Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

నీట్‌పై రెండు రోజుల్లో నిర్ణయం

* కేంద్ర మంత్రి నడ్డా
దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష(నీట్‌)’ను తప్పనిసరిగా నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... ఆదేశాల అమలుపై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మే 18న ఇక్కడ ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. వైద్యకళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే నీట్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, పాఠ్య ప్రణాళిక, భాష సహా నీట్‌పై చెలరేగుతున్న అన్ని ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. నీట్‌ రెండో దశ జులై 24న జరుగుతుందని స్పష్టంచేశారు. ప్రైవేటు వైద్య కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు సొంతంగా ప్రవేశపరీక్షలు నిర్వహించకుండా... తప్పనిసరిగా నీట్‌ ద్వారానే ప్రవేశాలు కల్పించాలని పేర్కొన్నారు. నీట్‌ను ఏడాదిపాటు వాయిదా వేసేందుకు వీలుగా అత్యవసరాదేశం (ఆర్డినెన్సు) తీసుకురావాలని కేంద్రం యోచిస్తోందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో నడ్డా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

published on 19.05.2016