Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - News

మే 2 నుంచి తెలంగాణ ఎంసెట్‌!

* గ‌తేడాది జరిగిన పరీక్షల తేదీల్లోనే ఈసారీ నిర్వహణ
ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ను మే 2వ తేదీ నుంచి అయిదు రోజులపాటు నిర్వహించనున్నారు. గత ఏడాది ఏ తేదీల్లో జరిగాయో దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు ఈసారి అవే తేదీల్లో జరగనున్నాయి. గత ఏడాది మే 2వ తేదీ నుంచి నెలాఖరు వరకు మొత్తం ఏడు రకాల ప్రవేశ పరీక్షలను తెలంగాణలో నిర్వహించారు. ఒక్క పీఈసెట్‌ తప్ప మిగిలిన ఎంసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీఈసెట్‌, ఐసెట్‌లను ఆన్‌లైన్‌ విధానంలో జరిపారు. మే 2 నుంచి 7వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మే 6వ తేదీ మాత్రం నీట్‌ ఉండటంతో ఆ రోజు జరపలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ చివరి వారంలో మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు రాయాలనుకున్నా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రెండు మూడు రోజులు వ్యవధి ఉండేలా పరీక్షల తేదీలను నిర్ణయించారు. ఈసారి కూడా అదేవిధంగా జరపనున్నారు.ఈసారి మే 5న నీట్‌ జరగనుంది. దాంతో ఈసారి కూడా గత ఏడాది తరహాలోనే జరిపే అవకాశం ఉంది. మే 9న ఈసెట్‌, 20న పీఈసెట్‌, 23, 24న ఐసెట్‌, 25న లాసెట్‌, 31న ఎడ్‌సెట్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఎంసెట్‌ కన్వీనర్‌ మార్పు!
పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఐసెట్‌ కన్వీనర్లలో కొందరు పదవీ విరమణ చేయటం.. మరికొందరు త్వరలో పదవీ విరమణ చెందనుండటంతో ఆ నాలుగు పరీక్షలకు కొత్త కన్వీనర్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించనుంది. ఐసెట్‌ను గత ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయానికి ఇవ్వగా ఈసారి ఓయూకు అప్పగించాలని భావిస్తున్నారు. మరోవైపు ఐసెట్‌ను తమకు ఇవ్వాలని మహాత్మాగాంధీ వర్సిటీ ఉపకులపతి అల్తాఫ్‌ హుస్సేన్‌ ప్రతిపాదిస్తున్నా అక్కడ ఆచార్యులు లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. ఇక 2016 ఎంసెట్‌-2 నుంచి కన్వీనర్‌గా ఉన్న ఆచార్య యాదయ్య స్థానంలో కొత్త వారిని నియమించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు తెలిసింది. యాదయ్య రిజిస్ట్రార్‌గా ఉండటం, ఇప్పటికే మూడు సార్లు కన్వీనర్‌గా పనిచేయడంతో కొత్తవారికి ఇవ్వాలని భావిస్తున్నారు. దాంతో జేఎన్‌టీయూహెచ్‌లో అకడమిక్‌ విభాగం సంచాలకుడిగా ఉన్న ఆచార్య బండారి, ప్రవేశాల విభాగం సంచాలకుడు, ఎంసెట్‌ కో కన్వీనర్‌గా పనిచేసిన మంజూర్‌ హుస్సేన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈసెట్‌ కన్వీనర్‌గా ఉన్న గోవర్ధన్‌ ప్రస్తుతం రెక్టార్‌గా ఉండటంతో ఆయన్నూ మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాంతో బండారికి ఎంసెట్‌ లేదా ఈసెట్‌లో ఏదోఒకటి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.published on 01.01.2019