Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

ఇదీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ తరుణమిది. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. తెలంగాణలో 18వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. ఈ కౌన్సెలింగ్‌ విధానం ఏ దశలో ఎలా ఉంటుందో వివరంగా...!
      సహాయకేంద్రాలకు వెళ్ళి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవడం, పాస్‌ వర్డ్‌ తయారీ, వెబ్‌ ఆప్షన్లు ఇవ్వటం, సీటు కేటాయింపు పొందటం, చివరకు కేటాయించిన కళాశాలలో చేరటం- స్థూలంగా ఇదీ వెబ్‌ కౌన్సెలింగ్‌ తీరు. ఈ ప్రక్రియ సులువైనదే. విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ దీనిపై అవగాహన పెంచుకుని, ప్రతి దశలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
విద్యార్థులు ఇంటి నుంచి గానీ హెల్ప్‌లైన్‌ సెంటర్‌/ ఇంటర్నెట్‌ కేఫ్‌ నుంచి గానీ.. వెబ్‌సైట్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
కౌన్సెలింగ్‌ ప్రకటనల్లో (ఆంధ్రప్రదేశ్‌: https://apeamcet.nic.in; తెలంగాణ: https://tseamcet.nic.in) పేర్కొన్న వివరాల ప్రకారం ముందు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. దీనికోసం నోటిఫికేషన్‌లోని షెడ్యూలు ప్రకారం సహాయక కేంద్రానికి (హెల్ప్‌లైన్‌ సెంటర్‌) హాజరు కావాలి.
సహాయ కేంద్రాల నుంచి చేయాల్సినవి
సహాయ కేంద్రం వద్ద అధికారి ఇచ్చే ప్రకటన కోసం వేచి ఉండాలి.
* అభ్యర్థి ప్రవేశద్వారం వద్ద తన ర్యాంకు కార్డును సంబంధిత అధికారికి ఇవ్వాలి.
* పిలుపు వచ్చేవరకూ రిజిస్ట్రేషన్‌ గదిలో వేచి ఉండాలి. పిలిచిన తరువాత రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రసీదు పొందాలి.
* రిజిస్ట్రేషన్‌ కౌంటరు వద్ద కంప్యూటర్‌ ఆపరేటర్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ కం వెరిఫికేషన్‌ ఫారాన్ని తీసుకోవాలి. మీ మొబైల్‌ నంబరు సరిగా ముద్రితమైందీ లేనిదీ సరిచూసుకోవాలి.
* అక్కడే ఉన్న రిజిస్టర్‌లో హాల్‌టికెట్‌ నంబరు, ర్యాంకు వివరాలను రాసి సంతకం చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లే.
ఒరిజినల్‌ సర్టిఫికెట్ల తనిఖీ
రిజిస్ట్రేషన్‌ కం వెరిఫికేషన్‌ ఫారం మీద సూచించిన వివరాలు సరిచూసుకోవాలి (లోకల్‌ ఏరియా, సెక్స్‌, మైనారిటీ, కేటగిరీ, స్పెషల్‌ రిజర్వేషన్‌ కేటగిరీ, పుట్టినరోజు, మొబైల్‌ నంబరు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అర్హత మొదలైనవి).
* ఎస్‌సీ/ ఎస్‌టీ/బీసీ కులాల అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని హాల్లో ఉన్న సంబంధిత డిపార్ట్‌మెంటల్‌ అధికారితో తనిఖీ చేయించుకోవాలి.
* అధికారులు ర్యాంకు కార్డు, హాల్‌టికెట్‌, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్‌, ఆదాయపత్రం మొదలైనవి తనిఖీ చేస్తారు.
* అభ్యర్థులందరూ తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ అధికారులతో తనిఖీ చేయించుకోవాలి.
* సహాయకేంద్రాల్లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వనక్కర్లేదు. రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు మాత్రమే అక్కడ తీసుకుంటారు.
* మాన్యువల్‌ ఆప్షన్‌ ఫారం అడిగి తీసుకుని, కౌన్సెలింగ్‌ హాలు నుంచి బయటకు రావచ్చు.
