రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో జేఈఈ పరీక్ష ఉత్తీర్ణతతో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాన్ని పొందొచ్చు. మేక్‌ ఇన్‌ ఇండియా ప్రోత్సాహంతో ఈ రంగంలో అవకాశాలు చాలానే ఉన్నాయి.

బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఈ రంగంలో ఉండే అవకాశాల గురించి తెలపండి. - శ్రీ వశిష్ట

సాధారణంగా బయోమెడికల్‌ ఇంజినీర్స్‌ బయోమెడికల్‌ పరికరాలు, వాటి డిజైనింగ్‌, కృత్రిమ అవయవ డెవలప్‌మెంట్‌, టెక్నికల్‌ రిపోర్ట్స్‌ రాయడం, రిపోర్ట్‌ చేయడం, మెడికల్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ వంటి రంగాల్లో తమదైన ముద్ర వేస్తారు. థెరపీ డెవలప్‌మెంట్‌, నానోమెడిసిన్‌, ప్రాస్థటిక్స్‌, సింథటిక్‌ బయాలజీ, మెడికల్‌ రొబోటిక్స్‌, ఇంప్లాంట్స్‌, బయోనిక్స్‌, క్లినికల్‌ ట్రయల్స్‌, బయోచిప్స్‌, వేరబుల్‌ టెక్నాలజీ, హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్‌, కంప్యుటేషనల్‌ మెడిసిన్‌ వంటి విభాగాల్లో వీరికి మంచి ఉద్యోగావకాశాలున్నాయి.

ఫార్మా-డి తుది సంవత్సరం చదువుతున్నాను. విదేశాల్లో మాకుండే ఉద్యోగావకాశాలేంటి? - రవీంద్ర నాయక్‌

నూతన, సమకాలీన కోర్సు కావడంతో ఈ కోర్సు చేసినవారికి దేశవిదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలున్నాయి. మనదేశంతో పోలిస్తే విదేశాల్లో డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చట్టాలు కఠినంగా ఉండటంతో ఈ కోర్సు చేసినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువ.
ఔషధ, బయోటెక్నాలజీ సంస్థల్లో మెడికో మార్కెటింగ్‌, ఫార్మకో విజిలెన్స్‌, ఔషధ నియంత్రణ పట్టాల డెవలప్‌మెంట్‌, క్లినికల్‌, డేటా మేనేజ్‌మెంట్‌, డ్రగ్‌ ఎక్స్‌పర్ట్‌, కమ్యూనిటీ ప్రాక్టీషనర్‌ వంటి వివిధ ఉద్యోగావకాశాలను పొందొచ్చు. ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి.

డిగ్రీ పూర్తిచేశాను. రా ఏజెన్సీలో పనిచేయాలనుంది. వెళ్లే మార్గం ఏమిటి? - జి.ఎస్‌. నాయక్‌

రా (రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌)లో చేరాలనుకునేవారికి నిశిత పరిశీలన, వివిధ కోణాల్లో ప్రశ్నించే, ఆలోచించే ధోరణి, చురుకుదనం, పట్టుదల, ధైర్యసాహసాలతోపాటు ఆప్టిట్యూడ్‌ పరిజ్ఞానం ఉండాలి. సివిల్‌ సర్వీసెస్‌ మాదిరిగానే రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ సర్వీస్‌కు కేంద్రప్రభుత్వం గ్రూప్‌-ఎ సివిల్‌ సర్వీస్‌ పరీక్ష నిర్వహిస్తుంది.
సాధారణంగా ఈ ఇంటెలిజెన్స్‌ విభాగంలోకి ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ శిక్షణలో ఉన్న ఆఫీసర్లకు రా ఏజెన్సీలో చేరే అవకాశం దొరుకుతుంది. కొన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేశాక తిరిగి తమ పేరెంట్‌ సర్వీస్‌లో చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రక్షణ, పోలీస్‌ విభాగంలో అత్యుత్తమ సర్వీస్‌ రికార్డు ఉన్నవారిని ‘రా’ ఎంచుకుంటుంది.

అగ్రికల్చర్‌ డిప్లొమా చేసి, ఇంటర్‌ దూరవిద్య ద్వారా పూర్తిచేశాను. ప్రస్తుతం బీఎస్‌సీ (బీజెడ్‌సీ) చదువుతున్నాను. ఇంటర్‌లో కెమిస్ట్రీ లేకపోవడం వల్ల ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంది. భవిష్యత్తులో ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ చదవాలనుంది. దీనికి కెమిస్ట్రీ తప్పనిసరా? - శ్వేత, వైజాగ్‌

ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ చేయాలనుకునేవారు డిగ్రీ స్థాయిలో బయాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ సబ్జెక్టులు చదివుండాలి. ముందుగా మీరు కెమిస్ట్రీ భయాన్ని వీడండి. ఎందుకంటే రానున్న రెండు సంవత్సరాలు ఈ సబ్జెక్టుల్లో మీ ప్రావీణ్యం ఎలాగూ పెరుగుతుంది.
ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌లో అగ్రానమీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌, ఫారెస్ట్రీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, హార్టీకల్చర్‌ వంటి స్పెషలైజేషన్లలో కెమిస్ట్రీ పాత్ర కొంచెం తక్కువే. కాబట్టి మీరు చదువుపై దృష్టిపెట్టండి. వీలైతే మంచి ఉపాధ్యాయుడితో కెమిస్ట్రీ ప్రైవేటు ట్యూషన్‌ చెప్పించుకోండి.

బీఎస్‌సీ మేథ్స్‌ పూర్తిచేశాను. ల్యాండ్‌ సర్వే డిప్లొమా కోర్సు చేయాలనుంది. అందించే సంస్థల వివరాలు తెలపండి. ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి. - రెంటమ్‌ రాజశేఖర్‌

ల్యాండ్‌ సర్వే కోర్సులు చేయాలనుకునేవారు బీఎస్‌సీ మేథమేటిక్స్‌ లేదా బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్వేయింగ్‌ అండ్‌ మ్యాపింగ్‌ వారు అందించే సర్వేయింగ్‌ సూపర్‌వైజర్‌ కోర్సును చేయొచ్చు. బీటెక్‌ పూర్తిచేసినవారు సర్వేయింగ్‌ ఇంజినీరింగ్‌ కోర్సును చేయొచ్చు. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారికి సర్వేయింగ్‌ టెక్నీషియన్‌, కార్టోగ్రఫీ టెక్నీషియన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
జీఐఎస్‌, జీపీఎస్‌, డిజిటల్‌ ఫొటో గ్రామెటరీ వినియోగం పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో శిక్షణ పొందిన మానవవనరుల అవసరం బాగా పెరిగింది. అడ్మిషన్ల కోసం ‌www.iism.nic.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

డిగ్రీ (బీకాం) 2012లో పూర్తి అయ్యింది. దుబాయ్‌లో శాప్‌ ఎంఎం సాఫ్ట్‌వేర్‌తో వేర్‌హౌజ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాను. భారత్‌ రావాలనుకుంటున్నాను. మంచి ఉద్యోగం సాధించాలంటే ఇక్కడ ఏ కోర్సులు నేర్చుకోవాలి? - ఖాదిర్‌ మహమ్మద్‌

బహుళ జాతీయ సంస్థల్లో శాప్‌-ఫికో మాడ్యూల్‌లో అనుభవం ఉన్నవారికి అవకాశాలు మనదేశంలో ఎక్కువగానే ఉన్నాయి. ఎలాగూ మీకీ రంగంలో అనుభవం ఉంది. కాబట్టి, స్వల్ప ప్రయత్నంతోనే శాప్‌-ఎండ్యూసర్‌గా ఉద్యోగాన్ని సాధించవచ్చు. అదే మీరు శాప్‌-ఫి (ఫైనాన్స్‌ మాడ్యూల్‌), శాప్‌-కో (కంట్రోల్‌ మాడ్యూల్‌)ల్లో అభిరుచిని బట్టి ఫి/ కోల్లో కన్సల్టెంట్‌గా నైపుణ్యం పొందితే మంచి వేతనంతో ఉద్యోగాన్ని సాధించవచ్చు. శాప్‌ కంట్రోలింగ్‌ మాడ్యూల్‌ కన్సల్టెంట్లకు మంచి గిరాకీ ఉంది. వివిధ కోచింగ్‌ సంస్థలు, శాప్‌ ఆథరైజ్‌డ్‌ సంస్థలు శాప్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుతోపాటు ఎక్సెల్‌, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌ కోర్సులను నేర్చుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి.

పీహెచ్‌డీ రెగ్యులర్‌ విధానంలో చేస్తున్నాను. తెలుగులో ఎంఏ చేయాలనుంది. పీహెచ్‌డీతోపాటు దూరవిద్య ద్వారా ఎంఏ ఒకేసారి చేయొచ్చా? - ఉప్పల శ్రీను, హైదరాబాద్‌

పీహెచ్‌డీ ఏ సబ్జెక్టులో చేస్తున్నారో చెప్పలేదు. సాధారణంగా యూజీసీ నిబంధనల ప్రకారం ఒక రెగ్యులర్‌ కోర్సుతోపాటు దూరవిద్యలో డిప్లొమా లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా చేయడానికి సౌలభ్యం ఉంది. మీరు చేయాలనుకున్న ఎంఏ తెలుగు కోర్సు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమాతో తత్సమాన కోర్సుగా భావించి మీరు ఎంఏ తెలుగు కోర్సు చేయొచ్చు.

ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. తరువాత బీఎస్‌సీ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్‌ చేయాలనుంది. అందించే కళాశాలలేవి? అర్హత వివరాలను తెలపండి. - రఘు

ఆస్ట్రానమీ/ ఆస్ట్రోఫిజిక్స్‌ చేయాలనుకునేవారు డిగ్రీలో ఫిజిక్స్‌ సబ్జెక్టుగా ఉన్న కోర్సును లేదా ఆస్ట్రోఫిజిక్స్‌ కోర్సును చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎంఎస్‌సీ ఫిజిక్స్‌, అప్లయిడ్‌ ఫిజిక్స్‌, ఆస్ట్రానమీ చేసి గేట్‌/ నెట్‌/ జెస్ట్‌ పరీక్షల ద్వారా పీహెచ్‌డీలో ప్రవేశాన్ని పొంది ఆస్ట్రానమీ చేయడం ద్వారా ఆస్ట్రానమర్‌, స్పేస్‌ ఫిజిసిస్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు ఫిజిక్స్‌, మేథమేటిక్స్‌పై మక్కువ పెంచుకోవాలి.
ఎంటెక్‌లో ఆస్ట్రోఫిజిక్స్‌ కోర్సును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌- బెంగళూరు, బీఎస్‌సీ లేదా బీఎస్‌సీ కోర్సును టీఐఎఫ్‌ఆర్‌- పుణె, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్‌ వారు అందిస్తున్నారు. తమ సొంత పరీక్షలు/ ఎంసెట్‌, జేఈఈ మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నారు. ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు డిగ్రీ స్థాయిలో ఆస్ట్రోఫిజిక్స్‌, ఆస్ట్రానమీ కోర్సులు ఎంచుకోవచ్చు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులను అందించే సంస్థలేవి? ఇవి చదివినవారికి వేతనాలు ఎలా ఉంటాయి? - వెంకటేష్‌ రామగిరి, ఖమ్మం

రానున్న కాలంలో ఐటీ, కృత్రిమ మేధ మానవ జీవనశైళిని సరళతరం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో కృత్రిమ మేధ కంప్యూటర్లకు మాత్రమే పరిమితమైతే ప్రస్తుతం రోజువారీ జీవితంలో వివిధ ఎలక్ట్రానిక్‌, కమ్యూనికేషన్స్‌ డివైజెస్‌ రూపంలో భాగం అయిపోతుంది. ఉదాహరణకు- అమేజాన్‌ ఇకో, స్మార్ట్‌ కిచెన్‌, హోమ్‌, గూగుల్‌ హోమ్‌, డ్రైవర్లు లేని కార్లు, రోబోటిక్‌ ఆపరేషన్స్‌ మొదలైనవి.
ఈ కోర్సు ఇతర కోర్సులైన కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డీప్‌ లర్నింగ్‌, రోబోటిక్స్‌, మేనేజ్‌మెంట్‌, బిహేవియర్‌ వంటి ఇతర కోర్సులతో అనుసంధానమై ఉంటుంది. పలు ట్రిపుల్‌ ఐటీలు, ఐఐటీలు, ఐఏఎంలు, గ్రేట్‌లేక్స్‌, అప్‌గ్రాడ్‌ వంటి సంస్థలు పీజీ డిప్లొమా కోర్సును అందిస్తున్నాయి. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఈ కోర్సు చేసినవారికి భారీ వేతనంతో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.

ఆర్కియాలజీపై ఆసక్తి ఉంది. డిగ్రీ చదువుతున్నాను. నాకు అర్హత ఉందా? ఉంటే డిగ్రీ తరువాత ఏ కోర్సును ఎంచుకోవాలి? అందించే కళాశాలలేవి? - రాములు గంగుల

సంస్కృతి, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు. ఎంఏ హిస్టరీ, ఆర్కియాలజీలో పీజీని చేయడం ద్వారా ఈ రంగంలో స్థిరపడవచ్చు. ఈ కోర్సులో ఆర్కియాలజీతోపాటు ఫొటో హిస్టరీ, ఆర్ట్‌, మ్యూజియాలజీ, ఆర్కియోమెట్రీ వంటి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. గొప్ప పరిశీలన, గ్రహణ శక్తి, విశ్లేషణాత్మకంగా, తార్కికంగా ఆలోచించే నైపుణ్యాలను విద్యార్థులు ఇనుమడింపచేసుకోవాలి. ఈ కోర్సును యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మను స్క్రిప్టాలజీ-తమిళ్‌ యూనివర్సిటీ, సెంటర్‌ ఫర్‌ మ్యూజియాలజీ అండ్‌ కన్జర్వేషన్‌- యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌-దిల్లీ వారు అందిస్తున్నారు.

డిగ్రీ చదువుతున్నాను. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేయాలనుకుంటున్నాను. కోర్సు వివరాలు, అర్హత, అందించే సంస్థల వివరాలను అందించండి. - దివ్య

టూరిజం, సేవాపరిశ్రమలకు ఆదరణ పెరగడంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఏదేని డిగ్రీ చదివినవారు ఎంబీఏ-హోటల్‌ మేనేజ్‌మెంట్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలజీ అడ్మినిస్ట్రేషన్‌, ఎంఎస్‌సీ హాస్పిటాలజీ అడ్మినిస్ట్రేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ వంటి పీజీ స్థాయి కోర్సులను ఎంచుకోవచ్చు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, వివిధ రాష్ట్రాల్లోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, క్రైస్ట్‌ యూనివర్సిటీ, ద్వారా డిప్లొమా, బ్యాచిలర్స్‌, పీజీ స్థాయిలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అభ్యసించవచ్చు.

ఇంటర్‌ (ఎంపీసీ) చదువుతున్నాను. ఆస్ట్రానమర్‌ కావాలనుంది. వివరాలను అందించండి - శివ గిరీషా

ఆస్ట్రానమర్‌ కావాలనుకునే అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్‌ కోర్సును లేదా ఆస్ట్రో ఫిజిక్స్‌ కోర్సును చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఎం.ఎస్‌.సి. ఫిజిక్స్‌, అప్లయిడ్‌ ఫిజిక్స్‌, ఆస్ట్రానమీ చేసి GATE/NET/JEST పరీక్షల ద్వారా Ph.Dలో ప్రవేశాన్ని పొందాలి. ఇలా ఆస్ట్రానమీపై అధ్యయనం చేయడం ద్వారా ఆస్ట్రానమర్‌, స్ఫేస్‌ ఫిజిసిస్ట్‌ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి మీరు ఫిజిక్స్‌, మ్యాథమేటిక్స్‌పై మక్కువ పెంచుకోవాలి. M.Tech ఆస్ట్రో ఫిజిక్స్‌ కోర్సును ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ - బెంగుళూరు, TIFR పుణె, JNTU - హైదరాబాద్‌, ఉస్మానియా యూనివర్సిటీ - హైదరాబాద్‌ వారు బీఎస్సీ/ బీటెక్‌ కోర్సును అందిస్తున్నారు. తమ సొంత ప్రవేశపరీక్షలు / ఎంసెట్‌, జేఈఈ మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

బీటెక్‌ (మైనింగ్‌) పూర్తిచేశాను. ఏయే సంస్థలు మాకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి? - హిమవంశీ

బీటెక్‌ (మైనింగ్‌) పూర్తి చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలున్నాయి. చమురు, గ్యాస్‌, మినరల్‌ డెవలప్‌మెంట్‌, క్వారీలు, డేటా మోడలింగ్‌ రంగాల్లో మైనింగ్‌ ఇంజినీర్‌, బ్లాస్టింగ్‌ స్పెషలిస్ట్‌, ప్లాంట్‌ ఇంజినీర్‌, డేటా ఇంజినీర్‌, క్వారీ ఇంజినీర్‌, మైనింగ్‌ సూపర్‌వైజర్‌ వంటి ఉద్యోగావకాశాలుంటాయి. విద్యుత్‌ రంగంతోపాటు ఫారెస్ట్రీలోనూ ఉద్యోగావకాశాలున్నాయి. గేట్‌ ద్వారా ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలను కల్పిస్తున్నాయి.

బీటెక్‌ (ఈసీఈ) చదువుతున్నాను. సీబీఐ ఆఫీసర్‌ అవ్వాలంటే బీటెక్‌ తరువాత ఏం ఎంచుకోవాలి? - పవన్‌

సీబీఐ ఆఫీసర్‌ కావాలనుకునేవారు ఏదైనా డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ వృత్తిలో రాణించాలంటే నిశిత పరిశోధన, ఇంటెలిజెన్స్‌, అనలిటికల్‌ మైండ్‌, మెంటల్‌ అలర్ట్‌నెస్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌, ఏకాగ్రత వంటి వ్యక్తిగత లక్షణాలను అలవరచుకోవాలి. ఎస్‌ఎస్‌సీ (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌) వారు నిర్వహించే పరీక్ష రాయాల్సివుంటుంది. రీజనింగ్‌ అండ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ సాధన ద్వారా పరీక్షలో నెగ్గి, ఆపై ఉద్యోగాన్ని పొందొచ్చు.

* పదోతరగతి చదువుతున్నాను. సైబర్‌ క్రైం పోలీస్‌ కావాలనుంది. ఇంటర్‌ నుంచి ఏ కోర్సులు ఎంచుకోవాల్సి ఉంటుంది. - జయవర్ధన్‌ నారాయణ

ఇంటర్‌నెట్‌, ఆధునిక టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ద్వారా వ్యక్తిగతంగా, పరోక్షంగా లేదా మానసికంగా హాని కలిగించే ప్రక్రియనే సైబర్‌ క్రైంగా పరిగణిస్తారు. ఇదే కాకుండా మోసపూరిత ఆర్థిక లావాదేవీల (ఆన్‌లైన్‌) ద్వారా వ్యక్తికి నష్టం కలిగించడం కూడా దీనికిందకే వస్తుంది. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని బీఎస్‌సీ కంప్యూటర్స్‌ లేదా బీటెక్‌ (ఐటీ/ సీఎస్‌సీ) తీసుకుని ఎథికల్‌ హ్యాకింగ్‌, డిప్లొమా ఇన్‌ సైబర్‌ క్రైం వంటి కోర్సులు చేయాలి. ఆ విధంగా సైబర్‌ క్రైం పోలీసు వ్యవస్థలోకి ప్రవేశించొచ్చు.

* ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేశాను. డిగ్రీ (కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ) మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదవాలనుంది. డిగ్రీ తరువాత ఏది ఎంచుకోవాలి? నేను చదివేవాటిల్లో ఏ సబ్జెక్టు ఎక్కువ ఉపయోగకరం? - దిషిత

నేర పరిశోధనలో విజ్ఞాన సూత్రాలను వర్తింపజేసి సాధారణ దృష్టిని తప్పించుకునే ఆధారాలను కనుక్కునే శాస్త్రమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అప్లైడ్‌ సైన్స్‌ లేదా వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసినవారికి ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివే అర్హత ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు చేయడానికి మీరు అర్హులే. పీజీ స్థాయిలో ఈ కోర్సును అందిస్తున్న సంస్థల్లో కొన్ని విద్యాసంస్థలు: అమిటీ యూనివర్సిటీ, గల్గోతియా యూనివర్సిటీ, డా. హరిసింగ్‌ యూనివర్సిటీ.
సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు పరిశీలన నైపుణ్యాలు, సహజంగా పరిశోధించే స్వభావం, ఆసక్తి ఉన్నవారు ఈ వృత్తిలో రాణిస్తారు. ఆధునిక నేర పరిశోధనలో మీరు చదువుతున్న కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ మూడూ అవసరమే, ప్రధానమే.

* పదోతరగతి పూర్తిచేశాను. పెట్రోలియం టెక్నాలజీ కోర్సు చేద్దామనుకుంటున్నాను. దీనిపై అవకాశాలెలా ఉంటాయి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? - మనోజ్‌

పెట్రోలియం టెక్నాలజీ చేయాలనుకునేవారు 10+2లో మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ చదివుండాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ద్వారా ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ- విశాఖపట్నం, రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ- అమేథి, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, ఐఐటీ-బాంబే, ఐఐటీ- ధన్‌బాద్‌ వంటి ప్రముఖ విద్యాలయాల్లో బీటెక్‌ (పెట్రోలియం ఇంజినీర్‌) కోర్సుల్లో ప్రవేశాన్ని పొందొచ్చు.
వీరికి డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, రిజర్వాయర్‌ ఇంజినీర్‌, ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ ఇంజినీర్‌ వంటి ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌ పెట్రోలియం, ఎస్సార్‌ ఆయిల్‌ వంటివి మంచి వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.

* బీ- ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్నాను. తర్వాత ఏ కోర్సులు ఎంచుకుంటే మేలు? మెడికల్‌ కోడింగ్‌, ఫార్మకో విజిలెన్స్‌, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌లలో వేటికి భవిష్యత్తు ఉంది? - కరిష్మా

ఫార్మా కళాశాలలు భారీగా పెరగడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీని వల్ల బీ ఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలు తగ్గాయనేది కొంత అపోహే.ఫార్మా రంగం అభివృద్ధి, బహుళ జాతి సంస్థలు భారతదేశానికి రావడం ఫార్మా విద్యార్థులకు శుభ పరిణామం. వీటి వల్ల రీసెర్చ్‌ ఓరియంటెడ్‌గా విద్యను అభ్యసిస్తే ఉద్యోగాలు మంచి జీతంతో అందిపుచ్చుకోవచ్చు. బీ ఫార్మసీ పూర్తిచేసిన తర్వాత జీపీఏటీ (జీప్యాట్‌) ద్వారా పీజీ (ఎం.ఫార్మసీ) లేదా నైపర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వంటి సంస్థల్లో ఎంబీఏ (హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సును పూర్తి చేసి మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు.
* మెడికల్‌ కోడింగ్‌ విషయానికొస్తే అభ్యర్థులు ఏఏపీసీ వారు నిర్వహించే సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ కోడర్‌(సీపీసీ) సర్టిఫైడ్‌ అవుట్‌ పేషెంట్‌ కోడర్‌ (సీఓసీ), సీఆర్‌సీ, సీఐసీ, మెడికల్‌ డాక్యుమెంటేషన్‌ లాంటి కోర్సులు చేయడం ద్వారా మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ఉద్యోగాన్ని సాధించవచ్చు. స్థిరపర్చుకోవచ్చు.
* ఔషధాల ప్రభావాలను పర్యవేక్షించి వాటి ప్రతికూల చర్యలను ముందుగానే అంచనా వేయడానికి, గుర్తించడానికి ఉపయోగపడే శాస్త్రమే ఫార్మకో-విజిలెన్స్‌. పేషెంట్‌ క్షేమం, ఆపరేషన్స్‌, సర్‌వైలెన్స్‌, సిస్టమ్స్‌, ఎస్‌ఓపీ ప్రిపరేషన్‌ వంటి విభాగాల్లో ఉద్యోగాన్ని సంపాదించవచ్చు.
* మెడికల్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ కోర్సును కూడా ఉద్యోగం కోసం ఎంచుకోవచ్చు. పై కోర్సులపై కొన్ని ప్రైవేట్‌ సంస్థలు హైదరాబాదు, బెంగళూరు నగరాల్లో శిక్షణ అందిస్తున్నాయి.

* ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ) పూర్తిచేశాను. ఆర్కియాలజీ కోర్సు చదవాలనుంది. నాకు అర్హత ఉందా? కోర్సులు అందించే సంస్థల వివరాలు తెలియజేయండి. - రాములు గంగాల

ఏదేని గ్రూపు వారు అర్హులు. బీఏ హిస్టరీ, ఆర్కియాలజీ డిగ్రీని అభ్యసించడం ద్వారా ఈ రంగంలో స్థిరపడవచ్చు. ఈ కోర్సులో ఆర్కియాలజీతో పాటుగా ఫొటో హిస్టరీ, ఆర్ట్‌, మ్యూజియాలజీ, ఆర్కియోమెటరీ లాంటి సబ్జెక్టులను విద్యార్థులు చదవాల్సి ఉంటుంది. గొప్ప పరిశీలన, గ్రహణ శక్తి, విశ్లేషణాత్మక- తార్కిక నైపుణ్యాలను విద్యార్థి ఇనుమడింపచేసుకోవాలి. యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మను స్క్రిప్ట్‌లాజీ-తమిళ్‌ యూనివర్సిటీ, సెంటర్‌ ఫర్‌ మ్యూజియాలజీ అండ్‌ కన్జర్‌వేషన్‌- యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ - దిల్లీ ఈ కోర్సును అందిస్తున్నాయి.

* పదో తరగతి చదువుతున్నాను. ఆస్ట్రో ఫిజిక్స్‌ చదవాలనుంది. ఇంటర్‌లో ఏ గ్రూపును ఎంచుకోవాలి? ఏ ప్రవేశ పరీక్షలు రాయాలి? - కె. ప్రేమ్‌ సాయి, అచ్చంపేట

ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ చదివినవారు ఆస్ట్రోఫిజిక్స్‌ కోర్సు చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (ఎంపీసీ) లేదా బీటెక్‌ కోర్సును పూర్తిచేసినవారు ఆస్ట్రోఫిజిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును చేయవచ్చు. దీన్ని మనదేశంలో ఎక్కువ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, పంజాబీ యూనివర్సిటీ, ఐఐఎస్‌సీ ఆలిగర్‌ ముస్లిం యూనివర్సిటీ లాంటివి ఆస్ట్రోఫిజిక్స్‌లో ఎంఎస్సీని అందిస్తున్నాయి. JEST పరీక్ష ద్వారా ఐఐఏ, ఐయూసీఏఏ, టీఐఎఫ్‌ఆర్‌ లాంటి సంస్థల్లో పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందవచ్చు. ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలకు పైన పేర్కొన్న విశ్వవిద్యాలయాలు సొంత ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

* ఇంటర్‌ పూర్తిచేసి, డీఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు జర్నలిజం చదవాలనుంది. తరువాత ఏ కోర్సు ఎంచుకుంటే మేలు? - యర్రంశెట్టి లిఖిత

జర్నలిజంపై ఆసక్తి ఉన్నవారు జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ డిగ్రీ కోర్సును ఎంచుకోవచ్చు. మీరు ఎలాగూ టీచర్‌ ట్రైనింగ్‌ పొందుతున్నారు కాబట్టి, దూరవిద్యా విధానంలోనూ ఈ కోర్సును అభ్యసించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు ఈ కోర్సు (జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌)లో డిప్లొమా, డిగ్రీలను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. ఇగ్నో ద్వారా కూడా ఈ కోర్సును అభ్యసించవచ్చు. జర్నలిజంలోనే మీ కెరియర్‌ను సాగించాలంటే డీఈడీ పూర్తయ్యాక జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సును ఇంజిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌-దిల్లీ, ఎంఐసీఏ-అహ్మదాబాద్‌, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో జర్నలిజం కోర్సును పూర్తిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.

* డిప్లొమా పూర్తిచేశాను. పై చదువులు కొనసాగించాలనుకుంటున్నా. అయితే ఏఎంఐఈ, బీటెక్‌ల్లో ఏది తీసుకుంటే మేలు? వీటి మధ్య భేదమేంటి? - జె. రేవంత్‌

విద్యార్థి నాలుగేళ్ల బీటెక్‌ విద్యను కళాశాల/ యూనివర్సిటీ ద్వారా రెగ్యులర్‌ విధానంలో అభ్యసిస్తారు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లపాటు ఈ కోర్సు కొనసాగుతుంది. ఏఎంఐఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారు అందిస్తున్నారు. మొత్తం 11 స్పెషలైజేషన్లలో తమకు నచ్చినదాన్ని విద్యార్థి ఎంచుకోవచ్చు. ఏఎంఐఈ కోర్సును సెక్షన్‌- ఎ, బిల రూపంలో రూపొందించారు. రెండు సెక్షన్లలో కలిపి మొత్తం 19 సబ్జెక్టులు, ల్యాబ్‌ పరీక్షలో విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి. ఆరేళ్ల వ్యవధిలో ఈ కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. ఏటా జూన్‌, డిసెంబర్‌ నెలల్లో పరీక్షలు జరుగుతాయి. సంవత్సరం పొడవునా అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమాతో ఉద్యోగం పొంది, ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెగ్యులర్‌ విధానంలో బీటెక్‌ అభ్యసించలేనివారు తమ పై చదువులు కొనసాగించడానికి ఏఎంఐఈ కోర్సును ఎంచుకోవచ్చు.
బీటెక్‌, ఏఎంఐఈ రెండు కోర్సులనూ ఉన్నత చదువులకు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు సమాన అర్హతగానే పరిగణిస్తారు. అయితే వీలుంటే ప్రొఫెషనల్‌ కోర్సు అయిన ఇంజినీరింగ్‌ విద్యను రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడమే మంచిది.

* ఫార్మా-డి రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకున్న జాతీయ, అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ అవకాశాలను తెలియజేయండి. వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? - దినేష్‌, వరంగల్‌

సాధారణంగా అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు విదేశాల్లో చదువుతున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఫెలోషిప్‌/ స్కాలర్‌షిప్‌ల ద్వారా అందిస్తారు. ఉదాహరణకు- కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ అండ్‌ ఫెలోషిప్‌ ప్లాన్‌, జేఎన్‌ టాటా ఎండోమెంట్‌ స్కాలర్‌షిప్‌ వంటివి మెరిట్‌ ఆధారంగానే అందుబాటులో ఉంటాయి. మీరు ప్రస్తుతం మనదేశంలోనే ఉన్నారు, ఇంకా ఫార్మా-డి రెండో ఏడాది చదువుతున్నారు. ఇంకా మీ కోర్సు నాలుగేళ్లు ఉంది కాబట్టి.. ఇండియన్‌ ఆయిల్‌ లిమిటెడ్‌ స్కాలర్‌షిప్‌, నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్స్‌ (ఎన్‌ఎంఎంఎస్‌), మహవీర్‌ ప్రసాద్‌ సింగ్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌, మినిస్ట్రీ ఆఫ్‌ మైనారిటీ అఫైర్స్‌ వారి మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌, స్టేట్‌ గవర్నమెంట్‌ స్కాలర్‌షిప్స్‌ను మెరిట్‌, మీన్స్‌ విధానంలో పొందొచ్చు. దరఖాస్తు కోసం ఆయా సంస్థల వెబ్‌సైట్లను చూడొచ్చు.

* కంప్యూటర్‌ డిప్లొమా పూర్తిచేశాను. బీటెక్‌ కాకుండా దూరవిద్య చేయగల అవకాశమున్న కోర్సుల వివరాలను తెలపండి. - సత్య, కాకినాడ

మీరు 10+3 (పాలిటెక్నిక్‌/ డిప్లొమా) ఇన్‌ కంప్యూటర్స్‌ పూర్తిచేసి ఉంటారు. బీటెక్‌ కాకుండా దూరవిద్యలో ఏఎంఐఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారు అందిస్తున్నారు. మీరు బీఎస్‌సీ కంప్యూటర్స్‌, బీఎస్‌సీ మేథమేటిక్స్‌, బీఏ మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ కోర్సులను దూరవిద్య ద్వారా అభ్యసించవచ్చు. అంతేకాకుండా ఆర్ట్స్‌ కోర్సులైన బీఏ, బీకాం, బీబీఏ కోర్సులను కూడా మీ విద్యార్హతో దూరవిద్య విధానంలో అభ్యసించవచ్చు. ఈ కోర్సులను దూరవిద్య ద్వారా ఇగ్నో, ఆంధ్రా, నాగార్జున, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు, బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అందిస్తున్నాయి. దూరవిద్య ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సులను చేయాలనుకుంటే మాత్రం ఏఎంఐఈ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ వారు అందించే ఏఎంఐఐటీఈ కోర్సులను ఎంచుకోవాలి.

* ఇంటర్‌ (ఎంఈసీ) పూర్తిచేశాను. సైన్స్‌ గ్రూపు (బీఎస్‌సీ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ) వైపు వెళ్లాలని ఉంది. కుదురుతుందా? - ఎస్‌. భార్గవ్‌

ఇంటర్‌ ఎంఈసీతో పూర్తి చేసినవారు డిగ్రీ స్థాయిలో (మేథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సులను ఎంచుకోవచ్చు. బీఎస్‌సీ (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌)ను తీసుకోవచ్చు. లేదా బీకాం, బీబీఏ, బీబీఎం వంటి కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదవనందున బీఎస్‌సీ (కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌) కోర్సును ఎంచుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీ ఆసక్తి మేరకు పైన తెలిపిన కోర్సులను ఎంచుకోవచ్చు.

* పీజీ చదువుతున్నాను. రూరల్‌ స్టడీస్‌, ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కోర్సులపై ఆసక్తి. కోర్సులు, అందించే సంస్థల వివరాలను తెలపండి. - పావన జ్యోతి

పీజీ స్థాయిలో రూరల్‌ స్టడీస్‌ చేయాలనుకునేవారు మాస్టర్స్‌ ఇన్‌ రూరల్‌ స్టడీస్‌ (ఎంఆర్‌ఎస్‌)ను అందిస్తున్న భవ్‌నగర్‌ యూనివర్సిటీ-గుజరాత్‌, పట్నా యూనివర్సిటీ- పట్నా, నిమ్స్‌ యూనివర్సిటీ- రాజస్థాన్‌, ఆంధ్రా యూనివర్సిటీ, ఇగ్నోవారు అందించే ఎంఏ (రూరల్‌ డెవలప్‌మెంట్‌) కోర్సును ఎంచుకోవచ్చు. విశ్వవిద్యాలయాలు తమ ప్రవేశపరీక్షల ద్వారా అడ్మిషన్‌ కల్పిస్తాయి. ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు పై కోర్సులకు అర్హులు.
ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ కావాలనుకునేవారు పీజీ స్థాయిలో ఎంఎస్‌సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) కోర్సును ఎంచుకోవచ్చు. ఈ కోర్సు చేయాలనుకునేవారు డిగ్రీలో కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, మైక్రోబయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదివుండాలి. బీటెక్‌ (సివిల్‌) చదివినవారు కూడా ఈ కోర్సును ఎంచుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సును ఆంధ్రా, ఆచార్య నాగార్జున, ఉస్మానియా యూనివర్సిటీలు అందిస్తున్నాయి.

* ఇంటర్‌ పూర్తిచేశాను. నాకు రక్షణ రంగంవైపు వెళ్లాలని ఉంది. అమ్మాయిలకు ఈ రంగంలో ఉన్న అవకాశాలూ, అందించే కళాశాలలు, ప్రవేశపరీక్షల వివరాలను తెలియజేయండి. - పి.దిషిత

రక్షణ రంగంలో అడుగిడాలనుకునేవారు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. ఏటా రెండుసార్లు యూపీఎస్‌సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో గమనించాల్సిన విషయం- అభ్యర్థి వయసు 16-19 ఏళ్ల మధ్య ఉండాలి. అంతకుమించినవారు అనర్హులు. ఆర్మీ విభాగంలో చేరాలంటే ఏదైనా సబ్జెక్టులో 10+2 పూర్తి చేసుండాలి. నేవీ లేదా ఏర్‌ఫోర్స్‌ విభాగంలో అభ్యర్థులు 10+2లో మేథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా అవకాశం కల్పిస్తారు. డిగ్రీ పూర్తిచేసిన మహిళా అభ్యర్థులు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌- టెక్నికల్‌ ఉమెన్‌ పరీక్ష ద్వారా రక్షణ రంగంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ రంగంలో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. పట్టుదల, కార్యదక్షతతో ఈ రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

* రెగ్యులేటరీ అఫైర్స్‌లో పీజీ డిప్లొమా చేయాలనుంది. అందించే సంస్థలు, వాటి ప్రవేశ వివరాలను అందించగలరు. - శ్రీలక్ష్మి

మీ ప్రశ్ననుబట్టి మీరు బీఎస్‌సీ లేదా బీఫార్మసీ/ ఎంఫార్మసీ చేసినవారై ఉండాలి. ఈ కోర్సును నిమ్స్‌ (జయపుర) యూనివర్సిటీ, గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ (జీఐఆర్‌ఏ)- పుణె, జామియా హమ్‌దర్ద్‌ యూనివర్సిటీ- దిల్లీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ మేనేజ్‌మెంట్‌- ముంబయి, బయో ఇన్ఫర్మాటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా- నోయిడా వారు అందిస్తున్నారు. డిగ్రీలో సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీస అర్హత ఉండాలి. మరిన్ని వివరాలకు పై విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లను సందర్శించొచ్చు.

* పదో తరగతి పూర్తిచేశాను. నాకు మిసైల్స్‌ గురించిన సమాచారం అంటే ఆసక్తి. పై చదువులను మిసైల్స్‌కు సంబంధించిన అంశాల్లో చేయాలనుంది. ఇంటర్‌ నుంచి ఏ కోర్సులను ఎంచుకోవడం ద్వారా నా లక్ష్యాన్ని చేరుకోగలను. - టి. ఆదిత్య రెడ్డి, నిర్మల్‌

మిసైల్స్‌ రక్షణ శాఖకు చెందినవి. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌లో ఎంపీసీని ఎంచుకోవాలి. తరువాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో డిగ్రీ, పీజీ చేయాల్సి ఉంటుంది. డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీవారు అందించే కోర్సుల ద్వారా మీ సంకల్పాన్ని చేరుకోవచ్చు. దీనికోసం ఎన్‌డీఏ పరీక్ష అర్హత సాధించాలి. దీనిద్వారా మిలిటరీ, ఏర్‌ఫోర్స్‌, నేవీ ఫోర్స్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, డిఫెన్స్‌ సంస్థలైన హెచ్‌ఏఎల్‌, ఎన్‌ఏఎల్‌, ఇతర సంస్థలైన డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ వంటి పరిశోధన సంస్థల్లోనూ ఉద్యోగాన్ని సాధించవచ్చు.

