Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

EAMCET NEWS

ఎంసెట్ పరీక్ష కేంద్రం గుర్తింపునకు గూగుల్ మ్యాప్

* హాల్‌టికెట్ వెనుక ముద్రణ
* 22 నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
* ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు వెల్లడి

ఈనాడు, కాకినాడ: ఏపీ ఎంసెట్-2018 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆన్‌లైన్ పద్ధతిలో రెండోసారి పరీక్ష నిర్వహిస్తున్న కాకినాడ జేఎన్‌టీయూ ఈమేరకు చర్యలు తీసుకుంది. ఇంజినీరింగ్ పరీక్ష 22 నుంచి 24 వరకు, అగ్రికల్చర్, మెడికల్ పరీక్ష 25న నిర్వహించనున్నారు. విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు ఈసారి హాల్‌టిక్కెట్ వెనుక గూగుల్ మ్యాప్‌తో పరీక్ష కేంద్రం వివరాలు పొందుపరిచినట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ ఆచార్య సి.హెచ్.సాయిబాబు 'ఈనాడు'కు తెలిపారు. పరీక్ష కేంద్రం ఎంత దూరంలో ఉంది, నిర్ణీత ప్రాంతం నుంచి కేంద్రానికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందనే వివరాలు కూడా పొందుపరిచినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇంజినీరింగ్ విభాగంలో 1,98,234 మంది, అగ్రికల్చర్, మెడికల్‌లో 75,592 మంది, రెండు విభాగాలకు 1,094 మంది కలిపి 2,74,920 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఏప్రిల్‌ 21వ తేదీ వరకు రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,78,500 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్‌టికెట్లలో తప్పులు ఉంటే వెంటనే ఎంసెట్ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలని కన్వీనర్ సూచించారు. ఉర్దూ అభ్యర్థులకు కర్నూలులో మాత్రమే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులు కాకుండా ఇతర బోర్డులకు చెందిన 11 వేల మంది విద్యార్థులు ఎంసెట్ రాస్తున్నందున వారు హాల్‌టికెట్‌తో పాటు డిక్లరేషన్ ఫారాలు కూడా డౌన్‌లోడు చేసుకోవాలని సాయిబాబు సూచించారు. వీరు ఏప్రిల్ 27 లోపు మార్కుల జాబితా, డిక్లరేషన్ ఫారాలను ఎంసెట్ కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఇతర వివరాలకు 0884 2340535, 0884 2356255 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

posted on 20.04.2018