Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Eamcet - Preparation Plan

రెండు గ్రూపులకూ మెరుగైన కోర్సు

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులకు దీటైన ప్రత్యామ్నాయ కోర్సుల్లో ప్రథమశ్రేణిలో నిలిచేది ఫార్మసీ. ఇంటర్‌ బైపీసీ, ఎంపీసీ... రెండు గ్రూపుల విద్యార్థులకూ దీనిలో ప్రవేశం లభిస్తుంది. దీని ప్రాధాన్యం, అవకాశాలేమిటో పరిశీలిద్దామా?
ప్రస్తుతం మనదేశంలో ఫార్మా పరిశ్రమ వేగంగా దూసుకుపోతోంది. లక్షా ఎనభైవేల కోట్ల వార్షిక టర్నోవర్‌ నమోదు చేసుకుంది. ఇదే వేగంతో అభివృద్ధి చెందితే 2020నాటికి ఈ టర్నోవర్‌ రెట్టింపు కాగలదని నిపుణుల అంచనా. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఫార్మసిస్టుల సంఖ్య రెట్టింపు కావాల్సివుంటుంది.
ఈ కారణంగానే ఫార్మసీ కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఎంపీసీ విద్యార్థులు రెమిడియల్‌ బయాలజీనీ; బైపీసీ విద్యార్థులు రెమెడియల్‌ మ్యాథ్స్‌ సబ్జెక్టునూ ఫార్మసీ మొదటి సంవత్సరంలో చదవాల్సివుంటుంది.
రెండు రకాల కోర్సులు
ఫార్మసీలో 2 రకాల డిగ్రీ కోర్సులున్నాయి. 4 సంవత్సరాల బి- ఫార్మసీ కోర్సు, 6 సంవత్సరాల ఫార్మా-డి కోర్సు.
* బి-ఫార్మసీ: మనదేశంలో బి- ఫార్మసీ కోర్సు బోధనాంశాలు అభివృద్ధి చెందిన దేశాల్లోని ఫార్మసీ కోర్సులకు భిన్నం. ఇవి ఫార్మా ఇండస్ట్రీ ఓరియంటెడ్‌గా ఉంటాయి. బి- ఫార్మసీలో ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌, ఫిజియాలజీ మొదలైన సబ్జెక్టులతోపాటు అన్ని రకాల ఔషధాలు తయారుచేసే విధానాలు, తయారైన ఔషధాల నాణ్యతను విశ్లేషించే మెలకువలు నేర్పిస్తారు.
ఫార్మా రంగంలో ఎదగాలంటే నాణ్యతగల ఫార్మసీ కళాశాలలో చదవటంతో పాటు ఫార్మా పరిశ్రమలో కొంతకాలం శిక్షణ పొందాల్సి ఉంటుంది. కానీ చాలా కళాశాలలు పరిశ్రమకు సంబంధించిన శిక్షణ అవకాశం కల్పించటం లేదు.
* ఫార్మా -డి కోర్సు: ఫార్మసీలో ప్రొఫెషనల్‌ డాక్టర్‌ డిగ్రీ అందించే ఆరు సంవత్సరాల ఫార్మా-డి కోర్సు పూర్తిగా క్లినికల్‌ ఓరియెంటెడ్‌. ముఖ్యంగా క్లినికల్‌ ఫార్మసీ, హాస్పిటల్‌ ఫార్మసీ, ఫార్మకో థిరాప్యూటిక్స్‌ లాంటి అనేక అంశాల్లో శిక్షణ ఇస్తారు.
ఫార్మా-డి విద్యార్థులకు మొదటి మూడు సంవత్సరాలు బి- ఫార్మసీ విద్యార్థులకు మాదిరిగానే కళాశాలలో పాఠ్యాంశాలు బోధిస్తూ ప్రాక్టికల్స్‌ చేయిస్తారు. అదనంగా ప్రతినెలా ఆస్పత్రి సందర్శన ఉంటుంది. నాలుగో సంవత్సరంలో వారానికి రెండు రోజులు ఆస్పత్రి సందర్శనలుంటాయి. ఐదో సంవత్సరంలో ప్రతిరోజూ ఒకపూట విధిగా ఆస్పత్రిలో బెడ్‌సైడ్‌ ట్రెయినింగ్‌ వార్డుల్లో రౌండ్లుంటాయి. ఆరో సంవత్సరంలో పూర్తిగా ఆస్పత్రిలోనే ఇంటర్న్‌షిప్‌/ రెసిడెన్సీ చేయాల్సి ఉంటుంది.