* కళాశాలల జాబితా, ట్యూషన్‌ ఫీజు వివరాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
మాన్యువల్‌ ఆప్షన్‌ ఫారం
చేరదలచిన కళాశాల, కోర్సు వివరాలు ప్రాధాన్యక్రమంలో అమర్చటమే 'ఆప్షన్లు ఇవ్వడం'. విద్యార్థి తన అభిరుచి, కుటుంబ ఆర్థిక స్తోమతలను బట్టి ప్రాధాన్యక్రమంలో వీలైనన్ని ఆప్షన్లను తయారు చేసుకోవాలి. అధ్యాపకుల, తల్లిదండ్రుల, బంధువుల, స్నేహితుల సలహాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
* మాన్యువల్‌ ఆప్షన్‌ ఫారంలో తాను చేరదలచిన కాలేజి కోడ్‌, జిల్లా కోడ్‌ వివరాలు ఆప్షన్‌ సంఖ్య ఎదురుగా గడుల్లో నింపాలి. ఈ కోడ్‌లను జాగ్రత్తగా చూసుకుంటూ నింపాలి.
ఆప్షన్లను ఎంచుకునేందుకు 1) కళాశాల ప్రాధాన్యం 2) కోర్సు ప్రాధాన్యం 3) ఈ రెండూ కలిసిన మిశ్రమ పద్ధతిని పాటించవచ్చు.
* సీటు కేటాయింపు అనేది ఆప్షన్ల ప్రాధాన్యక్రమంలోనే జరుగుతుంది. పలు విడతల్లో జరిగే ఈ ప్రక్రియ ప్రతిభ ప్రాతిపదికన ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్లనూ పరిగణనలోకి తీసుకుంటారు.
* కళాశాల, కోర్సుల్లో ఖాళీలను వెతికే క్రమంలో కంప్యూటర్‌ ప్రతిసారీ మెరుగైన ఆప్షన్‌ అందుబాటులో ఉందో లేదో చూస్తుంది.
* ఆప్షన్ల ఎంపికలో ప్రాథమ్యాలను నిర్ణయించడానికి గత సంవత్సరం అభ్యర్థులు కళాశాల, కోర్సులను ఎంచుకున్న తీరును పరిశీలించాలి. ఇందుకు కిందటి ఏడాదిలో ర్యాంకుల సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు.
వెబ్‌లో ఆప్షన్ల నమోదు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మాన్యువల్‌ ఆప్షన్‌ ఫారంలో ప్రాధాన్యక్రమాన్ని నిర్ణయించుకోవడం పూర్తయ్యాక వెబ్‌లో ఆప్షన్లను పొందుపరచాలి. దీన్ని ఇంటినుంచి/ ఇంటర్నెట్‌ కేఫ్‌/ సహాయక కేంద్రం నుంచి చేయవచ్చు.
వెబ్‌లో ఆప్షన్ల నమోదు నాలుగు అంచెల్లో ఉంటుంది. 1. ఇంటర్నెట్‌ ద్వారా యూఆర్‌ఎల్‌ ఎంటర్‌ చేయడం 2. పాస్‌వర్డ్‌ తయారీ 3. ఆప్షన్‌ నమోదు 4. లాగ్‌ అవుట్‌.
యూఆర్‌ఎల్‌ను ఎంటర్‌ చేయడం:
* ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ మీద రెండుసార్లు క్లిక్‌ చేయాలి.
* కంప్యూటర్‌లో విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టం, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ వెర్షన్‌ 9.0/ అంతకంటే ఎక్కువ ఉండాలి. నెట్‌స్కేప్‌ నేవిగేటర్‌, గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌లను ఉపయోగించి ఆప్షన్లు నమోదు చేయడానికి వీలుండదు.
* ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ర్యాంకర్లు https://apeamcet.nic.inనూ, తెలంగాణ ఎంసెట్‌ ర్యాంకర్లు https://tseamcet.nic.inనూ టైప్‌ చేయాలి. తరువాత Enter బటన్‌ నొక్కాలి.
* అపుడు హోం పేజీ కనిపిస్తుంది.
* దీనిలో కౌన్సెలింగ్‌ విధానం, కోర్సుల జాబితా, కళాశాలల సమాచారం, సహాయక కేంద్రాల వివరాలు మొదలైనవాటి లింకులుంటాయి.
పాస్‌వర్డ్‌ను ఏర్పరచుకోవడం
* కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాస్‌వర్డ్‌ చాలా ముఖ్యమైనది. ఇది ఏటీఎం ఉపయోగించేటపుడు పిన్‌ లాంటిది.
* దీన్ని ఇతరులకు తెలియకుండా రహస్యంగా ఉంచుకోవడం అభ్యర్థి బాధ్యత.
* అభ్యర్థి లాగిన్‌ అవ్వాలన్నా, ఆప్షన్లు నమోదు చేయాలన్నా, నమోదైన ఆప్షన్లను మార్చాలన్నా, ఆప్షన్లు సేవ్‌ చేయటం/తొలగించటం చేయాలన్నా, అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ ప్రింట్‌ తీసుకోవాలన్నా పాస్‌వర్డ్‌ అవసరం.