* ఇంటర్‌ తరువాత ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదవాలంటే ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకుంటే మంచిది? ఈ కోర్సు గురించిన పూర్తి సమాచారాన్ని అందించండి. - రాజు.పి, జై, వైవీఎన్‌ఎం సత్యనారాయణ

పర్యావరణ భౌతిక, రసాయన, జీవ సంబంధిత భాగాలను పరస్పరం అధ్యయనం చేసే విజ్ఞానశాస్త్రమే ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌. ఇది జీవ, రసాయనిక, భూగోళశాస్త్రాల కలయిక. అందుకే దీన్ని ఇంటర్‌ డిసిప్లినరీ ఫీల్డ్‌గా పరిగణిస్తారు. ఈ శాస్త్రం సాంఘిక, మానవీయ శాస్త్రాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. బీఎస్‌సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) మాత్రమే కాకుండా ఈ రంగంలో బీటెక్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌)ను కూడా ఇంటర్‌ తరువాత ఎంచుకోవచ్చు.
ఇంటర్‌లో ఎంపీసీ/ బైపీసీ ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ కోర్సుల్లో చేరాలంటే ఎంపీసీ ఎంచుకోవడం మంచిది. జీవశాస్త్ర కలయిక కోసం బైపీసీ ఎంచుకోవడం శ్రేయస్కరం. బీఎస్‌సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) లేదా బీటెక్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌) రెండింటికీ కూడా చక్కని భవిష్యత్తు ఉంది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ- ఖరగ్‌పూర్‌, ఐఐటీ-ఖాన్‌పూర్‌, ఐఐటీ-దిల్లీ, ఐఐటీ-రూర్కీ, ఐఐటీ-బాంబేల్లో బీటెక్‌లో ఈ కోర్సును అందిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆధారంగా ప్రవేశాన్ని కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బీఎస్‌సీ ఇన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ను ఆల్‌ అమీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- రాజమండ్రి, శ్రీ గ్రంథి చిన సన్యాసి రాజు కాలేజ్‌- శ్రీకాకుళం, హోమ్‌సైన్స్‌ కాలేజ్‌- హైదరాబాద్‌, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌- హైదరాబాద్‌, ఆంధ్రా, కాకతీయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి.

* బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ కోర్సులను అందిస్తున్న సంస్థలు, వాటి ఫీజు వివరాలను తెలియజేయగలరు. - శ్రీజేష్‌ నాయర్‌

మీరు ఏం చదివారో తెలియజేయలేదు. బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ కోర్సులను చదవాలనుకునేవారు డిగ్రీ స్థాయిలో బీకాం (అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌), బీకాం (జనరల్‌) కోర్సులను ఎంచుకోవచ్చు. డిగ్రీతోపాటు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) లేదా సీఎంఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ) కోర్సులను చదివితే ఈ రంగంలో అవకాశాలు ఎక్కువ. డిగ్రీ పూర్తిచేసినవారు సీఎంఏ-యూఎస్‌ కోర్సును ఎంచుకుని బిజినెస్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ రంగంలో స్థిరపడొచ్చు. సాధారణంగా ప్రతి డిగ్రీ కళాశాలలో బీకాం కోర్సు అందుబాటులో ఉంటుంది. సీఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) వారు, సీఎంఏ కోర్సును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏఐ) వారు అందిస్తున్నారు.

ఇంటర్‌ పూర్తిచేశాను. బీఎస్‌సీ మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌ చేయాలనుంది. కోర్సు వివరాలు, అందించే సంస్థలేవి? - షణ్ముఖి

మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇది పూర్తిగా సృజనాత్మకతకు సంబంధించింది. ఈ రంగంలోకి వెళ్లేముందు ఈ కోర్సు చదవడానికి ముందూ, చదివిన తర్వాతా రాణించడానికి కావాల్సిన లక్షణాలు మీకున్నాయో లేవో బేరీజు వేసుకోండి. సృజనాత్మకతతోపాటు కంప్యూటర్‌తో ఎక్కువసేపు పనిచేయగలిగే నేర్పు, ఓర్పు చాలా అవసరమవుతాయి.
ఈ కోర్సు చదివినవారికి గ్రాఫిక్స్‌, టీవీ, మీడియా, అడ్వర్టైజింగ్‌, గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, వెబ్‌సైట్‌ డిజైనింగ్‌, యానిమేషన్‌, ప్రింట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ కంటెంట్‌ తయారీ సంబంధిత సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ కోర్సును అతికొద్ది సంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. కేఎల్‌ యూనివర్సిటీ- విజయవాడ, జేవియర్‌ యూనివర్సిటీ- భువనేశ్వర్‌, వీఐటీ- వెల్లూర్‌, అమిటీ యూనివర్సిటీ- ముంబయి, మణిపాల్‌ యూనివర్సిటీ- మణిపాల్‌, లయోలా అకాడమీ- సికింద్రాబాద్‌ మొదలైనవి వాటిలో కొన్ని.
ఈ కోర్సులు చాలావరకూ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో అవకాశాలతోపాటు పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి సబ్జెక్టుపై పట్టు, నైపుణ్యాలను సాధించగలిగితే భవిష్యత్తు చాలా బాగుంటుంది.

ఇంటర్‌ పూర్తిచేశాను. మెటలర్జీ కోర్సుకి సంబంధించిన వివరాలను తెలియజేయండి. ఉద్యోగావకాశాలెలా ఉంటాయి? - ఉపేంద్ర కుమార్‌ రెడ్డి

ఇంటర్‌ తరువాత మెటలర్జీ ఇంజినీరింగ్‌ కానీ, డిప్లొమా ఇన్‌ మెటలర్జీ ఇంజినీరింగ్‌ కోర్సును కానీ చేయొచ్చు. జేఎన్‌టీయూ పరిధిలోని అతికొద్ది ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈ ఇంజినీరింగ్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఎంసెట్‌ ర్యాంకు ద్వారా ప్రవేశం పొందొచ్చు. పాలీసెట్‌ ద్వారా కూడా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశం పొంది లేటరల్‌ ఎంట్రీ ద్వారా మూడేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో చేరొచ్చు.
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ టెక్నాలజీ- గుజరాత్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫౌండ్రి అండ్‌ ఫోర్జ్‌ టెక్నాలజీ- రాంచీ, ఐఐటీ- మద్రాస్‌, బాంబే, రూర్కీ, కాన్పూర్‌, వారణాసి, కొన్ని ఎన్‌ఐటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఈ కోర్సు చదివినవారికి ప్రైవేటు ఉక్కు కర్మాగారాలు, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌, హిండాల్కో ఇండస్ట్రీస్‌, కేబుల్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థల్లో మెటలర్జికల్‌ ఇంజినీర్లు, టెక్నిషియన్లు, ప్రాసెస్‌ అనలిస్టులుగా ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. మెటల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌, అల్లాయ్‌ మ్యానుఫాక్చరింగ్‌, హెవీ మెషీన్‌ తయారీ కర్మాగారాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

బీఎస్‌సీ (హోంసైన్స్‌) చదువుతున్నాను. ఎంఎస్‌సీ (న్యూట్రిషన్‌) చదవాలని ఉంది. వీలవుతుందా? తెలుగు రాష్ట్రాల్లో అందించే సంస్థలు, వాటి ప్రవేశపరీక్షల వివరాలను తెలియజేయండి. - జెస్సిక

తెలుగు రాష్ట్రాల్లో ఎంఎస్‌సీ (న్యూట్రిషన్‌) కోర్సు అతి తక్కువ విశ్వవిద్యాలయాల్లోనే అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆంధ్రా యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌సీ హోంసైన్స్‌లో ఓ స్పెషలైజేషన్‌గా అందుబాటులో ఉంది. అదేవిధంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోనూ ఎంఎస్‌సీ హోంసైన్స్‌లో ఒక స్పెషలైజేషన్‌గా మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయాలన్నీ ప్రవేశ ప్రకటన జారీ చేశాయి. ప్రవేశపరీక్ష ద్వారానే ప్రవేశం దొరుకుతుంది. ఈ విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లను సందర్శించి, దరఖాస్తు తేదీలు, సిలబస్‌, నమూనా ప్రశ్నపత్రాల వివరాలను తెలుసుకుని ప్రవేశపరీక్షకు సన్నద్ధం కండి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎంఎస్‌సీ (న్యూట్రిషన్‌) కోర్సును దూరవిద్య ద్వారా కూడా అందిస్తోంది. ఆసక్తి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అందించే సంస్థల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి.

డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎంచుకున్నాను. దీనిపై డిగ్రీ తరువాత అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను తెలపండి. ఉద్యోగావకాశాలేంటి? - రాజేశ్వరి సాగర్‌

డిగ్రీ పూర్తిచేశాక పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌పై మక్కువ ఉంటే ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును ఎంచుకోవచ్చు. ప్రజా పరిపాలన విస్తృత జనాభాకు ఉపయోగపడే ప్రభుత్వ విధానాన్ని అమలుచేయడం, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, పౌరుల శ్రేయస్సు కోసం ప్రజాకార్యక్రమాలు అభివృద్ధి చేయడం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ముఖ్య లక్ష్యాలు.. సమాజం పట్ల ఆసక్తి, సమస్య పరిష్కరణ, సమాజ బాధ్యత పట్ల ఆసక్తి ఉంటే ఈ కోర్సు చేసినవారు తమ పరిజ్ఞానంతో ప్రభుత్వ గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాలు, పాలసీ రూపకర్తలకు సలహాదార్లుగా ఉన్నతి పొందే అవకాశాలున్నాయి. ప్రెసిడెన్సీ కాలేజ్‌-చెన్నై, నిజాం కాలేజ్‌- హైదరాబాద్‌, లఖ్‌నవూ యూనివర్సిటీ- లఖ్‌నవూ, యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి-ముంబయి.. ఈ కోర్సులో పీజీ చేయడానికి ప్రముఖ విశ్వవిద్యాలయాలు. ప్రైవేటు ఎన్‌జీఓ సంస్థల్లో ఈ కోర్సు చేసినవారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డిగ్రీలో ఏ కోర్సు?

ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాను. డిగ్రీలో ఏ కోర్సు ఎంచుకుంటే మేలు? - సుభాష్‌

ఇంటర్‌లో ఏ ఒకేషనల్‌ కోర్సు చదువుతున్నారో తెలుపలేదు. మీరు అకౌంట్స్‌ అండ్‌ టాక్సేషన్‌ కోర్సు చదువుతున్నట్లయితే డిగ్రీలో బీకాం, బీకాం- టాక్స్‌, బీబీఎం వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి (క్రాప్‌ మేనేజ్‌మెంట్‌), బీఏ రూరల్‌ మేనేజ్‌మెంట్‌, బీబీఏ కోర్సులను ఎంచుకోవచ్చు. ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కోర్సును చదువుతున్నట్లయితే బీఎస్‌సీ లేదా బీటెక్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. మీరు మీ ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యకు సంబంధించిన కోర్సునే డిగ్రీలో ఎంచుకోవడం మంచిది.

బొటానికల్‌ సైన్స్‌లో పీజీ చేశాను. యోగా ఉపాధ్యాయుడు కావాలనుంది. సంబంధిత కోర్సులు, అందించే కళాశాలల వివరాలను తెలియజేయండి. - సురేష్‌

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి మనిషి జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి. డబ్బు, ఉద్యోగం పరుగులో ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గింది. యోగా మనిషి శరీరాన్ని, మనసును ఏకం చేసే సాధనం. యోగా సాధన, శిక్షణలో ఉన్నత స్థానాలు చేరుకోవడానికి ఏకాగ్రత, సాధన ఎంతో ఆవశ్యకం. ఈ యోగా శిక్షణలో ఉపాధ్యాయుడిగా మారాలనుకునేవారు మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా (మినిస్ట్రీ ఆఫ్‌ ఆయుష్‌) వారు అందిస్తున్న వివిధ సర్టిఫికెట్‌ కోర్సులను పూర్తిచేసి అడ్వాన్స్‌డ్‌ యోగా సాధన కోర్సును ఎంచుకోవచ్చు. యోగా టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు, అందిస్తున్న నగరాల్లో రుషికేష్‌, ధర్మశాల ప్రముఖమైనవి. ఈ కోర్సును పూర్తిచేసినవారు సర్టిఫైడ్‌ యోగా టీచర్‌ అవుతారు. ఎస్‌-వ్యాసా యూనివర్సిటీ వారు బీఎస్‌సీ, ఎంఎస్‌సీ యోగా కోర్సులను రెగ్యులర్‌, దూరవిద్య విధానంలో అందిస్తున్నారు.

* బీఎస్‌సీ (మైక్రోబయాలజీ) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ ఉద్యోగావకాశాలేవి? ప్రభుత్వ సంస్థలు అందించే కోర్సులేమైనా ఉన్నాయా? - ఎస్‌.కుమారస్వామి

డిగ్రీతో అర్హత ఉన్న సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంక్‌ వంటి పోటీపరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రోబయాలజీ స్పెషలైజేషన్‌లో ఉద్యోగాలకైతే సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, క్లినికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్‌ సర్వే పర్సనల్‌, కెమికల్‌ అసిస్టెంట్‌తోపాటు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, సైంటిఫిక్‌ ఆఫీసర్‌, ఆక్వా రంగంలో క్వాలిటీ అస్యూరెన్స్‌ వంటి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో (పీజీఎంఐఈఆర్‌, సీఆర్‌ఐజేఏఎఫ్‌, ఎన్‌ఐఏబీ, అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో వంటి అవకాశాలను పొందొచ్చు. కానీ ఇందుకు ఎంఎస్‌సీ మైక్రోబయాలజీ పూర్తిచేసి ఉండాలి. ఈ రంగంలో ముందుకు సాగాలంటే పీజీ చేయడంతోపాటు పరిశోధనపై మక్కువ పెంచుకోవడం ద్వారా మంచి భవిష్యత్తును సాధించుకోవచ్చు.

* బీఏ (హెచ్‌టీపీ) పూర్తిచేశాను. పై చదువులు ఏవి చదివితే మేలు? నాకున్న ఉద్యోగావకాశాలేవి? - కేవీటీ, హైదరాబాద్‌

బీఏ (హిస్టరీ, తెలుగు, పాలిటీ) పూర్తి చేసినవారు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో తమకు ఆసక్తి ఉన్నటువంటి (పై మూడింటిలో) ఏదో ఒక కోర్సును స్పెషలైజేషన్‌గా ఎంచుకుని తమ పై చదువులు కొనసాగించవచ్చు. లేదా ఎంబీఏ వంటి ప్రొఫెషనల్‌ కోర్సును ఎంచుకుని బిజినెస్‌ రంగంలో ఉద్యోగం లేదా సొంత వ్యాపారాన్ని స్థాపించుకోవచ్చు. సాధారణంగా బీఏ (హెచ్‌టీపీ) చదివినవారు ప్రభుత్వ పరీక్షలైన గ్రూప్‌-1, గ్రూప్‌-2లకు సన్నద్ధం కావడం లేదా యూపీఎస్‌సీ పరీక్షలకు సన్నద్ధమై మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ వంటి కంప్యూటర్‌ స్కిల్స్‌ పెంపొందించుకుంటే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాన్ని పొందవచ్చు. హిస్టరీ పట్ల ఆసక్తి ఉన్నవారు ఎంఏ ఆర్కియాలజీ కోర్సును ఎంచుకుంటే మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి.

* స్టార్టప్‌ స్థాపనలో ఏ కెమిస్ట్రీ కోర్సు ఉపయోగపడుతుంది? ఆర్గానిక్‌, అనలిటికల్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీల్లో భవిష్యత్తుకు ఉపయోగపడేదేది? కోర్సులను అందించే విశ్వవిద్యాలయాలూ, ఉద్యోగావకాశాలనూ తెలపండి. ఐఐటీ దిల్లీలో పీహెచ్‌డీ ఉందా? - డి. పౌర్ణమి

అంకుర సంస్థ/ స్టార్టప్‌ను స్థాపించడంలో ఆచరణాత్మకమైన వ్యాపార ఆలోచన చాలా ముఖ్యం. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ జోసఫ్‌ ప్రకారం సమాజం ఎదుర్కొన్న/ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలకు కెమిస్ట్రీ పరిష్కారం చూపగలదు. కాబట్టి ముందుగా మీరు ఏ కెమిస్ట్రీ మంచిదో పక్కనపెట్టి సమస్యను కనుక్కోవడానికి ప్రయత్నించి ఆ తరువాత ఆ మార్గంలో అడుగులు వేయడం మంచిది.
ఆర్గానిక్‌ లేదా అనలిటికల్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీ కూడా భవిష్యత్తులో ఉపయోగపడేవే. ఇవి వేటికవే తమదైన ప్రత్యేకతను కలిగివున్నాయి. కాబట్టి మీరు మీకు నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంచుకోండి.
ఐఐటీ-దిల్లీ, బాంబే, బెంగళూరు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ లాంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, సంస్థలు ఎంఎస్‌సీ కెమిస్ట్రీ, పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ+పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. ఉద్యోగావకాశాల పరంగా ఎంఎస్‌సీ కెమిస్ట్రీ పూర్తిచేసినవారికి రిసెర్చ్‌ సైంటిస్ట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌, కెమికల్‌ అనలిస్ట్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌, ఉపాధ్యాయ వృత్తిలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను సాధించుకోవచ్చు.

* ఇంటర్‌ (క్రాప్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌) ఒకేషనల్‌ కోర్సు చేశాను. నాకున్న ఉన్నతవిద్య అవకాశాలను తెలపండి. నాకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలేవి? - నక్కల శ్రీనివాస్‌ యాదవ్‌

క్రాప్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్‌ పూర్తిచేసినవారికి స్వయం ఉపాధి, వ్యవసాయ, వ్యవసాయాధారిత పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇది స్టాండ్‌ అలోన్‌ కోర్సు కావడం వల్ల వ్యవసాయం ద్వారా వ్యవసాయాధారిత మార్గాల ద్వారా స్వయం ఉపాధి కల్పనకు విద్యార్థులను తయారు చేస్తోంది. ఈ కోర్సు పూర్తిచేసినవారికి విలేజ్‌ లెవల్‌ అసిస్టెంట్‌, ఫీల్డ్ అసిస్టెంట్‌, విత్తన గ్రేడర్‌, విత్తన ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌, మెటరలాజికల్‌ అబ్జర్వర్‌, గ్రామీణ బ్యాంకుల్లో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, సీడ్‌ గ్రోవర్‌ వంటి శాఖల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలుంటాయి. ఇంకా పై చదువుల విషయానికొస్తే బీబీఏ, బీబీఎం వంటి డిగ్రీ కోర్సులను చేసి పీజీ స్థాయిలో ఎంబీఏ (అగ్రి బిజినెస్‌) కోర్సును చేసే సౌలభ్యం ఉంది. మనదేశం వ్యవసాయాధారిత దేశం కాబట్టి వ్యవసాయ సంబంధిత మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసినవారికీ మంచి అవకాశాలున్నాయి.

* ఈసీఈ డిప్లొమా చేశాను. నా సబ్‌ బ్రాంచ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ వీడియో ఇంజినీరింగ్‌. ఉన్నతవిద్య చదవాలనుంది. బీటెక్‌ కాకుండా నాకున్న అవకాశాలేంటి? - విశాల్‌

సాధారణంగా డిప్లొమా పూర్తి చేసినవారు ఉద్యోగం కానీ బీటెక్‌ ద్వారా తమ చదువును కానీ కొనసాగిస్తారు. మీకు బీటెక్‌ కాకుండా బీఎస్‌సీ (కమ్యూనికేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మేథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌) చదివే అవకాశం ఉంది. అలాకాకుండా వ్యాపారం, మేనేజ్‌మెంట్‌ పట్ల ఆసిక్తి ఉంటే బీబీఏ, బీకాం, బీబీఎం వంటి డిగ్రీ కోర్సులను ఎంచుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొన్ని కళాశాలలు డిగ్రీ స్థాయిలో డేటా అనలిటిక్స్‌ కోర్సులను అందిస్తున్నాయి. మీ అభిరుచి, ఆసక్తి ఆధారంగా పైన పేర్కొన్న కోర్సులను ఎంచుకోవచ్చు.

