Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

చూసి ఆరాతీసి.. అడుగేయ్

* ఇంజినీరింగ్ కళాశాల ఎంపికలో జాగ్రత్త సుమా
* అప్రమత్తంగా లేకపోతే బోల్తా పడతారు
* 'గ్రూపు' సంస్థల అన్ని కళాశాలలనూ ఒక గాటన కట్టొద్దు
* భవనాలు, పచ్చదనం, ఆర్భాటాలకు మోసపోవొద్దు

      * మొదటి కౌన్సెలింగ్‌లో ఎక్కడో దూరంగా కళాశాలలో సీటు వచ్చింది... రెండో దశలో దగ్గరగా ఉన్న కాలేజీని ఎంచుకొని మా అమ్మాయిని చేర్చాను... ఇప్పుడు పొరపాటు చేశానని అర్థమైంది. మంచి కళాశాలకు బదులు దగ్గరగా ఉంటుందని మాత్రమే చూడటం వల్ల అమ్మాయి భవిష్యత్తును తలచుకుంటే ఆందోళనగా ఉంది.
- ఓ తండ్రి ఆవేదన
* ఓ ఏజెంట్ కలిసి అంతా తాను చూసుకుంటానని, ఫీజు చాలా తక్కువని చెబితే మా బాబును అక్కడ చేర్చాను. తీరా ఆ కళాశాలలో సరైన అధ్యాపకులే లేరు. పరిస్థితిని తలచుకుంటే భయమేస్తోంది.
* అధ్యాపకుల సంఖ్యను చూసి మోసపోయాం... వారంతా ఈ సంవత్సరమే కొత్తగా చేరారు. ఆ విషయాన్ని తాము గమనించలేదు. తర్వాత వారూ మారిపోయి కొత్త వాళ్లు రావడం... పోవడం నిత్యకృత్యంగా మారింది. దాంతో పాఠాలు అర్థం కాక మా బాబు చాలా ఇబ్బంది పడ్డాడు.
- ఓ విద్యార్థి తల్లి ఆవేదన
ఎంసెట్‌లో ర్యాంకు దక్కించుకున్న విద్యార్థులు... కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభానికి సమయం దగ్గర పడటంతో కళాశాలల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. తాము నివసించే ప్రాంతానికి దగ్గరగా ఉందనో... ఎవరో చెప్పారనో కళాశాలను ఎంచుకుంటే కెరీర్‌పరంగా కోలుకోలేని దెబ్బ తింటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాంగణ నియామకాల జాబితాను చూసి మోసపోవద్దని, వాటిపై లోతుగా ఆరా తీయడం మంచిదని సూచిస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలలను ఎంచుకోవడంలో తల్లిదండ్రులు... విద్యార్థులను కదిలిస్తే తాము చేసిన పొరపాట్లను కథలు కథలుగా చెప్పడం సాధారమైంది. అధిక శాతం మంది తాము చేరిన కళాశాలల్లోని పరిస్థితిని చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మంచి ర్యాంకు వచ్చి నిర్లక్ష్యం వల్ల తాము నాసిరకం కళాశాలలో చేరి భవిష్యత్తును ఫణంగా పెట్టామన్న ఆవేదన విద్యార్థుల్లో కనిపిస్తోంది. కొందరు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కొద్ది కళాశాలలను ఎంపిక చేసుకొని మొదటి దశలో సీట్లు రాక... రెండో విడత కౌన్సెలింగ్ నాటికి మెరుగైన కళాశాలల్లో సీట్లు నిండిపోయి నష్టపోతున్నారు. అధిక శాతం మంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల నాసిరకం కళాశాలల్లో చేరాల్సి వస్తోంది. హైదరాబాద్, చుట్టుపక్కల సుమారు 180కి పైగా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. కోర్సుతోపాటు కళాశాలను ఎంచుకోవడంలో భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జేఎన్‌టీయూహెచ్ కళాశాలలకు గ్రేడింగ్‌లు ఇవ్వకపోవడం, కనీసం ఏ జిల్లాలో ఏ కళాశాల ఉందో అన్న జాబితా కూడా వెబ్‌సైట్లో ఉంచకపోవడం వల్ల విద్యార్థులు గత ఏడాది నుంచి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
* ఏ సంవత్సరంలో కళాశాల స్థాపించారో పరిశీలించాలి. 2004 తర్వాత అనేక కళాశాలలను వ్యాపారం, ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం స్థాపించారన్న ఆరోపణలు ఉన్నాయి.
* పీహెచ్‌డీ ఉన్న అధ్యాపకులు ఎందరు ఉన్నారో గమనించాలి.
* కొన్ని గ్రూపులకు పలు విద్యా సంస్థలున్నాయి. అంటే ఒకటికి మించి అయిదారు కళాశాలలు ఆ యాజమాన్యం కింద ఉన్నాయి. అందులో కొన్ని కొద్ది సంవత్సరాల క్రితమే స్థాపించినవి. వాటిల్లో మౌలిక సదుపాయాలు ఉన్న కళాశాలలు కొన్నైతే... మరికొన్ని నాసిరకం. ఒకటీ రెండు కళాశాలల కారణంగా ఆ సంస్థకు మంచి పేరు వస్తోంది. మిగతా వాటిని యాజమాన్యం పెద్దగా పట్టించుకోదు. కళాశాలల పేర్లు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టి తప్పు దోవ పట్టిస్తాయి. ఒక కళాశాలకు ఇంజినీరింగ్, మరొక దానికి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇంకో దానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ... ఇలా పేర్లు ఉంటాయి. ఆప్షన్లు ఇచ్చుకునేటప్పుడు వీటిని గమనించాలి. లేకపోతే మీరు ఒక కళాశాల అనుకుంటే మరోదాన్లో సీటు వస్తుంది.