* పాస్‌వర్డ్‌ను రూపొందించుకోవటానికి Candidates Regisration ను క్లిక్‌ చేయాలి. రిజిస్ట్రేషన్‌ నంబర్‌, హాల్‌టికెట్‌ నంబర్‌, ర్యాంకు, పుట్టినతేదీ నమోదు చేయాలి.
* Generate password బటన్‌ను క్లిక్‌ చేయాలి.
* తెరమీద Candidate Detailsఅనే శీర్షికతో వివరాలు కనిపిస్తాయి. Pasword, Re-enter password అనే చోట్ల మీరు ఒక పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి.
* మీ పాస్‌వర్డ్‌ 8 నుంచి 10 కారెక్టర్ల నిడివి ఉండాలి. ఇందులో అక్షరాలతోపాటు కనీసం ఒకటైనా అంకె ఉండేలా చూడాలి.
ఉదా: EAMCET12, krishna123, 98765432H మొదలైనవి.
* ఆ పాస్‌వర్డ్‌ను Re-enter password దగ్గర కూడా ఎంటర్‌ చేయాలి.
* మొబైల్‌ ఫోన్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ కూడా నమోదు చేయాలి.
* Save Pasword అనేచోట క్లిక్‌ చేసి పాస్‌వర్డ్‌ను సేవ్‌ చేసుకోవాలి.
* Log Out క్లిక్‌ చేయాలి. దీంతో హోమ్‌ పేజీకి వస్తారు.
ఆప్షన్ల నమోదు
మాన్యువల్‌ ఆప్షన్‌ ఫారంపై ముందస్తు కసరత్తు (ప్రిపరేటరీ వర్క్‌) చేయకుండా నేరుగా వెబ్‌పై ఆప్షన్లు ఇవ్వకూడదు. దీనివల్ల పొరపాట్లు దొర్లుతాయి.
* ఆప్షన్లు ఇవ్వటానికి... హోం పేజిలోని Candidate login బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. లాగిన్‌ ఐడీ రహస్య సంఖ్య. దీన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఆప్షన్ల నమోదుకు ముందే పంపుతారు.
* క్యాండిడేట్‌ లాగిన్‌లో వివరాలు నింపితే ఆప్షన్లు ఇవ్వడానికి వీలవుతుంది.
వన్‌ టైం పాస్‌వర్డ్‌
* ఆప్షన్ల నమోదును మరింత భద్రంగా ఉంచడం కోసం 'వన్‌ టైం పాస్‌వర్డ్‌' (ఓటీపీ) ని ప్రవేశపెట్టారు. అభ్యర్థి లాగిన్‌ అయి, పేజీలోకి ప్రవేశించగానే ఓటీపీని మొబైల్‌ నంబరుకు పంపుతారు.
* నిర్దేశించిన బాక్సులో వన్‌టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
* డిక్లరేషన్‌ చదివి, దాన్ని నిర్ధారిస్తూ చెక్‌బాక్సులో రైట్‌ గుర్తును క్లిక్‌ చేయాలి.
* Click here for option entryని క్లిక్‌ చేయాలి.
* Help screen ను క్లిక్‌ చేస్తే ఆప్షన్‌ ఎంట్రీ ఫారమ్‌లో వివిధ మెనూ ఐటమ్స్‌ చూడొచ్చు.
* సాంకేతిక కారణాలతో- ఓటీపీ ఎంట్రీ బాక్సుపై error in sending OTP to your mobile అని కనపడినా/ ఓటీపీ మీ మొబైల్‌కు పంపినప్పటికీ అందకపోతే ఐదు నిమిషాలు ఆగాలి. తర్వాత కొత్త ఓటీపీ కోసం Click Here క్లిక్‌ చేయాలి.
* ఒకటి లేదా ఎక్కువ జిల్లాలను ఎంచుకోవాలి. అప్పుడు ఆ జిల్లాల్లోని కళాశాలలు, వాటిలో కోర్సులు కనపడతాయి.
* స్క్రీన్‌ మీద యూనివర్సిటీ కళాశాలు, మహిళా కళాశాలలు, మైనారిటీ సంస్థలు వేర్వేరు రంగుల్లో కనపడతాయి.
* ఎంసెట్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ నింపాలి.
