Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Counselling Info

విశేష ఆదరణ పొందుతున్న ఈసీఈ

ఇంజినీరింగ్‌ శాఖలన్నింటిలోకి బాగా గిరాకీ ఉన్న శాఖ ఇది. దాదాపు 80 శాతం విద్యార్థులు ఈ కోర్సు చేయడానికి ఆసక్తి చూపుతారు. మానవ జీవన శైలిని అనునిత్యం ప్రభావితం చేస్తున్న శాఖ ఈసీఈ. ప్రైవేటు రంగంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ఉద్యోగావకాశాలు తక్కువే అయినా సాఫ్ట్‌వేర్‌ వంటి ఇతర రంగాలకు మళ్లడం ఈ శాఖ చదివినవారికి సులభం.
వినిమయదారుల జీవన శైలి సులభతరం చెయ్యడంలో ఈసీఈ పాత్ర ఎంతో ఉంది. వాషింగ్‌ మెషిన్‌, ఓవెన్‌, గ్రైండర్‌ వంటి గృహోపకరణాల నుంచి ఉపగ్రహాల వరకు, చివరకు షేవింగ్‌ సెట్‌లలోనూ ఈ రంగం ఉత్పత్తుల ప్రభావం కనిపిస్తుంది. సమాచార వ్యవస్థను అత్యంత ప్రభావితం చేసిన చరవాణి (మొబైల్‌) వ్యవస్థ మానవాళికి ఈ రంగం ఇచ్చిన బహుమతే.
ఈ కోర్సు చేయాలంటే ఇంటర్మీడియట్‌ స్థాయిలో భౌతికశాస్త్రంలోని విద్యుచ్ఛక్తి, అయస్కాంతం, విద్యుదయస్కాంతం, ఆధునిక భౌతిక శాస్త్రం, సెమీ కండక్టర్లు వంటి సబ్జెక్టుల్లో పటిష్ఠమైన పునాది చాలా అవసరం. గణిత శాస్త్రంలోని సంకలనం, వ్యవకలనం ఇంకా తత్సంబంధిత అంశాలు బాగా ఆకళింపు చేసుకుని ఉండాలి.
బీటెక్‌లో ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్స్‌ అండ్‌ డివైజెస్‌, ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ఫీల్డ్స్‌, మైక్రో ప్రాసెసర్స్‌, పల్స్‌ అండ్‌ డిజిటల్‌ సర్క్యూట్స్‌ వంటి ముఖ్యమైన మౌలిక సబ్జెక్టులతో పాటు ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వి.ఎల్‌.ఎస్‌.ఐ., మొబైల్‌ కమ్యూనికేషన్స్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ వంటి అత్యాధునికమైన సబ్జెక్టులు విద్యార్థులు చదువుతారు.
ఉన్నత చదువుల విషయానికొస్తే- బీటెక్‌ ఈసీఈ చేసిన విద్యార్థులు ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, ఇంకా కంప్యూటర్స్‌ రంగాల్లోనూ ఎంటెక్‌ చెయ్యవచ్చు. విదేశాల్లోనూ నూతన రంగాల్లో ఎంఎస్‌కి అవకాశాలున్నాయి.
ఉద్యోగావకాశాలు
ఇతర ప్రసిద్ధ బ్రాంచిల కన్నా అవకాశాలు కొద్దిగా తక్కువే అయినా అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రైవేటు రంగంలోనూ అవకాశాలున్న రంగం ఇదే. ఈసీఈ ప్రధానంగా ఉద్యోగావకాశాలున్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు.. రక్షణ శాఖ, భారతీయ రైల్వే, భారత ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సి, ఇస్రో, అణు ఇంధన శాఖ, ఈసీఐల్‌, హెచ్‌.ఎ.ఎల్‌ వంటి అగ్రగామి సంస్థలు. ఇక ప్రైవేటు రంగంలో గృహ ఉపకరణాల తయారీ సంస్థలు, టీవీ తయారీ సంస్థలు, మొబైల్‌, టెలిఫోన్‌ తయారీ సంస్థలు మొదలైనవి.

Posted on 19.05.2017