Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

ఉపాధికి వేదిక... సీఎస్‌ఈ

ఇంజినీరింగ్‌లో ప్రధానశాఖల్లో ఒకటైన కంప్యూటర్‌సైన్స్‌ శాస్త్ర సాంకేతిక రంగాలతోపాటు సామాజిక జీవనశైలినీ ప్రభావితం చేయగలుగుతోంది. దీని ప్రభావానికి గురికాని రంగమేదీ లేదు. ఇంజినీరింగ్‌లో వేగంగా ఉద్యోగాలు అందించేదిగా ఈ శాఖకు ప్రసిద్ధి. కంప్యూటర్‌ సైన్స్‌ వారికే కాక ఇతర శాఖల అభ్యర్థులకు కూడా దీనిలో అవకాశాలుంటాయి.
      కష్టసాధ్యమైన సమస్యలకు సులువైన విధానంలో సమాధానాలు రాబట్టే విధానాల బోధన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ మూల పాఠ్యాంశం. నిజానికి ఈ శాఖలో కంప్యూటర్ల గురించి తక్కువ, వివిధ రంగాల్లో కంప్యూటర్‌ల వినిమయం గురించి ఎక్కువ అధ్యయనం చేస్తారు.
సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, హార్డ్‌వేర్‌ నిర్మాణ వివరాలు, నెట్‌వర్కింగ్‌ వంటి టెక్నాలజీలకు సంబంధించి కంప్యూటర్‌సైన్స్‌ మౌలిక సూత్రాలు దీనిలో నేర్పుతారు. ఇందులో భాగంగా వివిధ తరహాల సమస్యలకు క్రమసూత్ర పద్ధతుల అభివృద్ధి, వాటిని కంప్యూటర్‌లో ఆచరణలో పెట్టగలిగిన ప్రోగ్రాములుగా రాయడం గురించి బోధన ఉంటుంది. ఇంజినీరింగ్‌ ప్రక్రియకు మూలమైన వ్యవస్థాగత దృష్టి (సిస్టమ్‌ వ్యూ) తయారీ, ఆర్థిక విషయాలకు సంబంధించిన అంశాలు, బహుళ విషయిక ఇంజినీరింగ్‌ అనువర్తనానికి (మల్టీ డిసిప్లినరీ ఇంజినీరింగ్‌ అప్లికేషన్స్‌) సంబంధించిన విజ్ఞానం నేర్చుకుంటారు.
ఈ బ్రాంచికి కొన్ని విశిష్టతలున్నాయి.
* ఈ రంగాన్ని టెక్నాలజీ, సైన్స్‌, సామాజిక విషయాల సమాహారంగా పరిగణిస్తారు.
* ఒక సమస్యను వివిధ రీతుల్లోనే కాకుండా, వినూత్నమైన రీతిలో ఎలా సాధించగలమో తెలుసుకోవచ్చు.
* నూతన సాంకేతికతల సృష్టికర్తలుగా అయ్యే అవకాశాలు పుష్కలం (ఉదా: ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు).
* కంప్యూటర్లను వివిధ రంగాల్లో సమర్థంగా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవచ్చు.
* మానవులకు ప్రత్యక్షంగా పనిచేసే వీలులేని పరిస్థితుల్లో కంప్యూటర్లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు- అత్యధిక వేడి, రసాయనాల వల్ల కలిగే ప్రమాదకర పరిస్థితుల్లో దూరం నుంచే వీటి నియంత్రణకు కంప్యూటర్లు వీలు కలిగిస్తాయి (రిమోట్‌ కంట్రోల్‌ వ్యవస్థ).
* వివిధ టెక్నాలజీల రూపకల్పన, ప్రస్తుతమున్న టెక్నాలజీల వినూత్న పునః రూపకల్పన సాధ్యమవుతుంది.
ప్రోగామింగ్‌కే పరిమితం కాదు
కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కేవలం ప్రోగ్రామింగ్‌కే పరిమితం కాదు. నిజానికి 80- 85% ఇతర విధులు ఉంటే కేవలం 15- 20% వరకే ప్రోగ్రామింగ్‌ పని ఉంటుంది.
ఈ బ్రాంచిని ఎంచుకోదల్చినవారికి వివిధ రకాల, స్థాయుల వ్యక్తులతో సముచిత రీతిలో మాట్లాడడం రావాలి. భావప్రకటన సామర్థ్యం ఉండాలి. కంప్యూటర్‌ రంగం మానవ వనరుల అవసరాలపై ఆధారపడి పనిచేసే పరిశ్రమ. ఒక సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేయాలంటే ఎందరో మానవ బృందాల సమష్టి కృషి అవసరం. అంటే ఎన్నో రకాల చర్చల అవసరం కలుగుతుంది. కాబట్టి మానవ సంబంధాలు, ప్రవర్తన చాలా అవసరమవుతాయి.