* అప్పటికే నింపివున్న మాన్యువల్‌ ఆప్షన్‌ ఫారాన్ని చూస్తూ చేరదలచుకున్న కళాశాల, కోర్సు ఎదురుగా ఉన్న బాక్సులో ఎంచుకున్న ప్రాధాన్య సంఖ్యను నమోదు చేయాలి.
* నింపిన ఆప్షన్లను తరచూ సేవ్‌ చేస్తూ ఉండాలి. సేవ్‌ చేసిన ఆప్షన్లను చూడడానికి ప్రింట్‌ తీసుకోవచ్చు.
* Change password Menu Button ఉపయోగిస్తూ పాస్‌వర్డ్‌ మార్చుకోవచ్చు.
LOG OUT
ఆప్షన్ల నమోదు పూర్తయిన తరువాత లాగవుట్‌ కావాలి.
* ఆప్షన్ల నమోదు తర్వాత Log out క్లిక్‌ చేస్తే మూడు హెచ్చరికలు కనిపిస్తాయి. అవి..
a. Save and log out
b. Confirm log out
c. Cancel log out
* Cancel log out మీద క్లిక్‌ చేస్తే అప్పటివరకూ ఇచ్చిన ఆప్షన్లతో తిరిగి Option entry formకు చేరుకుంటారు.
* Save & log out మీద క్లిక్‌ చేస్తే అప్పటివరకూ మాత్రమే ఇచ్చిన ఆప్షన్ల వివరాలు సేవ్‌ అయి స్క్రీన్‌ మీద కనిపిస్తాయి.
* Confirm log out మీద క్లిక్‌ చేస్తే అప్పటివరకూ సేవ్‌ చేసిన ఆప్షన్ల వివరాలు మాత్రమే స్క్రీన్‌ మీద కనిపిస్తాయి.
* నిర్ణయించిన గడువు నాటికి సర్వర్‌లో రికార్డు చేసిన ఆప్షన్లను స్థిరం (ఫ్రీజ్‌) చేస్తారు.
* స్థిరీకరించిన ఆప్షన్లను మళ్లీ మార్చాలనుకుంటే అభ్యర్థి ఏదో ఒక సహాయక కేంద్రానికి వెళ్లి నిర్ణయించిన తేదీలోపు స్థిరీకరించిన ఆప్షన్లను ఒకసారి మార్చుకోవచ్చు.
ఆ మార్పు తరువాత సర్వర్‌లో రికార్డయిన ఆప్షన్లను మాత్రమే సీట్ల కేటాయింపునకు పరిగణిస్తారు. నమోదు చేసిన ఆప్షన్లను ప్రింటవుట్‌ తీసుకోవచ్చు.
* ఆప్షన్లు నమోదు చేసి, లాగవుట్‌ అయ్యాక బ్రౌజర్‌ను మూసేయాలి.
సీట్ల కేటాయింపు
విద్యార్థి వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఇచ్చిన ఆప్షన్ల ప్రాధాన్యక్రమంలో అతి మెరుగైన సీటును పొందే వీలుంది. కేటాయింపు వివరాలన్నీ వెబ్‌సైట్లో ఉంటాయి. Candidate login ద్వారా అభ్యర్థి Allotment order ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
'సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.900; ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులు రూ. 450 చెల్లించాల్సివుంటుంది. మొదటిదశ కౌన్సెలింగ్‌ తర్వాత కేటాయింపు జరిగిన సీటుకు సంబంధించి సెల్ఫ్‌ లాగిన్‌ ద్వారా గానీ, సహాయకేంద్రంలో గానీ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవచ్చు. రెండోదశ కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత మాత్రమే- కేటాయించిన కళాశాలలో ఫీజు కట్టి, ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో రిపోర్ట్‌ చేయాలి.'
- డా. కె. రఘునాథ్‌, ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ క్యాంప్‌ ముఖ్యాధికారి
వెబ్‌కౌన్సెలింగ్‌ సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.800; ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులు రూ. 400 చెల్లించాల్సివుంటుంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినవారు ఫీజును చలానా ద్వారా చెల్లించి, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవచ్చు. సహాయకేంద్రంలో అయినా రిపోర్ట్‌ చేయవచ్చు. తుది దశ కౌన్సెలింగ్‌ తర్వాత మాత్రమే సంబంధిత కళాశాలలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాల్సివుంటుంది.'
- బి. శ్రీనివాస్‌, తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ క్యాంప్‌ అధికారి
ఇవి గమనించండి!
1. అన్ని ధ్రువపత్రాల (సర్టిఫికెట్ల) జిరాక్స్‌ కాపీలు కనీసం రెండు సెట్లు తయారుగా ఉంచుకోండి.
