Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

కోర్సా? కళాశాలా?

* రెండింటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలి ?
* విద్యార్థులను ఎందులో చేర్పిస్తే మేలు?
* తల్లిదండ్రుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు

      మావాడికి జేఈఈ మెయిన్స్‌ వచ్చింది. వరంగల్‌ ఎన్‌ఐటీలో సీటొస్తుంది. కానీ కోరుకున్న కోర్సు కాకుండా ఏదో వచ్చేలా ఉంది. కోరుకున్నదంటే ఎక్కడో దూరంగా వచ్చేలా ఉంది. ఏం చేసేది? - ఓ తండ్రి ఆలోచన
మెయిన్స్‌ రాలేదు. బిట్సూ రాలేదు. ఎంసెట్‌ ర్యాంకు వచ్చింది. అలాగని టాప్‌ ర్యాంకు కాదు. మంచి కళాశాలను చూసుకున్నా వాటిలో కోరుకున్న కోర్సు వచ్చేలా లేదు. ఎందులో చేరేది? - ఓ విద్యార్థిని సందేహం
ఈనాడు - హైదరాబాద్‌: మా అబ్బాయి మెకానికల్‌ చేస్తానంటున్నాడు. మేమేమో కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) చేయమంటున్నాం! ఏది ఎంచుకోవాలి?... ఇంటికి దగ్గరున్న కళాశాలలో ఏదో ఒకటి తీసుకోవటం మంచిదా? దూరమైనా మంచి కాలేజీలో చేరాలా? నచ్చిన కోర్సా? మెచ్చిన కాలేజీనా? వచ్చిన సీటా? కింకర్తవ్యం? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల ఫలితాలు వచ్చిన వేళ... చాలామంది సగటు విద్యార్థుల, తల్లిదండ్రుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.
* అలాగైతే కళాశాలనే..
రాష్ట్రంలో 300కు పైగా కళాశాలలున్నా... అర్హులైన విద్యార్థులను మించి సీట్లున్నా... మంచి ర్యాంకు వచ్చే పిల్లల నుంచి మొదలెడితే...ర్యాంకు అంతగా రాని పిల్లల దాకా ప్రతి ఒక్కరిలోనూ ఏదో రకమైన సందేహం. అవకాశాల్ని ఎంచుకోగల మంచి ర్యాంకు వచ్చే కొద్దిమంది విద్యార్థులను పక్కనబెడితే... మిగిలిన వారందరిలోనూ కోర్సులు, కళాశాలల ఎంపికలో సంకటస్థితే! అయితే ఇంజినీరింగ్‌ తర్వాత ఏం చేయాలనుకుంటున్నామనేదే ప్రస్తుత ఎంపికను ప్రభావితం చేస్తోంది.
''ఆసక్తి ఉండి ... తదుపరి చదువులు చదవాలనుకుంటే మొదట కోర్సుకు ప్రాధాన్యమివ్వాలి... ఉద్యోగం చేయాలంటే మంచి కళాశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎందుకంటే మంచి కళాశాలలో ప్రాంగణ నియామకాలు బాగుంటాయి కాబట్టి. కుటుంబ సాధకబాధకాలు చూసి నిర్ణయించుకోవాలి'' అంటున్నారు హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీలోని సహాయ ఆచార్యుడు అనిల్‌ వుప్పల!
''సగటు బ్రాంచితో... మంచి కళాశాలలో చేరాలనేది నా సలహా. ఎందుకంటే మంచి బ్రాంచి తీసుకొని... సిబ్బంది లేని, అంతగా పేరులేని కాలేజీలో చేరితే ఏం లాభం?'' అని ఎన్‌ఐటీ వరంగల్‌లో భౌతికశాస్త్ర అసోసియేట్‌ ప్రొఫెసర్‌ దినకర్‌ అన్నారు. మంచి కళాశాలల్లో... చదువులు కూడా మంచిగానే ఉంటాయి. కాకుంటే కోర్సు విషయంలో కాసింత రాజీపడాల్సి వచ్చినా తప్పులేదన్నది నిపుణుల సలహా!
* కోర్సూ ముఖ్యమే కానీ..
