Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

విడుదలకు సిద్ధమైనా.. ఆలస్యమెందుకు?

* ఎంసెట్‌ ఫలితాలపై నెలకొన్న గందరగోళం
* విద్యార్థులు.. తల్లిదండ్రులకు సంకటం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాల విడుదలకు అంతా సిద్ధమైనా ఆలస్యమెందుకని...వేలాది మంది విద్యార్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసెట్‌ ఫలితాల విడుదల ప్రక్రియను అధికారులు అంతా పూర్తిచేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 27వ తేదీలోగా ఫలితాలు ఇస్తామన్నారు. 15న ఎంసెట్‌ జరిగిన రోజు మాత్రం అధికారులు ఈనెల 20 లేదా 21 నాటికి విడుదల చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. అందుకు తగ్గట్లే పనులు పూర్తి చేశారు. ఒకవేళ ఇంటర్‌ పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్న వారి మార్కుల కోసం అనుకున్నా వారికి పాయింట్‌ ర్యాంకులు ఇవ్వొచ్చు. సీబీఎస్‌ఈ అభ్యర్థులకూ అదే విధానం పాటిస్తారు. ఆ ఫలితాలు సైతం మే 21న విడుదలయ్యాయి. పునఃమూల్యాంకనం మార్కులతో కూడిన సీడీని కూడా తాము ఎంసెట్‌ అధికారులకు పంపించామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ మే 22న తెలిపారు. ఇప్పటికీ ప్రభుత్వం ఎంసెట్‌ ఫలితాల తేదీని ప్రకటించకపోవడం విద్యార్థుల్లో సందేహాలకు తావిస్తోంది. ఫలితాలు ముందుగా వెల్లడి కాకుండా ఒకరు అడ్డుపడుతున్నారన్న ప్రచారం విస్త్రతంగా సాగుతోంది.
విద్యార్థులకు నరకం
ఇంజినీరింగ్‌ చదవాలన్న లక్ష్యంతో ఉన్నవారు ఎంసెట్‌తోపాటు పలు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పరీక్షలు రాయడం తెలిసిందే. ఎంసెట్‌ కంటే ఆ వర్సిటీల ప్రవేశ కెన్సెలింగ్‌ ముందుగా జరుగుతాయి. ఎంసెట్‌ ఫలితాలు వస్తే ఆ ర్యాంకు ఆధారంగా మంచి కళాశాలల్లో సీటు లభిస్తుందా? లేదా? అన్నది అంచనాకు రావడానికి వీలుంటుంది. మరోవైపు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నాయి. దానివల్ల ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాకుంటే...ఇక్కడ నాసిరకం కళాశాలల్లో చేరటం కంటే డీమ్డ్‌ వర్సిటీల్లో చేరాలని విద్యార్థులు భావిస్తున్నారు. ఎంసెట్‌ ఫలితాలు రాకపోవడంతో వారు డీమ్డ్‌ వర్సిటీల కౌన్సెలింగ్‌కు వెళ్లాలా? వద్దా? అన్నది తేల్చుకోలేక పోతున్నారు. కౌన్సెలింగ్‌కు వెళ్లి సీటు లభిస్తే ఫీజు చెల్లించాలి... సీటు రద్దు చేసుకున్నా కొంత మినహాయించుకొని ఇస్తారు... ఇలాంటి ఎన్నో ఇబ్బందులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

published on 23.05.2016