2. ఒరిజినల్‌ సర్టిఫికెట్లనూ, డబ్బునూ అనధికార వ్యక్తులకు ఇవ్వకూడదు.
3. మీ పాస్‌వర్డ్‌ ఏమిటో ఎవరికీ చెప్పవద్దు. సహాయకేంద్రంలో వారికైనా, ఇంటర్‌నెట్‌ కేంద్రం వారికైనా, మీ స్నేహితులకైనా, బంధువులకైనా సరే- ఆ పాస్‌వర్డ్‌ తెలియనీయకూడదు. సిస్టమ్‌లో పాస్‌వర్డ్‌ను మీరు మాత్రమే ఎంటర్‌ చేయండి.
4. సీట్ల కేటాయింపులు ప్రతిభ ఆధారంగానే జరుగుతాయి. 'ఫలానా కళాశాలలో గ్యారంటీగా సీటు ఇప్పిస్తా'నంటూ చెప్పే మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దు.
5. ఏ సందేహం వచ్చినా సహాయకేంద్రాల్లో సిబ్బంది సహకారం తీసుకోండి.
6. ఆప్షన్‌ నమోదు చేసి లాగవుట్‌ అయ్యాక ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను మూసివెయ్యండి.
ఫీజు కట్టే విధానం
ఫీజు చెల్లించేందుకు చలానా ఫారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* సీటు కేటాయింపు పొందిన అభ్యర్థి ఫీజును Allotment order సహా ఆంధ్రాబ్యాంకు/ ఇండియన్‌ బ్యాంకులో (రాష్ట్రంలోని ఏదో ఒక బ్రాంచిలో) చెల్లించి రసీదు తీసుకోవాలి.
రిపోర్ట్‌ చేయడం
డౌన్‌లోడ్‌ చేసుకున్న అలాట్‌మెంట్‌ ఆర్డరు, ఫీజు రసీదు మొదలైన వాటితో దగ్గర్లో ఉన్న సహాయకేంద్రంలో రిపోర్ట్‌ చేయాలి.
మలిదశ కౌన్సెలింగ్‌
మొదటి దశ కౌన్సెలింగ్‌లో కొన్ని సీట్లు మిగిలిపోతాయి. కేటాయించినా విద్యార్థులు చేరక ఇంకొన్ని రద్దవుతాయి. అలాగే కొత్తగా అనుమతి పొందిన కళాశాలల్లో సీట్లు వస్తాయి. వీటన్నింటికీ మలిదశలో కౌన్సెలింగ్‌ జరుగుతుంది.
* మొదటిదశ కౌన్సెలింగ్‌లో పాల్గొననివాళ్లు, సీటు కేటాయింపు పొందని వాళ్లు మలిదశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. సీటు వచ్చి కళాశాల నచ్చకపోతే ఫీజు కట్టకూడదు. ఇలాంటి అభ్యర్థులు మలిదశలో పాల్గొనవచ్చు.
* అభ్యర్థి తనకు కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేసి, ఫీజు కట్టి ఉన్నా సరే... మలివిడత కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. మలివిడతలో మరో కళాశాలలో సీటు కేటాయిస్తే తొలివిడతలో పొందిన సీటు రద్దవుతుంది.
సీటు రద్దు చేసుకోవడం
అన్ని దశల్లో ఎలాట్‌మెంట్‌ పూర్తయిన తరువాత కూడా విద్యార్థి కేటాయించిన సీటు వద్దనుకుంటే నిర్దేశిత తేదీలోగా ఆ పని చేయవచ్చు. ఆ తేదీ తర్వాత ఇక కన్వీనర్‌కు సంబంధం ఉండదు. విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ విచక్షణకు వదిలేస్తారు.
పాస్‌వర్డ్‌ మరచిపోతే?
పాస్‌వర్డ్‌ను మరచిపోతే కాండిడేట్స్‌ లాగిన్‌లో Forgot your password లింకును క్లిక్‌ చేయాలి. రిజిస్ట్రేషన్‌ నంబరు, ర్యాంకు, ఎంసెట్‌ హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టినతేదీ నమోదు చేయాలి. Get new password క్లిక్‌ చేయాలి. కొత్త పాస్‌వర్డ్‌ మొబైల్‌కుగానీ, మెయిల్‌కుగానీ వస్తుంది. అందుకున్నాక దాన్ని ఆప్షన్‌ నమోదులో ఉపయోగించవచ్చు.

posted on 15.6.2015