సర్కారు పర్యవేక్షణలోనే కోర్సు మార్పు
* వచ్చే ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ నుంచి అమలు
* స్లైడింగ్‌లో కోర్సు మారినా బోధనారుసుం
* కళాశాలల యాజమాన్యాల అక్రమాలకు అడ్డుకట్ట
ఈనాడు - హైదరాబాద్: ఓ పేరున్న ఇంజినీరింగ్ కళాశాలలో మీరు ఏదో ఒక ఇంజినీరింగ్ బ్రాంచిలో ప్రవేశం పొందారు. తర్వాత మీకు ఆసక్తి ఉన్న బ్రాంచిలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిసి అందులో చేరదామంటే బోధనారుసుం రాదు. ఇలాంటి పరిస్థితితో వేలమంది విద్యార్థులు చేరిన బ్రాంచిలోనే సర్దుకుపోతున్నారు. అదే సమయంలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఖాళీలు చూపకుండా ఇతరులకు రూ.లక్షలకు అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం ఈ రెండు సమస్యలూ తీరనున్నాయి. కళాశాలలో కోర్సులు మారేందుకు (ఇంటర్నల్ స్లైడింగ్) జరిపే కౌన్సెలింగ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖే (సెట్ ప్రవేశాల కన్వీనర్) చేపట్టనుంది. సాధారణంగా ఎంసెట్‌లో 70శాతం కన్వీనర్ సీట్ల భర్తీకి సెట్ ప్రవేశాల కన్వీనర్ రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కొందరు ప్రవేశాలు పొందినా తర్వాత సీట్లు వదులుకొని వెళ్తారు. మరికొందరు రెండో కౌన్సెలింగ్‌లో ఇతర కళాశాలల్లో చేరతారు. అప్పుడు కొన్నిసీట్లు ఖాళీ ఉంటే అప్పటికే చేరినవారి కోసం ఆగస్టు మొదటివారంలో ఇంటర్నల్ స్లైడింగ్‌ను కళాశాల యాజమాన్యం నిర్వహిస్తుంది. అంటే ఓకోర్సు నుంచి మరో కోర్సులో చేరతారు. ఇలాంటివారికి బోధనారుసుం రాదు. చాలామంది విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ గురించి తెలియడంలేదు. దీంతో ఏటా 2నుంచి 3 వేలమంది నష్టపోతున్నారు. కొన్ని కళాశాలలు ఖాళీగా ఉన్న సీట్లలో కొన్నింటిని చూపి మిగతావి స్పాట్ అడ్మిషన్ల పేరిట రూ.లక్షలకు అమ్ముకునేవి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వచ్చే జూన్ నెలాఖరు లేదా జులై మొదటివారంలో ప్రారంభమయ్యే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో మార్పులు చేస్తున్నారు. ఇంటర్నల్ స్లైడింగ్‌ను కూడా ప్రవేశాల కన్వీనరే చేపడతారు. అందుకు ఆయా కళాశాలల్లో సీట్ల ఖాళీలను వెబ్సైట్లో ఉంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మెరిట్, రిజర్వేషన్ ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. దీనివల్ల విద్యార్థులకు బోధనారుసుంకు అర్హులవుతారు. ఈ ప్రకియను పాలిసెట్ కౌన్సెలింగ్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించారు.
మూడు విడతల్లో ఎంసెట్ కౌన్సెలింగ్
గతేడాది వరకూ రెండు విడతల్లోనే తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేవారు. ఈసారి దాన్ని మూడు విడతల్లో జరపాలని నిర్ణయించారు. జులై 31వ తేదీలోపు మూడు విడతల కౌన్సెలింగ్‌ను పూర్తి చేస్తారు. చివరి విడత ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిశాక నిర్వహిస్తారు. దానివల్ల జేఎన్టీయూ, ఓయూ ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు మిగిలిపోకుండా ఉంటాయని భావిస్తున్నారు.
ఎంసెట్‌కి నాలుగో వారంలో..
ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 4వ వారంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ చెప్పారు. దోస్త్ ప్రకటన జారీ సందర్భంగా మే 8న విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు. ఎంసెట్ ఫలితాలు మే 17న కానీ 18న కానీ వెల్లడవుతాయన్నారు. ఆ తర్వాత ప్రకటన జారీ చేసి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరుపుతామని తెలిపారు. అయితే 25వ తేదీ తర్వాత కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 23న పాలిసెట్ మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. అనంతరం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభించాలన్నది ఆలోచన. వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీటెక్ ప్రథమ సెమిస్టర్ తరగతులు ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభం కావాలి. ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెలాఖరులోనే ప్రారంభిస్తే తరగతుల ప్రారంభానికి చాలా గడువు ఉంటుంది. ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలను అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ఒక విద్యార్థి ఇటు దోస్త్... అటు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరై ఎంసెట్‌లో సీటు వచ్చి చేరిన వెంటనే డిగ్రీ సీటు రద్దవుతుంది. దీని కోసం డిగ్రీ, బీటెక్ ప్రవేశాలను ఒకే సమయంలో జరపాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.
posted on 09.05.2018