Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

EAMCET NEWS

15న ఎంసెట్‌-3 ఫలితాలు

* 17 నుంచి వైద్య విద్య ప్రవేశాలు
* 20వ తేదీ వరకూ ధ్రువపత్రాల పరిశీలన
* 21, 22 తేదీల్లో వెబ్‌ఆప్షన్ల నమోదు
* 22 రాత్రి లేదా 23న ప్రవేశాల వెల్లడి
* ప్రకటించిన కాళొజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-3 ర్యాంకులు సెప్టెంబర్ 15న విడుదల కానున్నాయి. 16వ తేదీన ర్యాంకులు వెల్లడించాలని ఎంసెట్‌ కమిటీ తొలుత నిర్ణయించింది. అయితే నెలాఖరులోగా వైద్యవిద్య కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో ఒక రోజు ముందే ర్యాంకులు ప్రకటించాలని తాజాగా నిర్ణయించింది. 15న ఉదయం జేఎన్‌టీయూహెచ్‌లో ర్యాంకులు విడుదల చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.ర్యాంకుల వెల్లడి అనంతరం సెప్టెంబర్ 17 నుంచి ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనున్నారు. 17 నుంచి 20 వరకూ నాలుగు రోజుల పాటు అర్హులైన విద్యార్థుల ధ్రువపత్రాలను ర్యాంకుల వారీగా పరిశీలిస్తారు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో విద్యార్థుల నుంచి వెబ్‌ఆప్షన్లు స్వీకరిస్తారు. 22 రాత్రిగానీ లేదా 23న గానీ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా వైద్యవిద్య సీట్ల భర్తీ వివరాలను వెల్లడించనున్నట్లు కాళొజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
* ధ్రువపత్రాల పరిశీలనకు 6 కేంద్రాలు:
ధ్రువపత్రాల పరిశీలనకు స్థానిక విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మారేడ్‌పల్లి, ఏవీ కళాశాల గగన్‌మహల్‌, వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానికేతర విద్యార్థులు విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాలి. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని కేంద్రం వద్దే ధ్రువపత్రాలు పరిశీలింప చేయించుకోవాలి. 17న ఉదయం 9గంటలకు క్రీడా విభాగం, సాయంత్రం 4 గంటలకు ఆంగ్లో ఇండియన్స్‌కు, 18న ఉదయం 9 గంటలకు ఎన్‌సీసీ విభాగంలో 1 నుంచి 10వేల ర్యాంకు వరకూ, 19న ఉదయం 9 గంటలకు సైనిక, పోలీస్‌ అమరవీరుల కుటుంబాలు, వికలాంగుల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. మరిన్ని వివరాలకు http://knruhs.in/, http://medadm.tsche.in/ వెబ్‌సైట్లలో సంప్రదించాలని కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
* రెండో విడతకు సన్నాహాలు:
సెప్టెంబర్ 23లోపు మొదటి విడత కౌన్సెలింగ్‌ను పూర్తి చేయాలని కాళొజీ వర్సిటీ యోచిస్తోంది. 25 లేదా 26 తేదీల్లోనే రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30లోపు ఎంబీబీఎస్‌ ప్రవేశాలు ముగించాలి. గడువు పెంచాలంటూ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రతికూల ఫలితం ఎదురైనా ఇబ్బందులు లేకుండా ఈమేరకు సన్నాహాలు చేస్తున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు గడువిస్తే కొంత సమయం తీసుకొని కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామన్నాయి.
అభ్యర్థులకు సూచనలు..
* తెలంగాణ ఎంసెట్‌ -3లో అర్హులైన విద్యార్థులే ప్రవేశాలకు అర్హులు. వీరు ఒరిజినల్‌ ధ్రువపత్రాల్లో నిర్దేశిత తేదీల్లో పరిశీలనకు హాజరవ్వాలి. ఎంసెట్‌ -3 హాల్‌టికెట్‌, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్మీడియట్‌ మార్కుల ధ్రువపత్రాలు, ఆరు నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ స్టడీ సర్టిఫికెట్లను తీసుకురావాలి.
* అభ్యర్థికి ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు పూర్తవ్వాలి. 02.01.2000 తర్వాత జన్మించిన విద్యార్థులు ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ ప్రవేశానికి అనర్హులు.
* ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.1000.
15న ప్రైవేటు ప్రకటన:
ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజులు, ప్రవేశాల విధివిధానాలు ఖరారవడంతో బీ కేటగిరీలోని 35 శాతం సీట్ల భర్తీకి ప్రైవేటు యాజమాన్యాలు సెప్టెంబర్ 15న పత్రికల్లో ప్రకటనలిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 23 లేదా 24 తేదీల్లో రాష్ట్రస్థాయి వేదిక ద్వారా ఒకే కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు చేపట్టాలని భావిస్తున్నాయి. అయితే దీనికి ఒకరోజు ముందుగానైనా కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈమేరకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో చర్చించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
కన్వీనర్‌ కోటాలో 2,075 సీట్లు:
తెలంగాణలో 2016-17 వైద్య విద్య సంవత్సరానికి ప్రభుత్వ, ఈఎస్‌ఐ, ప్రైవేటు వైద్య కళాశాలలన్నింటిలో కలిపి మొత్తం 3,550 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2,075 సీట్లను కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఇందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1000, ఈఎస్‌ఐ వైద్య కళాశాలలోని 50 సీట్లు కలిపి మొత్తం 1,050 సీట్లు ప్రభుత్వ పరిధిలోనివి. మిగిలిన 1,025 కన్వీనర్‌ సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనివి.
ఇవిపోగా ప్రైవేటు కళాశాలల్లోని మిగిలిన 1,025 సీట్లలో 718 (35%) యాజమాన్య కోటా కింద, మిగిలిన 207 సీట్లు (15%శాతం) ప్రవాస భారతీయుల కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్రంలోని మూడు మైనారిటీ వైద్య కళాశాలల్లోని మొత్తం 400 సీట్లలో 60 శాతం (240) సీట్లను ఎంసెట్‌-3 ర్యాంకుల ద్వారా కన్వీనర్‌ కోటాలో, 25 శాతం సీట్లను యాజమాన్య కోటా కింద, 15 శాతం సీట్లను ప్రవాస భారతీయ కోటాలో నీట్‌ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయాలి. అన్ని సీట్లనూ మైనారిటీ విద్యార్థులకే ఇవ్వాలి.

posted on 13.09.2015