* బీఎస్‌సీ (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తిచేశాను. తరువాత ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ చేద్దామనుకుంటున్నా. నాకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలూ, ఎంపిక ప్రక్రియనూ తెలపండి. - సందీప్‌, మహబూబ్‌నగర్‌

ప్రస్తుత సాంకేతిక, డేటా విప్లవంతో స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసినవారికి స్టాటిస్టీషియన్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, యూపీఎస్‌సీ వారు నిర్వహించే ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌లో ఆఫీసర్‌, డిగ్రీ లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (యూనివర్సిటీల్లో) వంటి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
ప్రైవేటు రంగంలో డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌, లెక్చరర్‌, స్టాటిస్టిక్స్‌, ట్రైనర్‌ వంటి అవకాశాలు ఉన్నాయి. అనలిటిక్స్‌ రంగంలో ఆసక్తి ఉన్నవారు ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైథాన్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అదనపు కోర్సులను నేర్చుకోవడం ద్వారా మంచి ఉద్యోగంతోపాటు మంచి వేతనాన్నీ పొందగలరు.

* ఇంటర్‌ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దీనిలో కెరియర్‌ నిర్మించుకోవాలనుంది. ప్రవేశపరీక్షలు, అందించే కళాశాలలేవి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? - దిషిత, విశాఖపట్నం

వెయ్యి పదాలకంటే ఒక చిత్రం ఎక్కువ మాట్లాడుతుంది. ఫొటోగ్రఫీలో ఆసక్తి ఉన్నవారు వైవిధ్యంగా చిత్రాన్ని చూడగల నేర్పు, సృజనాత్మకత, వృత్తిపట్ల అంకిత భావం కలిగివుండాలి. ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణె, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఆర్ట్‌- కోల్‌కతా, కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌- దిల్లీ, ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్‌ వారు మూడేళ్ల బ్యాచిలర్‌ ఇన్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (ఫొటోగ్రఫీ), బ్యాచిలర్‌ (ఫొటోగ్రఫీ) కోర్సులను అందిస్తున్నారు.
తమ సొంత ప్రవేశపరీక్షల ద్వారా ఈ కోర్సుల్లోకి ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. 10+2 చదివినవారు అర్హులు. ఫొటోగ్రఫీ చేసినవారికి ఫ్యాషన్‌, టీవీ, సినిమా, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ రంగాల్లో మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

* తొమ్మిదో తరగతి చదువుతున్నాను. స్పేస్‌పై ఆసక్తి. ఇస్రోలో చేరాలనుంది. పై చదువుల్లో ఏ గ్రూపులను ఎంచుకోవాలి? వేటిని చదివితే నా లక్ష్యాన్ని చేరుకోగలను? - వంశీతేజ ్‌

స్పేస్‌ సైన్స్‌పై ఆసక్తి, ఇస్రోలో చేరాలనే కోరిక ఉన్న ఔత్సాహికులు/ విద్యార్థులు గణితం, భౌతికశాస్త్రం పట్ల ప్రజ్ఞావంతులై ఉండాలి. అందుకు మీరు ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ ఎంచుకోవడం మంచిది. డిగ్రీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, బీఎస్‌సీ ఫిజికల్‌ సైన్సెస్‌, జియో ఫిజిక్స్‌ వంటి సబ్జెక్టులను ఎంచుకుని వాటిలోనే పైచదువులు ఎంఎస్‌సీ లేదా ఎంటెక్‌ చేయడం ద్వారా స్పేస్‌ సైన్సెస్‌/ ఇస్రో వంటి సంస్థల్లో టెక్నికల్‌ ఉద్యోగాలను పొందవచ్చు.
ఇస్రోలో నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు. కాబట్టి మీరు టెక్నికల్‌/ నాన్‌ టెక్నికల్‌ రంగాల్లో వేటిలో ఉద్యోగాలను పొందాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ముందుకు అడుగు వేయండి.

* ఏసీసీఏ చదవాలనుకుంటున్నాను. దాని ప్రాముఖ్యాన్ని తెలపండి. ఇది సీఏతో సమానమేనా? మనదేశంలో ఈ కోర్సు చేసినవారికి అవకాశాలెలా ఉన్నాయి? - ఎన్‌.పి. భాస్కర్‌

అసోసియేషన్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెన్స్‌ (ఏసీసీఏ) ఒక అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ అకౌంటింగ్‌ బాడీ. చార్టర్డ్‌ అకౌంటెన్సీ కోర్సును అకౌంటింగ్‌ రెగ్యులేటరీ సంస్థ అయిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెన్స్‌ ఆఫ్‌ ఇండియా వారు అందించే ఫ్లాగ్‌ షిప్‌ కోర్సు. ఈ రెండు కోర్సులకూ అకౌంటింగ్‌ రంగంలో ప్రత్యేకత, గుర్తింపు ఉన్నాయి. ఏసీసీఏ కోర్సుకు అంతర్జాతీయ గుర్తింపు దాదాపుగా 130 దేశాల్లో ఉంది. అంతర్జాతీయంగా వేరే దేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు ఏసీసీఏ కోర్సును ఎంచుకోవచ్చు. బహుళజాతి సంస్థల్లో ఈ కోర్సుకు మంచి గిరాకీ ఉంది.
ఇక సీఏ కోర్సు పూర్తిచేసినవారు మనదేశంలో సొంతంగా ప్రాక్టీసు పెట్టుకోవచ్చు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంతకం ఆడిటింగ్‌, టాక్స్‌, రిపోర్టింగ్‌లో చాలా ప్రాముఖ్యమైంది. ఏసీసీఏ పూర్తి చేసినవారికి ఈ సౌలభ్యం లేదు. కానీ ఉపాధి విషయానికి వస్తే రెండు కోర్సుల‌కూ బాగా గిరాకీ ఉంది.చార్ట‌ర్డ్ అకౌంటింగ్ పూర్తిచేసిన‌వారు ఏసీసీఏ కోర్సులో తొమ్మిది పేప‌ర్ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

* మా అమ్మాయి ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. బీయూఎంఎస్‌ చేయించాలని కోరిక. అర్హత వివరాలను తెలియజేయండి. రెగ్యులర్‌ చదువుతోపాటు ఉర్దూనూ దూరవిద్య ద్వారా చేయడం కుదురుతుందా? - ఎస్‌.ఎండీ యూనుస్‌, కర్నూలు

యునానీ చికిత్సకు దాదాపు ఆరు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. బ్యాచిలర్స్‌ ఇన్‌ యునానీ మెడికల్‌ సైన్సెస్‌ (బీయూఎంఎస్‌) కోర్సు చదవాలనుకునేవారు ఇంటర్‌ (10+2)లో బైపీసీ చదవాల్సి ఉంటుంది. బీయూఎంఎస్‌ కోర్సు వ్యవధి అయిదేళ్ల ఆరు నెలలు. ఇందులో చివరి ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఈ కోర్సును సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం) వారు రెగ్యులేట్‌ చేస్తారు. కోర్సును పూర్తిచేసిన విద్యార్థిని హకీమ్‌ అని పిలుస్తారు. పదో తరగతి వరకు ఉర్దూను ఒక సబ్జెక్టుగా చదివుండాలి లేదా ఇంటర్‌లో ఉర్దూను ఒక సబ్జెక్టుగా లేదా ఆప్షనల్‌గా చదివినవారు మాత్రమే అర్హులు. ఎందుకంటే ఈ కోర్సును ఉర్దూ మాధ్యమంలోనే అందిస్తారు.
మీ అమ్మాయి విషయంలో మీరు ఉర్దూ ఆప్షనల్‌గా ఉన్న విద్యాలయంలో చదివించడం శ్రేయస్కరం. మెరిట్‌ (10+2) ఆధారంగా సాధారణంగా బీయూఎంఎస్‌ కోర్సులో ప్రవేశ అర్హత లభిస్తుంది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా దూరవిద్య పాఠశాల స్థాయిలో చేయడం కుదురుతుంది. ముఖ్యంగా విద్యార్థి తనకిష్టమైన రంగంలో అడుగుపెట్టి కృషి చేస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.

* పదో తరగతి చదువుతున్నాను. అగ్రికల్చర్‌పై ఆసక్తి ఉంది. ఇంటర్‌, ఆపై ఏ గ్రూపులు ఎంచుకోవాలి? అందించే కళాశాలలేవి? భవిష్యత్తు ఎలా ఉంటుంది? - ఇ. అంజి నాయక్‌

మనది వ్యవసాయాధారిత దేశం కాబట్టి ఈ రంగంలో అభ్యర్థులకు అపార విద్య, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ఇంటర్‌ (10+2)లో బైపీసీ చదివినవారు డిగ్రీలో అగ్రికల్చర్‌ రంగాన్ని ఎంచుకోవచ్చు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ద్వారా బీఎస్‌సీ (అగ్రికల్చర్‌)లో ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, గుంటూరు, అనుబంధ కళాశాలలు ఈ కోర్సును అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌) వారు నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌)లో ఐసీఏఆర్‌ సంస్థల్లో సీటు సాధించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కోర్సు పూర్తి చేసినవారు అగ్రోనమిస్ట్‌, ఫుడ్‌ ఇంజినీర్‌, సాయిల్‌ సైంటిస్ట్‌, ఫార్మ్‌ షాప్‌ మేనేజర్‌ వంటి వివిధ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

* బీఎస్‌సీ (ఎంపీసీ) పూర్తిచేశాను. ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చేయాలనుంది. నేను అర్హుడినేనా? అందించే కళాశాలల వివరాలను తెలపండి. - చందన్‌ రెడ్డి

నేర పరిశోధనలో విజ్ఞాన సూత్రాలను వర్తింపజేసి, సాధారణ దృష్టిని తప్పించుకునే ఆధారాలను కనుక్కొనే శాస్త్రమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అప్లయిడ్‌ సైన్స్‌ లేదా వృక్ష శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసినవారికి ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివే అర్హత ఉంటుంది. కాబట్టి ఈ కోర్సు చేయడానికి మీరు అర్హులే. పీజీ స్థాయిలో ఈ కోర్సును అమిటి యూనివర్సిటీ, గల్గోతియా యూనివర్సిటీ, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ అందిస్తున్నాయి. పరిశీలన నైపుణ్యాలు, సహజంగా పరిశోధించే స్వభావం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ వృత్తిలో రాణిస్తారు.

* బి.ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఫార్మాలో పీజీ చేసినా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు దొరకవని విన్నాను. నిజమేనా? బి.ఫార్మసీ తరువాత బ్యాంకు, ఇతర ఉద్యోగాల పోటీపరీక్షలు రాద్దామనుకుంటున్నా. నాకు అర్హత ఉంటుందా? లేదా బి.ఫార్మసీ పూర్తయ్యాక ఏ కోర్సులు ఎంచుకుంటే మేలో సూచించండి. - ఎస్‌. రమేష్‌, రేపల్లె, గుంటూరు

ఫార్మా కళాశాలలు భారీగా పెరగడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. దీనివల్ల బి.ఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలు తగ్గాయన్నమాట కొంతవరకూ వాస్తవమే. కానీ ఫార్మా రంగం అభివృద్ధి, బహుళజాతి సంస్థలు మనదేశానికి రావడం ఫార్మా విద్యార్థులకు శుభపరిణామం. వీటివల్ల రిసెర్చ్‌ ఓరియెంటెడ్‌ ఉద్యోగావకాశాలు మెండుగానే ఉన్నాయి. విద్యార్థి తన డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో పరిశోధనాత్మకంగా విద్యను అభ్యసిస్తే ఉద్యోగాలను మంచి జీతంతో అందిపుచ్చుకోవచ్చు. బి.ఫార్మసీ చదివినవారు కూడా డిగ్రీ అర్హతగా ఉన్న బ్యాంకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫార్మకోవిజిలెన్స్‌, మెడికల్‌ కోడింగ్‌ వంటి అదనపు కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలను పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు మెడికల్‌ స్టోర్‌ను స్థాపించుకుని, వ్యాపార రంగంలోకి అడుగు పెట్టవచ్చు. కాబట్టి ఎక్కువగా మధనపడకుండా మీ కోర్సు వర్క్‌పై దృష్టిసారించండి.

* బీఎస్‌సీ (ఎంపీసీ) పూర్తిచేశాను. ఆర్కిటెక్చర్‌పై ఆసక్తి ఉంది. నాకున్న అవకాశాలేంటి? ప్రవేశపరీక్షలు, అందించే కళాశాలలు, ఫీజు వివరాలను తెలియజేయగలరు. - ఎన్‌. సాయితేజ, సిద్ధిపేట

ఆర్కిటెక్చర్‌ చదవాలనుకునేవారు 10+2లో మేథ్స్‌, ఫిజిక్స్‌ అభ్యసించి ఉండాలి. నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌ (ఎన్‌ఏటీఏ) వారు నిర్వహించే ప్రవేశపరీక్ష ద్వారా బి.ఆర్క్‌లో ప్రవేశాన్ని పొందవచ్చు. ఎలాగూ మీరు డిగ్రీ పూర్తిచేశారు కాబట్టి, ఒకసారి ఆలోచించుకుని అడుగు వేయడం శ్రేయస్కరం. బి.ఆర్క్‌ కోర్సుకు అయిదేళ్ల వ్యవధి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, ఐఐటీ రూర్కీ, ఎన్‌ఐటీ తిరుచ్చి వంటి ప్రసిద్ధ విద్యాసంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. సంబంధిత విద్యాలయాన్ని బట్టి కోర్సు ఫీజులో మార్పు ఉంటుంది.

* పదో తరగతి చదువుతున్నాను. వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌, యానిమేషన్‌పై ఆసక్తి. ఇంటర్‌, ఆపై ఏ కోర్సులు ఎంచుకోవడం మేలు? - ఎన్‌. ధృవ సాద్విక్‌

యానిమేషన్‌ రంగంలో చేరాలనుకునేవారికి కంప్యూటర్‌ పరిజ్ఞానం, వైవిధ్యంగా ఆలోచించే ధోరణి, సృజనాత్మకత వంటి ప్రధాన నైపుణ్యాలుండాలి. మల్టీమీడియా రంగం అభివృద్ధి చెందడంతో యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌, గ్రాఫిక్స్‌ నిపుణులకు గిరాకీ ఏర్పడింది. ఈ రంగంలో గేమింగ్‌, డిజైన్‌, వీఎఫ్‌ఎక్స్‌, 3డి యానిమేషన్‌, మిక్సింగ్‌, ఎడిటింగ్‌, డిజైనింగ్‌ విజువల్‌ ఆర్ట్స్‌ వంటి వివిధ విభాగాలు ఉన్నాయి. విద్యార్థి తన ఆసక్తినిబట్టి కోర్సును/ రంగాన్ని ఎంచుకోవాలి.
10+2లో పెయింటింగ్‌ అండ్‌ ఆర్ట్స్‌ను ఒక ఐచ్ఛికంగా ఎంచుకోవడం మంచిది. మాయా అకాడమీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్స్‌ (ఎంఏఏసీ), ఎరెనా అకాడమీ, షాఫ్ట్‌ యానిమేషన్‌ వంటి ప్రైవేటు సంస్థలు ఈ రంగంలో శిక్షణను అందిస్తున్నాయి.

* నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఆర్మీల్లో ఉన్నత క్యాడర్‌లో చేరాలంటే ఎలా ముందడుగు వేయాలి? ఎన్‌డీఏ, డిఫెన్స్‌ పరీక్షల గురించి తెలుపగలరు. - స్వరూప్‌, మిర్యాలగూడ

సాధారణంగా ఒక వ్యక్తి ఉన్నత క్యాడర్‌ (నేవీ/ ఏర్‌ఫోర్స్‌/ ఆర్మీ)లో చేరాలంటే అకంఠిత దీక్ష, శ్రమ, గురి కలిసి ఉండాలి. ఆర్మీలో ముఖ్యంగా మూడు రకాల ఆఫీసర్‌ ర్యాంకులు ఉంటాయి. నాన్‌ కమిషన్‌ ఆఫీసర్‌ (సిపాయి నుంచి హవిల్దార్‌)లో నాలుగు స్థాయులు ఉంటాయి. తరువాతది జూనియర్‌ కమిషన్‌ ఆఫీసర్‌ ర్యాంకులు (నాయిబ్‌ సుబేదార్‌, సుబేదార్‌, సుబేదార్‌ మేజర్‌). ఇక మూడోది, ఉన్నతమైనది కమీషన్డ్‌ ఆఫీసర్‌ ర్యాంకులు (లెఫ్టినెంట్‌, కెప్టెన్‌, మేజర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌, కల్నల్‌, బ్రిగేడియర్‌, మేజర్‌ జనరల్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌, జనరల్‌, ఫీల్డ్‌ మార్షల్‌). వీటిలో అన్నింటి కంటే ఉన్నతమైన క్యాడర్‌/ ర్యాంకు ఫీల్డ్‌ మార్షల్‌. ఇప్పటివరకూ ఈ ర్యాంకును ఇద్దరు మాత్రమే అందుకున్నారు. ప్రమోషన్‌ ద్వారా పై ర్యాంకులను చేరుకోవచ్చు.
ఎన్‌డీఏ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ) వారు నిర్వహించే పరీక్ష ద్వారా అభ్యర్థులు నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఆర్మీల్లోకి ప్రవేశాన్ని పొందవచ్చు. ఈ పరీక్షలకు ప్రధాన (నేవీ, ఏర్‌) అర్హత 10+2లో మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్మీలో ప్రవేశానికి 10+2లో ఏ సబ్జెక్టు చదివినవారైనా అర్హులే. ప్రవేశపరీక్ష ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షను నిర్వహించి ఫిట్‌ అని తేలాక సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డువారు ఇంటెలిజెన్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా 10+2 కేడెట్‌ ఎంట్రీని ఆర్మీ/ నేవీ/ ఏర్‌ఫోర్స్‌లో కల్పిస్తారు.

* ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్‌ అవ్వాలని నాకు ఆసక్తి. దీనికి ఏం చదవాలి? - మనీష, తిరువూరు

ఉపాధ్యాయ వృత్తిమీద మీకున్న మక్కువకు అభినందనలు. సాధారణంగా ఈ వృత్తిలో ప్రిన్సిపల్‌ (ప్రభుత్వ కళాశాలకు) అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాలంటే సంబంధిత పీజీ సబ్జెక్టులో యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ వారు నిర్వహించే నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇంటర్‌ కళాశాలలో చేరడానికి నెట్‌ రాయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఈ వృత్తిలో కళాశాల ప్రిన్సిపల్‌ కావడానికి ముఖ్య నియమం సీనియారిటీ అని చెప్పుకోవాలి. పీహెచ్‌డీ పట్టా పొందినవారికి త్వరగా ఇతరులతో పోలిస్తే ప్రిన్సిపల్‌ అయ్యే శాతం ఎక్కువ. ప్రమోషన్‌ ద్వారా వివిధ హోదాలను దాటుకుంటూ ప్రిన్సిపల్‌ హోదాను సాధించుకోవచ్చు.

