Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Mock Counselling News

ఎంసెట్‌ విద్యార్థులకు వల

* కన్వీనర్‌ పేరిట ఆప్షన్లకు సహకరిస్తామంటూ సందేశాలు
* విజయవాడ కేంద్రంగా వ్యవహారం

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎంసెట్‌లో మీరు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారా?.. ఇచ్చుకుంటే 8985099274కు ‘అవును' అని ఎస్‌ఎంఎస్‌ ఇవ్వండి... లేకుంటే 8074053315 నంబరుకు ‘లేదు' అని సంక్షిప్త సందేశం పంపండి- ఎండీ కన్వీనర్‌'.. అని ఆంగ్లంలో వేలమందికి సందేశాలు పంపుతూ కొందరు అక్రమార్కులు ఎంసెట్‌ ర్యాంకర్లకు గాలం వేస్తున్నారు. తెలంగాణ, ఏపీ అనే వివరాలు లేకున్నా కన్వీనర్‌ అని ఉండటంతో చాలామంది తిరుగు సమాధానం కూడా ఇచ్చారు. ఒకవేళ ఆప్షన్లు ఇచ్చుకోకుంటే వెంటనే విజయవాడ వచ్చి ఇచ్చుకోండి అంటూ ఫోన్‌ చేసి అడుగుతున్నారు. దీనిపై కొందరు తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తెలంగాణ ఎంసెట్‌ ప్రవేశాల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి సందేశాల్ని తాము ఇవ్వలేదనే సమాధానం వచ్చింది. దీనిపై అధికారులు ఏపీ ఎంసెట్‌ ప్రవేశాల అధికారులను సంప్రదిస్తే వారూ తాము అలాంటివి పంపలేదని చెప్పారు. సంక్షిప్త సందేశాల్లో ఉన్న ఫోన్‌ నంబర్లకు ఎంసెట్‌ ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ ఫోన్‌ చేసి మాట్లాడగా.. తమది విజయవాడ అనీ, ఆప్షన్లు ఇచ్చుకోకుంటే సహాయం చేద్దామని పంపామని సమాధానం ఇచ్చారు. పొరపాటున తెలంగాణకు కూడా ఎస్‌ఎంఎస్‌లు వెళ్లాయనీ, తాము ఏపీ ఎంసెట్‌ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని పంపామనీ.. క్షమించాలంటూ ఫోన్‌ కట్‌ చేశారు. దాంతో అసలు ఎంసెట్‌ అభ్యర్థుల ఫోన్‌ నంబర్లు బయటకు ఎలా వెళ్లాయనీ, దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ తెలంగాణ ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ పేరిట జూన్ 5న సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.
అనుకూల కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చేందుకే..
ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చింది ఓ కన్సల్టెన్సీ సంస్థ అని వెల్లడైంది. ఇంజినీరింగ్‌ కళాశాలలతో ఒప్పందం కుదుర్చుకొని ఉండొచ్చనీ, వారి వద్దకు వచ్చిన విద్యార్థులకు ఒప్పందం ఉన్న కళాశాలల్లో సీట్లు వచ్చేలా ఆప్షన్లు ఇవ్వడమే కన్సల్టెన్సీ ఉద్దేశమని సమాచారం. సీటు వస్తే కళాశాల యాజమాన్యం కన్సల్టెన్సీకి కమీషన్‌ ఇచ్చే అవకాశముంది.

Published on 06.6.2018