300 పడకల హాస్పిటల్‌ ఒప్పందం తప్పనిసరి: ఫార్మా- డి కోర్సు అందించే ప్రతి కళాశాలకూ కనీసం 300 పడకలు కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అనుబంధంగా ఉండాలి. లేదా అలాంటి సదుపాయాలున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో ఒప్పందం చేసుకుని ఉండాలి. ఈ ఆస్పత్రిలో క్లినికల్‌ ఫార్మసీ, డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌ విభాగం, పేషెంట్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ తప్పనిసరిగా ఉండాలి.
ఇంటర్‌ విద్యార్థులు ఫార్మా- డి కోర్సును ఎంచుకునేటపుడు అన్ని సదుపాయాలున్న ఆస్పత్రితో ఒప్పందమున్న కళాశాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం.
సీట్లలో సగం- సగం
బి-ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో సగం సీట్లు ఇంటర్‌ మేథ్స్‌వారికి, మిగతా సగం బయాలజీ చదివినవారికి ఎంసెట్‌తో వచ్చిన ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారు. డిప్లొమా ఇన్‌ ఫార్మసీ చదివినవారు కూడా ఫార్మా-డి కోర్సులో చేరడానికి అర్హులు.
మంచి కళాశాలలో బి-ఫార్మసీ కోర్సు చదివి నైపుణ్యం సాధించినవారి కోసం ఫార్మా పరిశ్రమలో ఉద్యోగావకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఔషధాలు తయారుచేసే మాన్యుఫాక్చరింగ్‌ కెమిస్ట్‌, ఔషధాల నాణ్యత విశ్లేషించే ఎనలిటికల్‌ కెమిస్ట్‌ కొలువులతోపాటు క్వాలిటీ ఎస్యూరెన్స్‌, డ్రగ్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌, ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో అవకాశాలుంటాయి. కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్‌ ఫార్మసీ, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఫార్మకో విజిలెన్స్‌ రంగాల్లో ఫార్మసీ చదివినవారి కోసం అనేక ఉద్యోగాలున్నాయి. ఎం.ఫార్మసీ చదివినవారు ఫార్మసీ కళాశాలలో లెక్చరర్‌ పోస్టులకు అర్హులు.
ప్రభుత్వరంగంలో...
నాణ్యమైన ఔషధాలను సరసమైన ధరలకు ప్రజలకు అందించడంలో ఔషధ నియంత్రణ అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. పార్లమెంటరీ సబ్‌ కమిటీ ఇటీవల చేసిన సిఫారసుల మేరకు కల్తీ మందులు అరికట్టే ప్రక్రియలో భాగంగా వేలమంది డ్రగ్‌ ఇన్స్పెక్టర్లు, ప్రభుత్వ ఎనలిస్టుల ఉద్యోగాలు రానున్న సందర్భం ఫార్మసీ చదివినవారికి మంచి అవకాశమని చెప్పవచ్చు.
క్లినికల్‌ రీసెర్చ్‌: అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనదేశంలో క్లినికల్‌ పరిశోధనలకు అతి తక్కువ ధనం ఖర్చవుతుంది. కాబట్టి అనేక బహుళజాతి ఫార్మా సంస్థలు క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇటీవల కొన్ని సంస్థలు క్లినికల్‌ట్రయల్స్‌ లోపభూయిష్ఠంగా నిర్వహించడం వల్ల ఈ పరిశ్రమ కొంతవరకూ కుంటుపడినా త్వరలో కోలుకొని అనేక బి-ఫార్మసీ, ఫార్మా-డి చదివినవారికి అవకాశాలు కలుగుతాయి. ఫార్మకో విజిలెన్స్‌, క్లినికల్‌ ట్రయల్స్‌, హాస్పిటల్‌ ఫార్మసీ, క్లినికల్‌ ఫార్మసీ రంగాల్లోని అనేక వేల ఉద్యోగాలకు ఫార్మా-డి చదివినవారు అతికినట్లుగా సరిపోతారు. అయితే ఈ రంగాల్లో అభివృద్ధి అంతమాత్రంగానే ఉంది.
బి-ఫార్మసీ కళాశాలల వివరాలు
దేశంలో 1200 ఫార్మసీ కళాశాలలున్నాయి. వీటిలో సుమారు 81వేల బి-ఫార్మసీ సీట్లున్నాయి. వీటిలో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు ఉన్న కళాశాలలు 1008 మాత్రమే.