* యానిమేషన్‌ రంగంలో చేరాలంటే ఏ అర్హతలుండాలి? అందులో ఏ కోర్సులుంటాయి? ఉపాధి అవకాశాలు బాగుంటాయా? ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వివరాలను తెలపండి. - మధు, నూజివీడు

యానిమేషన్‌ రంగంలో చేరాలనుకునేవారికి కనీస కంప్యూటర్‌ అవగాహన, వైవిధ్యంగా ఆలోచించే ధోరణి, సృజనాత్మకత వంటి ప్రధాన నైపుణ్యాలుండాలి. మల్టీమీడియా రంగం అభివృద్ధి చెందడంతో యానిమేషన్‌ నిపుణులకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ రంగంలో గేమింగ్‌ డిజైన్‌, వీఎఫ్‌ఎక్స్‌, 3డీ యానిమేషన్‌, మిక్సింగ్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, విజువల్‌ ఆర్ట్స్‌ వంటి వివిధ విభాగాలుంటాయి. అభ్యర్థులు ఆసక్తిని బట్టి కోర్సునూ, రంగాన్నీ ఎంచుకోవచ్చు. ఈ కోర్సులో చేరాలంటే 10+2 పూర్తిచేసి ఉండాలి.
ప్రభుత్వ సంస్థలు ఈ కోర్సును అందించడం లేదు. మాయ అకాడమీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్స్‌ (ఎంఏఏసీ), ఎరీనా అకాడమీ, షాప్ట్‌ యానిమేషన్‌ సంస్థలు ప్రైవేటు రంగంలో ట్రెయినింగ్‌, ప్లేస్‌మెంట్లను అందిస్తున్నాయి. ఉపాధిపరంగా గ్రాఫిక్‌ డిజైనర్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్పెషలిస్ట్‌, గేమింగ్‌ గ్రాఫిక్స్‌ ఇంజినీర్‌, యానిమేషన్‌ ఎక్స్‌పర్ట్‌ వంటి అవకాశాలుంటాయి.

* ఎథికల్‌ హ్యాకర్‌ అవ్వాలంటే కనీస విద్యార్హత ఏమిటి? దీనిలో ఏయే కోర్సులు, ఎక్కడ అందుబాటులో ఉంటాయి? - మృణాళిని, ముసునూరు

హానికర హ్యాకర్లు చేయదలచుకునే దుశ్చర్యలను ముందుగానే పసిగట్టి కంప్యూటర్‌, సమాచార వ్యవస్థల బలహీనతలు, దుర్భలాలను గుర్తించే చర్యను చట్టపరంగా సాగించడమే ఎథికల్‌ హ్యాకింగ్‌. ఈ కోర్సును చేయాలనుకునేవారికి కంప్యూటర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుండటం లాభిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రైవేటు కోచింగ్‌ సంస్థలు ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణనిస్తున్నాయి. ముఖ్యంగా ఈసీ కౌన్సిల్‌వారు అందిస్తున్న సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ (సీఈహెచ్‌;వీ9) కోర్సు ప్రముఖమైంది. ఈ పరీక్షలో 125 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. నాలుగు గంటల వ్యవధిలో పరీక్షను పూర్తిచేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.eccouncil.org ను సందర్శించవచ్చు. ప్రభుత్వ సంస్థలు ఈ కోర్సును అందించడం లేదు.

* బీఆర్క్‌ కోర్సులో చేరితే అవకాశాలెలా ఉంటాయి? - శ్రీరామ్‌, సింగరాయకొండ

బీఆర్క్‌ చదివినవారు వివిధ నిర్మాణాల ప్లానింగ్‌, డిజైనింగ్‌, నిర్మాణం, సూపర్‌విజన్‌ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీళ్ల అవసరం ఎంతగానో ఉంది. ప్రధానంగా స్పెషల్‌ డిజైనింగ్‌, ఆస్థటిక్స్‌, సేఫ్టీ మేనేజ్‌మెంట్‌, వివిధ స్ట్రక్చర్‌ నిర్మాణాల్లో వీరిది ప్రధాన పాత్ర. వీరు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఆర్కిటెక్చరల్‌ ఇంజినీర్‌, డిజైనర్‌, సూపర్‌వైజర్‌, సైట్‌ ఇంజినీర్‌గా చేయవచ్చు లేదా సొంతంగా ప్రాక్టీసును కూడా పెట్టుకోవచ్చు. మనదేశంలో నాటా (నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌) పరీక్ష ద్వారా ప్రధాన విద్యాసంస్థల్లో బీఆర్క్‌లో ప్రవేశాన్ని పొందవచ్చు.

పైలట్‌ అవ్వాలని నాకు అభిలాష. దీనికి కావాల్సిన విద్యార్హతలూ, ఫిట్‌నెస్‌ ప్రమాణాలు, శిక్షణ సంస్థలు, వాటి సుమారు ఫీజు వివరాలను తెలపగలరు. - శ్రీకృష్ణ, వరంగల్‌

పైలట్‌ అవ్వాలనుకునేవారు 10+2ను మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లతో పూర్తిచేసినవారు అర్హులు. మనదేశంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)వారు పైలట్‌ లైసెన్స్‌ను జారీ చేస్తారు. డీజీసీఏ వారి అనుబంధ, గుర్తింపు పొందిన ఫ్లయింగ్‌ స్కూల్‌ నుంచి శిక్షణ పొందినవారికి పైలట్‌ లైసెన్స్‌ను మంజూరు చేస్తారు.
పైలట్‌ అవ్వాలంటే ఫిట్‌నెస్‌పరంగా క్లాస్‌-2 మెడికల్‌ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థి ఫిట్‌గా ఉన్నట్లు తేలిన తరువాతే ఫ్లయింగ్‌ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్‌ ట్రైనింగ్‌ ఖర్చుతో కూడుకున్నది. ఫ్లయింగ్‌ స్కూల్‌నుబట్టి ఈ కోర్సుకు సుమారుగా రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ ఖర్చు కావచ్చు.
ఇందిరాగాంధీ ఫ్లయింగ్‌ స్కూల్‌ మనదేశంలో ప్రఖ్యాత పైలట్‌ ట్రైనింగ్‌ సంస్థ. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఫ్లయింగ్‌ ఏవియేషన్‌ అకాడమీ, వింగ్‌ ఏవియేషన్‌ మొదలైన సంస్థలు డీజీసీఏ అనుమతితో పైలట్‌ శిక్షణను అందిస్తున్నాయి.

* డిగ్రీ పూర్తిచేశాను. వార్తా విలేఖరి (న్యూస్‌ రిపోర్టర్‌) కావాలనుంది. ఈ కోర్సును అందించే సంస్థలు, అర్హతల వివరాలను తెలియజేయండి. దూరవిద్య ద్వారా చేయడం సాధ్యమేనా? - ఎల్‌. జీవన్‌, హన్మకొండ

న్యూస్‌ రిపోర్టర్‌గా స్థిరపడాలనుకునేవారు జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌లో కోర్సు చేస్తే మేలు. విలేఖరి కావాలనుకునేవారు సామాజిక సమస్యలపట్ల అవగాహన, వర్తమాన వ్యవహారాలను తెలుసుకోవడంపట్ల ఆసక్తి, భావాన్ని నేర్పుతో ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో అందించే నైపుణ్యం ఉండాలి. భాష, పదాలపై పట్టు పెంచుకోవాలి.
రిపోర్టింగ్‌ వివిధ విభాగాలైన క్రైమ్‌, ఇన్వెస్టిగేటివ్‌ రిసెర్చ్‌, బిజినెస్‌, అంతర్జాతీయ, ప్రాంతీయ, క్రీడా వంటి విభాగాల్లో చేయవచ్చు. దూరవిద్యలో ఇగ్నో ‘మాస్టర్స్‌ ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌’, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ‘ఎంఏ- జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌’ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని చదవడానికి డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.

మా అమ్మాయి ఇంటర్‌ (ఎంపీసీ) చదువుతోంది. తనకు ఫోరెన్సిక్‌ సైన్స్‌లో కానీ, ఆంగ్లంలో కానీ పై చదువులు చదవాలనుంది. ఏది మేలు? అందించే సంస్థల వివరాలను తెలపండి.? - శ్రీనివాసరావు

నేర పరిశోధన పట్ల ఆసక్తి, ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించే, వివిధ కోణాల్లో సమస్యలను సాధించే నేర్పు ఉంటే ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సును ఎంచుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో బీఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సును అమిటీ యూనివర్సిటీ, గల్గోతియా యూనివర్సిటీ, డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీ, తెలుగు రాష్ట్రాల్లో.. రాజా బహదూర్‌ వెంకట్‌ రామ్‌రెడ్డి ఉమెన్స్‌ కళాశాల అందిస్తున్నాయి.
ఆంగ్లంలో పై చదువులకు.. భాషపై ఆసక్తి ఉంటే సరిపోతుంది. ఆంగ్లంలో డిగ్రీ చేయాలనుకుంటే బీఏ (లిటరేచర్‌), లింగ్విస్టిక్స్‌, కంపారిటివ్‌ లిటరేచర్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. మనదేశంలో ఇఫ్లూ (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ), యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌, దిల్లీ వంటి ప్రముఖ సంస్థలు అందిస్తున్నాయి. ప్రతీ కోర్సుకూ తనదైన ప్రత్యేకత ఉంటుంది. దానికి తగ్గ అవకాశాలూ తప్పనిసరిగా ఉంటాయి. మీ అమ్మాయికి దేనిపై ఎక్కువ ఆసక్తి ఉంటే దాన్ని ఎంచుకోమనండి.

ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేశాను. దూరవిద్య ద్వారా సంబంధిత కోర్సులో పీజీ చేద్దామనుకుంటున్నా. అందించే సంస్థల వివరాలను తెలపండి. - కె.వి. నాయుడు, శ్రీకాకుళం

ప్రొఫెషనల్‌ కోర్సులైన ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌, ఇతర వృత్తివిద్యా కోర్సులను రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడమే శ్రేయస్కరం. మనదేశంలో ఆర్కిటెక్చర్‌ కోర్సులను దూరవిద్య ద్వారా ఏ విశ్వవిద్యాలయాలూ అందించడం లేదు.
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీ (బైరిసర్చ్‌) (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) వారు పార్ట్‌టైం విధానంలో ఎంఆర్క్‌ కోర్సును అందిస్తున్నారు. బి.ఆర్క్‌ పూర్తిచేసినవారు అర్హులు. పీజీఈసెట్‌ ద్వారా అర్హత కల్పిస్తారు. మరిన్ని వివరాలకు jnafau.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వివిధ ఆస్ట్రేలియన్‌, అమెరికా విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ దూరవిద్యా విధానంలో ఈ కోర్సును అందిస్తున్నాయి. కానీ కోర్సును ఎంచుకునే ముందు దాని వాలిడిటీ, గుర్తింపులను తెలుసుకుని నిర్ణయం తీసుకోండి.

డిగ్రీ చదివాను కానీ కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఇప్పుడు బీకాం పరీక్షలను సింగిల్‌ సిట్టింగ్‌లో రాద్దామనుకుంటున్నాను. కుదురుతుందా? ఇలా చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు నాకు అర్హత ఉంటుందా?

డిగ్రీలో మిగిలిన సబ్జెక్టులను పూర్తి చేయడానికి.. మీరు డిగ్రీ చదివిన కళాశాల లేదా అనుబంధ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించి, పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకోండి. ఇలా రాసి మీ డిగ్రీని పూర్తి చేయవచ్చు. ఈ విధంగా పూర్తి చేస్తే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లభించకపోవడం అంటూ ఉండదు. అలా కాకుండా మొత్తం బీకాం పరీక్షలను వేరే యూనివర్సిటీ ద్వారా వన్‌ సిట్టింగ్‌లో చేయాలనుకుంటేనే ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, మీరు మిగిలిపోయిన మీ సబ్జెక్టులను చదివిన విద్యాలయం/ విశ్వవిద్యాలయం నుంచి రాసి, ఉత్తీర్ణులవ్వండి. తద్వారానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత సాధిస్తారు.

నాకు పోలీసు అవ్వాలని కోరిక. ఇటీవల జరిగిన రైల్వే ఉద్యోగానికి నిర్వహించిన మెడికల్‌ టెస్టులో నాకు కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉందని తెలిసింది. దాంతో ఉద్యోగం కోల్పోయాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోలీసు ఉద్యోగాలకైనా నాకు అర్హత ఉంటుందా? అసలు నేను ఏయే ఉద్యోగాలకు అర్హుడినో తెలపగలరు?

మీ విద్యార్హతలను తెలుపలేదు. పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగానికి కనీస అర్హత 10+2. ఎస్‌.ఐ., ఎ.ఎస్‌.ఐ. ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్‌ను కనీస అర్హతగా పరిగణిస్తారు. కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తారు. మీకు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఆఫీసులో పనిచేసే ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. మీకు అర్హత ఉంటే.. గ్రూప్‌ - 1, 2, 3, 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్నా విజయాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. అందుకు తగ్గ సన్నద్ధతను ప్రారంభించండి. తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు.

ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్‌ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్‌ కాకుండా కొత్త కోర్సులను చదవాలనుకుంటున్నాను. నాకు అందుబాటులో ఉన్న అవకాశాలను తెలపండి. ?

విద్యార్థులందరూ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లవైపు పరుగులెడుతున్న ఈ తరుణంలో కొత్త కోర్సులను ఎంచుకోవాలనుకున్న మీ అభిరుచికి అభినందనలు. ప్రతీ కోర్సూ తనదైన ప్రత్యేకతలతో చదివినవారికి అవకాశాలను కల్పిస్తుంది. ముందుగా మీ అభిరుచికి తగ్గ, ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. మీకు వంటలపట్ల ఆసక్తి ఉంటే 10+2 తర్వాత కలినరీ మేనేజ్‌మెంట్‌ కోర్సులనూ, టూరిజం, కొత్త ప్రదేశాలపట్ల ఆసక్తి ఉంటే బీఎస్‌సీ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌నూ చదవొచ్చు. కళలపై ఆసక్తి ఉంటే బ్యాచిలర్స్‌ ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో, విద్యారంగం, బోధనపట్ల ఆసక్తి ఉంటే డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌లో చేరవచ్చు. నిశితంగా పరిశీలించే తత్వం, సమయస్ఫూర్తి మీ సొంతమై, నేర సంఘటనలపై అధ్యయనం చేయాలనుకుంటే ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సు ఎంచుకోవచ్చు. ఏ రంగంలో అయినా రాణించాలంటే ముఖ్యంగా దాని పట్ల ఆసక్తి, ఇష్టం పెంచుకుని కృషి చేయడం తప్పనిసరి. అప్పుడే విజయం సాధించగలరు.

బీఎస్‌సీ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాను. నాకు ప్రొఫెషనల్‌ చెఫ్‌ కావాలనుంది. చదవాల్సిన కోర్సులు, అందించే సంస్థల వివరాలను తెలుపగలరు.

చెఫ్‌కి కావాల్సిన ముఖ్యమైన అర్హత- కుకింగ్‌ పట్ల ఆసక్తి, నమ్మకం, నిర్వహణా నైపుణ్యాలు. వీటితోపాటు కిచెన్‌లో పనిచేసిన అనుభవమూ ఉండాలి. డిగ్రీ మాత్రమే ముఖ్యం అనుకుంటే అపోహే. దీనికి సంబంధించి కోర్సులు చేయాలనుకుంటే.. కలినరీ ఆర్ట్స్‌లో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను చేయొచ్చు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీజేఈఈ) 10+2 అర్హతతో ఉమ్మడి రాతపరీక్షను నిర్వహిస్తోంది. దీని ద్వారా దేశంలోని 21 కేంద్ర ప్రభుత్వ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ, వాటి అనుబంధ ప్రయివేటు సంస్థల్లో బీఎస్‌సీ- హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
మీరు డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుంచి కలినరీ క్రాఫ్టింగ్‌, కలినరీ ఆర్ట్స్‌లో సర్టిఫికేట్‌ లేదా డిప్లొమా కోర్సులు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. చెఫ్‌ కావడానికి ముఖ్యంగా కిచెన్‌లో పనిచేసిన అనుభవం బాగా తోడ్పతుంది. కొత్తదనం, ఆసక్తీ ముఖ్యమే.

దూరవిద్య విధానంలో డిగ్రీ 44% మార్కులతో 2010లో పూర్తి చేశాను. నా మార్కుల శాతాన్ని ఓడీఈ (ఆన్‌ డిమాండ్‌ ఎగ్జామినేషన్‌) ద్వారా పెంచుకోవాలనుకుంటున్నాను. కుదురుతుందా? దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు.

ఓడీఈ (ఆన్‌ డిమాండ్‌ ఎగ్జామినేషన్‌) ముఖ్య ఉద్దేశం- కోర్సు వ్యవధిని పూర్తిచేసుకుని కూడా టర్మ్‌ ఎండ్‌ ఎగ్జామినేషన్‌ కోసం వేచిచూస్తూ, వీలును బట్టి పరీక్షలను రాయాలనుకునే వారికి వీలును కల్పించడం. పరీక్ష ఫెయిల్‌ అయినవారు సమయం వృథా కాకుండా తిరిగి త్వరగా పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలనుకునేవారికి వీలు కల్పించే ప్రయత్నమిది. ఒకసారి కోర్సులో ఉత్తీర్ణత పొంది, సంవత్సరాలు గడిచిన తర్వాత మార్కులు పెంచుకునే మార్గం మాత్రం కాదు.
మార్కులను పెంచుకోవడానికి విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షల ద్వారా అవకాశం కల్పిస్తాయి. వీటిని రాసి మార్కులు పెంచుకోవాలనుకుంటే సంబంధిత విశ్వవిద్యాలయాల నిబంధనల ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశం డిగ్రీ పాసైన మూడేళ్లలోపు మాత్రమే (విశ్వవిద్యాలయాన్ని బట్టి) ఉంటుంది. మరిన్ని వివరాలకు ఒకసారి మీరు డిగ్రీ (దూరవిద్య) చదివిన విశ్వవిద్యాలయాన్ని సంప్రదించండి.

ఇంటర్‌ (బైపీసీ) పూర్తిచేశాను. బీఎస్‌సీ - ఎంఎల్‌టీ చేయాలనుంది. కోర్సు, అందించే సంస్థల వివరాలను తెలియజేయండి.

బీఎస్‌సీ- మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సు చేయదలచిన విద్యార్థులు ఇంటర్‌ బైపీసీ లేదా ఒకేషనల్‌ కోర్స్‌ ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ పూర్తిచేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.ఆర్‌. హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణలో కాళొజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌, వాటి అనుబంధ కళాశాలల్లో ఈ కోర్సును అభ్యసించడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రకటన విడుదల చేస్తాయి. రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ ఆశ్రమ్‌ కాలేజ్‌, ఏలూరు; గుంటూరు మెడికల్‌ కళాశాల, గుంటూరు; షాదన్‌ కళాశాల, హైదరాబాద్‌; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ వంటివి ఈ కోర్సును అందిస్తున్న ముఖ్యమైన విద్యాసంస్థలు.

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. కొందరి స్ఫూర్తితో సీబీఐ ఆఫీసర్‌ కావాలనుకుంటున్నాను. అందుకు నేనేం చేయాల్సి ఉంటుంది?

సీబీఐ అధికారి కావాలనుకునేవారు నిశితంగా విషయాన్ని శోధించడం, విశ్లేషణ నైపుణ్యాలు, సమస్య పరిశోధన, పరిష్కారం, బృందంతో పనిచేయగల నైపుణ్యాలు, నిజాయతీ, సమయస్ఫూర్తి, దూరదృష్టి వంటి లక్షణాలను అలవరచుకోవాలి. డిగ్రీ చదివినవారు సీబీఐ ఉద్యోగాలకు అర్హులు. ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాన్ని కల్పిస్తారు. కాబట్టి ఇప్పటినుంచే అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులపై దృష్టిసారించండి. వార్తాపత్రికలు, టీవీ వార్తలను ఎప్పటికప్పుడు అనుసరిస్తూ ఉండండి. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపైనా అవగాహనను పెంచుకోండి.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాను. నాకు వ్యవసాయ రంగంపై ఆసక్తి. దూరవిద్య ద్వారా కోర్సు అందించే సంస్థల వివరాలను తెలపండి?