అవకాశం ఉన్నప్పుడు మాత్రం పిల్లల ఇష్టాలకు తగ్గట్లుగా కోర్సునే ఎంచుకోవాలనేది నిపుణుల సూచన. ''కోర్సు అనేది జీవితాంతం తన వెంట ఉండేది. కళాశాల తాత్కాలికం. ఏదో ఒకటి చేస్తామంటే దెబ్బతినే ప్రమాదముంది. అలాగని... ఇష్టమైన కోర్సు కోసం ఏమాత్రం సదుపాయాల్లేని, ఏదో ఓ కళాశాలలో చేరాలని కాదు. అంతిమంగా... కాలేజీ పేరు ఎక్కడా ఉండదు... జేఎన్‌టీయూ అనో, ఓయూ అనో విశ్వవిద్యాలయం పేరిటే డిగ్రీ ఇస్తారు. కళాశాల అనేది సర్టిఫికెట్‌లో కనబడదు. కావాల్సిందల్లా సబ్జెక్ట్‌! నాలుగేళ్ల తర్వాత చదువెంత వచ్చిందనేది ముఖ్యం! కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నడవడిక ఎలా ఉన్నాయనేది కీలకం. మీ కళాశాలో ప్రాంగణ నియామకాలు లేకున్నా... కొన్ని కాలేజీలకు కలిపి ప్రాంగణేతర నియామకాల ప్రక్రియలు కూడా జరుగుతున్నాయి'' అని అమర్‌ అనే ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థి అన్నారు.
* ఎవరికే కోర్సు నప్పుతుందంటే.... - చెన్నకేశవరావు, ప్రధానాచార్యులు, సీబీఐటీ, హైదరాబాద్‌
''ఇంటర్‌ కాగానే చాలామంది విద్యార్థులపై వారి స్నేహితుల ప్రభావం ఉంటుంది. తమ స్నేహితులు ఎందులో చేరుతారో తామూ అందులో చేరాలనుకోవటం చాలామంది విషయంలో సహజం. లేదంటే బంధువులో, చుట్టుపక్కల వారి ప్రభావంతోనే ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌... మెకానికల్‌, సివిల్‌లో చేరతానంటూ చెప్పేస్తుంటారు. కానీ విద్యార్థికి ఏ సబ్జెక్ట్‌లో ఆసక్తి ఉంటుందో అందులోనే చేరాలి. వారికి ఆసక్తిగల సబ్జెక్ట్‌లకు, వారు బలంగా ఉన్న సబ్జెక్ట్‌లకు ఇంజినీరింగ్‌లో విభాగాలకు సంబంధముంటుంది. వాటి ఆధారంగా ఎంచుకుంటే ఫలితముంటుంది. తద్వారా ఇంజినీరింగ్‌లోనూ రాణించటానికి అవకాశముంటుంది. గణితం, భౌతికశాస్త్రంలో పట్టున్నవారు- ఈసీఈ, ఈఈఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌లను; కేవలం గణితంలో బాగుంటే - సీఎస్‌, ఐటీలను; కేవలం భౌతికశాస్త్రంలో బలంగా ఉంటే- మెకానికల్‌, మెకాట్రానిక్స్‌, మెటలార్జీ, ప్రొడక్షన్‌, ఆటోమొబైల్‌లను; రసాయన శాస్త్రంలో బాగా ఆసక్తి ఉంటే - సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీలను ఎంచుకుంటే బాగా రాణించే అవకాశముంది.''
ఆరా తీయాల్సినవి...
* కళాశాలల గురించి తెలుసుకునేప్పుడు కేవలం అంతర్జాలంపై ఆధారపడితే సరిపోదు. ప్రత్యక్షంగా వెళ్లి చూడాలి.
* బోధన ఎలా ఉందో... అర్హులైన బోధన సిబ్బంది ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. ప్రయోగశాలలు, గ్రంథాలయ సౌకర్యం, ఇతర సదుపాయాలెలా ఉన్నాయో చూసి, ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడాలి.
* జాతీయ గుర్తింపు మండలి (ఎన్‌బీఏ)గుర్తింపు ఉందోలేదో చూసుకోవాలి.
* ప్రాంగణ నియామకాల గురించి ఆరాతీయాలి. గతంలో ఎప్పుడెన్ని ఉద్యోగాలు వచ్చాయో గమనించాలి.
* గత సంవత్సరం ప్రవేశాలు ఎలా ఉన్నాయో కూడా చూడాలి.

posted on 29.5.2015