ఈ అంశాలను గమనించండి...
* కళాశాలలో తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్) గుర్తింపు ఇస్తారు. విభాగాల వారీగా నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్(ఎన్‌బీఏ) జారీ చేస్తారు. అవి ఉంటే కొంత వరకు పర్వాలేదని అనుకోవచ్చు. యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి(అటామనస్) దక్కిన కళాశాలలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. కొన్ని కళాశాలలకు విశ్వవిద్యాలయం నుంచి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. అందువల్ల స్వయంప్రతిపత్తి యూజీసీ ఇచ్చిందా? జేఎన్‌టీయూహెచ్ ఇచ్చిందా? అన్నది చూడాలి.
* ఇంటికి దగ్గరగా ఉంటే చాలు అన్న ఒక్క విషయానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. మెరుగైన కళాశాలలో సీటు వస్తే కొంత దూరమైనా చేరితే భవిష్యత్తు బాగుంటుంది.
* 100 శాతం ప్రాంగణ నియామకాలు అని ఉంటే గుడ్డిగా నమ్మవద్దు. కొన్ని కళాశాలలు బీపీఓ కంపెనీలను, అతి తక్కువ వేతనాలు ఇచ్చే కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తుంటాయి. ఏఏ కంపెనీలు ప్రాంగణ నియామకాలకు వచ్చాయి... ఏ నెలలో వస్తున్నాయి... ఎంత ప్యాకేజీ అనేదీ చూడాలి.
* కళాశాలను చూసి... ప్రిన్సిపాల్‌తో మాట్లాడి వెళ్లకుండా అక్కడ మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో మాట్లాడాలి. వారు ఇక్కడ చేరవచ్చు అంటే ఇక ఢోకా లేదు.
* అధ్యాపకుల సంఖ్యను కళాశాలలు భారీగా చూపుతాయి. వారికి తగిన విద్యార్హతలు ఉన్నాయో లేవో అన్నది చూసి ప్రతిఏటా జేఎన్‌టీయూహెచ్ ఆమోదం(ర్యాటిఫికేషన్) తెలుపుతారు. అలాంటి వారి శాతం ఎంత అన్నది చూడాలి.
* కొన్ని కళాశాలలకు శాశ్వత అనుబంధ గుర్తింపు(పర్మినెంట్ అఫిలియేషన్) జారీ చేస్తుంది. అంటే మూడేళ్లపాటు దీన్ని ఇస్తారు. అంటే ప్రతిఏటా తనిఖీ చేయాల్సిన అవసరం లేదు. ఇది జారీ చేయాలంటే కళాశాల ఏర్పాటు చేసి ఆరు సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 65 శాతం అధ్యాపకులకు తగిన విద్యార్హతలు ఉండాలి. విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి 1: 15 ఉండాలి.
వెబ్‌సైట్లపై వర్సిటీ కన్నేయాలి - డాక్టర్ కె.రవీంద్ర, నేషనల్ బోర్డు ఆఫ్ ఎక్రిడేషన్(ఎన్‌బీఏ) సభ్యుడు
చాలా కళాశాలలు ప్రాంగణ నియామకాలపై వాస్తవ విరుద్ధ సమాచారాన్ని ముద్రించుకుంటున్నాయి. అదే నిజమని విద్యార్థులు చేరి మోసపోతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు, విద్యార్థులు కళాశాలకు వచ్చి ప్రాంగణ నియామకాలు గురించే ఎక్కువ అడుగుతుంటారు. కొద్ది నెలల క్రితం రాష్ట్ర మంత్రి చెప్పినట్లుగా కళాశాలల పూర్తి వివరాలను వెబ్‌సైట్లో పెట్టాలి. తమకు 100 శాతం ప్రాంగణ నియామకాలు ఉన్నాయంటే దాన్ని పరిశీలించి జేఎన్‌టీయూహెచ్ ఆమోదం ఇచ్చిన కాపీలను వెబ్‌సైట్లో ఉంచాలి. ఎన్‌బీఏ గుర్తింపు ఉంటే ఏ బ్రాంచికి ఉందో కచ్చితంగా వెబ్‌సైట్లో పేర్కొనేలా విశ్వవిద్యాలయం చర్యలు తీసుకోవాలి. అధ్యాపకులు ఎన్ని సంవత్సరాలుగా కళాశాలలో పనిచేస్తున్నారో తల్లిదండ్రులు ఆరా తీయాలి. ప్రతిఏటా వారు మారుతున్నారంటే యాజమాన్యంలో లోపం ఉన్నట్లే.
ఈ నివేదికను అధ్యయనం చేయండి
జేఎన్‌టీయూహెచ్ 2014-15 విద్యా సంవత్సరానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం 288 కళాశాలలను బయట నిపుణులతో తనిఖీ చేయించి నివేదికను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచింది. హోంపేజీలోని అకడమిక్ ఆడిట్ సెల్ అనే విభాగంపై క్లిక్ చేస్తే ఆ నివేదికను చూడొచ్చు. మీ మదిలో ఉన్న కళాశాలలోని చాలా వరకు వివరాలను, ఆ కళాశాల పరిస్థితిని తెలుసుకోవచ్చు.

posted on 15.6.2015