వ్యవసాయంపై మీకున్న ఆసక్తికి అభినందనలు. మీరు గ్రాడ్యుయేషన్‌లో ఏం చదివారో తెలియజేయలేదు. మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివివుంటే ఎంటెక్‌లో అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ చదివి, వ్యవసాయంలో ఉపయోగపడే పరికరాల తయారీలో పాల్గొనవచ్చు. లేదా.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు కాబట్టి ఏదైనా యాప్‌ లాంటి టూల్‌ను తయారుచేసి వ్యవసాయ రంగానికి తోడ్పడే ప్రయత్నం చేయండి. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ చేయూతను ఇచ్చినవారవుతారు. ఇక కోర్సుల విషయానికొస్తే.. వెల్లింగ్‌కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ దూరవిద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ అండ్‌ అగ్రిబిజినెస్‌, ఇగ్నో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ పాలసీ కోర్సులను అందిస్తున్నాయి. మీకు అర్హత ఉన్నదాన్ని బట్టి కోర్సును ఎంచుకోండి.

ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్నాను. ఫోరెన్సిక్‌ లాపై ఆసక్తి ఉంది. అందించే కళాశాలలు, అర్హత వివరాలను తెలియజేయండి.

ఫోరెన్సిక్‌ విజ్ఞానశాస్త్ర సాయంతో నేర ఘటనలపై దర్యాప్తు చేయడానికీ, న్యాయస్థానంలో నేరస్థుల ప్రాసిక్యూషన్‌లో సాక్ష్యాలను సేకరించడానికీ ఉపయోగపడే న్యాయశాస్త్ర అధ్యయనమిది. మనదేశంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వారు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారికి ఎంఏ (క్రిమినాలజీ) కోర్సును అందిస్తున్నారు. ఐఎఫ్‌ఎస్‌ ఎడ్యుకేషన్‌వారు ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ క్రిమినాలజీలో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులనూ, పంజాబ్‌ యూనివర్సిటీ వారు డిప్లొమా ఇన్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ అండ్‌ క్రిమినాలజీ కోర్సులనూ అందిస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో కేవలం ఫోరెన్సిక్‌ లాపైనే కోర్సులు అందించే సంస్థలు తక్కువనే చెప్పాలి. విదేశాల్లో ఈ కోర్సుకు మంచి స్పందన ఉంది. మనదేశంలోని కొన్ని సంస్థలూ ఇప్పుడిప్పుడే ఈ కోర్సుపై దృష్టిపెడుతున్నాయి. త్వరలో అందుబాటులోకి రావొచ్చు.

డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చేస్తున్నాను. దీంతోపాటు బ్యాచిలర్‌ ఇన్‌ లైబ్రరీ సైన్స్‌ను కూడా ఒకేసారి దూరవిద్యలో చేద్దామనుకుంటున్నాను. కుదురుతుందా?

ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను లేదా పీజీ కోర్సులను, ఒక డిగ్రీ, ఒక పీజీ కోర్సును విద్యార్థులు అభ్యసించినట్లయితే ఏదేని ఒక కోర్సు మాత్రమే పరిగణనలోకి వస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి తగినదాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సంబంధిత ఉద్యోగ ప్రకటననుబట్టి మీ విద్యార్హతను వాడుకోవాలి. అంతేతప్ప రెండు కోర్సులనూ ఒకే ఏడాది పూర్తిచేసినట్లు చూపిస్తే కొన్నిసార్లు చిక్కులు ఏర్పడే అవకాశముంది. కొన్ని సంస్థలు ఒక దూరవిద్య కోర్సు, ఒక రెగ్యులర్‌ కోర్సుకు వెసులుబాటు కల్పిస్తాయి. దూరవిద్య కోర్సును అభ్యసించేముందు సంబంధిత విశ్వవిద్యాలయానికి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి ఉన్న విశ్వవిద్యాలయం నుంచే కోర్సును అభ్యసించాలి.

టెక్నికల్‌ కోర్సులను దూరవిద్య ద్వారా చదివితే చెల్లవని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది కదా! మా అమ్మ ఎంఎస్‌సీ కెమిస్ట్రీని 2005లో దూరవిద్య ద్వారా పూర్తిచేసింది. అది చెల్లుతుందా? ఇది ప్రభుత్వ సంస్థల్లో పదోన్నతులపై ప్రభావం చూపించే అవకాశముందా?

సంబంధిత విశ్వవిద్యాలయానికి దూరవిద్య ద్వారా కోర్సులను అందించడానికి యూజీసీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ) వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి లేని విశ్వవిద్యాలయాల్లో కోర్సులను చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. దీనివల్ల ప్రభుత్వ సంస్థల్లో పదోన్నతులపై ప్రభావం ఉండే అవకాశముంది. కాబట్టి, మీ అమ్మగారు ఎంఎస్‌సీ చేసిన విశ్వవిద్యాలయానికి డీఈసీ అనుమతి ఉందో లేదో తెలుసుకోండి. అనుమతి ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు. ఇక సుప్రీంకోర్టు విషయానికొస్తే.. టెక్నికల్‌ కోర్సులు అయినటువంటి ఇంజినీరింగ్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, టౌన్‌ ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ తదితర కోర్సులు అందించడానికి విశ్వవిద్యాలయాలు ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతి పొందని వాటినుంచి పట్టా పొందితే దానికి విలువ ఉండదు. ఏఐసీటీఈ అనుమతిని సాధారణంగా రెగ్యులర్‌ విధానంలో కోర్సులను అందించే సంస్థలకు మాత్రమే ఇస్తారు. ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి లేని మూడు విశ్వవిద్యాలయాలు అందించిన టెక్నికల్‌ కోర్సులను రద్దు చేసింది.

డిగ్రీ (బీజెడ్‌సీ) పూర్తిచేశాను. అగ్రికల్చర్‌పై ఆసక్తి ఉంది. నాకున్న విద్యావకాశాలను తెలియజేయండి. ఈ రంగంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది?

వ్యవసాయంపై మీకున్న ఇష్టానికి అభినందనలు. ప్రతి రంగం ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాల కల్పనలో తమదైన ప్రత్యేకతను కలిగివుంటుంది. కాబట్టి మీరు ఎంచుకున్న రంగంలో పట్టుదలతో శ్రమిస్తే భవిష్యత్తు బాగుంటుంది. బీజెడ్‌సీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారికి ఉన్నతవిద్య పరంగా మంచి అవకాశాలున్నాయి. వీరు ఎంఎస్‌సీలో అందుబాటులో ఉన్న బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌, జువాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ మొదలైన ఐచ్ఛికాలను అభిరుచి మేరకు ఎంచుకోవచ్చు. మీకు అగ్రికల్చర్‌పై ఆసక్తి ఉందన్నారు కాబట్టి.. ప్లాంట్‌ సైన్స్‌, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ పాథాలజీ, ఫారెస్ట్‌ బయోటెక్నాలజీ, ట్రాపికల్‌ ఫారెస్ట్రీ, సాయిల్‌ సైన్స్‌, మైక్రోబియల్‌ ప్లాంట్‌ బయాలజీ వంటి కోర్సులను అభ్యసించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రంగంలో పరిశోధనపరంగా మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అగ్రి బిజినెస్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌, ఐఐఎం అహ్మదాబాద్‌, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఏఏఆర్‌ఎం) వారు అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రికల్చర్‌) కోర్సును అభ్యసించి మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.

బీఎస్‌సీ (కంప్యూటర్స్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు పైలట్‌ కావాలనుంది. ఏ కోర్సులను ఎంచుకోవాలి?

పైలట్‌ కావాలనుకునేవారు 10+2లో మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లను చదవాల్సి ఉంటుంది. మన దేశంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వారు పైలట్‌ లైసెన్స్‌ను జారీ చేస్తారు. వారి అనుబంధ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ద్వారా శిక్షణ పొందినవారికి పరీక్ష నిర్వహించి పైలట్‌ లైసెన్స్‌ అందిస్తారు. ఫ్లయింగ్‌ స్కూల్‌కు దరఖాస్తు చేసుకునే ముందు క్లాస్‌-2 మెడికల్‌ పరీక్ష చేయించుకోవాలి. మెడికల్‌ పరీక్షలో ఆరోగ్యంగా ఉన్నారని తేలిన తరువాతే ఫ్లయింగ్‌ స్కూల్‌కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్‌ శిక్షణ ఖర్చుతో కూడుకున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఫ్లయిటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ, వింగ్స్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు డీజీసీఏ అనుమతితో శిక్షణ అందిస్తున్నారు.

మా అమ్మాయి ఎం.ఫార్మసీ చదువుతోంది. ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా చేయాలనుకుంటోంది. ఎం.ఫార్మసీ తరువాత ఏం చదివితే/ చేస్తే తన కలను సాకారం చేసుకోగలదు?

ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టాలన్న మీ అమ్మాయి ఆలోచన ప్రశంసనీయం. యూజీసీ వారి నిబంధన ప్రకారం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావాలనుకునేవారు సీఎస్‌ఐఆర్‌ నెట్‌ ఉత్తీర్ణులు కావాలి. ఎం.ఫార్మసీ అభ్యర్థులు లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో నెట్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది. నెట్‌ను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కావడానికి కనీసార్హతగా పరిగణిస్తారు. పీజీ తరువాత పీహెచ్‌డీ చేస్తే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశానికి మరింత దోహదపడుతుంది. సంబంధిత విశ్వవిద్యాలయం వారు నిర్వహించే ప్రవేశపరీక్ష- జీప్యాట్‌ ద్వారా లేదా నెట్‌లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఆయా విశ్వవిద్యాలయాల నిబంధనల ప్రకారం పీహెచ్‌డీలో ప్రవేశాన్ని పొందొచ్చు.

బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ కోర్సులను నేరుగా, దూరవిద్య ద్వారా అందించే విశ్వవిద్యాలయాలేవి?

ఏదైనా డిగ్రీ చేసినవారు ఏడాది కాలవ్యవధి గల బ్యాచిలర్‌ ఇన్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (బీఎల్‌ఐఎస్‌సీ) చదవడానికి అర్హులు. మాస్టర్స్‌ ఇన్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ (ఎంఎల్‌ఐఎస్‌సీ) కోర్సు అభ్యసించాలనుకునేవారు డిగ్రీతోపాటు బీఎల్‌ఐఎస్‌సీ కోర్సునూ పూర్తిచేసుండాలి. రెగ్యులర్‌ విధానంలో మనాయిర్‌ కాలేజ్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌- వరంగల్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ వారు ఈ కోర్సులను ప్రవేశపరీక్ష ద్వారా అందిస్తున్నాయి. దూరవిద్య విధానంలో ఆచార్య నాగార్జున, ఇగ్నో, ఎస్‌వీ యూనివర్సిటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

బీఎస్‌సీ (నర్సింగ్‌) నాలుగేళ్ల కోర్సు చేశాను. కానీ నాకు ఎంబీబీఎస్‌ చేయాలని ఉంది. వీలుంటుందా?

ఎంబీబీఎస్‌ చేయదలచుకున్నవారు సీబీఎస్‌సీ వారు నిర్వహించే నీట్‌ను రాయవలసి ఉంటుంది. నీట్‌ జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్‌లో చేరడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష. కనిష్ఠ వయఃపరిమితి 17 ఏళ్లు కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠ వయఃపరిమితి లేదు. 10+2లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల్లో 50% మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షను రాయవచ్చు. దీనిలో వచ్చిన ర్యాంకును బట్టి దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో సీటును పొందవచ్చు. మీరు 10+2లో బైపీసీ చదివుంటే మీకు అర్హత ఉన్నట్లే.

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లపై ఆసక్తి. వీటిని నేర్చుకోవడం వల్ల లాభముంటుందా? ఉద్యోగావకాశాలెలా ఉంటాయి?

మొబైల్‌ రంగంలో నిత్యం చోటుచేసుకునే మార్పులు మనం సంభాషించుకునే తీరు, వ్యాపారం చేసుకునే వేదిక, సమాచారాన్ని ఉపయోగించుకునే విధానాలను నిర్ణయిస్తున్నాయి. రోజువారీ దైనందిన జీవితాన్ని మొబైల్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ లేకుండా వూహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్‌ డివైజెస్‌, ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌లపైనే ఆధారపడి ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్లాట్‌ఫాంలు మొబైల్‌ డెవలపర్‌కు గిరాకీని తెచ్చిపెడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ వృత్తి మార్గాల్లో మొదటి వరుసలో నిలుస్తున్నాయి. ఈ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆధారిత, అభివృద్ధి వేదికల్లో నైపుణ్యం సాధించడం ద్వారా మంచి ప్రొఫెషనల్‌ డెవలపర్‌గా ఎదిగే అవకాశాన్ని పొందవచ్చు.

బీబీఎం చదువుతున్నాను. మాస్టర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ను విదేశాల్లో చేయాలనుంది. దీనికి సంబంధించిన వివరాలు, ఉద్యోగావకాశాలను తెలపండి.

అంతర్జాతీయ వర్తకం ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో మాస్టర్స్‌ చేసిన అభ్యర్థులకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లపట్ల విస్తృత అవగాహన, క్రాస్‌ బోర్డర్‌ నెగోషియేషన్స్‌, స్ట్రాటజీ, బహుళజాతి సంస్థల వ్యూహాత్మక ప్రణాళిక, చట్టపరమైన అంశాల పరిరక్షణ, అంతర్జాతీయ పర్యావరణంలో పనిచేయగలిగే మేనేజీరియల్‌ నైపుణ్యాలను అభ్యర్థుల్లో పెంపొదిస్తుంది. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటే జీఆర్‌ఈ లేదా జీమ్యాట్‌తోపాటు అభ్యర్థి ఆంగ్లభాషా నైపుణ్యాన్ని పరీక్షించే టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌/ పీటీఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. విదేశీ విశ్వవిద్యాలయాలు సాధారణంగా ఫాల్‌ (సెప్టెంబరు), స్ప్రింగ్‌ (జనవరి)ల్లో ప్రవేశాలను కల్పిస్తాయి. కొన్ని సంస్థలు సమ్మర్‌ (మే)లోనూ ప్రవేశాలను కల్పిస్తాయి. సంబంధిత విశ్వవిద్యాలయాన్నిబట్టి దరఖాస్తు గడువులు వేరుగా ఉంటాయి. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో మాస్టర్స్‌ చేసినవారికి మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌, అనలిస్ట్‌, ఇంపోర్ట్‌-ఎక్స్‌పోర్ట్‌ కంప్లయిన్స్‌ స్పెషలిస్ట్‌, ఎకనమిస్ట్‌, ఇంటర్నేషనల్‌ అకౌంటెంట్‌, మార్కెటింగ్‌, స్ట్రాటజీ రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలను పొందవచ్చు.

బీటెక్‌ తర్వాత బ్యాంకింగ్‌లో డిప్లొమా చేశాను. ప్రస్తుతం ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. బ్యాంకింగ్‌లో పీహెచ్‌డీ చేయాలనుంది. నాకు అర్హత ఉందా? అందించే సంస్థల వివరాలను తెలియజేయండి.

సాధారణంగా బ్యాంకింగ్‌లో పీహెచ్‌డీ చేయదలచుకున్నవారు ఎంబీఏ (ఫైనాన్స్‌) లేదా ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. పీహెచ్‌డీ ప్రవేశం పొందాలంటే సంబంధిత విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. మౌఖిక పరీక్షలోనూ విజయం సాధించాలి. పీహెచ్‌డీలో ఫెలోషిప్‌ పొందాలనుకునేవారు యూజీసీ నిర్వహించే నెట్‌-జేఆర్‌ఎఫ్‌ పరీక్ష ఉత్తీర్ణత చెందాలి. బ్యాంకింగ్‌లో పీహెచ్‌డీని విశ్వవిద్యాలయాలు సాధారణంగా ఫైనాన్స్‌ అధ్యాపకుల పర్యవేక్షణలో అందిస్తాయి. కొన్ని ఐఐఎంలు బీటెక్‌ చేసినవారికి కూడా ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌పీఎం)లో క్యాట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తున్నాయి. ఎఫ్‌పీఎం కోర్సును పీహెచ్‌డీ తత్సమాన అర్హతగా పరిగణిస్తారు.

బీఎస్‌సీ (బీజెడ్‌సీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఆ తర్వాత మెడిసినల్‌ బోటనీ (ఆయుష్‌/ ఆయుర్వేదిక్‌) చేయాలనుంది. అందించే కళాశాలల వివరాలను తెలియజేయండి.

మొక్కల ద్వారా మానవ ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఎన్నో. మొక్కల పెంపకం, సంరక్షణ, గుర్తింపు, నాణ్యత నియంత్రణ, కొత్త మొక్కల ఉత్పత్తి, వాటి వైద్య సామర్థ్యం, మేధోసంపత్తుపై దృష్టిసారించే విజ్ఞానశాస్త్రమే మెడిసినల్‌ బోటనీ.
సాధారణంగా పీజీ ఆయుష్‌ కోర్సులు చేయడానికి బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ చేసినవారు అర్హులు. కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా ఎంఎస్‌సీ మెడిసినల్‌ ప్లాంట్స్‌ కోర్సును ఎంచుకోవచ్చు. బుందేల్‌ఖండ్‌ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న ఎంఎస్‌సీ (ఆయుర్వేద ఆల్టర్నేట్‌ మెడిసిన్‌) కోర్సును అయినా ఎంచుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వారు అందించే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మెడిసినల్‌ బోటనీ కోర్సును కూడా అభ్యసించవచ్చు.

 

ఎంఏ, బీఈడీ (సోషల్‌) చేసి, స్కూలు అసిస్టెంట్‌గా (10 సం.) చేస్తున్నాను. ఇప్పుడు ఎంఈడీ చేయాలనుకుంటున్నా. దూరవిద్య ద్వారా చేసే అవకాశం ఉందా? అందించే విశ్వవిద్యాలయాల వివరాలను తెలపండి.

అవకాశం ఉంది. ఎంఈడీ కోర్సును దూరవిద్యలో చేయదలచినవారు సంబంధిత కోర్సును అందిస్తున్న విశ్వవిద్యాలయానికి కోర్స్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ), నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి ఉందని నిర్ధారించుకున్న తరువాతే కోర్సులో చేరాలి. ఈడీ అభ్యసించాలనుకునేవారు బీఈడీని 55% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన పాఠశాల లేదా ఎడ్యుకేషన్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి రెండేళ్ల బోధనానుభవాన్ని కలిగివుండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కుల విషయంలో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. ఇగ్నో (IGNOU), బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వారు దూరవిద్యలో ఎంఈడీ కోర్సును అందిస్తున్నారు. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఏటా మే/ జూన్‌ నెలల్లో ప్రకటన వెలువడుతుంది.

బీఎస్‌సీ (బీజెడ్‌సీ) ఈ ఏడాదే పూర్తైంది. ప్లాంట్స్‌ అండ్‌ ఫారెస్ట్రీలో ఆసక్తి ఉంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాల వివరాలను తెలపండి.