దీనిలో రాణించాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. అధ్యాపకుల తోడ్పాటుతో పాటు విద్యార్థి కృషీ ఎంతో అవసరం. తర్కం పెంపొందించుకోవాలంటే చర్చలు అవసరం. తరగతిలో కూర్చుని పాఠాలు వింటూ మౌనంగా ఉండడం కన్నా సబ్జెక్టుకు సంబంధించిన అంశాలపై బెరుకులేని చర్చలకు చొరవ తీసుకోవాల్సివుంటుంది.
విద్య, ఉద్యోగావకాశాలు
అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించే రంగమిది. ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్లేవారిలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులే అత్యధికులు. మనదేశంలోనే ఈనాడు కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంటెక్‌ స్థాయిలో చాలా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన రంగంలో సంప్రదాయికమైన సీఎస్‌ఈనే కాకుండా వెబ్‌ టెక్నాలజీస్‌, ఇంటర్నెట్‌ టెక్నాలజీస్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ వంటి కొత్త కోర్సులున్నాయి. పరిశోధనకు కూడా ఎంతో అవకాశమున్న రంగమిది. సమీప భవిష్యత్తులో ఎంటెక్‌ స్థాయిలో ఇంకా ఎన్నో ప్రత్యేక కోర్సులు ప్రారంభించడానికి అవకాశాలున్నాయి.
ఎందుకు చదవాలి?
1. ప్రతి చర్యలో అంతర్భాగం: కంప్యూటింగ్‌, కంప్యూటర్‌ టెక్నాలజీ మనం చేసే ప్రతి పనిలోనూ ఉపయోగమవుతాయి. సినిమాల వంటి వినోదం నుంచి వ్యాపార లావాదేవీలు, ప్రభుత్వ యంత్రాంగం పనితీరు వరకు కంప్యూటింగ్‌ ప్రక్రియ ఉంది. ఈ కంప్యూటింగ్‌ ప్రక్రియ వివిధ పార్శ్వాల సమగ్ర అవగాహన ఆధునిక జీవన విధానానికి ఆవశ్యకం.
2. జటిల సమస్యలకు సమాధానాలు: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ సమాజం ఎదుర్కొంటున్న జటిలమైన సమస్యలను సాధించడమే కాకుండా సమర్థ సమాధానాల అభివృద్ధికి మెలకువలను నేర్పిస్తుంది. దీనికితోడు సున్నితమైన, వూహాత్మకమైన ఆలోచనాసరళిని నేర్చుకుని అభివృద్ధి చేసుకునే వీలుంటుంది.
3. సమాజంపై ప్రభావం: కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ శాస్త్ర రంగాల్లో నూతన ఆలోచనా ధోరణికి ప్రేరకశక్తి. జీనోమ్‌, ప్రమాదకార రోగ నిరోధకాల అభివృద్ధినే కాక, వాణిజ్యం, విద్యవంటి రంగాలపై కూడా అపరిమిత ప్రభావం చూపిస్తుంది. తమ వంతు సేవ చేసి సమాజంపై ప్రభావం చూపించాలనుకునేవారికి ఈ శాఖ పుట్టినిల్లు లాంటిది.
4. ఆకర్షణీయమైన కెరియర్‌: ఈ రంగంలో వృత్తిపరమైన సంతృప్తే కాకుండా అత్యధిక పారితోషికాలు కూడా ప్రోత్సాహకాలుగా లభిస్తాయి. ఈ రంగం వర్థమాన రంగం కావడం వల్ల నూతన ఆవిష్కరణలకు వినూత్న రీతిలో సమాధానాలు పెంపొందించడానికి ఆస్కారముంది. దీనివల్ల వాణిజ్య అభివృద్ధికీ- తద్వారా వ్యక్తిగతంగా సాంకేతికంగానే కాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడం సులభం.
స్టార్టప్‌ సంస్థల్లో అత్యధిక సంఖ్య ఈ రంగానికి చెందినవే అంటే ఈ రంగంలో ఎన్ని అవకాశాలున్నాయో తెలుస్తుంది. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువే. ఈ ధోరణి ఇంకా కొనసాగుతుందని నిపుణుల అభిప్రాయం.
5. పరిమితులు లేని అవకాశాలు: కంప్యూటర్‌ రంగం వేగంగా మారుతున్న రంగం. దీనివల్ల కంప్యూటింగ్‌ వ్యవస్థ నిరంతరం అభివృద్ధికి లోనవుతోంది. అందువల్ల ఈ రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు.

posted on 23.6.2015