ఆంధ్రప్రదేశ్‌: 7 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బి-ఫార్మసీ కోర్సును అందిస్తున్నాయి. వీటిలో బి-ఫార్మసీ సీట్ల సంఖ్య 380. మరో డీమ్డ్‌ యూనివర్సిటీ కూడా బి-ఫార్మసీ కోర్సును అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 122 ఫార్మసీ ప్రైవేటు కళాశాలలు 10,100 బి-ఫార్మసీ సీట్లను అందిస్తున్నాయి.
బి-ఫార్మసీ అందించే విశ్వవిద్యాలయాల్లో సీట్లు
1. ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం- 40
2. జేఎన్‌టీయూ, కాకినాడ- 60
3. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి- 40
4. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి- 60
5. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం- 60
6. జేఎన్‌టీయూ, అనంతపురం- 60
7. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు- 60
మొత్తం 380 సీట్లు
ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఎన్ని కళాశాలలు?
శ్రీకాకుళం- 2, విజయనగరం- 7
విశాఖపట్నం- 10, తూర్పుగోదావరి- 12
పశ్చిమగోదావరి- 10, కృష్ణా- 11
గుంటూరు- 23, ప్రకాశం- 11 మొత్తం 86
శ్రీ వెంకటేశ్వర పరిధిలో ఎన్ని కళాశాలలు?
నెల్లూరు - 11, చిత్తూరు - 9
కడప - 7, అనంతపురం - 2
కర్నూలు- 7 మొత్తం 36
తెలంగాణలో ఫార్మసీ కళాశాలలు
తెలంగాణలో మూడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు బి-ఫార్మసీ కోర్సు అందిస్తున్నాయి. వాటిలోని సీట్ల సంఖ్య 160.
బి-ఫార్మసీ కోర్సు విశ్వవిద్యాలయాల్లో సీట్లు
1. కాకతీయ విశ్వవిద్యాలయం - 40
2. పాలమూరు విశ్వవిద్యాలయం - 60
3. శాతవాహన విశ్వవిద్యాలయం - 60
మొత్తం - 160 సీట్లు
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేటు ఫార్మసీ కళాశాలలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 169 ప్రైవేటు ఫార్మసీ కళాశాలలు 12,060 బి-ఫార్మసీ సీట్లను అందిస్తున్నాయి. ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణలో 48 కళాశాలలకు 100 చొప్పున బి-ఫార్మసీ సీట్లకు అనుమతినిచ్చింది. మిగతా 121 కళాశాలలు 60 మందిని మాత్రమే బి-ఫార్మసీలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ అనేక కళాశాలలకు 120- 180 సీట్ల వరకు అనుమతినిచ్చింది.
తెలంగాణ ఫార్మసీ కళాశాలలు- ఏ జిల్లాలో ఎన్ని?
హైదరాబాద్‌ 12, కరీంనగర్‌ 13
ఖమ్మం 10, మహబూబ్‌నగర్‌ 6
మెదక్‌ 11, నల్గొండ 20
నిజామాబాద్‌ 3, రంగారెడ్డి 57
వరంగల్‌ 37 మొత్తం 169
మంచి కళాశాల ఎంపిక ఎలా?
* ఫార్మా పరిశ్రమల సందర్శన, నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చే కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుంది. ప్రాంగణ నియామకాలు, జీప్యాట్‌, పీజీసెట్‌లాంటి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన కళాశాలను ఎంపిక చేసుకోవడం మంచిది.
* ఫార్మా-డిలో చేరేవారు కళాశాలతోపాటు ఆ కళాశాల ఏ ఆస్పత్రితో ఒప్పందం చేసుకుందో ఆ ఆస్పత్రిని కూడా సందర్శించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
ఎంసెట్‌-2014లో ప్రభుత్వ కళాశాలల్లో ఫార్మసీ సీట్లు సాధించిన
తుది ర్యాంకులను www.eenadupratibha.netలో చూడండి.
ఫార్మా-డి కళాశాలల వివరాలు
భారత్‌లో 191 ఫార్మసీ కళాశాలలు ఫార్మా-డి కోర్సును అందిస్తున్నాయి. వీటిలో 5730 ఫార్మా-డి సీట్లున్నాయి. తెలంగాణలో 52 ఫార్మసీ కళాశాలల్లో 1560 సీట్లుండగా ఆంధ్రప్రదేశ్‌లో 51 కళాశాలల్లో 1530 ఫార్మా-డి సీట్లున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి ఒకే ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం (ఆంధ్రా విశ్వవిద్యాలయం) ఫార్మా- డి కోర్సును అందిస్తోంది.

posted on 11.07.2015