అడవుల నిర్వహణ, సంరక్షణ, మొక్కల పెంపకం, సహజ వనరుల రక్షణ, పర్యావరణ పునరుద్ధరణ, ప్రభుత్వ, ప్రైవేటు అటవీ ప్రాంతాల ప్రణాళిక- వాటి అభివృద్ధి కార్యకలాపాలను చూసుకునే విభాగమే ప్లాంట్స్‌ అండ్‌ ఫారెస్ట్రీ. ప్రభుత్వ రంగంలో యూపీఎస్‌సీ నిర్వహించే ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌) రాసి, సివిల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగాన్ని పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, నర్సరీలు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగ ప్రకటనల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ప్రైవేటు రంగంలో.. ప్లాంటేషన్‌ ఫీల్డ్‌ మేనేజర్‌, నర్సరీ అడ్మినిస్ట్రేటర్‌, ప్రైవేట్‌ ఫారెస్ట్‌ ప్లానింగ్‌ మేనేజర్‌, కన్జర్వేషన్‌ మేనేజర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.

డిగ్రీ (బీఎస్‌సీ) రెండో సంవత్సరం చదువుతున్నాను. ఇంటర్‌వరకూ తెలుగు మాధ్యమంలో పూర్తిచేసి, డిగ్రీ నుంచి ఆంగ్లంలో చదువుతున్నాను. సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలనుకుంటున్నా. ఏ మాధ్యమాన్ని ఎంచుకుంటే మేలు?

సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారికి విషయపరిజ్ఞానం, సమస్యను లోతుగా విశ్లేషించే నేర్పు, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఉండాలి. తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకూ అభ్యసించి ఇంగ్లిష్‌లో, డిగ్రీ వరకూ ఆంగ్లంలో చదివి, తెలుగులో.. సివిల్స్‌ రాసి విజయం సాధించినవారూ ఉన్నారు. ఇటీవల రోణంకి గోపాలకృష్ణ తెలుగు మాధ్యమంలో సివిల్స్‌ రాసి, ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. కాబట్టి మీరు ఏ మాధ్యమంలో భావవ్యక్తీకరణ బాగా చేయగలరో దాన్నే ఎంచుకోండి. ఇంకా డిగ్రీలోనే ఉన్నారు కాబట్టి, ఇప్పటి నుంచే సివిల్స్‌ ప్రాథమిక సన్నద్ధతను మొదలుపెట్టండి.

మా అమ్మాయి బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. తనకు క్లినికల్‌ సైకాలజీలో మాస్టర్స్‌ చేయాలనుంది. ఇందుకు సాధారణంగా డిగ్రీలో సైకాలజీ చదివివుండాలని విన్నాను. తనకేమో ఈ కోర్సులోనే ఆసక్తి ఉంది. వేరే ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా? ఉంటే ప్రవేశపరీక్ష, అందించే కళాశాలలు, విశ్వవిద్యాలయాల వివరాలను తెలియజేయండి.

మానసిక అనారోగ్య స్వభావం, కారణాలు, చికిత్సల అధ్యయనంపై దృష్టి కేంద్రీకరించే మనస్తత్వశాస్త్రమే క్లినికల్‌ సైకాలజీ. మీరు విన్నట్టుగా క్లినికల్‌ సైకాలజీలో మాస్టర్స్‌ చేయాలంటే డిగ్రీలో సైకాలజీ ఒక ఐచ్ఛికం లేదా సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. మీ అమ్మాయికి ఆసక్తి ఉంటే.. ఇదే సబ్జెక్టులో ఎంఎస్‌సీ లేదా ఎంఏ చేయొచ్చు. అమిటీ విశ్వవిద్యాలయం, రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా యూనివర్సిటీలు ఎంఏ/ ఎంఎస్‌సీ (సైకాలజీ) చేసినవారికి ఎంఫిల్‌ (క్లినికల్‌ సైకాలజీ) చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

డెంటల్‌ సర్జన్‌గా చేస్తున్నాను. డిస్కవరీ, నేషనల్‌ జాగ్రఫీ సంస్థల్లో పనిచేయాలని ఆసక్తి. కుదురుతుందా? వాటి అర్హత వివరాలను తెలియజేయండి.

డిస్కవరీ, నేషనల్‌ జాగ్రఫీ సంస్థల్లో వివిధ విభాగాలు ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న విభాగం ఏమిటో తెలియజేయలేదు. ముందుగా మీకు ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకోండి. ఇలాంటి సంస్థలు కొన్నిసార్లు ఫ్రీలాన్సర్‌ ఉద్యోగాలను అందిస్తుంటాయి. ఒకసారి సంస్థ వెబ్‌సైట్‌లో కెరియర్‌ పేజీని సందర్శించండి. దీనివల్ల సంబంధిత శాఖలపై మీకు అవగాహన ఏర్పడుతుంది.

ఫోరెన్సిక్‌ సైన్స్‌లో పీజీ చేయాలనుంది. అందుకు డిగ్రీ స్థాయిలో ఏ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది? వాటిని అందించే సంస్థల వివరాలను తెలియజేయండి?

నేర పరిశోధనలో విజ్ఞాన సూత్రాలను వర్తింపచేసి సాధారణ దృష్టిని తప్పించుకునే ఆధారాలను కనుక్కునే శాస్త్రమే ఫోరెన్సిక్‌ సైన్స్‌. మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, అప్లయిడ్‌ సైన్స్‌ లేదా వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎంఎస్‌సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివే అర్హత ఉంటుంది. డిగ్రీ స్థాయిలో బీఎస్‌సీ ఫోరెన్సిక్‌ కోర్సును అమిటీ, గల్గోతియా, డా.హరిసింగ్‌ గౌర్‌ విశ్వవిద్యాలయాలు, హైదరాబాద్‌లోని రాజా బహదూర్‌ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల అందిస్తున్నాయి. ఆసక్తీ, పరిశీలన నైపుణ్యాలూ, పరిశోధించే సహజ స్వభావం ఉన్న అభ్యర్థులు ఈ వృత్తిలో రాణిస్తారు.

బీఎస్‌సీ, ఎంఎస్‌సీ స్టాటిస్టిక్స్‌ పూర్తిచేసినవారు సాప్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశించాలనుకుంటే ఏయే కోర్సులను చదవాల్సి ఉంటుంది?

ఐటీ డేటా సంబంధిత ఉద్యోగాల్లో నిపుణులకు ఈ మధ్యకాలంలో భారీగా గిరాకీ ఏర్పడింది. డేటా సైంటిస్ట్‌, డేటా అనలిస్ట్‌, బిగ్‌ డేటా ఇంజినీర్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, గణాంక శాస్త్రవేత్తల వంటి ఉద్యోగ అభ్యర్థుల కోసం కంపెనీలు వెతుకుతుంటాయి. మంచి హోదా, జీతభత్యాలను అందిస్తున్నాయి. ఆర్‌-ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, పైథాన్‌, హడూప్‌, డాటా మైనింగ్‌ కోర్సుల్లో పట్టు సాధిస్తే సాప్ట్‌వేర్‌, డేటా రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.

ఫార్మా-డి మూడో సంవత్సరం చదువుతున్నాను. దీని తర్వాత ఏయే కోర్సులను ఎంచుకుంటే నా కెరియర్‌కు అనుకూలం? నాకున్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగావకాశాలను తెలియజేయండి.

ఔషధాల ప్రభావాల సేకరణ, గుర్తింపు అంచనా, పర్యవేక్షణ, నివారణలకు సంబంధించిన ఔషధ శాస్త్రమే ఫార్మా-డి. ఆరు సంవత్సరాల ఫార్మా-డిని పూర్తిచేసిన అభ్యర్థులు రెండేళ్ల పోస్ట్‌ బ్యాకులెరేట్‌ పూర్తిచేసి పీహెచ్‌డీ పట్టా అందుకోవచ్చు. ప్రస్తుతం ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ఈ కోర్సును గుర్తించింది. కాబట్టి త్వరలో ప్రభుత్వ కొలువులకూ ఆస్కారం ఉంటుంది. ఫార్మా-డి పూర్తిచేసినవారు ఔషధ, హాస్పిటల్‌, బయోటెక్నాలజీ సంస్థల్లో మెడికల్‌ రైటర్స్‌, క్లినికల్‌ రిసర్చర్స్‌, సబ్జెక్టు మ్యాటర్‌ ఎక్స్‌పర్ట్స్‌ నియంత్రణ పత్రాల డెవలప్‌మెంట్‌, కమ్యూనిటీ ప్రాక్టీషనర్‌, డ్రగ్‌ ఎక్స్‌పర్ట్‌, అకడమిక్స్‌ రంగాల్లో ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.

ఎంకాం, ఎల్‌ఎల్‌బీ చదివాను. ఇంటర్నేషనల్‌ లా చదవాలని ఉంది. దానికి సంబంధించిన వివరాలతోపాటు దూరవిద్య ద్వారా అందించే సంస్థల వివరాలనూ తెలియజేయండి.

ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ లా చదివేవారికి గిరాకీ ఏర్పడింది. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ లా (ఐఎస్‌ఐఎల్‌) వారు డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ బిజినెస్‌ లా, ఇంటర్నేషనల్‌ రెఫ్యూజీ లా, లా ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వంటివాటిలో కోర్సులను అందిస్తున్నారు. దూరవిద్య ద్వారా సింబయాసిస్‌ లా స్కూల్‌, ఐఐఈఎం (కేరళ) వారు ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధి గల వివిధ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను ఇంటర్నేషనల్‌ లాలో అందిస్తున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులకు అర్హులు.

2009లో పదో తరగతి పూర్తయింది. అననుకూల పరిస్థితుల కారణంగా చదువు మధ్యలోనే ఆగిపోయింది. చిన్న చిన్న కంప్యూటర్‌ కోర్సులను చేశాను. కానీ, ఎక్కడా ఉద్యోగం రాలేదు. కనీస అర్హత లేదు అంటున్నారు. నా విద్యార్హతను ఎలా పెంచుకోవచ్చు? భవిష్యత్తుకు ఉపయోగపడే మార్గాన్ని సూచించండి.

ఉన్నత విద్య ప్రతి ఒక్కరికీ చేరువ కావడం, విద్యావంతులు ఎక్కువ కావడంతో ప్రతి చిన్న ఉద్యోగానికీ డిగ్రీ కనీసార్హతగా అడుగుతున్నారు. మీరు మీ విద్యార్హతను దూరవిద్య ద్వారా పెంచుకోవచ్చు. దూరవిద్య ద్వారా బీఏ లేదా బీకాం వంటి డిగ్రీ కోర్సును పూర్తిచేయడం ద్వారా అర్హతను పెంచుకుని ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. దీంతోపాటు టాలీ, ఎంఎస్‌ ఆఫీస్‌ వంటి కంప్యూటర్‌ కోర్సులను చేస్తే ఉపయోగం ఉంటుంది.

బీకాం చదువుతున్నాను. నాకు డ్రాయింగ్‌ అంటే ఆసక్తి. వాటికి సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి. ప్రభుత్వ రంగంలో డ్రాయింగ్‌కు సంబంధించిన ఉద్యోగావకాశాలు ఏవైనా ఉంటాయా?

డ్రాయింగ్‌ రంగంలో స్థిరపడాలనుకునేవారు డిగ్రీ స్థాయిలో బ్యాచిలర్‌ ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) ను ఎంచుకోవాల్సి ఉంటుంది. డ్రాయింగ్‌లో డిగ్రీ లేదా పీజీ చేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డ్రాయింగ్‌ టీచర్‌గా ఉద్యోగం పొందవచ్చు. ఫ్రీలాన్సర్‌ డ్రాయింగ్‌ ఆర్టిస్ట్‌గా మీడియా, యానిమేషన్‌ రంగాల్లోని కొన్ని శాఖల్లో ఉద్యోగం సంపాదించుకోవచ్చు.

డిప్లొమా (ఈసీఈ) 2014లో పూర్తిచేశాను. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించాలని ఉంది. నాకున్న అవకాశాలను తెలియజేయండి.

3 సంవత్సరాల డిప్లొమా (ఈసీఈ) లేదా పాలిటెక్నిక్‌ చేసిన అభ్యర్థులకు వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌, తమ వెబ్‌సైట్లలోని కెరియర్‌ పేజీల్లో ప్రకటనలు వెలువరుస్తాయి. జూనియర్‌ ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఫోర్‌మెన్‌ (ఎలక్ట్రికల్‌) ట్రెయినీలు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ వంటి ఉద్యోగావకాశాలుంటాయి. ముఖ్యంగా గెయిల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, యూపీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ వంటి సంస్థలు వివిధ ఉద్యోగ ప్రకటనలను జారీ చేస్తుంటాయి. ఈ ఉద్యోగాలకు మీరు ప్రయత్నించవచ్చు.

డిగ్రీ మధ్యలోనే ఆపేశాను. విభిన్నమైన కెరియర్‌ను ఎంచుకోవాలని ఉంది. సినిమాలపై ఆసక్తి ఉంది. మంచి రచయిత కావాలనుకుంటున్నాను. ఏం చేయాలి?

విభిన్న కెరియర్‌ను ఎంచుకోవాలన్న మీ ఆసక్తి అభినందనీయం. సినిమా రంగంలో రాణించాలనుకునేవారు స్వతహాగా తమదైన ప్రతిభను ఏర్పరచుకోవాలి. దీనికి తోడుగా మీరు నిర్ణయించుకున్న రంగంలో కోర్సులను అందిస్తున్న మంచి శిక్షణ సంస్థల్లో తర్ఫీదును పొందాలి. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) పుణె, అన్నపూర్ణ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ప్లస్‌ మీడియా, రామోజీ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వంటి ప్రముఖ సంస్థలు నటన, స్క్రిప్ట్‌ రైటింగ్‌, ఫిల్మ్‌ మేకింగ్‌, మల్టీ మీడియా వంటి విభాగాల్లో శిక్షణను ఇస్తున్నాయి. సినిమా పరిశ్రమలో ప్రతీ రంగం తమదైన ప్రత్యేకతను కలిగి ఉంది. కాబట్టి మీరు ఎంచుకున్న రంగం మీద ఆసక్తి కలిగి ఉండి కృషి చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు.

ఇంటర్‌ 5 సంవత్సరాల క్రితం పూర్తిచేశాను. రష్యాలో ఏడాదిపాటు ఎంబీబీఎస్‌ చేశాను. కొన్ని కుటుంబ కారణాల వల్ల కొనసాగించలేకపోయాను. ఇప్పుడు మనదేశంలో ఎంబీబీఎస్‌ చేయవచ్చా? ప్రవేశపరీక్ష రాయడానికి నాకు అర్హత ఉందా?

గతంలో చెప్పినట్టుగా ఎంబీబీఎస్‌ అభ్యసించదలచుకున్నవారు 10+2లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను 50% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. సీబీఎస్‌సీ వారు నిర్వహించే నీట్‌ ఆధారంగా ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందవచ్చు. పరీక్ష రాయడానికి కనిష్ఠ వయసు 17 సంవత్సరాలు. మీరు 10+2 విధానంలో బైపీసీ చదివుంటే ఎంబీబీఎస్‌ చేయడానికి అర్హులే.

ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యాను. తరువాత డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తిచేశాను. గ్రూప్‌-4 వంటి ఉద్యోగాలకు అర్హత ఇంటర్‌గా ఉంటుంది. అలాంటివాటికి నాకు అర్హత ఉంటుందా? లేకపోతే ఏం చేయాలి?

ఇంటర్‌ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవడం కుదరదు. డిగ్రీ అర్హతతో ఉన్న గ్రూప్‌-2, గ్రూప్‌-1 ఉద్యోగాలు, ఇతర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. ఒకసారి బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ వారిని సంప్రదించి ఫెయిల్‌ అయిన లేదా మధ్యలో ఆపేసిన ఇంటర్‌ను ఇప్పుడు కొనసాగించడం/ పరీక్ష రాయడం కుదురుతుందో లేదో అనే సమాచారాన్ని సేకరించుకోవాలి. దానినిబట్టి ఇంటర్‌ పూర్తి చేయడమో, ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడమో చేయడం ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మా అమ్మాయి బైపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. నీట్‌ రాయాలనుకుంటోంది. కనీస వయఃపరిమితి ఎంత? వైద్యవృత్తిలో చేరాలంటే నీట్‌ కాకుండా వేరే ప్రత్యామ్నాయాలున్నాయా? వివరాలను తెలియజేయండి. ఒకవేళ వయసు తక్కువగా ఉంటే అనుమతి పత్రాన్ని ఎలా పొందాలి?

జాతీయస్థాయిలో ఎంబీబీఎస్‌లో చేరడానికి నిర్వహించే పరీక్షే నీట్‌. దీన్ని రాయడానికి కనిష్ఠ వయఃపరిమితి పదిహేడు సంవత్సరాలు కాగా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠ వయః పరిమితి లేదు. ఇదేకాకుండా భారత్‌లో వైద్యవృత్తిలో చేరడానికి ఎయిమ్స్‌ ద్వారా దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఏడు ఎయిమ్స్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీటును పొందవచ్చు. జిప్‌మర్‌ ద్వారా కూడా ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందవచ్చు. మీ అమ్మాయికి తగినంత వయసు లేకపోతే సంబంధిత వైద్యాధికారి (ప్రభుత్వ), జిల్లా మెజిస్ట్రేట్‌, కలెక్టర్‌లలో ఎవరో ఒకరి నుంచి అనుమతి పత్రం పొందవచ్చు.

డిగ్రీ (బీకాం) మూడో సంవత్సరం (2013) పూర్తిచేయలేదు. 1, 2 సంవత్సరాల్లోనూ సబ్జెక్టులు మిగిలివున్నాయి. ఇప్పుడు మళ్లీ డిగ్రీ కొనసాగించాలనుకుంటున్నాను. రెగ్యులర్‌ దూరవిద్యల్లో ఏది మేలు? తెలియజేయగలరు.

ఏ కోర్సు అయినా రెగ్యులర్‌ విధానంలో చదవడం వల్ల విషయ పరిజ్ఞానాన్నీ, భావ వ్యక్తీకరణనీ పెంచుకోవచ్చు. దీని ద్వారా మంచి ఉద్యోగావకాశాన్ని పొందవచ్చు. ఏవైనా కారణాల వల్ల రెగ్యులర్‌ విద్యను అభ్యసించడం కుదరకపోతే దూరవిద్యను ఆశ్రయించవచ్చు. సాధ్యమైతే రెగ్యులర్‌ విధానంలోనే డిగ్రీని పూర్తిచేయండి. అలా కుదరకపోతే డిగ్రీ చదివిన విశ్వవిద్యాలయంలోనే దాన్ని దూరవిద్యలోకి మార్చుకుని గ్రాడ్యుయేషన్‌ పట్టాను పొందండి. ఏ విధానంలో విద్యను అభ్యసించినా లోతైన అధ్యయనంతోపాటు విషయ పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయండి.

బీఎస్‌సీ (నర్సింగ్‌) నాలుగేళ్ల కోర్సు చేశాను. కానీ నాకు ఎంబీబీఎస్‌ చేయాలని ఉంది. వీలుంటుందా?

ఎంబీబీఎస్‌ చేయదలచుకున్నవారు సీబీఎస్‌సీ వారు నిర్వహించే నీట్‌ను రాయవలసి ఉంటుంది. నీట్‌ జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్‌లో చేరడానికి నిర్వహించే ప్రవేశపరీక్ష. కనిష్ఠ వయఃపరిమితి 17 ఏళ్లు కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం గరిష్ఠ వయఃపరిమితి లేదు. 10+2లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల్లో 50% మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షను రాయవచ్చు. దీనిలో వచ్చిన ర్యాంకును బట్టి దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో సీటును పొందవచ్చు. మీరు 10+2లో బైపీసీ చదివుంటే మీకు అర్హత ఉన్నట్లే.

డిగ్రీ (బీఎస్‌సీ) రెండో సంవత్సరంతో ఆపేశాను. దూరవిద్య ద్వారా కొనసాగించాలనుకుంటున్నాను. నేను సివిల్స్‌ రాయడానికి అర్హుడినేనా?

ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు జాతీయస్థాయిలో నిర్వహించే సివిల్స్‌ రాయడానికి అర్హులు. మీరు డిగ్రీ పూర్తిచేస్తే ఈ పరీక్షను రాయడానికి అర్హులే. సన్నద్ధతను గురించి తెలుసుకోవాలనుకుంటే www.eenadupratibha.net వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మీరు ముందుగా డిగ్రీని దూరవిద్య విధానంలోకి మార్పించుకుని రెండో సంవత్సరం నుంచి కొనసాగించవచ్చు. రెగ్యులర్‌ విధానం నుంచి దూరవిద్యకు డిగ్రీని మార్చుకుని కొనసాగించే వెసులుబాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU), గుంటూరు; ఆంధ్రవిశ్వవిద్యాలయం , విశాఖపట్నం వంటివి కల్పిస్తున్నాయి. తగిన విచారణ చేసుకుని చదువును కొనసాగించండి.

ఎస్‌ఎస్‌సీ తర్వాత ఐటీఐ చేశాను. ప్రస్తుతం టెలికాం సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. డిప్లొమా చేయాలనుంది. పదోన్నతులకు ఏ డిప్లొమా సహకరిస్తుందో వివరించండి.

మీరు ఐటీఐ ఏ విభాగంలో పూర్తిచేశారో తెలుపలేదు. టెలికాం రంగంలో ఏ విభాగంలో పనిచేస్తున్నారో కూడా తెలుపలేదు. టెలికాంలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, సిగ్నల్‌ వ్యవస్థ, టవర్స్‌ వంటి వివిధ విభాగాలున్నాయి. మీరు చేస్తున్న విభాగాన్ని బట్టి డిప్లొమా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐటీఐ పూర్తిచేసినవారు లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌ కోర్సును నేరుగా రెగ్యులర్‌ విధానంలో చేరవచ్చు. టెలికాం రంగంలో ఉన్నారు కాబట్టి, ఈసీఈ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవడం ఉపయోగకరం. దూరవిద్యలో పాలిటెక్నిక్‌ డిప్లొమా చేయడం వీలు కాదు. మీరు డిగ్రీ పూర్తి చేసినట్లయితే ఆ తర్వాత దూరవిద్యలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ టెలికాం మేనేజ్‌మెంట్‌ కోర్సును ఎంచుకోవచ్చు.

డిగ్రీ (బీజెడ్‌సీ) మూడో సంవత్సరం చదువుతున్నాను. సైకాలజీలో పీజీ చేయాలనుంది. నాకు అర్హత ఉందా? వాటికి ఉండే ప్రవేశపరీక్షలు, ఏయే అంశాల్లో వాటికి సన్నద్ధమవాల్సి ఉంటుంది?

సైకాలజీలో పీజీ చేయాలనుకునేవారు డిగ్రీ సైకాలజీ చదివివుండాలి. కానీ కొన్ని విశ్వవిద్యాలయాలు ఏదైనా డిగ్రీ చదివినవారికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ తమ సొంత ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశాలను కల్పిస్తున్నాయి. సైకాలజీ అంటే మానసిక ప్రవర్తన, మనస్తత్వ శాస్త్ర అధ్యయనం, విశ్లేషణాత్మక ఆలోచన, సహనం వంటి అంశాల్లో అవగాహన పెంపొందించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

విదేశీ కళాశాలలతో సంబంధమున్న వాటిల్లో సైబర్‌లా లేదా హ్యూమానిటీస్‌ చదవాలనుంది. అటువంటి కళాశాలలు, వాటి అడ్మిషన్‌ల వివరాలను తెలియజేయండి.

మీరు మీ విద్యార్హతలను తెలియజేయలేదు. సాధారణంగా సైబర్‌లా కోర్సును ఐటీ సంస్థల్లో పని చేసేవారు, ప్రాక్టీసింగ్‌ న్యాయవాదులు తమ అర్హతను పెంపొందించుకోవడానికి అభ్యసిస్తారు. నల్సార్‌ యూనివర్సిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీ, సింబయాసిస్‌ లా స్కూల్‌ వంటివి తమ విద్యార్థులకు అనుబంధ విదేశీ కళాశాలల్లో ఒక సెమిస్టర్‌ లేదా ఒక సంవత్సరంపాటు ఒక ఐచ్ఛికంగా సైబర్‌లా కోర్సును అభ్యసించే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ విద్యాలయాల్లో క్యాట్‌ ద్వారా ప్రవేశం పొందవచ్చు. హ్యూమానిటీస్‌ విషయంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎరాస్మస్‌ ప్రోగ్రాం ద్వారా విదేశంలో కొంతకాలం విద్యనభ్యసించే ఏర్పాటును కల్పిస్తున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాలైన ఎస్‌ఆర్‌ఎం, గీతం వర్సిటీ, క్రయిస్ట్‌ విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు విదేశీ కళాశాలల్లో ఒక సెమిస్టర్‌ విద్యను పూర్తిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సంబంధిత వర్సిటీలు తమ సొంత ప్రవేశపరీక్ష ద్వారా హ్యూమానిటీస్‌ కోర్సులో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి.

బీఎస్‌సీ (ఎంపీసీఎస్‌) 2017లో పూర్తైంది. ఎంఎస్‌సీ (ఫిజిక్స్‌) చేయాలనుంది. విశ్వవిద్యాలయాన్ని ఎలా ఎంచుకోవాలి? పరిశోధనలోనూ ఆసక్తి ఉంది. అందుకు నేను ఏయే అంశాలపై దృష్టిసారించాలి?

ఎంఎస్‌సీ అభ్యసించాలనుకునే విద్యార్థులు ఐఐటీవారు నిర్వహించే జామ్‌ (JAM)పరీక్ష లేదా వివిధ ఎన్‌ఐటీలు నిర్వహించే ఎంఎస్‌సీ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. బోధన, పరిశోధనలపరంగా అత్యున్నత ప్రమాణాలున్న, పీజీలోనే పరిశోధనలను ప్రోత్సహించే విశ్వవిద్యాలయాల్లో పీజీ చేయడం వల్ల పరిశోధన పట్ల ఆసక్తి పెంచుకోవచ్చు. లోతుగా అధ్యయనం చేయడం, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతోపాటు సీఎస్‌ఐఆర్‌ నెట్‌- జేఆర్‌ఎఫ్‌ పరీక్షకు సిద్ధం కావడం ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాన్ని పొందవచ్చు.

ఇంటర్‌ రెండో సంవత్సరం (1998) పూర్తి చేయలేదు. దూరవిద్య ద్వారా బీఏ (2015) పూర్తిచేశాను. ఇప్పటివరకూ ఇంటర్‌కు సంబంధించిన ధ్రువపత్రాలేమీ తీసుకోలేదు. ఫర్వాలేదా? ఇప్పుడు ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో రాయాలనుకుంటున్నాను. మంచిదేనా? నాకున్న ఉద్యోగావకాశాల వివరాలను తెలపండి.

బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ వారిని సంప్రదించి మీరు పూర్తిచేయని రెండో సంవత్సరం ప్రస్తుతం కొనసాగించడం సాధ్యపడుతుందేమో తెలుసుకోండి. అలా కుదరకపోతే అప్పుడు ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా ఇంటర్‌ను పూర్తి చేయవచ్చు. అప్పుడు మీరు ఇంటర్‌, బీఏ అర్హత ఉన్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో కాకుండా రెండు సంవత్సరాల ఇంటర్‌ విద్యను రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడం మంచిది.

బీటెక్‌ పూర్తిచేశాను. మా పెదనాన్న సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌గా చేస్తున్నారు. ఆయన త్వరలో పదవీ విరమణ పొందనున్నారు. వారసత్వంగా ఆయన ఉద్యోగం నాకు వచ్చే అవకాశం ఉందా?

వారసత్వ ఉద్యోగాలపట్ల సంస్థలు తమకంటూ ప్రత్యేక నియమ నిబంధనలు ఏర్పరచుకుంటాయి. సాధారణంగా వారికి పుట్టిన పిల్లలకు మాత్రమే వారసత్వ ఉద్యోగావకాశాలుంటాయి. కాబట్టి, సంబంధిత సంస్థ (జైలు) అధికారులతో సంప్రదించడం ద్వారా మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోండి.

పదో తరగతి తర్వాత దూరవిద్యలో బీఏ చేశాను. ఆ తర్వాత ఎంఏ (పాలిటిక్స్‌) చేసి, బీఈడీ (సోషల్‌-ఇంగ్లిష్‌) 2014లో పూర్తిచేశాను (2017లో ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ వన్‌ సిట్టింగ్‌లో పూర్తైంది). డీఎస్‌సీ రాశాను కానీ, ఉద్యోగం రాలేదు. నాకున్న వేరే ప్రభుత్వ ఉద్యోగావకాశాలేవి? ఇంకా వేరే ఏ కోర్సులైనా చేస్తే మేలా?

పీజీ అర్హతతో ఉన్న ఉద్యోగావకాశాలకు మీరు అర్హులు. రాష్ట్ర, కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ద్వారా వెలువడే ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకుని, పోటీ పడేందుకు మీకు అర్హత ఉంది. ఎంఏ (పాలిటిక్స్‌) తో జూనియర్‌ లెక్చరర్‌గా ప్రయత్నించవచ్చు. ఏపీసెట్‌ లేదా యూజీసీ నెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ లెక్చరర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి, ఈ ఉద్యోగ పరీక్షలకు సంసిద్ధమైతే తప్పకుండా విజయం సాధిస్తారు.

డిగ్రీ (బీఏ కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. సైబర్‌ లా చేయాలనుంది. సైబర్‌ లా, సైబర్‌ సెక్యూరిటీల మధ్య తేడా ఏంటి? సైబర్‌ లాను అందించే విశ్వవిద్యాలయాల వివరాలను తెలియజేయండి. ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

ఇంటర్నెట్‌ ఆధారిత సేవలు, ఇంటర్నెట్‌ వాడకం, సైబర్‌ నేరాలు, వాటి చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం- 2000ను రూపొందించారు. దీనినే సైబర్‌ చట్టం/ సైబర్‌ లా అంటారు. కంప్యూటర్లు, నెట్‌వర్క్‌, డేటా అనధికార వాడకం, హ్యాకింగ్‌ల నుంచి పరిరక్షించే సాంకేతిక పరిజ్ఞానాన్నే సైబర్‌ సెక్యూరిటీ అంటారు.
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వారు సంవత్సరం వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌లాస్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ సైబర్‌ లా కోర్సును అందిస్తోంది. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ కోర్సులకు అర్హులు. పెరిగిన ఇంటర్నెట్‌ వినియోగం దృష్ట్యా ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. లా ఫర్మ్స్‌, కార్పొరేట్‌, ఇన్‌కం టాక్స్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.

ఇంటర్‌ (సీఈసీ) పూర్తిచేశాను. ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ లేదా ఏర్‌ టికెటింగ్‌ చేయాలనుంది. వీటిలో ఏది మేలు? ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? ఈ కోర్సులను అందించే కళాశాలల వివరాలను తెలపండి.

ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హాండ్లింగ్‌, ఏర్‌ టికెటింగ్‌లకు తమదైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు కోర్సులూ విమానయాన సేవలను అందిస్తున్నాయి. కాబట్టి, రెండింటిలో మీ ఆసక్తిమేరకు ఎంచుకోండి. ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ హాండ్లింగ్‌ కోర్సు ముఖ్యంగా విమానాశ్రయ అంతర్జాతీయ స్థాయి పర్యావరణాల్లో పనిచేయడానికి, ప్రపంచ నలుమూలలా ఉండే ప్రజలను కలుసుకుని, సాయం చేయడానికి ఇష్టపడే అభ్యర్థుల కోసం రూపొందించారు.
ఏర్‌ టికెటింగ్‌ ప్రధానంగా విమానాల బుకింగ్‌, టికెట్‌ రిజర్వేషన్‌, ప్రయాణ ప్రణాళికను రూపొందించడం, ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లను చేయడం లాంటి నైపుణ్యాలను అలవరచుకోవడం వంటివాటితో కూడి ఉంటుంది. ఐఏటీఏ (ఇంటర్నేషనల్‌ ఏర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌) జీఎంఆర్‌ వారు నాలుగు నెలల వ్యవధిగల సర్టిఫికెట్‌ ఇన్‌ ఏర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌, గ్రౌండ్‌ హాండ్లింగ్‌ డిప్లొమా ఇన్‌ ఏర్‌ టికెటింగ్‌ కోర్సులను అందిస్తున్నారు.

బయాలజీలో దూరవిద్య ద్వారా డిగ్రీ (మూడో సంవత్సరం) చదువుతున్నాను. ఎంఎస్‌సీ జియాలజీ రెగ్యులర్‌ విధానంలో చేయాలనుంది. దీంతోపాటు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలకూ సిద్ధమవాలనుకుంటున్నాను. వీటికి సంబంధించి ఏవైనా శిక్షణ సంస్థలున్నాయా? ఉద్యోగాన్ని అందించే ఇతర పరీక్షల వివరాలూ తెలపండి.

డిగ్రీ దూరవిద్యలో అభ్యసించినవారు రెగ్యులర్‌గా పీజీ చదవడానికి ఎలాంటి అవరోధం లేదు. కానీ, ఎంఎస్‌సీ (జియాలజీ) చేయాలనుకునే వారు బీఎస్‌సీ (జియాలజీ) పూర్తిచేసి ఉండాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు బీఎస్‌సీలో జియాలజీని ఒక సబ్జెక్టుగా మూడు సంవత్సరాలు చదివినవారికీ అవకాశం కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ పుణె, దిల్లీ యూనివర్సిటీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇలా అందిస్తున్న వాటిలో ఉన్నాయి. దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి నగరాల్లోని కొన్ని ప్రైవేటు సంస్థలు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్వహించే పరీక్షలకు సంబంధించిన శిక్షణను అందిస్తున్నాయి. డిగ్రీ పూర్తిచేశారు కాబట్టి పబ్లిక్‌ సర్వీస్‌ నియామక పరీక్షలు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలు, బ్యాంకు పరీక్షలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. జియాలజీ పీజీ ఉత్తీర్ణులైనవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో జియో ఫిజిసిస్ట్‌, జియాలజిస్ట్‌, రిసెర్చ్‌ అసోసియేట్‌, మేనేజర్‌- మైనింగ్‌ లాంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా (ఈఈఈ) 80%తో పూర్తిచేశాను. ఆర్థిక అననుకూల పరిస్థితుల కారణంగా బీటెక్‌ చేయలేకపోతున్నాను. వన్‌ సిట్టింగ్‌లో బీటెక్‌ పరీక్షలు రాస్తే, నాకు బీటెక్‌ అర్హత ఉన్నట్లేనా? బీటెక్‌ అర్హతగా ఉన్న ఉద్యోగాలకు నేను దరఖాస్తు చేసుకోవచ్చా?

వన్‌ సిట్టింగ్‌లో డిగ్రీ లేదా బీటెక్‌ చేయడం అసలు అందుబాటులో లేదు. ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌ లేదా కళాశాల ఇలా అందించినా దానివల్ల విద్య, ఉద్యోగపరంగా మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. బీటెక్‌ అర్హత సాధించాలంటే మీరు రెగ్యులర్‌ విధానంలోనే చదవాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో దూరవిద్యలో ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఐఈ) వారు అందిస్తున్న ఏఎంఐఈ కోర్సును ఎంచుకోవచ్చు. బీటెక్‌కు సమాన అర్హతగా ఈ కోర్సును పరిగణిస్తారు. అప్పుడు బీటెక్‌ అర్హతగా ఉన్న ఉద్యోగాలకూ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్‌ పూర్తి చేశాక గ్రూప్‌ 4 రాసి, ఆర్‌ అండ్‌ బీలో జూనియర్‌ అసిస్టెంటుగా పని చేస్తున్నా. దూరవిద్య ద్వారా బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఉంది. ఏ విశ్వవిద్యాలయాలయినా ఈ అవకాశం కల్పిస్తున్నాయా?

ఉద్యోగం చేస్తూ మీ విద్యార్హతను పెంచుకోవాలనే ఆలోచనకు అభినందనలు. బీఈ లేదా బి.టెక్‌ లాంటి ప్రొఫెష్నల్‌ కోర్సులను రెగ్యులర్‌గా అభ్యసించడం అనేది శ్రేయస్కరం. మీ విషయంలో రెగ్యులర్‌ విద్య అభ్యసించడం కుదరదు కాబట్టి మీరు ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ వారు అందిస్తున్నటువంటి ఎ.ఎం.ఐ.ఇ. లేదా ఐ.ఇ.టి.ఇ. వారి ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ కోర్సులను ఎంచుకోవచ్చు. 10+2 లేదా, డిప్లొమా చేసినవారు ఈ కోర్సు చేయడానికి అర్హులు.
ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారు ఎ.ఎం.ఐ.ఇ కోర్సును పదకొండు స్పెషలైజేషన్స్‌లో అందిస్తున్నారు. మీరు కోరుకున్నటువంటి సివిల్‌ ఇంజినీరింగ్‌ కూడా ఈ స్పెషలైజేషన్‌లో ఉంది. సెక్షన్‌ ఎ. సెక్షన్‌ బి కింద ఈ కోర్సును రూపొందించారు. మొత్తం 19 సబ్జెక్టులు, ల్యాబ్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
ఉత్తీర్ణత సాధించిన వారు అసోసియేట్‌ మెంబర్‌ ఇన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌గా నమోదవుతారు. ఆరు సంవత్సరాల వ్యవధిలో ఈ కోర్సును పూర్తి చేయాలి. ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో పరీక్షలు జరుగుతాయి. సంవత్సరం పొడుగునా అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.ieindia.org ని సందర్శించండి. ఐ.ఇ.టి.ఇ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్స్‌ వారు ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ కోర్సును అందిస్తున్నారు. జూన్‌ నెలలో పరీక్ష కొరకు ఫిబ్రవరి లోగా, డిసెంబర్‌ నెల పరీక్ష కొరకు ఆగస్టు లోగా దరఖాస్తు చేసుకోవాలి. అయిదు సంవత్సరాల వ్యవధిలో కోర్సును పూర్తి చేయాలి.
పైన పేర్కొన్న రెండు కోర్సులు రెగ్యులర్‌ మోడ్‌లో బి.టెక్‌తో తత్సమాన అర్హతగా పరిగణిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలకు అర్హత కల్పిస్తాయి. ఉన్నత చదువులు అభ్యసించడానికి కూడా తోడ్పడతాయి.

హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేయాలని ఉంది. దూరవిద్య/ కరస్పాండెన్స్‌లో ఈ కోర్సును అందించే విశ్వవిద్యాలయాలేవి?

పర్యటక రంగ అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. హాస్పిటాలిటీ/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఎంబీఏ చేయాలనుకునే అభ్యర్థులు ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సును దూరవిద్య ద్వారా కాకుండా రెగ్యులర్‌ విధానంలో అభ్యసించడం మంచిది. ఫలితంగా వృత్తిపరమైన నైపుణ్యాలు, సాఫ్ట్‌స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
ఏదైనా దూరవిద్య కోర్సును అభ్యసిం ముందు ఆ కోర్సును అందించే విశ్వవిద్యాలయం, సంబంధిత కోర్సుకు డిఫెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ), యూజీసీ అనుమతి ఉందో లేదో తెలసుకోవాలి. అనుమతి ఉన్న విశ్వవిద్యాలయ కోర్సును మాత్రమే ఎంచుకోవాలి. ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) వారు ఫెడరేషన్‌ ఆఫ్‌ హోటల్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) వారి సౌజన్యంతో ఎంబీఏ హెచ్‌ఎం కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తున్నారు.
సింబయాసిస్‌, సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీల వారు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నారు.