Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

ఎంసెట్‌-2 ఎప్పుడు?

* నిర్వహణ తేదీపై స్పష్టతకు రెండుమూడు రోజులు ఆగాల్సిందే
* నీట్‌ ఆర్డినెన్స్‌ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న అధికారులు
* మళ్లీ దరఖాస్తు తప్పదంటున్న వైద్యవర్గాలు

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌-2 నిర్వహణ తేదీపై ప్రభుత్వ నిర్ణయం వెలువడటానికి మరికొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి న్యాయ సలహా కోరడంతో ఆయన ఆమోదానికి, ఆర్డినెన్స్‌ ఉత్తర్వులు వెలువడటానికి మరో రెండు రోజులు పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ను సమగ్రంగా, లోతుగా పరిశీలించకుండా ఎంసెట్‌ తేదీని ఖరారు చేయలేమని వైద్యవర్గాలు వెల్లడించాయి. దీంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముందుగా వెల్లడించినట్లుగా ఎంసెట్‌-2 నిర్వహణ తేదీపై మే 23న ప్రభుత్వ నిర్ణయం వెలువడకపోవచ్చు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మే 25, 26 తేదీల్లోగాని, ఆ తర్వాత గానీ వెల్లడయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
నీట్‌పై ఆర్డినెన్స్‌ నిర్ణయం మే 20న వెలువడింది. అదే రోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమై.. మే 23న ఎంసెట్‌ తేదీలను ఖరారు చేస్తామని ప్రకటించారు. అప్పటిలోగా ఆర్డినెన్స్‌ రాష్ట్రానికి చేరుతుందన్న అంచనాతో వారు ఆ ప్రకటన చేశారు. జులై మొదటి వారంలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చినా.. ఆర్డినెన్స్‌ ప్రతిని సమగ్రంగా పరిశీలించకుండా కచ్చితమైన తేదీలను ప్రకటించకూడదని నిర్ణయించారు. ముఖ్యంగా ఆర్డినెన్స్‌లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని అన్ని రకాల వైద్యసీట్ల భర్తీకి నీట్‌ నుంచి వెసులుబాటు కల్పించారా? లేదా.. కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల సీట్లు, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 50 శాతం కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వమే భర్తీ చేసే సీట్లకు మాత్రమే వెసులుబాటు ఇచ్చారా? అనేది తేలాల్సి ఉంది. ఆర్డినెన్స్‌ ఉత్తర్వులు రాష్ట్రానికి చేరిన అనంతరం ఎంసెట్‌-2 తేదీలు, ప్రైవేటు మెడ్‌సెట్‌ నిర్వహణ.. తదితర అంశాలపై స్పష్టత వస్తుందని, ఇదంతా జరగటానికి కనీసంగా రెండు మూడురోజులు పట్టవచ్చని వైద్యవర్గాలు తెలిపాయి.
మళ్లీ రుసుం చెల్లించాల్సిందే!
తెలంగాణలో ఈ ఏడాది ఒకసారి వాయిదా అనంతరం మే 15న ఎంసెట్‌ నిర్వహించారు. ఈలోపు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను నీట్‌ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయడంతో.. మే 15న నిర్వహించిన ఎంసెట్‌ను ఆయుష్‌, వ్యవసాయ, పశువైద్య, ఫిజియోథెరపీ సీట్ల కోసమేనని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 1.01లక్షల మంది బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. అయితే, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్లను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయరనే ప్రభుత్వ ప్రకటనతో.. దరఖాస్తుదారుల్లో 88 శాతం మంది మాత్రమే ఎంసెట్‌ రాశారు. తాజాగా మరోసారి ఎంసెట్‌-2ను నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో.. తొలి ఎంసెట్‌ దరఖాస్తులు చెల్లుబాటు కావనీ, ఎంసెట్‌-2 కోసం ప్రవేశ ప్రకటనను జారీ చేస్తామనీ, విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వైద్యవర్గాలు స్పష్టం చేశాయి. దీంతో విద్యార్థులు మళ్లీ రుసుములు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కారణమైతే.. మధ్యలో విద్యార్థులెందుకు నష్టపోవాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.


published on 23.05.2016