Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

ఇంటర్‌ విలువెంత?

* నీట్‌ ర్యాంకులతోనే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీ
* ఏపీ, తెలంగాణ అధికార్ల వెల్లడి
* ఆయుష్‌ సీట్ల భర్తీకి మాత్రం ఇంటర్‌ వెయిటేజీ

ఈనాడు - హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌లో అత్యధిక మార్కులు సాధించినా... ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల్లో వాటికి ప్రాధాన్యం లేదు. రెండేళ్లు అహర్నిశలు శ్రమించి ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన తెలుగు విద్యార్థులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్యవిద్య సీట్లలో ప్రవేశాలకు ఇంటర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదనీ, కేవలం నీట్‌ ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జాతీయ స్థాయిలో ఏకీకృత ప్రవేశ పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో... నీట్‌ ర్యాంకుల వెల్లడిలో ఇంటర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోలేమని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నీట్‌ ర్యాంకులు వెల్లడైన తర్వాత సీట్ల భర్తీ రాష్ట్రస్థాయిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో నీట్‌ ర్యాంకుకు జతగా ఇంటర్మీడియెట్‌ మార్కులను పరిగణనలోకి తీసుకొంటారా లేదా అన్న విషయం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ స్పష్టతనిచ్చారు. ‘‘నీట్‌ ర్యాంకుల ఆధారంగానే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను భర్తీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఒకసారి ప్రతిభ ఆధారంగా ర్యాంకులను ప్రకటించాక మళ్లీ వాటికి ఇంటర్‌ మార్కుల వెయిటేజీ పేరు చెప్పి.. ఆ ర్యాంకులను మార్చే ప్రయత్నం చేయడం కోర్టు ధిక్కారమే అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు’’ అని తివారీ స్పష్టం చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. ‘‘జాతీయ స్థాయిలో పరీక్ష జరుగుతుండడం వల్ల ఆ నియమ నిబంధనలను అనుసరించే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర షరతులు కూడా పాటించడం అనివార్యం. దీనివల్ల ఇంటర్‌ మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడమనే అంశంపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల నీట్‌కు అనుగుణంగా విద్యార్థులు సన్నద్ధం కావాలి’’ అని ఆయన సూచించారు. ఈ నిర్ణయం వల్ల పారదర్శకత పెరుగుతుందనీ, విద్యార్థుల్లోనూ అయోమయం ఉండదని ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇంటర్‌ మార్కులకు ప్రాధాన్యం లేకపోవడం వల్ల కొద్దిమంది విద్యార్థులు నష్టపోవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి... ఒకవేళ నీట్‌లో ఆశించిన మార్కులను సాధించలేకపోతే అప్పుడు నష్టపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
    ఎంసెట్‌ ద్వారా భర్తీ చేయనున్న ఆయుర్వేదం, హోమియో, యునానీ, ఫిజియోథెరపీ.. తదితర కోర్సులకు ఇంటర్‌ మార్కుల వెయిటేజీ ఉంటుందని వైద్యవర్గాలు స్పష్టంచేశాయి. ఇప్పటి వరకూ కొనసాగుతున్న విధానం మాదిరిగానే ఎంసెట్‌ మార్కులను 75 శాతానికి, ఇంటర్‌ మార్కులను 25 శాతానికి మదించి విద్యార్థికి ర్యాంకు కేటాయిస్తారు.
* ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లకూ... ఇంటర్‌ మార్కులకు లంకె ‘నీట్‌’తో తెగిపోయింది. ఇక ఏ పరీక్షకు ఆ పరీక్షే లెక్క. ఇంటర్‌లో ఎక్కువ మార్కులు రానివారికి ‘వెయిటేజీ’ భారం తగ్గిపోయినట్టే.
* నీట్‌లో మంచి ర్యాంకు సాధిస్తే చాలు.. సీటు సొంతం చేసుకోవచ్చు.
* ఇంటర్‌ టాపర్లు కూడా వెయిటేజీ మాట మరిచిపోవాలి. నీట్‌లోనూ అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నించాలి.
* నీట్‌ జాతీయ స్థాయి పరీక్ష. నిబంధనలు, షరతులు దేశవ్యాప్తంగా అందరూ పాటించడం అనివార్యం. దీనికి అనుగుణంగా విద్యార్థులు సన్నద్ధం కావాలి.

published on 14.05.2016